ఉత్తమ్ వ్యాఖ్యలు.. దేనికి సంకేతం ?
posted on Jan 7, 2023 @ 1:38PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన వివాదం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పుతో సమసి పోయినట్లేనా? మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్‌రావు థాకరే నియామకంతో, సీనియర్లు సంతృప్తి చెందినట్లేనా? ఇక సీనియర్, జూనియర్ కొత్త పాత నాయకులు అంతా కలిసి పనిచేస్తారా? అంటే, అలాంటి సూచనలు ఏవీ కనిపించడం లేదని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మార్పు తర్వాత జరిగిన, కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో శిక్షణ తరగతులకు కూడా జానా రెడ్డి, భట్టి విక్రమార్క తప్ప మిగిలిన జీ 9 నాయకులు ఎవరూ హాజరు కాలేదు. ఆ ఇద్దరు కూడా మొక్కుబడిగా వచ్చి వెళ్ళారే తప్ప రేవంత్ రెడ్డితో సయోధ్య కుదిరిందనే సంకేతలేవీ ఇవ్వలేదు.
అదొకటి అలా ఉంటే ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు సొంత బాటలు వేసుకుంటున్నారని, ఎవరికి వారు తమ తమ సొంత నియోజక వర్గాలలో విజయం కోసం సొంత పంథాలో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. నిజానికి ఖమ్మం జిల్లాలో భారాస నాయకులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి సుధాకర రెడ్డి ఎలాగైతే స్వతంత్రంగా సొంత పంధాలో ఆత్మీయ సదస్సుల పేరిట సొంత ఇంటిని చక్కబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారో అదే పంథాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు సొంత నియోజక నియోజక వర్గాలపై దృష్టిని కేద్రీకరించారని అంటున్నారు. నిజానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అయితే ఇక తానూ తన నియోజక వర్గానికే పరిమితం అవుతానని ప్రకటించారు. గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నారు.
ఈనేపధ్యంలోనే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ కోదాడ స్థానాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు తెర తీశాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రెండు నియోజక వర్గాలకు సంబంధించిన తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఉత్తమ కుమార్ రెడ్డి ఈ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ వేనంటూ జోస్యం చెప్పారు.
అంతే అయితే, అది పెద్ద విషయం కాకపోవునేమో, కానీ, ఆయన అంతటితో ఆగలేదు. హుజూర్‌నగర్‌లో మళ్లీ తానే పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఒక వేళ మెజార్టీ 50 వేలకు ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటాననని ప్రకటించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి పార్టీ ప్రమేయం లేకుండా అసెంబ్లీకి పోటీ చేస్తానని తనంతట తానుగా ప్రకటించుకోవడం రేవంత్ రెడ్డి ని గిల్లడం కోసమేనా అనే చర్చ జరుగుతోంది.
మరోవంక ఉత్తమ కుమార్ రెడ్డి సవాలు విసిరిన కొద్ది రోజులకే, మంత్రి కేటీఆర్ హుజూర్ నగర్ లో పర్యటించి ఎప్పుడో మూడున్నర ఏళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు సంబందించిన శంకు స్థాపనలు చేశారు. బహిరంగ సభలో ప్రసంగించారు.
కానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తీసుకు రాలేదు. ఉత్తమ కుమార్ రెడ్డి పేరు అసలే ప్రస్తావించలేదు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గానే కేటీఆర్ ప్రసంగం సాగింది. రాష్ట్రం పన్నుల రూపంలో కేద్రానికి ఇచ్చిన నిధుల కంటే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎక్కువని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసిరారు. కానీ ఉత్తమ కుమార్ రెడ్డి పేరైనా ఎత్తలేదు. దీంతో చర్చ కొత్త మలుపు తిరిగింది. నిజానికి, ఉత్తమ కుమార్ రెడ్డికి భారాస ముఖ్యనాయకులతో మంచి సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. నిజానికి, కాంగ్రెస్, భారాసల పొత్తుకు సుముఖంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉత్తమ కుమార్ రెడ్డి ఉన్నారని అంటారు. అలాగే రేవంత్ రెడ్డి వర్గం కోవర్టులుగా ముద్ర వేసిన సీనియర్లలోనూ ఉత్తమ్ పేరు ఉందనే ప్రచారం జరుగుతోంది.
నిజమే ఉత్తమ కుమార్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు కోదాడ నుంచి, మూడు పర్యాయాలు హుజూర్ నగర్ నుంచి ఎన్నికయ్యారు. కాబట్టి ఆయనకు ఆ నియోజక వర్గాలపై పట్టున్న మాట నిజమే. అయితే, అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ నల్గొండ ఎంపీగా ఎన్నికయ్యారు. హుజూర్‌నగర్ శాసనసభ స్థానాన్నికి రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా కరాణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య, పద్మావతి పోటీ చేసి ఓడి పోయారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి సిట్టింగ్ స్థానంలో భార్యను ఉత్తమ్ గెలిపించుకోలేక పోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. కాగా.. అంతకుముందు 2018 జరిగిన ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేవలం 7466 ఓట్లతో గెలుపు సాధించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉన్న ప్రస్తుతపరిస్థితుల్లో మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలవటం.. అది కూడా 50 వేల మెజార్టీతో విజయం సాధించడం కొంత ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత గట్టిగా ఆ రెండు నియోజక వర్గాలు మావే.. మెజారిటీ 50వేలకు తగ్గితే రాజీనామా చేస్తాను అంటున్నారంటే అది కూడా ఆలోచించవలసిన విషయమే అంటునారు. మరో వంక నియోజక వర్గానికి వచ్చీ మంత్రి కేటీఆర్ ఉత్తమ్ సవాలుపై స్పందించకే పోవడం సైతం ఆలోచించవలసిన విషయమే అంటున్నారు. అంతేకాదు నియోజక వర్గానికి వచ్చి భారాసకు ప్రధాన ప్రత్యర్ధిగా బావిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరైనా ఎత్తక పోవడం ఇంకా ఇంకా ఆలోచించ వలసిన విషయమే అంటున్నారు. ఈ నేపధ్యంలోనే భారాస నేతలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనే పాత అనుమానాలు కొత్తగా తెర పైకి వస్తున్నాయి.