వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతోందా?

వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఓ విధంగా రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు.  అంతేకాదు.. ప్రభుత్వంలో కొలువు దీరిన సలహాదారుల రూపంలో అయితేనేమీ.. వివిధ కార్పొరేషన్ సంస్థల అధిపతులుగా నియమించడంలో అయితేనేమీ.. వివిధ నామినేటేడ్ పోస్ట్‌లు కట్టబెట్టడంలో అయితేనేమీ.. టీటీడీ చైర్మన్, ఈవో వంటి పదవుల విషయంలో అయితేనేమి, శాసన మండలి  చైర్మన్, ఈవో పదివిలో అయితేనేమి మొత్తం రెడ్డి సామాజిక వర్గం వారికే మనసా వాచా   జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. అయినా కూడా జగన్ సర్కార్ పట్ల రెడ్డి సమాజిక వర్గంలో  ఆసంతృప్తి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో రెడ్డి సమాజికవర్గంలో అసంతృప్తి గతంలో ఎన్నడూ లేదని ఆ సమాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఇదే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు ..  కాసు బ్రహ్మానందరెడ్డి,  చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి , వైఎస్ రాజశేఖరరెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రెడ్లదే రాజ్యమని.. అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో.. ఆ తర్వాత వచ్చి కె రోశయ్య ప్రభుత్వంలోనే కాదు.. ఆ గద్దెనెక్కిన కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని.. దీంతో రెడ్లకు దక్కాల్సిన ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదని చెబుతున్నారు. ఇక   జగన్.. ముఖ్యమంత్రి అయితే.. తమకు పూర్వ వైభవం వస్తోందని.. తమ సామాజిక వర్గానికి  జగన్   ఓ ఆశాకిరణమని ఆ సామాజిక వర్గం వారు భావించారు. వైఎస్ ప్రభుత్వంలో దక్కిన మర్యాద, ప్రాధాన్యత మళ్లీ దక్కుతోందని  ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా  వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరినా.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కు అత్యంత గౌరవప్రదమైన స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత జగన్ పాదయాత్ర లో రోడ్లు మీదకు వచ్చి మరీ తమ శక్తి కొలది ఖర్చు చేసి.. తమ విలువైన సమయాన్ని సైతం పక్కన పెట్టి.. మరీ జగన్ గద్దెనెక్కేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.  దీంతో 2019 ఎన్నికల్లో  జగన్ పార్టీ గెలుపు..  నల్లేరు మీద నడకే అయిందని..ఈ నేపథ్యంలో తమకు గౌరవం, విలువ దక్కుతోందని సదరు సామాజికవర్గం భావించింది కానీ,  జగన్ హయాంలో కనీస గౌరవం కూడా  దక్కడం లేదని సదరు   సామాజిక వర్గం వాపోతోంది.    ఈ నేపథ్యంలో  రెడ్డి సామాజిక వర్గం చూపు తెలుగుదేశం వైపు మళ్లిందని అంటున్నారు. అందుకు ఉదాహరణ.. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి.. అలాగే ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  ఉమ్మడి కడప జిల్లా నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి,వరదరాజులు రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్యామిలీ, బైరెడ్డి ప్యామిలీలు  తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల నాటికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో రెడ్లు... పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులివే!

ఎన్నికల సంవత్సరం పైగా తెలంగాణలో అధికారంపై బీజేపీకన్నేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు బడ్జెట్ లో పెద్ద పీట వేస్తారని అంతా భావించారు. తెలంగాణ ప్రజలూ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కేంద్రంతో పెరిగిన దూరం నేపథ్యంలో బడ్జెట్ కు ముందు తెలంగాణ సర్కార్ పెద్దగా డిమాండ్లేవీ పెట్టలేదు. ఒక విధంగా బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులూ లేకుంటే బాగుంటుంది అన్నట్లుగా తెలంగాణ సర్కార్ వ్యవహరించింది. బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత లేకపోతే.. తన విమర్శలకు మరింత పదును పెట్టి ఎన్నికలలో లబ్ధి పొదాలన్న వ్యూహంతో  బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించింది. అందుకే గత బడ్జెట్ కు ముందు తెలంగాణకు కావాల్సినవి ఇవీ అంటూ లేఖాస్త్రాలను సంధించేది. రైల్వే ప్రాజెక్టులపై గొంతెత్తేది. కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ చేసేది. అయితే ఈ సారి మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. సరే బీఆర్ఎస్ సర్కార్ అడక్కపోయినా..రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ అర్రులు సాచుతున్న సమయంలో ప్రజల మెప్పు పొందడానికి తెలంగాణకే కేటాయింపులలో సింహభాగందక్కుతుందని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం ఎన్నికలు ఎన్నికలే.. బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులే రెంటికీ సంబంధం లేదన్న తీరుగానే వ్యవహరించింది. ఈ సారి బడ్జెట్ లో కూడా తెలంగాణకు దక్కాల్సిన కేటాయింపులు దక్కలేదు. ఏదో ఊరడింపు అన్నట్లుగా నిధులు విదిలించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ఆఫ్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.374.35 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.300కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 

నిర్మలమ్మ బడ్జెట్ 2023-24 .. కొంచం తీపి.. కొంచెం చేదు

నిర్మలా సీతారామన్ బుధవారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ తీపి చేదుల మిశ్రమంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఆర్థిక నిపుణులు మాత్రం బడ్జెట్ కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మతన బడ్జెట్ లో వేతన జీవులకు ఒకింత ఊరట కలిగించేలా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 7లక్షల రూపాయలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల పొదుపు పరిమితిని రూ.15లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచారు. ఆదాయం 7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధిస్తారు. అంటే 7లక్షల నుంచి 9 లక్షల వరకూ 5శాతం, ఆదాయం 30 లక్సలు దాటితే 30శాతం పన్ను విధిస్తారు. ఇక  ధూమ పాన ప్రియులకు నిర్మల షాక్ ఇచ్చారనే చెప్పాలి. పొగాకు ఉత్పత్తులపై భారీగా వడ్డించారు. దీంతో సిగరెట్ల ధరలు పెరుగుతాయి. ఒక బంగారం, వెండి లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో వీటి ధరలూ పెరుగుతాయి. అలాగే బ్రాండెడ్  దుస్తుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఇక టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాల ధరలు తగ్గుతాయి.     నిరుద్యోగులకు కూడా ఒకింత ఊరట కలిగించేందుకు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నిధులు కేటాయించారు. నాలుగు లక్షల మంది  నిరుద్యోగులకు  పీఎం కౌశల్ పథకం కింద శిక్షణ ఇస్తారు. స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడానికి యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.   ఇక దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకువచ్చారు. విద్యుత్ రంగానికి 35 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.  5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కొవిడ్ సమయంలో నష్టపోయినఎంఎస్ఎంఈలకు రిఫండ్ పథకం అమలు చేస్తారు. అలాగే ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు ఉంటుందన్నారు.  గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. అలాగే  పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.   కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని  మరో ఏడాది పొడిగించారు.   వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించగా,  బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయించారు.  పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు,  గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు పీఎంఏవై కోసం రూ.79వేల కోట్లు కేటాయించారు. 

వేతన జీవులకు శుభవార్త

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు శుభవార్త చెప్పారు. ఆదాయ పన్ను పరిమితిని 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రస్తుతం 5లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆదాయపన్ను పరిమితిని పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. పరిమితిని పెంచడంపై వేతన జీవుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.  ఇక వయోవృద్ధుల పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితిని పెంచారు.ఇప్పుడు రూ.15లక్షలుగా ఉన్న పరిమితిని 30 లక్షలకు పెంచారు. ఇక మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు.

కర్నాటకకు వరాలు.. ఎన్నికల తాయిలమేనా?

నిర్మలమ్మ తన బడ్జెట్ లో కర్నాటక రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. ఆ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో సాగు రంగానికి ప్రత్యేకంగా 5300 కోట్లు కేటాయించారు. ఇక దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అలాగే 5జీ సేవల అభివృద్ధి కోసం ప్రత్యేక ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం కౌశల్ పథకం కింద నాలుగు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలో టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 50 టూరిస్టు స్పాట్ ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలాగే దేశీయ ఉత్పత్తుల విక్రయాల ప్రోత్సాహానికి దేశ వ్యాప్తంగా యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించారు. ఇక వయోవృద్ధుల పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితిని పెంచారు. ఇప్పుడు రూ.15లక్షలుగా ఉన్న పరిమితిని 30 లక్షలకు పెంచారు. ఇక మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు.

పీఎం ఆవాజ్ యోజనకు 79 వేల కోట్లు

నిర్మలమ్మ తన బడ్జెట్ లో గృహ కొనుగోలు దారులకు తీపి కబురు చెప్పారు. కొత్త ఇళ్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ఒకింత వెలుసుబాటు కలిగేలా పీఎం ఆవాజ్ యోజనకు ఈ బడ్జెట్ లో నిధులు పెంచారు. గత బడ్టెజ్ లో ఈ పథకానికి 48వేల కోట్ల రూపాయలకు కేటాయించగా ఈ సారి దానిని 66శాతం పెంచి 79 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గృహ కొనగోలు దారులకు ఇది కచ్చితంగా ఊరట కలిగిస్తుంది.  ఇక రైల్వేలకు కూడా భారీగానే కేటాయించారు. రైల్వేల కోసం ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ 2.04 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త రైల్వే జోన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే ఇన్ ఫ్రాస్టక్టర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక మూల ధనం కింద పది లక్షల కోట్లు కేటాయించారు. అలాగే ట్రైబల్ ఏరియాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఏకలవ్య పారఠాలల్లో ఉపాధ్యాయ నియామకాలను భారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే కారాగారాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. 

ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమం.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల

ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమ పనితీరుతో ప్రకాశవంతంగా నిలిచిందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కరోనా సమయంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసేందుకు ఉచిత ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించినట్లు వెల్లడించారు.డిజిటల్ సేవలను సాధారణ ప్రజల వరకు తీసుకెళ్లేందుకు కోవిన్, ఆధార్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దేశంలో తలసరి ఆదాయం రూ. 1.97 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. పరిపాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో  భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందన్నారు. 2022లో డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయన్నారు. టెక్నీలజీ ఆధారిత అభివృద్దితో ముందుకు సాగేందుకు   దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  దేశంలోని మహిళలకు శక్తివంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ వృద్ధి రేటు 7 శాతంగా ఉండనున్నట్లు తాము అంచనా వేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈల వృద్ధికి రుణాలు అందించటంతో పాటు, స్కిల్ డెవలప్ మెంట్, డిజిటల్ సేవలను చేరువ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్లో లడఖ్, కశ్మీర్, ఉత్తర భారతంపై దృష్టి సారించినట్లు చెప్పారు.   వ్యవసాయ స్టార్టప్స్ కోసం నిధి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రైతుల సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తామన్నారు. ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ పథకాన్ని తీసురుకురానున్నట్లు వెల్లడించారు. దీని కోసం రూ.2000 కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు. చిరుధాన్యాలకు గ్లోబర్ హబ్ గా భారత్ నిలిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.

సుస్థిర పురోగతి దిశగా భారత్ అడుగులు.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు చేరుకున్నారు. మరి కొద్ది క్షణాల్లో   లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ఆరంభించారు. అంతకు ముందు  బడ్జెట్ కాపీలు లోక్ సభకు ప్రత్యేక వాహనంలో వచ్చాయి. కాగా తన ప్రసంగంలో వసుధైక కుటుంబం లక్ష్యంతో బడ్జెట్ రూపొందించిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పురోగమిస్తోందని అన్నారు. తొమ్మిదేళ్ల కిందట ఎక్కడో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.  యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు ఆశాదీపంగా తన బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా అభివృద్ధి మందగిస్తే.. భారత్ మాత్రం ప్రగతి బాటలో దూసుకు పోయిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.   కోవిడ్ సమయంలో పీఎం గరీబ్ కల్యాణ్  అన్న యోజన పథకం కింద 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అది కొనసాగుతుందన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశగా భారత్ సాగుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ కారణంగానే ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్ల రూపాయల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామనీ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 220 కోట్ల వ్యక్సిన్ లను అందించినట్లు చెప్పారు. అలాగే 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమాయోజన పథకాన్ని అందిస్తున్నామన్నారు.  వ్యవసాయం కోసం  డిజిటల్ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ ఫెసిలిటీలు, అగ్రికల్చర్ స్టార్ట్ అప్ లను చేయూత కోసం ప్రత్యేక నిథి ఏర్పాటు, అలాగూ రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు, పత్తి సాగు మెరుగుదల కోసం చర్యల, మార్కెటింగ్ ఫెసిలిటీతో పాటు చిరుధాన్యాల పంటలకు సహకారం అందిస్తామన్నారు. ఇందుకోసం శ్రీ అన్న పథకం కింద రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 

స్వతంత్ర భారత దేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరో తెలుసా?

మరి కొద్ద సేపటిలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఐదో సారి. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ఇలా వరుసగా ఐదు మార్లు వార్షిక పద్దును ప్రవేశపెట్టిన వారు నిర్మలకు ముందు ఐదుగురు మాత్రమే. అయితే అసలు స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి సారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరో తెలుసా? ఎప్పుడో తెలుసా? 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే సంవత్సరం నవంబర్ 26న పార్లమెంటులో దేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. దేశ తొలి విత్త మంత్రి ఆర్కే షణ్ముషం చెట్టి తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 

బడ్జెట్ కు వేళయ్యింది.. రాష్ట్రపతిని కలిసిన నిర్మలాసీతారామన్

బడ్జెట్ కు వేళయ్యింది. దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం భారత దేశం బడ్జెట్ వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనం గుప్పిట చిక్కి విలవిలలాడుతున్న తరుణంగా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఒకింత మెరుగ్గా ఉందన్న ఐఎమ్ఎఫ్ అంచనాల నేపథ్యంలో ప్రపంచం దృష్టి భారత్ వైపు మళ్లింది. ఈ సమయంలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్ది సేపటిలో పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆమె కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఆరోసారి. కాగా ఆనవాయితీ ప్రకారం ఆమె కొద్ది సేపటి కిందట రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కు ఆమోదం పొందారు. ఆ వెంటనే కేంద్ర కేబినెట్ తో భేటీ అయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ నిర్మలమ్మ పద్దును ఆమోదించింది. మరి కొద్ది సేపటిలో ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెడతారు.   ఇక, 2023-24 బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో నిర్మలా సీతారామన్  వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత ఆర్థికమంత్రుల జాబితాలో  ఆరో స్థానంలో నిలిచారు. గతంలో   మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, చిదంబరం, అరుణ్ జైట్లీలు వరుసగా ఐదు సార్లు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవీ.. మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది!

యూనియన్ బడ్జెట్ అనగానే దేశంలో మధ్యతరగతి ఆశల పల్లకిలో ఊరేగడం మొదలెట్టేస్తోంది. ఇది ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే అదే మధ్య తరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంపన్నులకు సానుకూలంగా.. మధ్య తరగతిని దిగువ మధ్య తరగతిని ఊసూరుమనిపించే  విధంగా బడ్జెట్ రూపకల్పన అన్నది పరిపాటిగా మారిపోయింది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తున్నదన్న అంచనాల మధ్య పార్లమెంటులో బుధవారం (ఫిబ్రవరి1) విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై దేశ ప్రజలే కాదు.. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా, ఆశగా చూస్తున్నాయి.   మరి నిర్మలా సీతారామన్ ఆ అంచనాలను అందుకుంటారా? మధ్యతరగతి మందహాసం చేసేలా, సామాన్యుల ఆశలను నెరవేర్చేలా నిర్మలమ్మ బడ్జెట్ ఉంటుందా? పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవి? వీటన్నిటినీ సమాధానం మరి కొద్ద గంటల్లో లభిస్తుంది. వితంతమంతి నిర్మలా సీతారామన్... ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యి బడ్జెట్‌కి ఆమోదం పొందుతారు. ఆ తరువాత   నిర్మలా సీతారామన్  పార్లమెంట్‌కి చేరుకుంటారు. వెంటనే కేంద్ర కేబినెట్ మంత్రులతో సమావేశం అవుతారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం.. బడ్జెట్‌ని ఆమోదిస్తుంది. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తారు. బడ్జెట్ బ్రీఫ్‌తో  లోక్‌సభలోకి వెళ్తారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఇది పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సభ గురువారానికి (ఫిబ్రవరి 2)వాయిదా పడుతుంది. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ మొదలవుతుంది. ఆర్థిక సర్వేని బట్టీ ఈసారి బడ్జె్ట్‌పై   భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటం  ఈసారి బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరగడానికి ఒక కారణం.  ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం బడ్జెట్ పైనా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  ఏది ఏమైనా మధ్యతరగతి ఆశల పల్లకీలో ఊరేగుతోంది. ఆర్థిక వేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురుచూపులకూ మరి కొద్ద గంటలలో తెరపడే అవకాశం ఉంది. అయినా ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో  2023-24 ఆర్థిక సంవత్సరంలో   స్థూల దేశీయోత్పత్తి 6 నుంచి 6.8 శాతం మధ్యలో ఉండొచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జీడీపీ మెరుగ్గా ఉంది.   కొనుగోలు శక్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. ద్రవ్య వినిమయంలో ఐదో స్థానంలో ఉంది.  జీడీపీ 6 నుంచి 6.8శాతం మధ్య పరిమితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే ఆర్థిక, రాజకీయ పరిణామాలు దీనిని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.  కరోనా మహమ్మారి నుంచి భారత్ కోలుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా పూర్వపు స్థితికి చేరుకుంది.   అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి మారకం విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.   ప్రభుత్వం తీసుకొచ్చిన  అత్యవసర రుణ హామీ పథకం సత్ఫలితాలు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలు వేగంగా కోలుకున్నాయి. ఫలితంగా 2022 జనవరి నుంచి నవంబరు మధ్య కాలంలో రుణాల వృద్ధి 30.5శాతానికి చేరుకుంది.  వాహనాల అమ్మకాల్లో జపాన్, జర్మనీ దేశాలను వెనక్కి నెట్టి భారత్ 3వ స్థానానికి చేరుకుంది. జీడీపీలో 7.1శాతం వాటా వాహన రంగానిదే. 

హడలెత్తిస్తున్న ఐటీ సోదాలు

నిజానికి ఒక తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా  సోదాలు ఆగడం లేదు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో మరో మారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం(జనవరి 31) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని వసుధా ఫార్మాలో ప్రారంభమైన సోదాలు ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటాయో అనే భయం అందరినీ  కలవరపాటుకు గురు చేస్తోంది.  ఇదలా  ఉంటే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.అలాగే రాజ్ పుష్ప, వెరిటిక్స్, ముప్పా, లైఫ్ స్టైల్ సంస్థల్లో ఇలా మొత్తం 51 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఇళ్లు ఏకంగా 10 ఎకరాల్లో ఉంది. వెంకట్రామిరెడ్డి, ఆయన సోదరుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ఇల్లు అత్యంత అధునాతన సౌకర్యాలతో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు పలు డాక్యుమెంట్లను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే వెంకట్రామిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన సంస్థల ట్యాక్స్ చెల్లింపుల వివరాలు, బ్లాక్ మనీపై ఆరా తీస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలా ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీలు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  జరిగాయి. ఇక తాజాగా మరోసారి ఏపీ, తెలంగాణలో సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్ సంస్థ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సహా 51 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.  కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండగా ఐటీ అధికారులు తరచూ రైడ్స్ జరగడం ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ పెడుతున్నాయి.

ఆప్ కు ఆమె గుడ్ బై

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవికీ  రాజీనామా చేశారు. ఇదేమీ అనూహ్య పరిణామం కాదు. ఎప్పుడైతే  ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపారో అప్పుడే ఇందిరా శోభన్  ,అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి, కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఇందిరా శోభన్.. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపై  వ్యవహరించిన తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ 2021లో రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్‌-టీపీలో చేరారు. అయితే  షర్మిల అహంకార ధోరణికి విసుగు చెంది  కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్‌-టీపీకి కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీలో చేరారు. కేజ్రివాల్ ఆమెను తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ గా నియమిచారు. ఇప్పుడు తాజాగా ఆప్ కు గుడ్ బై చెప్పారు.  ఆమె తన రాజీనామా లేఖను అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ దోస్తీని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇందిరా శోభన్  ప్రధానంగా తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. రాష్ట విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథిగా, కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినేతికి వ్యతిరేకంగా గళ మెత్తారు. పోరాటం చేశారు. ఆ పోరాటం కొనసాగింపుగానే  ఆమె ఆప్  లో చేరారు. అయితే  కేజ్రివాల్  కేసేఆర్ తో చేతులు కలపడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.  సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తో కలిసి నడవాలని నిర్ణయించడంతో ఆప్  సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లైందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్తాపానికి గురైనట్టు ఇందిరా శోభన్ వెల్లడించారు. ఖమ్మం సభకు వచ్చినప్పుడే కేజ్రీవాల్ ముందు తన సందేహాన్ని ఉంచానని ఆమె చెప్పారు. ఇవాళ పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ బాయ్ కాట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. అంబేద్కర్ ఫోటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న కేసీఆర్ తో కలిసి ఈ దేశ ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారని కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. అదలా ఉంచి, అరవింద్ కేజ్రివాల్ విషయానికి వస్తే  ఆయనకు  ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సామాజిక కార్యకర్త అన్నా జహారే సారథ్యంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేజ్రివాల్  ఆ తర్వాత, హజారే అభీష్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. నిజానికి  కేజ్రివాల్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని అన్నా హజారే చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్  స్కాం  వెలుగు చూసిన నేపధ్యంలో, కేజ్రివాల్ కు రాసిన లేఖలో కూడా అన్నా హజారే గతాన్ని గుర్తు చేశారు.. మీరు  'స్వరాజ్' మకుటంతో రాసిన పుస్తకంలో   ఎన్నో ఆదర్శవంతమైన విషయాలు రాశారు.. అప్పుడు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కానీ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయ్యాక ఆదర్శ సిద్ధాంతాన్ని మరిచిపోయినట్లున్నారు  అని హజారే ఆలేఖలో పేర్కొన్నారు. అంతే కాదు, 2012లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో తన సహచరుడిగా ఉన్న కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. "ఇతర పార్టీల మార్గాన్ని అనుసరించడం" ప్రారంభించిందని విమర్శించారు. మద్యం, సిగరెట్ల విక్రయాలపై కేజ్రీవాల్‌కు గతంలో ఉన్న వైఖరిని హజారే గుర్తు చేశారు. కేజ్రీవాల్ మాటలకు, ఆయన చర్యలకు తేడా ఉందని హజారే ఆరోపించారు.   కేజ్రీవాల్ తాను బోధించినవన్నీ మరచిపోయారని, ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని, దీని ద్వారా మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని ప్రోత్సహిస్తోందని హజారే ఆరోపించారు. మద్యం అమ్మకాలను అరికట్టడంలో లేదా పరిమితం చేయడంలో విజయం సాధించిన మహారాష్ట్రలోని పలు గ్రామాలను ఆయన ఎత్తి చూపారు. దేశ రాజధానిలో కూడా కేజ్రీవాల్ ఇదే విధానాన్ని అమలు చేస్తారని తాను ఊహించానని, అయితే అది జరగలేదన్నారు.  ఇటువంటి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ మీరు అలా చేయలేదు. డబ్బుకు అధికారం, అధికారం డబ్బుకు డబ్బు అనే ఈ విష చక్రంలో ప్రజలు తరచుగా చిక్కుకుంటారు' అని హజారే వ్యాఖ్యానించారు. ఇప్పడు అవే ఆరోపణలు ఇందిరా శోభన్ చేశారు.

కోడి కత్తి కేసులో జగన్ హాజరు కావాల్సిందే.. ఎన్ఐఏ కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (జనవరి 31)  జరిగింది.  విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేత జగన్ పై కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.  దీంతో ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు చేస్తోంది.  2019 ఆగస్టు 13న ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.  కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 15న ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు మంగళవారం (జనవరి 31) ఆదేశించింది.   మరోవైపు వ్యక్తిగత కారణాలతో  ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను కూడా హాజరు పరచాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో 3వ సాక్షిగా ఉన్న జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గత విచారణలో కూడా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు   ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదని  ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.   బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది. అనంతరం కేసు విచారణను జనవరి 31కు వాయిదా వేసింది. ఇప్పుడు వచ్చే నెల 15న జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందిగా  ఆదేశిస్తూ విచారణను అప్పటికి వాయిదా వేసింది. 

కేసీఆర్ భంగపాటు పర్యవశానమేమిటంటే..?

గవర్నర్‌ వ ర్సెస్‌ గవర్నమెంట్‌ అంశంలో కోర్టుకు వెళ్లి  భంగపడి కేసీఆర్ సాధించినదేమిటన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. బడ్జెట్‌ను ఆమోదించాలంటూ తెలంగాణ సర్కారు పంపిన లేఖపై.. గవర్నర్‌ తమిళసై ఎంతకూ స్పందించకపోవడాన్ని  కేసీఆర్‌ సర్కారు  సవాల్ గా తీసుకుంది.  రాజ్‌భవన్‌ నుంచి స్పందన లేకపోవడం అవమానంగా భావించింది.  బడ్జెట్‌ ఆమోదించకపోతే రాగల సమస్యలను దృష్టి ఉంచుకుని  గవర్నర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. ప్రతిష్టకు పోయి ముందు వెనుకలు ఆలోచించకుండా దూకుడు ప్రదర్శించింది. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన కేసీఆర్‌..  తన వైఖరికి భిన్నంగా   చివరి వరకూ పోరాడకుండా  మధ్యలోనే అస్త్ర సన్యాసం చేశారు. ఇది ప్రజలలో బీఆర్ఎస్ పరువునే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరువునూ మసకబార్చింది. గవర్నర్ విషయంలో కేసీఆర్ దుందుడు వైఖరి అంతిమంగా గవర్నర్ ను విజేతగా నిలిపింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేసిన ధీరురాలిగా ప్రజలలో ఆమె ఇమేజ్ పెంచింది.  ఇంత వరకూ కనీ వినీ ఎరుగని విధంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గవర్నర్ వ్యవస్థ కారణంగా ఇబ్బందులు పడుతున్న బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలూ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేసీఆర్ ఈ పోరాటంలో విజయం సాధిస్తే తామూ అదే బాట పట్టాలని భావించారు. కేసీఆర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఫలితం ఏలా వచ్చినా కేసీఆర్ చివరి వరకూ నిలబడతారని కూడా ఆశించారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా మధ్యలోనే అస్త్రసన్యాసం చేసి పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.  అక్కడితో అయిపోలేదు.. ఈ కేసు విషయంలో రాజ్ భవన్ అన్ని విధాలుగా పై చేయి సాధించింది. ఇప్పట్లో గవర్నర్ వ్యవస్థపై ఎవరూ కూడా ధిక్కార ధోరణి ప్రదర్శించాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం కల్పించింది. ప్రభుత్వంలో ఉన్న వారు గవర్నర్‌ను విమర్శిస్తున్నారంటూ, గవర్నర్‌ తరఫు న్యాయవాది కోర్టు కు చెప్పారు. దీంతో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది   ఇకపై గవర్నర్‌ను విమర్శించవద్దని ప్రభుత్వానికి చెబుతానంటూ  సమాధానం ఇచ్చారు. అంటే గవర్నర్ తో న్యాయపోరాటానికి సిద్ధమైన కేసీఆర్ ఎంతగా డిఫెన్స్ లో పడిపోయారో అర్ధమౌతుంది.  గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలను నేను కూడా ఖండిస్తా. అలాంటి మాటలు సరికాదు. ఆమె ఒక మహిళ అని ఆమెను విమర్శించేవారు గుర్తించాలి. మహిళను గౌరవించాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా’నని.. దవే వినయపూర్వకంగా హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో గవర్నర్ పైనా, గవర్నర్ వ్యవస్థపైనా ఇంత కాలం బీఆర్ఎస్ చేస్తూ వచ్చిన విమర్శలన్నిటికీ కేసీఆర్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసినట్లే అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించగా, గవర్నర్‌ తన రాజ్యాంగపరమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ న్యాయవాది చెప్పారు. అంతే విచారణను కోర్టు ముగించింది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత సాధించిందేమైనా ఉందంటే.. అది తన అశక్తతను చాటుకోవడం మాత్రమే. వ్యూహ రహితంగా అహంకారంతో  వ్యవహరిస్తే తలదించుకోకతప్పదని చాటడమే.   గవర్నర్ తో న్యాయపోరాటానికి సిద్ధమైన కేసీఆర్ ఆ విషయంలో  న్యాయపరమైన అధ్యయనం లేకుండా వ్యవహరించి తన ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టనూ కూడా మసకబార్చుకున్నారు.   గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోకుండా.. న్యాయ పోరాటం కొనసాగించి ఉంటే, కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు  బావిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతున్న నేతగా కేసీఆర్,  గవర్నర్‌ చర్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్నికొనసాగించి ఉంటే..  ఆయనకు దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల మద్దతు పెరిగి ఉండేది.  జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు వచ్చి ఉండేది.  అయితే కేసీఆర్ పిటిషన్‌ ఉపసంహరణతో ఆ అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్నారన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తమౌతోంది. జాతీయ రాజకీయాలలో ఎదగాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు ఈ పరిణామం ఒక ఎదురు దెబ్బేనని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ కు మద్దతు విషయంలో పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని పరిశీలకులు సైతం అంటున్నారు. 

సివిల్ సర్వెంట్ల కేటాయింపు కేసు విచారణకు రాకపోవడంపై అనుమానాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్‌కి వెళ్లినా.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. తెలంగాణలోనే కొనసాగుతున్నారు.  డీవోపీటీ ఆదేశాలపై అప్పట్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ( క్యాట్‌)కి వెళ్లి స్టేతెచ్చుకొని తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.  సోమేశ్‌ కుమార్ విషయమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఆ అధికారుల పరిస్థితి ఏమిటన్న అంశంపై చర్చ మొదలైంది. తెలంగాణలో పని చేస్తున్న 12 మంది ఏపీ క్యాడర్ సివిల్ సర్వెంట్ల కేటాయింపుపై  ఈ నెల 27న హైకోర్టులో వాచారణకు రావాల్సి ఉండగా ఇంత వరకూ రాలేదు.   12 మంది బ్యూరోక్రాట్ ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్  విచారించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని   అభిప్రాయడింది. అన్ని పిటిషన్ లను  రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది. అయితే వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని  అధికారుల తరపు న్యాయవాదులు  కోర్టుకు  తెలుపగా తదుపరి విచారణను 27 కు వాయిదా వేసింది. అయినా ఆ కేసు విచారణకు రాలేదు. ఎందుకు రాలేదన్నదానిపై పలు అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.  ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్​ కూడా ఏపీ క్యాడరే. ఆయనతో పాటు ఐపీఎస్​లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్, ఏవీ రంగనాధ్ ఉన్నారు. ఐఏఎస్‌లలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీ ప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్​ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, కాటా ఆమ్రపాలి (ప్రస్తుతం సెంట్రల్ డిప్యూటేషన్) ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్​లో పనిచేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌‌కు వచ్చిన జడ్జిమెంట్ మాదిరే వీళ్లకూ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  అయితే ఈ కేసు విచారణకు బెంచ్ మీదకు రాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక సోమేష్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికే కోర్టు తీర్పు మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయారు. అక్కడ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వాస్తవానికి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉన్నా సోమేష్ కుమార్ ఆ పని చేయలేదు. అసలు కోర్టు తీర్పు రాగానే ఆఘమేఘాల మీద సోమేష్ కుమార్ ను రిలీవ్ చేయడానికి కారణం  గత కొంత కాలంగా సీఎస్ సోమేష్ కుమార్ తీరు పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉండటమే కారణమని అంటున్నారు.   న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశించినా సోమేష్ కుమార్ పట్టించుకోలేదని,  అలాగే ధరణి పోర్టల్ లో లోపాల సవరణ విషయంలో కూడా ఆయన స్పందన పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతారు. అన్నిటికీ మించి ఒక స్థలం విషయంలో మంత్రి కేటీఆర్, సోమేష్ కుమార్ మధ్య విభేదాలు కూడా సోమేష్ రిలీవ్ విషయంలో ముఖ్యమంత్రి వేగంగా నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు. అందుకే సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా సోమేష్  ఆ దిశగా ఆలోచన చేయలేదనీ, ఏపీకి వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ లో పని చేస్తున్న ఏపీ కేడర్‌కి చెందిన అధికారులకు కూడా సోమేష్ అంశాన్ని బూచిగా చూపి వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుంటే అదే జరుగుతుందన్న సందేశాన్ని కేసీఆర్ ఇచ్చినట్లైందని అంటున్నారు.

ఉచ్చు బిగుసుకుంటోందా?

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ ఆవినాష్ రెడ్డిని సీబీఐ అధికారుల విచారణ తరువాత  చోటు చేసుకొంటున్న పరిణామాల వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. సీబీఐ అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటల పాటు   అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ సందర్భంగా అవినాష్ రెడ్డి సీబీఐ ప్రశ్నలకు వా  సమాధానం చెప్పినా..  వివేకా దారుణ హత్య తరువాత  అవినాష్ రెడ్డి పోన్ నుంచి వెళ్లిన కాల్ డేటా మాత్రం..  ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిందని అంటున్నారు. ఆ క్రమంలో ఈ కాల్ డేటాపై సీబీఐ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన అవినాష్ రెడ్డి.. ఎవరెవరికి కాల్ చేసిందీ పూసగుచ్చినట్లు చెప్పేశారని వైసీపీలోని ఒక వర్గం అంటున్నది.  మరీ ముఖ్యంగా రెండు నెంబర్లకు అనినాష్ రెడ్డి ఫోన్‌ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. వాటిపై అవినాష్ రెడ్డిని గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. ఆ నెంబర్లు ఎవరివో  ఆయన సీబీఐ అధికారులకు వెల్లడించారని అంటున్నారు. ఆ రెండు నంబర్లలో ఒకటి తాడేపల్లి ప్యాలెస్ లో  అత్యంత కీలక వ్యక్తికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌దని..  ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతితో మాట్లాడాలంటే.. ముందుగా నవీన్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి చెప్పినట్లు  అధికార పార్టీలోని ఓ వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో దీంతో వివేకా హత్య జరిగిన రోజు.. ఆ తర్వాత   అవినాష్ రెడ్డి పలు మార్లు సీఎం సతీమణి భారతితో  మాట్లాడినట్లు సీబీఐ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారనీ...  అందుకే నవీన్ కు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. అంతే కాకుండా   నాటి విపక్ష నేత   జగన్‌తో మాట్లాడాలంటే..  మరో వ్యక్తికి ఫోన్ చేయాల్సి ఉంటుందని... అతడు ప్రస్తుతం ముఖ్యమంత్రి   జగన్ వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా సీబీఐ అధికారులకు కడప ఎంపీ   అవినాష్ వివరించినట్లు సదరు వర్గంలో చర్చ సాగుతోంది.     ఈ నేపథ్యంలోనూ నవీన్‌తోపాటు ఆ వ్యక్తికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారని.. అంటున్నారు. అయితే   ఏ రోజు.. ఏ సమయంలో   విచారణకు హాజరుకావాలి.. అనే అంశాలను మాత్రం సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొనలేదంటున్నారు. ఏది ఏమైనా నవీన్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తే..   వివేకా హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందనీ...  ఆ తర్వాత సీఎం సతీమణికి  భారతీకి సైతం నోటీసులు జారీ చేసే అవకాశం లేకపోలేదని వైసీపీలోని ఓ వర్గం భావిస్తోంది.   వివేకా హత్య జరిగిన రోజు.. సాక్ష్యాలు చేరిపేసేందుకు కడప ఎంపీ వైయస్ అవినాష్ ప్రయత్నించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.. అలాగే వివేకా హత్య కేసులో ప్రస్తుత సీఎం  జగన్ హస్తం ఉందంటూ ఇప్పటికే హు కిల్డ్ బాబాయి అంటూ ప్రతిపక్షాలు.. వివిధ సందర్భాల్లో... పలు వేదికలపై నుంచి బహిరంగంగానే  నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు స్కెచ్ చేసిన సూత్రధారుల పని పట్టేందుకు సీబీఐ అధికారులు లోతైన విచారణ జరపాలని నిర్ణయించారని.. ఆ క్రమంలో సీబీఐ అధికారుల విచారణకు వైసీపీలోని  కీలక వ్యక్తులు తెరపైకి రానున్నారనే ఓ చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

విశాఖే రాజధాని.. జగన్ ప్రకటన కోర్టు ధిక్కరణేనా?

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  మంగళవారం (జనవరి 31) విచారణకు రానుంది. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన ఏపీ రాజధాని విశాఖపట్నమే అంటూ చేసిన ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో మంగళవారం (జనవరి 30) జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు తేల్చి చెప్పింది.   దీనిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. అంటే ప్రస్తుతం రాజధాని అమరావతి. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు.  అయితే జగన్ తాను   విశాఖ వెళ్లబోతున్నానని.. అదే రాజధాని అని ప్రకటించారు. ఇది  కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యాయ నిపుణులు కూడా జగన్ వ్యాఖ్యలు కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అంటున్నారు. దీనిపై ప్రముఖ న్యాయవాది శ్రవణ్  ఇప్పటి వరకూ మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజల్ని మోసం చేసిన జగన్ ఇప్పుడు.  విశాఖ ఏకైక రాజధాని అని ప్రకటించడం ద్వారా ఇన్వెస్టర్ లను కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఏది ఏమైనా జగన్ ప్రకటన కచ్చితంగా సబ్ జ్యుడిస్ అవుతుందని, ఈ విషయాన్ని పిటిషనర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకుళ్లాలని ఆయన అన్నారు. రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో జగన్ ప్రకటన సంచలనంగా మారింది.  ఢిల్లీ సమావేశంలో జగన్ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలూ కల్పిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉందన్నారు. కానీ అవేవీ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. విశాఖపట్నమే రాజధాని అంటూ అయన చెప్పిన మాటలపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

అందరి చూపు నిర్మలమ్మ బడ్జెట్ వైపు

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము, పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగం  రాజ్యాంగ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని, ముఖ్యంగా మహిళకు ఏంతో గర్వ కారణంగా నిలిచి పోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు  మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన   మోడీ  ఈరోజు వెలువడిన ఐఎంఎఫ్ తాజా నివేదికను పరోక్షంగా ప్రస్తావిస్తూ  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందే విశ్వనీయ వర్గాల నుంచి  భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల సందేశాలు అందాయని సంతోషం వ్యక్తపరిచారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అందరూ మెచ్చే, అందరి ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని, సిటిజెన్ ఫస్ట్  విధానాన్ని ముందుకు తీసుకుపోతామని అన్నారు.   కాగా బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ,పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తోలి రోజు   మంగళవారం(జనవరి 31) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను బుధవారం (ఫిబ్రవరి 1) కి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ.  ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. కాగా, 2023-24 కేంద్ర బడ్జెట్‌ ను నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం  బుధవారం(జనవరి 31 ) 2023-24 వార్షిక బడ్జెట్‌  ప్రవేశపెట్టనున్న తరుణంలో  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)  భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. ఈ ఆర్థిక ఏడాది దేశ జీడీపీ (జీడీపీ) వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదవుతుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.1 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను ఐఎంఎఫ్‌  విడుదల చేసింది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఏడాది 3.4 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. వచ్చే సంవత్సరానికి అది 2.9 శాతానికి చేరుతుందని తెలిపింది.ఈ ఏడాది భారత వృద్ధి నెమ్మదించడానికి బాహ్య పరిణామాలే కారణమని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఆసియాలోని వర్ధమాన దేశాల వృద్ధిరేటు 5.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. చైనా ఆర్థిక వ్యవస్థలో కుదుపుల వల్ల 2022లో అది 4.3 శాతానికే పరిమితమైనట్లు గుర్తు చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాలదేనని వెల్లడించింది. అదే అమెరికా, యూరోప్  కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు 1.2 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది. అన్నిటికీ మించి  ఐఎంఎఫ్ తీపి  భారత్‌లో ద్రవ్యోల్బణం వచ్చే మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని తీపి కబురు చెప్పింది. వచ్చే ఏడాది అది మరింత తగ్గి 4 శాతంగా నమోదవుతుందని తెలిపింది. మరోవైపు ప్రపంచ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 6.6 శాతంగా, వచ్చే ఏడాది 4.3 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ఇప్పుడు   ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రవేశ పెట్టానున్న, 2023 – 2024 వార్షిక బడ్జెట్ వైపు అందరి చూపూ కేద్రీక్రుతమైంది. ప్రధాని మోడీ సంకేత మాత్రంగా చెప్పిన విధంగా, నిర్మలమ్మ అందరి అందరి ఆకాంక్షలను నెరవేరుస్తారా లేదా .. చూడవలసి వుంది.