సంజయ్ పాదయాత్రకు కాంగ్రెస్  కౌంటర్! రేవంత్ రెడ్డి దళిత దండోరా..

తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అన్ని పార్టీలో పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగానే ఎత్తులు వేస్తున్నాయి. ఆగస్టు 9 నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. చార్మీనార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభించనున్న సంజయ్.. హుజురాబాద్ భారీ బహిరంగ సభతో ముగించనున్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.  పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో జోష్ మీదున్న కాంగ్రెస్ కూడా వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయితే బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టనున్న రోజే కాంగ్రెస్ ప్రొగ్రామ్ ఉండేలా రూట్ మ్యాప్ ప్రకటించారు. దళిత బంధు పథకం పేరిట సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కార్యాచరణను టీపీసీసీ ప్రకటించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు ‘దళిత దండోరా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత గిరిజన దండోరా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఆగస్టు 9న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా నిర్వహిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా?.. 118 నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఓట్ల కోసం దళితులను మోసం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. 

'అప్పుల‌ప్ర‌దేశ్‌'పై కేంద్రం క‌న్నెర్ర‌! జీవీఎల్ ఎంట్రీతో జ‌గ‌న్‌కు చెక్ త‌ప్ప‌దా?

జీవీఎల్ న‌ర‌సింహారావు. ఊరికే రారు మ‌హానుభావుడు. ఆయ‌న వ‌చ్చారంటే.. ఎవ‌రికో ఎస‌రు పెడుతున్న‌ట్టే. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఢిల్లీలో తిష్ట‌వేసి.. ఇటు బీజేపీ త‌ర‌ఫున‌, అటు అన‌ధికారికంగా కేంద్ర ప‌క్షాన‌.. ఏపీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతుంటారు జీవీఎల్‌. చ‌క్క బెట్ట‌డం కంటే కూడా.. చిక్కు పెట్ట‌డంపైనే ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి సారిస్తుంటార‌నే పేరు. కొంత‌కాలంగా ఏపీ విష‌యంలో సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్న జీవీఎల్‌.. మ‌ళ్లీ ఇప్పుడు స్వ‌రం పెంచారు. ఏపీ వ్య‌వ‌హారాల్లో దూకుడు పెంచారు. ఆయ‌న ఎక్కువ ఫైనాన్సియ‌ల్ మేట‌ర్స్‌లోనే.. వేలు పెట్టి కెలుకుతుంటారు. పీడీ బిల్లులేవంటూ ఇటీవ‌ల‌ ఏపీ స‌ర్కారును నిల‌దీశారు. తాజాగా, ఏపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ముందు దోషిగా నిల‌బెట్టేలా.. అప్పులపై నిప్పులు చెరిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల‌ప్ర‌దేశ్‌గా మార్చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ అడ్డ‌గోలు విధానాల‌పై స్వ‌యంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  ఏపీ.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిప‌డ్డారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తీరోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అప్పులకోసమే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎస్‌డీసీ) ఏర్పాటు చేసినట్టుందని.. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందంటూ త‌ప్పుబ‌ట్టారు. ఈ విష‌యాల‌న్నిటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాన‌న్నారు జీవీఎల్‌. ఎస్‌డీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేయాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్ర‌తీరోజూ కొత్త అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారని.. ఏపీ అప్పులపై కాగ్‌, ఆర్బీఐతో ఆడిట్‌ చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్ అన్నారు.  జీవీఎల్ అభిప్రాయ‌మే బీజేపీ అభిప్రాయం. కేంద్రం ఏపీని టార్గెట్ చేయాల‌ని అనుకుంటే.. ముందు జీవీఎల్‌ను రంగంలోకి దింపుతుంది. ఆయ‌న‌తో ప్ర‌భుత్వ ప‌రువంతా తీయిస్తుంది. ఆ త‌ర్వాత యాక్ష‌న్‌లోకి దిగుతుంది. జీవీఎల్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే.. కేంద్రం జ‌గ‌న్ స‌ర్కారుకు స‌హాయ నిరాక‌ర‌ణ చేయ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో అభివృద్ధిని అట‌కెక్కించేసి.. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేసిన సీఎం జ‌గ‌న్ తీరుపై కేంద్రం గుర్రుగా ఉంద‌ని అంటున్నారు. అందుకే, జ‌గ‌న్ ముంద‌రి కాళ్ల‌కు బంధాలేసేందుకే జీవీఎల్‌తో కేంద్రానికి ఫిర్యాదు చేయించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత ఇక అస‌లైన యాక్ష‌న్ మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. అయితే, ఈ చ‌ర్య‌లు కేవలం ఆర్థిక‌ విధానాల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా? లేక‌, సీబీఐ విచార‌ణ‌,  జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దునూ ప్ర‌భావితం చేస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.   

కేసీఆర్‌ సోష‌ల్‌మీడియా స్టంట్స్‌!.. అందుకేనా ఆ ఫోన్ కాల్స్‌?

ట్రింగ్ ట్రింగ్‌.. ట్రింగ్ ట్రింగ్‌.. ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి హ‌లో అంటే.. అట్నుంచి కేసీఆర్ గొంతు. అంతే, మ‌నోడు ఫుల్ షాక్‌. ముఖ్య‌మంత్రే త‌న‌కు ఫోన్ చేయ‌డంతో ఫుల్ ఖుషీ. క‌ట్ చేస్తే.. క్ష‌ణాల్లో అన్ని టీవీ ఛానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ ద‌డ‌ద‌డ‌లాడుతుంది. స‌ర్పంచ్‌కు స్వ‌యంగా ఫోన్ చేసిన సీఎం.. రైతులు కాల్ చేసిన కేసీఆర్‌.. ఇలా గంట‌ల త‌ర‌బ‌డి న్యూస్ న‌డుస్తుంది. మీడియా హౌజ్‌ల‌న్నిటిలోనూ ఒక‌టే హంగామా న‌డుస్తుంది. ఫ‌లానా అత‌నికి కేసీఆర్ ఫోన్ చేశార‌ట‌.. ఫ‌లానా విష‌యం మాట్లాడార‌ట‌.. అంటూ రెండు మూడు రోజులు చ‌ర్చ న‌డుస్తుంది. ఇలా అనేక‌సార్లు జ‌రగటంతో ఇదంతా కావాల‌నే చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అనే వాద‌న వినిపిస్తోంది.  కేసీఆర్ ఫోన్ చేస్తారు.. అవ‌త‌లి వారు మాట్లాడుతారు.. మ‌రి, ఆ ఫోన్ కాల్స్‌ బ‌య‌ట‌కు ఎలా వ‌స్తున్నాయ్‌? ఆ కాల్ రికార్డ్ చేస్తున్న‌ది ఎవ‌రు? వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతున్న‌ది ఎవ‌రు? మీడియాకు లీక్ చేస్తున్న‌ది ఎవ‌రు? అనే అనుమానం ఎవ‌రికైనా వ‌చ్చిందా? ఒక‌వేళ వ‌చ్చినా.. ఆ జోష్‌లో ఆ విష‌యాన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఇదంతా ప‌క్కా ప్లాన్డ్‌గా సాగుతున్న ప్ర‌మోష‌న్ అని అంటున్నారు.  తాజాగా, ద‌ళిత బంధు ప‌థ‌కంపై మాట్లాడుకుందామంటూ జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడటం వైర‌ల్‌గా మారింది. ఎప్ప‌టిలానే ఆ ఫోన్ కాల్‌తో కొన్ని గంట‌ల పాటు మీడియా హౌజెస్ పండ‌గ చేసుకున్నాయి. ఈ ఎపిసోడ్‌తో అంద‌రికంటే సీఎం కేసీఆరే చాలా సంతోషించి ఉంటారు. ఎందుకంటే, జ‌స్ట్ ఒక్క నిమిషం ఫోన్ కాల్‌తో.. ద‌ళిత బంధు గురించి, కేసీఆర్ గురించి.. తెలుగు రాష్ట్రాల్లో రోజంతా తెగ చ‌ర్చ న‌డిచింది. పైసా ఖ‌ర్చు లేకుండా సింపుల్‌గా ఇంత ప్ర‌చారం మ‌రే ర‌కంగానైనా వ‌స్తుందా? రెండేళ్లుగా సీఎం కేసీఆర్ ఫోన్ కాల్స్‌తో మంచి డ్రామా పండిస్తున్నారు. 2019లో మంచిర్యాల జిల్లాకు చెందిన యువ‌రైతు శ‌ర‌త్.. త‌న భూమికి వేరొక‌రి పేరుమీద ప‌ట్టా చేశారని ఆరోపిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ముఖ్య‌మంత్రి దృష్టికి రావ‌డంతో.. కేసీఆరే స్వ‌యంగా శ‌ర‌త్‌కు ఫోన్ చేసి ఆయ‌న స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయ్యాక‌.. ఆ విష‌యాన్ని మ‌ళ్లీ ఫేస్‌బుక్‌లో పెట్టాలంటూ కేసీఆరే రిక్వెస్ట్ చేయ‌డం.. ఆయ‌న అస‌లు ఉద్దేశ్యాన్ని చెప్ప‌క‌నే చెబుతుంది. ఆ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ధ‌ర‌ణి వెబ్‌సైట్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అదే స‌మ‌యంలో యువ‌రైతు శ‌ర‌త్ రెవెన్యూ అధికారుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని.. కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా వాడుకున్నారు. రెవెన్యూ శాఖ‌లో ఇలాంటి అరాచ‌కాలు జ‌రుగుతుంటాయ‌ని.. అందుకే తాను ధ‌ర‌ణి వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టాన‌ని మెసేజ్ ఇచ్చారు. ఆ ఫోన్ కాల్ అప్ప‌ట్లో వైర‌ల్ కావ‌డం.. మీడియాలో హ‌డావుడి జ‌ర‌గ‌డం.. రెవెన్యూ శాఖ‌పై విమ‌ర్శ‌లు.. ధ‌ర‌ణి కావాలంటూ డిమాండ్లు.. ఇలా కాగ‌ల కార్యాన్ని చాలా సులువుగా  ఫోన్‌కాల్‌తో సాధించుకున్నారు కేసీఆర్‌. అప్ప‌టి నుంచీ ఆయ‌న అప్పుడ‌ప్పుడూ ఇలా ఫోన్‌కాల్ ట్రిక్‌ను చాక‌చ‌క్యంగా ప్ర‌యోగిస్తున్నార‌ని అంటున్నారు.  గ‌తంలోనూ చాలాసార్లు కేసీఆర్ ఈ టాక్‌ట్రిక్స్ ప్లే చేశారు. జూన్‌లో తాను ద‌త్త‌త తీసుకున్న యాదాద్రి జిల్లా వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌కు ఫోన్ చేసి.. తాను గ్రామానికి వ‌స్తున్నానని.. అంత క‌లిసి మాట్లాడుకుందామ‌ని.. క‌లిసి భోం చేద్దామంటూ ఫోన్ చేశారు. సీఎం.. వాసాల‌మ‌ర్రికి వెళ్లేదాక ఆ ఫోన్ కాల్ తెగ వైర‌ల్ అవుతూనే ఉంది. ఇదే క‌దా కేసీఆర్‌కు కావ‌ల‌సింది..! ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్‌కు చెందిన నాగిరెడ్డి అనే రైతుకు ఫోన్ చేసి ఆలుగ‌డ్డ సాగుపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గ‌తేడాది జులైలో జ‌గిత్యాల‌కు చెందిన ఓ రైతుకు కేసీఆర్ ఇలానే ఫోన్ చేశారు. వ‌ర‌ద కాలువ నిర్మాణం, ముంపు క‌ష్టాల‌పై మాట్లాడారు. తెలంగాణ వారికే కాదు.. ఆంధ్ర ప్ర‌జ‌ల‌కూ కేసీఆర్ ఫోన్లు చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. 2020 డిసెంబ‌ర్‌లో కృష్ణా జిల్లా ఘంట‌శాల‌కు చెందిన ఆద‌ర్శ రైతు ఉప్ప‌ల ప్ర‌సాద‌రావుకు ఫోన్ చేసి సీడ్రిల్ ఆధునిక వ్య‌వ‌సాయ యంత్రాల ప‌నితీరు, లాభాల గురించి వివ‌రాలు క‌నుక్కున్నారు.  ఇలా, ప‌లుమార్లు కేసీఆర్ ఫోన్‌కాల్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే, కేసీఆర్ చేసే అన్ని కాల్స్ బ‌య‌ట‌కు రావు. తాను కావాల‌నుకున్న‌, కావాల‌ని చేసిన కాల్స్‌ను మాత్ర‌మే ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వైర‌ల్ చేస్తుంటారు. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చెన్నై ఆసుప‌త్రిలో స‌ర్జ‌రీ జ‌రిగితే.. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆ ఫోన్ కాల్ బ‌య‌ట‌కు రాలేదు. అంటే, ఆ విష‌యాన్ని పబ్లిసిటీకి వాడుకోవాల‌ని భావించ‌లేదు కేసీఆర్‌. అలానే అనేక అంశాల‌పై వివిధ వ‌ర్గాల ప్ర‌ముఖుల‌కు, అధికారుల‌కు, కేంద్ర ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌కు సీఎం కేసీఆర్ ఫోన్లు చేస్తూనే ఉంటారు. అవేవీ రికార్డు అవ‌వు.. బ‌య‌ట‌కు రావు.. కేవ‌లం, కేసీఆర్ ఏ విష‌యంపైనైతే చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుకుంటారో.. ఏ టాపిక్ అయితే మీడియాలో హ‌డావుడి జ‌ర‌గాల‌ని భావిస్తారో.. ఆ స‌మ‌యంలో ఆయ‌న కావాల‌నో ఫోన్ చేస్తుంటారు.. ఆ కాల్‌ను ఆయ‌నే రికార్డు చేస్తుంటారు.. ఆ ఆడియాను మీడియాకు లీక్ చేసి.. త‌నకు కావాల్సిన‌ ప్ర‌యోజ‌నం పొందుతుంటారు. ఇలా వైర‌ల్‌గా మారే ఫోన్‌కాల్స్ య‌వ్వార‌మంతా.. కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో జ‌రిగేవే అంటున్నారు.   

తిరుపతి యువకుడికి ప్రధాని మోడీ ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ లోని తిరుప‌తికి చెందిన సాయి ప్ర‌ణీత్ అనే యువ‌కుడిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌శంసించారు. మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోడీ.. సామాజిక మాధ్య‌మాల్లో రైతుల‌కు ఏపీ వెదర్ మ‌న్ పేరుతో వాతావ‌ర‌ణ స‌మాచారం అందిస్తూ సాయి ప్ర‌ణీత్ మంచి పని చేస్తున్నార‌ని చెప్పారు. బెంగ‌ళూరులో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తోన్న సాయి ప్ర‌ణీత్ రైతుల‌కు అందిస్తోన్న సేవ‌ల‌కు గాను ఐక్య‌రాజ్య‌స‌మితి, భార‌త వాతావ‌ర‌ణ శాఖ నుంచి కూడా గ‌తంలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆయ‌న సేవ‌ల‌ను మ‌న్ కీ బాత్‌లో మోడీ ప్ర‌స్తావించారు. చండీగ‌ఢ్‌కు చెంద‌ని 29 ఏళ్ల సంజ‌య్ రాణాను కూడా మోదీ ప్ర‌శంసించారు. ఆ యువ‌కుడు ఫుడ్ స్టాల్ ను నిర్వ‌హిస్తుంటాడ‌ని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భ‌తూర్ అనే వంట‌కాన్ని అమ్ముతుంటాడ‌ని మోడీ అన్నారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయ‌న ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడారు. త‌మిళ‌నాడులోని నీల‌గిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మ‌హిళ అంబ‌ర్క్స్ ప్రాజెక్ట్ చేప‌ట్టి సేవ‌లందిస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌శంసించారు. కొండ ప్రాంతాల ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు వెళ్లేందుకు ప‌డుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని  వారి కోసం ఆమె ఉచితంగా ర‌వాణా స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. త‌న స‌హ‌చ‌ర ఉద్యోగుల వ‌ద్ద విరాళాలు సేక‌రించి ఆమె ఈ సేవ‌లు కొన‌సాగిస్తున్నార‌ని ప్రధాని వివ‌రించారు. ఆమె మొత్తం ఆరు అమ్‌బ‌ర్క్స్  స‌ర్వీసులు న‌డిస్తున్నార‌ని కొనియాడారు. ప్రజలకు కొవిడ్ జాగ్రత్తలు చెప్పారు ప్రధాని మోడీ. పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రుపుకునే స‌మ‌యంలో క‌రోనా ఇంకా తొల‌గిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని  సూచించారు. క‌రోనా ఇంకా మ‌న మ‌ధ్యే ఉంద‌ని, కొవిడ్ నియంత్ర‌ణ నియ‌మాల‌ను మ‌ర్చిపోకూడ‌ద‌ని మోడీ తెలిపారు. ఒలింపిక్ ప్లేయర్లు ఎన్నో కష్టాలు భరించి... ఆ స్థాయి కి వెళ్లారన్న ప్రధాని మోడీ.. వారిని సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని కోరారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు. జులై 26న కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన మోడీ.. మన భారత సైనికుల నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలను ప్రపంచ దేశాలు చూశాయన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు  శ్రద్ధాంజలి ఘటించమని, సలాం చెయ్యమని దేశ ప్రజలను కోరారు. కార్గిల్ విజయ గాథను చదవాలని విద్యార్థులను కోరారు ప్రధాని మోడీ. 

ఆగస్టులోనే థర్డ్‌ వేవ్‌!.. ఈసారి మ‌రింత డేంజ‌ర‌స్‌...!

క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు పోయాయి. జ‌నం రోడ్ల‌పై విచ్చ‌ల‌విడిగా తిరిగుతున్నారు. ఇన్నాళ్లూ ఆంక్ష‌ల‌తో కంట్రోల్లో ఉన్న ప్ర‌జ‌లు.. ఇప్పుడు ఒళ్లు విరుచుకుని విహారం చేస్తున్నారు. గుళ్లు, గోపురాలు, షాపులు, ప‌ర్య‌ట‌న‌లు, బంధువులు, పార్కులు, మాల్స్‌.. ఇలా అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఏదో ఒక సాకుతో, ప‌నితో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. క‌రోనా పోయింద‌ని బిందాస్‌గా ఉంటున్నారు. కానీ, క‌రోనా ఎక్క‌డికీ పోలేద‌ట‌. ఇంకా మ‌న మ‌ధ్య‌నే తిరుగుతోంద‌ట‌. ఫ‌స్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్‌కు మ‌ధ్య బ్రేక్ ఇచ్చిన‌ట్టుగానే.. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్‌తో దాడి చేసేందుకు సిద్ధంగా ఉంద‌ట‌. అందుకు ఎంతో టైమ్ కూడా లేద‌ని.. ఈ ఆగ‌స్టులోనే థ‌ర్డ్ వేవ్ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.  మ‌న ద‌గ్గ‌ర రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు.. పాజిటివిటీ రేటు నిలకడగా ఉన్నాయి కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. భార‌త్‌లో మొదటి, రెండో దశలు.. తొలుత కేరళ తర్వాత మహారాష్ట్ర అనంతరం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆ క్ర‌మంలో ఇప్పుడు మ‌రోసారి కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండ‌టం థ‌ర్డ్ వేవ్‌కు సంకేతంగా భావిస్తున్నారు. కేరళలో పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ 9 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల నమోదులో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండ‌టం ఆందోళ‌న‌క‌ర విష‌యం. థ‌ర్డ్ వేవ్ ఏపీపై తీవ్ర ప్ర‌భావం చూపే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.  ఏపీలో రోజుకు స‌గ‌టున 2వేల కేసులు వ‌స్తున్నాయి. పాజిటివిటీ రేటు 2.1 నుంచి 2.6 శాతం వరకూ ఉంది. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. ఆయా జిల్లాల్లో కేసులు పెరుగుతాయి తప్ప.. తగ్గక‌పోవ‌డంతో.. థ‌ర్డ్ వేవ్ ముంద‌ర ఏపీ ఉంద‌ని అంటున్నారు. సుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏ వారానికి ఆ వారం కర్ఫ్యూను పొడిగించుకుంటూ వస్తోంది. మూడోదశను దృష్టిలో పెట్టుకునే కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ఫ్యూ అమలులో ఉన్న‌ తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరుజిల్లాల్లో కేసుల ఎక్కువగా నమోదవుతున్నాయి.  దేశవ్యాప్తంగా 67 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉందని సీరో సర్వే ద్వారా వెల్లడవుతుంది. ఏపీలో కూడా దాదాపు 70శాతంపైన హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉన్నట్లు సీరో సర్వేతో తేలింది. అయితే, రెండో దశ ఉధృతిని హెర్డ్‌ ఇమ్యూనిటీ నియంత్రించలేకపోయింది. మూడో దశ ప్రభావం తొలి రెండుదశల స్థాయిలో ఉండొచ్చని అంచ‌నా. జాగ్రత్తగా లేక‌పోతే మ‌రింత ప్ర‌మాద‌క‌రం. వ్యాక్సినేష‌న్ ఎంత వేగంగా జ‌రిగితే.. అంత ఉప‌యోగం. 

పప్పు అంటూ కేటీఆర్ ట్వీట్..  సోషల్ మీడియాలో రచ్చ 

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ లీడర్లు, కార్యకర్తలు హంగామా చేశారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన పేరుతో భారీగా మొక్కలు నాటి కేటీఆర్ కు శుభాకాంక్షలు  చెప్పారు. టీఆర్ఎస్ నేతలతో పాటు వివిధ పార్టీల నేతలు కూడా కేటీఆర్ కు  విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జాతీయ స్థాయిలోని ప్రముఖులు కూడా కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.  కేటీఆర్ బర్త్ డే రోజున ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. థ్యాంక్యూ పప్పు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పప్పు అన్న పదానికి చాలా స్టోరీ ఉంది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీని విపక్ష నేతలు పప్పు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వైసీపీ నేతలు లోకేష్ అని కామెంట్ చేస్తుంటారు. దీంతో కేటీఆర్ పప్పు అని చేసిన కామెంట్ ఆసక్తి రేపింది.   అయితే కేటీఆర్ చేసిన పప్పు ట్వీట్ వెనుక అసలు విషయంలోకి వెళితే.. ఎమ్మెల్సీ కవిత  తన సోదరుడు కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ''హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మరిన్ని విజయాలు సాధించాలి.'' అంటూ కవిత ట్వీట్ చేశారు. సోదరి కవిత ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ పప్పు.. అని రిప్లై ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ నేతలతో పాటు సామాన్య జనాలు కూడా వెరైటీగా స్పందించారు. నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. మరికొందరు సెటైర్లు వేశారు. కవితను మీరు పప్పు అని పిలుస్తారా? అని నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నించారు.  మొత్తానికి కవిత నిక్ నేమ్ తొలిసారి బయటపెట్టారు అంటూ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్ తో ఇంట్లో కవితను పప్పు అనే ముద్దు పేరు ఉందనే విషయం బయటకు వచ్చింది. చిన్నప్పుడు కవితను పప్పు అన్న పేరుతోనే అందరూ పిలిచేవారని చెబుతున్నారు.      

పీవీ సింధు విన్.. సొనియా జోడీ అవుట్

టొక్సో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జే తొలి మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై సునాయసనంగా గెలిచింది. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించింది. సూపర్ ఫామ్ కొనసాగించిన సింధు.. కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. తన తరువాతి మ్యాచ్‌లో సింధు హాంగ్‌కాంగ్‌కు చెందిన చెయుంగ్ గాన్‌తో తలపడనుంది.  ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 575 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా, యశస్విని 574 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. చివరి షూటర్ 577 పాయింట్లతో ఫైనల్స్‌కు అర్హత సాధించారు. దీంతో రెండు పాయింట్ల తేడాతో మనుబాకర్ ఫైనల్‌కు వెళ్లలేకపోయారు.  ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో హైదరాబాదీ ,మాజీ ఒలింపియన్ సానియా మిర్జా జోడి తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. ఉక్రెయిన్‌కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్..  సానియా మిర్జా, అంకితా రైనా జోడిని ఓడించారు. భార‌త్‌పై ఉక్రెయిన్ 6-0, 6-7, 8-10 తేడాతో గెలిచింది. తొలి సెట్ ను బాగా సోనియా మీర్జా జోడి.. ఆ త‌ర్వాత ఏ మాత్రం రాణించ‌లేక‌పోయారు. తొలి సెట్‌ను 6-0తో కైవసం చేసుకోగా, అనంత‌రం రెండు సెట్లలో ఓడిపోయారు. మొద‌ట సానియా జోడి రెండో సెట్‌లో 5-3 తేడాతో లీడ్‌లో కొన‌సాగింది. ఆ త‌ర్వాత మాత్రం ఉక్రెయిన్ క్రీడాకారిణుల‌పై సానియా జోడి పైచేయి సాధించ‌లేక‌పోయింది. 

వెండి వెలుగుల‌ వెనుక క‌ష్టాలెన్నో.. మీరాబాయి లైఫ్ స్టోరీ..

ఒలింపిక్స్‌లో ర‌జతం సాధించ‌డంతో ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా మీరాబాయి పేరు మారుమోగుతోంది. ఇప్పుడామె ఓ సూప‌ర్‌స్టార్‌. ప్ర‌శంస‌లు.. న‌జ‌రానాలకు కొద‌వే లేదు. అయితే, టోక్యో వ‌ర‌కు ఆమె ప్ర‌యాణం  అంత సాఫీగా సాగ‌లేదు. ఈ విజ‌యం వెనక అనేక‌ త్యాగాలు.. అంత‌కుమించి అవమానాలు. గెలవాలనే ప‌ట్టుద‌ల‌.. ప‌త‌కం సాధించాల‌నే త‌ప‌నే.. ఆమెను ఒలింపియ‌న్‌గా నిల‌బెట్టింది. ర‌జితంతో మెరిసేలా చేసింది.  ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో 1994, ఆగస్టు 8న ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్‌ కాక్‌చింగ్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది మీరాబాయి చాను. బడికెళ్లే వయసులో విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజరాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. వంటకోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో అడవికి వెళ్లేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ.  మీరాబాయి స్వస్థలంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ శిబిరాలు లేక‌పోవ‌డంతో ఆమె రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్‌ అనితా చాను వెదురు బొంగులతో సాధన చేయించేది. రోజూ వెదురుబొంగులు తెప్పించడం.. వాటికి బరువులు పెట్టి మోయిస్తూ టెక్నిక్స్‌ నేర్పించేది. మీరాబాయి వేగంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో 48 కిలోల విభాగంలో రజతం గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనా.. ఒత్తిడి తట్టుకోలేక అనర్హతకు గురైంది.  ఆ త‌ర్వాత‌ రోజూ ఆరు గంటలకుపైగా సాధన చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో కొత్త మెలకువలు నేర్చుకుంది. మీరాబాయి కఠిన శ్రమకు ఫలితాలు లభించసాగాయి. 2017లో అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. 2018లో రాజీవ్‌ ఖేల్‌రత్న, పద్మశ్రీ వ‌రించాయి. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో ర‌జతం గెలిచింది.  ‘రియో ఒలింపిక్స్‌లో ఓటమి చెందినప్పుడే నిర్ణయించుకున్నా.. నేనేంటో టోక్యోలో నిరూపించుకోవాలని అని మీరాబాయి చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఐదేళ్లలో ఐదు రోజులు మాత్రమే ఇంటిదగ్గర ఉన్నా. ఇప్పుడు ఈ పతకంతో ఊళ్లో అడుగుపెడతా’ అంటూ రజత పతకం సాధించాక చెప్పిన మాటలే చాను పట్టుదలకు, మనస్తత్వానికి నిద‌ర్శ‌నం.  టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. రూ.కోటి నజరానాతో పాటు ఓ ప్ర‌భుత్వ‌ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాబాయి చానుకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు చెప్పారు.   

రాజీనామాల‌పై చంద్ర‌బాబు స‌వాల్‌.. స‌ర్కారు ఎస్కేప్‌.. అందుకే అంత‌ భ‌య‌మా?

అధికారంలో ఉన్నారు. సంక్షేమం పేరుతో డ‌బ్బులు పంచుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో గెలిచారు. అయినా, టీడీపీ అంటే భ‌యం. ఇంకా చంద్ర‌బాబు అంటే వ‌ణుకు. కార‌ణం, వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నే విష‌యం వారికి స్ప‌ష్టంగా తెలుసు. అమ‌రావ‌తి, క‌రోనా క‌ట్ట‌డి నుంచి జాబ్ క్యాలెండ‌ర్ వ‌ర‌కూ రెండేళ్లుగా జ‌నం.. జ‌గ‌న్‌పై ఎంత అసంతృప్తి, అస‌హ‌నంతో ఉన్నారో పాల‌కుల‌కు బాగా తెలుసు. క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ముట్ట‌డిల‌తో ప్ర‌జ‌ల నుంచి ఎగిసిప‌డుతున్న ఆగ్ర‌హ‌జ్వాల‌లే అందుకు నిద‌ర్శ‌నాలు.  ఇక‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎలా గెలిచారంటారా? ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు, బెదిరింపులు, అక్ర‌మాలు, దొంగ ఓట్ల‌తో గ‌ట్టెక్కారో ఏపీలో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అందుకే, రాజీనామాలంటే భ‌య‌ప‌డుతున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌లంటే వ‌ణికిపోతున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబే.. ఎల‌క్ష‌న్ల‌కు బెద‌ర‌కుండా విశాఖ ఉక్కు, ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాల‌కు సిద్ధ‌మా అని స‌వాల్ విసిరితే.. వైసీపీ మాత్రం రాజీనామాల‌కు ముఖం చేటేస్తోంది. స‌వాల్ స్వీక‌రించ‌కుండా త‌ప్పించుకుంటోంది.  ఇక‌ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ముఖ్య‌మంత్రి త‌ర్వాత ముఖ్య‌మంత్రి అంత‌టివాడైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అయితే.. రాజీనామాల విష‌యంలో మ‌రీ దిగ‌జారి మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలనుకుంటే మీరే చేసుకోండంటూ పిరికిత‌నం ప్ర‌ద‌ర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని సజ్జల మాట్లాడ‌టం.. ఎన్నిక‌లంటే వైసీపీలో క‌లుగుతున్న క‌ల‌వ‌ర‌పాటుకు నిద‌ర్శ‌నం అంటున్నారు.  గ‌తంలో అధికారంలో ఉండిమ‌రీ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంతో అలుపెర‌గ‌ని పోరాటం చేసిన‌.. ఎంపీలంతా రాజీనామ చేసిన ఘ‌న‌త టీడీపీది. చంద్రబాబు ఆదేశాల‌తో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ కోసం ప‌ద‌వుల‌ను తృణ‌పాయంగా వ‌దిలేశారు తెలుగుదేశం ప్ర‌జాప్ర‌తినిధులు. అయితే, కేంద్రంతో అంట‌కాగుతూ.. ఢిల్లీకి గులాంగిరీ చేస్తూ.. ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాల‌రాస్తోంది వైసీపీ. బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉందంటూ.. మ‌న‌మేమీ చేయ‌లేమంటూ.. ప్ర‌త్యేక హోదా నినాదాన్ని ఎప్పుడో అట‌కెక్కించేశారు. రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు పార్ల‌మెంట్‌లో ఉత్తుత్తి నినాదాలు చేస్తున్నారు. పోల‌వ‌రం నిధుల కోసం గ‌ట్టిగా నిల‌దీసింది లేదు. విశాఖ ఉక్కును అంగ‌డి స‌రుకుగా అమ్ముకుంటున్నా.. ఉద్య‌మిస్తున్న‌ది లేదు. చంద్ర‌బాబు ఓ అడుగు ముందుకేసి.. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటానికి సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించినా.. ప్ర‌భుత్వం నుంచి ఉలుకూప‌లుకూ లేదు. ఇంత‌టి చేత‌గాని, చేష్ట‌లుడిగిన ప్ర‌భుత్వాన్ని ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌లేదంటూ మండిప‌డుతున్నారు ప్ర‌జ‌లు. అయితే, జ‌గ‌న్ జుట్టు కేంద్రం చేతిలో ఉండ‌టం.. సీబీఐ కేసుల ఉచ్చు బిగిస్తుండ‌ట‌మే.. ఢిల్లీకి జ‌గ‌న్ దాసోహమ‌వ‌డానికి కార‌ణ‌మ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. నేరం జ‌గ‌న్ చేస్తే.. శిక్ష ఏపీ అనుభ‌వించాల్సి వ‌స్తోంద‌ని ఆగ్ర‌హంతో కూడిన ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు.   

కేటీఆర్ కు విషెష్ చెబుతూ సెటైర్లు.. షర్మిలను ఆటాడుకున్న నెటిజన్లు 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా  ఘనంగా నిర్వహించారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా పార్టీ శ్రేణులతోపాటు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కేటీఆర్ కు బర్త్ డే విషెష్ చెబుతూ దేశ వ్యాప్తంగా ప్రముఖులు ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి. రాజకీయాలకు అతీతంగా నేతలు ఆయనకు విషెస్ చెప్పారు.  వైఎస్ఆర్ టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన్ను నేరుగా మంత్రి కేటిఆర్‌గా కాకుండా మరోసారి సీఎం కేసిఆర్ గారి కొడుకు కేటిఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గతంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూనే సెటైర్లు వేశారు.ఆయనకు భగవంతుడు ఆయురాగ్యోలతోపాటు రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే శక్తిని ఇచ్చే విధంగా లక్షా 91 వేల ఉద్యోగ ఖాలీలను భర్తి చేసే పట్టుదలను ఇవ్వాలని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతోపాటు 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నానని షర్మిల ట్వీట్ చేశారు. చివరి ట్విస్ట్ గా వనపర్తికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని లావణ్య ఆత్మహత్య చేసుకున్న వీడియోను కానుకగా ఇస్తున్నాట్టు ఆ వీడియోను పోస్టు చేసింది.  కేటీఆర్ కు విషెస్ చెబుతూ షర్మిల పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బర్త్ డే రోజున ఇలాంటి పోస్టులు ఏంటని కొందరు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇదివరకు కేటీఆర్ ఎవరో తెలియదని చెప్పావ్ మరి విషెస్ దేనికని మరికొందరు ప్రశ్నించారు.  షర్మిల ఎన్ని జిమ్మిక్కులు చేసినా..తెలంగాణలో ఆమె పార్టీకి ఉనికి ఉండదని మరికొంతమంది అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం షర్మిలను విపరీతంగా ట్రోల్ చేశారు. చంద్రకాంత్ రెడ్డి మొదటి భార్య, బ్రదర్ అనీల్ శాస్త్రీ రెండో భార్య షర్మిలకు కృతజ్ఞతలు అంటూ విరుచుకుపడ్డారు. కరోనాను కాలితో తొక్కి చంపే, వానలను తిట్లతో ఆపే మత ప్రచారకుడి  సెకండ్ హ్యాండ్ బాణం అంటూ కౌంటర్లు వేశారు. బాబాయ్ లాగా తనకు అవుతుందోమోనన్న భయంతోనే తెలంగాణకు షిప్ట్ అయిందని మరికొందరు ఆరోపిస్తూ పోస్టులు పెట్టారు.  మొత్తానికి కేటీఆర్ బర్త్ డే రోజున వైఎస్ షర్మిల చేసిన పోస్టు రాజకీయంగా రచ్చగా మారింది. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలో హుందాగా వ్యవహరించాలని.. కాని షర్మిల ఓవరాక్షన్ చేసిందనే విమర్శలే ఎక్కువగా వినిపించాయి. చంద్రబాబు, జగన్ సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు పద్దతిగా చెప్పుకుంటారని, షర్మిల తీరు సరిగా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిపక్వత లేనట్లుగా షర్మిల వ్యవహరిస్తున్నారనే  టాక్ జనాల నుంచి కూడా వస్తోంది.  

గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి.. వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తున్న వేళ... ఆ ఎమ్మెల్యే మాత్రం అందుకు వ్యతిరేకమైన కామెంట్లు చేశారు. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టం అమలు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గోవధ చట్టంపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి.  భారత్‌లో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటన్నారు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదన్నారు. లౌకిక దేశంలో గోవు పూజించేవారికి పూజించే వస్తువని, తినే వారికి ఆహార వస్తువన్నారు. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు.  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగధల్ బక్రీద్ పండుగ రోజు గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నాయని కూడా వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. మైనార్టీలపై గోవధ చట్టం పేరుతో రాద్ధాంతం చేయడం కరెక్టు కాదన్నారు.  వైసీపీ ఎమ్మెల్యే గా చెప్పడం లేదంటూనే అతి సున్నితమైన గోవధ చట్టాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చెన్నకేశవ రెడ్డి. మునులు గోవులను తిన్నట్టుగా తాను విన్నానని వ్యాఖ్యానించారు. గోవధ నియంత్రణ యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు మన చట్టాల్లో ఈ కాలానికి అవసరం లేని చట్టాలు తొలగించాలని సూచించారు. గోవులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆహార వస్తువులుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.లౌకికవాదిగా చెప్తున్నానంటూనే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.    

అశ్లీల కాల్స్‌ పేరిట మెస్సెజ్‌.. చివరికి ఇలా.. 

ప్రజలు డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకుంటున్నారు. అందుకు కస్టపడి పనిచేయడం వదిలేసి అడ్డదారిలో డబ్బు సందపాదించాలనుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువైతున్నాయి.  కాల్ గర్ల్స్‌ పేరిట మెసెజ్‌లు పంపడం, అశ్లీల వీడియోలను, ఫొటోలను కొంత మందికి  పంపించడం లాంటివి చేసి వల పన్నేవారు. దీంతోపాటు అశ్లీల వీడియో కాల్స్‌ చేయిస్తామంటూ రూ.300ల నుంచి రూ.5వేల వరకూ డిమాండ్‌ చేసేవారు. పాపం ఆ ముసుగు మాటున ఏంజరుగుతుందో తెలుసుకోలేని కొంత మంది పిచ్చి జనం డబ్బులు పంపించి మోసపోవడం జరుగుతుంది. అలాంటి ముఠా ఆటకట్టించారు ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసులు. అశ్లీలమైన విడియోలను, ఫోటోలను పంపి ఆన్ లైన్ విడియో కాల్స్ చేయిస్తామని డబ్బు దండుకుంటున్న  ఇద్దరు కిలాడి వ్యక్తులను  అరెస్టు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్‌ సీఐ కె. కళావెంకటరమణ తెలిపారు. నిందితులు మార్కెటింగ్ యాప్స్ వినియోగించుకుని సాధారణ ప్రజలకు కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తామని, అశ్లీల విడియో కాల్స్ చేయిస్తామని రూ.300 ల నుంచి రూ. 5,000 వరకు దండుకుంటున్నారని తెలిపారు. ఈ ముఠా పలు యాప్‌లను ఉపయోగించి.. ఒకేసారి 100 నుంచి 1000 మంది వరకు బల్క్ మేసేజ్‌లు పంపేవారని తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది వీరి వలలో చిక్కుకొని అత్యధికంగా డబ్బులు చెల్లించేవారని తెలిపారు. ఈ విధంగా చాలామంది మోసపోయినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఆ తర్వాత నిందితులు.. బాధితులను ఫోన్‌ ద్వారా భయపెడుతూ డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు. ఈ ఘటనలో పగిడ్యాల గ్రామానికి చెందిన తెలుగు జనార్ధన్, కర్నూలుకు చెందిన బెస్త ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు దాదాపు రెండేళ్ల నుంచి ఈ విధంగా మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.  పలువురి నుంచి అందిన సమాచారం మేరకు.. తమ బృందం వారిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఇలా రోజుకు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ మేరకు నిందితులకు సంబంధించిన పలు బ్యాంక్ అకౌంట్లను గుర్తించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్స్, మహేంద్ర కంపెనీ కారు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కళావెంకటరమణ అన్నారు.  హైదరాబాద్ లో మరో ఘటన..  రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్‌లో చందన నాగ రవిరాజా, చందన సునీత అలియాస్ అనూష అనే భార్యాభర్తలిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు . పక్కా సమాచారం మేరకు వారిని సరూర్ నగర్, రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో జూన్ 15వ తేదీన పట్టుకున్నట్లు తెలిపారు. వారితో పాటు ఒక విటుడిని, బాధితురాలైన ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్ ఉత్తర్వులకు అనుగుణంగా జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ దంపతులు యువతులకు ఉపాధి కల్పించే నెపంతో మాయమాటలు చెప్పి ఆపై బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్నారు. కాలేజీకి వెళ్లే స్టూడెంట్లనే వీరు టార్గెట్‌గా పెట్టుకున్నారని, ఇలాంటి వారి మాయమాటలను నమ్మొద్దని సీపీ సూచించారు. కాగా ఈ దంపతులను శుక్రవారం చెర్లపల్లి, చంచల్ గూడ సెంట్రల్ జైళ్లకు తరలించినట్లు చెప్పారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందన్నారు.

క‌విత‌కు 6 నెల‌లు జైలు.. కేసీఆర్‌కు షాక్‌..

ఓట‌ర్లకు డ‌బ్బులు పంచ‌డం.. చాలా పెద్ద‌ నేరం. అయితే, ఈ విష‌యాన్ని నాయ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా పట్టించుకోరు. ఎల‌క్ష‌న్లు రాగానే.. నోట్లు వెద‌జ‌ల్లి ఓట్లు రాల్చుకుంటారు. ఐదేళ్లు ఏం ప‌ని చేయ‌క‌పోయినా.. పోలింగ్‌కు ముందు రెండు రోజులు మాత్రం బాగా ప‌ని చేస్తారు. ల‌క్ష్మీక‌టాక్షంతో ఓట‌ర్ల జేబులు క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. పోటీ ఎంత ఉంటే అంత ధ‌ర ప‌లుకుతుంటుంది. ఓటుకు 500 నుంచి 5000 వ‌ర‌కూ పంచుతుంటారు. బ‌య‌ట‌కు మాత్రం తామేమీ ఖ‌ర్చు చేయ‌లేదంటూ.. ఈసీ నిబంధ‌న‌ల మేర‌కే ఖ‌ర్చు పెట్టిన‌ట్టు లెక్క‌లు చూపుతారు. ఇలాంటి విష‌యాల్లో కేసులూ భారీగానే న‌మోద‌వుతుంటాయి కానీ, చాలా అరుదుగా మాత్ర‌మే శిక్ష‌లు ప‌డుతుంటాయి.  తాజాగా, అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి ఓటుకు నోటు కేసులో శిక్ష ప‌డింది. మహబూబాబాద్ టీఆర్ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.  పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీసస్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు రూ. 10వేల జరిమానాను ఎంపీ చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.    

ఒలంపిక్ మెడ‌లిస్ట్ మీరాబాయి ఫ‌స్ట్ రియాక్ష‌న్‌.. థాంక్యూ ఇండియా...

ఒలంపిక్స్‌లో వెండి ప‌త‌కం సాధించినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను. ఐదేళ్లుగా దీనిని కలగంటున్నాన‌ని.. స్వర్ణం కోసమే ప్రయత్నించాన‌ని.. రజతమూ గొప్ప ఘనతేన‌న్నారు. దేశం తరఫున ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచినందుకు ఆనందంగా ఉంది. నేను మణిపుర్‌కు మాత్రమే కాదు.. ఈ దేశం మొత్తానికీ చెందుతానంటూ సందేశ‌మిచ్చారు మీరాబాయి చాను.  ‘నా కోచ్‌ విజయ్‌ శర్మ, సహాయ బృందానికి, వారి నిరంతర సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. నాకు శిక్షణనివ్వడమే కాకుండా ప్రతిక్షణం నాలో ప్రేరణ నింపారు. అలాగే నా కుటుంబం, ప్రత్యేకంగా మా అమ్మకు ధన్యవాదాలు. ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. నన్ను నమ్మింది. ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ, సాయ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య, ఐఓఏ, ఇండియన్‌ రైల్వేస్‌, స్పాన్సర్లు సహా అందరికీ కృతజ్ఞతలు’ అని మీరాబాయి అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49కిలోల విభాగంలో రజత పతకం గెలిచింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్‌తో పతకం గెలిచిన రెండో వెయిట్‌ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది మీరాబాయి.  టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో అభినంద‌న‌లు తెలిపారు.   

జగనన్న రోడ్డు పథకం అదుర్స్.. జర్నీ చేస్తే కొవ్వు మటాష్..  

పాపం ప్రభుదేవా కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. మన ఏపీ రోడ్లపై తోపుడు బండి ఎక్కి వెళ్లుంటే ఇంకా సూపర్ గా డ్యాన్స్ చేసేవాడు. పాపం మనోళ్లు చాలామంది బ్లడ్ సర్క్యులేషన్ కోసం, వెయిట్ తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు.  మన ఏపీ రోడ్లపై జర్నీ చేస్తే దెబ్బకు కొవ్వు కరిగిపోతుంది. వర్షం పడితే ఆటోమేటిక్ గా రోడ్లపై స్విమ్మింగ్ పూల్స్ వచ్చేస్తాయి.. ఇలాంటి అద్భుతాలు ఎక్కడైనా దొరుకుతాయా చెప్పండి.. ఏపీలో తప్ప. ఇలాంటి మీమ్స్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయ్. అక్కడ తిరిగేస్తారులెండి.. అక్కడ రోడ్లుండవుగా.. ఆ రోడ్లపై గతుకులు, గుంటలు ఉండవుగా మరి. ఎందుకో తెలియదు గాని..జగనన్న వచ్చినప్పటి నుంచి రోడ్లను పట్టించుకోవటం లేదు. పైగా రోడ్లను డెవలప్ చేయడానికి సెస్ అంటూ పెట్రోల్ లీటర్ పై రూపాయి అదనంగా వసూలు చేసుకుంటున్నాడు. హైవేలు బాగానే ఉంటాయి.. ఊళ్లలోకి వెళ్లగానే రోడ్లు మొటిమలు తెగ వచ్చేసిన టీనేజ్ పిల్లల మొహాల్లా కనపడుతున్నాయి. ఇదేమి దారుణంరా బాబూ అంటూ లోకల్ వైసీపీ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇక వర్షాకాలం రాగానే మేకప్ కరిగిపోయిన ఆర్టిస్టుల్లా.. కాస్తో కూస్తో ఉన్న మట్టి కొట్టుకుపోయి..ఘోరంగా తయారవుతున్నాయి రోడ్లు.  ఆ మధ్య పవన్ కల్యాణ్ కూడా కొడాలి నాని మీద సెటైర్ వేశాడు..మా సంగతి తర్వాత ముందు కనీసం రోజూ నువ్వు తిరిగే రోడ్డు కూడా బాగు చేయించవా.. నువ్వేం మంత్రివయ్యా అన్నాడు. అంత మాట అన్నాకూడా కొడాలి నానికి ఆవేశం రాలేదు.. రోడ్డు బాగు చేయించనే లేదు. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. విషయం ఏంటంటే.. ఎప్పుడు జైలుకెళ్తానా అని భయపడే జగనన్నకు.. జనాల అకౌంట్లో డబ్బులు వేయడానికే వచ్చేవన్నీసరిపోవటం లేదు. వాటి కోసమే అప్పులు చేయాల్సి వస్తోంది. అవి ఆపితే.. రేపు తనకు మద్దతుగా ఎవరు నిలబడతారు.. నేను లోపలికిపోయినా.. బయట రాజ్యమేలాలంటే ఎలా అనేదే ఆయన టెన్షన్. అందుకే ఆ డబ్బులు ఈ డబ్బులు అనే తేడా లేకుండా అన్నీవాటిపైపు తరలించేస్తారు. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వటం లేదు. ఇక రోడ్లేయడానికి డబ్బులెక్కడ వస్తాయి. కనీసం నరేగా నిధులు సక్రమంగా తెచ్చుకున్నా వేసుకోవచ్చు. అదీ చేతకావటం లేదు.. పైగా వచ్చిన కాసిన్ని కూడా ఆ నవరత్నాలవైపు తిప్పేస్తున్నాడు. ఇక రోడ్లెక్కడ వేస్తారు చెప్పండి. ఎవరు ఆ రోడ్లపై పడిపోతే ఆయనకేంటి? బండి మీద నుంచి పడి నడుం విరగ్గొట్టుకుంటే ఆయనకేంటి? యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతే మాత్రం ఆయన కేంటి? ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటూ పోతాడు.. ఓటేసినందుకు మనమంతా ఆ గతుకుల రోడ్లపైనే చితికిపోతూ ప్రయాణం చేద్దాం

సీఎం కేసీఆర్ ఆడియా లీక్.. హుజురాబాద్ లో సంచలనం..

ఆరు నూరైనా హుజురాబాద్ గెలిచి తీరాల్సిందే. ఈట‌ల రాజేంద‌ర్‌ను అసెంబ్లీలో అడుగు పెట్ట‌కుండా చేయాల్సిందే. ఇదే సీఎం కేసీఆర్ సంక‌ల్పం. అందుకోసం ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌మంటున్నారు. ఈట‌ల‌ను ఓడించేందుకు.. ఏకంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్నే తీసుకొచ్చారు. హుజురాబాద్‌లో 45వేల‌కు పైగా ఉన్న ద‌ళిత ఓట‌ర్ల‌ను గంప‌గుత్త‌గా ఆక‌ర్షించేందుకు.. ఏకంగా 2వేల కోట్లు ఖ‌ర్చే చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. కుటుంబానికి 10 ల‌క్ష‌ల‌తో దిమ్మ‌తిరిగే ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. కేవ‌లం ద‌ళితుల‌కేనా.. అదికూడా హుజురాబాద్‌కేనా.. మ‌రి, మిగ‌తా వారి ప‌రిస్థితి ఏంటంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. అవేవీ ప‌ట్టించుకునేలా లేరు సీఎం కేసీఆర్‌. ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌యోజ‌నాల‌ను తానే స్వ‌యంగా వివ‌రించేందుకు రంగంలోకి దిగారు. హుజురాబాద్ ద‌ళితుల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలుపించుకొని.. వారికి ప‌థ‌కం ల‌బ్ది గురించి వివ‌రించ‌నున్నారు కేసీఆర్‌. ఆ మేర‌కు ముఖ్య‌మంత్రి నేరుగా నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘‘దళిత బంధు ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఇలాంటి పథకం ఎక్కడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హుజూరాబాద్‌లో ప్రతి గ్రామంలో ఈ పథకం గురించి వివరించాలి. దళిత జాతి చాలా గొప్పది. దేశానికి, ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చే పథకం ఇది. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది. ఈ పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలి. హుజూరాబాద్‌లో ఈ పథకం విజయంపై ఎస్సీల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ నెల 26న హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని వారు ప్రగతిభవన్‌కు రావాలి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు’’ అని ఫోన్‌లో వివరించారు కేసీఆర్‌.  సీఎం కేసీఆర్‌ నుంచి స్వయంగా ఫోన్‌ రావడంతో రామస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 26న హుజురాబాద్‌ నియోజకవర్గంలోని 412 మంది ఎస్సీలతో ప్రగతి భవన్‌లో దళితబంధు పథకంపై అవగాహన సదస్సు జ‌ర‌గ‌నుంది. అంత‌కుముందు 25న క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ద‌ళితుల‌తో స‌మావేశం నిర్వ‌హించి.. సీఎంతో జ‌ర‌గ‌బోయే సమీక్ష కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు.  

వివేకా హత్యలో ఆ ఇద్దరు ప్రముఖులెవరు? వాచ్ మెన్ రంగన్నను ఎందుకు బెదిరించారు? 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య అలియాస్ రంగన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివేకాకు సన్నిహితుడిగా ఉండే ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించాడంటూ వాచ్ మెన్ రంగన్న చెప్పడం కలకలం రేపుతోంది. అంతేకాదు హత్యలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పడంతో.. ఆ ఇద్దరు ఎవరన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. వివేకా హత్యకు 8 కోట్ల రూపాయల సుపారీ జరిగిందనే వార్తలు వస్తుండటంతో... పెద్ద తలకాయల హస్తం ఉందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది.  వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంత కాలం పెదవి విప్పని ఆయన వాచ్‌మన్ రంగన్న ఇప్పుడు బహిరంగంగానే పలు విషయాలను వెల్లడిస్తున్నారు.  వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చారని రంగన్న చెప్పారు. వాళ్లు ఎవరో తనకు తెలియదన్నారు.  ఎర్ర గంగిరెడ్డి వివేకాతోనే ఉంటారు.. నాతో ఎన్నోసార్లు మాట్లాడారు.. ఇప్పుడు నేనెవరో తెలియదంటే ఏమనుకోవాలి..?  అని రంగన్న ప్రశ్నించారు. తనకేమీ కాదని అంటేనే సీబీఐకి అన్ని విషయాలు చెప్పానన్నారు.  వివేకా హత్య కేసులో జమ్మలమడుగు న్యాయమూర్తి ఎదుట శుక్రవారం వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్‌ రంగయ్య..  స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుట పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ‘‘ఆ ముగ్గురిలో ఒకరు... తమ పేర్లు బయటికి చెబితే నన్ను నరికేస్తామన్నారు.. అందుకే... భయపడ్డానని చెప్పారు. సీబీఐ సారోళ్లు మేమున్నామని ధైర్యం చెప్పడంతో ఏమైనా కానీ అని  కోర్టులో అవే చెప్పానని  రంగయ్య వివరించారు. ‘గురువారం నన్ను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు లేదంటే మళ్లీ కడపకు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం మళ్లీ జమ్మలమడుగుకు తీసుకెళ్లి కోర్టులోకి పంపించారు. రాత్రి పెద్ద సారోళ్లు పులివెందులకు తీసుకొచ్చి జేఎన్‌టీయూ వద్ద వదిలేశారు. నా ఖర్చులకు ఏమైనా ఇవ్వండి సార్‌ అంటే ఢిల్లీ పెద్దసారు 15 వందలు ఇచ్చారు"  అని వాచ్ మెన్ రంగయ్య చెప్పారు.  మరోవైపు వాచ్ మెన్ రంగన్న తనపై ఆరోపణలు చేయడంపై స్పందించారు ఎర్ర గంగిరెడ్డి.  వివేకానందరెడ్డి తనకు దేవుడితో సమానమని చెప్పుకొచ్చారు. తాను చీమకు కూడా హాని చేయనని తెలిపారు. కేవలం వివేకాతో తాను సన్నిహితంగా వుండటం వల్లే కేసులు పెట్టారని స్పష్టం చేశారు. వాచ్‌మెన్ రంగన్నను వివేకా ఇంట్లో చూశానే తప్ప ఏ రోజూ మాట్లాడలేదన్నారు గంగిరెడ్డి. రంగన్నను  తాను బెదిరించింది అవాస్తవమన్నారు. వివేకా హత్యకేసులో  నా ప్రమేయం ఉందని అతను నాపై ఎలా చెబుతున్నాడో అర్ధం కావట్లేదన్నారు. వివేకా హత్యకేసులో  నా ప్రమేయం ఉందంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం.. ఏ ప్రమాణానికైనా సిద్ధమన్నారు గంగిరెడ్డి. హత్య జరిగిన ముందురోజు రాత్రి ముందు వివేకాతో కలిసే ఉన్నానని, నన్ను మా ఇంటి దగ్గర దింపి ఆయన ఇంటికెళ్లారని గంగిరెడ్డి తెలిపారు. హత్య జరిగిందని ఉదయం 7 గంటలకు వివేకా బావమరిది తనకు కాల్ చేసి చెప్పారన్నారు. వివేకా కుమార్తె సునీత కూడా తనను వివరాలు అడిగారన్నారు.  

ఆన్లైన్ చదువులకోసం స్మార్ట్ ఫోన్ ఇస్తే కొంప కొల్లేరు చేశారు.. 

ఇంటర్నెట్ ప్రంచంలో నేటి పిల్లలు చదువు కంటే గేమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంత కాలంగా పబ్ జి.. ఈ గేమ్ చాలా చాలా మంది పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పబ్ జి గేమ్ కి అడిక్ట్ అయ్యారు అంటే ఇక అంతే తిండి తిప్పలు లేకుండా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేకుండా పొద్దున్న లేచినప్పటి నుండి గేమ్ లో మునిగి  తేలుతున్నారు.ఒక వైపు ఈ  ఆన్‌లైన్ గేమ్స్ కుటుంబాలను కూల్చేస్తున్నాయి. లోకజ్ఞానమే తెలియని పిల్లలు.. ఆ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల గుల్ల చేస్తున్నారు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అందినకాడికి దోచిపెడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా మారి.. సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలు.. తమ తల్లికి తెలియకుండా ఆమె ఖాతా నుంచి లక్ష రూపాయలకు పైగా విత్ డ్రా చేసుకున్నారు. అది తెలియక ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ భర్త ఉద్యోగం రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కోజికోడ్‌లోనే నివాసం ఉంటోంది. ఇద్దరూ పిల్లల్లో ఒకరు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. మరొకరు పదవ తరగతి చదువుతున్నారు. కరోనా వచ్చిన అందరి జీవితాలను కింద మీద చేసినట్లు. వీళ్ళ కుటుంబం లో కూడా కరోనా ప్రభావం లేకపోలేదు. లాక్ డౌన్ కారణంగా పిల్లలకు  ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. దాంతో ఆ తల్లి.. తన పిల్లలిద్దరికీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఇచ్చింది. ఇక అంతే.. పిల్లలు పాఠాలు వినడం పక్కన పెట్టి. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు.  నిత్యం  గేమ్స్ ఆడుతుండేవారు. ముఖ్యంగా నిషేధిత ‘పబ్‌జి’ ఆటకు అడిక్ట్ అయ్యారు ఆ పిల్లలిద్దరు. ఆటలో భాగంగా నెక్ట్స్ లెవల్‌కి చేరడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పిల్లలు తమ తల్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అలా.. ఆమె ఖాతా నుంచి పలు దాఫాలుగా లక్ష రూపాయలకు పైగా డబ్బులు డ్రా చేశారు. ఇది తెలియని ఆ తల్లి డబ్బులు పోయాయనుకుని కోజికోడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు. పబ్‌జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు గుర్తించారు. విషయాన్ని బాధితురాలికి తెలియజేశారు. అది తెలిసి ఆవిడ కూడా షాక్ అయ్యారు. ఇది విషయం పిల్లలకు ఫోన్ ఇస్తే చదువుతున్నారు అని మనం అనుకుంటాం కానీ అది ఏ కుటుంబంలో జరగదు.. 

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు షాక్‌..

య‌ధా రాజా.. త‌ధా అధికారులు. ఏపీలో ఇష్టారాజ్యంగా పాల‌న కొన‌సాగుతోంది.. అధికారులు ఎవ‌రి మాటా విన‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పాల‌కుల క‌నుస‌న్న‌ల్లో అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆఖ‌రికి హైకోర్టు విష‌యంలోనూ ఉదాసీనంగా ఉంటున్నార‌ని అంటున్నారు. కోర్టునే లైట్ తీసుకుంటే.. న్యాయ‌వ్య‌వ‌స్థ చూస్తూ ఊరుకుంటుందా? గ‌ట్టిగా బుద్ధి చెప్ప‌దూ? ఇప్పుడు అదే జ‌రుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వెంట‌నే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించడం క‌ల‌క‌లం రేపింది. అస‌లేం జ‌రిగిందంటే....  కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని.. కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.  వారెంట్‌ రీకాల్‌ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉంటుందని తెలిపింది. రూ.50వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. శిక్ష నిలిపివేయాలంటూ సత్యనారాయణ, ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా.. విజ్ఞప్తిని లంచ్‌ తర్వాత పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.