జూనియర్ ఎన్టీఆర్ తండ్రయ్యాడు: జాతకచక్రం ఇదిగో..!

  యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం 11 గంటలకు పండంటి మగపిల్లాడు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్ బో హాస్పిటల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి పుత్రోదయం అయింది. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు జాతక చక్రాన్ని పరిశీలించిన జ్యోతిషులు తండ్రికి తగ్గ కొడుకు పుట్టాడని, నందమూరి వారి నూతన వారసుడు వంశం పేరును నిలబెట్టేవాడు, వంశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్ళేవాడు అవుతాడని చెబుతున్నారు. జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం... నందమూరి బుజ్జోడు రోహిణీ నక్షత్రంలో, కన్యాలగ్నం, వృషభరాశిలో, చంద్రమహాదశలో పుట్టాడు. ఈ ముహూర్తంలో పుట్టినవాళ్ళు చాలా అందంగా వుంటారు. మంగళవారం నాడు పుట్టాడు కాబట్టి నందమూరి వంశానికి అలంకారమైన ఆవేశంతోపాటు మంచి ఆశయాలు కూడా కలిగి వుంటాడు. దూకుడును ప్రదర్శించే మంచి శక్తివంతుడు అవుతాడు. ఏదైనా అనుకుంటే సాధించే పట్టుదల కలిగినవాడు అవుతాడు. అలాగే రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ధర్మచింతన వుంటుంది. మంచి లౌక్యం కలిగి వుంటాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నెగ్గుకొచ్చే చాతుర్యం కలిగి వుంటాడు. ఏ రంగంలో అయినా తన ఆధిక్యత నిలుపుకుంటాడు. ఈ జాతకుడికి సాహస క్రీడల పట్ల మక్కువ వుంటుంది. కళారంగంలో మంచి ప్రావీణ్యం, అభినివేశం వుంటాయి. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు జాతకం విషయంలో జ్యోతిషులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ పుట్టాడని భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయం తీసుకోలేదు: నారాయణ

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ చెప్పారు. ఢిల్లీలో శివరామకృష్ణన్ కమిటీతో భేటీ అయిన అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రాష్ట్రంలోని 13 జిల్లాలకు అందుబాటులో వుండేలా వుండాలని, విజయవాడ - గుంటూరు మధ్య నీటి లభ్యత ఎక్కువగా వుందని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అంటే రవాణా సదుపాయలు కూడా బాగా వుండాలని, రాష్ట్రంలో నాలుగు జిల్లాలలోని ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ జిల్లాలు అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటాయన్నారు. ఈనెల 26వ తేదీన శివరామకృష్ణన్ కమిటీతో మరోసారి సమావేశం కానున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.

శ్రీకృష్ణుడి నక్షత్రంలో పుట్టిన ఎన్టీఆర్ వారసుడు!

తెలుగు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు ఈ రోజు ఉదయం 11 గంటలకు కొడుకు పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోనూ, అభిమానుల్లోనూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. వీరి ఆనందానికి మరోక కారణం కూడా వుంది, అదేంటంటే..ఈ వారసుడు శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టాడట. కృష్ణుడి నక్షత్రంలో పుట్టిన ఈ బుజ్జి కృష్ణయ్య తండ్రి సమస్యలను దూరం చేసే అదృష్టాన్ని తీసుకువచ్చాడని అంటున్నారు. అలాగే ఇప్పుడు పుట్టిన ఈ చిన్ని కృష్ణుడికి కూడా ముత్తాత పోలికలు వుంటే ఇక తమ ఆనందానికి అంతే వుండదని నందమూరి వంశాభిమానులు అంటున్నారు.

పరిశ్రమలకు సింగిల్‌ విండో విధానం:కేసీఆర్‌

  హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ ఫ్యాప్సీ, ఫిక్కీ సీఐఐ ప్రతినిధులతో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ విండో విధానం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నట్టు ఆయన తెలిపారు. సీఎం కార్యాలయానికఇనుసంధానంగా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పూర్తి పారదర్శకంగా నతన పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 24 గంటలు విద్యుత్‌ అవసరమని, విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని, మంచి పరిశ్రలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. తెలంగానలో అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పారు.

రాజ్యసభలో సచిన్, రేఖ సాధించిందేమిటి?

  సెలబ్రిటీలు రాజ్యసభకు నామినేట్ కావడం, గెస్టుల్లాగా రాజ్యసభకు వచ్చి వెళ్ళడం.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న తంతు. ఆమధ్య రాజ్యసభకు నామినేట్ అయిన క్రికెట్ సచిన్ టెండూల్కర్, నటి రేఖ పరిస్థితి కూడా అదే! సచిన్ టెండూల్కర్, రేఖలను యుపిఎ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. 2012 ఏప్రిల్ 12వ తేదీన రాజ్యసభకు నామినేట్ అయిన సచిన్ ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే సభకు వచ్చారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే రాజసభ సమావేశాలకు హాజరయ్యారు. మొత్తమ్మీద ఈ రెండున్నరేళ్ళలో టెండూల్కర్ మూడు సార్లు, రేఖ వారం రోజులు హాజరయ్యారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ సభలోకి అడుగుపెట్టలేదు. రాజ్యసభకు ఎన్నికైన సెలబ్రిటీలు బాధ్యతగల రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కత్రినా, దీపికల్లో ఎవరు పొడవు?: కేంద్ర పరీక్షలో ప్రశ్న!

  ప్రశ్న: ఈ క్రిందివారిలో ఎవరు పొడవు? ఆప్షన్లు: 1. హుమా ఖురేషీ, 2. కత్రినా కైఫ్, 3. దీపికా పడుకొనే, 4. ప్రీతీజింటా. ఇదేదో సినిమా క్విజ్ కాదు.. ఈ ప్రశ్నను కేరళలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌‍సి) పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష రాసేవారు ఈ ప్రశ్నను చూసి అవాక్కయ్యారు. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న వుండటం సంచలనాన్ని సృష్టించింది. దీనిపట్ల ఎస్ఎస్‌సి చైర్మన్ ఎ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు. ఇది సరైంది కాదని, దిగజారిన ప్రమాణమని, దాంతో తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని, విచారం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. ఉమ్మడి గ్రాడ్యుయెట్ స్థాయి పరీక్షలో అటువంటి ప్రశ్న ఇవ్వడం లైంగిక వివక్ష అంటూ కేరళ మహిళా కమిషన్ ధ్వజమెత్తింది. ఈ ప్రశ్నాపత్రంలోనే మహిళలందరూ పిల్లులు, అన్ని పిల్లులు ఎలుకలు అనేవిధంగా ఓ ప్రశ్న వున్నట్టు కేరళ మహిళా కమిషన్ విమర్శిస్తోంది.

సానియా మిర్జా తెలంగాణకి గర్వకారణం: కేసీఆర్

  తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, ప్రయోజనాలను సానియా మిర్జా ప్రమోట్ చేయనుంది. ఇప్పటి వరకు టెన్నిస్ క్రీడాకారిణిగా, మోడల్ కనిపించిన సానియా మీర్జా తెలంగాణ అంబాసిడర్‌‌గా కొత్త పాత్రలో కనిపించనుంది. సానియా మిర్జాను తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు ఐఎఎస్ అధికారి జయేశ్ రాజన్ ధ్రువీకరించారు. మంగళవారం జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో సానియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ అధికార ధ్రువీకరణ పత్రంతోపాటుకోటి రూపాయల చెక్ అందించారు. సానియా అసలు సిసలైన హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణం అని కేసీఆర్ అన్నారు.

మార్కండేయ కట్జూ మీద డీఎంకే మండిపాటు

  అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి కోసం యూపీఏ భాగస్వామిగా ఉన్న తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ పార్టీ లాబీయింగ్ చేసిందని ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై డీఎంకే పార్టీ మండిపడింది. కట్జూ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని డీఎంకే స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి కోసం తమిళనాడుకు చెందిన పార్టీ లాబీయింగ్ చేసిందన్న ఆరోపణలన్ని అభూత కల్పనలు అని డీఎంకే నేతలు తెలిపారు. యుపీఏతో భాగస్వామిగా వున్న తమిళనాడు పార్టీ తమదే కాబట్టి తాము ఈ అంశంపై స్పందిస్తున్నామని డీఎంకే నేతలు అన్నారు. కట్లూ చేసి ఆరోపణల్ని డీఎంకే పట్టించుకోవడం లేదన్నారు. కట్జూ తమ పార్టీ పేరు చెప్పలేదని.. అంతేకాకుండా న్యాయమూర్తి పేరు కూడా ఆయన వెల్లడించలేదని డీఎంకే నేత టీకేఎస్ ఇళగోవన్ అన్నారు. మార్కండేయ కట్జూ వ్యాఖ్యల్ని డీఎంకే అధినేత కరుణానిధి దృష్టికి తీసుకువెళ్తామని ఇళగోవన్ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్‌ కొడుకువి ఎవరి పోలికలు?

  టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం 11 గంటలకు పండంటి మగపిల్లాడు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్ బో హాస్పిటల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి పుత్రోదయం అయింది. ఈ వార్త విని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. తాము అభిమానించే నందమూరి వంశంలో మరో అంకురం పుట్టిందని, తెలుగు సినిమా రంగానికి మరో ఫ్యూచర్ స్టార్ ఉదయించిందని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నందమూరి వారి అభిమానులందరి మనసులలో ఒకటే ఎదురుచూపు వుంది.. అది ఏమంటంటే, అర్జెంటుగా జూనియర్ ఎన్టీఆర్ కొడుకుని కళ్ళారా చూసేయాలి. ఆ బుజ్జోడు ఎవరి పోలికో కనిపెట్టేయాలి. తాత నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కి స్టార్‌డమ్ రావడానికి ఆ పోలికలే కారణమయ్యాయి. ఇప్పుడు పుట్టిన నందమూరి వారసుడికి కూడా ముత్తాత పోలికలు వుంటే ఇక తమ ఆనందానికి అంతే వుండదని నందమూరి వంశాభిమానులు అంటున్నారు. ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్ అందగాడు. లక్ష్మీ ప్రణతి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చూడ ముచ్చటైన ఈ జంటకు పుట్టిన బుజ్జిగాడు డెఫినెట్‌గా అదిరిపోయే అందగాడే అయి వుంటాడని, తమ హీరో వారసత్వాన్ని కొనసాగించేవాడు అవుతాడని అభిమానులు అనుకుంటున్నారు.

గాలి బెయిల్ పిటిషన్ కొట్టివేత

  గాలి జనార్దన రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన బెయిల్ పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. మూడేళ్లుగా దర్యాప్తు పూర్తి చేయకుండా నిందితులను ఎంత కాలం జైల్లో ఉంచుతారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిందితుల శిక్ష ఖరారు కాకుండానే దర్యాప్తు దశలో ఇలా జైల్లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. గాలి జనార్దన్ రెడ్డి అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం కెసిఆర్

రవీంద్రభారతిలో దాశరథి 89వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని అన్నారు. బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఉందని,దాశరది వంటి గొప్పవారి విగ్రహాలు ఉండాలని అబిప్రాయపడ్డారు. తెలంగాణ సాహితీ లోకం గర్వించే విధంగా దాశరథి విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో దాశరథి పేరిట స్మారక అవార్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అవార్డుతో పాటు లక్షరూపాయల రివార్డు అందజేస్తామన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ దాశరథి అని కేసీఆర్ కొనాయాడారు.దాశరథి కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రభుత్వంలో వారికి తగిన పాత్ర ఇస్తామని హామీ ఇచ్చారు.

కొంప ముంచిన ఫేస్‌బుక్ ఫ్రెండ్!

  ఫేస్‌బుక్‌లో ఎవర్ని పడితే వాళ్ళని ఫ్రెండ్స్‌గా ఒప్పుకోవద్దు.. ముక్కూ ముఖం తెలియని వాళ్ళతో ఓవర్‌గా వెళ్ళొద్దు అని ఎవరు ఎంతగా మొత్తుకున్నా కొంతమంది ఈ హెచ్చరికలను పట్టించుకోరు. అలా పట్టించుకోని పాపానికి ఒక మహిళ అక్షరాలా కోటి ముప్పయి లక్షలు పోగొట్టుకుంది. డెహ్రాడూన్‌కి చెందిన బీనా ఠాకూర్ అనే మహిళ ఓఎన్జీసీ ఉద్యోగి భార్య. బోలెడంత డబ్బు కూడా వుంది. ఆమెకి ఫేస్ బుక్ అంటే ప్రాణం. ముష్టోడు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేసేసి ఛాటింగ్ చేసేంత విశాల హృదయం. ఈమెకి అమెరికాకి చెందిన రిచర్డ్సన్ అనే ఫ్రెండ్ ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరూ గంటలకు గంటలు ఫేస్ బుక్ ఛాటింగ్‌లో మనసులు విప్పి మాట్లాడుకుంటూ వుండేవారు. ఈమధ్య ఛాటింగ్‌లో రిచర్డ్సన్ అపర దానకర్ణుడిలా పోజు పెట్టి తాను తొమ్మిది కోట్ల రూపాయలను ఎవరైనా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేవాళ్ళకి దానం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ తొమ్మదికోట్లు తానే కొట్టేస్తే ఓ పనైపోతుందని అనుకుందో ఏమోగానీ బీనా ఠీకూర్ ఆ డబ్బు తనకే ఇస్తే వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ముసలోళ్ళ సేవలో తరిస్తానని చెప్పింది. అయితే ఆ తొమ్మిది కోట్లకు ముందు పన్ను కట్టాలని, కాబట్టి వెంటనే బ్యాంకులో కోటి 30 లక్షలు జమ చేయమని చెప్పాడు. బీనా ఠాకూర్ పిచ్చిమొహంలాగా రిచర్డ్సన్ అకౌంట్లో అంత డబ్బూ జమచేసేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని లబోదిబో అని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా!

తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియామీర్జాను నియమించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అబివృద్దికి సంబందించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వారి సేవలను వాడుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. దాని కోసం సానియామీర్జాను అంబాసిడర్ గా నిర్ణయిస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. సచివాలయంలో సోమవారం కేసీఆర్‌ను కలిసిన సానియా రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కోరింది. వచ్చే నెల 25న ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్‌లో టైటిల్ లక్ష్యంగా సన్నద్ధం కావడానికి ఆమెకు కోటి రూపాయలు మంజూరు చేశారు. అలాగే మరికొంత మంది జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

సింగరేణి వాటాల మీద కేసీఆర్ కన్ను!

  దేశంలోనే భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి గనులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో వాటాని పెంచుకోవడం ద్వారా సింగరేణి గనుల మీద తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఆధిపత్యం సాధించేలా చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘వాటాల ఉపసంహరణ విధానం'ను లోతుగా అధ్యయనం చేసి, సింగరేణిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ అంశం మీద కేసీఆర్అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది.

ఉస్మానియా పిల్లలపై లాఠీఛార్జీ దారుణం!

  తమకు ఉద్యోగాలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద తెలంగాణ ప్రభుత్వం లాఠీఛార్జ్ జరిపించడం దారుణమన్న అభిప్రాయాలు తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఈ ఘటనను ఖండిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతో కృషి చేసిన ఉస్మానియా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం అత్యంత దారుణమైన చర్య అని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అలాగే తెలంగాణలోని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఈ విషయం మీద కక్కలేక మింగలేక వున్నారు. ఉస్మానియా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాల్సిందిపోయి వారిమీద లాఠీఛార్జ్ చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న టీఆర్ఎస్ పార్టీలో కూడా తలెత్తింది. సొంత ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయని అనుకున్న విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలే మిగిలాయన్న సానుభూతి ఉస్మానియా విద్యార్థుల మీద వ్యక్తమవుతోంది.

ఎంహెచ్ 17 బ్లాక్ బాక్స్ అప్పగించిన రెబల్స్!

  ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో కుప్పకూలిన ఎంహెచ్ 17 విమానం బ్లాక్‌బాక్స్‌ను రష్యా అనుకూల తిరుగుబాటుదారులు తిరిగి ఇచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో మలేషియా ప్రభుత్వ అధికారులకు తిరుగుబాటుదారులు సోమవారం అప్పగించారు. అంతేకాకుండా, విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా పది కిలోమీటర్ల మేరకు కాల్పుల విరమణ కూడా పాటిస్తున్నట్టు తెలిపారు. విమానప్రమాదంలో మరణించిన ప్రయాణికుల మృతదేహాలు తిరుగుబాటుదారుల అధీనంలోనే వున్నాయి. అంతర్జాతీయ పరిశీలకులు వచ్చేవరకు శవాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు తెలిపారు. శవాలు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఏసీ రైల్ వ్యాగన్లలో భద్రపరిచామని వారు తెలియజేశారు.

రుద్రమదేవి నగల చోరీ.. ఎన్నో అనుమానాలు!

  రుద్రమదేవి సినిమా కోసం తెచ్చిన కిలోన్నర బరువైన బంగారు నగలు పోయాయని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతవరకు నగల చోరికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకకపోయినప్పటికీ ఎన్నో అనుమానాలు అయితే పోలీసులకు కలుగుతున్నాయి.   1. అసలు సినిమా షూటింగ్ కోసం బంగారు ఆభరణాలు వాడాలని ఎందుకు అనుకున్నారు?   2. బంగారు ఆభరణాలు, గిల్టు ఆభరణాలు కలిపి ఎందుకు వుంచారు?   3. నిజంగానే పోయిన ఆభరణాలలో బంగారు ఆభరణాలు వున్నాయని ఆధారాలేమిటి?   4. పోయిన ఆభరణాలలో బంగారు ఆభరణాలెన్ని? గిల్టు ఆభరణాలెన్ని?   5. విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిసినా వాటిని అంత అజాగ్రత్తగా ఎందుకు ఉంచారు?