మోడీ దూకుడుకు కళ్ళెం.. విపక్షాలదే విజయం!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు విజయం సాధించాయి. దిగ్విజయంగా సభా కార్యక్రమాలను స్తంభింప చేశాయి. ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలనుకున్న కీలక అంశాలు, ఏవీ ప్రస్తావనకు రాలేదు. పైగాసస్’ ఒక్కటే ఇష్యూగా ఇంతవరకు సభ సమయం పుణ్యకాలం ముగిసిపోయింది. ప్రతిపక్షాల మంకు పట్టును ప్రజలు హర్షిస్తారా, ఆమోదిస్తారా అనే విషయాన్నిన్ని పక్కన పెడితే, మొత్తానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడంలో చాలా వరకు సఫల మయ్యాయి. మోడీ దూకుడుకు కళ్ళెం వేయగాలిగాయి.
మరో వంక సభలోపల వెలుపలా కూడా ప్రతిపక్షాలు ఐక్యతను చూపగలిగాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తొలిసారిగా, కాంగ్రెసేతర విపక్షాలతో మాట కలిపారు. విపక్షాల ఉమ్మడి వ్యూహా సమావేశాలలో చురుగ్గా పాల్గొన్నారు. బహుసా మొదటిసారి, స్వయంగా రాహుల్ విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్’కు ఒక రోజు రైతుల ఆందోళలను హై లైట్ చేస్తూ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ, మరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను హైలైట్ చూస్తూ సైకిల్ మీద వచ్చి మీడియా ఫోకస్ ను తమ వైపుకు తిప్పుకున్నరు ఈ సమావేశాలలో రాహుల్ గాంధీ, ఎన్నో కొన్ని అదనపు పాయింట్స్ అయితే కొట్టేశారు. రాహుల్ నాయకత్వాన్ని అందరూ కాకపోయినా కొందరైనా ఆమోదించారు. పార్లమెంట్ సమావేశాలు మరో నాలుగు రోజులు జరుగుతాయి... ఈనాలుగు రోజుల్లో బ్రహ్మాండం ఎదో జరిగితే ఏమో కానీ, లేదంటే చివరాఖరుకు, పార్లమెంట్ వర్షాకాల సంవేశాలలో ప్రతిపక్షాలు పై చేయి సాధించాయి, అనే మాటే జనంలోకి వెళుతుంది. కొవిడ్ సెకండ్ వేవ్’కు చెక్ పెట్టడంలో మొదలైన మోడీ ప్రభుత్వ వైఫల్యాల చిట్టాలో పార్లమెంట్’ ప్రహసనం కూడా వచ్చి చేరుతుంది.
ఒక విధంగా పార్లమెంట్ లోపల వెలుపలా జరుగుతున్న పరిణామాలు. అధికార కూటమిని మరీ ముఖ్యంగా బీజేపే నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అందుకు సంకేతమే అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు, ఇంతక ముందు ఎప్పుడూ లేని విధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేమంగళ వారం నుంచి మూడు రోజుల పాటు, తమ మంత్రి మండలి సభ్యులో సమావేశాలు కాదు, ఏకంగా సమ్మేళనమే నిర్వహిస్తున్నారు. ప్రదాన మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించి నెలరోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని. మిగిలి మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం అనుసరించవలసిన వ్యూహం, అదే విధంగా మూడేళ్ళ తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటుగా, 2022 లో వచ్చే వివిధ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై కూడా కూలకషంగా చర్చించి, విధానాలను ఖరారు చేస్తారని సమాచారం. అదే విధంగా, ఈ నెల రోజుల్లో కొత్త మంత్రుల పనితీరును కూడా సమీక్షిస్తారు. లక్ష్యాలను నిర్దేశిస్తారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆగష్టు 16 నుంచి కేంద్ర మంత్రులు తమ తమ రాష్ట్రాలలో పర్యటించాలని పార్టీ ఆదేశించింది. ఈ పర్యటనలలో పార్లమెంట్ ద్వారా ప్రజల ముందు ఉంచాలనుకుని, విపక్షాలు సభను సాగనీయక పోవడం వలన చెప్పుకోలేక పోయిన విషయాలను ప్రజల ముంచుతారని, పార్టీ వర్గాల సమాచారం, ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల ఏకైక మంత్రి కిషన్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు.
ఇంతవరకు కారణాలు ఏవైనా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా మొదలు కేంద్ర మంత్రులు, బీజీపే నాయకులు విపక్షాలు విసురుతున్న సవాళ్ళకు సమాధానం ఇవ్వడం లేదు. అయితే, ఇక ఎదురు దాడి చేయక తప్పదని లేదంటే ప్రజలలో ఇంకా ఇంకా పలచన అవుతామని బీజేపీ పెద్దలు గుర్తించారు. సంఖ్యాబలం అండగా పార్లమెంట్ వేదికగా విపక్షాల మీద విరుచుకు పడేందుకు పక్కా వ్యూహంతో సిద్దమైనా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు, వచ్చిపడిన పైగాసస్ హ్యాకింగ్ దుమారంలో ఆ ఎజెండా కొట్టుకు పోయింది. అందుకే, నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని, కమల దళం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మందు గూడును ప్రధాని మోడీ బీజీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు అందించారు. విపక్షాల తీరును ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. విపక్షాలు పార్లమెంట్’ను అడ్డుకోవడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడమే, ప్రజలను అవమానించడమే అని ప్రధాని పేర్కొన్నారు.
పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయడం వలన ప్రజల సంస్యలు చర్చకు రాకపోవడంతో పాటుగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ప్రధాని పేర్కొన్నారు. ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని ఎంపీ లను ఆదేశించారు. ఒక విధంగా చూస్తే విపక్షాలపై దండయాత్రకు కమల దళం, మోడీ సేన సిద్డంవుతున్నాయి. అయితే, కొవిడ్ సెకండ్ వేవ్ మొదలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు ఒకటొకటిగా క్యూ కట్టి బయటకు వస్తున్నాయి. అన్నివర్గాల ప్రజలు ఏదో ఒక విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజులు, కార్మికులు , వివిధ రంగాల ప్రైవేటు ఉద్యోగులు ఉపాధి కోల్పోయి, ఆదాయాలు కుదించుకుపోయి, పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు, మంత్రులు, ఎంపీలు ఇచ్చే ఊక దంపుడు ఉపన్యాసాలు,ఊరటనిస్తాయా.. ప్రజల ఆగ్రహాన్ని చల్లారుస్తాయా .. చూడాలి..