కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి కారణమేంటి?

కేసీఆర్ రాష్ట్రం గురించి పట్టించుకోవడం మానేశారా? గవర్నర్ తో విభేదాల విషయంలో తగిలిన ఎదురు దెబ్బ కారణంగా ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బీజేపీపై విమర్శలు చేయవద్దని నిర్ణయించుకున్నారా? లేక కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కాపాడుకోవడం కోసం కేంద్రంపై, ప్రధానిపై విమర్శల వాడి వేడి తగ్గించేశారా? కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బుధవారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు దాదాపు శూన్యం. ఏదో ఒకటీ అరా కేటాయించినా.. అవన్నీ కేంద్ర సంస్థలకు సంబంధించి మాత్రమే. గత ఏడాది నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ ను చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఎలుగెత్తారు. అప్పుడు ఆయన ప్రసంగం అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. కేంద్రంపై పోరులో కేసీఆర్ చాంపియన్ అన్న భావన కలిగించింది. ఏడాది గిర్రున తిరిగింది. మళ్లీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ సారీ తెలంగాణకు రిక్తహస్తమే. అయినా కేసీఆర్ పన్నెత్తి మాట్లాడలేదు. కనీసం తెలంగాణకు కేంద్రం మళ్లీ అన్యాయం చేసింది అన్న మాటైనా ఆయన నోటి వెంట రాలేదు. జాతీయ పార్టీ అధినేత అయినా, తెలంగాణకు ముఖ్యమంత్రే కదా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేటాయింపులు దక్కకపోవడంపై నోరెత్తకపోవడమేమిటని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి పలు  రకాల భాష్యాలు చెబుతున్నారు. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభం అవుతున్నాయి. ఆ రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. మొదట గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని భావించిన కేసీఆర్.. ఆ తరువాతి పరిణామాలతో వెనక్కు తగ్గారు. అంతే కాదు.. గవర్నర్ కు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా గవర్నర్ ప్రసంగ ప్రతులలో ఆమె చెప్పిన మార్పులకు కూడా ఓకే చేసేశారు. అంటే ప్రభుత్వం ఆమోదంతో రూపొందిన గవర్నర్ ప్రసంగంలో కూడా ఆమె చెప్పిన మార్పులు చేయడానికి కిమ్మనకుండా అంగీకరించేశారు. తమిళనాడు గవర్నర్ చేసిన విధంగా తమిళిసై కూడా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా అన్న భయం ఆయనలో కనిపిస్తోంది. ఒక వైపు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తనతో జట్టుకట్టే పార్టీల గురించి అన్వేషణ సాగిస్తూనే.. మరో వైపు ఏ విధంగానైనా కేంద్రం మెప్పు పొందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే గవర్నర్ ఎపిసోడ్ తరువాత కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కేంద్రంపై విమర్శల దూకుడు కనిపించడం లేదు. మరో వైపు గవర్నర్ ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి పసన్న కుమార్ రెడ్డిని షటిల్ సర్వీసులా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య తిప్పుతున్నారు.   మొత్తానికి కేంద్రం విషయంలో కేసీఆర్ తీరు మారిందనడానికి బడ్జెట్ పై ఆయన నోరెత్తకపోవడాన్నే తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు. 

రాహుల్ జోడో యాత్ర ముగిసింది.. కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంది?

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఆయన విజయవంతంగా తన గమ్యం చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు.  అయిదు నెలల కాలంలో 14 రాష్ట్రాలలో కాలి పాదయాత్ర సాగించిన  రాహుల్‌ గాంధీ, ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంత మేరకు రాజకీయ లబ్ధి చేకూరిందన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం రావడం లేదు. రాహుల్ తన పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎర్రటి ఎండలో, వణికించే చలిలో కూడా ఎక్కడా ఆగకుండా ఆయన పాదయాత్ర నిర్ధిష్ట షెడ్యూల్ ప్రకారం సాగింది. ఆయనలోని పట్టుదలను, ఓర్పు, సహనాన్ని ప్రజల కళ్లకు కట్టింది. రాహుల్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. రాజీవ్ గాంధీ తనయుడిగా, తల్లి సోనియా చాటు బిడ్డగానే కాకుండా ప్రజా జీవితంలో యాక్టివ్ గా ఉండే నేతగా, ప్రజల కష్టాలకు, సమస్యలకు స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక అలుపూ, సొలుపు అన్నది లేకుండా రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తూ, అదీ ఉత్సాహంగా, ప్రజలతో మమేకమౌతూ ఆయన సాగించిన నడక అందరి దృష్టినీ ఆకర్షించిందనడంలో సందేహం లేదు. స్థిత ప్రజ్ణత సాధించిన నేతగా, పరిణతి చేందిన వ్యక్తిగా, రాజకీయ వేత్తగా ఆయనకు దేశ వ్యాప్త గుర్తింపు తీసుకు వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే ఈ గుర్తింపు  కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనకరం, ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందా? అధికారాన్ని హస్తగతం చేస్తుందా? అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే రాజకీయ వర్గాల నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తోంది. ఆయన పాదయాత్ర సాగుతున్న సమయంలోనే తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైంది. హిమాచల్ లో విజయం సాధించినప్పటికీ.. ఆ విజయాన్ని రాహుల్ పాదయాత్ర క్రెడిట్ లో వేయడానికి వీల్లేదు. ఆ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒక సారి అధికారం మారడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.   ఏతావాతా.. రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలలో ఆదరణ ఉందనీ, ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నీరుగారలేదనీ, అయితే ఆ ప్రజాదరణనూ, క్యాడర్ ఉత్సాహాన్నీ ఎన్నికలలో విజయంగా మరల్చుకుందుకు అవసరమైన వ్యూహాలు కరవయ్యాయనీ తేలింది.  ఇక మళ్లీ రాహుల్ వద్దకు వస్తే.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల, ప్రజలకు చేరువ కావడం వల్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న అవగాహన నిస్సందేహంగా మరింత పెరిగింది.  అలాగే ప్రజలకు కూడా రాహుల్ పట్ల ఇప్పటి వరకూ ఉన్న దృక్ఫథం కూడా మారి ఉంటుంది. నాన్ సీరియస్ రాజకీయ వేత్త కాదనీ, విపక్షాలు ఇంత కాలం విమర్శిస్తున్న విధంగా ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ కాదనీ కూడా అర్ధమైంది. ఆయనలో పరిణితి చెందిన నేతను ఈ యాత్ర  ప్రజలకు పరిచయం చేసింది.   ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికీ, పార్టీకి అవసరమైన జవసత్వాలు నింపడానికి చేకగలిగిందంతా చేశారు. ఇక మిగిలినది పార్టీ చేయాలి. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా వ్యక్తమౌతున్న సానుకూలతను వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలదో చూడాలి. పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ ఉన్నా,  రాష్ట్రాలలో పార్టీ నేతల మధ్య తగాదాలు, విభేదలూ గెలుపునకు అవరోధాలుగా మారుస్తున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ ఎన్నికల ఓటములకు అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు.. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో విజయంపై పార్టీ దృష్టి సారించాల్సి ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దానిని కాపాడుకోవడం.. విపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ ముందున్న సవాళ్లు.  మరీ ముఖ్యంగా  కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో  ఏకకాలంలో బీజేపీ, అధికార బీఆర్ఎస్ లను ఎదుర్కొని విజేతగా నిలవాల్సిన అవసరం ఉంది.   

బాలకృష్ణ గ్రేట్.. విజయసాయి రెడ్డి

తెలుగుదేశం అధినేత   నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణపై  ఎవరైనా సోషల్ మీడియా వేదికగా  విమర్శలు గుప్పిస్తున్నారంటే.. అది వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి రోజు.. వీరిపై  ట్విట్టర్ వేదికగా ఏదో ఒక విమర్శ చేస్తేనే కానీ  విజయసాయిరెడ్డికి  పూట గడవదన్న టాక్   సోషల్ మీడియాలో ఉంది.  అయితే తాజాగా టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్జతలు తెలపడం సంచలనంగా మారింది.  జనవరి 27న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.  ఆ  సందర్భంగా  ఆయన బంధువు, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై.. కుప్పకూలిపోయారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి..  చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  నందమూరి తారకరత్న.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అది ఎలాగంటే... విజయసాయిరెడ్డి భార్య సునంద.. చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డి.  ఆ అలేఖ్యా రెడ్డి.. తారకరత్న భార్య. అంటే.. విజయసాయిరెడ్డికి.. తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు.  దీంతో విజయసాయిరెడ్డి.. బుధవారం(ఫిబ్రవరి 1) బెంగళూరులోని నారాయణ హృదయాలకు వెళ్లి.. మరదలి అల్లుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన పూర్తిగా సేఫ్ అని చెప్పారు. అయితే  తారకరత్న అస్వస్థతకు గురైన రోజు దాదాపు  45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ   నిలిచిపోవడంతో  మెదడు పైభాగం దెబ్బతిందని.. ఈ నేపథ్యంలో.. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌‌ కారణంగా.. లివర్ కానీ.. కొన్ని ఆర్గాన్స్‌కి కానీ.. రక్త ప్రసరణ తగ్గిందని.. దీంతో కొంత యాక్టివిటీ తగ్గిందని అన్నారు.   అయితే ఈ రోజు హార్ట్ ఫంక్షనింగ్ పర్ ఫెక్ట్ గా ఉందనీ,  మెదడులో ఎడిమా  అంటే వాపు  ఉందని.. ఇది మూడు నాలుగు రోజులు ఉంటుందని..  ఆ తర్వాత స్టెబిలైజ్ అయి.. వాపు తగ్గడం ప్రారంభమవుతుందని... వైద్యులు చెప్పారని విజయసాయి వివరించారు.  వైద్యులు  అద్బుతంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనీ. మంచి ట్రీట్‌మెంట్ కనిపిస్తోందని విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. తారకరత్న ఆరోగ్యం విషయంలో బాలకృష్ణ  ఎంతో కష్టపడ్డారనీ, అన్ని విషయాలూ ఆయన   స్వయంగా చూసుకొంటురన్న విజయ సాయి ఆయనకు కృతజ్జతలు తెలియజేసుకొంటున్నానన్నారు.        తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి ఫ్యామిలీతోపాటు నారా ఫ్యామిలీలో ఎంత ఆందోళన వ్యక్తమవుతుందో.. విజయసాయిరెడ్డి ఫ్యామిలీలో కూడా అంతే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సైతం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలోనే ఆసుపత్రలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించి... అతడికి అందిస్తున్న వైద్యాన్ని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

నెల్లూరు పెద్దారెడ్ల ప్రతిఘటన

కాలం కలిసి వస్తుంటే.. అన్ని ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి.. అదే కాలం కలిసి రాకుంటే.. ఒకదాని వెనుక ఒకటి పోతునే ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా  చోటు చేసుకొంటున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీకి కాలం కలిసి రావడం లేదని అనిపించక మానదు.  మొన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి.. నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నేడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి..  రేపు ఎవరు అనే  చర్చ జోరుగా సాగుతోంది. వీరందరూ ఒకరి వెంట ఒకరు వైసీపీపైనా, సీఎం జగన్ పైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్‌నారాయణరెడ్డి గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతలను నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం.  మరి కొద్ది రోజుల్లో ఆయన  తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమనీ, నేడో రేపో ముహూర్తం ఖరారు చేసుకుంటారని నెల్లూరులో విస్తృతంగా ప్రచారంలో ఉంది.   అలాగే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..   జగన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో..   తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అధికారులపై చూపిస్తుండడంతో.. ఈ ఏడాది జనవరిలో సీఎం  జగన్ ఆయనను తన క్యాంప్ కార్యాలయానికి స్వయంగా  పిలిపించుకొని మరీ మాట్లాడి పంపించారు. అయితే గత కొద్ది రోజులుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. సొంత పార్టీపై కోటంరెడ్డి నిప్పులు చెరగడమే కాదు..  అన్నా.. జగనన్న మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే... అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి,  జగన్‌కే సూటిగా ప్రశ్నలు సంధించారు. నమ్మకం లేని చోటు నేను  ఉండను గాక ఉండనంటూనే.. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. ఆ విషయం ఆ పార్టీ వారికే చెప్పానని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తాన్నారు. దీంతో కోటంరెడ్డి పార్టీ మార్పు పక్కా అని అందరికీ అర్థమైపోయింది.     ఇక... ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం.. తన నియోజకవర్గంలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలపై.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గమైన ఉదయగిరిలో పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి.. చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఆతడి వల్ల మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలకుడు ధనుంజయరెడ్డి నిర్ణయాల వల్ల .. పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధనుంజయ్ రెడ్డి ససతం ఉదయగిరి ఎమ్మెల్యేపై తనదైన శైలిలో పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌కు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాదు తన మీద పెత్తనం చేయడం కదరని పని అని.. ఈ విషయం సీఎం జగన్, జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడానికే కాదు.... దేనికైనా సిద్ధమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  స్పష్టం చేశారు.  ఇలాంటి వరుస పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని మరో ఎమ్మెల్యే.. అంటే మరో పెద్దారెడ్డి.. తన గొంతు సవరించుకొని.. అధికార పార్టీపై అసమ్మతి గళం విప్పి ఎదురు తిరిగేవారు ఎవరా? అని తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు సైతం టెన్షన్ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో   ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అలాంటి జిల్లాలో ఇలా   ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తడం విప్పుతూ పోతే.. ఇక మిగిలేది ఎవరిని.. అధికార పార్టీ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు. 

జగన్ పై కోటం రెడ్డి రివోల్ట్.. కారణమేమిటంటే?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీకి  రాం.. రాం చెప్పేశారు.  అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున బరిలో దిగాలనుందంటూ..  తన మనస్సులోని మాటను బయటపెట్టేశారు.  అయితే తెలుగుదేశం నుంచి పోటీ విషయంలో  నిర్ణయం మాత్రం చంద్రబాబుదేనంటూ  ముక్తాయించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం  జగన్‌తో కోటంరెడ్డి భేటీ అయ్యారు.  అయితే ఆ భేటీ జరిగిన నెల రోజులకే కోటంరెడ్డి..  ఇకపై వైసీపీలో ఉండలేనంటూ..  ఫ్యాన్‌ స్వీచ్ ఆప్ చేసి మరి బయటకు వచ్చేయడం సంచలనంగా మారింది.  కోటంరెడ్డి నిర్ణయం పట్ల వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలో తొలి నాళ్ల నుంచి ఆవేశం ఉండేదని..  కానీ  జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం ఆయనకు మంత్రిపదవి దక్కకపోవడంతో పాటు..  తన సొంత జిల్లాలో.. అదీ జస్ట్... తన పక్క నియోజకవర్గం నుంచి గెలుపొందిన సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను జగన్ తన తొలి కేబినెట్‌లోకి తీసుకోవడం..  ఆ తర్వాత జరిగిన మలి కేబినెట్‌ కూర్పులో సైతం.. అదే  జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి కేబినెట్ బర్త్ కేటాయించడం.. ఈ ఇద్దరికీ అత్యంత కీలక శాఖలను  కేటాయించడం..   కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేదనే ఓ చర్చ అప్పుడూ, ఇప్పుడూ కూడా జిల్లాలో వాడి వేడిగా నడుస్తోంది. అదీకాక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో..   జగన్ మీద ఉన్న నమ్మకంతో కోటంరెడ్డి ఫ్యాన్ పార్టీలో చేరారన్న సంగతి అందరికీ తెలిసిందే.  2014లో తొలిసారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. అయితే నాడు పార్టీ విపక్షంలో ఉండడంతో.. జగన్ అధికారంలోకి వస్తే.. తనకు మంత్రిగిరి దక్కుతోందని కూడా భావించారని ఆయన కోటరీలోని వారు ఇప్పటికీ చెబుతుంటారు. అంతేకాదు..  వైయస్ జగన్ అధికారంలోకి రావడం కోసం జిల్లాలో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారని కూడా ఆయన వర్గం చెబుతోంది.  ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ జెండా రెపరెపలాడిందని.. అలాగే రాష్ట్రంలో కూడా ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని.. దీంతో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం మంత్రిగిరి దక్కలేదని.. చర్చ సైతం సాగుతోంది.  అలాగే జగన్ మలి కేబినెట్‌ కూర్పుకు ముందు కూడా కోటంరెడ్డి.. తన నియోజకవర్గంలో రాజకీయ పరంగా జగనన్న వదిలిన బాణంలా దూసుకుపోయారని.. ఆ క్రమంలో పార్టీలోని శ్రేణుల పడుతున్న ఇబ్బందులు తెలుసుకొనేందుకు.. తన నియోజకవర్గంలో నేను.. నా కార్యకర్త అంటూ దాదాపు 50 రోజులు పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్ర సైతం నిర్వహించారని... కానీ జగన్ మలి కేబినెట్‌లో మాత్రం ఆయనకు స్థానం దక్కలేదని... ఈ నేపథ్యంలో ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టోన్‌లో జగన్ పార్టీ పట్ల విముఖత స్పష్టంగా వినిపిస్తూ వస్తోందనే టాక్ సైతం వైరల్ అవుతోంది. అందులోభాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. అధికార మదంతో ప్రవర్తిస్తే, అధికార మదం తలకెక్కితే ప్రజలు వాత పెడతారని.. సొంత పార్టీ వారిని హెచ్చరించారు. అంతేకాదు... ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దని వైసీపీ శ్రేణులకు ఆయన హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే కోటంరెడ్డిలో చోటు చేసుకున్న అసంతృప్తి క్లియర్ కట్‌గా అర్థమువుతోందనే చర్చ సైతం సాగుతోంది.  అలా మొదలైన కోటంరెడ్డిలో ప్రస్ట్రేషన్.. నేడు పీక్స్‌ చేరిందని.. అంతేకాదు తన ఫోన్ ట్యాపింగ్ అంశం.. కోటంరెడ్డిని జీర్ణించుకోలేకుండా చేశాయని..  అందుకే నమ్మకం లేని చోట ఉండలేనంటూ ఆయన వైసీపీకి పార్టీకి గుడ్ బై చేప్పేశారు.  ఇక వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కోటంరెడ్డి గట్టిగానే నోరు పారేసుకొన్నారని.. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుది భస్మాసూర హస్తమని.. ఆ భస్మాసురుడికే ఈ చంద్రబాబు పెద్దన్న అన్నారని.. అలాగే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం తగలబడిపోయిందన్నారని.. రాష్ట్ర చరిత్రలోనే చంద్రబాబు ఓ విఫల నాయకుడిగా అభివర్ణించారని.. తన ఐదేళ్ల పాలనపై చంద్రబాబు... ఆత్మపరిశీలన చేసుకోకుండా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమంటూ కోటంరెడ్డి పలు వేదికలపై నుంచి వ్యాఖ్యలు సైతం చేశారని చర్చ సైతం సైకిల్ పార్టీలో సవారీ చేస్తోంది.   మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌లో నరకాసురుడి పాలన కనిపిస్తోందా? చంద్రబాబు అవినీతిని బైట పెట్టిన వైయస్ జగన్‌లో నరకాసురుడు కనిపిస్తున్నాడా? అంటూ నాడు చంద్రబాబుపై ఇదే కోటంరెడ్డి నిప్పులు సైతం చెరిగారని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కేవలం ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారని కూడా కోటంరెడ్డి తన ప్రెస్‌మీట్‌లో గుర్తు చేశారని.... అలాగే  చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో కరువు కటకాలతో ఉండేదని... జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని కూడా అన్నారని.. అలాగే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోతోందంటూ కోటంరెడ్డి జోస్యం కూడా చెప్పారనే చర్చ సైతం టీడీపీలో సాగుతోంది.  అయితే పార్టీ అధినేత చంద్రబాబుపై ఇలాంటి వాఖ్యలు చేసిన.. కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ.. తెలుగుదేశంలోని ఓ వర్గం   అడ్డం పడుతోన్నట్లు సమాచారం. అదీకాక గతంలో ఇన్ని విమర్శలు చేసిన ఆయన.. నేడు పార్టీలోకి వస్తే.. పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతోందనే ప్రశ్న కూడా ఉదయించినట్లు తెలుస్తోంది. మరోవైపు... టీడీపీతో కోటంరెడ్డి.. ముందుగానే మంతనాలు చేసుకొన్నారని.. ఆ తర్వాతే.. జగన్ పార్టీకి బై బై చెప్పేశారని.. జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపై ఇన్ని ఆరోపణలు గుప్పించిన.. కోటంరెడ్డిని సైకిల్ పార్టీలోకి ఆహ్వానిస్తారా? లేకుంటే.. సజ్జల చెప్పినట్లు.. ముందే వేసుకొన్న పథకం ప్రకారం.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారా? ఓ వేళ.. టీడీపీలో కోటంరెడ్డి రాకకు అడ్డు పడితే... ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది.. ఆయనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటంటే మాత్రం.. అందుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

వచ్చే ఎన్నికలలో బీజేపీ నినాదం మోడీ!

ప్రస్తుతం బీజేపీకి మోడీ వినా మరో ప్రజాకర్షక నేత లేరు. నిజమే ఇప్పుడు మోడీ తప్పితే ప్రస్తుతం బీజేపీలో ఇమేజ్ ఉన్న నేత మరొక్కరు లే రు. అందుకే పార్టీని మించి ఎదిగిన మోడీ పెత్తనాన్ని ఆర్ఎస్ఎస్ అనివార్యంగా భరిస్తోంది. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నినాదం, ఆశ, ఆస్త్రం అన్నీ మోడీయే. ప్రచార సారథీ మోడీయే. అందుకే తన కోసం తన కాళ్లకు తానే   బలపాలు కట్టుకు మరీ తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు మోడీది. నిజమే కాంగ్రెస్, దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలూ ఎలా అయితే ఒకే ఒక వ్యక్తిపై ఆధారపడి బండి లాగిస్తున్నాయో.. బీజేపీ కూడా అలాగే మోడీపై ఆధారపడి మనుగడ కొనసాగిస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన  బీజేపీ ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అంతా మోడీ షో అన్నట్లుగానే సాగుదోంది. బీజేపీలో, ప్రభుత్వంలో అంతా తానే అయిన పరిస్థితిపై మోడీ ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. అన్నిటికీ తన ఇమేజ్, తన పేరు ఉపయోగించడంపై ఒకింత అభ్యంతరం చేశారు. అన్నిటికీ తానే రావాలని, తాను వస్తేనే విజయం అన్న మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పార్టీ నేతలకు చెప్పారు. అయితే ఆయన ఆ మాట కేవలం మాటవరసకే చెప్పారన్న విషయం అప్పుడే అందరికీ అర్ధమైంది. పార్టీకి  మోడీ పేరు ఓ తారక మంత్రంగా మారింది. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు బీజేపీ నేతలకు మోడీ జపం వినా మరోటి లేకుండా పోయింది.   ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రానికి చెందిన నేతే ఉన్నా తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడానికి స్వయంగా మోడీయే ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. ఆయన ఆధిపత్యం, ప్రాముఖ్యతా పార్టీలో ఎంతగా పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికకు  బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను మోడీ తన వ్యక్తిగత హోదాలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందంటే.. పార్టీగా బీజేపీ పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.  ఉదాహరణకు హిమాచల్ విషయం చెప్పుకున్నాం కానీ.. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర విభాగాలన్నీ మోడీ ఆదేశాల కోసమే ఎదురు చూస్తాయి తప్ప సొంతంగా పని చేసే శక్తియుక్తులను ఎప్పుడో కోల్పోయాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి పోటీగా, దీటుగా రాష్ట్రాల్లో బీజేపీలో కుమ్ములాటలు వర్ధిల్లుతున్నాయి.  సంఘ్ పరివార్ నుంచి వచ్చిన పాత బీజేపీ నేతలకు బయటి నుంచి, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి  వచ్చి చేరిన నేతల మధ్య విభేదాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఇంతకాలం బీజేపీ జెండా, అజెండా మోసిన తమను కాదని బయటి నుంచి వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత పెరగటం, వారికి అధికారం కట్టబెట్టడాన్ని పాతనాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటి బిగువన తమ ఆగ్రహాన్ని అణచుకుంటున్నారు. ఒక్కో సారి పార్టీని ధిక్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు  తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో  అంతర్గత కుమ్ములాటల రూపంలో బయటకు వస్తూనే ఉంది. వీటి పరిష్కారానికి సైతం మోడీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఇమేజ్ అనే ఏకైక అస్త్రంతో కదన రంగంలోకి అడుగుపెడుతోంది.  వరుసగా మూడవసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో మోడీ ఉన్నారు.  నెహ్రూ వరుసగా మూడుసార్లు దేశాన్ని ఏలినట్టు తన పేరు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవాలని మోడీ కోరుకుంటున్నారు. అందుకే మోడీ కూడా నెహ్రూ అడుగుజాడలలో అంతర్జాతీయ వేదికలపై గౌరవం పొందడం ద్వారా దేశ ప్రజల మనస్సులలో స్థానాన్ని పదిల పరుచుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగమే ఇండియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు అని పరిశీలకులు అంటున్నారు.    

శుభమన్ గిల్ సెంచరీ.. మూడో టి20లో ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో బుధవారం (ఫిబ్రవరి 1) జరిగిన నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆటలోని అన్ని విభాగాల్లోనూ పై చేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రెండో ఓవర్ లోనే ఇషాంత్ కిషన్ ఔటైనప్పటికీ శుభమన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.   కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.  గిల్. మొత్తంగా 63 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ స్కోరులో 12  ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో టి20లో ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది.  అలాగే రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు.   235 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ  12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా 168 పరుగుల భారీ విజయం సాధించింది. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా నాలుగు వికెట్లు, హర్షదీప్, ఉమ్రాన్, మావీలు రెండేసి వికెట్లు తీశారు. శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 2-1తో కైవశం  చేసుకుంది. స్కిప్పర్ హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

లాంగ్ లీవ్ లో ఏపీ సీఐడీ మాజీ చీఫ్.. కారణమేమిటి?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. ఏపీ డీజీపీగా సునీల్ కుమార్ నియామకం జరగనుందన్న వార్తలు వస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ లో వెళ్లడం సంచలనం కలిగిస్తోంది.  నిజానికి డాక్టర్ సునీల్ కుమార్ ఐపీఎస్ ఏపీలో ఎవరికీ పరిచయం అవసరం లేని పేరు. సీఐడీ చీఫ్ గా అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన వ్యక్తి.  విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి. సీఐడీ చీఫ్ గా ఉన్నంత కాలం సునీల్ కుమార్ అంటే ఏపీ సీఐడీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది.   అటువంటి సునీల్ కుమార్ ను  ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఇటీవల బదలీ చేసింది.   డీజీ హోదాలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో  ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కుమార్  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.   జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా సునీల్ కుమారే ఉన్నారు.  ఆయన హయాంలో ఏపీ సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే  ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.    ఆయన పని తీరును మెచ్చి జగన్ సర్కార్ సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి ఇచ్చింది. పదోన్నతి ఇచ్చి నిండా నెలరోజులు కూడా కాకుండానే  బదలీ వేటు వేయడం సంచలనం సృష్టించింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు  పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడం అప్పడే  సంచలనం సృష్టించింది.   1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించిన సునీల్, జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఏపీ సర్కార్  జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది . వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను  సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అలాంటి సునీల్ కుమార్ కు హఠాత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయమనడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.  అయితే ఆయనను ఏపీ డీజీపీగా నియమించేందుకే సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  అటువంటిది సీఐడీ పోస్టు నుంచి ఆయన తప్పించి ఇంత కాలం ఎలాంటి పోస్టూ ఇవ్వకుండా ప్రభుత్వం దూరం పెట్టడం, ఆ తరువాత ఇప్పుడు ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలోని ఒక రెస్టారెంట్, విశాఖ జిల్లాలో ఓ 50 ఎకరాల భూమి విషయంలో సునీల్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరించడంతోనే ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టేసింది. ఏది ఏమైనా.. సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించి పక్కన  పెట్టేయడం, ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్ పెట్టడం వెనుక ఏదో  పెద్ద కారణమే ఉందని మాత్రం అంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వానికి సానుకూలంగా.. పరిధి దాటి మరీ వ్యవహరించిన సునీల్ కుమార్ ఇప్పుడు అదే ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారనీ, అందుకే లాంగ్ లీవ్ పై వెళ్లక తప్పని అనివార్య పరిస్థితి ఎదుర్కొన్నారని అంటున్నారు. 

మెరుగుపడిన తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పైనే చికిత్స

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఈ రోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బుధవారం  (ఫిబ్రవరి 1) హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్యలు.. ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తరువాత మరో హెల్త్ బులిటిన్ విడుదల చేస్తామని  తెలిపారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ తెలిపారు. ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు త్వరలోనే వెంటిలేటర్ సపోర్టు తొలగిస్తామని వివరించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ మంగళవారం( జనవరి 31)తో పోలిస్తే బుధవారం(ఫిబ్రవరి 1) ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని అన్నారు.  గుండె, కాలేయం పనితీరు సాధారణంగానే ఉందని తెలిపారు. తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. నిన్నటి వరకూ గడ్డంతో కనిపించిన తారకరత్న తాజా ఫొటోలో క్లీన్ షేవ్ తో కనిపించారు. 

వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతోందా?

వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఓ విధంగా రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు.  అంతేకాదు.. ప్రభుత్వంలో కొలువు దీరిన సలహాదారుల రూపంలో అయితేనేమీ.. వివిధ కార్పొరేషన్ సంస్థల అధిపతులుగా నియమించడంలో అయితేనేమీ.. వివిధ నామినేటేడ్ పోస్ట్‌లు కట్టబెట్టడంలో అయితేనేమీ.. టీటీడీ చైర్మన్, ఈవో వంటి పదవుల విషయంలో అయితేనేమి, శాసన మండలి  చైర్మన్, ఈవో పదివిలో అయితేనేమి మొత్తం రెడ్డి సామాజిక వర్గం వారికే మనసా వాచా   జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. అయినా కూడా జగన్ సర్కార్ పట్ల రెడ్డి సమాజిక వర్గంలో  ఆసంతృప్తి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో రెడ్డి సమాజికవర్గంలో అసంతృప్తి గతంలో ఎన్నడూ లేదని ఆ సమాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఇదే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు ..  కాసు బ్రహ్మానందరెడ్డి,  చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి , వైఎస్ రాజశేఖరరెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రెడ్లదే రాజ్యమని.. అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో.. ఆ తర్వాత వచ్చి కె రోశయ్య ప్రభుత్వంలోనే కాదు.. ఆ గద్దెనెక్కిన కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని.. దీంతో రెడ్లకు దక్కాల్సిన ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదని చెబుతున్నారు. ఇక   జగన్.. ముఖ్యమంత్రి అయితే.. తమకు పూర్వ వైభవం వస్తోందని.. తమ సామాజిక వర్గానికి  జగన్   ఓ ఆశాకిరణమని ఆ సామాజిక వర్గం వారు భావించారు. వైఎస్ ప్రభుత్వంలో దక్కిన మర్యాద, ప్రాధాన్యత మళ్లీ దక్కుతోందని  ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా  వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరినా.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కు అత్యంత గౌరవప్రదమైన స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత జగన్ పాదయాత్ర లో రోడ్లు మీదకు వచ్చి మరీ తమ శక్తి కొలది ఖర్చు చేసి.. తమ విలువైన సమయాన్ని సైతం పక్కన పెట్టి.. మరీ జగన్ గద్దెనెక్కేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.  దీంతో 2019 ఎన్నికల్లో  జగన్ పార్టీ గెలుపు..  నల్లేరు మీద నడకే అయిందని..ఈ నేపథ్యంలో తమకు గౌరవం, విలువ దక్కుతోందని సదరు సామాజికవర్గం భావించింది కానీ,  జగన్ హయాంలో కనీస గౌరవం కూడా  దక్కడం లేదని సదరు   సామాజిక వర్గం వాపోతోంది.    ఈ నేపథ్యంలో  రెడ్డి సామాజిక వర్గం చూపు తెలుగుదేశం వైపు మళ్లిందని అంటున్నారు. అందుకు ఉదాహరణ.. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి.. అలాగే ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  ఉమ్మడి కడప జిల్లా నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి,వరదరాజులు రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్యామిలీ, బైరెడ్డి ప్యామిలీలు  తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల నాటికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో రెడ్లు... పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులివే!

ఎన్నికల సంవత్సరం పైగా తెలంగాణలో అధికారంపై బీజేపీకన్నేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు బడ్జెట్ లో పెద్ద పీట వేస్తారని అంతా భావించారు. తెలంగాణ ప్రజలూ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కేంద్రంతో పెరిగిన దూరం నేపథ్యంలో బడ్జెట్ కు ముందు తెలంగాణ సర్కార్ పెద్దగా డిమాండ్లేవీ పెట్టలేదు. ఒక విధంగా బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులూ లేకుంటే బాగుంటుంది అన్నట్లుగా తెలంగాణ సర్కార్ వ్యవహరించింది. బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత లేకపోతే.. తన విమర్శలకు మరింత పదును పెట్టి ఎన్నికలలో లబ్ధి పొదాలన్న వ్యూహంతో  బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించింది. అందుకే గత బడ్జెట్ కు ముందు తెలంగాణకు కావాల్సినవి ఇవీ అంటూ లేఖాస్త్రాలను సంధించేది. రైల్వే ప్రాజెక్టులపై గొంతెత్తేది. కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ చేసేది. అయితే ఈ సారి మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. సరే బీఆర్ఎస్ సర్కార్ అడక్కపోయినా..రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ అర్రులు సాచుతున్న సమయంలో ప్రజల మెప్పు పొందడానికి తెలంగాణకే కేటాయింపులలో సింహభాగందక్కుతుందని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం ఎన్నికలు ఎన్నికలే.. బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులే రెంటికీ సంబంధం లేదన్న తీరుగానే వ్యవహరించింది. ఈ సారి బడ్జెట్ లో కూడా తెలంగాణకు దక్కాల్సిన కేటాయింపులు దక్కలేదు. ఏదో ఊరడింపు అన్నట్లుగా నిధులు విదిలించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ఆఫ్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.374.35 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.300కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 

నిర్మలమ్మ బడ్జెట్ 2023-24 .. కొంచం తీపి.. కొంచెం చేదు

నిర్మలా సీతారామన్ బుధవారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ తీపి చేదుల మిశ్రమంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఆర్థిక నిపుణులు మాత్రం బడ్జెట్ కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మతన బడ్జెట్ లో వేతన జీవులకు ఒకింత ఊరట కలిగించేలా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 7లక్షల రూపాయలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల పొదుపు పరిమితిని రూ.15లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచారు. ఆదాయం 7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధిస్తారు. అంటే 7లక్షల నుంచి 9 లక్షల వరకూ 5శాతం, ఆదాయం 30 లక్సలు దాటితే 30శాతం పన్ను విధిస్తారు. ఇక  ధూమ పాన ప్రియులకు నిర్మల షాక్ ఇచ్చారనే చెప్పాలి. పొగాకు ఉత్పత్తులపై భారీగా వడ్డించారు. దీంతో సిగరెట్ల ధరలు పెరుగుతాయి. ఒక బంగారం, వెండి లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో వీటి ధరలూ పెరుగుతాయి. అలాగే బ్రాండెడ్  దుస్తుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఇక టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాల ధరలు తగ్గుతాయి.     నిరుద్యోగులకు కూడా ఒకింత ఊరట కలిగించేందుకు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నిధులు కేటాయించారు. నాలుగు లక్షల మంది  నిరుద్యోగులకు  పీఎం కౌశల్ పథకం కింద శిక్షణ ఇస్తారు. స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడానికి యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.   ఇక దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకువచ్చారు. విద్యుత్ రంగానికి 35 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.  5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కొవిడ్ సమయంలో నష్టపోయినఎంఎస్ఎంఈలకు రిఫండ్ పథకం అమలు చేస్తారు. అలాగే ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు ఉంటుందన్నారు.  గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. అలాగే  పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.   కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని  మరో ఏడాది పొడిగించారు.   వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించగా,  బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయించారు.  పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు,  గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు పీఎంఏవై కోసం రూ.79వేల కోట్లు కేటాయించారు. 

వేతన జీవులకు శుభవార్త

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు శుభవార్త చెప్పారు. ఆదాయ పన్ను పరిమితిని 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రస్తుతం 5లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆదాయపన్ను పరిమితిని పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. పరిమితిని పెంచడంపై వేతన జీవుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.  ఇక వయోవృద్ధుల పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితిని పెంచారు.ఇప్పుడు రూ.15లక్షలుగా ఉన్న పరిమితిని 30 లక్షలకు పెంచారు. ఇక మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు.

కర్నాటకకు వరాలు.. ఎన్నికల తాయిలమేనా?

నిర్మలమ్మ తన బడ్జెట్ లో కర్నాటక రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. ఆ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో సాగు రంగానికి ప్రత్యేకంగా 5300 కోట్లు కేటాయించారు. ఇక దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అలాగే 5జీ సేవల అభివృద్ధి కోసం ప్రత్యేక ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం కౌశల్ పథకం కింద నాలుగు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలో టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 50 టూరిస్టు స్పాట్ ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలాగే దేశీయ ఉత్పత్తుల విక్రయాల ప్రోత్సాహానికి దేశ వ్యాప్తంగా యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించారు. ఇక వయోవృద్ధుల పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితిని పెంచారు. ఇప్పుడు రూ.15లక్షలుగా ఉన్న పరిమితిని 30 లక్షలకు పెంచారు. ఇక మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు.

పీఎం ఆవాజ్ యోజనకు 79 వేల కోట్లు

నిర్మలమ్మ తన బడ్జెట్ లో గృహ కొనుగోలు దారులకు తీపి కబురు చెప్పారు. కొత్త ఇళ్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ఒకింత వెలుసుబాటు కలిగేలా పీఎం ఆవాజ్ యోజనకు ఈ బడ్జెట్ లో నిధులు పెంచారు. గత బడ్టెజ్ లో ఈ పథకానికి 48వేల కోట్ల రూపాయలకు కేటాయించగా ఈ సారి దానిని 66శాతం పెంచి 79 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గృహ కొనగోలు దారులకు ఇది కచ్చితంగా ఊరట కలిగిస్తుంది.  ఇక రైల్వేలకు కూడా భారీగానే కేటాయించారు. రైల్వేల కోసం ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ 2.04 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త రైల్వే జోన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే ఇన్ ఫ్రాస్టక్టర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక మూల ధనం కింద పది లక్షల కోట్లు కేటాయించారు. అలాగే ట్రైబల్ ఏరియాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఏకలవ్య పారఠాలల్లో ఉపాధ్యాయ నియామకాలను భారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే కారాగారాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. 

ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమం.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల

ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమ పనితీరుతో ప్రకాశవంతంగా నిలిచిందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కరోనా సమయంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసేందుకు ఉచిత ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించినట్లు వెల్లడించారు.డిజిటల్ సేవలను సాధారణ ప్రజల వరకు తీసుకెళ్లేందుకు కోవిన్, ఆధార్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దేశంలో తలసరి ఆదాయం రూ. 1.97 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. పరిపాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో  భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందన్నారు. 2022లో డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయన్నారు. టెక్నీలజీ ఆధారిత అభివృద్దితో ముందుకు సాగేందుకు   దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  దేశంలోని మహిళలకు శక్తివంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ వృద్ధి రేటు 7 శాతంగా ఉండనున్నట్లు తాము అంచనా వేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈల వృద్ధికి రుణాలు అందించటంతో పాటు, స్కిల్ డెవలప్ మెంట్, డిజిటల్ సేవలను చేరువ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్లో లడఖ్, కశ్మీర్, ఉత్తర భారతంపై దృష్టి సారించినట్లు చెప్పారు.   వ్యవసాయ స్టార్టప్స్ కోసం నిధి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రైతుల సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తామన్నారు. ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ పథకాన్ని తీసురుకురానున్నట్లు వెల్లడించారు. దీని కోసం రూ.2000 కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు. చిరుధాన్యాలకు గ్లోబర్ హబ్ గా భారత్ నిలిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.

సుస్థిర పురోగతి దిశగా భారత్ అడుగులు.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు చేరుకున్నారు. మరి కొద్ది క్షణాల్లో   లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ఆరంభించారు. అంతకు ముందు  బడ్జెట్ కాపీలు లోక్ సభకు ప్రత్యేక వాహనంలో వచ్చాయి. కాగా తన ప్రసంగంలో వసుధైక కుటుంబం లక్ష్యంతో బడ్జెట్ రూపొందించిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పురోగమిస్తోందని అన్నారు. తొమ్మిదేళ్ల కిందట ఎక్కడో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.  యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు ఆశాదీపంగా తన బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా అభివృద్ధి మందగిస్తే.. భారత్ మాత్రం ప్రగతి బాటలో దూసుకు పోయిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.   కోవిడ్ సమయంలో పీఎం గరీబ్ కల్యాణ్  అన్న యోజన పథకం కింద 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అది కొనసాగుతుందన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశగా భారత్ సాగుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ కారణంగానే ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్ల రూపాయల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామనీ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 220 కోట్ల వ్యక్సిన్ లను అందించినట్లు చెప్పారు. అలాగే 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమాయోజన పథకాన్ని అందిస్తున్నామన్నారు.  వ్యవసాయం కోసం  డిజిటల్ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ ఫెసిలిటీలు, అగ్రికల్చర్ స్టార్ట్ అప్ లను చేయూత కోసం ప్రత్యేక నిథి ఏర్పాటు, అలాగూ రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు, పత్తి సాగు మెరుగుదల కోసం చర్యల, మార్కెటింగ్ ఫెసిలిటీతో పాటు చిరుధాన్యాల పంటలకు సహకారం అందిస్తామన్నారు. ఇందుకోసం శ్రీ అన్న పథకం కింద రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 

స్వతంత్ర భారత దేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరో తెలుసా?

మరి కొద్ద సేపటిలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఐదో సారి. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ఇలా వరుసగా ఐదు మార్లు వార్షిక పద్దును ప్రవేశపెట్టిన వారు నిర్మలకు ముందు ఐదుగురు మాత్రమే. అయితే అసలు స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి సారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరో తెలుసా? ఎప్పుడో తెలుసా? 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే సంవత్సరం నవంబర్ 26న పార్లమెంటులో దేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. దేశ తొలి విత్త మంత్రి ఆర్కే షణ్ముషం చెట్టి తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 

బడ్జెట్ కు వేళయ్యింది.. రాష్ట్రపతిని కలిసిన నిర్మలాసీతారామన్

బడ్జెట్ కు వేళయ్యింది. దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం భారత దేశం బడ్జెట్ వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనం గుప్పిట చిక్కి విలవిలలాడుతున్న తరుణంగా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఒకింత మెరుగ్గా ఉందన్న ఐఎమ్ఎఫ్ అంచనాల నేపథ్యంలో ప్రపంచం దృష్టి భారత్ వైపు మళ్లింది. ఈ సమయంలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్ది సేపటిలో పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆమె కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఆరోసారి. కాగా ఆనవాయితీ ప్రకారం ఆమె కొద్ది సేపటి కిందట రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కు ఆమోదం పొందారు. ఆ వెంటనే కేంద్ర కేబినెట్ తో భేటీ అయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ నిర్మలమ్మ పద్దును ఆమోదించింది. మరి కొద్ది సేపటిలో ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెడతారు.   ఇక, 2023-24 బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో నిర్మలా సీతారామన్  వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత ఆర్థికమంత్రుల జాబితాలో  ఆరో స్థానంలో నిలిచారు. గతంలో   మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, చిదంబరం, అరుణ్ జైట్లీలు వరుసగా ఐదు సార్లు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.