ఫేస్‌బుక్ పుణ్యమా అని విడాకులు!

ఫేస్‌బుక్ కారణంగా స్నేహాలు, అనుబంధాలు పెరగడమే కాదు.. ఉన్న అనుబంధాలు కూడా తెగిపోయే అవకాశాలున్నాయి. ఈ పాయింట్‌కి బలం చేకూర్చే సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా బోలెడన్ని వున్నాయి. పచ్చగా వున్న కాపురాలు సైతం ఫేస్ బుక్ పుణ్యమా అని కూలిపోయిన సందర్భాలకి అయితే లెక్కే లేదు. ఈమధ్యకాలంలో ఫేస్ బుక్ కారణంగా పెటాకులైపోయిన పెళ్ళిళ్ళ సంఖ్య చాలా వుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఫేస్ బుక్ కారణంగా దాంపత్య సంబంధాలకు ముప్పు వాటిల్లుతోందని ఓ అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. ఫేస్‌బుక్ వల్ల అమెరికాలోనే ఇలాంటి పెటాకుల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో ప్రతి ఏటా జరిగే విడాకుల శాతం మరో నాలుగు శాతం పెరిగిందట. ఆ నాలుగు శాతం పెరగడానికి ఫేస్‌బుక్కే కారణమట.

నీటి సరఫరాపై అంతర్జాతీయ సదస్సు

బేగంపేటలోని హోటల్ గ్రీన్‌పార్క్ వేదికగా నగరాలు, పట్టణాలల్లో నీటి సరఫరాపై అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో సెమినార్‌ జరుగుతుంది. జలమండలి, ఇండియన్‌ వాటర్‌ వర్క్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సెమినార్‌ను సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభిస్తారు. భారత్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన 250మందికి పైగా నిపుణులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు, అధికారులు, వ్యాపారవేత్తలు సదస్సుకు హాజరుకానున్నారు. పదేళ్లకోసారి జరిగిగే ఈ సెమినార్‌ను గతంలో గోవా, చెన్నై నగరాల్లో నిర్వహించారు.

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫా? సారీ!

  ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వుంది కాబట్టి పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడం కుదరని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. అయితే ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ఉద్దేశం మంచిదేగానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం కావడం, సిబ్బంది కొరత తీవ్రంగా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడం సమంజసం కాదేమోనని ఆయన అన్నారు. నెలరోజుల్లో పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి చెప్పారు.

చంద్రబాబు రూటే సపరేటు

సెక్రటేరియట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశించే రూటు మారబోతోంది. సచివాలయంలో ప్రస్తుత వున్న రూటు బాబు బయటకు వెళ్లే దారి కానుంది. ఉద్యోగులు కాలినడకన వస్తున్న పాత గేటుని సీఎం కాన్వాయ్‌ ప్రధాన మార్గం కానుంది. దానికి అనుగుణంగా మార్పులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భద్రతా పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి బిర్లా మందిర్ దగ్గర వాచ్ టవర్‌ను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు వున్నారు. ఎల్‌ బ్లాకు సీఎం ఛాంబర్ సమీపంలో ఎత్తైన భవనాలు ఉండడంతో భద్రతా పరంగా బిర్లా మందిర్ దగ్గర వాచ్ టవర్‌ను ఏర్పాటు చేస్తే మంచిదని అధికారులు భావిస్తున్నారు.

బాబోయ్ స్వైన్ ఫ్లూ... ముందు జాగ్రత్తలివే!

  హైదరాబాద్‌ ప్రజల్ని అప్పుడప్పుడూ వణికించే స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్ళీ నగరంలోకి ఎంటరైంది. ఈ ప్రమాదకర వ్యాధి కారణంగా 2012లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 36 మంది చనిపోయారు. 2013 సంవత్సరంలో తొమ్మదిమందిని ఈ వ్యాధి పొట్టనపెట్టుకుంది. 2014లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. తాజాగా గత వారం రోజులుగా స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ఆస్పత్రులలో చేరిన వారి సంఖ్య పదుల్లో వుంది. వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ సీజన్‌లో ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని వైద్యులు సూచిస్తున్నారు. జ్వర లక్షణాలు కనిపిస్తే అవి స్వైన్ ఫ్లూ అవునా, కాదా అనే విషయాన్ని వైద్యులను సంప్రదించి నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే స్వైన్ ఫ్లూ గతంలో మాదిరిగా ప్రాణాంతకం అయ్యే అవకాశం లేవని వైద్యులు అంటున్నారు. ఇంటి పరిసరాల్లో పందులు సంచరించేవారు మరింత జాగ్రత్తగా వుండాలని చెబుతున్నారు.

షరపోవా ఇష్యూ: సచిన్ సంస్కారానికి హేట్సాఫ్!

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాశమంత ఎత్తు ఎదిగినా ఆయన సంస్కారం ఎంతమాత్రం తగ్గలేదు. ఉన్నతమైన ఆ సంస్కారం మరోసారి మారియా షరపోవా విషయంలో కూడా బయటపడింది. టెన్నిస్ స్టార్ మారియా షరపోవా సచిన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సచిన్ అంటే ఎవరని ప్రశ్నించడం, సచిన్ అంటే ఎవరో నీకు తెలియదా అని ఆమె మీద భారత క్రికెట్ అభిమానులు, సచిన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం గురించి సచిన్ ఇంతకాలం స్పందించలేదు. తాజాగా ఈ అంశం మీద సచిన్ తన ప్రతిస్పందన తెలిపారు. రష్యన్ క్రీడాకారిణి షరపోవాకు క్రికెట్ గురించి తెలిసి వుండకపోవచ్చునని, అంతమాత్రానికి ఆమె విషయంలో పరుషంగా వుండటం తగదని అన్నారు. మనం ఎవరినీ మన వ్యాఖ్యలతో బాధపెట్టకూడదని సచిన్ హితవు పలికారు. షరపోవాని మాటలతో గాయపరచడం మంచిది కాదని సచిన్ అనడం ఆయన సంస్కారానికి నిదర్శనం.

రంభకి ఏ పాపమూ తెలియదు: సోదరుడు

  సినీ నటి రంభ మీద ఆమె మరదలు పల్లవి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద రంభ సోదరుడు శ్రీనివాస్ స్పందించారు. తనతో వ్యక్తిగత విభేదాలు వున్న తన భార్య పల్లవి పబ్లిసిటీ కోసమే రంభ పేరును ఈ కేసులో ఇరికించిందని, పాపం రంభకు ఏ పాపమూ తెలియదని వివరణ ఇచ్చారు. రంభపై ఆరోపణలు చేసిన తన భార్యపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.. తన భార్య కుటుంబ సభ్యులు వెనుక నుంచి తన భార్య చేత ఈ డ్రామా ఆడిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. తన భర్త శ్రీనివాస్‌తో పాటు ఆయన సోదరి అయిన నటి రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వరరావు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీడి దుంపతెగ.. రోడ్డుమీదే తాళి కట్టేశాడు!

  తమిళనాడులోని తంజావూరులో ఓ ప్రియుడు తన ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెని తన నుంచి దూరం చేసేస్తారేమోనని భయపడిపోయి అర్జెంటుగా రోడ్డుమీదే తాళి కట్టేశాడు. ఊటీకి చెందిన ఆనంద్, దివ్య అనే ప్రేమజంట చాలాకాలం నుంచి ప్రేమలో మునిగి వున్నారు. వీరి వ్యవహారం తెలిసిన దివ్య తల్లిదండ్రులు ప్రేమ, దోమ అన్నారంటే కాళ్ళు తీసేస్తాం అని ఇద్దర్నీ హెచ్చరించారు. అయినా దివ్య ప్రేమ మైకం వదలకపోవడంతో ఆమెని తంజావూరులోని తమ బంధువుల ఇంట్లో వుంచారు. దివ్యని వెతుక్కుంటూ ఆనంద్ కూడా తంజావూరుకి వెళ్ళాడు. వెళ్ళేవాడు మామూలుగా వెళ్ళకుండా జేబులో ఓ తాళిబొట్టు కూడా పెట్టుకుని వెళ్ళాడు. దివ్య కోసం తంజావూరు రోడ్లు పట్టుకుని తిరిగిన ఆనంద్‌కి ఓ చోట రోడ్డుమీద దివ్య కనిపించింది. అంతే మనోడు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా దివ్య దగ్గరకి వెళ్ళిపోయి ఆమె మెళ్ళో తాళి కట్టేశాడు. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్ళింది. ఇద్దరూ మేజర్లు కావడంతో నువ్వు కట్టిన తాళి చెల్లదంటూ పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.

ప్రీతీజింటా లేఖ.. బాలీవుడ్‌లో సంచలనం!

  తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను మానసికంగా, శారీరకంగా హింసించాడంటూ ఫిర్యాదు చేస్తూ ప్రీతీజింటా మంగళవారం ముంబై పోలీసు కమిషనర్‌కి రాసిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ప్రీతీజింటా బాలీవుడ్ సహచరులు ఈ లేఖలోని విషయాలను తెలుసుకుని బిత్తరపోయారు. వారంతా ఈ అంశంలో షాకింగ్ ఎక్స్.పీరియన్స్ అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. తమ మధ్య నవ్వుతూ, తుళ్ళుతూ వుంటూ, క్రికెట్ టీమ్ ఓనర్‌గా కూడా యాక్టివ్‌గా వుంటే ప్రీతీజింటా జీవితంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. నెస్ వాడియాతో ప్రీతీజింటాకి వున్న గొడవలు టీ కప్పులో తుఫానులాగా సమసిపోతాయని వారంతా భావించారు. అయితే మేటర్ చాలా సీరియస్‌గా వుందన్న విషయం ప్రీతీజింటా తాజా లేఖతో బయటపడటంతో వారందరూ ప్రీతీ జింటా మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నుంచి ప్రీతీ జింటా సాధ్యమైనంత త్వరగా బయటపడాలని బాలీవుడ్ కోరుకుంటోంది.

రాజధాని కృష్ణ - గుంటూరు మధ్య బెస్ట్.. ఎందుకంటే..!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని రాజధాని మీద నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి తెలిపారు. రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్, ఏపీ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ రాజధానికి ఈ ప్రాంతం ఎందుకు బెస్టో వివరించారు. కృష్ణా - గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో ఉండడంతోపాటు నీటి వసతి, విమానా శ్రయాలు, రైలు, రోడ్డు సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వారికి వివరించామన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వచ్చే నెలాఖరున శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో రాజధానికి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీని మరోమారు కోరినట్టు ఆయన తెలిపారు.

కోరిక తీర్చలేదని లవర్నే చంపేశాడు!

  ఒక శాడిస్టు ప్రియుడు ప్రియురాలు తన కోరిక తీర్చడానికి నిరాకరించడంతో ఆమెని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోర సంఘటన తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో జరిగింది. చాముండేశ్వరి (19) అనే అమ్మాయి రాజ్‌కుమార్ అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈమధ్యకాలంలో చాముండేశ్వరి మరో కుర్రాడి ప్రేమలో పడటంతో రాజ్‌కుమార్‌ని దూరం పెడుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఆమెను ఒక్కసారి ఏకాంతంగా కలవాలని కోరిన రాజ్‌కుమార్ ఆమె వచ్చినప్పుడు తన కోరిక తీర్చమని ఆమెని బలవంతం చేశాడు. అయితే ఆమె దానికి నిరాకరించడంతో రాజ్‌కుమార్ ఆమె తలమీద బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. రాజ్‌కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నాడు.

తెలంగాణలో మావోయిస్టులు..!

  తెలంగాణ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు పెద్దపల్లిలోని ప్రధాన కూడళ్లలో విస్త్రతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రహదారిపై వచ్చిపోయే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీచేసిన తర్వాతనే పంపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.   బీహార్ లో మరోసారి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గయ వద్ద రైల్వే ట్రాక్ ను పేల్చివేశారు. దీంతో ఢిల్లీ-హౌరా మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి 15 రైళ్లు నిలిచిపోయాయి. యముక్ వద్ద నీలాంబర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. గయా ఘటనపై రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ విచారణకు ఆదేశించారు. 

దాశరథి స్మారక పురస్కారం!

  ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ప్రతి సంవత్సరం దాశరథి పురస్కారం పేరిట లక్షా నూట పదహారు రూపాయలు అందజేసి సన్మానిస్తామని కేసీఆర్ తెలిపారు. దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాశరథి పేరిట కేసీఆర్ ప్రకటించిన మరికొన్ని అంశాలు..   1. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థకు దాశరథి పేరు.   2. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం.   3. దాశరథి కుమారుడికి . ఆయన కుమారుడికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం.

రైల్లోంచి తోసేశారు..నేడు చితకబాదారు

రైళ్ళలో తనిఖీలు చేయాలంటేనే టీసీలు తెగ భయపడిపోతున్నారట. ఎవరిని టికెట్ అడిగితె ఎవడూ ఏం చేస్తాడోనని టీసీలు బిక్కుబిక్కుమంటూ తమ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి హైదరాబాద్ నగరంలో రైళ్ళలో టీసీలపై జరుగుతున్న దారుణాలే కారణం. మొన్న హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో టిక్కెట్ చూపించమని అడిగిన పాపానికి టికెట్ కలెక్టర్ గీతను కొందరు దుండగులు రైలులో నుండి తోసివేశారు. ఆ సంఘటన జరిగి ఇంకా పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. తాజాగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. టికెట్ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న టీసీ కౌసల్యను టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు చితకబాదారు. ప్రయాణికుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటలనలతో భయపడిపోతున్న టీసీలు తమ రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణలో పరిశ్రమలకు సింగిల్ విండో!

  తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు విషయంలో సింగిల్ విండో విధానాన్ని అమలు చేసే ఆలోచనలో వుంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి వివరించారు. తమ ప్రభుత్వం అనుసరించే కొత్త పారిశ్రామిక విధానం వల్ల ఉద్యోగాలతోపాటు ఉత్పత్తి కూడా పెరుగుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే పారిశ్రామికవేత్తలు తనను నేరుగా సంప్రదించవచ్చని కేసీఆర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో రెండున్నర లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామని, దరఖాస్తు చేసుకున్న 12 నుంచి 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. దీనికోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నామని చెప్పారు.