అన్నీ ఎదురుదెబ్బలే.. అయినా జగనన్న తీరు మారలే! 

మనం లోపలికి వెళ్లకముందే వాళ్లని లోపలికి పంపించాలి. జైలుకెళ్లడం అనేది రాజకీయ కుట్ర తప్పితే.. వేరే కాదని అలా నిరూపించాలి. ఇంత చేసి ప్రజల ముందు నేరస్తుడిలా నిలబడకూడదు. జైలుకెళితే సానుభూతి రావాలి తప్ప.. వ్యతిరేకత రాకూడదు. అందుకే ఎంత స్పీడుగా విచారణ చేసి.. ప్రత్యర్ధిని లోపల వేస్తే..అంత మంచిది. ఇది జగనన్న స్క్రిప్టు. కాని దేవుడు వేరేగా స్క్రిప్టు రాస్తున్నట్లున్నాడు. అందుకే ఏ పని కావటం లేదు. రోజురోజుకు ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. ఇంకెన్నాళ్లు నేనా ఆర్టిఫిషియల్ చిరునవ్వుతో ఫోజులివ్వాలి..హాయిగా నన్ను నవ్వుకోనివ్వరా అని జగన్ అధికారులపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.   అమరావతిని సెంటర్ పాయింట్ చేసుకుని తెలుగుదేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలని ప్లాన్ వేస్తే..అది ఎప్పటికప్పుడు ఎదురు కొడుతుంది. అప్పటికప్పుడు అంతా బాగానే ఉంది.. దెబ్బ పడిందన్నట్లు అనిపిస్తుంది.. మరికొన్ని రోజులకే రివర్స్ అవుతుంది. అందుకు అధికారుల తప్పులో.. సాంకేతిక వ్యవహారాలో కారణాలని భ్రమిస్తున్నారు. అంతేగాని అసలు సబ్జెక్టులోనే లోపం ఉందని అనుకోవడం లేదు.ముందు మూడు రాజధానులు ప్రకటించి..అమరావతిని జీరో చేసి.. ఆర్ధికంగా దెబ్బకొట్టామనుకున్నారు. అక్కడ భూములు కొన్న టీడీపీ నేతలంతా స్మాష్ అనుకున్నారు. కాని మొత్తం రైతులను దెబ్బ తీస్తున్నామనే సంగతి మర్చిపోయారు. ఆ రైతుల్లో అన్ని సామాజికవర్గాల వారున్నారని గాని..వారు తమకు ఓటేశారన్న సంగతి గాని పూర్తిగా వదిలేశారు. దీంతో నెగెటివ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో వచ్చి పడింది.  ఇక తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ అని మొదటి నుంచి చెబుతున్న ఆవు కథనే మళ్లీ బయటికి తీశారు. సీఐడీ విచారణ అన్నారు.. నోటీసులన్నారు. కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఒకరోజు సడెన్ గా రైజ్ చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు జడ్జినే వివాదంలోకి లాగారు. ఆయన ప్రమోషన్ కే అడ్డం పడదామనుకున్నారు. ఏదీ అవలేదు. పైగా ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ ఆ ఆరోపణల కేసులను కొట్టిపారేశాయి. ఇక ఈ విషయంలో చేయగలిగింది కూడా ఏమీ మిగల్లేదు.అసైన్డ్ ల్యాండ్స్ దళితుల నుంచి బలవంతంగా లాక్కున్నారని.. బినామీ పేర్లతో రాజధాని బెనిఫిట్ పొందారని ఇంకో ఆరోపణల పర్వం మొదలెట్టారు. దీని కోసం స్టింగ్ ఆఫరేషన్లు చేసి..సీఐడీ అధికారులను తిప్పి నానా హంగామా చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి వాయించేశారు. ఇంత చేసినా.. ఆ దళితులు మాత్రం అదంతా అబద్ధం అని చెప్పడంతో అంతా తుస్ మంది.  ఇక ఏపీ ఫైబర్ నెట్ లో టెండర్లలో అక్రమాలు అంటూ మరోటి మొదలెట్టారు. దీనిని అప్పటి ఐటీ మంత్రి లోకేష్ మెడకు చుట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆత్రంగా విచారణలకు ఆదేశాలిచ్చినా..ఆధారాలు లేక అవి చతికిలపడుతున్నాయి. ఇది కూడా అంతే. అప్పటి అధికారి అయితే నేరుగా సవాల్ చేశారు.. అక్రమం,అవినీతి అనేది ప్రూవ్ చేసి చూపించండి అంటూ గట్టిగానే ఛాలెంజ్ చేశాడు. ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ఆ కేసులో లేదు. చట్టాన్ని ప్రయోగించి ఎలా ఇరికించాలని చూస్తున్నారే తప్ప..తర్వాత కోర్టు చేతిలో మొట్టికాయలు తప్పవని ఇప్పటికే అనుభవం వచ్చినా తెలుసుకోలేకపోతున్నారు. మరి జగనన్న ఎప్పటికి సాటిస్ ఫై అవుతారో? ఈ కేసుల కథలు ఎప్పటికి ముగుస్తాయో? 

జల వివాదంలో కేసీఆర్ దూకుడు.. ఏపీ రియాక్షన్ ఏంటో? 

 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింద ముదిరేలా కనిపిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసినా సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. కేంద్రం నిర్ణయంతో వివాదం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో మొదటి నుంచి దూకుడుగా వెళుతున్న తెలంగాణ సర్కార్ మరో సంచలనానికి తెర తీసింది. కేంద్రం గెజిట్‌పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కేసీఆర్ సర్కార్‌..  తాజాగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా జలాల్ని 50 శాతం నిష్పత్తిలో పంచాలంటూ కొత్త వివాదానికి ఆజ్యం పోసింది.  ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకూ కృష్ణా జలాల్ని ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది కేసీఆర్ సర్కార్. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరపాలని విజ్ఞప్తి చేసింది. రివర్ క్యాచ్మెంట్‌ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం.. ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని కోరింది. తెలంగాణలోనే కృష్ణా క్యాచ్ మెంట్ ఏరియా 70 శాతంగా ఉందని తన లేఖలో తెలంగాణ సర్కార్ వివరించింది. అంతేకాదు పెన్నా క్యాచ్ మెంట్ ఏరియాకు ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాశారు తెలంగాణ ENC మురళీధర్‌. కృష్ణా నదీ పరివాహకం తమ ప్రాంతంలోనే అధికంగా ఉంది అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ 68 శాతం నదీ పరివాహకం ఉందని.. దాని ప్రకారం నీటి కేటాయింపులు జరపాలని లేఖలో కోరింది. అత్యల్ప పరీవాహకం ఉన్న ఏపీకి అధిక నీటి కేటాయింపులేంటని బోర్డు తీరును ప్రశ్నిస్తోంది. కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు ఏపీ తరలించుకుపోతోందని ఎప్పటినుంచో వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోసారి లేఖలో అదే విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా క్యాచ్‌మెంట్‌ ఏరియా ఆధారంగా నీటి కేటాయింపులు జరపాలని కోరుతోంది.  తెలంగాణ సర్కార్ లేఖపై  కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుందున్నది ఆసక్తిగా మారింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం కృష్ణా జలాల్లో ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణలు 298 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ సర్కార్ తాజాగా సగం సగం పంచాలని కోరడంతో.. ఏపీకి వాటా భారీగా తగ్గనుంది. తెలంగాణ సర్కార్ తాజాగా రాసిన లేఖలో పొందుపరిచిన అంశాలతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఏపీ రాజకీయ వర్గాలు, ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తాజా లేఖపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

అమిత్‌షాతో ర‌ఘురామ మీటింగ్‌.. జ‌గ‌న్‌కు చెక్ పెడ‌తారా?

ర‌ఘురామ. ఈ పేరు వింటేనే జ‌గ‌న్‌కు ఉలిక్కిపాటు. ర‌ఘురామ మీడియాతో మాట్లాడినా, త‌న‌కు లేఖ‌లు రాసినా.. జ‌గ‌న్‌లో క‌ల‌వ‌ర‌పాటు. సీబీఐ కోర్టులో కేసు వేసినా, స్పీక‌ర్‌ను క‌లిసినా, ఎంపీల‌కు లేఖ‌లు రాసినా, ఎన్‌హెచ్ఆర్డీకి ఫిర్యాదు చేసినా.. ఆఖ‌రికి ర‌ఘురామ తుమ్మినా, ద‌గ్గినా జ‌గ‌న్‌కు హైరానే. వీటికే ఇంత‌లా కంగారు ప‌డే జ‌గ‌న్‌.. ఇక ర‌ఘురామ అమిత్‌షాతో భేటీ అయ్యార‌నే బ్రేకింగ్ న్యూస్ తెలిసి ఇంకెంతగా ఇదైపోతున్నారో ఊహించుకోవ‌చ్చు. అవును, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు స‌మావేశ‌మ‌య్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. రఘురామ ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.  ఇన్ని విష‌యాలు మాట్లాడుకున్న వారిద్ద‌రూ సీఎం జ‌గ‌న్ గురించి మాట్లాడ‌కుండా ఉంటారా? సీబీఐ కోర్టులో ఉన్న జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు ప్ర‌స్తావ‌న‌కు రాకుండా ఉంటుందా? సీఐడీ క‌స్ట‌డీలో ఓ ఎంపీ అయిన త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించిన విష‌యం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకురాకుండా ఆగుతారా? డౌట్ ఎందుకు? ఆ విష‌యాల‌న్నీ చ‌ర్చకు వ‌చ్చాయంటున్నారు. అస‌లు, జ‌గ‌న్ సంగ‌తి అటోఇటో తేల్చేసేందుకే ర‌ఘురామ.. అమిత్ షాను క‌లిశార‌ని అంటున్నారు. ర‌ఘురామ త‌న‌కు ఏం చెబుతారో తెలిసే.. ఆ సంగ‌తుల‌న్నీ వినేందుకే అమిత్‌షా సైతం ర‌ఘురామ‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చార‌ని చెబుతున్నారు.  ఓవైపు సీబీఐ కోర్టులో కేసు.. మ‌రోవైపు పార్లమెంట్‌లో గ‌తానికి భిన్నంగా వైసీపీ ఎంపీల నిర‌స‌న‌లు. ఇటు, ఎంపీ ర‌ఘురామ‌పై ఎలాగైనా అన‌ర్హ‌త వేటు వేయించాల‌నే ప‌ట్టుద‌ల‌లో వైసీపీ. అటు, త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించిన ఏపీ స‌ర్కారును పార్ల‌మెంట్ ముందు దోషిగా నిల‌బెట్టాల‌నే క‌సిలో ర‌ఘురామ‌. ఇలా ప‌లు విష‌యాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఎంపీ ర‌ఘురామ చ‌ర్చించార‌ని తెలుస్తోంది. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు, కోర్టుల్లో వ‌రుస‌గా త‌గులుతున్న ఎదురుదెబ్బ‌లు, ఆల‌యాల‌పై దాడులు.. ఇలా అన్నిటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ ర‌ఘురామ‌.  సీఎం జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో ఏదో జ‌రుగుతోంద‌ని.. వేగంగా పావులు క‌దులుతున్నాయ‌ని అంటున్నారు. పార్ల‌మెంట్‌లో వైసీపీ ఎంపీల ధిక్కార‌స్వ‌రాన్ని సైతం కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని చెబుతున్నారు. అందుకే, వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చేందుకే ర‌ఘురామ‌కు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చార‌ని అంటున్నారు. ఈ నెల 26న సీబీఐ కోర్టులో తీర్పు రాబోతుండ‌గా.. జ‌రిగిన ఈ భేటీలో కీల‌క విష‌యాలే ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.  అమిత్‌షా-ర‌ఘురామ భేటీతో జ‌గ‌న్‌రెడ్డిలో గుండెద‌డ అమాంతం పెరిగింద‌ని అంటున్నారు. ర‌ఘురామ మ‌ళ్లీ త‌న‌ను ఎలా బుక్ చేయ‌బోతున్నాడో.. అందుకు కేంద్రం నుంచి ఎలాంటి స‌హాయాన్ని కోరాడ‌నే టెన్ష‌న్ జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌నేది ఆయ‌న స‌న్నిహితుల మాట‌.   

ప్ర‌వీణ్ కుమార్ వీఆర్ఎస్ ఆమోదం.. భవిష్యత్ కార్యాచరణ ఇదేనా? 

ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణను ప్ర‌భుత్వం ఆమోదించింది. ప్ర‌వీణ్‌కుమార్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు సోమవారం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన ప్ర‌భుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణ‌యం వెలువ‌రించింది. ప్ర‌వీణ్‌కుమార్ రాజీనామాతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శిగా ఆర్థిక‌శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రొనాల్డ్ రాస్‌కు ప్ర‌భుత్వం అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఐపీఎస్ గా 26 ఏండ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ప్రస్తుతం అడిషనల్‌ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శికి ఈ మెయిల్‌ ద్వారా  పంపించారు.  తనపై నమ్మకంతో పలు బాధ్యతలు అప్పగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌కు ఉన్న‌త విద్య అందాల‌న్నారు. ప్ర‌వీణ్ కుమార్ ఎవ్వ‌రికీ అమ్ముడుపోడ‌ని త‌ర‌త‌రాలుగా జ‌రుగుతున్న అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడ‌నున్న‌ట్లు తెలిపారు. పూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరాం చూపిన బాటలో నడుస్తానని ప్రవీణ్ కుమార్ తాను రాసిన లేఖలో వెల్లడించారు. దీన్నిబట్టి ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఆర్‌ఎస్.ప్ర‌వీణ్‌కుమార్ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ తెలంగాణలో సంచ‌ల‌నంగా మారింది. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన రాజ‌కీయాల్లోకి వెళతారా? టీఆర్ఎస్‌లో చేరిపోతారా? హుజురాబాద్ నుంచి బ‌రిలో దిగుతారా? ద‌ళిత బంధు బాధ్య‌త‌లు చేప‌డ‌తారా? లేక‌, తానే సొంతంగా పార్టీ పెట్టేసుకుంటారా? స్వేరోస్‌ను రాజ‌కీయంగా డెవ‌ల‌ప్ చేస్తారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు వస్తున్నాయి. అయితే ఆదిలాబాద్ నుంచే నా ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని వీఆర్‌ఎస్ ప్రకటించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాలతోనే మొత్తం వ్యవస్థ మారుతుందనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు.  ప్రవీణ్‌కుమార్‌ ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీకి దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కానీ టీఆర్‌ఎస్‌ ముఖ్యులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే వీఆర్‌ఎస్‌ ప్రకటించిన ప్రవీణ్‌కుమార్‌, ఆ పార్టీలో చేరుతారని ఊహించటం కష్టమని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఇక ప్రవీణ్‌కుమార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకమైనందున.. బీజేపీలోనూ చేరే అవకాశం లేదు. ‘జై భీం’ పేరుతో కొత్త పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేస్తున్నారు. 

తెలంగాణలో భూముల విలువ పెంపు.. గురువారం నుంచి కొత్త రేట్లు 

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎస్ సోమేశ్‌ కుమార్ జీవో జారీ చేశారు. భూముల రేట్లు పెంచుతూ, కొత్త ధరలు ఈ నెల 22 నుంచే అమలులోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు భూముల మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచింది. ఈ కొత్త రేట్లకు అనుగుణంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌‌ను అప్‌డేట్‌ చేసేందుకు సాయంత్రం 5 గంటలకు వెబ్‌సైట్ సర్వీస్‌ను రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ నిలిపేసింది. భూముల రేట్లతో పాటు వాటి రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీని కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్‌లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుందని సీఎస్ తెలిపారు. భూముల మార్కెట్ విలువు పెంచుతున్నారన్న సమాచారంతో పాత ధ‌ర‌ల్లో రిజిస్ట్రేష‌న్ల‌కు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పోటెత్తారు. ఇటీవల ప్రభుత్వం కోకాపేట సహా ఇతర ప్రాంతాల్లో భూములను వేలం వేసింది. ప్రభుత్వ భూములను తక్కువ రేట్లకే అమ్మి, ఆ వ్యవహారం ముగిశాక ఇప్పుడు భూముల రేట్ల పెంపు నిర్ణయం తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. సర్కారు భూములను తక్కువకు అమ్మి, అవి కొనుక్కొన్న కంపెనీలకు లాభం చేకూర్చేలా టీఆర్‌‌ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసినట్టుగా కనిపిస్తోందని రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఈ జీవో ఇస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేదని, కానీ ప్రజల సొమ్మును తన బినామీలకు దోచిపెట్టేందుకే వేలం ముగిసిన వారం తర్వాత ఉత్తర్వులు ఇచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భూముల రేట్ల పెంపు ఇలా.. 1. వ్యవసాయ భూములకు తక్కువ ధర ఉన్న దగ్గర ఎకరానికి రూ.75,000 పెంపు  2.   వ్యవసాయ భూముల కోసం, ప్రస్తుతం ఉన్న విలువలు తక్కువ ధర  ఉన్న దగ్గర  50%, మధ్యరకంగా ఉన్న దగ్గర 40%, అత్యధికంగా  ఉన్న దగ్గర  30% పెంపు 3. ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటి వరకు కనిష్ట విలువ చదరపు గజానికి రూ.100 ఉండగా.. చదరపు గజానికి  రూ.200గా పెంపు  4. ఓపెన్ ప్లాట్లు తక్కువ ధర ఉన్న దగ్గర  50%, మధ్య రకంగా ఉన్న  భూములకు 40%, అత్యధికంగా ఉన్న దగ్గర 30% సవరించారు  5. అపార్ట్‌మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న అతి తక్కువ విలువ ఉన్న దగ్గర  చదరపు అడుగుకు రూ.800 ఉండేది. ఇప్పుడది రూ.1000 6. అపార్ట్‌మెంట్లకు సంబంధించి తక్కువ విలువ  ఉన్న దగ్గర 20 శాతం, ఎక్కువ విలువ  ఉన్న దగ్గర 30 శాతం పెంపు  7. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు స్టాంప్ డ్యూటీ రేట్ల అమ్మకానికి 6% నుంచి 7.5 శాతానికి పెంపు 

పార్ల‌మెంట్‌లో  వైసీపీ రచ్చ.. యాక్ష‌నా? ఓవ‌రాక్ష‌నా?

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్తైంది. ఈ రెండేళ్ల‌లో ప‌లుమార్లు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రిగాయి. అన్నిసార్లు వైసీపీ ఎంపీలు స‌భ‌కు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ క్యాంటీన్ల‌లో కాఫీలు, టిఫినీలు చేశారు. స‌భ‌లో చ‌ప్ప‌ట్లు కొట్టారు. బిల్లుల విష‌యంలో కేంద్రానికి ఫుల్లుగా స‌హ‌క‌రించారు. అప్పుడెప్పుడూ వారికి ప్ర‌త్యేక హోదా గురించి రాజ్య‌స‌భ‌లో గట్టిగా గ‌ళ‌మెత్తాల‌ని అనిపించ‌లేదు. అప్పుడెప్పుడూ వారికి పోల‌వ‌రం నిధుల‌పై లోక్‌స‌భ‌లో నిల‌దీయాల‌ని తోచ‌లేదు. స‌డెన్‌గా.. వైసీపీకి రెండేళ్ల త‌ర్వాత రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు గుర్తొచ్చిన‌ట్టున్నాయి. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై కొత్త‌గా ఇప్పుడే వారికి జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా హోదా అడగటం మిన‌హా మనమేమీ చేయలేమన్న జ‌గ‌న్‌రెడ్డి.. అక‌స్మాత్తుగా కేంద్రం విష‌యంలో త‌న స్టాండ్ మార్చేసుకున్నారు. బ‌హుషా, గ‌త‌రాత్రి ఏ జీస‌సో, వైఎస్సారో ఆయ‌న‌కు హిత‌బోధ చేసుంటారని అంటున్నారు. ఆ వెంట‌నే.. పార్ల‌మెంట్‌లో వైసీపీ ఎంపీలు యాక్ష‌న్‌లోకి దిగిపోయారు.  విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ లాబీలోకి దూసుకొచ్చేశారు. వ‌రుస‌గా రెండురోజులుగా ప్ర‌త్యేక హోదా కోసం స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నారు.  ఇక‌ పెద్ద‌ల స‌భ‌లో త‌మ పార్టీ పెద్దాయ‌న యాక్ష‌న్ చూసి.. లోక్‌స‌భ‌లోనూ వైసీపీ ఎంపీలు నిర‌స‌న స్వ‌రం పెంచేశారు. అక్క‌డ ప్ర‌త్యేక హోదా డిమాండ్ అయితే, ఇక్క‌డ పోల‌వ‌రం నిధుల కోసం ఫైటింగ్‌. ఇలా ఉభ‌య స‌భ‌లో వైసీపీ ఎంపీలు చేస్తున్న హంగామా చూసి.. యావ‌త్ దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోతోంది. అదేంటి? మోదీకి న‌మ్మిన బంటుల్లా ఉండే వైసీపీ ఎంపీలు ఇలా ఒక్క‌సారిగా ఎదురుతిర‌గ‌డ‌మేంట‌ని తెగ చ‌ర్చించుకుంటున్నారు. అయితే, ఎవ‌రికీ వైసీపీ ఎంపీల చిత్త‌శుద్ధి మీద న‌మ్మ‌కం మాత్రం క‌ల‌గ‌డం లేదు. వీరి హ‌డావుడి వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అదేంట‌బ్బా.. అని చెవులు కొరుక్కుంటున్నారు.    సీబీఐ కోర్టులో జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. ఇన్నాళ్లూ జ‌గ‌న్‌కు సీబీఐ బాగా స‌హ‌క‌రించింద‌ని అంటారు. ఇప్పుడిక ఆ ద‌ర్యాప్తు సంస్థ నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ వ‌స్తోంద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై జోక్యం చేసుకోబోమ‌ని, కోర్టు ఇష్ట ప్ర‌కార‌మే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని సీబీఐ చెప్ప‌డంతో జ‌గ‌న్‌రెడ్డి షాక్ తిన్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లతో ఏదో ప్ర‌య‌త్నించారు. దీంతో బెయిల్ ర‌ద్దుపై తాము కూడా కౌంట‌ర్ వేస్తామంటూ ఇటీవ‌ల సీబీఐ స్టాండ్ మార్చుకుంది. ఇప్పుడు సీబీఐ వేయ‌బోయే ఆ కౌంట‌ర్ ఏంట‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌నే సీబీఐ సైతం కౌంట‌ర్ దాఖ‌లు చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం తెలిసి వైసీపీలో క‌ల‌వ‌ర‌పాటు మొద‌లైంద‌ని అంటున్నారు. కేంద్రం నుంచి సీబీఐ రూపంలో స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌వుతోంద‌ని.. అదే జ‌రిగితే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దైతే.. మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌నే భ‌యం జ‌గ‌న్‌ను అస‌హ‌నానికి గురి చేస్తోంద‌ని అంటున్నారు.  అటు, త‌న‌కు పంటికింద రాయిలా మారిన ఎంపీ ర‌ఘురామ‌పై అనర్హ‌త వేటు వేయాలంటూ వైసీపీ కొంత‌కాలంగా గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు ఎన్నిసార్లు మొర‌పెట్టుకున్నా.. ఆయ‌న నుంచి ఆ దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు లేవు. ర‌ఘురామ‌పై వేటు వేయ‌డం కేంద్రానికి ఇష్టం లేద‌ని.. అందుకే స్పీక‌ర్ విష‌యాన్ని నానుస్తున్నార‌ని ర‌గిలిపోతోంది వైసీపీ. కేవ‌లం ఒక ఎంపీపై వేటు వేయించుకోలేకపోతే.. ఇక తాము కేంద్రానికి ఊడిగం చేసేది ఎందుక‌ని జ‌గ‌న్ ఫ్ర‌స్టేష‌న్‌కి గుర‌వుతున్నార‌ట‌. అందుకే, పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రానికి ఓ ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ని అంటున్నారు. త‌మ‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే కేంద్రానికి కూడా స‌హ‌క‌రించ‌మ‌ని.. రాజ్య‌స‌భ‌లో పూర్తిస్థాయి సంఖ్యాబ‌లం లేని బీజేపీకి వైసీపీ స‌హాయం త‌ప్ప‌నిస‌రి అని గుర్తు చేయ‌డానికే.. వైసీపీ ఎంపీలు ఇలా పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను అడ్డుకొని.. ప‌రోక్షంగా కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నార‌ని అంటున్నారు. ఇందులో స్వ‌ప్ర‌యోజనాలే దాగున్నాయి కానీ, వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కాదంటున్నారు. ఇదంతా కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగ‌డేన‌ని.. వ‌న్స్, సీబీఐ కోర్టులో త‌న‌కు రూట్ క్లియ‌ర్ అయితే.. మ‌రో మూడేళ్ల వ‌ర‌కూ పార్ల‌మెంట్‌లో వైసీపీ త‌ర‌ఫున ఇక ఇలాంటి సీన్లు చూసే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ పార్ల‌మెంట్‌లో ఈ హైడ్రామా కంటిన్యూ కావొచ్చని చెబుతున్నారు. చూడాలి వైసీపీ ఎంపీల చిత్త‌శుద్ది ఎంత‌వ‌ర‌కూ ఉంటుందో...

రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ఆయనకు మూడినట్టేనా? 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాకులు ఇస్తున్నారు. రోజూ ఏదో ఒక కార్యక్రమంతో హల్ చల్ చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇక రేవంత్ ఎప్పుడు ఏం చేస్తారోనని తెలంగాణ పోలీసులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఛలో రాజ్ భవన్ కు పిలుపిచ్చి పోలీసులకు, ప్రభుత్వానికి చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి. సోమవారం కోకాపేట భూముల సందర్శనకు పిలుపివ్వడంతో అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. కేసీఆర్ సర్కార్ పై రోజుకో సంచలన ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. మరోసారి ఆందోళనకు పిలుపిచ్చారు.  దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై గురువారం ఛలో రాజ్ భవన్ కు పిలుపిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మోడీ సర్కార్ తో పాటు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ హ్యాకింగ్ కు పాల్పడ్డాయని ఆరోపించారు. సమాజం మేలు కోసం పనిచేసే వారి ఫోన్లను హ్యాక్ చేసి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారాన్ని 2019లో వాట్సాప్ సంస్థ రెండు సార్లు హెచ్చరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ ప్రధాని మోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు దేశ ద్రోహానికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. దేశంలో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేతలతో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు కూడా హ్యాకింగ్ కు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మీడియా ప్రతినిధులు కూడా హ్యాకింగ్ భాధితులేనని చెప్పారు. తెలంగాణ లో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ ప్రభాకర్ రావు వ్యవహార శైలి, ఆయన నియామకం పై కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.తెలంగాణలో పోలీస్ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను , ఇజ్రాయిల్ నుండి ఫోన్ హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ కొనుగోలుకోసం కేటాయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డే  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పారన్నారు.  ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం పై ఆరోపణలు చేసిన సహాయ మంత్రి కి, మోడి కేబినెట్ హోదా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఫోన్ హ్యాకింగ్ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా? అని నిలదీశారు. అవసరం అయినప్పుడు పార్లమెంట్ లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావన చేస్తానని తెలిపారు రేవంత్ రెడ్డి. 

మోడీ గారు మరకలు తుడుచుకోండి.. ప్రధానికి బీజేపీ ఎంపీ చురకలు 

పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్’ వివాదం పై రచ్చ సాగుతోంది. ఫోన్ల్ ట్యాపింగ్ కు సంబందించిన  వివాదం ఉభయ సభలనూ కుదిపేసింది. పెగాసస్ స్పైవేర్ వివాదంపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో సమావేశమయ్యారు. మరోవైపు పెగాసస్ వివాదం నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరిగింది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు.   బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మోడీ ప్రభుత్వానికి సుతిమెత్తగా మొట్టికాయలు  వేశారు. పెగాసస్ వివాదానికి సంబంధించి వచ్చిన ఆరోపణల మరకల నుంచి  మోడీ ప్రభుత్వం బయటకు  రావాలని కోరారు, నిజాయతీని నిరూపించుకోవాలని కోరారు. ‘పెగాసస్ కథేంటో, ఇందుకు సంబదించి అంతర్జాతీయ మీడియా సంస్థలు మూకుమ్మడిగా  చేస్తున్న స్నూపింగ్ ఆరోపణల నిజానిజాలు ఏమిటో ప్రజల ముందుంచాలని స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబందించిన మొత్తం గుట్టును బయట పెట్టాలని స్వామి కోరారు. “‘పెగాసస్ స్పైవేర్ ఒక వాణిజ్య సంస్థ. డబ్బులు పుచ్చుకుని పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సో .. భారత దేశంలో ఆపరేషన్ నిర్వహించినందుకు ఆ కంపెనీకి, ఎవరు డబ్బులు ఇచ్చారు? ఇది ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన ప్రశ్న. ప్రభుత్వం  కాకపోతే ..ఎవరు కంపెనీకి డబ్బులు ఇచ్చారు? ఇందులోని నిజానిజాలు ఏమిటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం వుంది, అని స్వామి ట్వీట్ చేశారు.  ఇలా చిరుగాలిలా మొదలైన ‘పెగాసస్’  వివాదం చిలికి చిల్కి గాలి వానగా, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేస్తున్నది.  ప్రస్తుత టెలికాం మంత్రి సహా  ఇద్దరు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్, మరో ఎనిమిది తొమ్మిదిమంది ఆయన సన్నిహిత సహచరులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్, 40 మనది వరకు జర్నలిస్టులుమ, ఇతర ప్రముఖులు  మొత్తం 300 మందికి పైగా భారతీయుల ఫోన్లు ఇజ్రాయిల్ స్పైవేర్ హ్యాకింగ్’ లక్ష్యంగా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఈ స్పైవేర్ ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే కంపెనీ అమ్ముతుంది . కాబట్టి, ఈ వ్యవహారంలో ప్రభుత్వ హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ  జరిపించాలని, హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇదంతా వట్టిదే అని ప్రభుత్వం కొట్టి వేస్తోంది.  కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం  రాజద్రోహానికి పాల్పడిందని ఆరోపించింది.ఇందుకు అమిత్ షా దే బాధ్యతని ఇర్ధరించింది  అలాగే ఈ మొత్తం వ్యవహరంలో ప్రధాని మంత్రి పాత్ర పైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ డిమాండ్’కు కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ,వామపక్ష పార్టీలు, ఆర్జేడీ శివసేన పార్టీలు మద్దతు నిచ్చాయి. అయితే బీజేపీ విపక్షాల ఆరోపణలలో ఇసుమంతైనా వాస్తవం లేదని కొట్టి వేసింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి లేదా మోడీ ప్రభుత్వానికి సంబంధమున్నట్లు చిన్నపాటి ఆధారం కూడా లేదని, ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు.  పార్లమెంట్  వర్షాకాల సమావేశాల రెండవ  రోజు మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అంతకు ముందు, పార్లమెంట్ ఉభయ సభల్లో ఫోన్ ట్యాపింగ్, ‘పెగాసస్’ స్పైవేర్ వివాదంపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలను స్తంభింప చేసింది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కార్యక్షేత్రంలో కాంగ్రెస్ విఫలమవుతూ వస్తోందని, అయినా వారి గురించి ఆలోచించకుండా, బీజేపీ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారని ఎద్దేవా చేశారు. అసోం, బెంగాల్, కేరళలో ఘోరంగా విఫలం చెందినా, బీజేపీపై విరుచుకుపడుతూనే ఉన్నారని మండిపడ్డారు. వారి పార్టీ గురించి ఆలోచించడం కంటే, బీజేపీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.అదేలా గున్నప్పటికీ, ‘పెగాసస్’వివాదం వర్షాకాల సమావేశాలను స్వాహా చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కోరుకుంటున్నది అదే విపక్షాలు ఇస్తున్నదీ అదే.. 

ఢిల్లీపై డ్రోన్ అటాక్స్‌?.. ఆగ‌స్ట్ 5 టార్గెట్‌! ఆ రోజే ఎందుకంటే?

ముష్క‌రులు బ‌రి తెగిస్తున్నారు. దేశ రాజ‌ధానిపై దాడుల‌కు మ‌రోసారి కుట్ర చేస్తున్నారు. మోదీ స‌ర్కారు వ‌చ్చాక ఉగ్ర‌వాదుల కుతంత్రాల‌కు చెక్ ప‌డుతుండ‌టంతో అసహనంతో ర‌గిలిపోతున్నారు. స‌రిహ‌ద్దులు కట్టుదిట్టం చేయ‌డంతో.. ఇక స్లీప‌ర్ సెల్స్‌ను దాడుల‌కు ఉసిగొల్పుతున్నారు. దుర్బంగా రైలు బాంబు ఘ‌ట‌న‌లు అందులో భాగ‌మేనంటున్నారు. మ‌రోవైపు, క‌శ్మీర్‌లో డ్రోన్ అటాక్స్‌తో టెర్ర‌ర్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ సైనిక వైమానిక‌ కేంద్రం టార్గెట్‌గా ఉగ్ర‌వాదులు డ్రోన్ల‌తో బాంబు దాడి చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప‌లుమార్లు టెర్ర‌ర్ డ్రోన్లు క‌శ్మీర్‌లో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో సైన్యం అప్ర‌మ‌త్త‌మైంది. అదే డ్రోన్ అటాక్స్‌ను స్పూర్తిగా తీసుకొని.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో సైతం బాంబు దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తో భ‌ద్ర‌తా సంస్థ‌లు అల‌ర్ట్ అయ్యాయి. ఇండిపెండెన్స్ డే కి ముందు ఉగ్ర‌దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే స‌మాచారంతో ఢిల్లీలో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించాయి.  జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడి జరిగింది. అదే తరహాలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి ఢిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాలు హెచ్చ‌రించాయి. ఆగ‌స్టు 5న దాడి జ‌రిగే ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసింది. అందుకు ప్ర‌తీకారంగా ఆ రోజున ఉగ్ర‌వాదులు డ్రోన్ల స‌హాయంతో ఢిల్లీలో బాంబు దాడులు చేయొచ్చ‌ని నిఘావ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి.  ప్ర‌స్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడొచ్చని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి ఉగ్రమూకలు పెద్ద కుట్రనే పన్నుతున్నాయని భద్రతా సంస్థలు అల‌ర్ట్ చేశాయి.  ఇంటెలిజెన్స్‌ విభాగం సహా ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేష‌న్ల‌ను అప్రమత్తం చేశారు. డ్రోన్‌ దాడులకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విద్రోహ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వ‌నున్నారు. ఐబీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో దేశ రాజ‌ధానిలో భ‌ద్ర‌త మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఏవైనా అనుమానాస్ప‌ద విష‌యాలు క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.   

భర్తను కాశీకి పంపి.. ప్రియుడితో స్వర్గం.. 

ఈ మధ్య  కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైతున్నాయి. వివాహేతర సంబంధాలు కాపురాలనే కాదు.. ప్రాణాలనూ కూల్చేస్తున్నాయి. పెద్దల అంగీకారం, పంచభూతాలు వేద మంత్రాల మధ్య మూడు ముళ్ళు ఏడు అడుగులు నడిచిన వాళ్ళు చివరికి పరాయి వాడి మోజులో పడి సొంత వాళ్ళను చంపుకుంటున్నారు.  తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ భార్య ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా చంపించింది. అనంతలోకాలకు పంపేసింది. ఆపై భార్య ఆత్మహత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె ఐదు ఏళ్లు విజయవంతంగా తప్పించుకుంది. కానీ.. అబద్ధానికి చాపకింద నీరు లాంటిది ఎప్పుడో అప్పుడు తడి తెలిసినట్లు అబద్దం కూడా బయటపడుతది. నిజానికి నిలకడ ఎక్కువ అంటారు కదా.. ఆలస్యంగానైనా అసలు నిజం బయటకు పొక్కింది. చివరికి ఆమె ఊచలు లెక్కిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది మంచిర్యాల జిల్లా బీమారం మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. బీమారం మండలంలోని శ్రీరాంపూర్ కాలనీకి చెందిన సత్యరాజ్, కన్నూరి మహేశ్వరి దంపతలు ఉన్నారు. వృత్తి రీత్యా సత్యరాజ్ ఫాస్టర్..ప్రజలను మేల్కొలపడానికి అతను వెళితే , మహేశ్వరికి తన భర్తతో కలిసి పని చేసే గంగాధర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి ఇరువురి విషయం భర్త సత్యరాజ్‌కు తెలియడంతో.. అతను తన భార్యను పలుమార్లు మందలించాడు.అప్పటికే అలవాటైన పని కాబట్టి ఎంత చెప్పిన ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడు అయిన గంగాధర్‌తో కలిసి భర్తను హతమార్చాలని వ్యూహం పన్నింది. అందుకు అద్భుతమైన పధకం వేశారు.. వల్ల పధకాన్ని అమలు చేసే రోజు రానే వచ్చింది. ఓ రోజు సత్యరాజ్ భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా.. మహేశ్వరి ప్రియుడు గంగాధర్ ముందుగా అనుకున్నట్లు గానే  టవేర వాహనంతో ఆక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యరాజ్.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సత్యరాజ్ మృతిపై ఎవరికీ అనుమానం రాకుండా.. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ స్థానిక పోలీసులకు మహేశ్వరి ఫిర్యాదు చేసింది. కట్ చేస్తే.. ఇది జరిగి కూడా ఐదేళ్లు అవుతోంది. అయితే.. రోజు రోజుకు మహేశ్వరి ప్రవర్తనలో తేడా కనిపిస్తుండటంతో సత్యరాజ్ తల్లికి అనుమానం వచ్చింది. దాంతో తన కొడుకును మహేశ్వరే చంపించిందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. రంగం లోకి దిగి సత్య రాజ్ మరణాన్నికి సంబందించిన కేసు మరోసారి  లోతుగా విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కావాలనే వ్యూహం ప్రకారం చంపించినట్లు మహేశ్వరి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈ కేసులో మహేశ్వరి, ఆమె ప్రియుడు తో పాటు.. మరో ముగ్గురుని పోలీసులుఅ దుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కవాళ్లు అయిదు నిమిషాల సుఖం కోసం కట్టుకున్నవాడినే చంపుతుందా అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. 

బక్రీద్ కోసం కొవిడ్ ఆంక్షలు సడలింపు.. కేరళ సర్కార్ పై సుప్రీం ఆగ్రహం

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం స్పష్టించింది. మరణ మృదంగం మోగించింది. సెకండ్ వేవ్ లో కొన్ని ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఆక్సిజన్ అందక లక్షలాది మంది చనిపోయారు. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది. అయితే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాత్రం ఇంకా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగానే థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నాటికి దేశంలో మూడో వేవ్ ఉధృతి ఉంటుందని వైద్య సంస్థలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కొవిడ్ ఆంక్షలపై రాష్ట్రాలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.  ఓ వైపు ధర్డ్ వేవ్ భయాలు ఉండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతున్న కేరళ ప్రభుత్వం కూడా అలాగే వ్యవరించింది. బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపు ఇచ్చింది.  కొవిడ్ ఆంక్షలను మినహాయించిన కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారుల డిమాండ్ కు తలొగ్గి ఆంక్షలను సడలిస్తున్నారంటే.. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని మండిపడింది. వ్యాపారం చేసుకునేవారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజల ఆరోగ్య హక్కును కాలరాయరాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇప్పటికే ఆంక్షల ఎత్తివేత అమల్లోకి వచ్చినందున.. కేరళ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని, కన్వర్ యాత్ర కేసుకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలను ఇక్కడా పాటించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 

మహా మునిలా మారిన వైసీపీ ఎమ్మెల్యే.. 

ఉత్తరాంధ్రలో ఆయన కీలక నేత. అధికార పార్టీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ కేబినెట్ లో బెర్త్ వస్తుందని అనుకున్నా... ఎందుకో రాలేదు. అయితే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ బెర్తు ఖాయమనుకుంటున్న ఆ ఎమ్మెల్యే సడెన్ గా మహా మునిలా మారారు. అడవుల్లోకి వెళ్లి తపస్సు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏంటి ఇలా మునిగా మారడం ఏంటని చూసినవాళ్లంతా షాక్ తింటున్నారు.. ఎందుకలా మారిపోయారని చర్చించుకుంటున్నారు..  అయితే  ఆ ఎమ్మెల్యే..  మంత్రి పదవి రాలేదనే కోపంతోనే, రాజకీయాలపై విరక్తితోనే మహా మునిలా మారలేదు. ఆ సీనియర్ ఎమ్మెల్యేకి రాజకీయాలతో పాటు నటనలోనూ అనుభవం ఉంది. అందుకే ఇలా సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. ఓ సినిమా కోసం ఇలా మహా మునిలా మారిపోయారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. తన కళా పోషణను బయటపెడుతున్నారు కరణం ధర్మ శ్రీ.  గిరిజనుల ఇలవేలుపు జై. మోదకొండమ్మ సినిమా షూటింగ్‌లో  పాల్గొంటున్నారు.  శ్రీమోదవందన్‌ సినిమా టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుతీర్థ మహామునిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నటిస్తున్నారు. గతంలోనే విశాఖ గాజువాకలో శ్రావణమాసం సందర్భంగా షూటింగ్ ప్రారంభించారు. కరోనా కారణంగా కొంత కాలం నిలిచిపోయింది. తాజాగా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. పాడేరు ఘాట్‌ రోడ్డులో ఎమ్మెల్యే ధర్మశ్రీపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. పరమశివుడికి తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సన్నివేశాన్ని షూట్ చేశారు. కోమాలమ్మ పనుకు, 12 మైళ్లు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ వీడియోను ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్ చేశారు.  ధర్మశ్రీకి చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టమట. తన సొంత ఊరిలో చాలా నాటకాల్లో ఆయన నటించారని స్థానికులు చెబుతుంటారు. 2004లో మొదటిసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రలో నటించారు. ఆయన పాత్రపై వైఎస్ ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా అన్నమయ్య అని పిలిచేవారు. 

బెంగాల్ బీజేపీలో  సువేందు కలకలం..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కథ ముగిసి చాల కాలమే అయింది. ఆ ఎన్నికల్లో బీజీపీ సీట్ల సంఖ్య పెరిగినా, ఆశించిన అధికారం మాత్రం అందనంత దూరంలోనే ఆగిపోయింది. అయితే, ఇంతకాలం తర్వాత, బీజేపీ శాసన సభా పక్ష నేత సువేందు అధికారి, పార్టీ ఓటమికి పార్టీ నాయకుల అతి విశ్వాసమే కారణమని విమర్శించారు. పార్టీ 170-180 సీట్లు సాధించి తీరుతుందంటూ పలువురు నేతలు అతిగా విశ్వసించారని,అదే బిజెపి ఓటమికి కారణమైందని మండిపడ్డారు. పూరబ్‌ మిడ్నాపూర్‌ జిల్లాలోని చండీపూర్‌ ప్రాంతంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి,రెండో దశలలో  పార్టీ నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత అతి విశ్వాసానికి పోయి, బాధ్యలు విస్మరించడంతో ఆశించిన ఫలితాలు అందుకోలేక పోయామని అన్నారు.  అది నిజమే కావచ్చును, అయితే, ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి, ఇప్పుడు ఈ పాత గాయాన్ని ఎందుకు కెలుకు తున్నారు? దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు, ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఈ విశ్లేషణలు ఎందుకు చేస్తున్నారు? అనేది బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఉద్దేశం అతి విశ్వాసం అనర్ధదాయకం అని చెప్పడమేనా? లేక .. ఇంకేదోనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి, బెంగాల్ ఎన్నికల విషయంలో  స్థానిక నాయకుల కంటే జాతీయ నాయకత్వమే అతి విశ్వాసానికి పోయింది. ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీకి రెండు వందలకు పైగా సీట్లు వస్తాయని ఆయన పాల్గొన్న ప్రతి సభలో, ప్రతి సమావేశంలో, విలేకరుల సమావేశాలలో, ఇంటర్వ్యూలలో  ఒకటికి నాలుగు సార్లు, చెపుతూ వచ్చారు. బెంగాల్లో గెలిచేశామనే ధీమాను  వ్యక్తం చేశారు. చివరకు అమిత్ షా లెక్క తప్పుతుందని, కమల దళం నెంబర్ వంద దాటదని, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్, కూడా ఆయనకే సవాలు విసిరారు. ఆయన చెప్పినట్లుగానే, బీజేపీ బలం 70 దగ్గరే ఆగిపోయింది.అప్పట్లో అమిత్ షా, పరిస్థితి, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు వంవ్వినందుకు అన్నట్లు అయిందని విశ్లేషణలు వినిపించాయి.  సరే, ఆదాల ఉంటే సువేందు అధికారి ఆపాత గాయాన్ని ఇప్పుడు ఎందుకు కెలుకుతున్నారు. ఆయన ఎవరిని తప్పు పడుతున్నారు... స్థానిక నాయకుల బుజాల మీద తుపాకి పెట్టి, జాతీయ నాయకత్వం మీద తూటాలు పేలుస్తున్నారా? అయితే, అయన ఉద్దేశం ఏమిటి ? సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా? ఇలా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నికలకు మందు సువేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నుండి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. సువేందు వ్యాఖ్యలపై టిఎంసి అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ ఘాటుగా స్పందించారు. బిజెపి నేతలు వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు విశ్వాసాలతో ఊహల్లోనే విహరిస్తుంటారని అన్నారు. సువేందు అధికారి ఎవరినో  ఎందుకు తప్పు పడుతున్నారు.. ఆయన కూడా 180 సీట్లు సాధిస్తామంటూ పలుసార్లు ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు.అయితే, ఎన్నికల సమయంలో గెలుపు మీద ధీమా వ్యక్తం చేయడం తప్పు కాదని,అది అన్ని పార్టీలు అందరు నాయకులు చేసేదేనని, అయితే ఈ సమయంలో సువేందు అధికారి అదేదో పెద్ద నేరం అన్నట్లు ప్రకటించడమే ఆశ్చర్య పరుస్తోందని, అయన మనసులో ఎదో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్నాట్లు ఉందని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు.

ఈట‌ల కేంద్రంగా మ‌ర్డ‌ర్ పాలిటిక్స్‌! మ‌రో కోడిక‌త్తి దాడి జ‌రిగేనా?

ఎన్నిక‌లొస్తే చాలు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు. ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు. నువ్ ఇది చేశావంటే.. నువ్ అది చేశావంటూ.. బ‌ట్ట కాల్చి మీద వేసే య‌వ్వారాలు. అభివృద్ధి, అరాచ‌కాలు, దోపిడీ, దౌర్జన్యాలు.. ఇవే ప్ర‌ధాన అస్త్ర‌శ‌స్త్రాలు. ప్రాంతం ఏదైనా, ఎన్నిక‌లు ఎలాంటివైనా.. ఇలాంటివ‌న్నీ కామ‌న్‌గా క‌నిపించేవే. అదే రాయ‌ల‌సీమ అయితే.. మ‌రో అడుగు ముందుకేసి.. దాడులు, క‌త్తులు, బాంబులు, హ‌త్య‌లు కూడా తెర మీద‌కు వస్తుంటాయి. తెలంగాణ‌లో ఆ క‌ల్చ‌ర్ త‌క్కువేన‌ని చెప్పాలి. అయితే, గ‌తానికి భిన్నంగా, గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా హుజురాబాద్ కేంద్రంగా మ‌ర్డ‌ర్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. త‌న హ‌త్య‌కు కుట్ర చేస్తున్నారంటూ ఈట‌ల ఆరోపించ‌గా.. అంత అవ‌సరం లేదంటూ మంత్రి కౌంట‌ర్ ఇచ్చారు. మ‌ధ్య‌లో కౌశిక్‌రెడ్డి ఎంట‌రై.. ఈట‌ల సుక్కంపూసేమీ కాదంటూ.. గ‌తంలో త‌న‌పైనా హ‌త్యాయ‌త్నం చేశారంటూ.. హిస్ట‌రీ మొత్తం త‌వ్విపోస్తున్నారు. ఇలా హ‌త్యారోప‌ణ‌ల‌తో హుజురాబాద్ ఉప ఎన్నిక ఎక్క‌డికి దారి తీస్తుందోన‌నే భ‌యాందోళ‌న‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి. ఇదేమి పాడు క‌ల్చ‌ర్ అంటూ ప్ర‌జాస్వామ్య‌వాదులు మండిప‌డుతున్నారు.  కొన్ని నెల‌ల క్రితం మంథ‌ని ఏరియాలో న‌డిరోడ్డుపై లాయ‌ర్ దంప‌తుల మ‌ర్డ‌ర్ జ‌రిగింది. టీఆర్ఎస్ నేత పుట్టా మ‌ధు ప్ర‌మేయంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పుట్టా మ‌ధు మాజీ న‌క్స‌ల్ కావ‌డం.. గ‌తంలోనూ ఆయ‌న‌పై ప‌లు కేసులు ఉండ‌టం క‌ల‌క‌లం రేపింది. ఈట‌ల టీఆర్ఎస్‌తో బ్రేక‌ప్ చేసుకున్నాక‌.. పుట్టా మ‌ధు ఈట‌ల మ‌నిషి అంటూ ఆ కేసులో యాక్ష‌న్ మొద‌లైంది. కొన్నిరోజుల హ‌డావుడి త‌ర్వాత ఎందుకోగాని అది సైలెంట్ అయిపోయింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్ మ‌ర్డ‌ర్ పాలిటిక్స్‌ను హాట్ టాపిక్‌గా మార్చేశారు. టీఆర్ఎస్‌ను వీడే  స‌మ‌యంలోనే తాను మొన‌గాడిన‌నే చెప్పుకునే ప్ర‌య‌త్నంలో.. న‌ర‌హంత‌కుడు న‌యీం చంపుతానంటేనే భ‌య‌ప‌డ‌లేదు.. కేసీఆర్‌కు భ‌య‌ప‌డ‌తానా? అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. న‌యీం ప్ర‌స్తావ‌న కావాల‌నే చేశార‌ని కొంద‌రు అంటున్నారు.  క‌ట్ చేస్తే.. మ‌రోమారు ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓ హంత‌క ముఠాతో క‌లిసి.. త‌న హ‌త్య‌కు ఓ మంత్రి కుట్ర చేశార‌ని అన్నారు. త‌న ద‌గ్గ‌ర ఫోటో సాక్షాలు కూడా ఉన్నాయ‌ని.. త్వ‌ర‌లోనే వాటిని బ‌య‌ట‌పెడ‌తానంటూ క‌ల‌క‌లం రేపారు. ఓ మంత్రి అన‌గానే.. గంగుల క‌మ‌లాక‌ర్ అల‌ర్ట్ అయ్యారు. ఆయ‌న ఆరోప‌ణ‌లు త‌న‌పైనే అని అంతా అనుకుంటారు కాబ‌ట్టి వెంట‌నే కౌంట‌ర్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. బీజేపీలోనే ఉన్నారుగా.. సీబీఐ, ఎన్ఐఏ ఎంక్వైరీ వేసుకోండి.. అది నిజ‌మ‌ని తేలితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ స‌వాల్ విసిరారు. ఈట‌ల‌పై త‌న‌కు వ్య‌క్తిగ‌త క‌క్షలేమీ లేవ‌న్నారు.  ఇలా ఈట‌ల వ‌ర్సెస్ గంగుల ఎపిసోడ్ న‌డుస్తుండ‌గానే.. మ‌ధ్య‌లో పాన‌కంలో పుడ‌క‌లా కౌశిక్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. మాజీ న‌క్స‌ల్ అయిన‌ ఈట‌ల చ‌రిత్ర అంతా నేరమ‌య‌మేనంటూ.. మ‌ర్డ‌ర్ పాలిటిక్స్ చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటేనన్న‌ట్టు.. ఈట‌ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కౌశిక్‌రెడ్డి. 2018లో తనను హత్య చేసేందుకు ఈటల రాజేందర్ ప్లాన్ చేశారంటూ.. త‌న‌కు స్పాట్ పెట్టిన గ్రామం, స‌మ‌యంతో స‌హా డిటైల్స్ అన్నీ చెప్పేశారు. అక్క‌డితో ఆగ‌లేదు.. ఈట‌లదంతా హ‌త్యా రాజ‌కీయమేనంటూ.. 2014 లో మాజీ ఎంపీటీసీ బాల‌రాజును మ‌ర్డ‌ర్ చేయించింది రాజేంద‌రేనంటూ కాక రేపారు. కౌశిక్‌రెడ్డి అనే కాదు.. ఈట‌ల టీఆర్ఎస్‌ను వీడిన స‌మ‌యంలో.. ధైర్యం తెచ్చుకున్న ప‌లువురు బాధితులు.. ఈట‌ల మ‌ర్డ‌ర్ పాలిటిక్స్‌పై సోష‌ల్ మీడియాలో ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.  ఇలా, ఈట‌ల త‌న హ‌త్య‌కు కుట్ర చేస్తున్నారంటూ కాక రేప‌డం.. అస‌లు ఈట‌ల‌వే హ‌త్యా రాజ‌కీయాలంటూ ఎదురుదాడి జ‌రుగుతుండ‌టంతో.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది. తెలంగాణ‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనట్టు.. మ‌ర్డ‌ర్ పాలిటిక్స్ ప్ర‌చారంలో కీల‌క టాపిక్‌గా మార‌డం చూస్తుంటే.. ముందుముందు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయోన‌నే భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలో జ‌రిగిన‌ట్టు కోడిక‌త్తిలాంటి దాడి జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు.   

వీడు మాములు దొంగ కాదు.. 

500 సంపాదించాలంటే రోజంతా కష్టపడాలి. కొంత మంది ఈజీ మనీ కోసం అలవాటు పడి అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు  ప్లాన్ వేసి అమలు చేసి చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ప్లాన్ వేస్తే  అమలు అవ్వాల్సిందే.. వాళ్ళ కన్ను పడితే ఏంటది బంగారం ఐన కరగాల్సిందే.. వాళ్ళు అనుకుంటే ఏ టైం లోనై బాధితుల చేత అరుపులు పెట్టించగలరు వల్లే చైన్ స్నాచర్. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల దొరికిపోతున్నారు. తాజాగా  గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలకు పాల్పడిన కరుడుగట్టిన స్నాచర్‌ను మలక్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి  ఏకంగా  రూ.2 లక్షల విలువ చేసే సొత్తును ఏడు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌ ఎం.రమేశ్, అదనపు డీసీపీ కె.మురళీధర్, మలక్‌పేట్‌ ఏసీపీ ఎన్‌.వెంకటరమణలతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఎల్‌బీనగర్, ఎన్టీఆర్‌ నగర్, ఫేస్‌-3 ఓ పత్రికలో వార్తా పంపిణీ విభాగంలో సహాయ మేనేజర్‌గా పని చేస్తున్న గంగపురం నరేందర్‌ ఈనెల 14న మలక్‌పేట్‌ వెళ్లారు. అక్కడ తన విధులు ముగించుకొని కాలినడకన ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రభుత్వ గర్ల్స్‌ జూనియర్‌ కళాశాలకు చేరుకున్నారు. సుమారు ఉదయం 7.20 నిమిషాలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి నరేందర్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని ఆస్మాన్‌ఘడ్‌ ప్రాంతం వైపు వెళ్లిపోయాడు. బాధితుడు మలక్‌పేట్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదేరోజు గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.   నిందితుడు డబీర్‌పుర షా కాలనీలో ఉండే ముదస్సిర్‌ అలియాస్‌ బిపాషా (21)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రంగంలోకి దిగారు పోలీసులు ఇతను బాల్యంలోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. కాచిగూడ రైల్వే పోలీసులకు దొరికిపోయాడు. రోడ్లపై సందుల్లో వెళుతూ.. ఒంటరిగా కనిపించే అమాయక ప్రజలను బెదిరించి సెల్‌ఫోన్లు, డబ్బులు లాక్కొనిపోతుంటాడు. ఆ తర్వాత రెయిన్‌ బజార్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విడుదలైన బిపాషా.. మళ్లీ ప్రణాళికను రచించాడు. తన ప్రణాళిక ప్రకారం 13న ఓ వ్యక్తిని బెదిరించి ద్విచక్రవాహనం తీసుకొని వెళ్లిపోయాడు. 14న రెయిన్‌బజార్, కాచిగూడ, సైదాబాద్, సరూర్‌నగర్, మాదన్నపేట్, మలక్‌పేట్‌ల్లో 7 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లాడని పోలీసులు గుర్తించారు. మలక్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, డీఐ డి.నానునాయక్‌ ఆధ్వర్యంలో ఎస్సై సైదులు తమ సిబ్బందితో కేసును పరిష్కరించారు. కమిషనర్‌ వీరిని అభినందించారు. ఎప్పటికైనా న్యాయమే గేలుస్తాది అని చెప్పినట్లు, దొంగతనం కూడా అంతే ఈరోజు దొరక్క పోవచ్చు కానీ ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే.. సో అలాంటి పనులు పక్కకు పెట్టి కస్టపడి పని చేస్తేనే మనకు బర్కతు ఉంటుంది.. అదే నాలుగు కాలాల పాటు మనతో ఉంటుంది. 

కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందా? ప్లాన్ చేసిందెవరు? 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే పార్టీల్లోని ప్రచారంలోకి దిగాయి. అంతేకాదు వ్యక్తిగత దూషణలు, సంచలన ఆరోపణలతో కాక రేపుతున్నారు లీడర్లు. హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తనను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించి కలకలం రేపారు. తనకు జరుగుతున్న కుట్రలకు సంబంధించి తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఈటల ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈటల ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన గంగుల.. ఓటమి భయంతోనే సానుభూతి కోసం రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  తాజాగా ఈటల రాజేందర్ పై మరో సంచలన ఆరోపణలు చేశారు పౌడి కౌశిక్ రెడ్డి. 2018లో తనను హత్య చేసేందుకు ఈటల రాజేందర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. 2018 లో మర్రిపల్లి గుడా గ్రామంలో తనను చంపడానికి ప్రయత్నించారని చెప్పారు. రాత్రి 10 గంటల సమయంలో తాను ప్రచారం ముగించుకుని వస్తుండగా.. ఈ ప్లాన్ చేశారన్నారు కౌశిక్ రెడ్డి. తాను అప్రమత్తంగా ఉండటంతో తప్పించుకున్నానని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గతంలో హత్యా రాజకీయాలకు ఈటల పాల్పడ్డారని ఆరోపించారు.  టీఆర్ఎస్ మాజీ ఎంపిటిసి బలరాజును 2014 జనవరి 5 న నర్సింగ్‌పురా గ్రామంలో హత్య చేశారని చెప్పారు.  ఇక  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  బుధవారం ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంచలనం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులకు సమాధానాలు కూడా ఇవ్వకుండానే ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. 

ఫైజ‌ర్‌తో ప‌క్ష‌వాతం ఛాన్సెస్‌!.. మ‌న వ్యాక్సిన్లే బెట‌ర్‌..!

క‌రోనాకు మందు లేదు. వ్యాక్సిన్ ఒక్క‌టే త‌రుణోపాయం. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటేనే కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ‌. వ్యాక్సిన్ వేసుకున్నామ‌ని బిందాస్‌గా ఉండే ప‌రిస్థితి కూడా లేదు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ల సామ‌ర్థ్యం సుమారు 75శాతం మాత్ర‌మే. అందుకే, టీకా త‌ర్వాత కూడా మాస్క్‌, శానిటైజ‌ర్‌, సోష‌ల్ డిస్టెన్స్ త‌ప్ప‌నిస‌రి. అయితే, వ్యాక్సిన్ వేసుకుంటే జ్వ‌రం వ‌స్తుంద‌ని, టీకాతో త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వ‌స్తున్నాయ‌నే.. రెండు మూడు రోజుల తాత్కాలిక ఇబ్బందుల‌ను బూత‌ద్దంలో చూసి.. వ్యాక్సిన్ అంటే భ‌య‌ప‌డి.. టీకాలు తీసుకోవ‌డం లేదు. ఇండియాలో ఈ ధోర‌ణి అధికంగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగిన ద‌శ‌లో జ‌నాలు వ్యాక్సిన్ కోసం ఎగ‌బ‌డ్డారు. ఇప్పుడు కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. టీకా జోలికి వెళ్ల‌డం లేదు. మ‌రోవైపు, వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయ‌నే ప్ర‌చారం వారిని మ‌రింత భ‌య‌పెడుతోంది. తాజాగా, అలాంటి ఓ ఘ‌ట‌నే వ్యాక్సిన్‌పై మ‌రింత ఆందోళ‌న పెంచుతోంది.  కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ కంటే విదేశీ వ్యాక్సిన్లైన ఫైజ‌ర్‌, మెడెర్నాల సామ‌ర్థ్యం చాలా ఎక్కువ‌. దాదాపు 95శాతం కొవిడ్ నుంచి ర‌క్షిస్తున్నాయి ఆ టీకాలు. అందుకే భార‌తీయులు సైతం ఎప్పుడెప్పుడు ఆ విదేశీ టీకాలు అందుబాటులోకి వ‌స్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే, చాలా త‌క్కువ సంఖ్య‌లో సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుండ‌టం విదేశీ వ్యాక్సిన్ల‌పై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. చాలా అరుదుగా హార్ట్ స్ట్రోక్స్‌, ప‌క్ష‌వాతం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఆ వ్యాక్సిన్ల విష‌యంలో న‌మ్మ‌కం స‌డ‌లుతోంది. తాజాగా, ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఒక వ్యక్తికి బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చింది. ఈ ఘటన యూకేలో జ‌రిగింది. 61 ఏళ్ల వ్యక్తి తొలి డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తన ముఖంలో ఎడమవైపు భాగంలో ఇబ్బంది వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా దాన్ని బెల్స్ పాల్సీగా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేశారు. కోలుకున్న కొన్ని రోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఆ వ్యాధి మరింత ముదిరింది. ఆహారం మింగాలన్నా, ఎడమ కన్ను మూయాలన్నా.. కష్టసాధ్యంగా మారింది. మరోసారి చికిత్స చేసిన వైద్యులు.. ఈ వ్యక్తికి అలా జరగడానికి ఫైజర్ వ్యాక్సినే కారణమని తేల్చారు.  ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్‌పై చేసిన ఓ అధ్యయనంలో బెల్స్ పాల్సీ వంటి సైడ్ ఎఫెక్టులు రావడం చాలా అరుదుగా సంభవిస్తుందని తేలింది. కేవలం 0.02శాతం మందిలో మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పరిశోధనలో వెల్లడైంది. అయినా, భ‌య‌ప‌డాల్సింది లేద‌ని.. ఇప్ప‌టికీ ప్ర‌పంచంలో ఫైజ‌ర్ వ్యాక్సినే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన క‌రోనా టీకా అని చెబుతున్నారు వైద్యులు. అయితే, మ‌న ఇండియ‌న్ మేడ్ కొవాగ్జిన్ కానీ, మ‌న‌కు అందుబాటులో ఉన్న కొవిషీల్డ్ వ‌ల్ల కానీ, ఇలాంటి ప్ర‌మాద‌క‌ర సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం లేవ‌ని.. భారతీయులంతా నిర‌భ్యంత‌రంగా వ్యాక్సిన్లు తీసుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.   

హుజురాబాద్ పై వరాల వర్షం.. గులాబీ బాస్ కు ఓటమి భయం? 

ఆరు నూరైనా ... నూరు ఆరైనా.. ఏది ఏమైనా హుజురాబాద్ ఉపఎన్నికలో తెరాస గెలిచి తీరాలి ... ఇందుకోసం ఏమి చేసినా ఓకే... ఎన్ని కోట్లు ఖర్చయినా అభ్యంతరం లేదు... ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మనసులో మాట ఇదేనా ... ఇందుకోసమేనా ఆయన అంతలా శ్రమిస్తోంది, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి  ఇది ముఖ్యమత్రి మనసులో మాట మాత్రమే కాదు, పార్టీ నాయకుల వద్ద ఆయన అంటున్న మాట కూడా ఇదే, అని పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నారు.అందుకే ఆయన ఓ వంక పార్టీ నాయకులను పరుగులు పెట్టిస్తున్నారు,మరో వంక ఈటలను ఎదుర్కునే అభ్యర్ధి కోసం వేట కొనసాగిస్తున్నారు. అలాగే, ఇంకో చేత్తో నియోజక వర్గం పై వరాల జల్లు కురిపిస్తున్నారు.  నిజంగా, హుజురాబాద్ లో పరిస్థితి ముఖ్యమంత్రినే కలవరానికి గురిచేసే విధంగా ఉందా... లేక ఇది కేసీఆర్ మార్క్  వ్యూహంలో భాగమా? అనే ప్రశ్న కుడా లేక పోలేదు. అయితే ఏందీ ఏమైనా ఒకే ఒక్క నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అంటే పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి హుజురాబాద్ ఉప ఎన్నికను, ఒక నియోజక వర్గానికి జరుగుతున్న ఎన్నికగా చూడడం లేదు, పార్టీ, కుటుంబ రాజకీయ భవిష్యత్తును తేల్చే .. మహా సంగ్రామంగా చూస్తున్నారు. ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి లెక్క తప్పింది. పరిస్థితి ఇంతవరకు వస్తుందని ఉహించలేదు. అయితే, ఈటల రాజేందర్ వ్యూహత్మకంగా హుజురాబాద్’లో పోటీ తనకు, కేసీఆర్‌కు మధ్యే అన్నట్లుగా  వాతావరణాన్ని మలచారు. నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో,ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోతే, అది కేసేఆర్ ఓటమిగా ముద్రపడుతుంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాల ఓటమిగానూ ప్రచారం జరుగుతుంది.పార్టీ పతనానికి చివరి మెట్టు అదే అయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నాఋ. అంతే కాదు హుజురాబాద్ ఉపఎన్నిక రేపటి ముఖ్యమంత్రి పీఠం ఎవరిదో నిర్ణయించే ఎన్నికగా కూడా భావిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి సర్వశక్తులు ఒడ్డుతున్నారని, పార్టీలోనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.  హుజురాబాద్ నియోజక వర్గంపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నారు.ఇప్పటికీ,నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్‌, జమ్మికుంట మునిసిపాలిటీల్లో రూ.66.85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరాలోనే  పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇదిగాక నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లోని 106 గ్రామపంచాయతీల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీణవంక మండలంలో రూ.23 కోట్లు, హుజూరాబాద్‌ మండలంలో రూ.15 కోట్లు, జమ్మికుంట మండలంలో రూ.7 కోట్లు, ఇల్లందకుంట మండలంలో రూ.10 కోట్లు, కమలాపూర్‌ మండలంలో రూ.45 కోట్లతో పనులను ప్రతిపాదించారు. ఇంత చేసిన తర్వాత కూడా గెలుపు మీద ధీమా లేక, దళిత బంధు, పథకం అమలుకు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. నిజానికి ఈ పథకాన్ని తీసుకోచ్చిందే హుజురాబాద్ కోసం.హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలో దళిత సామాజిక వర్గం ఓట్లు గణనీయ సంఖ్యలో (46వేల పై చిలుకు ) ఉన్నాయి. ఈ ఓట్లను గంప గుత్తగా కొల్ల కొట్టేందుకే ముఖ్యమంత్రి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు హుజురాబాద్ నియోజక వర్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. సరే, అధికార పార్టీ నాయకులు కరీంనగర్ సెంటిమెంట్’ను జత చేసే ప్రయత్నం చేస్తున్నా, జనాలకు మాత్రం ఇది ఉప ఎన్నికల పథకమే అని అర్థమైపోయింది.  అంతే కాకుండా, ఈ పథకం రాష్ట్ర బడ్జెట్ రూ. 1200 కోట్లు అయితే  పైలట్ ప్రాజెక్ట్ అమలుచేస్తున్న హుజురాబాద్ కే 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, పలు అనుమానాలకు తావిస్తోంది.   ఇదిలా ఉండగా ఈటల రాజీనామా తర్వాత ఒకే సారి అంతవరకు పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సంబంధించిన రూ.17.08 కోట్ల చెక్కులనూ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అది కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ఒక్క హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలోనే పంపిణి చేశారు.ఇలా ఉరుకులు పరుగుల మీద నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారంటే, ఈఒక్క సీటుకు ముఖ్యమత్రి ఏంట్ ప్రధాన్యత ఇస్తున్నారో అర్థం చేస్కోవచ్చునని పరిశీలకులు అంటున్నారు. అయితే, కేసీఆర్ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయడం అంటే, అది తమ గొయ్యి తామే తవ్వుకోవంతో సమానమనే మాట కూడా వినవస్తోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక గులాబీ బాస్ గుండెల్లో ఈటెలా సలుపుతోంది.

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యేల జంప్!

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లకు పైగానే సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. మోడీ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీ పదవుల విషయంలోనూ గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్. సీనియర్లను కాదని పైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన యువ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన కాంగ్రెస్ పెద్దలు.. పంజాబ్ లోనూ సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించినా సిద్దూకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టింది. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అయితే కాంగ్రెస్ కు కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేసింది బీజేపీ. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న కమల పార్టీ.. హస్తం పార్టీకి భారీ షాక్‌ ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీని నిలువునా చీల్చింది. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  బీజేపీలో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు తీరని నష్టమని చెబుతున్నారు.  గోవిందాస్‌ కొంతౌజమ్‌ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీసీసీకి చీఫ్‌ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్‌ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.