జల వివాదంలో కేసీఆర్ దూకుడు.. ఏపీ రియాక్షన్ ఏంటో?
posted on Jul 21, 2021 @ 10:16AM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింద ముదిరేలా కనిపిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసినా సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. కేంద్రం నిర్ణయంతో వివాదం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో మొదటి నుంచి దూకుడుగా వెళుతున్న తెలంగాణ సర్కార్ మరో సంచలనానికి తెర తీసింది. కేంద్రం గెజిట్‌పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కేసీఆర్ సర్కార్.. తాజాగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా జలాల్ని 50 శాతం నిష్పత్తిలో పంచాలంటూ కొత్త వివాదానికి ఆజ్యం పోసింది.
ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకూ కృష్ణా జలాల్ని ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది కేసీఆర్ సర్కార్. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరపాలని విజ్ఞప్తి చేసింది. రివర్ క్యాచ్మెంట్ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం.. ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని కోరింది. తెలంగాణలోనే కృష్ణా క్యాచ్ మెంట్ ఏరియా 70 శాతంగా ఉందని తన లేఖలో తెలంగాణ సర్కార్ వివరించింది. అంతేకాదు పెన్నా క్యాచ్ మెంట్ ఏరియాకు ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాశారు తెలంగాణ ENC మురళీధర్.
కృష్ణా నదీ పరివాహకం తమ ప్రాంతంలోనే అధికంగా ఉంది అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ 68 శాతం నదీ పరివాహకం ఉందని.. దాని ప్రకారం నీటి కేటాయింపులు జరపాలని లేఖలో కోరింది. అత్యల్ప పరీవాహకం ఉన్న ఏపీకి అధిక నీటి కేటాయింపులేంటని బోర్డు తీరును ప్రశ్నిస్తోంది. కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు ఏపీ తరలించుకుపోతోందని ఎప్పటినుంచో వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోసారి లేఖలో అదే విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా క్యాచ్‌మెంట్ ఏరియా ఆధారంగా నీటి కేటాయింపులు జరపాలని కోరుతోంది.
తెలంగాణ సర్కార్ లేఖపై కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుందున్నది ఆసక్తిగా మారింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం కృష్ణా జలాల్లో ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణలు 298 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ సర్కార్ తాజాగా సగం సగం పంచాలని కోరడంతో.. ఏపీకి వాటా భారీగా తగ్గనుంది. తెలంగాణ సర్కార్ తాజాగా రాసిన లేఖలో పొందుపరిచిన అంశాలతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఏపీ రాజకీయ వర్గాలు, ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తాజా లేఖపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.