హైదరాబాద్ లో ట్రంప్ రోడ్డు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్ కు ముందు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంలోని రోడ్లకు గ్లోబల్ ఐకాన్ ల పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, ప్రతిభామంతుల  గౌరవార్థం రాష్ట్రంలోని పలు ప్రధాన రహదారులకు వారి పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే..  ఓ ఆసక్తికరమైన, పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చే సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కన ఉన్న హై ప్రొఫైల్ రహదారికి  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు మరియు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్రం ఇప్పటికే లేఖలు రాసింది.  అక్కడ నుంచి అనుమతి లభించి ఈ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం జరిగితే..  అమెరికా వెలుపల ఒక సిట్టింగ్ అధ్యక్షుడి పేరు మీద వెలిసిన తొలి రోడ్డు మార్గం ఇదే అవుతుంది.  ఇక పోతే.. రావిర్యాల ప్రాంతంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును రేడియల్ రింగ్ రోడ్డుతో  కలిపే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. దేశ పారిశ్రామిక రంగానికి, ప్రజాహితానికి రతన్ టాటా చేసిన  సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.   అలాగే.. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు గౌరవంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ రహదారికి గూగుల్ స్ట్రీట్ గా నామకరణం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి  గ్లోబల్ కనెక్టివిటీ, పెట్టుబడులకు ద్వారాలు తెరవడమే కాకుండా,  బ్రాండ్ తెలంగాణను అంతర్జాతీయ వేదికపై బలోపేతం చేయడానికి దోహదపడుతుందంటున్నారు. 

మంచు తెర మాటున లంబసింగి.. మన్యానికి పోటెత్తుతున్న పర్యాటకులు

శీతాకాలంలో మంచు తెరల మధ్య మన్యం అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా అల్లూరి జిల్లా చింతపల్లి, లంబసింగి వంటి ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు మంచు వానలా కురుస్తోంది. ఈ సందర్భంగా మన్యం అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అటువంటి అద్భుత అనుభవాన్ని పొందేందుకు పర్యాటకులు మారేడుమిల్లి, లంబసింగి ,తాజంగి డ్యాం, చెరువులు వ్యానo, వ్యూ పాయింట్, కొత్తపల్లి జలపాతం, వంజంగి వ్యూపాయింట్, అరకు చూడటానికి  పర్యాటకులు క్యూ కడుతున్నారు. లంబసింగిలో ఆదివారం 7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజులలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. చలిలో మన్యం అందాలను  ఆస్వాదించేందుకు ఓ వైపు పర్యాటకులు పోటెత్తుతుండగా, మరో వైపు  చలి, మంచు కారణంగా ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా   చిన్నపిల్లలు వృద్ధులు చలికి ఎక్స్ పోజ్ కాకుండా ఉండటం మేలని చెబుతున్నారు. 

మేడ్చల్ జిల్లాలో రియాల్టర్ హత్య

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని కాప్రా సాకేత్ కాలనీలో సోమవారం (డిసెంబర్ 8) ఉదయం వెంకటరత్నం అనే రియల్టర్ దారుణ హత్యకు గురయ్యారు.  తన ఇంటి నుంచి బైక్ పై బయలుదేరిన వెంకటరత్నంను   సాకేత్ కాలనీలోని ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్  వద్ద  గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. ముందుగా రివాల్వర్ తో కాల్పులు జరిపి, ఆ తరువాత విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత మార్చారు.  సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఘటనాస్థలంలోని బుల్లెట్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.  ఇలా ఉండగా హతుడు వెంకటరత్నంపై  గతంలో దౌలి పేట పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్ ఉందనీ, అలాగే ఓ జంట హత్యల కేసులో కూడా నిందితుడని తెలు స్తోంది.  కాగా ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వెంకట రత్నం హత్య కు సంబంధించి అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  

గ్లోబల్ సమ్మిట్ గెస్టులకు తెలంగాణ చిరుతిళ్లు

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిథులు, విశిష్ఠ  అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ కోసం ప్రత్యేక కిట్ ను రూపొందించింది.   ఉదయం నేపాల్‌, బ్యాంకాక్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల ఆదివారం (డిసెంబర్ 7) ఉదయమే వచ్చిన  ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి తోడ్కోని వెళ్లింది. అక్కడ నుంచి వారికి కేటాయించిన హోటల్స్ కు తరలించింది. అక్కడ వారికి ఈ ప్రత్యేక కిట్ ను అందజేసింది. ఈ కిట్ లో తెలంగాణ చిరుతిళ్లు సకినాలు, చెక్కగారెలు, నువ్వుల లడ్డూ, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు, బాదమ్‌కీ జాలి వంటివి ఉన్నాయి. ఇలా ఉండగా తెలంగాణ రైజిగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే వారిని ఆహ్వానించేందుకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చెందిన వంద మంది అధికారులతో ఒక బృందాన్ని నియమించింది.  ఇక  సమ్మిట్‌ జరిగే సమయంలో హైదరాబాద్‌ ధమ్‌ బిర్యానీ, పాయా, మటన్‌ కర్రీతో పాటు వెజ్‌, నాన్‌వెజ్‌కు సంబంధించిన పలు వంటలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాలకు చెందిన వంటలను కూడా సిద్ధం చేస్తోంది.  

అభినవ కృష్ణదేవరాయులు పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఉడుపిలో అభివన కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం చేశారు.  కర్ణాటకలోని ఉడుపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి  సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కల్యాణ్‌కు ప్రధానం చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ తాను ఈ కార్యక్రమానికి సత్యాన్వేషిగా వచ్చానని చెప్పారు.   పాలన, సేవ, బాధ్యతలే నిజమైన నాయకత్వానికి ప్రతీకలన్నారు.   వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరిం చారు.  జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, తీసుకునే ప్రతి నిర్ణయం, ఎదుర్కొని ప్రతి సంశయంలోనూ భగవద్గీత మనకు తోడ్పడుతుందన్న పవన్ కల్యాణ్,  నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, ఐడెంటిటీ క్రైసెస్, ఫెయిల్యూర్ ఫియర్ వంటి వాటితో యుద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధానికి ఏ మాత్రం తీసిపోదనీ, ఈ యుద్ధంలో గెలవడానికి అవసరమైన  మానసిక బలం, మనోస్థైర్యాన్ని అందించేది భగవద్గీత  మాత్ర మేనన్నారు.     మన భారతమాత ఎన్నో దండయాత్రలను ఎదుర్కొని, తట్టుకుని నిలబడిందంటే, అది ఆయుధాలతో కాదు, సంపదతో కాదు, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాల వల్లనేనన్నారు.  సనాతన ధర్మం మూఢనమ్మకం కాదనీ,  ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి గా పవన్ కల్యాణ్ అభివర్ణించారు.  

మూడు విమానాలకు బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైన వేళ.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదరింపు తీవ్ర కలకలం సృష్టించింది. విదేశాల నుంచి వస్తున్న మూడు విమానాలకు ఒకే రోజు ఒకే సారి బాంబు బెదరింపు ఈమెయిల్ రావడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కన్నూర, ఫ్రాంక్ పర్ట్, లండన్ ల నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ మూడు విమానాలకు సోమవారం (డిసెంబర్ 8) ఈ మెయిల్ ద్వారా బాంబు బెదరింపులు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తనిఖీలు చేపట్టారు.  విమా నాశ్రయ సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్మెంట్‌ అత్యవసర ప్రోటోకాల్‌ను అమల్లోకి తీసుకువచ్చాయి. మూడు విమానాలు ఎలాంటి ప్రమాదం లేకుండా శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌ అయ్యాయి. ల్యాండింగ్‌ అనంతరం ప్రయాణికులందరిని  విమానం నుంచి దింపి, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ జోన్‌లకు ఈ విమానాలను తరలించారు.   ఇదిలా ఉండగా, మూడు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.   విమానా శ్రయం పరిధిలో అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, మొత్తం ఏరియాను హై అలర్ట్‌లో ఉంచారు.ఈ ఘటనపై  వింగ్‌ ఇప్పటికే విచారణ చేపట్టింది, బెదిరింపు ఇమెయిల్‌ పంపిన వివరాలు తెలుసుకునే పని ప్రారంభించింది.  

అమెరికాలో లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను  అమెరికాలో పోలీసులు అడ్డుకున్నారు. డల్లాస్ లో ఎయిర్ పోర్టు నుంచి ఆయన బటయకువస్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల పాటు అమెరికాలో చదవి, రెండేళ్లు వాషింగ్టన్ డీసీ లో ప్రపంచ బ్యాంకులో కొలువు చేసిన లోకేష్ కు అప్పట్లో ఎప్పుడూ ఇటువంటి సంఘటన ఎదురు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన డల్లాస్ తెలుగు డయాస్సోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అమెరికాలోని  తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలే కాకుండా తెలుగువారు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విమానాశ్రయంలో లోకేష్ ను అడ్డుకున్నారు.  సాధారణంగా దేశాధినేతలు, ప్రపంచ కప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచి వచ్చే క్రీడాకారులకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అటువంటి సమయాలలో పోలీసులు ఆయా సెలబ్రిటీలను విమానాశ్రయం నుంచి వేరే మార్గం గుండా బయటకు తీసుకు వెడతారు. అశేష అభిమాన జనం రావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వారిని భద్రంగా పంపేందుకు ఇలా చేస్తారు. ఇప్పుడు లోకేష్ ను అమెరికాలో పోలీసులు అలాగే అడ్డుకుని ఆయన వేరే మార్గం గుండా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకు వెళ్లారు. ఇది అమెరికాలో కూడా లోకేష్ కు అభిమానులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో తెలియజేస్తున్నది. పోలీసులు తనను అడ్డుకుని వేరే మార్గం ద్వారా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువచ్చిన విషయాన్ని తెలుగు డయాస్పోర సమావేశంలో లోకేష్ స్వయంగా చెప్పారు.   డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ఈ కార్యక్రమం వరకు తనకు ఘన స్వాగతం పలికారని, ఈ అభిమానం అపూర్వమనీ, మరువలేననీ లోకేష్ అన్నారు. 

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన భాగ్యనగరం

  తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేటి మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ,  ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు.  మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు  సిద్దం చేశారు.  వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దంచేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ తో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.  సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.  ఇక అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్ లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు అందించనున్నారు.

జగన్‌పై ఎంపీ వేమిరెడ్డి ఫైర్

  అప్పన్న ఫ్యామిలీకి  సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై మాజీ సీఎం జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడారు. ‘‘వైఎస్ జగన్ నాపై అనవసర వ్యాఖ్యలు చేశారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవరి సూచనతో నేను సాయం చేశానో నాకు స్పష్టంగా తెలుసు. వైవీ సుబ్బారెడ్డి వద్ద పనిచేసిన అప్పన్నకు మానవతా దృక్పథంతో సాయం చేశాను. నేను చేసిన సహాయం నిజమా కాదా అనేది దేవుడే సాక్షి. సాయం కోసం ఎవరైనా వస్తే ఇప్పటికీ నాకు తోచినంతగా ఆదుకుంటున్నాను. ప్రతి నెలా నేను సహాయం చేసే వారి జాబితాలో చాలామంది ఉంటారు. ఈ విషయం ఆయనకూ తెలుసు. నేను సేవా భావంతోనే సాయం చేస్తుంటాను. అయితే సేవ చేసినా నిందలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనం చేసిన మంచిని, చేసిన సేవను దేవుడికే తెలుసు. జగన్ కామెంట్స్ తనను బాధించాయనే కారణంగా ఇప్పుడు ఈ విషయాలు వెల్లడిస్తున్నాను’’ అని వేమిరెడ్డి తెలిపారు.  

హిందూ మతంపై కుట్రలు : విజయసాయిరెడ్డి

  హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. డబ్బు ఆశ చూపించి మత మార్పిడులకు వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్ధాలుగా జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.  దేశం కోసం, ధర్మం కోసం హిందువులందరూ ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష..శ్రీరక్ష అని ఓ యాంకర్ మతమార్పిడులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. హిందూ ధర్మం కోసం అన్ని సామాజిక వర్గాలు ఒకటి అవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన బీజేపీకి చేరువయ్యేందుకు ఇలాంటి ట్వీట్ చేశారని కామెంట్స్ చేశారు.   

కుల్సుంపురా సీఐ సస్పెన్షన్ వేటు

  హైదరాబాద్‌ నగర పోలీస్‌ వ్యవస్థలో కలకలం రేపుతున్న ఘటనలో కుల్సుంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ సునీల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌  సస్పెండ్‌ చేశారు. ఒక కీలక కేసులో విచారణను ప్రభావితం చేస్తూ, నిందితుల పేర్లు ఉద్దేశపూర్వకంగా మార్చి మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు వెల్లువెత్తాయి.  ప్రత్యర్థి వర్గం నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. కేసును డిస్టార్ట్‌ చేసి, వాస్తవ నిందితులను రక్షించే ప్రయత్నం చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయానికి చేరడంతో వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా వచ్చిన నివేదికల్లో ఇన్స్పెక్టర్‌ చర్యలు డిపార్ట్‌మెంట్‌ నిబంధనలకు విరుద్ధమని ఉన్నాయని తేలడంతో సునీల్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు.  ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి శాఖా విచారణను కూడా ప్రారంభించినట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఈ సస్పెన్షన్‌తో కుల్సుంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. విధుల్లో అక్రమాలు, వర్గపోరు, అంతర్గత లావాదేవీలు బయటకు రావడంతో ఇతర అధికా రులు కూడా అప్రమత్త మయ్యారు.ఈ కేసు ఎటు తిరుగుతుందో, ఇన్స్పెక్టర్‌పై ఇంకా ఏ చర్యలు పడతాయో అన్న దానిపై పోలీస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

స్మృతి మంధాన పెళ్లి రద్దు...ఎందుకంటే?

  భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. తన వివాహం క్యాన్సిల్ అయిందని మంధాన ప్రకటించారు. గత కొన్ని వారాలుగా నా జీవితంలో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి రద్దు అయిందని క్లారటీ ఇస్తున్నా నేను ఈ మ్యాటర్‌ను ఇంతటితో వదిలేస్తున్నా మీరు నాలాగే చేయండి ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా నా ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.  నవంబర్ 23 మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి, ముచ్చల్ అనారోగ్యంతో ఆస్పుపత్రిలో చేరారు. ముచ్చల్ వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు స్క్రీన్ షాట్ వైరలయ్యాయి. ఆ తర్వాత వివాహం వాయిదా పడింది. తాజాగా రద్దు అయ్యింది.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

  విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఘటన తిరుపతి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరిచిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.  వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌కి ఫిర్యాదు చేసి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా బాధిత విద్యార్థినిని ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్లిపోయింది. ఈ పాడుపనికి పాల్పడిన లక్ష్మణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

గోవా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

  గోవా నైట్ క్లబ్‌‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ అగ్నిప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ఘటనల్లో కొందరు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని విచారం వ్యక్తం చేశారు.  గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని వివరించారు. అగ్నిప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు జరుపుతామని తెలిపారు. . . క్లబ్‌ను సీజ్‌ చేసి నిర్వాహకులను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లబ్‌లో భద్రతా చర్యలకు సంబంధించి దర్యాప్తు జరుపుతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు  

గోవాలో భారీ అగ్ని ప్రమాదం...25 మంది మృతి

  గోవా రాష్ట్రాన్ని మరోసారి విషాదం కమ్మేసింది. ఉత్తర గోవా ఆర్పోరాలోని రోమియో లేన్‌లో ఉన్న ప్రముఖ బిర్చ్ నైట్ క్లబ్‌లో అర్థరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 25 మంది ప్రాణాలను బలిగొంది. క్లబ్ కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలు క్షణాల్లోనే మొత్తం ప్రాంగణాన్నే చుట్టేసి నైట్ క్లబ్‌ను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులతో  సహా మొత్తం 23 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అందులో ముగ్గురు సజీవదహనం కాగా, మిగిలిన వారు తీవ్రమైన పొగలతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో క్లబ్‌లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నారని... ప్రాణ నష్టం పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.  అయితే అప్పటికే పలు ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల గుర్తింపు కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని అధికారులు ఆదేశించారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో నైట్ క్లబ్‌లు, పర్యాటక వేదికలపై కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఈ ఘటన జరగడంతో రోమియో లేన్ ప్రాంతం మొత్తం విషాద వాతావరణంలో మునిగి పోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను, పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క్లబ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమా? లేదా భద్రతా ప్రమాణాల లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గోవాలో జరిగిన ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

భారత్ ఫ్యూచర్ సిటీ..మారనున్న తెలంగాణ దశ

  భారత్ ఫ్యూచర్ సిటీ.. రాబోయే టెక్నాలజీకి, ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ సహకారాన్ని సూచించే ఓ మహానగరానికి ఇప్పుడిదో ఆనవాలు. ఇక్కడ జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల.. హైదరాబాద్ భవిష్యత్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం దశ కూడా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పుడు.. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్.. ఇండియాలో రీసౌండ్‌లో వినిపిస్తోంది.  దేశ, విదేశాల ఫోకస్ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ మీదే ఉంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలు తప్ప ఏమీలేని ప్రాంతం.. ఇప్పుడు ఈ ప్రపంచం నలుమూలల్లోని..ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులను పట్టుకొచ్చే కోటగా మారింది. అదే ప్రాంతం.. భవిష్యత్ తరాలకు భరోసాగా నిలవబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కారణంగా.. ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారాయ్.  ఈ సదస్సు జరిగిన తర్వాత.. తెలంగాణ కథే మారబోతోంది. ఎందుకంటే.. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ దశని మార్చే ఓ గ్లోబల్ రెవల్యూషన్‌గా కనిపిస్తోందిప్పుడు! అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రాబోయే అత్యాధునిక టెక్నాలజీ హబ్‌లతో.. ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ.. ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక విప్లవానికి కేంద్రం కాబోతోంది.  ఇక్కడ రేవంత్ సర్కార్ నిర్వహించబోతున్న ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ దిగ్గజాలు.. ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గ్లోబల్ సమ్మిట్‌తో.. తెలంగాణ ఊహించని స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందుకోబోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ ఆర్థిక సదస్సులో పాల్గొనే మల్టీ నేషనల్ కంపెనీలు.. తమ కార్యకలాపాలు విస్తరించడానికి, కొత్తగా స్థాపించడానికి వేల కోట్ల రూపాయలు.. పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.  ఈ ఇన్వెస్ట్‌మెంట్లే.. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి వెన్నుగా నిలుస్తాయ్. భారీ పెట్టుబడులతో.. రాబోయే కొన్నేళ్లలో.. వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఫైనాన్స్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు.. ప్యూచర్ సిటీలో గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ఈ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత.. దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు ఇక్కడ ఏర్పాటైతే.. ఐటీ, స్టార్టప్ రంగాల్లో.. భారత్‌లోని ఇతర మెట్రో నగరాలకు.. హైదరాబాద్ గట్టి పోటీనిస్తుంది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో టెక్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.  భారత్ ఫ్యూచర్ సిటీలో.. 5జీ, 6జీ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లాంటి సౌకర్యాలు రాబోతున్నాయ్. ఇక.. పూర్తిగా సోలార్ ఎనర్జీ సప్లై, వ్యర్థాల నిర్వహణకు అధునాతన పద్ధతులు, జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ లాంటివి.. హైలైట్‌గా నిలుస్తున్నాయ్. కొత్త స్టార్టప్‌లని ప్రోత్సహించేందుకు.. ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫీసులు కూడా వస్తాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో.. గ్లోబల్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్.. కేవలం ఐటీ సెక్టార్‌కే పరిమితం కాదు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీర్‌పేట, ముచ్చర్ల, శ్రీశైలం హైవే ప్రాంతాల్లో.. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టే విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయ్. విదేశీ ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో.. హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు.. ఈ రంగంలో కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయ్. ఈ ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా.. యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు.. కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు కూడా వస్తాయ్. ఇప్పటికే.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.  ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణని 2047 నాటికి.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో.. ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌కు తుదిమెరుగులు దిద్దుతోంది. మరోవైపు సదస్సులో పాల్గొనే వక్తలు, హాజరయ్యే ప్రతినిధుల లిస్ట్ కూడా రెడీ అయింది. తెలంగాణ సర్కార్ కమిట్‌మెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపు, పటిష్టమైన ప్రణాళికతో.. భారత్ ఫ్యూచర్ సిటీ.. తెలంగాణకు ఓ గేమ్ ఛేంజర్ కాబోతోంది. మీర్‌పేటలోని ఈ మారుమూల ప్రాంతం... ఇప్పుడు యావత్ భారతదేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి తెలంగాణ శక్తిని చాటిచెప్పే వేదికగా మారనుంది.