వెండి వెలుగుల వెనుక కష్టాలెన్నో.. మీరాబాయి లైఫ్ స్టోరీ..
posted on Jul 24, 2021 @ 11:05PM
ఒలింపిక్స్‌లో రజతం సాధించడంతో ఇప్పుడు ప్రపంచమంతా మీరాబాయి పేరు మారుమోగుతోంది. ఇప్పుడామె ఓ సూపర్‌స్టార్. ప్రశంసలు.. నజరానాలకు కొదవే లేదు. అయితే, టోక్యో వరకు ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఈ విజయం వెనక అనేక త్యాగాలు.. అంతకుమించి అవమానాలు. గెలవాలనే పట్టుదల.. పతకం సాధించాలనే తపనే.. ఆమెను ఒలింపియన్‌గా నిలబెట్టింది. రజితంతో మెరిసేలా చేసింది.
ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో 1994, ఆగస్టు 8న ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్ కాక్‌చింగ్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది మీరాబాయి చాను. బడికెళ్లే వయసులో విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజరాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. వంటకోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో అడవికి వెళ్లేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ. మీరాబాయి స్వస్థలంలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ శిబిరాలు లేకపోవడంతో ఆమె రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్ అనితా చాను వెదురు బొంగులతో సాధన చేయించేది. రోజూ వెదురుబొంగులు తెప్పించడం.. వాటికి బరువులు పెట్టి మోయిస్తూ టెక్నిక్స్ నేర్పించేది. మీరాబాయి వేగంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2014లో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల విభాగంలో రజతం గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనా.. ఒత్తిడి తట్టుకోలేక అనర్హతకు గురైంది.
ఆ తర్వాత రోజూ ఆరు గంటలకుపైగా సాధన చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో కొత్త మెలకువలు నేర్చుకుంది. మీరాబాయి కఠిన శ్రమకు ఫలితాలు లభించసాగాయి. 2017లో అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. 2018లో రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ వరించాయి. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచింది.
‘రియో ఒలింపిక్స్‌లో ఓటమి చెందినప్పుడే నిర్ణయించుకున్నా.. నేనేంటో టోక్యోలో నిరూపించుకోవాలని అని మీరాబాయి చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఐదేళ్లలో ఐదు రోజులు మాత్రమే ఇంటిదగ్గర ఉన్నా. ఇప్పుడు ఈ పతకంతో ఊళ్లో అడుగుపెడతా’ అంటూ రజత పతకం సాధించాక చెప్పిన మాటలే చాను పట్టుదలకు, మనస్తత్వానికి నిదర్శనం.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ భారీ నజరానా ప్రకటించారు. రూ.కోటి నజరానాతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాబాయి చానుకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు చెప్పారు.