చంద్రబాబుకు బులెట్ ప్రూఫ్ బస్సు.. 5 కోట్లు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనల నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఈప్రత్యేక సౌకర్యాలతో కూడిన బులెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసింది. సుమారు రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన ఈ బస్సు ఈ రోజు ఉదయం విజయవాడ చేరుకుంది. అయితే చంద్రబాబు కూడా విజయవాడలోనే ఉన్న నేపథ్యంలో దానిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిని ఆయన జిల్లా పర్యటనల్లో భాగంగా మాత్రమే ఉపయోగించనున్నారు. చంద్రాబాబు ఈ బులెట్ ప్రూఫ్ బస్సును తయారు చేసే బాధ్యతను ఆర్టీసీ అధికారులకు అప్పగించడంతో వారు బెంజ్ కంపెనీకి చెందిన బస్సును కొనుగోలు చేసి.. ఛండీగఢ్‌లో దానిని బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దడం జరిగింది. ఈ బస్సు శక్తివంతమైన బాంబు దాడులను కూడా తట్టుకుని నిలుస్తుందని తెలుస్తోంది.  

డీఎస్ కు ప్రభుత్వ సలహాదారు పదవి..

  డీఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి మారిన సంగతి తెలసిందే. అలా పార్టీ మారారో లేదో అప్పుడే కేసీఆర్ తనకు పదవిని కట్టబెట్టేశారు. అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ జీవో జారీ చేశారు. అంతేకాదు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా జీవో జారీ చేశారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా డీఎస్ కు ఫోన్ చేసి చెప్పడం జరిగిందట. దీనికి డీఎస్ హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని.. తనపై నమ్మకంతోనే ఇంతటి బాధ్యతను అప్పగించారని.. కెసిఆర్‌కు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని.. నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పారు.   గత నెల జూలై 8వ తేదీన డీఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాను బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని.. అంతేకాని పదవుల మీద వ్యామోహంతో కాదని చెప్పిన సంగతి తెలిసిందే.

శవంతో సెల్ఫీల పోటీ.. స్పెషల్ వీడియో

  సెల్ఫీ.. ప్రస్తుతం చాలా మందికి ఈ సెల్ఫీ పిచ్చి బాగానే పట్టింది. తింటున్నా.. కూర్చున్నా.. టక్కున సెల్ఫీ తీసుకోవడం అప్ డేట్ చేయడం. ఎంత వెరైటీగా సెల్ఫీ పెడితే అంత గొప్ప అన్నట్టు ఉంది చూస్తే. దానికోసం సాహసాలు కూడా చేస్తూ రకరకాలుగా ఫోటోలు తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రాణాలు పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పిచ్చి ఎంతలా అంటే కనీసం ఏ పరిస్థితిలో ఉన్న సందర్భం ఏంటీ అని కూడా చూసుకునే స్థితిలో కూడా లేకుండా పోతున్నారు కొందరు. అయితే ఇప్పుడు రష్యావాళ్లు ఒక మెట్టు ఎక్కి ‘సెల్ఫీస్ విత్ డెడ్' పేరుతో సోషల్ మీడియా ఓ కాంపిటీషన్ కు తెర లేపారు. దీనిలో పాల్గొన్నవారు చనిపోయిన వారితో సెల్ఫీ తీసుకుంటే వాటిలో బెస్ట్ సెల్పీలను ఎంపిక చేసి వాటికి బెస్ట్ క్యాష్ ప్రైజులను బహుకరిస్తారట. అయితే ఈ కాంపిటీషన్ సంగతేమో కాని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాని ఈ కాంపిటీషన్ ను నిర్వహించిన వారు మాత్రం చనిపోయిన వ్యక్తితో సెల్ఫీలు దిగటమనేది ‘ఒక రకమైన కళ' అంటూ సమర్థించుకుంటున్నాయి. ఈ ఒక్కటి చాలు మానవీయ విలువలు రోజురోజుకు ఎంత దిగజారుతున్నాయో చెప్పడానికి.  

చెప్పేంత విషయాలు ఏం లేవు.. గవర్నర్

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌తో అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అయితే గవర్నర్ భేటీపై ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్వవహారం పైనా చర్చించేందుకు కలిసారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భేటీ అనంతరం గవర్నర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భేటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదని.. సంచలనమైన విషయాలు ఏం లేవని ఒక గవర్నర్ గా మాత్రమే కలిశానని చెప్పారు. కాగా ఇరురాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత సమస్యలు.. ఉద్యోగుల విభజన.. షెడ్యూల్ 9,10లోని వివాదాల వల్ల సమస్యలు.. ముఖ్యంగా ఈ సమస్యల వల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తలసాని యాదవ్ రాజీడ్రామా వ్యవహారం ఏం చర్చలోకి రాలేదని.. సరైన సరైన సమయంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.   ఆతరువాత గవర్నర్ నరసింహన్ దంపతులు ఇరువురు కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించారు. ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను  పరామర్శించి సంతాపం తెలియజేశారు.

టీడీపీకి పవన్ కళ్యాణ్ అవసరమెంత?

  ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ట్వీట్లతో నేతలపై మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్లకు అందరూ ఎలా ఉన్నా టీడీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తగ్గట్టుగానే ఘాటుగా సమాధానమిస్తున్నారు. గతంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఇలాగే మాటల యుద్ధాలు.. ట్వీట్ల యుద్ధాలు జరిగాయి. అలాగే ఈసారి కూడా భూసేకరణ నేపథ్యంలో రైతల భూములు తీసుకోవద్దని.. ఏడాదికి మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని.. ఉండవల్లి, బేతపూడి, పెనుబాక భూములను భూసేకరణ నుండి మినహాయించాలని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబునే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు యనమల స్పందించి భూసేకరణ వద్దంటున్నారు మరి ఏం చేయాలో కూడా చెబితే బావుంటుందని ఒకింత వెటకారంగానే సమాధానవిచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా రైతు సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎటకారంగా ఉందా ఉంటూ స్ట్రాంగ్ గానే యనమలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్వీట్లకు టీడీపీ నేతల్లో ఎవరో ఒకరు కాస్త ఘాటుగా స్పందించినా.. తరువాత ఆపార్టీకి సంబంధించిన నేతల్లో ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ కు తామేమి వ్యతిరేకం కాదంటూ వారు ఆ ఉద్దేశంతో అనలేదంటూ సమర్ధిస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో స్వయంగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తామని.. తాము పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. యనమల విషయంలో కూడా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో తమకు ఎలాంటి విబేధాలు లేవని.. తనని ఒప్పించే భూములు సేకరిస్తామని చెప్పారు.     దీనిని బట్టి చూస్తే టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కు బాగానే ప్రాధాన్య ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా బీజేపీ టీడీపీ పార్టీలు మిత్రపక్షాలు అని తెలిసిన విషయమే. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ పార్టీలకు తన మద్ధతు ఎప్పుడో తెలిపాడు. ఈ నేపథ్యంలో టీడీపీ పవన్ కళ్యాతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే తాను ఎంత ప్రశ్నించిన.. ఎంత ఘాటుగా ట్వీట్లు చేసిన టీడీపీ మాత్రం తనను సమర్ధిస్తూనే ఉంది. దీనికి కారణం అతనికి అభిమానులు ఎక్కువ.. జనాల్లో అతనికి ఉన్న క్రేజ్ కూడా కావచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు టీడీపీ పవన్ కళ్యాణ్ కు అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా అని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ కి వచ్చే లాభమేంటి అని అనుకుంటున్నారు. అందులోనూ నిజం లేకపోలేదు.. ఎందుకంటే ఎప్పుడో పార్టీ పెట్టి కొన్ని రోజులు అసలు ఏం మాట్లాడకుండా ఉండి.. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఉపయోగముంటుందో పార్టీకే తెలియాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చేదెంతో.. పోయేదెంతో తెలియదు కాని పవన్ కళ్యాణ్ మాత్రం తక్కువ టైంలోనే తన కంటూ ఒక ప్రాధాన్యతను ఏర్పరచుకున్నాడు. అది గొప్ప విషయమే కదా..

అభిమన్యుడిలా వెంకయ్య.. చంద్రబాబు కితాబు

  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు.  శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితే కాని హైదరాబాద్ అభివృధ్ది జరిగింది.. ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు కాని ఇప్పుడు రాష్ట్ర విభజన వల్ల హైదరబాద్ లేకుండా పోయింది. ఏపీలో హైదరాబాద్ లాంటి నగరం లేకపోయినా నిలదొక్కుకోవాలనుకుంటున్నాం.. దీనికి కేంద్రం తప్పకుండా సహకరించాలి.. సహకరించి తీరాలని అన్నారు.   ప్రత్యేకహోదా ఇంకా ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తాను ఈ నెల 25 న భేటీ కానున్నట్లు తెలిపారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా ఒక్క విషయమే కాకుండా ఇంకా ఏపీ రాష్ట్రానికి కావలనిన అవసరాలను.. ఏపీకి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లడతానని.. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా తయారుచేశామని తెలిపారు. అభిమన్యుడిలా వెంకయ్యనాయుడు అంతేకాదు ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి గురించి మాట్లాడుతూ రాష్ట్ర విభనప్పుడు వెంకయ్యనాయుడు ఏపీ కోసం చాలా పోరాడారన్నారు. కేవలం తమ పార్టీ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో ఏపీకి అన్యాయం జరగకుండా భవిష్యత్ లో ఏపీకి కావలసిన అవసరాలు.. సమస్యలు గురించి రాజ్యసభలో అభిమన్యుడిలా పోరాడారని.. దానిని ఎప్పటికీ మరిచిపోలేమని ప్రశంసించారు. అంతేకాదు వెంకయ్య ఢిల్లీలో ఉన్నంతకాలం రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగదని కితాబిచ్చారు. రాజధాని అవసరాలకు వెంకయ్య ముందుగానే స్పందించారని, ఇప్పటికే రూ.500 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు.

విచారణ కోసం కాదు..కాల్ డాటాని భద్రపరచమని కోరేందుకేనట!

  ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు చేయడానికి నియమించబడిన ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నిన్న సాయంత్రం తెలంగాణా హోంశాఖ కారదర్శిని విచారణకు హాజరుకమ్మని ఆదేశించేందుకు నోటీసులు ఇవ్వడానికి తెలంగాణా సచివాలయానికి వెళ్ళారని వార్తలు వచ్చేయి. వాళ్ళు వెళ్ళడం, ఆయనకీ నోటీసు ఇవ్వడం వరకు ఆ వార్తలు నిజమే కానీ ఆ నోటీసు విచారణ కోసం మాత్రం కాదు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయనకు సీల్డ్ కవర్లలో అందజేసిన కాల్-డాటా రికార్డులను భద్రంగా ఉంచమని కోరుతూ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఆయనకు అందజేయడానికే వారు అక్కడికి వెళ్ళారు. ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు సచివాలయానికి వచ్చిన సంగతి తెలుసుకొని సచివాలయంలోని కొందరు ఉద్యోగ సంఘ నేతలు వచ్చి నిరసనలు తెలియజేసారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని సిట్ అధికారులను జాగ్రత్తగా వారి వాహనాల్లో పంపించివేశారు.

రాజధాని భూసేకరణకు నేడు రైతులకు నోటీసులు

  రాజధాని కోసం భూసమీకరణ 98శాతం పూర్తయ్యింది. కానీ మిగిలిన రెండు శాతం భూసేకరణకి నాలుగయిదు గ్రామాలలో రైతులు అంగీకరించకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో వారికీ భూసేకరణ చట్టం క్రింద నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోవలసి వస్తోంది. ఇంకా 2200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 700 ఎకరాల సేకరణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మిగిలిన 1,500 ఎకరాల భూసేకరణకు కూడా మరొక్క వారం రోజుల్లోగానే నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కనుక ఇక ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలకడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లే భావించవచ్చును. మరి దీనిపై ఆ రైతులు, ప్రతిపక్షాలు, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ తను రాజధాని గ్రామాలలో రైతులను త్వరలోనే కలుస్తానని నిన్న ట్వీటర్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏమయినప్పటికీ భూసేకరణలో ఈ ఆఖరిఘట్టంలో కొంత యుద్ద వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

అనుష్క టార్చెర్ పెడుతున్న డైరెక్టర్ ఎవరు?

    ఇప్పటికే రుద్రమదేవి సినిమాని పూర్తి చేయడానికి గుణశేఖర్ చాలా కష్టపడ్డాడు. మొదటి నుండి ఈ సినిమాకు పాపం ఎదురుదెబ్బలు బాగానే తగిలాయి. అయినా ఏదోలా సినిమా మాత్రం పూర్తిచేశాడు. అయితే ఇప్పుడు ఈయనకు మరో సమస్య వచ్చిపడింది. అది ఎవరి వల్లో కాదు ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర పోషించిన నటి అందాల భామ అనుష్కవల్లనట. అదెలా అంటే రుద్రమదేవి రిలీజ్ నేపథ్యంలో భాగంగా గుణశేఖర్ ఈ సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టాడు. అయితే ఈ ప్రమోషన్లపై అనుష్క అంత ఇంట్రస్ట్ చూపించట్లేదట. తన దృష్టంతా తన కొత్త సినిమా సైజ్ జీరో పై ఉందని.. ఈ ప్ర‌మోష‌న్ల‌పై అస్స‌లు దృష్టి నిల‌ప‌డం లేద‌ని టాక్‌. అయితే గుణశేఖర్ ఎలాగో కూర్చోపెట్టి ఇంటర్య్వూలు ఇప్పిస్తున్నాకాని సినిమా గురించి కాన్ఫిడెన్స్‌గా ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేద‌ట. టీవీ ఛాన‌ళ్ల లైవ్ పోగ్రాంకి ర‌మ్మంటే స‌సేమీరా అంటోంద‌ట‌. అయితే అనుష్క మాత్రం ఇప్పటికే ఈ సినిమాకి చాలా రోజులు కేటాయించాను ఇక నావల్ల కాదు అని తేల్చి చెప్పేసిందట.

రాహుల్ భయ్యా.. వదినెక్కడ

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పుడూ ఒక సమాధానం లేని ప్రశ్న ఎదురవుతుంటుంది. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా అదే రాహుల్ గాంధీ పెళ్లి విషయం. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అమేథీలో తనకు ఆప్రశ్న ఎదురైంది. రాహుల్ గాంధీ తన నియోజకవర్గమైన అమేథీలో పర్యటిస్తున్న నేపథ్యంలో తన గెస్ట్‌హౌస్‌కు వెళ్లేముందు ఒక వ్యక్తి "భయ్యా, కబ్ తక్ అకేలా ఆయేగా? బాబీ కబ్ సాత్ ఆయేంగి? అంటే భయ్యా ప్రతిసారీ మీరొక్కరే అమేథీకి వస్తున్నారు.. వదినమ్మ ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించాడట. పాపం రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఎప్పటిలాగే చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోయారట. మొత్తానికి రాహుల్ గాంధీకి మాత్రం ఎక్కడికెళ్లినా అందరూ ఈ ప్రశ్న అడగటమే. ఇంకా ఎన్నాళ్లు జవాబు ఇవ్వకుండా తప్పించుకుంటారో చూద్దాం.

పవన్ ను ఒప్పించే భూములు సేకరిస్తాం..

  ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను భూసేకరణ చట్టం ద్వారా తీసుకోవద్దని ట్వీట్స్ ద్వారా చంద్రబాబును కోరారు. అయితే దీనికి యనమల కౌంటర్ ఇవ్వడం దానికి పవన్ కళ్యాణ్ రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఏపీ రాజధానికి అటు రైతులను.. పవన్ కళ్యాణ్ ను ఒప్పించే భూసేకరణ చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో మాకు ఎలాంటి విబేధాలు లేవని.. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయనకు తెలియదుని వాటిని వివరిస్తామని అన్నారు. కాగా భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని.. సుమారు మూడువేల ఏకరాల భూమిని భూసేకరణ చట్టంద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు.

నాగార్జునతో అనసూయ

  ఎన్ని షోల్లో యాంకరింగ్ చేసిన జబర్దస్త్ కామెడీ షో ద్వారానే అనసూయకు ఫుల్ క్రేజ్ వచ్చిందన్నది మాత్రం వాస్తవం. దీంతో ఆమెకి సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసే అవకాశం దక్కింది కాని అనసూయ దానిని తిరస్కరించింది అనే వార్తలు కూడా వచ్చాయి. దాని తరువాత నాగార్జున సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. అయితే ఇప్పుడు దీనికి సంబధించి స్వయంగా నాగార్జుననే తన ట్విట్టర్ ద్వారా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అనసూయ నటిస్తుందని.. ఆ సినిమాకు సంబంధించిన ఒక స్టిల్‌ ను కూడా పోస్ట్‌ చేశాడు. అయితే ఇంతకుముందు ఈ సినిమాలో అనసూయ నాగార్జున మరదలుగా నటిస్తుందని అని వార్తలు వచ్చాయి.. కాని అది ఎంతవరకు నిజమో తెలియదు.. నాగార్జున కూడా నటిస్తుంది అని అన్నారు కాని ఏ పాత్ర చేస్తుందో మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని పోస్ట్ చేస్తానని తెలిపారు. కాగా ఈ చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి బుల్లి తెర యాంకర్ అనసూయ వెండితెర మీద అది కూడా మన్మధుడు నాగార్జున సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఫోన్ ట్యాపింగ్ లో ఏపీ మరో అడుగు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో  ఏపీ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి గురువారం నాడు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇంకా కొంతమంది  నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తుంది. దీనిలో భాగంగానే సిట్ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు అందించనున్నట్టు సమాచారం.

యనమలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

  భూసేకరణ వద్దని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ లో ట్వీట్ లు చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి, పెనుబాక, బేతపూడి గ్రామల్లో భూములను భూసేకరణనుండి మినహాయించాలని నేరుగా చంద్రబాబునే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించి భూసేకరణ వద్దని చెపుతున్న పవన్ కళ్యాణ్ ఏ చేయాలో కూడా చెబితే బావుంటుందని ఒకింత వెటకారంగానే సమాధాన మిచ్చారు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి నేను రైతుల సమస్యల గురించి.. వారి ఆవేదనల గురించి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దాని వెటకారం చేయడం వారికే చెల్లిందని యనమలకు ఘాటుగా సమాధానమిచ్చారు. అయినా "సినిమా పరిశ్రమకు ఇచ్చింది హైదరాబాద్ లో ఉన్న కొండ ప్రాంతాలు కాని పంటలు పండే పచ్చని పొలాలు కాదని ఆ విషయాన్ని యనమల రామకృష్ణుడుకి తెలియదనుకుంటా" అని చురక అంటించారు.   ఇంకా "ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు .." అని ట్వీటారు. కాగా త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.  

రెండు రాష్ట్రాలకు సిగ్గుచేటు

  రాష్ట్ర విభజన ముందు తెలంగాణ, ఆంధ్రా అన్న విభేధాలు కొంతమంది మధ్య ఉన్న రాష్ట్ర విభజన తరువాత మాత్రం అది కాస్త ఎక్కువైందనే చెప్పవచ్చు. రాష్ట్రం విడిపోయి ఏడాదిపైన అయినా ఎన్నో విషయాలలో రెండు రాష్ట్రాలు గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కట్టుగా ఒక పనిని మాత్రం చేస్తున్నాయి. ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అది మహిళలను అవమానపరచడం. ఈ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే మహిళలను అగౌరపరచడం.. వారిని వేధించడంలో దేశంలోనే ఆంధ్రరాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ కూడా దాదాపు ముందు వరుసలోనే ఉంది. 2014 లెక్కల ప్రకారం ఈ నేరాల్లో ఆంధ్రరాష్ట్రం ముందుండగా రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే కొనసాగుతుండటం గమనార్హం. ఒక్క దీనిలోనే కాదు అటు సైబర్ నేరాలు, మోసాలు వంటి నేరాల్లో కూడా తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. కాగా హత్యలు, కిడ్నాప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్, అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానం సంపాదించుకున్నాయి.

కేసీఆర్ ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటా! రేవంత్ రెడ్డి

  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మరికొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు మెహబూబ్ నగర్ కొండగల్ మార్కెట్ యార్డు వద్ద అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఆయన నియోజక వర్గంలో ఉన్న మార్కెట్ యార్డుకి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేసారు. కానీ, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో ఆయన తను అంచరులతో కలిసి అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. భూమిపూజ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారిని స్టేషన్లో ఉంచి తరువాత విడుదల చేసారు.   స్థానిక ఎమ్మెల్యేనయినా తనకు ప్రొకాల్ ప్రకారం ఆహ్వానం పంపకపోగా తనను పోలీసుల చేత అరెస్ట్ చేయించినందుకు రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈవిధంగా అరెస్టులతో తనను ఎవరూ భయపెట్టలేరని, తెదేపాను ఎంతగా అణగద్రొక్కే ప్రయత్నిస్తే మరినత శక్తివంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడుతామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దించేవరకు తన పోరాటం సాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ను ఏకేసిన వెంకయ్యనాయుడు

 ఏపీకి కేటాయించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందని.. ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణా ఏర్పడాలి అలాగే ఏపీకి న్యాయం జరగాలి.. అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అని పార్లమెంట్ లో ఎవరు గొంతు చించుకున్నారో అందరికి తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని అడ్డుకుంటానంటే నాకు అభ్యంతరం లేదని, కానీ తాను వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి ప్రాజెక్టు వస్తుందన్నారు. గడ్డిబొమ్మలు పెట్టి తన దిష్టి బొమ్మలు తలగబెట్టినంత మాత్రన అలాంటివి లెక్కచేయనని మండిపడ్డారు. అంతేకాదు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెగ హడావుడి చేస్తుంది.. మరి యాభై ఏళ్లు పాలన చేసిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు. తాను కష్టపడి ఇంతటి స్థాయికి వచ్చానని నలభై రాజకీయానుభవం ఉన్న నాకు మొదటి నుండి ఇదే పార్టీలో ఉన్నాను.. ఇదే పార్టీలో చస్తాను అని అన్నారు. అంతేకాని వారసత్వ రాజకీయాలతో రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ పార్టీలోకి మారతారో తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తమను అడగడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

చంద్రబాబు మోడీల భేటీ తేదీ ఖరారు

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీల భేటీ ఈ రోజు జరగాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. అనుకొని పరిస్థితుల్లో సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో భేటీ కాస్త వాయిదా పడింది. అయితే కేంద్రం తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి రావచ్చని తెలిపింది. దీంతో చంద్రబాబు నాయుడు ఈనెల 25న భేటీకి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఏపీలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. అందులోను మోడీ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో చంద్రబాబు కూడా ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యమైందని భావించే 25వ తేదీనే సమావేశానికి ఎంచుకున్నారు.   మరోవైపు ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాపైన ఇంకా ఏపీకి కావలసిన అవసరాలపై చంద్రబాబు తగిన ముసాయిదాను తయారుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపైన  అంతేకాదు ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించాలని.. ఈ మేరకు మోడీని కూడా ఒప్పించాలని నిర్ణయం తీసుకన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రత్యేక హోదా విషయంలో ఉత్తరఖండ్ మోడల్ లా ఏపీకి ప్రత్యేక హోదాకాని.. ప్రత్యేక ప్యాకేజీకాని కావాలని కోరనున్నట్టు సమాచారం.