హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా?
posted on Aug 9, 2021 @ 10:19AM
తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికపై నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్ని అక్కడే మోహరించాయి. ఇక్కడి నుంచి గత ఆరు ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పోటీ పడబోతున్నారు. గతంలో కారు గుర్తుపై గెలిచిన ఈటల.. ఈసారి మాత్రం బీజేపీ కమలం పువ్వు గుర్తుతో బరిలో ఉండబోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్ తీసుకుంటున్న అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాని ప్రచారం మాత్రం ముమ్మరంగా చేస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండానే.. నాగార్జున సాగర్ తరహాలో గులాబీ లీడర్లు గ్రామాలు చుట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కారెక్కారు. దీంతో ఆయనే అధికార పార్టీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంతో హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది.
అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ కోసమే వెలుగులోకి తెచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో 45 వేలకు పైగా దళిత ఓటర్లున్నారు. అందుకే ఆ సామాజిక వర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.అధికార పార్టీ అభ్యర్థి మాత్రం బీసీ వర్గం నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, వకుళాభరణం ఎల్.రమణ పొనగంటి మల్లయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు ఇవ్వాలనుకున్నా పెద్దిరెడ్డి మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న పాడి ఉదయానందరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
హుజురాబాగ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నియోజకవర్గంపై ఫోకస్ చేయగా కాంగ్రెస్ వెనకబడింది. ఈటల కోసమే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో హుజురాబాద్ ఉప ఎన్నికను కాంగ్రెస్ కూడా సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. కేసీఆర్ దళిత బంధుకు కౌంటర్ గా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిందట. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా పేరు అనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరును పరిశీలిస్తున్నారట.
టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తే.. బీసీనే పోటీకి దింపాలని పీసీసీ ముఖ్య నేతలు దాదాపుగా నిర్ణయానికి వచ్చారట. బీసీ కోటాలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నిలబెట్టాలని అనుకున్నా.. ఆయన ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అనూహ్యంగా కొండా దంపతుల పేర్లు తెరపైకి వచ్చాయంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు. ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లోకి మారారు. కాని వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు కొంత కాలంగా స్తబ్ధుగా ఉండిపోయారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపినట్లు సమాచారం.
హుజురాబాద్ నియోజకవర్గానికి వరంగల్ జిల్లాతో లింకులుంటాయి. నియోజకవర్గంలోని కమలాపుర్ మండలం ఇప్పుడు కూడా వరంగల్ జిల్లా పరిధిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన శాయంపేట, పరకాల నియోజకవర్గాలకు పక్కనే హుజురాబాద్ ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో కొండా దంపతులకు భారీగా అనుచర గణం ఉందని చెబుతున్నారు. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల తర్వాత ఎక్కువగా ఓటర్లున్నది మున్నురు కాపులే. దాదాపు 28 వేలకు పైగా వీరి ఓట్లు ఉన్నాయి. పద్మశాలీ ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి. కొండా దంపతుల్లో మురళీ కాపు కాగా.. సురేఖ పద్మశాల. ఈ లెక్కన కొండా బరిలో ఉంటే మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు పద్మశాలి ఓట్లు కూడా కలిసివస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుందని చెబుతున్నారు.