ఎంపీటీసీ కౌంటింగ్ సిబ్బందికి తేనెటీగల కాటు

  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌లో సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఓట్ల కౌంటింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక, కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు శ్రీకాకుళం జిల్లా పలాసలోని కౌంటింగ్ కేంద్రం సిబ్బందికి మరో కొత్త సమస్య వచ్చి పడింది. పలాస కౌంటింగ్ కేంద్రంపైకి తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల కుట్టుడు ధాటికి ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. తేనేటీగల బారిన పడి ముఖాలు వాచిపోయిన వారిని అధికారులు స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల గుంపు వస్తున్న విషయాన్ని గమనించి పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. టూ లేట్.. అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాయి. కనిపించిన వారిని కనిపించినట్టు కుట్టిపెట్టాయి.

ఆమె ఎంపీటీసీగా గెలిచింది.. కానీ మృత్యువు ఓడించింది

      విధి బలీయమైనదంటారు. ఈ మాటకు మరో ఉదాహరణగా నిలిచే సంఘటన ఈ ఎన్నికల సందర్భంగా జరిగింది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం కమ్మంగుల ఎంపీటీసీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున చిలుకమ్మ అనే మహిళ పోటీ చేసింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 21న చిలుకమ్మ అనారోగ్యంతో మరణించింది. ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో చిలుకమ్మ ఎంపీటీసీగా విజయం సాధించింది. ఎవరైనా ఎన్నికలలో విజయం సాధిస్తే ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అయితే చిలుకమ్మ గెలిచిన విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు బాధతో విలపిస్తున్నారు. చిలుకమ్మ బతికి వుంటే ఎంత సంతోషించేదో అని విలపిస్తున్నారు.

తెలంగాణలో తగ్గిన కారు జోరు

      రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో వుంది. ఆ తర్వాత చాలాసేపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అనూహ్యంగా టీఆర్ఎస్ ముందుకు దూసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధిగమించి ముందుముందుకి వెళ్ళిపోయింది. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో పరాభవం పొందిన టీఆర్ఎస్ స్థానిక ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకోబోతోందా అనే సందేహాలు కలిగాయి. అయితే మధ్యాహ్నం రెండున్నర తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీ పైచేయి సాధించింది. కాంగ్రెస్ పార్టీ 460 ఎంపీటీసీ స్థానాలతో మొదటి స్థానంలో వుండగా, టీఆర్ఎస్ 427 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ 183 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది.

ఎగ్జిట్ పోల్ సర్వేలు: ఛీ కొట్టిన కాంగ్రెస్

      సోమవారం నాడు వివిధ జాతీయ ఛానల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని, యుపిఎ దుకాణం సర్దేయబోతోందన్న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు వుంటే కేవలం లక్షమంది అభిప్రాయాలు కనుక్కుని ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ దేశంలోని ఓటర్లందరి మనోభావాలను ఎలా ప్రతిఫలిస్తాయని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈనెల 16వ తేదీన విడుదలయ్యేవే నిజమైన రిజల్ట్స్ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు షకీల్ అహ్మద్ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద స్పందించారు. 2004, 2009 సంవత్సరాల్లో కూడా ఇలాగే కాంగ్రెస్ వ్యతిరేక సర్వేలు ఇచ్చారని.. ఆ రెండు ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు.

ఆస్పత్రిలో పేషెంట్ల మధ్య గొడవ.. ఒకరి మృతి

      ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు ఎక్కడైనా బాధపడుతూ, నీర్సంగా వుంటారు. తమ వ్యాధులకు చికిత్స పొందడం మినహా మిగతా విషయాలను పేషెంట్లు పట్టించుకోరు. అయితే బొంబాయిలోని బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లలో కొందరు ఒకరితో మరొకరు గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. అసలే పేషెంట్లు కావడం వల్ల ఒక పెషెంట్ మరణించాడు. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షహబుద్దీన్ తాలూక్ దార్ అనే వృద్ధుడు తన వార్డులోనే వున్న మరో ముగ్గురు వృద్ధ పేషెంట్లతో గొడవపడ్డాడు. దాంతో ఆ ముగ్గురు ముసలోళ్ళు కలిసి ఈ ముసలోడిని చావబాదారు. ఈ ముసలాయన కూడా తిరగబడి ఆ ముగ్గర్నీ కొట్టాడు. దాంతో ఆ ముగ్గరిలో ఒక ముసలాయన అక్కడిక్కడే మరణించారు. ఆ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్స అందుబాటులో వున్నప్పటికీ సదరు ముసలాయన్ని ఎవరూ బతికించలేకపోయారు. షహబుద్దీన్ కొట్టిన ముగ్గురు పేషెంట్లలో ఒకరు మరణించారు.. మిగతా ఇద్దరు వ‌ృద్ధ పేషెంట్లు తీవ్ర గాయాలతో ఐసీయులో చికిత్స పొందుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజల్ట్స్: తెలంగాణ జిల్లాలు

      తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. తెలంగాణ జిల్లాల వారీగా మధ్యాహ్నం ఒంటిగంటకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (43), తెలుగుదేశం (26), తెరాస (79), ఇతరులు (23) 2. కరీంనగర్: కాంగ్రెస్ (32), తెలుగుదేశం (5), తెరాస (53), ఇతరులు (18) 3. వరంగల్: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (2), తెరాస (4), ఇతరులు (0) 4. ఖమ్మం: కాంగ్రెస్ (8), తెలుగుదేశం (29), తెరాస (0), ఇతరులు (29) 5. నల్గొండ: కాంగ్రెస్ (21), తెలుగుదేశం (5), తెరాస (10), ఇతరులు (13) 6. నిజామాబాద్: కాంగ్రెస్ (47), తెలుగుదేశం (8), తెరాస (61), ఇతరులు (14) 7. మెదక్: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (2), తెరాస (13), ఇతరులు (6) 8. రంగారెడ్డి: కాంగ్రెస్ (55), తెలుగుదేశం (27), తెరాస (24), ఇతరులు (33) 9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (55), తెలుగుదేశం (2), తెరాస (1), ఇతరులు (2) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 239, తెలుగుదేశం: 106, తెరాస: 245, ఇతరులు: 124.

సీమాంధ్ర ఎంపీటీసీ తాజా ఫలితాల వివరాలు

      సీమాంధ్ర జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల వారీగా మధ్యాహ్నం రెండుగంటకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (88), వైసీపీ (43), ఇతరులు (17) 2. విజయనగరం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (9), వైకాపా (4), ఇతరులు (1) 3. విశాఖపట్నం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (24), వైకాపా (6), ఇతరులు (4) 4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (70), వైకాపా (30), ఇతరులు (18) 5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (36), వైకాపా (17), ఇతరులు (21) 6. కృష్ణ: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (101), వైకాపా (68), ఇతరులు (12) 7. గుంటూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (78), వైకాపా (66), ఇతరులు (5) 8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (52), వైకాపా (48), ఇతరులు (9) 9. నెల్లూరు: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (34), వైకాపా (38), ఇతరులు (7) 10. చిత్తూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (10), ఇతరులు (1) 11. కడప: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (35), వైకాపా (93), ఇతరులు (3) 12. కర్నూలు: కాంగ్రెస్ (13), తెలుగుదేశం (96), వైకాపా (124), ఇతరులు (20) 13. అనంతపురం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (48), వైకాపా (18), ఇతరులు (3) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 19, తెలుగుదేశం: 676, వైకాపా: 565, ఇతరులు: 120  

ఇండియన్లకి ఒబామా కంగ్రాట్స్: థాంక్స్ చెప్పిన బీజేపీ

      మన దేశంలో ఎన్నికల పోలింగ్ ముగియగానే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించాడు. భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో రాబోయే కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఒబామా ప్రకటించారు. ‘అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో సమర్థంగా ఎన్నికలు నిర్వహించడం ప్రశంసనీయం. ఎన్నికల ప్రక్రియని విజయవంతం చేసిన భారతీయులకు నా అభినందనలు’ అని ఒబామా తన సందేశంలో పేర్కొన్నారు. ఒబామా సందేశాన్ని భారతీయ జనతాపార్టీ స్వాగతించింది. భారతీయులకు అభినందనలు తెలిపిన ఒబామాకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశం మీద భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, ఇండియాలో ‘కొత్త ప్రభుత్వం’ రాబోతుందన్న విషయం ఒబామాకి కూడా తెలిసిపోయిందని అన్నారు. రాబోయే బీజేపీ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల సహకారం తప్పకుండా లభిస్తుందన్న నమ్మకం వుందని ఆయన చెప్పారు.

ఎన్డీయేదే ఢిల్లీ అన్న ఎగ్జిట్ పోల్స్: దూసుకెళ్ళిన స్టాక్ మార్కెట్స్

      సోమవారం నాడు వివిధ జాతీయ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడి చేసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో ఒకేమాట చెప్పాయి.. అదేమిటంటే, కేంద్రంలో ఎన్టీయే అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ ఇంటికి పోవడం ఖాయం. ఈ వాస్తవాలు వెలుగులోకి రాగానే మంగళవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళాయి. సెన్సెక్స్ 490 దూసుకెళ్ళి మొత్తం 24000 పాయింట్ల మార్కును దాటింది. అలాగే నిఫ్టీ 150 పాయింట్లు పెరిగింది. గత వారం రోజులుగా నరేంద్రమోడీ అధికారంలోకి వస్తున్న సూచనలు కనిపిస్తూ వుండటంతో స్టాక్ మార్కె్ట్ లాభాల బాటలో పయనిస్తోంది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్: సీమాంధ్రలో టీడీపీ ముందంజ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరగడం వల్ల కౌంటింగ్ సాధారణ వేగంతో జరుగుతోంది. చాలాచోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరడం, బ్యాలెట్లకు చెదలు పట్టడం లాంటి సంఘటనలు జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం 11 గంటల వరకు జరిగిన కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ తన హవాని కొనసాగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికలలో తన సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్ల మద్దతు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ స్థానాన్ని, 108 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా 74 జడ్పీటీసీ స్థానాలను పొందింది. కాంగ్రెస్ పార్టీ 5 ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. వామపక్షాలు నాలుగు ఎంపీటీసీలు, ఇతరులు 74 ఎంపీటీసీలు పొందారు. పరిషత్ ఎన్నికలలో కూడా మునిసిపల్ తరహా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: బ్యాలెట్ బాక్సుల కష్టాలు

      రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్లను బాక్సుల్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. అయితే కొన్ని స్ట్రాంగ్ రూములు పేరుకే స్ట్రాంగ్ తప్ప బ్యాలెట్లకు భద్రత కల్పించలేకపోయాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈమధ్య కురిసిన వర్షాల కారణంగా స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన కొన్ని బాక్సుల్లోకి నీళ్ళు చేరాయి. చాలాచోట్ల బ్యాలెట్లు తడిచిపోయాయి. ప్రస్తుత అలా బ్యాలెట్లు తడిచిన కేంద్రాల్లో లెక్కింపు సిబ్బంది ఓట్లు లెక్కపెట్టే పనిని పక్కన పెట్టి తడిచిపోయిన బ్యాలెట్లను ఎండలో ఆరబెట్టే పనిలో వున్నారు. ఎండలో ఆరబెట్టిన బ్యాలెట్లు గాలిలోకి ఎగిరిపోతూ వుంటే వాటిని పట్టుకోవడానికి తంటాలు పడుతున్నారు. అలాగే కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయి. బూత్ బంగ్లాల్లా వుండే స్ట్రాంగ్ రూమ్స్ లో నెలల తరబడి బ్యాలెట్ పేపర్లు పెడితే చెదలు పట్టవా? తడిచిన బ్యాలెట్లు, చెదలు పట్టిన బ్యాలెట్లు పనికిరాకపోతే ఆయా కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

డబుల్‌ డెక్కర్ రైలు వస్తోంది.. అందరు పక్కకి జరగండి..

      రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు హైదరాబాద్‌‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణం ప్రారంభించింది. మంగళవారం ఉదయం 6.45 గంటలకు కాచిగూడ- గుంటూరు మధ్య ఏసీ డబుల్‌ డెక్కర్ రైలు ప్రారంభమైంది. రైల్వే శాఖ సీనియర్ ఉద్యోగి ఒకరు ఈ రైలుకు పచ్చజండా ఊపి ప్రారంభించారు. దీంతో దక్షిణాదిన తొలిసారిగా ఈ డబుల్‌ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతివారం కాచిగూడ- గుంటూరు- కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి కాచిగూడ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ సర్వీసు అందుబాట్లోకి వస్తోంది. తొలిసారి డబుల్ డెక్కర్ రైలు ఎక్కిన ప్రయాణికులు మురిసిపోయారు. సెల్ ఫోన్లతో రైలును ఫొటోలు తీసుకున్నారు. తొలి ప్రయాణంలో కాచిగూడ నుంచి గుంటూరు వరకు 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు.

పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవాల వివరాలు

      జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన స్థానాల వివరాలివి. తెలంగాణలో 69 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 24 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, తెరాసకు చెందిన 14 మంది అభ్యర్థులు, వామపక్షాల అభ్యర్థులు ఇద్దరు, ఇతరులు 26 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సీమాంద్రలో 251 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏకగ్రీవమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచింది. వైకాపా 70 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, వామపక్షాలు 4 స్థానాల్లో, ఇతరులు 70 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచారు.