ఏపీలో 52, తెలంగాణలో 39 లోక్ సభ సీట్లు?  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లు ఉండగా.. తెలంగాణలో 17 స్థానాలున్నాయి. అయితే త్వరలో ఏపీలో లోక్ సభ స్థానాలు 52కు, తెలంగాణలో 39 పెరగబోతున్నాయనే సమాచారం వస్తోంది. దేశంలో లోక్ సభ సీట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 543 లోక్ సభ సీట్లుండగా.. వాటిని వెయ్యికి పైగా పెంచడానికి కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉండే తన సహచర ఎంపీల ద్వారా ఈ విషయం తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. దీంతో లోక్ సభ సీట్లు పెరగనున్నాయనే వార్త  దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  '2024 లోపు లోక్ సభ స్థానాలను 1000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని బీజేపీలో ఉన్న నా సహచర ఎంపీల ద్వారా తెలిసింది. కొత్త పార్లమెంట్ భవనం 100 సీట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఒకవేళ వెయ్యి స్థానాలకు పెంచితే అంతకంటే ముందు ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలి. కీలకమైన ఈ అంశంపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.'' అని మనోజ్ తివారి ట్వీట్ చేశారు. లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను ప్ర‌స్తుత‌మున్న 543 నుంచి ఏకంగా వెయ్యికి పెంచే దిశ‌గా మోదీ స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తోంద‌ని, దీనిపై జ‌నాభిప్రాయం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తివారీ త‌న ట్వీట్ లో అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా త‌న వాద‌న‌కు నిద‌ర్శ‌నంగా.. కొత్త‌గా క‌డుతున్న పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టాను వెయ్యి మందికి స‌రిప‌డేలా క‌డుతున్న వైనాన్ని ఆయ‌న ఉద‌హ‌రించారు.  భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో ఎందుకు 1000 మంది ఎంపీలు ఉండదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా త‌మ జ‌నాభాకు అనుగుణంగా చట్ట స‌భ‌ల స‌భ్యుల సంఖ్య‌ను పెంచుకుంటూ పోతుంటే.. మ‌నం ఇంకా ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా జరుగుతున్న ప్రచారంతో ఆ దిశగా మోడీ సర్కార్ సీరియస్ గానే వర్కవుట్ చేస్తుందని చెబుతున్నారు.  మనదేశంలో ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలున్నాయి.  ఇందులో 530 సీట్లను రాష్ట్రాలకు కేటాయించగా.. మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.ఏళ్లుగా ఈ సంఖ్య అలా పెర‌గ‌కుండా  ఉంటూ వ‌స్తోంది. 1977 నుంచి సీట్ల సంఖ్య అలాగే ఉంది. కాని అప్పుడు  మన దేశ జనాభా కేవలం 55 కోట్లే. ప్రస్తుతం దేశ జనాభా 135 కోట్లు దాటింది. కాని లోక్ సభ సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదు. 2009లో పునర్విభజన చేశారు. కాని లోక్ సభ నియోజకవర్గాల పరిధి మాత్రమే మారింది.. కాని సీట్లు సంఖ్య పెరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ గతంలో అన్నారని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ కంటే ముందు జితిన్ ప్రసాద కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  మోడీ స‌ర్కారు ప్ర‌తిపాదిస్తున్న మాదిరిగా లోక్ స‌భ సీట్లు వెయ్యికి పెరిగితే.. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు సంఖ్య ఇప్పుడున్న సంఖ్య కంటే రెట్టింపు కానున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం 80 లోక్ సభ సీట్లుండగా.. కొత్త ప్రతిపాదనతో అది 193కు పెరగనుంది. మహారాష్ట్రలో 48 సీట్ల నుంచి 117కు పెరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు 42 ఉండగా.. పెరిగితే 92 కావొచ్చంటున్నారు. బీహార్ లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా.. 94కు పెంచాలని మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుందని సమాచారం. ప్రస్తుత జనాభా ఆధారంగా తమిళనాడు 77, రాజస్థాన్ లో 65 లోక్ సభ సీట్లు ఉండనున్నాయి. మధ్య ప్రదేశ్ లో 68, కర్ణాటకలో 67క. గుజరాత్ లో 60కి లోక్ సభ సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక  తెలుగు రాష్ట్రాల ఎంపీ సీట్లు కూడా డబుల్ కన్నా ఎక్కువ కానున్నాయి. ఏపీలో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లుండగా... మోడీ సర్కార్ ప్రతిపాదన ప్రకారం 52కు పెరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ‌లో ఉన్న 17 సీట్లు 39కు పెరుగుతాయి.  లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను దాదాపుగా డ‌బుల్ చేసే దిశ‌గా జ‌రుగుతున్న ప్ర‌తిపాద‌న‌ల వ‌ల్ల ప్రాంతీయ పార్టీలు.. ప్ర‌త్యేకించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు లాభమనే చర్చ జరుగుతోంది . అదే సమయంలో యూపీ, బీహార్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో పెరిగే సీట్లు బీజేపీకి ప్రయోజనమనే చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం, ఉత్తరాదిలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కావడం వంటి అంశాలను పరిశీలిస్తూ మోడీ సర్కార్ తాజా స్కెచ్ వేస్తుందని చెబుతున్నారు. అయితే లోక్ సభ సీట్ల పెంపుపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చేసిన ట్వీట్ పై కేంద్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీజేపీ కూడా మాట్లాడలేదు. దీంతో మోడీ సర్కార్ మదిలో ఈ ప్రతిపాదన ఉందా లేదా అన్నదానిపై పూర్తి స్పష్టత రావడం లేదు.

పార్టీని కాదు నన్ను చూసి ఓటేయండి.. బీజేపీకి ఈటల రాజేందర్ షాక్?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు హుజురాబాద్ కేంద్రంగానే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో ఉప ఎన్నికల జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. హుజురాబాద్ లక్ష్యంగానే సీఎం కేసీఆర్ దళిత బంధును తీసుకొచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏడేండ్లుగా పెండింగులో ఉన్న రేషన్ కార్డుల పంపిణి కూడా బైపోల్ పుణ్యమే అంటున్నారు.  తనకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని ఈటల రాజేందర్ గట్టి పట్టుదలగా ఉన్నారు. బీజేపీలో చేరిన ఈటల.. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి జనాలతో మాట్లాడుతున్నారు. పాదయాత్రలో సంచలన ఆరోపణలు చేస్తూ ముందుకు వెళుతున్నారు రాజేందర్. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్న ఈటల రాజేందర్.. ప్రచారంలో మాత్రం పార్టీ పేరును ఎక్కువగా చెప్పడం లేదని తెలుస్తోంది. జమ్మికుంట మండలం గండ్రపల్లి సభలో మాట్లాడిన ఈటల.. బీజేపీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ప్రజలు ఎప్పటిలాగే తనకు అండగా ఉండాలని కోరారు రాజేందర్. ఈసారి పార్టీల పరంగా ఆలోచించవద్దని కోరారు. అంతేకాదు తన పార్టీని కాకుండా తనను చూసి ఓటేయమని అభ్యర్థించారు. ఎన్నడూ ఇంతగా ఓట్ల కోసం మిమ్మల్ని అడగలేదని.. మీ గుండెల్లో చోటు సంపాదించిన ఈ బిడ్డను ఈసారి పార్టీ చూడకుండా ఆశీర్వదించాలని కోరారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీని కాదని తనను చూసి ఓటేయమని చెప్పడంపై బీజేపీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తనను  గెలిపించాలని కోరకుండా.. పార్టీ వద్దని చెప్పడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ ఏం చేస్తారన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరిగింది. కాని రాజేందర్ మాత్రం కమలం గూటికి చేరారు. అయితే బీజేపీలో రాజేందర్ ఇమడలేకపోతున్నారనే చర్చలు కూడా కొన్ని రోజులుగా వస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. దీంతో ఈటల కాంగ్రెస్ లో చేరితే బాగుండేదని, ఆయన తొందరపడ్డారనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపించింది.అంతేకాదు ఉప ఎన్నికల తర్వాత రాజేందర్  కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇప్పుడు రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఆయన సంతృప్తిగా లేరనే అభిప్రాయం మళ్లీ తెరపైకి వస్తోంది. బీజేపీ కంటే తన ఇమేజ్ తో ప్రచారం చేసుకుంటనే గెలుస్తాననే ఆలోచనకు ఈటల వచ్చారంటున్నారు. బీజేపీ అయితే కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం ఉండటంతో.. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఇలా రూట్ మార్చారనే వాదన కూడా వస్తోంది. మొత్తంగా పార్టీని పట్టించుకోవద్దంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

ఏపీలో సంక్షేమ పథకాలకు కోతలు? అధికారులను బకరా చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం ... ఎత్తుతున్నారా? ఇంత వరకు అంతా తమ ఘనతే అని, కొవిడ్, కష్టాలు కట్టకట్టుకుని దాడి చేసినా, సంక్షేమ ఫలాలను గంట కొట్టినట్లు ఠంచనుగా టైముకు ఇంటింటికీ చేర్చిన ఘనత మొత్తానికి మొత్తంగా తమకే దక్కుతుందని అధికార పార్టీ డబ్బాలు కొట్టుకుంది. అంతే కాదు, ఆ క్రెడిట్ మొతం     ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఖాతాలోకే చేరుతుందని కూడా అధికార గణాలు ముఖ్యమంత్రికి కీర్తి కిరీటాలు తగిలించాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం, గొంతు మారుతోందా? అధికారులను బకరాలను చేసే బ్లేమ్ గేమ్’కు రంగం సిద్డంమవుతోందా? అంటే, అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే  వస్తోంది.   జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 26 నెలలు అయింది. అయితే ఇంతవరకు ఆయన అధికారులను పల్లెత్తు మాట అన్న సందర్భం ఇంచుమించుగా లేదనే అంటారు. ఒకటి రెండు సందర్భాలలో చిరుకోపం  చూపినా, మరీ ఇంతలా ముఖాన వాతలు పెట్టిన సందర్భం అయితే లేదు. ఇంతకీ విషయం ఏమంటే,కొంత మంది అధికారుల పనితీరును సిఎం మొట్టమొదటి సారిగా చీదరించుకున్నారు. ఛీ .. చండాలం, వెరీ బ్యాడ్’ అని అక్షింతలు వేశారు. మంగళవారం (జూలై 27) న స్పందన కార్యక్రమం పై జిల్లా కల్లెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్’లో ముఖ్యమంత్రి కొంత మంది ఆఫీసర్స్ పనితీరు చాలా బాగాలేదని,  వెరీ బ్యాడ్ అని పేరు పేరునా చెప్పేశారు. ఇది ఆమోదయోగ్యం కాదు అని గట్టిగా మందలించారు. అంతే కాదు, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో ఫెయిల్ అయిన వారికి  మెమోలు ఇవ్వండి, అని పై అధికారాలకు ఆదేశాల జారీ చేశారు. అక్కడితో ఆగకుండా, ఇలా మెమోలు ఇవ్వవలసి రావడం బాధాకరం. నాకు నేను మెమో ఇచ్చుకోవడంతో సమానం, మీ ఫెయిల్యూర్ నా ఫెయిల్యూర్’ అంటూ మొదటిసారిగా అధికారుల ముఖం మీదనే చీవాట్లు పెట్టారు. గ్రామ, వార్డ్ సెక్రటేరియట్ల ఇన్స్పెక్షన్’కు సంబంధించి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.   గ్రామ, వార్డ్ సచివాలయాలు తమ మానస పుత్రికలుగా పేర్కొంటూ, వాటిని నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు ..అంటూ అధికారుల ఫెయిల్యూర్స్ ఏకరువు పెట్టారు. మనం ముందు మనుషులమ తర్వాతనే అధికారులం .... అంటూ చాలా చక్కగా జ్ఞానబోధ చేశారు. అంతే అయితే అదోరకం, కానీ, అసలు చెప్పదలచుకున్న విషయాన్ని చివర్లో అధికారుల చెవిలో వేశారు. సంక్షేమ ఫలాలు అనర్హులకు అందరాదు, అలాంటి అనర్హులను ఎరివేయండి, అందుకోసంగా ఇల్లిల్లు తిరిగి అయినా  సంక్షేమ లబ్దిదారుల జాబితాను, కుదించమని చెప్పారు. అఫ్కోర్స్ అదే సమయంలో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని కూడా అన్నారనుకోండి. అయితే, అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా గీత దాటిన నేపధ్యంలో.  ముఖ్యమంత్రి  మాట్లాడిన తీరు తెన్నులను బట్టి, సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్యను కుదించి, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే  ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టమావుతోందని అంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుల పద్దు హద్దులు దాటిందని హెచ్చరించింది.  కేంద్ర నిధుల దారి మళ్లింపు కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా బీజేపీ ఎంపీ జీవిఎల్, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, టీడీపీ ఎంపీల బృదం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఈ నేపధ్యంలో, సంక్షేమ కోతలకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. అయితే, ఆ పాపం తమ చేతికి అంటకుండా, అధికారాలను బకరాలను చేసేందుకే, ముఖ్యమంత్రి డైరెక్ట్’గా మెమోల వరకు వెళ్ళారని అధికారులు అంటున్నారు. అయితే ఈ బ్లేమ్ గేమ్ ఎక్కడి వరకు వెళుతుంది.. ఏ మలుపు తీసుకుంటుంది చూడవలసి వుందని అధికారులు అంటున్నారు. 

రెండుసార్లు వ్యాక్సిన్‌.. మూడుసార్లు కొవిడ్‌.. వామ్మో మామూలుగా లేదుగా...

క‌రోనా వైర‌స్‌ మ‌హా ఖ‌త‌ర్నాక్‌. ఏమాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్నా కాటేయ‌క మాన‌దు. మాస్కులు పెట్టుకున్నా, శానిటైజ‌ర్లు రాసుకుంటున్నా మ‌హా జాగ్ర‌త్త‌గా ఉండాలి సుమీ. వ్యాక్సిన్ వేసుకున్నాం క‌దా... ఇక మాకేమీ కాద‌ని బిందాస్‌గా ఉండ‌లేని ప‌రిస్థితి. కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లా సామ‌ర్థ్యం సుమారు 75శాతం మాత్ర‌మే. అంటే, రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొవిడ్ వ‌చ్చే అవ‌కాశం మ‌రో 25శాతం ఉంద‌న్న మాట‌. డ‌బుల్ డోస్ వేసుకున్న వారికే క‌రోనా సోకుతుంటే.. ఇక సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఏమాత్రం సేఫ్ కాదు. తాజాగా, ఓ లేడీ డాక్ట‌ర్‌కు ఏకంగా మూడుసార్లు క‌రోనా అటాక్ అయింది. వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ బారిన ప‌డ‌టం ఆందోళ‌న‌క‌ర అంశం.  కరోనా కొత్త వేరియంట్లను వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకుంటుందా? లేదా? అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ముంబయికి చెందిన డాక్టర్ శ్రిష్టి హిల్లరి (26) అనే యువ డాక్టర్ రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రెండు సార్లు కరోనా బారిన పడింది. అంతకుముందు కూడా ఓసారి ఆమెకు క‌రోనాఅటాక్ అయింది. మొత్తం 13 నెలల్లో ఏకంగా మూడుసార్లు ఆమెకు కరోనా వైరస్ సోకింది. తొలి రెండు సార్లు ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూడోసారి అదీ రెండు డోసులు తీసుకున్న తర్వాత సోకిన వైరస్‌ కారణంగా ఆమెకు తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ముంబైలోని వీర్ సావర్కర్ హాస్పిటల్‌లో కొవిడ్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ శ్రిష్టి హల్లరికి గతేడాది జులై 17న తొలిసారి కరోనా సోకింది. అప్పుడు ఆమెలో సాధారణ లక్షణాలే కనిపించాయి. ఈ ఏడాది మార్చి 8న తొలి డోసు, ఏప్రిల్ 29న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మే 29న రెండో సారి కరోనా బారినపడ్డట్టు రిపోర్ట్స్ వెల్లడించాయి. సింప్టమ్స్ మైల్డ్‌గానే ఉండటంతో ఇంట్లోనే కోలుకున్నారు. జులై 11న మరోసారి మొత్తం కుటుంబానికి వైరస్ సోకింది. ఈ సారి ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అయితే, టీకాలు ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోకున్నా.. ఆరోగ్యం దిగజారకుండా, ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మార‌కుండా కాపాడుతాయనేది నిపుణులు మాట‌. కానీ, శ్రిష్టి హల్లరి విషయంలో మాత్రం ఆరోగ్యం క్షీణించ‌డానికి.. క‌రోనా వైర‌స్‌ వేరియంట్లు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయ‌నేందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. అందుకే, మాస్కు పెట్ట‌కున్నా.. వ్యాక్సిన్ వేసుకున్నా.. బీ కేర్‌ఫుల్‌. నిర్ల‌క్ష్యం ఏమాత్రం త‌గ‌దు.   

నిషేధిత ఆస్తుల జాబితాలో 20 లక్షల ఎకరాలు.. ఇదేందయ్యా కేసీయారూ! 

తెలంగాణలో రెవిన్యూ సంస్కరణల గురించి గంభీర వచనాలు వల్లించిన కేసీఆర్.. ఆ మాటలు చెప్పి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్ర ప్రజల సమస్యలకు పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. అనేక దఫాలుగా ఎన్నో గంటలపాటు సమావేశాలు జరిపి తయారు చేసిన మార్గదర్శకాల మేరకు అధికారులు పని చేయలేకపోతున్నారా.. లేక మార్గదర్శకాలు, పని విభజనే అశాస్త్రీయంగా ఉందా.. అదీగాక అధికారులు తమ పాత పద్ధతిలోనే లంచాల సంస్కృతిని మరింత పెంచి పోషిస్తూ భూముల లావాదేవీల్లో కొర్రీలు వేస్తున్నారా అన్న విమర్శలకు ఇప్పుడు బలం పెరిగింది. ఇందులో అధికారుల లోపం ఉందా.. ప్రభుత్వం చేతగానితనం ఉందా అనేది కాసేపు పక్కనపెడితే.. ఇప్పటికీ 20 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా ల్యాండ్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండడమే అందుకు ఓ నిదర్శనంగా చెబుతున్నారు విపక్ష పార్టీల నేతలు.  రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిషేధిత ఆస్తుల జాబితా రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, అసైన్డ్ ల్యాండ్స్ ఉండాల్సిన ఈ లిస్టులో లక్షలాది మంది అసలైన పట్టాదారుల సర్వే నెంబర్లు నమోదయ్యాయి. అధికారులు చేసిన తప్పులు.. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో  దాదాపు 20 లక్షల ఎకరాల పట్టా ల్యాండ్స్ నిషేధిత ఆస్తుల చిట్టాలో చిక్కుకున్నాయి. దీంతో అసలు సిసలైన యజమానులు తమ భూములను అమ్ముకోలేక.. కుటుంబీకులకు మ్యుటేషన్ చేసుకోలేక తిప్పలు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు ఈ జాబితాలో ఉండటం రెవిన్యూ రికార్డుల్లోని తప్పులను వేలెత్తి చూపుతోంది. తమ దగ్గర పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని.. తమ  భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు ఏళ్లకేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జిల్లా అధికారుల నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని.. అప్పుడే ఆ జాబితా నుంచి భూములు తొలగిస్తామని రెవిన్యూ సిబ్బంది ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము బలవుతున్నామని, ఎన్వోసీ తెచ్చుకునేందుకు లంచాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. గతంలో హైదరాబాద్ ను ఆనుకునే ఉన్న ఓ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి చిక్కింది కూడా ఇలాంటి కేసులోనే కావటం గమనార్హం. అంతేకాదు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన భూములపైనా క్లారిటీ లేకుండా నోషనల్ ఖాతాలకే పరిమితం చేశారు. దీనివల్ల లబ్ధిదారులకు నష్టపరిహారం సైతం ఇంకా అందకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీడం ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు కూడా ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్లిపోయి అభివృద్ధి చేసుకోవాలన్నా లేక అవసరం మేరకు అమ్ముకోవాలన్నా, మరేదైనా ఇతర అవసరాలకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో పిల్లల చదువులైనా, పెళ్లీడుకొచ్చిన పిల్లలకైనా ఉపయోగపడకుండా పోయాయి. అసలు ఇలాంటి భూములకు రిజిస్ట్రేషన్ల శాఖ సింపుల్ గా రెడ్ మార్క్ పెట్టి కూర్చోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే నిషేధిత జాబితా నుంచి తమ భూములు తీసేయాలని ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే 60 వేల  మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరంతా ఎన్వోసీ కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు అధికారులు భూముల విలువను బట్టి ఎన్వోసీ కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. రెవిన్యూ అధికారుల మీద బాధిత ప్రజలు దాడులు చేస్తున్నా లంచావతారులకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికైతే పరిష్కారం దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగానైనా ఈ ప్రజోపయోగ కార్యక్రమాన్ని పట్టాలకెక్కిస్తారా అంటున్నారు సామాన్య జనం.

కాపురానికి  నో చెప్పిన భార్య..  బ్లేడ్‌తో గొంతు కోసుకున్న భర్త..  

ఈ మధ్య కొంత మందికి ప్రాణం అంటే లెక్కలేకుండా పోయింది. ప్రతి చిన్న విషయానికి ప్రాణం తీసుకుంటున్నారు.. లేదంటే పర్ణాలు తీస్తున్నారు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా తాండూర్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో జరిగింది.  కర్ణాటక రాష్ట్రంలోని గురుకుంటకు చెందిన ఒక వ్యక్తి. అతని పేరు  అడిగి సంగమేశ్వర్. అతను తన భార్యతో కలిసి ఎన్టీఆర్ కాలనీలో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. ఈ ప్రాంతంలోనే పాలిసింగ్ యూనిట్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంగమేశ్వర్‌కు, తన భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో తన భార్య ఆమె అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. భార్య భర్తల మధ్య ఎప్పుడు ఉండే చిన్న చిన్న గొడవలే అని ఆమె అనుకోలేదు.. అతను కూడా అనుకోలేదు..  ఈ క్రమంలో పలుసార్లు  భార్య అక్కా, బావాతో కూడా సంగమేశ్వర్ మాట్లాడాడు. అయినా ఫలితం లేదు. చివరికి  తన భార్య ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన భార్యను కాపురానికి పంపించడం లేదంటూ మనస్తాపానికి గురైన సంగమేశ్వర్..ఎప్పుడు గొడవ పడే వాళ్ళు లేకపోతే కూడా మనిషికి భయం వేస్తది కదా.. మరి అతనిది అమాయకత్వం లేదంటే నిజంగానే భార్య అంటే బెంగో తెలియదు గానీ చివరికి  బ్లేడ్‌తో గొంతు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయింది. అయితే.. సంగమేశ్వర్‌ను గమనించిన స్థానికులు వెంటనే అతనిని తాండూర్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.  

కేసీఆర్ కోసం కొత్త ఫామ్‌హౌజ్‌.. ఆ గ‌ట్టు మీదే ఉంటారా? ఆ టార్గెట్ కోస‌మేనా?

కేసీఆర్ ఇల్లెక్క‌డుందో చాలా త‌క్కువ మందికే తెలుసు. కేసీఆర్ ఉండేది ఎక్క‌డో అంద‌రికీ తెలుసు. పెద్దిల్లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌.. చిన్నిల్లు గ‌జ్వేల్ ఫామ్‌హౌజ్‌. రెండు ఇండ్ల సంసారం ముఖ్య‌మంత్రిది. నందిన‌గ‌ర్‌లో ఉండే ఆయ‌న సొంతింటికి వెళ్లి చాలా ఏండ్లే అయ్యింది. తాజాగా, సీఎం కేసీఆర్ మ‌రో కేరాఫ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ గ‌ట్టు మీద కుర్చీ వేసుకొని కూర్చొనేందుకు రెడీ అవుతున్నారు. ఆ మేర‌కు ఆస్థాన వాస్తు పండితుడు సుద్దాల సుధాక‌ర్‌తేజ.. ఇంటి స్థ‌లాన్ని ప‌రిశీలించి వ‌చ్చారు. ఓ శుభముహుర్తాన కేసీఆర్ కొత్త‌ ఇంటికి శంకుస్థాప‌న ప‌డ‌నుంది. ఇంత‌కీ, ఆయ‌న‌కు ఇప్ప‌టికిప్పుడు ఇంకో ఇంటి అవ‌స‌రం ఏమొచ్చింది? ఇంత‌కీ ఆ లొకేష‌న్ ఏంటి?  కేసీఆర్ మాట‌లు చెబుతారే గానీ.. చేత‌ల్లో చూపించ‌రనే ఆరోప‌ణ‌ ఉంది. కేసీఆర్ కోత‌ల రాయుడనే విమ‌ర్శ ఉంది. ఆయ‌న చెప్పే మాట‌లు, చేసే ప‌నులు కూడా అలానే ఉంటాయ‌నుకోండి అది వేరే విష‌యం. తాజాగా, తెలుగురాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం తీవ్ర స్థాయిలో న‌డుస్తోంది. మంత్రులు తిట్ల దండ‌కంతో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర పోలీసుల మోహ‌రింపుతో ఉద్రిక్త‌త‌లు పెంచేస్తున్నారు. కేంద్రానికి, ట్రైబ్యున‌ల్‌కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఏపీ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తి చేస్తే.. పాల‌మూరు ఇక ఎడారే అంటోంది తెలంగాణ‌. జ‌గ‌న్ దూకుడుకు భ‌య‌ప‌డో, మ‌రే కార‌ణ‌మో కానీ.. ఏళ్లుగా ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న‌ప‌డేసిన పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఇప్పుడిప్పుడే ఫోక‌స్ పెడుతున్నారు. గ‌తంలో ఆ ప్రాజెక్టును త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు తాను అక్క‌డే కుర్చీ వేసుకొని కూర్చుంటానంటూ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పాల‌మూరుకు వెళ్లిన ప్ర‌తీసారి కేసీఆర్ ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. కానీ, ఇంత వ‌ర‌కూ అక్క‌డ ఒక్క కుర్చీ కూడా వేసింది లేదు. తాజాగా, కుర్చీ ఏం ఖ‌ర్మ‌.. ఏకంగా గెస్ట్‌హౌజ్ క‌ట్టుకొని అక్క‌డే తిష్ట వేస్తాన‌ని.. ప్రాజెక్టు పూర్తి అయ్యే వ‌ర‌కు అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని కేసీఆర్ క‌మిట్ అయ్యార‌ట‌. వెంట‌నే ప్రాజెక్ట్ సమీపంలో త‌న‌కో గెస్ట్‌హౌజ్ నిర్మించాలంటూ ఇటీవ‌ల‌ అధికారుల‌ను ఆదేశించార‌ట‌.  సీఎం కేసీఆర్ గెస్ట్‌హౌజ్‌ కోసం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఓ స్థ‌లం చూశారు. అదెలా ఉందో చూసి ర‌మ్మంటూ త‌నకెంతో న‌మ్మ‌క‌మైన‌ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాక‌ర్ తేజ‌ను కోరార‌ట కేసీఆర్‌. ఆ మేర‌కు ఇటీవ‌ల సుద్దాల.. భూత్పూర్ మండలంలో పర్యటించారు. కరివెన ద‌గ్గ‌ర‌ నిర్మాణంలో ఉన్న కురుమూర్తిరాయ ప్రాజెక్టు దగ్గర గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన స్థ‌లాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆ స్థ‌లం వాస్తుకు అనుగుణంగా ఉందో లేదో అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్‌కు అందించ‌నున్నారు సుద్దాల సుధాక‌ర్‌తేజ‌. కేసీఆర్ ఆమోదం తెలిపితే.. వెంట‌నే గెస్ట్‌హౌజ్ నిర్మాణం మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. ఆ గ‌ట్టుపై ఉన్న‌ గెస్ట్ హౌస్‌లోనే కేసీఆర్ ఉంటార‌ని.. అక్క‌డి నుంచే ప్ర‌భుత్వ‌ పరిపాలన కార్యక్రమాలు, ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తార‌ని అంటున్నారు. ఆ లెక్క‌న త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ అడ్ర‌స్ మారిపోనుంద‌న్న మాట‌. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉంటేనే ఎవ‌రికీ అందుబాటులో ఉండ‌ని ముఖ్య‌మంత్రి.. ఇక‌పై పాల‌మూరు షిఫ్ట్ అయితే ఆ మాత్రం కూడా క‌నిపించ‌రేమో...అంటున్నారు.  

ప్రాణం తీసిన సమోసా.. 

టైటిల్ చూసి షాక్ అయ్యారా ..? సమోసా ప్రాణం తియ్యడం ఏంటని అనుకుంటున్నారా..? గాశారం బాగాలేకపోతే గడ్డిపోస కూడా మన చావుకు కారణం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సమోసా ధర విషయంలో ఏర్పడిన చిన్న వివాదం కాస్తా చినికిచినికి గాలివానై.. చివరకు ఓ వ్యక్తి బలవన్మరణానికి దారితీసింది. పోలీసులు విచారణ చేసి  తెలిపిన వివరాల మేరకు అతని పేరు  బజ్రు జైశ్వాల్ వయసు 30 సంవత్సరాలు  తన స్నేహితులతో కలిసి సమోసా తినేందుకు సమీపంలోని షాప్‌కు వెళ్లారు. షాప్‌లో రెండు సమోసాలు తిన్నారు. రెండు సమోసాలకు రూ.20లు చెల్లించాలని సదరు షాప్ యజమానురాలు కాంచన్ సాహు కోరింది. ఇక అంతే ఆమెకు చెల్లించడానికి డబ్బులు లేకనో.. అంతకు ముందు ఉన్న ధరను కాకుండా  ధర పెంచినందుకు తెలియదు గానీ.. కొన్ని రోజుల క్రితం వరకు ఆ షాప్‌లో రెండు సమోసాల ధర రూ.15 (ఒక్కోటి రూ.7.50)గా ఉండేది. రూ.20 ఎందుకు చెల్లించాలంటూ షాప్ యజమానురాలితో  గొడవకు దిగాడు జైశ్వాల్ఒ. ఒక్కో సమోసా ధరను రూ.2.50 పెంచడం కరెక్టుకాదంటూ రూ.5లు అదనంగా ఇచ్చేందుకు నిరాకరించాడు.  అయితే ముడి సరుకుల ధరలు పెరగడంతో సమోసా ధరను ఒక్కోటి రూ.10కి పెంచినట్లు కాంచన్ తెలిపింది. నిజమే కదా మరి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశానికి అంటుతున్నాయి ఇప్పుడు ఉన్నపరిస్థితిలో ఆమె వెర్షన్ ఆమె చెప్పింది. అయినా సరే అల్లు అర్జున్ సినిమాలో తగ్గేదే లో అన్నట్లు  వెనక్కి తగ్గని జైశ్వాల్ మునుపటిలా రూ.15లే చెల్లిస్తానని తెగేసి  చెప్పాడు. ఇక రెండు సమోసాలు, 5 రూపాయల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. జైశ్వాల్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు షాపు యజమాని సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.  జైశ్వాల్‌పై 294, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు స్టేషన్‌కు పిలించి ప్రశ్నించారు. పోలీసు కేసుతో తీవ్ర మనోవేధనకు గురైన నిందితుడు ఈ నెల 24న తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కుటుంబీకులు, స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించగా.. చికిత్సా ఫలితం లేకుండా ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆత్మాహుతికి పాల్పడే ముందు జైశ్వాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను కాంచన్, పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించాడు. పోలీసులు తనను స్టేషన్‌లో తీవ్రంగా కొట్టినట్లు తెలిపాడు. కాగా జైశ్వాల్ కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు ఉందని దుకాణ యజమాని కాంచన్ మీడియా తెలిపింది. జైశ్వాల్ ఆత్మాహుతికి ప్రతీకారం తీర్చుకుంటామని అతని కుటుంబీకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. మొత్తానికి రెండు సమాసాలకు సంబంధించిన రూ.5ల గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకోవడం మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింద.  ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.    

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయం! జగన్ రెడ్డిని పట్టించుకోని కేంద్రం..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే సమస్యే లేదు .. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకుని తీరుతాం.. ఇదీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెబుతున్న మాట. ఇటీవలే ఆయన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో  హడావుడి కూడా చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వైసీపీ నేతలు తాము ఏదో చేస్తున్నామనే ప్రయత్నం చేస్తుండగా.. అటు కేంద్ర సర్కార్ మాత్రం తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. జగన్ రెడ్డి సర్కార్ వినతులను కనీసం పట్టించుకోకుండా ముందుకు పోతోంది.  ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ మరో షాకిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో పెట్టుబడులు ఉపసంహరించాలని కేబినెట్ కమిటీ నిర్ణయించడంతో ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.సీబీఐ మాజీ జేడీ.. వీవీ లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం దారుణమని.. దీనికి రాజ్యాంగం సైతం అంగీకరించదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పలు దఫాల విచారణ అనంతరం.. తాజాగా.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్‌లో కేంద్రం దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలాంటివాటిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందన్నారు. కేంద్రం కేబినెట్ కమిటీలో ప్రధాని, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఉక్కుమంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, పెట్రోలియం మంత్రి సభ్యులుగా ఉన్నారన్నారు. పూర్తి అర్హత కలిగిన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.అంతేకాదు లక్ష్మినారాయణ విశాఖ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారని, ఆయన ఈ పిటిషన్ ను రాజకీయ ప్రయోజనాల కోసమే వేసినట్లున్నారని కూడా తన కౌంటర్ లో కేంద్రం పేర్కొంది.  విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు వీల్లేదని.. ప్రజాసంఘాలు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. రాజకీయ నేతలు కూడా.. దీనిలో భాగమయ్యారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తన పదవికి రాజీనామా కూడా సమర్పించారు. ఇక ప్రభుత్వం పరంగా కూడా జగన్ లేఖలు రాస్తున్నారు. రాశారు. అయితే.. జగన్ ప్రయత్నాలను మొసలి కన్నీళ్లుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొందరు న్యాయపోరాటం చేస్తున్నారు. అయినా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

జూలై 30న సీబీఐకి శీలపరీక్ష.. జగన్ బెయిల్ కేసుపై ఉత్కంఠ 

రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించడమే కాదు, అలా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం కూడా అవసరమే. కాదంటే, వ్యవస్థల పట్ల ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది. సంస్థలు అపవాదులను మోయవలసి వస్తుంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సీబీఐ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మోస్తున్న అపవాదులు చాలావన్నట్లుగా కొత్త తప్పులు తలకు చుట్టుకుంటోంది. గతంలో ఎప్పుడోనే భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు, సీబీఐని, సర్కార్ పలుకులు పలికే ‘పంజరంలో చిలక’ అని అభివర్ణించింది.  ఒకప్పుడు సీబీఐ అంటే, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ గా ప్రసిద్ధి చెందింది. అప్పటి విపక్షాలు ఆ విధంగా ఆరోపించాయి. అలాగే, ఇప్పుడు, కాంగ్రెస్ సహా  ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో సీబీఐ కీలుబొమ్మని ఆరోపిస్తున్నాయి. నిజానికి, అప్పుడైనా, ఇప్పుడైనా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ అనేది, మెజారిటీ ప్రజల అభిప్రాయం. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఆయన బెయిలు రద్దుకు సంబందించి సొంత పార్టీ, వైసీపీ రెబెల్ ఎంపీ దాఖలు చేసిన కేసులో అలాగే,ముఖ్యమంత్రి సొంత బాబాయి, వైఎస్ వివేకానంద మర్డర్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని సామాన్య ప్రజలు కూడా సందేహలు వ్యక్తపరుస్తున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు, ప్రొసీజర్ పాటిస్తూ. అటు నిందితుడు జగన్మోహన్ రెడ్డిని, పిటీషన్ వేసిన రఘురామ కృష్ణం రాజును అలాగే, ఈ కేసును పుష్కర కాలానికి పైగా విచారిస్తున్నసీబీఐని కౌంటర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబందించి నిందితుడు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు, రఘురామ కృష్ణం రాజు తరపు న్యాయవాదులు లిఖితపూర్వకంగా  కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ మాత్రం దాగుడు మూతలు ఆడుతోంది. ముందు, ఇదిగో అదిగో అంటూ ఒకటి రెండు వాయిదాలు కోరింది. చివరకు  మీ ఇష్టం చట్టం ఎలా చెబితే ఆలా చేయండి అంటూ భారాన్ని కోర్టుకు వదిలేసింది.  మళ్ళీ తూచ్ ... మేము కూడా  లిఖిత  పూర్వకంగా మా వాదన వినిపిస్తామంటూ .. జూలై  14న కోర్టును సీబీఐ కోరింది. అందుకు  పది రోజులు గడవు కోరింది. అన్నిటికీ ఓకే చెప్పిన సీబీఐ న్యాయస్థానం, ఈ నెల (జూలై)26కు విచారణ వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశం, అని కూడా కొంచెం చాలా గట్టిగానే చెప్పింది. అయినా జూలై 26 సోమవారం సీబీఐ సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. సీబీఐ అధికారికి   జ్వ‌రంగా ఉన్నందున విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని, కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీబీఐ లాయ‌ర్లు కోర్టును కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.ఈ వ్యవహారం చూస్తుంటే ఏదో విధంగా జగన్ రెడ్డి బెయిలు రద్దు పిటీషన్’పై తుది తీర్పు సాధ్యమైనంత వరకు వాయిదా వేయలనేదే సీబీఐ సంకల్పంగా, అందుకోసమే ఇన్ని అడ్డదారులు తొక్కుతోందనే అనుమానాలు బల పడుతున్నాయి.  రేపు జూలై 30న మరో మెలిక పెట్టి మళ్ళీ వాయిదా కోరితే, అదే నిజమని అనుకోక తప్పదు. ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయిన సంస్థ మరింతగా విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. అంతే కాదు, ఒక్క సీబీఐ మాత్రమే కాదు, సీబీఐ ని వెనకనుంచి నడిపించే కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఇప్పటికే, బీజేపీ, వైసీపీల మధ్య చీకటి బంధం ఉందన్న ఆరోపణఉండనే వుది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు.అందుకే జూలై 30న సీబీఐ శీల పరీక్షను ఎదుర్కుంటోందని అంటున్నారు.  ఇక జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో విచారణ అధికారిని బదిలీచేయడం కూడా, సీబీఐ ఎవరికైనా కొమ్ము కాస్తోందా అనే అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. 

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇంకా భారీగానే వస్తున్నాయి. రోజుకు 2 వేలకు పైగానే  కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ఆంక్షలు తొలగించడంతో జనాలు యథేచ్చగా తిరుగుతున్నారు. మాస్కులు లేకుండానే గుంపులు గుంపులుగా వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలన్న సోయి కూడా మర్చిపోయారు. త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు, జనాల అజాగ్రత్తలతో వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  ఏపీలో వైరస్ కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఐసొలేషన్ లోకి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని ఆయన ప్రకటన విడుదల చేశారు. 

జ‌నాల‌కు చెవిలో పువ్వు.. బీజేపీ మాట‌ల‌కు అర్థాలే వేరులే..

2014లో భారీ మెజార్టీతో గెలిచింది బీజేపీ. అద్వానీనే ప్ర‌ధాని అనుకున్నారంతా. పెద్దాయ‌న‌కు వ‌య‌సు మ‌ళ్లిందంటూ ప‌క్క‌న‌పెట్టేసి.. అంద‌ల‌మెక్కారు మోదీ. ఎప్ప‌టికైనా త‌న దారికి అడ్డొస్తార‌నేమో మ‌రో సీనియ‌ర్ నేత‌ ముర‌ళీమ‌నోహ‌ర్ జోషినీ అదే సాకుతో అడ్డు తొల‌గించుకున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి ప‌ద‌వుల్లేవ్ అంటూ బాజా మోగించారు. అదే కార‌ణంతో తాజా కేబినేట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లోనూ కొంద‌రు సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. లేటెస్ట్‌గా మ‌రో వ‌య‌సు వేటు ప‌డింది. క‌ర్ణాట‌క సీఎం కుర్చీ నుంచి 79 ఏళ్ల య‌డ్యూర‌ప్ప‌ను అర్థాంత‌రంగా దింపేసింది బీజేపీ. ఆయ‌న సీఎం ప‌ద‌వి చేప‌ట్టి రెండేళ్లే అవుతోంది. అంటే, అప్పుడాయ‌న వ‌య‌సు 77. ఈ లెక్క‌న 77 ఏళ్లు ఉంటే వ‌య‌సులో ఉన్న‌ట్టు.. 79 వ‌స్తే వ‌య‌సు మీరిన‌వాడు అన్న‌ట్టా బీజేపీ ఉద్దేశ్యం? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా జ‌నం చేవిలో క‌మ‌లం పువ్వు పెట్ట‌డమేన‌ని.. కాషాయ పెద్ద‌లు ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌కు య‌డ్యూర‌ప్ప బ‌లైపోయార‌ని అంటున్నారు.  బీజేపీ చెబుతున్న కుంటి సాకుల‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. ఇటీవ‌ల‌ 89 ఏళ్ల మెట్రో మ్యాన్ శంక‌ర‌న్‌ను కేర‌ళ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన బీజేపీకి అప్పుడు ఈ ఏజ్ ఫ్యాక్ట‌ర్ గుర్తుకు రాలేదా? అని నిల‌దీస్తున్నారు. కేరళ‌కో రూల్‌.. క‌ర్ణాట‌క‌కు మ‌రో రూలా? అని మండిప‌డుతున్నారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్ 17కి మోదీకి సైతం 70 ఏళ్లు నిండుతాయ‌ని.. మ‌రి ఆయ‌న కూడా ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వైదొలుగుతారా? అని సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నెటిజ‌న్లు.  క‌ర్ణాట‌క‌లో రెండేళ్ల‌కే సీఎం మారిపోయారు. అటు, ఉత్త‌రాఖండ్‌లోనూ ఇప్ప‌టికే ముచ్చ‌ట‌గా ముగ్గురు ముఖ్య‌మంత్రులు చేంజ్ అయ్యారు. ఇక‌, గ‌వ‌ర్న‌ర్లు సైతం ప‌దే ప‌దే మారుతుండ‌టం కామ‌న్‌గా మారింది. ఇక మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ఎన్సీపీని చీల్చే ప్ర‌య‌త్నాన్ని దేశ‌మంతా అస‌హ్యించుకుంది. బెంగాల్‌లో మ‌మ‌త స‌ర్కారును కేసుల‌తో భ‌య‌భ్రాంతుల‌ను గురి చేస్తున్న‌ వైనాన్ని అంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వ్య‌తిరేకంగా లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను ఉసిగొల్పుతున్న తీరు బీజేపీకే మైన‌స్‌గా మారుతోంది.  ఇక ఏపీలో వైసీపీ స‌ర్కారుతో కుమ్మ‌క్కై.. జ‌గ‌న్‌కు సీబీఐ ర‌క్ష క‌ల్పిస్తుండ‌టం.. ప్ర‌త్యేక హోదా అట‌కెక్కించ‌డం, పోల‌వ‌రం నిధుల‌కు గండి పెట్ట‌డం.. విశాఖ ఉక్కును అడ్డంగా అమ్ముకోబోతుండ‌టం.. అడ్డ‌గోలు అప్పులు, ఆల‌యాల‌ దాడుల‌పై జోక్యం చేసుకోకుండా అవినీతి, అరాచ‌క ప్ర‌భుత్వానికి కొమ్ముకాస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అటు, తెలంగాణ‌కు ఐటీఐఆర్ కారిడార్‌ ఎగ్గొట్ట‌డం.. బీహార్‌కు నిధుల వ‌ర‌ద పారించ‌డం.. ఇలా దేశాన్ని విభ‌జించి పాలిస్తోంద‌నే ఆగ్ర‌హం ప్ర‌జ‌ల నుంచి వెల్లువెత్తుతోంది. విదేశాల నుంచి న‌ల్ల‌ధ‌నం తీసుకొస్తామంటూ బీజేపీ ఆడిన‌ డ్రామాను ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌ర్చిపోయినా.. తాజాగా వివిధ రాష్ట్రాల‌తో, వివిధ పార్టీల‌తో క‌మ‌ల‌నాథులు ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామాను చూసి అంతా అస‌హ్యించుకుంటున్నారు.  గ‌తంలో కాంగ్రెస్ ఇలానే చేస్తే.. ఆ పార్టీకి బుద్ది చెప్పి.. రెండు ప‌ర్యాయాలుగా అధికారానికి దూరం పెట్టారు ప్ర‌జ‌లు. గ‌తంలో ముఖ్య‌మంత్రుల‌ను ప‌దే ప‌దే మార్చే సంస్కృతి కాంగ్రెస్‌దే. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు వాడుకునే అల‌వాటు కాంగ్రెస్‌దే. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను చీల్చి.. రాష్ట్రాల‌ను విభ‌జించి పాలించిన చ‌రిత్ర కాంగ్రెస్‌దే. అందుకే, ఆ పార్టీకి క‌ర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు బీజేపీ సైతం నాటి కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తోందని అంటున్నారు. ఆ తాను ముక్కేనంటూ మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు అవినీతికి కేరాఫ్‌గా మారితే.. బీజేపీ స‌ర్కారుకు సైతం ఎంతోకొంత అవినీతి మ‌ర‌క అంట‌క‌పోలేదు. ర‌ఫేల్ కొనుగోళ్ల‌లో భారీ స్థాయిలో క‌రెప్ష‌న్ జ‌రిగింద‌నేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. దేశ సంప‌ద‌ను అంబానీ, అదానీల‌కు దోచిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌. మాల్యా, మోదీ, చోక్సీలు బ్యాంకుల‌ను కొల్ల‌గొట్టి విదేశాల‌కు చెక్కేయ‌డం స‌ర్కారు చేత‌గానిత‌న‌నేన‌నే ప్ర‌చారం. ఇక పెగాస‌స్‌తో బీజేపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతోంది. దేశ ప్ర‌జ‌ల‌పైనే నిఘా పెట్టిన బ‌రితెగింపుతో బాగా బ‌ద్నామ్ అవుతోంది. అందుకే, రోజురోజుకీ బీజేపీ గ్రాఫ్ బాగా ప‌డిపోతోంది. తీరు మార‌క‌పోతే.. కాంగ్రెస్ వాస‌న‌లు వీడ‌క‌పోతే.. కాషాయ పార్టీకి సైతం కాంగ్రెస్‌లా శిక్ష త‌ప్ప‌క‌పోవ‌చ్చని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, కాషాయ పార్టీకి ఇప్ప‌టికైనా క‌నువిప్పు క‌లిగేనా? ఇలానే క‌ళ్లు మూసుకొని పాలిస్తుందా?

ప్రవీణ్ కుమార్ టార్గెట్ ఫిక్స్? దళిత బంధు ఆశతో గులాబీ బాస్?  

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాక్కులో, వైఖరిలో క్లారిటీ వచ్చింది. తనకు రాజకీయ శత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించారు. అలాగే సామాజికవర్గాల్లో తనతో వచ్చేవారెవరో అంచనా రూపొందించుకున్నారు. అందుకు సూర్యాపేటలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన డెలివరీ చేసిన డైలాగులే సాక్ష్యం. గురుకులాల కార్యదర్శిగా రాజీనామా చేసిన తరువాత పలు ఇంటర్వ్యూల్లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలకు, తాజాగా సూర్యాపేటలో ఆయన మాటల్లో స్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు ఆయన స్పీచ్ విన్నవారు.  తాను చేసిన త్యాగానికి అర్ధం ఉండాలంటే బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తామెవరినీ అడుక్కోవలసిన అవసరం లేకుండా బహుజన రాజ్యాన్ని బహుజనులే నిర్మించుకోవాలంటున్నారు. అంతేకాదు.. డబ్బున్న అగ్రవర్ణ నేతల రాజకీయ కబంధ హస్తాల నుంచి బయట పడాలంటే బహుజన అధికార నిధి కోసం అందరూ త్యాగభావాన్ని అలవరచుకోవాలని కోరుతున్నారు. అంటే పార్టీ ఫండ్ కోసం ఎవరినో అడగడం కాదు.. తమ పార్టీ ఖర్చులు తామే భరించుకోవాలని, అప్పుడే రాజకీయ, సామాజిక యుద్ధం ఫలితాలిస్తుందని తాత్విక కోణాలు ఆవిష్కరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రస్థానంలో దీన్ని పరిణతి గల అంశంగా చూడాలంటున్నారు రాజకీయ పండితులు. పాలకులంతా అక్రమాస్తులతో ప్రజల్ని వంచిస్తున్నారని, ఓట్లను కొనుగోలు చేసి మోసం చేస్తున్నారని ముఖ్యంగా అధికార పార్టీ నమ్ముకున్న ఎలక్షనీరింగ్ మీద దాడిని ప్రారంభించారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ అమరుల త్యాగాల మీద ఇంకొకరు సుఖపడటమేంటని, అసలు అమరులైనవారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారేనంటూ పరోక్షంగా అన్ని సామాజికవర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తూ బహుజన రాజ్యాధికారానికి బాటలు వేస్తున్నారు. చరిత్రాత్మక నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ప్రవీణ్.  దళిత, బహుజన, మైనారిటీ వర్గాలతో కదం కదం కలిపి నడిచేందుకు ఇప్పటికే వ్యూహరచన చేసుకున్న ప్రవీణ్.. అగ్రవర్ణ అభిజాత్యపు విమర్శల్లో నిండా మునిగిన కేసీఆర్ మీద సామాజిక అస్త్రాలు సంధించేందుకు రెడీ అయ్యారు. అందుకు గ్రౌండ్స్ కూడా చాలా పటిష్టంగా తయారు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 8న బీఎస్పీలో చేరిక ఖాయమైపోగా అంతకుముందు ప్రతిరోజూ ప్రజల్లో ఉండేందుకు, మీడియాలో ఉండేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలు కవరయ్యేలాగా రోజుకో జిల్లాలో సమ్మేళనాలు నిర్వహించి తాను పార్టీ కండువా కప్పుకునేనాటికి విపరీతమైన హైప్ క్రియేట్ చేయాలని స్కెచ్ వేసుకున్నారు. ఆయన ఆ దిశగానే కదులుతుండడం అటు టీఆర్ఎస్ అధినాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. చాపకింద నీరులా వస్తున్న ప్రవీణ్ కుమార్ (పీకే), ఆయన స్వేరో సైన్యానికి జడిసే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును అకస్మాత్తుగా హుజూరాబాద్ ఎన్నికకు ముందే ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు.  అటు పీకే కూడా తన లోగుట్టు కేసీఆర్ గుర్తించడం వల్లే ఇటీవల కేబినెట్ భేటీలో తన గురించి చాలాసేపు చర్చ జరిగిందని, ఆ తదుపరి తనపై ప్రభుత్వం శాఖాపరంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్నందువల్లే ఆరేళ్ల సర్వీసును త్యాగం చేయాల్సి వచ్చిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ సర్కారుకు ఎక్కడా వ్యతిరేకంగా కనిపించకుండా అణిగిమణిగి ఉన్న పీకే, ఆ బాధ్యతలను పక్కన పెట్టగానే సర్కారు మీద అస్త్రాలు ఎక్కుపెట్టడం గమనించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే హుజూరాబాద్ లో పీకే పోటీ చేయడాన్ని కూడా కొట్టిపారేయలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

బొమ్మలాట కాదు .. బొమ్మైకి కత్తిమీద సామే..

కర్ణాటక రాష్ట్రంలో సుమారు రెండు నెలలకు పైగా సాగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడింది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో 12 మంది కేంద్ర మంత్రులకు ఇట్టే  ఉద్వాసన పలిగిన బీజేపీ కేంద్ర నాయకత్వం, కర్ణాటక ముఖ్యమంత్రి పదవినుంచి బీఎస్ యడ్యూరప్పను తప్పించేందుకు మాత్రం చాలా చాలా కసరత్తే చేసింది. వ్యూహాలను పన్నింది. పావులు కదిపింది. చివరకు ఎలాగైతేనేమి, 78 ఏళ్ల యడ్డీని అదే వయసు వంకగా చూపించి సగౌరవంగా సాగనంపింది. ఆయన సోమవారం  ‘స్వచ్చందంగా’, తమ పదవికి రాజీనామా చేశారు.అక్కడి నుంచి 24 గంటలు తిరగక ముందే అధిష్ఠానం ఆదేశం మేరకు, బీజేపీ శాసన సభాపక్షం కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మైని ఎన్నుకుంది. ఈయన మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ నాయకుడు ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. ఆయన బుధవారం రాష్ట్ర 20 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ వ్యవహరంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.నాయకత్వ మార్పును సాఫీగా కానిచ్చింది. అలాగే, యడియూరప్ప వారసుడి ఎంపిక ప్రక్రియను కూడా హేండిల్ విత్ కేర్  అన్నట్లుగా చాలా సున్నితంగా కానిచ్చింది.   అయితే ఇల్లలకగానే పండగ కాదు, అన్నట్లుగా యడ్యూరప్పను తప్పించడంతోనే కథ సుఖాంతం అయినట్లు కాదు, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. యడ్యూరప్ప రెండేళ్ళ పాలన మిగిల్చిన మరకలు ఒక వైపు, ఆయన నీడ మరొక వైపు కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని వెంటడుతూనే ఉంటాయి. అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, బొమ్మైను సెలెక్ట్ చేసింది యడ్డీనే కావడం, ఇద్దరూ ఒకే  (లింగాయత్) సామాజిక వర్గానికే చెందినవారు కావడం ఇటు కొత్త ముఖ్యమంత్రికి, అటు పార్టీ అధిష్ఠానికి కూడా కొంత ఊరట ఇచ్చే, అంశంగానే పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసిన రావడం పట్ల ఆగ్రహంగా ఉన్న యడ్డీని అలాగే, ఆయన కంట కన్నీరు చూసి కరిగిపోయి, బీజేపీని శపించిన లింగాయత్ సామాజిక వర్గాన్ని బుజ్జగించెందుకే,అదే సామాజిక వర్గానికి చెందిన బొమ్మైని అధిష్ఠానం ఎంపిక చేసిందని, పరిశీలకులు భావిస్తున్నారు.మరో వంక  జనతా పరివార్‌కు చెందినవారు కావడం, యడ్డికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొంది అధిష్ఠానం పెద్దలతోనూ సత్సంబంధాలు కలిగివుండడం, బీజేపీలో సౌమ్యుడిగా గుర్తింపు పొందడం, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందడం వంటి అంశాలన్నీ బొమ్మైకు కలిసొచ్చాయని భావిస్తున్నారు.  అయితే, కొత్త ముఖ్యమంత్రి ముందున్న సవాళ్ళు సామాన్య మైనవి కాదు. మరో 18 నెలల్లో శాసన సభ ఎన్నికల పెద్ద పరీక్షకు పార్టీని సిద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు.కొవిడ్ 19, వరదలు, మరో వంక ఆర్థిక వ్యవహారాలు ఇలా అన్ని దిక్కులా నుంచి సమస్యలు, సంక్షేమాలు కళ్ళురుముతున్నాయి. అలాగే, రాజకీయంగానూ, బొమ్మై ముందు చాలానే సమస్యలున్నాయి. యడ్యూరప్ప రెండేళ్ళ పాలనలో అవినీతి అరోపణలురాని  రోజంటూ లేదు. అది కూడా ప్రతిపక్షాల నుంచి కాదు,సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే యడ్డీకి వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు.అలాగే, యడ్డీ చిన్న కొడుకు విజయేంద్ర ప్రభుత్వ వ్యవహరాలలో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలున్నాయి. నిజానికి యడ్డీ ఉద్వాసనకు ఇవ్వన్నీ కూడా కారణమయ్యాయి.అదే విధంగా కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు యడ్డీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణ వుంది. ఈ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ ... మరో వంక సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులకు దీటుగా రాజకీయాలు చేయడం కొత్త ముఖ్యమంత్రి బొమ్మైకి కత్తి మీద సాముగానే పరిశీలకులు భావిస్తున్నారు.  

పారిశ్రామిక పితామహుడు.. వేలాది కుటంబాల్లో వెలుగులు.. ముళ్లపూడికి శతకోటి వందనాలు 

నిలువెత్తు తెలుగుదనం, కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షల ప్రతిరూపం డాక్టర్ ముళ్ళపూడి సత్యహరిశ్చంద్రప్రసాద్. ఆంధ్రా పారిశ్రామికరంగ పితామహుడు, పారిశ్రామిక భగీరధుడుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్  దక్షిణ భారత దేశంలో "ఆంధ్రా బిర్లాగా" సుపరిచితులు.  ఆంధ్రషుగర్స్ ఆంధ్రాపెట్రోకెమికల్స్  లాంటి ఎన్నో వ్యవసాయ ఆధారిత భారీ పరిశ్రమల స్ధాపన ద్వారా, ఆంధ్ర పారిశ్రామిక రంగానికి మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పునాదులు వేసి, రాష్ట్రంలో మెుదటితరం పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్.  పారిశ్రామిక అంతరిక్ష  రాకెట్  ఇంధన  తయారీ ద్వారా  భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన సగర్వంగా చేర్చారు. తణుకును పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దారు. ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యంగా ఉభయగోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్టణం, రాయలసీమలలోనే కాక.. దేశంలోనే పలు చోట్ల కొన్ని వేల, లక్షల కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి మరియు విద్యావకాశాలు కల్పించి వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆదర్శమూర్తి డాక్టర్ సత్యహరిశ్చంద్రప్రసాద్.  పశ్చిమగోదావరి జిల్లా కోస్తాంధ్ర ఉండ్రాజవరం సంస్ధానాధీశులు, తణుకు ముళ్ళపూడి జమిందారుల వంశంలో.. ఆంధ్రభోజ, సాహితీ వల్లభ, కళాప్రపూర్ణ కీ.శే. ముళ్ళపూడితిమ్మరాజు- వెంకటరమణమ్మ దంపతులకు 1921లో జన్మించారు సత్యహరిశ్చంద్రప్రసాద్. చిన్నతనం నుండే ఆయన తాతగారు, ఉండ్రాజవరం సంస్ధానాధీశులు, "రైతురాయడు" గా ప్రసిధ్ధి గాంచిన ముళ్ళపూడి వేంకటరాయుడు అడుగుజాడల్లో నడిచారు.  ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాతగా ప్రసిధ్ధి పొందారు. తాత తండ్రుల వారసత్వంగా గాంధీజీ సిధ్ధాంతాలపై ఆశక్తి పెంచుకొన్న ముళ్ళపూడి..స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని సమరయోధుడిగానిలిచారు.  పాఠశాల విద్య (ఎస్ఎస్ యల్ సి) పూర్తి చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (ఆగస్ట్ 11, 1947) తణుకు లో ఆంధ్రా సుగర్స్ స్థాపించారు. గ్రామీణభారతాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల సహాయంతో పారిశ్రామికంగా అభివృధ్ధి చేసి విద్యా ఉద్యోగ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరాన్ని ఆయన చిన్నతనంలోనే గుర్తించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపారు. గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ ఇది.    గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రా షుగర్స్ లో ప్రస్తుతం 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడి తో మొదలయ్యి.. ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది. రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ కూడా ఇదే.  దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ కూడా ఇదే. అంతేకాదు ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత సత్య హరిశ్చంద్రప్రసాదే. భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము కూడా ఆయన నెలకొల్పిందే.  పశ్చిమగోదావరి జిల్లాలోని  తణుకును పారిశ్రామిక పట్టణంగా తయారుచేసి ప్రపంచ పటంలో నిలిపారు. దేశ విదేశాలు పయనించి శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగతిని అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో  అగ్రభాగాన నిలిపిన ఘనత ఆంధ్రాబిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాదే. ఈ అభివృధ్ధి నమూనానే నేటి తరం నాయకులు అవలంబిస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ రంగంలో ఎన్నో విశిష్ట పదవులను అలంకరించారు ముళ్ళపూడి సత్యహరిశ్చంద్రప్రసాద్. ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందారు. తాత వెంకట్రాయుడు, తండ్రి తిమ్మరాజు గారి అడుగు జాడల్లో నడిచి.. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు, వృధ్ధాశ్రమాలు స్ధాపించి సమాజానికి ఎంతో సేవచేసారు. ఆంధ్రుల పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాన్ని అంతరిక్ష స్ధాయికి చేర్చిన మహనీయుడు డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కు  శత జయంతి సందర్భంగా ఘన నివాళులు..

తెలంగాణ‌కు ఏపీ హెల్పింగ్ హ్యాండ్‌.. దొందుదొందేన‌ని క్లియ‌ర్‌..

పైపైన తిట్టుకుందాం.. కొట్టుకుందాం.. జ‌నాన్ని ప‌రేషాన్ చేద్దాం. లోలోనా మాత్రం మ‌నం మ‌నం ఒక్క‌టే అన్న‌ట్టు ఉందాం. ఇదే ఇప్పుడు ఇద్ద‌రు సీఎంలు ఫాలో అవుతున్న ఫార్ములాగా ఉంది. జ‌గ‌జ‌గ‌డంపై రెండు రాష్ట్రాలు క‌త్తులు దూస్తున్నాయి. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర పోలీసుల‌ను మోహ‌రిస్తున్నాయి. కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. మంత్రులు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇక స‌మ‌ర‌మే అన్న‌ట్టు తెగ సీన్ క్రియేట్ చేస్తున్నారు. క‌ట్ చేస్తే.. ఒక‌రికొక‌రు తోడుగా ఉంటున్నారు. ప‌ర‌స్ప‌రం సాయం చేసుకుంటున్నారు. తాజాగా, ఏపీ స‌ర్కారు త‌న మిత్రుడైన కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఓ సాఫ్ట్‌వేర్ షేర్ చేసింది. రాబోవు ఫ్రెండ్‌షిప్ డేకి ముందే గిఫ్ట్ ఇచ్చిన‌ట్టుంది.  తెలంగాణకు జగన్ సర్కార్ సాయం అందించింది. ‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 'మన బడి', 'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉప‌యోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నా.. ఏపీ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ అడ‌గ‌డం.. అందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగీకరించడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సిద్ధ‌మ‌వుతోంది. ఆ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏపీ ద‌గ్గ‌ర ఉన్న‌ నాడు–నేడు సాఫ్ట్‌వేర్‌ ప్రయోజనకరంగా ఉంటుందని.. తాము కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటామని.. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు కార్య‌క్ర‌మ‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ త‌యారు చేసిన‌ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ప్రభుత్వం వినియోగిస్తోంది. ఎన్ని పనులు చేపట్టారు? ఎన్ని పనులు పూర్తయ్యాయి? ఎన్ని నిధులు ఖర్చయ్యాయి? తదితర అంశాలన్నీ తెలిసేలా ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌నే  తాజాగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం మేర‌కు ఆ రాష్ట్రానికి అందిస్తోంది ఏపీ స‌ర్కారు.  ఇక్క‌డ మేట‌ర్‌.. సాఫ్ట్‌వేర్ సాయంకంటే కూడా రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స్నేహాం గురించే ఎక్కువ చ‌ర్చ న‌డుస్తోంది. పైకి రెండు ప్ర‌భుత్వాలు వాట‌ర్ ప్రాజెక్టుల‌పై పోట్లాడుకుంటున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. లోలోప‌ల మాత్రం మంచి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోంద‌ని.. సాఫ్ట్‌వేర్ సాయ‌మే అందుకు ఎగ్జాంపుల్ అని అంటున్నారు. మ‌రెందుకో పైకి ఆ వాట‌ర్ వార్‌ డ్రామా? ప్ర‌జ‌ల భావోద్రేకాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఎందుకో? అని మండిప‌డుతున్నారు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు.   

అత్తిలి సత్తి… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. 

నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. నిట్టనిలువునా దోచేశాడు. అందుగలదు ఇందులేదు అన్న సందేహం లేదు ఎందెందు చూసిన అందందు గలదు మోసం. ప్రతి పనిలో.. ప్రతిదానిలో భాగమైపోయింది. అందరూ  లాజిక్కుల కంటే ఎక్కువగా మేజిక్కులనే నమ్ముతారు. అందుకే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్లు మనదేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్. మన దేశంలో నకిలీ స్వామీజీలు, దొంగ బాబాల చేసిన.. చేస్తున్న స్కాములు అంత ఇంత కాదు వాళ్ళ మీద సీరియల్స్ తెస్తే ఎపిసోడ్స్ సరిపోవు.. బుక్స్ రాస్తే పెన్నులు పేపర్లు సరిపోవు.. స్వామిలు బాబాలు మోసాలు చేసిన ఎన్ని దారుణాలు చేసిన మళ్ళీ మళ్ళీ జనం  తెలివి లేకుండా ఇంకా వారి వలలో  పడుతున్నారు. తాజాగా సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా  పూజారి. నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) లో ఓ పూజారి బారి మోసానికి తెరలేపాడు. అతని పేరు శ్రీనివాస శర్మ, పురోహితం చేస్తే వచ్చిన  డబ్బులు సపోవడంలేదు అనుకున్నాడేమో మరి.  సుమంగళి వ్రతాలూ చేస్తానని చెప్పి పలువురు మహిళల దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  కోటిన్నర వసూలు చేసి ఉడాయించాడు. డిచ్ పల్లి , బోధన్ , మాక్లూర్ లో మహిళల భర్తల క్షేమం కోసం వ్రతాలూ చేస్తానని నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు నిందితుడు. కొందరు మహిళలు భర్తలకు తెలియకుండా లక్షల్లో అతడికి చెల్లించారు. శ్రీనివాస్ శర్మ మోసం చేశాడని ఆలస్యంగా గ్రహించిన బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాలసీల పేరుతో భారీ మోసం.. ఏ మాట వెనుక ఎవరి స్వార్ధం ఉందొ తెలుసుకోలేనంతకాలం మోసపోతూనే ఉంటాం అని లెనిన్ చెప్పినట్లు.. ఆ విషయాన్నే మరిచిపోయి ఈ ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు. తాజాగా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో ఓ వృద్ధురాలి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.15 లక్షలు దండుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధురాలి(80)తో… ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి లాయాలిటీ, రివర్సల్ బోనస్​ల పేరుతో ఉత్తరప్రదేశ్​కు చెందిన ముగ్గురు సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. బోనస్ డబ్బుల ఆశ చూపి అందినకాడికి దోచుకున్నారు. ఆర్పీఐ, ప్రాసెసింగ్, సెబీ, వివిధ ఛార్జీల పేరుతో రూ.15.47 లక్షలు అకౌంట్లో వేయించుకున్నారు. అనంతరం వారి ఫోన్​ స్విచాఫ్​ రావడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు… యూపీలోని ఘజియాబాద్​కి చెందిన దేవాన్ష్, ఇమ్రాన్ ఖాన్​ను అరెస్టు చేసి రిమాండు​కు తరలించారు. మరో నిందితుడు రస్టజీ పరారీలో ఉన్నట్లు… త్వరలోనే అతడిని పట్టుకుంటామని సైబర్​ పోలీసులు తెలిపారు.  

రామ‌ప్ప‌కు పెను ముప్పు!.. పాల‌కుల‌కు ప‌ట్ట‌దా?

కాక‌తీయుల వైభ‌వానికి యునెస్కో గుర్తింపు. ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా రామ‌ప్ప. అంతా బాగుంది. అంద‌రికీ సంతోషంగా ఉంది. తెలుగుజాతికి ద‌క్కిన గౌర‌వంగా అంతా సంబ‌ర ప‌డుతున్నారు. ఇక‌పైనైనా రామ‌ప్ప‌కు మంచి జ‌నాద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఖుషీ అవుతున్నారు. అయితే, పాల‌కుల అవ‌గాహ‌న రాహిత్యంతో రామ‌ప్ప ఉనికి ప్ర‌మాదంలో ప‌డింది. ప్ర‌భుత్వాల కాసుల క‌క్కుర్తికి చారిత్ర‌క వైభ‌వానికి ముప్పు వాటిల్లుతోంది.  అవును, రామ‌ప్ప టెంపుల్‌కి సింగరేణి ఓపెన్‌ కాస్టు నుంచి ముప్పు పొంచిఉంద‌ని అంటున్నారు. ఆలయానికి జ‌స్ట్ 6 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు ఉత్పత్తికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. బొగ్గు మైనింగ్ కోసం బ్లాస్టింగ్స్ జ‌రిపితే.. ఆ ప్ర‌కంప‌ణ‌లు రామ‌ప్ప వ‌ర‌కూ వ్యాపిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ తొలిసారిగా బొగ్గు బ్లాక్‌ ప్రారంభించింది. 315 హెక్టార్ల అటవీ భూములను, 1,483హెక్టార్ల వ్యవసాయ, అసైన్డ్‌ భూములను సేకరిస్తున్నారు. రానున్న 19 ఏళ్లలో 40.43 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సింగరేణి, రెవెన్యూ శాఖ అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ ఏడాది చివరినాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సింగ‌రేణి ఓపెన్ కాస్టు బ్లాస్టింగ్స్ వ‌ల్ల రామప్ప ఆల‌య పునాదులు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని తెలుస్తోంది. టెంపుల్‌కు కేవ‌లం 6 కిలోమీట‌ర్ల దూరంలోనే సింగ‌రేణి సంస్థ‌ మైనింగ్‌కు ముందుకురావ‌డం ఆందోళ‌న‌క‌ర అంశం. గ‌తంలోనూ ఇలాంటిదే ఓ ఘ‌ట‌న జ‌రిగింది. 2016లో భూపాలపల్లి జిల్లా భీంగణపురం నుంచి రామప్ప వరకు దేవాదుల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వాలని భావించారు. సొరంగం పనులకు  బ్లాస్టింగ్‌ చేయాల్సిన అవసరం ఉండ‌టంతో రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలిపారు. స్థానికులు కూడా  సొరంగం పనులను వ్యతిరేకించి ఆందోళనకు దిగారు. దీంతో ఆ పనులను నిలిపి వేసి, పైపులైన్‌ నిర్మాణంతో దేవాదుల నీటిని తరలిస్తున్నారు.  ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తి కోసం బాంబులతో బ్లాస్టింగ్‌ చేస్తారు. ఈ ప్రభావం భూగర్భం గుండా 10 కిలో మీటర్ల దూరం వ‌ర‌కూ ఉంటుందట‌. అందుకే, 6 కి.మీ. దూరంలో ఉన్న‌ రామప్ప ఆల‌యానికి ప్రమాదం ఏర్ప‌డ‌వ‌చ్చ‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. వెంకటాపూర్‌ ఓపెన్‌కాస్టు ప్రభావంపై మరోసారి సర్వే చేసి, రామప్పకు ముప్పు లేదంటేనే కొనసాగించాలని, లేదంటే బొగ్గు తవ్వకాలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మ‌రి పాల‌కులు, అధికారులు ఏం నిర్ణ‌యం తీసుకుంటారో..? మ‌రోవైపు, రామ‌ప్ప చారిత్ర‌క సంప‌ద సంర‌క్ష‌ణ‌పై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యునెస్కో విధించిన గ‌డువులోగా స‌మ‌గ్ర సంర‌క్ష‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావ‌స్తుశాఖ‌, క‌లెక్ట‌ర్‌తో క‌మిటీ వేసి.. క్షేత్ర‌స్థాయిలో క‌మిటీ ప‌రిశీలించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.   

దాడుల‌తో భ‌య‌పెట్ట‌గ‌ల‌రా? జ‌గ‌న్‌పై తిరుగుబాటు త‌ప్ప‌దా?

కోడ‌లిని కొట్టి అత్త అరిచింద‌నేది సామెత‌. ఇది నిజ‌మేన‌ని ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. సేట్ టు సేమ్‌.. ఈ సామెత‌ను పోలిన సంఘ‌ట‌న ఇప్పుడు ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. బాధితుల‌పైనే కేసులు. దాడికి గురైన వారిపైనే హ‌త్యాయ‌త్నం బ‌నాయింపు. బ‌హుషా.. రాజారెడ్డి రాజ్య‌మే వాళ్ల టార్గెట్ కాబోలు. అందుకే, వ‌రుస‌గా టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా దాడుల‌కు తెగ‌బ‌డుతూనే ఉన్నారు. తాజాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా మీద జ‌రిగిన అటాక్ మ‌రింత అరాచ‌కంగా ఉంది. రాత్రి వేళ‌లో ప‌దుల సంఖ్య‌లో వైసీపీ శ్రేణులు దేవినేని బృందంపై దాడికి బ‌రితెగించారు. కొండ‌ప‌ల్లి అడ‌వుల్లో గ‌ప్‌చుప్‌గా జ‌రుగుతున్న‌ అక్ర‌మ మైనింగ్‌ను బాహ్య ప్ర‌పంచానికి చాటిచెప్ప‌డానికి దేవినేని ఉమా ఆధ్వ‌ర్యంలో టీడీపీ బృందం అక్క‌డికి వెళ్లింది. ఈ విష‌యం తెలిసి వైసీపీ వ‌ర్గాలు దేవినేనిని అడ్డ‌గించి దాడికి పాల్ప‌డ్డారు. టీడీపీ వాళ్లు ఎదురుతిర‌గ‌డంతో దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా బ‌తికిపోయారు. త‌న‌పై జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గా దేవినేని అక్క‌డే కారులో ధ‌ర్నాకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పై నుంచి ఏం ఆదేశాలు వ‌చ్చాయో.. ఖాకీలే కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టారు. దేవినేనిని అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మామూలుగా అయితే అక్క‌డికి ఆ ఉద్రిక్త‌త ముగిసిపోవాలి. కానీ, ఏపీ పోలీసులు క‌దా.. వైసీపీ తొత్తుల్లా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. బాధితుడైన దేవినేనిపైనే ఏకంగా మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌ కేసు పెట్టారు. ఉచ్చు మ‌రింత బిగించేందుకు ఎస్సీ, ఎస్టీ సెక్ష‌న్లు కూడా బ‌నాయించారు. బ‌హుషా పాల‌కులు ఫుల్ ఖుషీ అయింటారు.  కృష్ణా జిల్లా నేత‌ల‌పై ఇలాంటి అరాచ‌కాలు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా దాదాపు ఇలాంటి దాడులే జ‌రిగాయి. అది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యం. బుద్ధా వెంక‌న్న‌, బోండా ఉమాలు మాచ‌ర్ల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌ర్య‌వేక్షించి విజ‌య‌వాడ తిరిగి వ‌స్తున్నారు. మార్గ మ‌ధ్య‌లో వైసీపీ దుండ‌గులు కాపు కాశారు. టీడీపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న కారును వెంబ‌డించి దాడికి దిగారు. పెద్ద పెద్ద దుంగ‌ల‌తో, క‌ర్ర‌ల‌తో, రాళ్ల‌తో అటాక్‌ చేశారు. కిలోమీట‌ర్ల మేర టీడీపీ వారి వాహ‌నాన్ని వెంబ‌డించి మ‌ళ్లీ మ‌ళ్లీ దాడుల‌కు తెగించారు. చివ‌రాఖ‌రికి కారు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంతో అతిక‌ష్టం మీద‌ బ‌తుకు జీవుడా అంటూ ప్రాణాల‌తో విజ‌య‌వాడ చేశారు. అప్పట్లో ఆ అటాక్ పెను దుమారం రేపింది. టీవీల్లో ఆ దృశ్యాలు చూసి అంతా అవాక్క‌య్యారు. ఆ క‌ర్ర గానీ, ఆ రాయి గాని త‌గిలుంటే ఎంత దారుణం జ‌రిగిపోయేది? వాళ్లు వైసీపీ నాయ‌కులా.. బ‌జారు రౌడీలా అంటూ ప్ర‌జ‌లంతా మండిప‌డ్డారు. అయినా, వైసీపీ వాళ్ల బుద్ధి మార‌నేలేదు. దాడుల దారుణాన్ని ఆప‌నేలేదు. తాజాగా మ‌రోసారి దేవినేని ఉమాను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసే ప్ర‌య‌త్నం తీవ్ర స్థాయిలో జ‌రుగుతోంది.  అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, బుద్ధా వెంక‌న్న‌, బోండా ఉమా, కొల్లు ర‌వీంద్ర‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. ఇలా అనేక మంది నోరున్న‌ టీడీపీ నేత‌లే టార్గెట్‌గా వైసీపీ స‌ర్కారు కేసులు, దాడుల‌తో బ‌రితెగిస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ అవినీతి, అరాచ‌క పాల‌న‌ను నిత్యం ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టడ‌మే పాల‌కుల‌కు కళ్ల‌మంట‌గా మారింది. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వినిపించే నోళ్లు నొక్కేసేందుకు.. ప్ర‌ధాన నేత‌ల పేర్లు రాసుకొని మరీ టార్గెట్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కేసులో ఇరికించి నానాతిప్ప‌లు పెట్టారు. ధూళిపాళ్ల న‌రేంద్రపై పాత కేసును కొత్త‌గా బ‌య‌ట‌కు తీసి జైలుకు పంపించారు. ఇలా టీడీపీ నేత‌లంద‌రినీ ఏదో ర‌కంగా కేసుల‌తో ఇబ్బంది పెడుతున్నారు. ఆఖ‌రికి సొంత‌పార్టీ ఎంపీ అయిన ర‌ఘురామ‌ను సైతం వ‌ద‌ల‌కుండా కేసులు, అరెస్టులు, థ‌ర్డ్ డిగ్రీతో చుక్క‌లు చూపిస్తున్నారు.  టీడీపీ టార్గెట్‌గా జ‌రుగుతున్న వ‌రుస దాడులు చూసి.. శాంతికాముకులైన ఆంధ్రులు హ‌డ‌లిపోతున్నారు. క‌డ‌ప ఫ్యాక్ష‌న్‌ను రాష్ట్ర‌మంతా తీసుకొస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. పోలీసుల‌ను పావులుగా వాడుకుంటూ.. చ‌ట్టాన్ని చుట్టంగా మార్చుకొంటూ.. కేసులు, దాడులతో అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని అప‌హ్యాస్యం చేస్తూ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏపీవ్యాప్తంగా అమ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫ్యాక్ష‌న్ మీద స్వారీ ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌క‌ర‌మే. రాజారెడ్డి దారుణ‌ మ‌ర‌ణ‌మే అందుకు నిద‌ర్శ‌నం. మ‌రి, ఆ రాజారెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న నేటి పాల‌కుల పాపం పండే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉందంటున్నారు. కాలం ఎంత‌టివాడినైనా శిక్షించ‌క‌మాన‌దంటూ శ‌పిస్తున్నారు. ఇలా బ‌రితెగించ‌డం దారుణ‌మంటూ మండిప‌డుతున్నారు.