సీమాంధ్ర సీఎంగా చిన్నమ్మ?
posted on Oct 25, 2013 @ 4:29PM
కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా రాష్ట్ర విభజన సజావుగా సాగిపోతే, సీమాంధ్రలో కాంగ్రెస్ గెలిస్తే సీమాంధ్ర సీఎంగా చిన్నమ్మ అనగా దగ్గుబాటి పురంద్రీశ్వరి అయ్యే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం రెండు ముక్కలు చేస్తే ఎలాగూ ఆ ముక్కలో కాంగ్రెసే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఇక ఈ ముక్కలో కూడా అధికారంలోకి రావాలంటే చిన్నమ్మని సీఎం అభ్యర్థిగా తెరమీదకు తేవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. బొత్స, ఆనం లాంటి నాయకులు కూడా సీమాంధ్రకి సీఎం అయిపోవాలని కలలు కంటున్నప్పటికీ అధిష్ఠానం చిన్నమ్మ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లభించే అవకాశం వుంది.
టీడీపీకి అండగా వుండే సామాజికవర్గం ఓట్లలో భారీ చీలిక తెచ్చే అవకాశం వుంది. అలాగే మహా నాయకుడు ఎన్టీఆర్ కుమార్తె కావడం, సమర్థురాలిగా పేరు తెచ్చుకోవడం, తాజాగా రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌కి మద్దతుగా మాట్లాడటం ఇవన్నీ పురందేశ్వరికి ప్లస్ పాయింట్లుగా మారాయి. రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రలో కోల్పోయే పరువు, పవరు పురందేశ్వరికి వల్ల తిరిగి పొందవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు వున్నట్టు తెలుస్తోంది. మహిళను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా మహిళల ఓటు బ్యాంకుకు కైవసం చేసుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. సీమాంధ్రలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలంటే చిన్నమ్మనే రంగంలోకి దించడం కరెక్టని కాంగ్రెస్ భావిస్తోంది.