కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి కారణమేంటి?

కేసీఆర్ రాష్ట్రం గురించి పట్టించుకోవడం మానేశారా? గవర్నర్ తో విభేదాల విషయంలో తగిలిన ఎదురు దెబ్బ కారణంగా ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బీజేపీపై విమర్శలు చేయవద్దని నిర్ణయించుకున్నారా? లేక కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కాపాడుకోవడం కోసం కేంద్రంపై, ప్రధానిపై విమర్శల వాడి వేడి తగ్గించేశారా? కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బుధవారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సారి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు దాదాపు శూన్యం. ఏదో ఒకటీ అరా కేటాయించినా.. అవన్నీ కేంద్ర సంస్థలకు సంబంధించి మాత్రమే. గత ఏడాది నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ ను చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఎలుగెత్తారు. అప్పుడు ఆయన ప్రసంగం అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. కేంద్రంపై పోరులో కేసీఆర్ చాంపియన్ అన్న భావన కలిగించింది. ఏడాది గిర్రున తిరిగింది. మళ్లీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ సారీ తెలంగాణకు రిక్తహస్తమే. అయినా కేసీఆర్ పన్నెత్తి మాట్లాడలేదు. కనీసం తెలంగాణకు కేంద్రం మళ్లీ అన్యాయం చేసింది అన్న మాటైనా ఆయన నోటి వెంట రాలేదు.

జాతీయ పార్టీ అధినేత అయినా, తెలంగాణకు ముఖ్యమంత్రే కదా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేటాయింపులు దక్కకపోవడంపై నోరెత్తకపోవడమేమిటని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి పలు  రకాల భాష్యాలు చెబుతున్నారు. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభం అవుతున్నాయి. ఆ రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. మొదట గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని భావించిన కేసీఆర్.. ఆ తరువాతి పరిణామాలతో వెనక్కు తగ్గారు. అంతే కాదు.. గవర్నర్ కు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా గవర్నర్ ప్రసంగ ప్రతులలో ఆమె చెప్పిన మార్పులకు కూడా ఓకే చేసేశారు. అంటే ప్రభుత్వం ఆమోదంతో రూపొందిన గవర్నర్ ప్రసంగంలో కూడా ఆమె చెప్పిన మార్పులు చేయడానికి కిమ్మనకుండా అంగీకరించేశారు. తమిళనాడు గవర్నర్ చేసిన విధంగా తమిళిసై కూడా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా అన్న భయం ఆయనలో కనిపిస్తోంది.

ఒక వైపు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తనతో జట్టుకట్టే పార్టీల గురించి అన్వేషణ సాగిస్తూనే.. మరో వైపు ఏ విధంగానైనా కేంద్రం మెప్పు పొందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే గవర్నర్ ఎపిసోడ్ తరువాత కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కేంద్రంపై విమర్శల దూకుడు కనిపించడం లేదు. మరో వైపు గవర్నర్ ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి పసన్న కుమార్ రెడ్డిని షటిల్ సర్వీసులా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య తిప్పుతున్నారు.   మొత్తానికి కేంద్రం విషయంలో కేసీఆర్ తీరు మారిందనడానికి బడ్జెట్ పై ఆయన నోరెత్తకపోవడాన్నే తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు. 

Advertising
Advertising