30 యాక్ట్... హౌస్ అరెస్టులు లేవు.. ఆంక్షలకే వైసీపీ అనవసర గగ్గోలు!

ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిప్పుకుని పర్యటన అనుమతు కోసం వెళ్తే 30 యాక్ట్ అంటూ హడావుడి చేసి అనుమతులు ఇవ్వకుండా చేశారు. ఆనుమతులు ఇచ్చ కూడా ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కూడా ఉంటాయని చూపించిన ఘనత వైసీపీకే దక్కుతుందని ప్రజలు అంటున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలన ముగిసింది. ఇప్పుడు జగన్ పార్టీకి రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఐదేళ్ల నిర్బంధ కాండ నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడిలో పడింది. పోలీసులు సైతం తమ విధులు స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన వైసీపీ మాత్రం ప్రశాంతంగా పర్యటనలు చేసుకుంటే   మైలేజ్ రాదని పరామర్శ యాత్రల పేరిట వెళ్తు గొడవలు, దాడులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల, చివరికి సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలతో చెలగాటాలాడుతోంది.   మామిడి రైతుల సమస్యలు అంటూ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంకు రానున్న జగన్ కు గతంలో జరిగిన కారణాలతో పోలీసులు ఆంక్షలు విధిస్తే దాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. గతంలో వైసీపీ చేసిన పనిని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ప్రజాస్వామ్యం లో తిరిగే హక్కుతో పాటు భద్రత కూడా కల్పిస్తున్నది. 30 యాక్ట్ అంటూ అరెస్టులు చేయడం లేదు. శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలు మాత్రమే విధిస్తున్నది. దీనికే జగన్ అంటే, జగన్ వస్తుంటే.. కూటమి ప్రభుత్వం భయపడుతోంది అంటూ నానా యాగీ చేస్తున్నది వైసీపీ. జగన్  బంగారుపాల్యం యాత్రనే తీసుకుంటే.. మామిడి సీజన్ ముగిసిన దశలో మామిడిరైతుకు పరామర్శ, భరోసా కోసం అంటూ జగన్ కుట్ర కోణం దాగి ఉందన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. అయితే నిజమైన రైతులతో మాట్లాడుతారా లేక పేటీఎం బ్యాచ్ ను జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తారా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ యాత్ర ఏ తీరున సాగుతుందో చూడాలి. 

సిగాచీ ప్రమాద ఘటనపై..ఎన్‌డీఎం బృందం సీరియస్

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది.   పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఘటనపై ఇప్పటి వరకు 44కు మృతుల సంఖ్య చేరింది. అనంతరం ఎన్‌డీఎంఏ అక్కడే సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. యాజమాన్యం సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంతో సీరియస్ అయింది. పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.  సమావేశం అనంతరం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది.  సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 30న పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

జమిలికి లైన్ క్లియర్!?

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది. ఆ నివేదిక జమిలిని సానుకూలంగా ఉండటంతో దేశంలో అన్ని ఎన్నికలూ ఒకే సారి జరిపే దిశగా అడుగులను వేగవంతం చేసింది. ఈ విషయంగా రాష్ట్రాలతోనూ చర్చించింది.  బీజేపీ పాలిత రాష్ట్రాలూ, ఎన్డీయే కూటమి పార్టీలూ జమిలికి సై అన్నాయి. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలూ, బీజేపీ ప్రత్్యర్థి పార్టీలూ జమిలికి నో అన్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రాలు జ‌మిలికి   గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. విషయం అలా ఉండగా కొందరు న్యాయవాదులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించారు.  జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. అలాగే జమిలి నిర్వహణ వల్ల వ్యయం తగ్గుతుందన్న విషయంలోనూ వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకే దఫా ఎన్నికల నిర్వహణ ఎన్నికల అవినీతి పెచ్చరిల్లడానికే దారి తీస్తుందని విమర్శలు గుప్పించారు. అయితే వీటిలో వేటికీ కేంద్రం బదులివ్వకపోవడంతో ఢిల్లీ బార్ అసోసియేషన్ సహా దేశ వ్యాప్తంగా సుప్రీం కోర్టులో పెద్ద సంఖ్యలో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. సరే సుప్రీం కోర్టు ఆ పటిషన్లను ఏకకాలంలో విచారించేందుకు అంగీకరించడంతో కేంద్రం కూడా సుప్రీం కు మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను సుప్రీం కు సమర్పించింది. ఆ నివేదిక ప్రకారమే ముందకు వెడుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదికపై అధ్యయనం చేసి జమిలికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను క్వాష్ చేయాలని సుప్రీం ను కోరింది. దీనిపై నివేదికను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జమిలి ఎన్నికలకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు భారీగా తగ్గుతుందన్న అంశంతో ఏకీభవించింది.  అలాగే జమిలికి ఓకే చెప్పింది. దీంతో జమిలికి ఇక అడ్డంకులన్నీ తొలగిపోవడంతో కేంద్రం తన కార్యాచరణను స్పీడప్ చేసింది. జమిలికి దేశ వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలలోనే జమిలి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది.  

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

  భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు.  ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోగా ఈవోను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. 

జగన్.. షర్మిల.. ఎవరికి వారుగా తండ్రి వైఎస్ కు నివాళులు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా  నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీని నడిపిస్తోంది. జగన్ షర్మిలల మధ్య ఉన్న విభేదాలు జరిగిన ఎన్నికల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జగన్ పై ఆ ఎన్నికల్లో షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డి కూతురు సునీతను వెంటబెట్టుకొని బాబాయ్ హత్య గురించి ఎన్నికల్లో తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. ఆ  ఎన్నికల నుండి ఇద్దరు మధ్య రాజకీయ, కుటుంబ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలులలో జరిగే తండ్రి వైయస్ జయంతి వేడుకల్లోగాని, వర్ధంతి వేడుకల్లో గాని వేరువేరుగానే పాల్గొంటూ నివాళులర్పిస్తూ వస్తున్నారు. మంగళవారం (జులై 8) జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలల్లోనూ ఇదే తీరున ఎవరికి వారుగా తండ్రికి నివాళులర్పించారు. వారి తల్లి విజయం మాత్రం ఇద్దరితో కలిసి ఘాట్లో నివాళులు అర్పించారు .ఉదయం 7:30 కు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, తల్లి విజయమ్మ, బంధువులు, కుటుంబ సభ్యులు, వైసిపి నాయకులతో కలిసి ఉదయం  8 .45 గంటల నుంచి 9.54 గంటల  వరకు నివాళులర్పించి ప్రార్థనలు చేసి జగన్ వెళ్ళిపోయారు.జగన్ వెళ్లిన తర్వాత ఆయన సోదరి షర్మిల వైయస్ ఘాట్ కు  వచ్చి తండ్రికి నివాళులర్పించారు. తల్లి విజయమ్మ అటు జగన్ తోనూ ఆ తర్వాత షర్మిళ తోను  నివాళులర్పించడం ఆమె లో భావోద్వేగాన్ని నింపింది.

కోవూరు కొలిమి.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలతో కాక

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే.. నోటి దురుసు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురవుతోంది. స్థానిక ఎమ్మెల్యే తనకు సోదరి వరుస కూడా అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పార్టీలోని కొందరు అంటుంటే.. వాటిని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడ్డమేంటన్న చర్చకు తెరలేచింది. నల్లపరెడ్ల పరువు మొత్తం తీస్తున్నావుగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  ప్రసన్న ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర  పదజాలంతో కామెంట్ చేశారు. అంతే కాదు.. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం అనరాని మాటలు అన్నారు. వీపీఆర్ గా పేరున్న ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని.. ఆయన్ను హతమార్చడం కోసం కొన్ని టీములు సుపారీ సిట్టింగులు వేసినట్టుగా తనకు సమాచారముందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. పోయి పోయి పలు చోట్ల తిరిగి పీహెచ్డీలు చేసొచ్చిన.. ప్రశాంతిరెడ్డిని పెళ్లాడే బదులు తనకు చెప్పి ఉంటే.. ఒక మంచి కన్నెపిల్లను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడ్నని అనడంతో ఇప్పుడు కోవూరు మొత్తం కొలిమిలా తయారైంది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరు మొత్తం అట్టుడుకుతోంది. తెలుగుదేశం- వైసీపీ మధ్య పొలిటికల్ వార్ షురూ అయ్యింది. అదలా ఉంటే తనపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు.  ఒక్క మహిళా ఎమ్మెల్యేగా తాను ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే..సభ్య సమాజం చెవులు మూసుకునే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత భాషా ప్రయోగం చేశారని విమర్శించారు.  అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడి మా నోరు మూయిద్దామనుకుంటున్నావా? అని నిలదీశారు. ఒక మాజీ మంత్రి అయి ఉండీ మహిళల పట్ల ఇంత నీచంగా, అసభ్యంగా మాట్లాడడాన్ని బట్టే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తోందన్నారు.   ఇక ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.  ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చెప్పుకోలేని బాధలు అనుభవించిన చాలా మందిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండవచ్చన్నారు. అయినా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఒక సూటి ప్రశ్న అన్న ఆమె..  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇళ్లల్లోని మహిళలకు వినిపించగలరా అని నిలదీశారు.   ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు

పాతబస్తీలోని సిటీ సివిల్  కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వ్యాజ్యాల కోసం వచ్చిన ప్రజలను, న్యాయవాదులను, న్యాయమూర్తులను కోర్టు నుంచి బయటకు పంపేశారు.   కోర్టు మొత్తాన్నీ ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, బాంబు డిఫ్యూసింగ్ స్కాడ్‌తో కోర్టు మొత్తాన్ని జల్లెడ పట్టారు. చివరకు బెదరింపు కాల్ ఫేక్ అని తేల్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో ఈ బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్నది తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

జ‌గ‌న్, ప‌వ‌న్.. స్క్రిప్ట్ రైట‌ర్లే తేడా?

ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో  వ్యక్తం అవుతుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్స‌లు పొంత‌న లేకుండా ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ఏది ప‌డితే అది మాట్లాడేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో హోరు మంటున్నాయ్. కార‌ణం అందులో మొద‌టిది ప్రాంతీయ‌త‌. ఆయ‌న ఎక్క‌డ పుట్టారో ఎక్క‌డ పెరిగారో ఎక్క‌డ ఎదిగారో అనే దాని మీద ఒక స్థిర‌మైన స‌మాచారం చాలా మందికి తెలీదు. అది అందుబాటులో ఉండ‌దు కూడా. ప‌వ‌న్ కుటుంబానిది పాల‌కొల్లుకు ద‌గ్గ‌ర్లోని మొగ‌ల్తూరు. ఈ ప్రాంతంలో వారికో ఇల్లు కూడా ఉంది. ఇక తండ్రి వెంక‌ట్రావు కొణిదెల ఎక్సైజ్ శాఖ అధికారిగా ప‌లు ప్రాంతాల్లో పని చేశారు.  దీన్ని ఆస‌రాగా తీసుకున్న ప‌వ‌న్.. ప‌లు ప్రాంతాల్లో త‌న రిఫెరెన్సులు జార విడుస్తుంటారు. చీరాల, బాప‌ట్ల‌, ఒంగోలు ఇలా ప‌లు ప్రాంతాల్లో తాను పుట్టాన‌నీ పెరిగాన‌నీ త‌ర్వాత ఆడుకున్నాన‌నీ.. ఇలా  ర‌క‌ర‌కాలుగా చెబుతుంటారాయ‌న‌. ఆపై నెల్లూరులో ఆయ‌న య‌వ్వ‌నం  సాగిన‌ట్టుగా ప‌దే ప‌దే చెబుతుంటారు. ఇక్క‌డ ఒక కాలేజీలో తాను చ‌దువుకున్న‌ట్టు చెబుతుంటారు. ఆపై తాను ఇంట‌ర్ క‌న్నా మించి చ‌ద‌వ‌క పోవ‌డానికి గ‌ల కార‌ణం పుస్త‌కాల్లో తాను చ‌దువుకోవ‌ల్సినంత చ‌దువు లేద‌ని అంటారు. నిజానికి   ఇంట‌ర్ క‌న్నా మించి చ‌దవక పోవడాన్ని త‌న‌కు తానే ఒక అవ‌మానంగా భావించి అక్క‌డ‌క్క‌డా ఇలాంటి డ్రాపింగులు చేస్తుంటారు.  ఇక త‌న‌కు పాల‌నా అనుభ‌వం లేద‌ని ఒక సారి..  తాను త‌లుచుకుంటే బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌లై పోతుంద‌ని ఒక సారి.. తాను- స‌ముద్రం- శిఖ‌రం ఒక‌టేన‌నీ.. ఎవ‌రి కాళ్ల ద‌గ్గ‌ర ప‌డి బ‌తికేది లేద‌ని ఒక సారి.. ఆపై త‌న‌క‌న్నా మించిన వారు ఎంద‌రో ఉన్నార‌నీ ఇలా  ర‌క‌ర‌కాలుగా   పొంత‌న లేని మాట‌లు మాట్లాడే స్తుంటారు. ఇదంతా ఆయ‌న‌కు స్క్రిప్ట్ రాసిచ్చే వారి  ప్ర‌భావ‌మా..  లేక త‌నే స్వ‌యంగా ఇలాంటి కామెం ట్లు చేస్తుంటారా? ఒక‌ప్పుడు హిందువుల‌కు వ్య‌తిరేకంగా ఎన్నో కామెంట్లు చేసిన  పవన్ కల్యాణ్..  తాను మురుగ‌న్ దారిలో న‌డిచానని.. చెప్పేసి బుక్ అయిపోతుంటారు. దీంతో ఆయ‌న క్ర‌మంగా త‌న  క్రెడిబిలిటీ కోల్పోతుంటారు. అభిమానులంటే ఎలాగోలా ఆయ‌న జార‌విడిచే ప్ర‌తిదీ అమృత ప్రాయంగా తీసుకుంటారు. కాద‌న‌డం లేదు. కానీ అందరూ అలా ఉండ‌రు క‌దా? ఈ  విష‌యంలో ప‌వ‌న్ ఎందుకో వెన‌క‌బ‌డ్డార‌నే చెప్పాలి. అదే చంద్ర‌బాబు త‌న‌కు తాను ఇంత బిజీగా ఉండ‌గా  కూడా ఒక స్ట‌డీ  చేసి త‌ర్వాతే ఏదైనా మాట్లాడ తారు. మొన్న‌టికి మొన్న మ‌హిళా దినోత్స‌వం  రోజు.. రాజ‌కీయేత‌ర ప్ర‌సంగం ఒక‌టి చేశారాయ‌న‌. త‌న ఆహార‌పు అల‌వాట్లు.. ఇత‌ర‌త్రా చ‌ర్చించారు. ఈ క్రమంలో ఆయ‌న మాట‌ల్లో ఒక మెచ్యూరిటీ క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు.. ఎంతో స్ట‌డీ చేసిన ఇన్ఫో క‌నిపిస్తుంది. ఇంత బిజీగా ఉండే చంద్రబాబుకు అంత ప‌రిశీల‌న  ఎలా సాధ్యం అని  ఆయ‌నంటే గిట్ట‌ని వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.  ఇలాంటి దేదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోగానీ జ‌గ‌న్ లోగానీ ఉన్న‌ట్టు క‌నిపించ‌దు. జ‌గ‌న్ ఎంత‌టి ఇమ్మెచ్యూర్ అంటే.. ఆయ‌న‌కు పాబ్లో ఎస్కో బార్ అంటే ఎవ‌రో తెలీదు. ప్ర‌త్య‌ర్ధులు త‌న‌ను అత‌డితో పోలిస్తే.. ఎవ‌ర‌ని ఒక అమాయ‌క మొహం పెట్టారు. స‌రే అంద‌రికీ అన్నీ తెలియాల్సిన  ప‌న్లేదు. కానీ కొంతైనా సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక- ప‌రిజ్ఞానం ఉండాలి క‌దా? ఇదే జ‌గ‌న్ లాంటి వారిచ్చిన‌ట్టు కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు,  డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ వంటి పథకాల  గురించి స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివిన లోకేష్ ఎప్పుడో క‌నుగొన్నారు. కానీ బై బ్యాడ్ ల‌క్.. వాటినే జ‌గ‌న్ కాపీ కొట్టి.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌గా, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ గా మార్చిన‌ట్టు చెబుతారు కొంద‌రు. అదే బాబు అలా క్కాదు.. ప్ర‌స్తుతం పీ4 ఎంత‌టి మ‌హ‌త్త‌ర‌మైన ప‌థ‌క‌మంటే.. అది   పేద‌రికాన్ని పార‌దోలే ఒక  సంజీవ‌నే. అలాంటిదేదీ జ‌గ‌న్ నుంచి ఆశించ‌లేం. ఆయ‌న ఏదైనా స‌రే ఒక పెట్టుబ‌డి  కింద కాకుండా ఖ‌ర్చుగా మార్చుతుంటారు. దీంతో.. రాష్ట్రాన్ని దివాలా తీయించే ధోర‌ణి అవ‌లంబిస్తుంటారు. బేసిగ్గా  జ‌గ‌న్ చుట్టూ పెద్ద గొప్ప మేథావులెవ‌రూ లేరు. ఒక వేళ ఉన్నా వారెవ‌రూ ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌లో ఉండ‌రు. దానికి తోడు ఆయ‌న‌కు స్క్రిప్ట్ అందించే వారు కూడా ఎంతో అతిశ‌యంగా ఇస్తుంటారు. ఇవ‌న్నీ రివ‌ర్స్ లో విక‌టించిన‌వే త‌ప్ప  ఆయ‌న్ను కాపాడ‌లేక పోయాయి. ప‌వ‌న్ కూడా అంతే ఇద్ద‌రూ ఇద్ద‌రే. వారికెవ‌రు స్క్రిప్ట్ ఇస్తారోగానీ.. వాటిలో ఎంత మాత్రం ఇన్ఫో లేక పోగా.. అతిశ‌యంగా అనిపిస్తాయి. ఇదే ఈ ఇద్ద‌రికీ పెద్ద మైనస్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక టీటీడీ పుస్తక ప్రసాదం!

దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని  అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి మహాత్మ్యం, వైభవం అతి సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా చిన్న సైజులో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది.  మతమార్పిడులను అరికట్టడం, హిందూ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా ఇందుకు సంకల్పించింది.   శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల్లో ఉచితంగా  పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక  పుస్తకాలను చిన్న సైజులో   భక్తులు చేతిలో ఇమిడే విధంగా  ముద్రించి  దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు తిరుమల తిరుపతిలలో కూడా భక్తులకు వీటిని  శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని నిర్ణయించినట్లు బీఆర్నాయుడు తెలిపారు. అలాగే తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు వీటిని అందజేస్తామన్నారు.   

తెలంగాణ క్రీడాభివృద్ధిలో భాగస్వామిగా ఉంటా.. రేవంత్ తో కపిల్ దేవ్

 క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కపిల్ దేవ్ అభినందించారు. రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కపిల్‌దేవ్‌కు సీఎం రేవంత్‌ వివరించారు. దీంతో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతోపాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తాను భాగస్వామిగా ఉంటానని కపిల్ దేవ్ ముందుకు వచ్చారు.

తెలంగాణలో మీడియా, సినిమా రంగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా.. సీఎం రేవంత్ తో అజయ్ దేవగన్

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం (జులై7) క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌,  వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్జాతీయ స్థాయి  స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కూడా అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవ‌గ‌ణ్‌కు వివ‌రించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు. పలువురు విద్యార్థలు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కడలూరు చెమ్మన్ గుప్పం రైల్వే గేటు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రైలు వచ్చే సమయం అయినా కూడా రైల్వే గేటు వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.  పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో.. ఆ ధాటికి స్కూలు బస్సు దాదాపు 50 మీటర్ల దూరానికి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘట స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు.  

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ సమీపంలో సుజాతమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగుదశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఇలా ఉండగా వేమిరెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  

సినీ, క్రీడా ప్ర‌ముఖుల‌తో సీఎం రేవంత్

రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్ద‌రు సినీ క్రీడా సెల‌బ్రిటీల‌ను క‌లిశారు. వారిలో ఒక‌రు 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత లెజండరీ క్రికెటర్ క‌పిల్ దేవ్ కాగా. మ‌రొక‌రు న‌టుడు, నిర్మాత  అజ‌య్ దేవ్ గ‌న్.  ఈ మ‌ధ్య ప‌దే ప‌దే రేవంత్   140 కోట్ల భార‌త దేశం నుంచి వ‌చ్చే ప‌త‌కాల సంఖ్య కేవ‌లం వేళ్ల మీద లెక్క‌బెట్ట‌గ‌లిగేంత మాత్ర‌మేనా? అంటున్నారు.   ఈ క్ర‌మంలో చూస్తే.. క‌పిల్ దేవ్ లాంటి క్రీడా ప్ర‌ముఖుల  స‌ల‌హా  సూచ‌న‌లు చాలా చాలా అవ‌స‌రం. దానికి తోడు ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించ‌మ‌ని, ఆపై క్రీడ‌ల‌ కోసం  వంద కోట్లు ఇవ్వ‌మ‌ని ఆయ‌న కేంద్ర మంత్రిని క‌లిసి మ‌రీ విన్న‌వించుకున్నారు. ఇక ఒలింపిక్స్- 2036 రెండు ఈవెంట్లు.. తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌ప‌మ‌ని కూడా అడిగారు సీఎం రేవంత్.  ఇక అజ‌య్ దేవ్ గ‌న్ సీఎం భేటీలోని ముఖ్యాంశ‌మేంట‌ని చూస్తే.. హైద‌రాబాద్ లో ఫిల్మ్ స్టూడియో క‌ట్ట‌డానికి త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల్సిందిగా దేవ్ గ‌న్ సీఎం రేవంత్ ని అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అజ‌య్ దేవ్ గ‌న్ కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ఒకటి మాదాపూర్ లో   ఉంది. ఇక్క‌డే ఒక ఫుల్ స్టూడియో సెట‌ప్ ఉంటే బావుండ‌ని అజ‌య్ దేవ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందుకోసమే  సీఎం రేవంత్ ని అజ‌య్ దేవగన్ కోరినట్లుగా తెలుస్తోంది.  

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. సై, ఛత్రపతి, బాహుబలి, రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలకు శివశక్తి దత్తా పాటలు రాశారు. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. అలాగే జానకిరాముడు చిత్రానికి శివశక్తి దత్తా రచయతగా పని చేశారు. ఇక చంద్రహాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా స్వయానా సోదరులు.  శివశక్తి దత్తా మృతితో కీరవాణి, రాజమౌలి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. శివశక్తిదత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం డ్యామ్

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇలా ఉండగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీటి వరద కొనసాగుతోంది. సుంకేసుల, జారాల నుంచి లక్షా 72 వేల 705 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. కాగా శ్రీశైలం జలశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటను రానున్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలకు ముందు  చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. అంతకు ముందంు ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.  ఇలా ఉండగా జులై నెలలోనే శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం పాతికేళ్లలో ఇదే తొలి5 సారి. ఇక పోతే చంద్రబాబు శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అనంతరం  నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు.  

రొట్టెల పండుగలో మంత్రి నారాలోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నట్లు నారా లోకేష్ చెప్పారు.  ముఖ్యమంత్రి  ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.  ప్రజల శ్రేయస్సే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మతసామరస్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందిన బారాషాహీద్ మసీదులో జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఈ రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివస్తారు. స్వర్ణాల చెరువులో తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకుంటారు. 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవదహనం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు.   హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తమ పిల్లలతో పాటు ఇటీవల వెకేషన్‌ కోసం అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి సరదాగా అంట్లాంటా వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి తిరిగి డల్లాస్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు గ్రీన్ కౌంటీ ప్రాంతానికి చేరుకున్నది. అక్కడ రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ట్రక్ వారు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొనడంతో   కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకట్, తేజస్విని, వారి ఇద్దరు పిల్లలూ సజీవదహనమయ్యారు. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వాళ్ల కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తహా తమ ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు.  

రాజాసింగ్ సై అంటారా.. సరండెర్ అవుతారా?

  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా?  పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను  అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ  సీరియస్ గా తీసుకుందా? అందుకే..  ఆయన గేటు దాటక ముందే ఆయన సమర్పించిన రాజీనామా లేఖను..  అప్పటి  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారా? అందుకే..  సంప్రదింపులు బుజ్జగింపులకు స్కోప్ లేకుండా  పార్టీ అధికార ప్రతినిధి  రాణి రుద్రమ ద్వారా, క్రమశిక్షణ  గీత దాటిన  రాజాసింగ్  విషయంలో పార్టీ  కఠినంగా ఉంటుందనే సంకేతాలు ఇప్పించారా ? అంటే..  పార్టీ వర్గాల  అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి.. రాజా సింగ్’ ‘కట్టర్’ హిందుత్వ వాది. అందులో సందేహం లేదు. అలాగే..  జనంలో మంచి ఫాలోయింగ్  ఉన్న నాయకుడు. ఈ విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. బీజేపీ కార్యకర్తల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఒక్క పిలుపుతో వందలు కాదు వేల మంది కార్యకర్తలను కదిలించగల చేయగల ఏకైక సిటీ నాయకుడు రాజా సింగ్.  కార్యకర్తల్లోనే కాదు..  కార్పొరేటర్లు, ఇతర స్థానిక నాయకులు కూడా  రాజా సింగ్ ను పార్టీతో సమానంగా చూస్తారు. అందుకే..  గోషామహల్ స్థానిక నాయకులు, కార్యకర్తలు బీజేపీ, రాజాసింగ్ తమకు రెండు కళ్ళు.. ఎవరినీ  వదులుకునేది లేదని అంటున్నారు. రాజా సింగ్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే.. ఎన్ని సుగుణాలు ఉన్నా,  క్రమశిక్షణ గీత దాటి బీజేపీలో కొనసాగడం అయ్యేపని కాదని  పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి.. ఇప్పటికే రాజా సింగ్ కు పార్టీ లాంగ్ రోప్ ఇచ్చింది. అనేక మార్లు ఆయన గీత దాటినా, ఆయనకున్న ప్రత్యేక అర్హతల దృష్ట్యా పార్టీ నాయకత్వం చూసీచూడనట్లు వదిలేసింది. అయితే.. ఇక ఇప్పుడు ఉపేక్షించే పరిస్థితి ఉండదని రాజా సింగ్ అనుకూల వర్గం నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.  అయితే..  రాజా సింగ్ కోరుకున్న విధంగా ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి ఆయన్ని సస్పెండ్ చేయమనో, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమనో కోరే పరిస్థితి అయితే రాకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో రాజా సింగ్  తనంతట తానుగా రాజీనామా చేస్తే..  ఉప ఎన్నిక వస్తే  బీజేపీ తమ అభ్యర్ధిని బరిలో  దింపుతుందని అంటున్నారు.  అందుకు రంగం సిద్దం చేసుకుంటోందనీ చెబుతున్నారు.  నిజానికి.. ఉప ఎన్నిక వస్తుందా? రాదా?  అనే విషయంతో సంబంధం లేకుండా  రాజాసింగ్  స్థానంలో మాధవీ లతను ఓల్డ్ సిటీ  లీడర్ గా నిలిపేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవును..  గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్  స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీని ఎదుర్కున్న ఫైర్ బ్రాండ్ లేడీ మాధవీ లతను రంగంలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి..  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్  మాధవీ లతతో మాట్లాడి, గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చినా రాక పోయినా.. అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా,.. పాత బస్తీలో  రాజాసింగ్ పాత్రను ఇక పై మీరే పోషించవలసి ఉంటుందని మాధవీలతకు బీజేపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వంక రాజా సింగ్  తాను పార్టీని వదిలినా, హిందుత్వ సిద్దాంతాన్ని వదిలేది లేదని అంటున్నారు. అలాగే..  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా  నాయకత్వాన్ని సమర్దిస్తానని అంటున్నారు. అంతే కాదు.. తన కోసం పార్టీ క్యాడర్  ఎవరూ పార్టీ వదలవద్దని  వీడ్కోలు సందేశం(?)ఇస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన కూడా రాజాసింగ్ కు లేదని, అంటున్నారు. ఈ నేపద్యంలో రాజాసింగ్  నెక్స్ట్ మూవ్ ఏమిటి? సరెండర్ అవుతారా ? సై .. అంటారా ? అనేది తేలవలసి వుందని అంటున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు అటు  బీజేపీ నుంచి కానీ, ఇటు రాజాసింగ్ వైపు నుంచి కానీ, తీవ్ర నిర్ణయం ( డ్రాస్టిక్’ స్టెప్) ఏదీ  ఉండక పోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం గా చెపుతున్నారు.  సో..గోషా మహల్ ఉప ఎన్నికకు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం.