ఉన్న‌తాధికారిపై ఇసుక చల్లిన ఉద్యోగి.. దేవాదాయ‌శాఖ‌లో 'భూ'కంపం..

పై అధికారిపై కోపం వ‌స్తే ఏం చేస్తారు? తిడితే ప‌డ‌తారు.. లేదంటే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తారు.. అదీ కాదంటే తోటి ఉద్యోగులకో, ఇంట్లో వారికో చెప్పుకొని బాధ‌ప‌డతారు. బాస్ పీడ ఎప్పుడు విర‌గ‌డ‌వుతుందా.. ఎప్పుడు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ, ఆమె మాత్రం అలా కాదు. కోపం వ‌చ్చింది. ఆవేశంతో ర‌గిలిపోయింది. ఇక అంతే.. గుప్పెడు ఇసుక తీసుకొచ్చి ఆ అధికారి ముఖంపై కొట్టింది. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు అవ‌డంతో.. ఏపీ దేవాదాయ శాఖ‌లో ర‌చ్చ రంబోలా అవుతోంది.  విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుక వేయ‌డం క‌ల‌క‌లం రేపింది.  పుష్పవర్ధన్‌ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బందిపై పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్ శాంతి ఉదాసీనతను పుష్పవర్ధన్‌ ప్రశ్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని అంటున్నారు.  ఆమె అలా ముఖం మీద ఇసుక చ‌ల్లినా.. డిప్యూటీ క‌మిష‌న‌ర్ పుష్ప‌వ‌ర్థ‌న్ మాత్రం ఏమాత్రం కంట్రోల్ త‌ప్ప‌లేదు. కోపానికి రాలేదు. కుర్చీలో అంతే శాంతంగా కూర్చున్నారు. ఆమెను ప‌ల్లెత్తి మాట కూడా అన‌లేదు. అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పుష్ప‌వ‌ర్థ‌న్‌. విజిలెన్స్‌ సిబ్బంది కార్యాలయానికి చేరుకుని మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు. డీసీ పుష్ప‌వ‌ర్థ‌న్‌పై ఏసీ శాంతి ఇసుక చల్లిన సీసీకెమెరా దృశ్యాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.     

ప్రకాశం జిల్లా వైసీపీలో ఫైటింగ్! త్వరలో ఎంపీ మాగుంట జంప్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. కొంత కాలంగా అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఇదే అదనుగా పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు కొందరు నేతలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు దూకుడుతో కష్టాలు పడుతున్న వైసీపీకి. త్వరలో మరో ఎంపీ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి... ఆ ఎంపీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని  సమాచారం. ఇప్పటికే సదరు ఎంపీ టీడీపీ ముఖ్య నేతలతో మంత్రాంగం నడుపుతున్నారని చెబుతున్నారు.  ప్రకాశం జిల్లా వైసీపీ నేతల మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. తాజాగా అవి తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. తాజాగా వెలుగులోనికి వచ్చిన అక్రమ మైనింగ్ విషయంలోనూ ఎంపీ మాగుంటను సొంత పార్టీ నేతలే ఇరికించే ప్రయత్నాలు చేశారని చర్చ జరుగుతోంది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు సంబంధించి వివాదం జరుగుతోంది. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే అందులో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. ఎంపీ మాగుంట పేరును ఎఫ్ఐఅర్ లో చేర్చడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. మాగుంటకు మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్ర పూరితంగా ఎంపీ మాగుంటను ఇరికించారని ఆరోపించారు.   సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలు ఫోర్జరీ చేయించి సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు తెరలేపారని సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీపీఎస్ విధానం అమర్చి వాహనాల గురించిన సమాచారం తీసుకొని మరీ స్థానికులే స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు సోమిరెడ్డి. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌లో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు చేర్చారన్నారు. సాధారణ గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తి ఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా అని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ మాగుంట  సంతకాన్ని గోవర్థన్ రెడ్డి అనుచరుడే ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఒకే సంతకంతో మూడు దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించ లేదని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న అక్రమ మైనింగ్ కోసం ఎంపీని బలిచేస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్ష తీర్చుకున్నారని.. కాకాణి దోపిడీపై, అరాచకాలపై తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీచేస్తూ, ఏమాత్రం సంబంధంలేని సొంతపార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతమన్నారు. ఎంపీసంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయాలన్నారు. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ ఎంపీ మాగుంటకు మద్దతుగా టీడీపీ నేత ఇలా ఓపెన్ ప్రకటన చేయడం చర్చగా మారింది.  ఇదిలా ఉండగానే పార్లమెంటు వర్షాకాలు సమావేశాల సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి  ఓ పార్టీ ఏర్పాటు చేశారు. మాగుంట నివాసంలో జరిగిన పార్టీకి అనూహ్యంగా టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. నిజానికి ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య వార్ ఓ రేంజ్ లో ఉంటుంది.  పార్లమెంట్ లోనూ ఇరు పార్టీల ఎంపీలు చాలా గ్యాప్ మెయింటేన్ చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా ఢిల్లీలో ఉంటారు. కాని ఏపీ లీడర్లు మాత్రం కలవడానికి ఇష్టపడరు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో కనీసం టీడీపీ ఎంపీలు ఉన్న లాబీల్లోకి కూడా వైసీపీ ఎంపీలు వెళ్లడం లేదు.అలాంటిది వైసీపీ ఎంపీ మాగుంట ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీలు రావడం చర్చనీయాంశంగా మారింది. మాగుంట ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వైసీపీ ఎంపీలు.. అక్కడ టీడీపీ ఎంపీలను చూసి షాకయ్యారట. సొంత పార్టీ ఎంపీలకు.. మాగుంట కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే.. ప్రతిపక్ష పార్టీ ఎంపీలను ఆహ్వానించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాగుంట వైఖరిపై కొందరు వైసీపీ ఎంపీలు ఆగ్రహంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మాగుంట పార్టీలో టీడీపీ ఎంపీలు హాజరైన విషయం బయటకు పొక్కటంతో వైసీపీ పెద్దలు నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారట.  గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎంపీగా  గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు.  టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత మాగుంటను ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల సమయంలో  టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు మాగుంట. జగన్ సునామీలో మాగుంట విజయం సాధించారు. అయితే జిల్లా వైసీపీ నేతలతో మొదటి నుంచి ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాగుంటకు విభేదాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన విషయాల్లోనూ మంత్రి మాగుంటను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ మాగుంటకు పడటం లేదు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు విషయంలోనూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి.. మాగుంటకు మధ్య  వివాదం రేగింది. మాగుంట సపరేట్గా ఆనందయ్య మందును సేకరించి.. ప్రత్యేక శిబిరాలు వేసి ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించలేదు.జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్తోనూ ఇతర నేతలతోనూ మాగుంటకు పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో తాను ఏర్పాటు చేసిన విందుకు మాగుంట,, టీడీపీ ఎంపీలను ఆహ్వానించడం.. వైసీపీ ఎంపీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో మట్టితవ్వకాల విషయంలో ఎంపీ మాగుంట పేరు కేసులో చేర్చడం, దీనికి వ్యతిరేకంగా టీడీపీ మాట్లాడటం ఆసక్తిగా మారింది. తాజా పరిణామాలతో మాగుంట వైఖరిలో మార్పు వచ్చిందా? దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా? అనే చర్చ  మొదైలంది. త్వరలోనే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. టీడీపీ గూటికి చేరడం ఖాయమనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. 

సానియా మిర్జాపై రాజాసింగ్ ర‌చ్చ‌..

తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ‌రు? వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేరు కొంద‌రు. గూగుల్‌లో సెర్చ్ చేసి.. ఓహో, సానియా మిర్జానా అనుకుంటారు. తెలంగాణ‌కు ఓ బ్రాండ్ అంబాసిడ‌ర్ ఉన్నార‌ని.. అది టెన్నిస్‌ ప్లేయ‌ర్ సానియా అని తెలిసాక కూడా అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటే ఏం చేస్తారు? ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అనే విష‌యాలు ప‌క్క‌న‌పెడితే.. ఇప్పుడు ఆ హోదాపై కిరికిరి స్టార్ట్ చేశారు బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌. పాకిస్తాన్ కోడ‌లు మ‌న‌కెందుకు.. తెలంగాణ అమ్మాయి పీవీ సింధును బ్రాండ్ అంబాసిడ‌ర్ చేయాల‌ని డిమాండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన‌ పీవీ సింధుని సీఎం కేసీఆర్ మరింత ప్రోత్సహించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. స్పోర్ట్స్ కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పీవీ సింధు తెలంగాణ అమ్మాయి.. తెలంగాణ‌కే కాకుండా భారతదేశానికి కూడా పేరు తెచ్చిందన్నారు. అందుకే, పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలన్నారు. పాకిస్తాన్ కోడలు (సానిమా మిర్జా)ను సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించడం సరికాదన్నారు.  ప్రముఖ టెన్నీస్ స్టార్‌ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని రాజా సింగ్ గతంలో కూడా డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన సానియా మిర్జా.. పాకిస్తాన్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు.   

రేపోమాపో హుజురాబాద్ నోటిఫికేష‌న్‌.. బీజేపీ స్కెచ్.. కేసీఆర్ అల‌ర్ట్‌.. ఈటల జంప్!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. రేపోమాపో హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాబోతోంద‌ట‌. ఈ మేర‌కు ఢిల్లీ నుంచి లీకులు వ‌స్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు పై నుంచి స‌మాచారం అందింద‌ట‌. ఈట‌ల చెవికీ ఆ మెసేజ్ రీచ్ అయిందే. అందుకే, ఆ ఇద్ద‌రు నేత‌లు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. కేసీఆర్ ప‌రుగున వాసాల‌మ‌ర్రిలో వాలిపోయి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించేశారు. అటు, కాలికి స‌ర్జ‌రీ అయింది.. 10 రోజులు రెస్ట్ అవ‌స‌ర‌మ‌న్నా విన‌కుండా.. ఈట‌ల రాజేంద‌ర్ ఆసుప‌త్రి నుంచి నేరుగా హుజురాబాద్‌కు ప‌రుగులు పెట్టారు. వాళ్లిద్ద‌రి దూకుడు అలా ఉంటే.. ఇటు కాంగ్రెస్ సైతం నిద్ర‌మ‌బ్బు నుంచి మేల్కొని.. కేండిడేట్ సెల‌క్ష‌న్ స్పీడ‌ప్ చేసింది. ఇలా తెలంగాణ‌లో బైపోల్ వార్ ఒక్క‌సారిగా వేడెక్కి.. రాజ‌కీయ హ‌డావుడి అమాంతం పెరిగిపోయింది.  బుధ‌వారం సీఎం కేసీఆర్ స‌డెన్‌గా త‌న ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రికి వెళ్ల‌డం ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. నాగార్జున సాగ‌ర్‌కు వెళ్లిన‌ట్టే.. వాసాల‌మ‌ర్రిలో కూడా ప‌ర్య‌టిస్తారేమో అనుకున్నారంతా. కానీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు సీఎం కేసీఆర్‌. అది పేరుకే వాసాల‌మ‌ర్రి ప‌ర్య‌ట‌న అయినా.. ఆయ‌న టూర్ అంతా ద‌ళితుల చుట్టూనే తిరిగింది. ద‌ళితవాడ‌లో ఇంటింటికీ కాలిన‌డ‌క‌న వెళ్లి ప‌రిశీలించారు. వారి మంచిచెడ్డ‌లు అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ద‌ళితుల‌తోనే ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. మిగ‌తా కులాల వారినెవ్వ‌రినీ ఆ మీటింగ్‌కి రానివ్వ‌లేదు. కొంద‌రు వాసాల‌మ‌ర్రి వాసులు గొడ‌వ చేసినా.. వారిని లోనికి అనుమ‌తించ‌లేదు. అప్పుడు కూడా ఎవ‌రికీ అనుమానం రాలేదు. ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ.. స‌డెన్‌గా ద‌ళిత‌బంధు ప‌థ‌కం వాసాల‌మ‌ర్రి నుంచే ప్రారంభిస్తున్న‌ట్టు.. ఇప్పుడు.. ఈ గంట‌నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం అయిపోయిన‌ట్టు.. ప్ర‌క‌టించేశారు సీఎం కేసీఆర్‌. తర్వాత కొన్ని గంటల్లోనే దళిత బంధుపై జీవో ఇచ్చేశారు, 76 ద‌ళిత కుటుంబాల‌కు  త‌లా 10ల‌క్ష‌లు అకౌంట్లో జ‌మ చేసేశారు.   అంతా ఆశ్చ‌ర్యం. అంద‌రిలోనూ సందేహం. ద‌ళిత‌బంధు స్టార్ట్ అయిపోయిందా.. అని గిల్లి మ‌రీ చూసుకున్నారు కొంద‌రు. హుజురాబాద్‌లో క‌దా ప్రారంభం కావాల్సింది? వాసాల‌మ‌ర్రిలో ఎందుకు మొద‌లు పెట్టారు? ల‌క్ష కోట్ల ప‌థ‌కాన్ని అంత సింపుల్‌గా, ఎలాంటి హంగామా లేకుండా.. అలా ఎలా ప్రారంభించేశారు? కేసీఆర్‌ ఇలా ఎలా చేశారు? అంటూ అనేక అనుమానాలు. ఆ ప్ర‌శ్న‌ల‌న్నిటిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. అస‌లు గుట్టు ర‌ట్ట‌వుతుంది. హ‌మ్మా.. కేసీఆర్ ఇంత‌టి ఎత్తుగ‌డ వేశారా? దాని వెనుక ఇంత పెద్ద రీజ‌న్ దాగుందా? అని తెలిసి అంతా నోరెళ్ల బెగుతున్నారు. రేపోమాపో హుజురాబాద్ బైపోల్‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేస్తుంద‌నే ప‌క్కా స‌మాచారం కేసీఆర్‌కు వ‌చ్చింద‌ట‌. అదే జ‌రిగితే.. షెడ్యూల్ వెలువ‌డితే.. ఇంకా ప్రారంభం కాని ద‌ళిత‌బంధును ఆపేయ‌డం ఖాయం. అది కేసీఆర్‌కు అస‌లుకే ఎస‌రు తెస్తుంది. అందుకే, వెంట‌నే ద‌ళిత‌బంధును స్టార్ట్ చేసేస్తే.. ఆన్ గోయింగ్ ప‌థ‌కం కింద చూపించొచ్చు. అప్పుడు హుజురాబాద్ నోటిఫికేష‌న్ వ‌చ్చినా.. ద‌ళిత బంధుకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఇదంతా హుజురాబాద్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాబోతోంద‌నే లీకుల‌తోనే కేసీఆర్ ఇలా స్కెచ్ వేశార‌ని అంటున్నారు.  కేసీఆర్ తీసుకురాబోతున్న‌ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఎలాగైనా అడ్డుకోవడానికి బీజేపీ పెద్ద‌లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. స‌డెన్‌గా హుజురాబాద్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌డానికి ఈసీ సిద్ద‌మ‌వ‌డం అందులో భాగ‌మేనంటున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టే సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధును సింపుల్‌గా, ఎలాంటి హ‌డావుడి లేకుండా, అప్ప‌టిక‌ప్పుడు స్టార్ట్ చేసేశారు. దీంతో.. కంగుతిన్న క‌మ‌ల‌నాథులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే మేట‌ర్ ఈట‌ల చెవిలో వేసేశారు. అటు ఈసీ నోటిషికేష‌న్‌, ఇటు ద‌ళితబంధు.. విష‌యం తెలిసి ఈట‌ల రాజేంద‌ర్ ఆసుపత్రి బెడ్ మీద‌నుంచి నేరుగా హుజురాబాద్ ప‌య‌న‌మయ్యారు. కాలి గాయం అలానే ఉన్నా.. ఆరోగ్యం కుద‌టప‌డ‌కున్నా.. డాక్ట‌ర్లు వారించినా.. డోంట్‌కేర్ అంటూ.. స‌మ‌యం లేదంటూ.. ఆల‌స్యం అయితే అస‌లుకే మోసం వ‌స్తుందంటూ.. కంగారు కంగారుగా ఈట‌ల మ‌ళ్లీ రంగంలోకి దిగిపోయారు.  కేసీఆర్‌, ఈట‌ల ఇలా హ‌డావుడి ప‌డుతుంటే.. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ విష‌యంలో త‌న‌ న‌త్త‌న‌డ‌క‌లో ఇప్పుడిప్పుడే వేగం పెంచుతోంది. తాజాగా, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి స‌మీక్ష నిర్వ‌హించారు. స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను దామోద‌ర రాజ‌న‌ర్సింహా, పొన్నం ప్ర‌భాక‌ర్‌లకు అప్ప‌గించారు. తాము త‌గ్గైనా.. ఈట‌ల‌ను గెలిపించైనా.. కేసీఆర్‌ను ఓడించేలా రాజ‌కీయ జూదం ఆడుతున్న‌ట్టుంది కాంగ్రెస్‌పార్టీ. అందుకేనేమో.. హుజురాబాద్ విష‌యంలో మొద‌టినుంచీ అంత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు రేవంత్‌రెడ్డి.  ఇలా మూడు పార్టీలు జోరుతో.. రేపోమాపో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌నే లీకుల‌తో.. తెలంగాణ రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కింది. అప్ప‌ట్లో కొడంగ‌ల్ ఎన్నిక‌లా.. ఇప్పుడు హుజురాబాద్ ఎల‌క్ష‌న్ మ‌ళ్లీ స్టేట్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి.. ఎవ‌రి వ్యూహాలు, ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు ఎలా ఉంటాయో.. ఓట‌ర్లు ఎవ‌రి వైపు ఉంటారో..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? బీజేపీ మనసు మారేనా? 

అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు చర్చకు వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారి, కేంద్ర ప్రభుత్వం లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభించిందని, ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనీష్ తివారీ  ట్వీట్  ప్రకారం  ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానల సంఖ్య రెట్టింపు గీతను కూడా దాటి ఏకంగా 1200 ప్లస్ సంఖ్యకు చేరుకుంటుంది. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా లోక్ సభ స్థానాల సంఖ్య రెట్టింపు గీతను దాటేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 25 స్థానాలు 52, తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాలు 39కి చేరుకుంటాయి.  నిజానికి, దేశంలో నియోజక  వర్గాల పునర్విభజన 2026 వరకు గడువుంది.అది కూడా 2021 జనాభా లెక్కల ప్రకారం జరగవలసి ఉంటుంది. కొవిడ్ కారణంగా 2021లో జరగవలసిన జనగణన జరగలేదు.ఆ కారణంగా నియోజక వర్గాల పునర్విభజన ఇంకొంత ఆలస్యం అయినా అవుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తేనే తుట్టెను కదిపింది. జమ్మూ కశ్మీర్’ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా నియోజక వర్గాల  పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. దీంతో నియోజక వర్గాల పునర్విభజన వివాదం మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరో మెలిక కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 (రాష్ట్ర విభజన చట్టం) దేశంలో నియోజక వర్గాల పునః విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునః విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాన్ని కల్పిచింది.ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలను 153కు పెంచుకోవచ్చని విభజన చట్టం సూచించింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం తరచు చర్చకు వస్తోంది. వివాదానికి దారి తీస్తోంది.  కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ సంచలనంగా మారిన నేపధ్యంలో, కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉభయ తెలుగు రాష్టలలోనూ 2026 తర్వాతనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, అంతవరకు ప్రస్తుత స్థితే యథాతథంగా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం సూచించిన విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలంటే, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని గతంలో చెప్పిన  విషయాన్నే నిత్యానంద రాయ్ మరోమారు స్పష్టం చేశారు.  నియోజక వర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న ప్రాతీయ పార్టీలు, ముఖ్యంగా తెరాస కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర సవతి తల్లి ప్రేమ చూపుతోందని, తెరాస సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విరుచుకు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్ ‘ కు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలకు ఒక న్యాయమా అని నిలతీస్తున్నారు. కేంద్ర తలచుకుంటే, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే, విభజన చట్టంలో చిన్న మార్పు చేస్తే నియోజక వర్గాల పునర్విభజన చేపట్ట వచ్చని అంటున్నారు. నిజమే, కానీ, ఒకే ఒక్క నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు, వేల కోట్ల రూపాయల పధకాలను ప్రకటించుకుంటూ పోతూ, అవును హుజురాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు వంటి పథకాలు అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటింఛి నప్పుడు లేని తప్పు కేంద్రంలో అధికరమలో ఉన్న బీజేపీ  నియోజక వర్గాల పునర్విభజనలో రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటే తప్పవుతుందా? అని కమల దళం నాయకులు ప్రశ్నిస్తున్నారు.  తెరాసనే కాదు,బీజేపీ కూడా సన్యాసుల సత్రం కాదు, కదా. ఆవిషయాన్ని ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందు చెప్పారు కదా నాయి గుర్తు చేస్తున్నారు.  అదలా ఉంటే, కారణాలు ఏవైనా, అవి సహేతుకం అయినా కాకున్నా, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో సీట్లు పెరగవు, తెలంగాణ అసెంబ్లీలో 119, ఏపీ అసెంబ్లీలో 175, లోక్ సభలో ఏపీకి 25, టీఎస్ 17...అంతే, ప్రస్తుతానికి ఇంతే.

మోడీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. పెగాసస్ నిఘా నిజమైతే తీవ్రమైన అంశమన్న సీజేఐ

దేశంలో రాజకీయ ప్రకంపనలు స్పష్టిస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎడిటర్స్ గిల్డ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వస్తున్నట్లు గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అటువంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.    పెగాసస్ నిఘా వివాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన ఈ స్పైవేర్‌తో కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పిటిషనర్లు ఎన్ రామ్, తదితరుల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ అని ఆరోపించారు. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోందన్నారు. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి అని తెలిపారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని తెలిపారు. గూఢచర్యం, నిఘా జరుగుతున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయన్నారు. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో, లేదో తనకు తెలియదన్నారు.  ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతున్నారని కపిల్ సిబాల్ తెలిపారు. ప్రైవేటు సంస్థలు దీనిని సంపాదించడం సాధ్యం కాదన్నారు. జర్నలిస్టులు,  కోర్టు ఆఫీసర్స్, విద్యావేత్తలు, రాజ్యాంగ అధికారులపై ఈ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారని చెప్పారు. దీనిని ఎవరు కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్ అంశం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు. పెగాసస్ సాప్ట్‌వేర్ ను ఆసంస్థ కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్మినప్పుడు, ఫోన్ హ్యాకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండదన్నారు సిబల్.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌ లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు ఫోన్లూ హ్యాకింగ్‌ జాబితాలో కనిపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పెగాసస్‌పై పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో ఉభయ సభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఇందులో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ల ట్యాపింగ్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడతారని తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది. ఇది రాజ్యాంగబద్ధత, నేరతత్వానికి సంబంధించింది’’ అని వాదించారు. 

అమ‌ర‌రాజాపై అన్నీ కుట్ర‌లేనా? అస‌లక్క‌డ ఏం జ‌రుగుతోంది? రియాల్టీ చెక్‌..

తిరుప‌తి స‌మీప క‌ర‌కంబాడిలో 36 ఏళ్లుగా అమ‌ర‌రాజా ఉంది. ద‌శాబ్దాలుగా ఎవ‌రికీ ఏ స‌మ‌స్యా లేదు. స‌డెన్‌గా జ‌గ‌న్ స‌ర్కారుకే కాలుష్యం గుర్తుకొచ్చింది. ఇక్క‌డి నేల‌, నీరు, గాలి పొల్యూట్ అవుతున్నాయ‌ని.. వెంట‌నే ఫ్యాక్ట‌రీ మూసేయాల‌ని ఆదేశించింది. ఆ ఆర్డ‌ర్స్ చూసి.. 'అవునా'.. అంటూ అంతా ఆశ్చ‌ర్యం. ఇదేమీ చోద్యం అంటూ ఆగ్ర‌హం. ఎందుకంటే అబ‌ద్దం అలాంటిది మ‌రి. అమ‌ర‌రాజా వ్య‌వ‌స్థాప‌కులు  గ‌ల్లా రామ‌చంద్రనాయుడు కుటుంబం ఫ్యాక్ట‌రీ ఆవ‌ర‌ణ‌లోనే నివ‌సిస్తోంది. అంతా ఆరోగ్యంగా, కులాసాగానే ఉన్నారు. అంత కాలుష్య‌మే ఉంటే.. కంపెనీ ఓనర్లు అక్క‌డే ఎందుకు ఉంటారు చెప్పండి. ఈ చిన్న‌ లాజిక్ జ‌గ‌న్ స‌ర్కారుకు అర్థంకావ‌డం లేదా? లేక‌, అంతా అర్థ‌మ‌య్యే, అక్క‌డ ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేద‌ని తెలిసే.. కావాల‌నే ఇలా చేస్తున్నారా?  అమ‌ర‌రాజా ఫ్యాక్టరీ ఆవరణలో సిబ్బంది కోసం 375 క్వార్టర్స్‌ ఉన్నాయి. వాటిలో సుమారు 2వేల మంది ఉంటున్నారు. ఇదే ప్రాంగణంలో సంస్థ యాజమాన్యం హైస్కూలు నిర్వహిస్తోంది. ఉద్యోగుల పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కలిపి 990 మంది చదువుకుంటున్నారు. అక్క‌డ కాలుష్యం లేద‌న‌డానికి ఇంత‌కంటే ఆధారం ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే..  అమరరాజా బ్యాటరీస్‌ ప్రధాన ప్లాంటు తిరుపతికి బాగా సమీపంలోని కరకంబాడిలో ఉంది. కంపెనీ సమీపంలో కరకంబాడి, తారకరామా నగర్‌, దొడ్లమిట్ట, ఇందిరానగర్‌, రాజీవ్‌గాంధీ కాలనీ, గొల్లపల్లె గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 20వేల మంది వ‌ర‌కూ నివ‌సిస్తున్నారు. వీరిలో ఎవ‌రూ కూడా కంపెనీ కాలుష్యం వ‌ల్ల అనారోగ్యం పాలైన‌ది లేదు. ప్ర‌భుత్వం మాత్రం కరకంబాడిలోని ప్లాంటు కారణంగా గాలి, నీరు, భూమిలో 'లెడ్‌' స్థాయికి మించి ఉందంటోంది. అదే నిజ‌మైతే.. అధిక మోతాదు లెడ్ వ‌ల్ల ఒక్క‌రైనా ఆసుప‌త్రి పాల‌య్యే వారుగా? మ‌రి, అలాంటి కేసు ఒక్క‌టున్నా బ‌య‌ట‌పెట్ట‌మంటూ స‌వాల్ విసురుతున్నారు స్థానికులు. అమ‌ర‌రాజాపై రాజ‌కీయ క‌క్ష్య‌తోనే కాలుష్య‌మంటూ పీసీబీతో కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆ పీసీబీ అధికారులు ఎప్పుడు వ‌చ్చారో.. స్థానిక గ్రామాల్లో ఎలాంటి ప‌రిశీల‌నలు చేశారో.. ఎవ‌రిని ప్ర‌శ్నించారో.. ఎవ‌రి నుంచి ర‌క్త‌ న‌మూనాలు సేక‌రించారో.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ తెలీని చిదంబ‌ర ర‌హ‌స్యం.  ఇక‌, ప్ర‌జ‌ల‌తో పాటు ఫ్యాక్టరీ సమీపంలోని పంటపొలాలు కూడా చక్కగా ఉన్నాయి. అంటే గాలి, నీటి కాలుష్యం లేద‌నేగా అర్థం? పోనీ, స్థానికులెవ‌రైనా ఫిర్యాదు చేశారా? అమ‌ర‌రాజాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు జ‌రిగాయా? ప‌ర్యావ‌ర‌ణ సంస్థ‌లేవైనా ఆందోళ‌న చేశాయా? మ‌రెందుకు ఇంత‌టి ఓవ‌రాక్ష‌న్ అంటూ నిల‌దీస్తున్నారు స్థానిక ప్ర‌జ‌లు.  ఇది.. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా అమరరాజా గ్రూప్‌కు లభించిన సర్టిఫికెట్‌. గత ఏడాది ఫోర్బ్స్‌, స్టాటిస్టికా సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలకు చెందిన లక్షన్నర మంది ఉద్యోగులు/కార్మికులను ప్రశ్నించి... తాము పని చేస్తున్న సంస్థ ప్రతిష్ఠ, విశ్వసనీయత, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీతో అందించే సేవ, స్వభావం, అందుతున్న ప్రయోజనాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. సుమారు 50 లక్షల డాటా పాయింట్స్‌ను విశ్లేషించి ఆయా సంస్థలకు ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఇందులో.. అమరరాజా గ్రూప్‌ను ‘ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థ’లలో ఒకటిగా గుర్తించింది. అమరరాజాకు ప్రపంచస్థాయిలో 316 ర్యాంకు రావడం విశేషం. ఈ జాబితాలో భారత్‌కు చెందిన రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ వంటి అతికొద్ది కంపెనీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇంత‌టి గొప్ప కంపెనీ ఏపీలో ఉన్నందుకు, వేలమందికి ఉపాధి క‌ల్పిస్తున్నందుకు, ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి వేల కోట్ల రాబ‌డి అందిస్తున్నందుకు గ‌ర్వ‌ప‌డ‌దామా? లేక‌, కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ వారు కాబ‌ట్టి ఇంత‌టి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు తెగ‌బ‌డ‌తామా? జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న‌ దుర్నీతితో అమ‌ర‌రాజాలాంటి ప్ర‌పంచ స్థాయి కంపెనీ ప‌క్క రాష్ట్రానికి త‌ర‌లిపోయేందుకు సిద్ధ‌మ‌వ‌డం నిజంగా ఆంధ్రుల దుర‌దృష్ట‌మే. జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇలాంటి దుష్ఫ‌లితాలెన్నో అనుభ‌వించాల్సిందే..  అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారంతా.

వరదల్లో మంత్రి.. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ

ఉత్తర భారతంలో వానలు దంచి కొడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి.కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల గ్రామాలకు గ్రామాలే జలమయమయ్యాయి. దాతియా జిల్లాలో వందలాది గ్రామాలను వరద ముంచెత్తింది. రెండు బ్రిడ్జీలు వరదల ధాటికి పూర్తిగా కూలిపోవడంతో చాలా గ్రామాలకు.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  దాతియా జిల్లాకే చెందిన హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. వరద నీటిలోనే మంత్రి చిక్కుకుపోయారు.వరద బాధితులను రక్షించేందుకు హోంశాఖ మంత్రి బోటులో వెళ్తుండగా..  దగ్గరలోని ఓ చెట్టు ఆ బోటుపై పడడంతో అది ఆగిపోయింది. అప్పటికే ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆ ఇంటివారంతా ఇంటి రూఫ్ పైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అతి కష్టం మీద నరోత్తం మిశ్రా కూడా ఆ ఇంటిని చేరారు. అయితే చుట్టూ నీరు ప్రవహిస్తుండడంతో ఆయన కూడా వారితో బాటు ఆ ఇంటిపైనే చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లే దారి లేక ఆయన అధికారులకు ఫోన్ లో సమాచారమిచ్చారు. దీంతో మంత్రిని రెస్క్టూ చేసేందుకు అధికారులు ఆర్మీ సాయం కోరారు. వైమానిక దళాన్ని సంప్రదించి ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్ పంపారు జిల్లా అధికారులు. అందులోని సిబ్బంది హెలికాఫ్టర్ నుంచి తాడును కిందికి వదలడంతో దాన్ని పట్టుకుని మంత్రి పైకి చేరగలిగారు. ఇతర సహాయక సిబ్బందిని, బాధితులను కూడా ఇలాగే సిబ్బంది రక్షించారు. తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలను విజిట్ చేసి మిశ్రా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని.. అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి నరోత్తం మిశ్రా చర్యను కాంగ్రెస్ పార్టీ ఓ స్టంట్ గా అభివర్ణించింది. ఏదో చేయాలనుకుంటే.. ఏదో జరిగిందంటూ సెటైర్లు వేశారు. 

4 ద‌శాబ్దాల స్వ‌ప్నం.. హాకీలో ఒలింపిక్ ప‌త‌కం.. చెక్‌దే ఇండియా..

భార‌త జాతీయ క్రీడ ఏంటి? నేటి యువ‌త క్రికెట్ అనుకుంటారేమో. హాకీ అని ఎంత మందికి తెలుసు? అలాంటి జాతీయ క్రీడ‌ను క్రికెట్ పూర్తిగా స్వాహా చేసేసింది. దేశంలో హాకీ ప్రాభ‌వం క‌నుమ‌రుగైంది. ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో హాకీపై ఆస‌క్తి క‌న‌బ‌రిచే వాళ్ల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. నాణ్య‌మైన కోచింగ్ సైతం అందుబాటులో ఉండ‌దు. పంజాబ్ రాష్ట్రం పుణ్యమా అని హాకీ అంతోఇంతో బ‌తికే ఉంది. 41 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో మ‌నోళ్లు నిరాశే మిగిలిస్తున్నారు. అలాంటిది.. ఫినిక్స్ ప‌క్షిలా టోక్యో ఒలింపిక్స్‌లో దుమ్మురేపుతూ.. హాకీలో ఇండియా స‌త్తా ఏంటో చాటుతూ.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. కాంస్య ప‌త‌కంతో క‌నువిందు క‌లిగించారు. పున‌ర్‌వైభ‌వం దిశ‌గా.. భార‌త‌మాత‌ మెడ‌ను బ్రాంజ్‌ మెడ‌ల్‌తో అలంక‌రించారు.  4 ద‌శాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది హాకీ ఇండియా. ఉత్కంఠ‌భ‌రితంగా జర్మనీతో జరిగిన కాంస్య పోరులో అద్భుత‌ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. ఇండియా త‌ర‌ఫున సిమ్రన్‌ జీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌ పాల్‌ సింగ్‌ గోల్స్‌ చేశారు.  స్వర్ణం చేజారింద‌నే బాధ‌తో బ‌రిలో దిగిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ గోల్ కొట్టి భార‌త్‌పై ఒత్తిడి పెంచింది. రెండో క్వార్ట‌ర్‌లో భార‌త్ రెచ్చిపోయింది. ఏకంగా మూడు గోల్స్ చేసింది. ఇండియా ఆట‌గాళ్ల పొర‌బాట్ల వ‌ల్ల జ‌ర్మ‌నీకి సైతం గోల్స్ వ‌చ్చాయి. ఆట ముగిసే స‌రికి 5-4 తేడాతో హాకీ ఇండియాదే విజ‌యం. 41 ఏళ్ల త‌ర్వాత చ‌రిత్ర‌లో నిలిచేలా ఒలింపిక్స్ కాంస్య‌ ప‌త‌కం. క‌నీసం ఒలింపిక్స్ మెడ‌ల్ సాధించాకైనా.. ఇండియాలో జాతీయ క్రీడ‌కు పున‌ర్‌వైభ‌వం సాధ్య‌మేనా? క్రికెట్ క్రేజ్‌ను త‌ట్టుకుని హాకీ నిల‌బ‌డ‌గ‌ల‌దా? 

లోక్ సభలో రఘురామ రాజే టాప్.. వైసీపీ ఎంపీలు తుస్..

పార్లమెంట్ సభ్యులు ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తుంటారు. ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిద్యం వహించే ఎంపీలు.. ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతారు. కేంద్ర సర్కార్ సాయం కోరుతుంటారు. తమ వాగ్దాటితో కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు సభల్లో జరిగే కీలక చర్చల్లో పాల్గొని తమ పార్టీ వాయిస్ , తమ వాయిస్ వినిపిస్తుంటారు. అయితే పార్లమెంట్ లో కొందరు ఎంపీలు యాక్టివ్ రోల్ పోషిస్తుండగా.. మరికొందరు మాత్రం మొక్కుబడిగా వెళ్లి వస్తున్నారు. ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్లుగానే కొందరు వ్యవహరిస్తుంటారు. కొందరు ఎంపీలైతే సభలకు కూడా డుమ్మా కొడుతుంటారు. లోక్ సభ సభ్యుల పనితీరుకు సంబంధించి తాజాగా ఓ సంస్థ అధ్యయనం చేసింది.  పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు సంబంధించి సంచలన అంశాలు వెలుగులోనికి వచ్చాయి. పార్లమెంట్ అధికారిక సమాచారాన్ని అసరాగా చేసుకొని ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో కొందరు ఏపీ ఎంపీల పనితీరు చాలా దారుణంగా ఉంది. కొందరైతే అసలు సభలకే వెళ్లడం లేదు. మరికొందరు సభకు వెళ్తున్నా.. సైలెంటుగా కూర్చుని వస్తున్నారు. అధికార వైసీపీ ఎంపీల పనితీరు చాలా దారుణంగా కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. లోక్ సభ హాజరు విషయంలో చివరి స్థానంలో నిలిచారు.  కడప ఎంపీ హాజరుశాతం కేవలం 32 శాతంగా ఉంది.  వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు హాజరు విషయంలో టాప్ లో నిలిచారు. రఘురామ లోక్ సభ హాజరు 96 శాతంగా ఉంది. లోక్ సభలో ఎంపీ రఘురామ రాజు ఇప్పటివరకు మొత్తం 50 డిబేట్లలో పాల్గొనటంతో పాటు.. 145 ప్రశ్నల్ని అడిగారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు తక్కువగా ఉన్నప్పటికి.. సభకు హాజరైన సమయంలో ఆయన ఉత్సాహంగా ప్రశ్నలు వేస్తున్నట్లు నివేదికలో తేలింది. అవినాష్ రెడ్డి ఇప్పటివరకు  146 ప్రశ్నల్ని సంధించారు. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్  హాజరు 89 శాతం ఉంటే.. 54 డిబేట్లలో పాల్గొని మొత్త 133 ప్రశ్నల్ని వేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని  హాజరు విషయంలో గల్లా జయదేవ్ కు సమానంగా ఉన్నారు. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో మరో ఆసక్తికర అంశం బయటికొచ్చింది. హాజరు విషయంలో అంతంతమాత్రంగానే ఉన్న నందిగం సురేష్.. సభకు హాజరైన రోజుల్లోనూ సైలెంటుగా కూర్చుని వెళుతున్నారు. ఆయన ఇప్పటివరకు లోక్ సభలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడగని ఘనత సాధించారు. ఒక్క డిబేట్ లోనూ నందిగం సురేష్ పాల్గొనలేదు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రతిపక్ష టీడీపీ ఎంపీల పనితీరు కొంత బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీల తీరు మాత్రం దారుణంగా ఉంది. లోక్ సభ సభ్యుల పదవీకాలం ఇప్పటికే సగం పూర్తైంది. ఇకనైనా ఎంపీలు మేల్కొని లోక్ సభలో ప్రజా సమస్యలకు లెవనెత్తితే బాగుంటుందని ఏపీ జనాలు కోరుకుంటున్నారు.

ఊడిపోయిన పులిచింతల గేటు.. కృష్ణా జిల్లాలో ముంపు భయం 

నిండుకుండలా ఉన్న పులిచింతల ప్రాజెక్టు దగ్గర అనూహ్య ఘటన జరిగింది. ప్రాజెక్టు ఒక గేటు ఊడిపోయింది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసే క్రమంలో  ఊడిపోయింది 16 నంబర్ గేటు. దీంతో ఆ గేటు ద్వారా భారీగా నీరు దిగువకు వెళుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1 లక్ష క్యూసెక్కులు ఉండగా..  అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో  గేటు ఊడిపోయింది. దీని ఫలితంగా మరో 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా దిగువకు వెళుతోందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ప్రాజెక్టు దగ్గరకు చెరుకున్న ఇరిగేషన్ అధికారులు ఎమర్జెన్సీ గేటును బిగిస్తున్నారు. మధ్యాహ్నానికి గేటు బిగించడం పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద‌ ఉధృతి పెరుగుతోంది. కృష్ణా , గుంటూరు జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ నది దాటే ప్రయత్నం చేయవద్దని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. పులిచింతల ప్రాజెక్టులో  ప్రస్తుతం గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో  నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి ప‌రిస్థితిని పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జ‌రిపారు.  స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌ని కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ చెప్పారు. పులిచింత‌ల డ్యామ్ గేటు ఊడిపోవ‌డంతో కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

పోలీస్ + క్రిమినల్ + పొలిటీషియన్ = మాధవ్! 

పోలీస్ అయితే ఒక రకంగా వార్నింగ్ ఇస్తారు..క్రిమినల్ అయితే ఇంకో రకంగా వార్నింగ్ ఇస్తారు.. ఎంపీ అయితే మరో రకంగా వార్నింగ్ ఇస్తారు..కాని మూడూ అయితే.. ఆ రేంజే వేరుగా ఉంటుంది. హిందూపురం ఎంపీ మాధవ్ పోలీసుగా పనిచేశారు... ఆయనపై ఒక రేప్ కేసు, ఒక మర్డర్ కేసు ఉన్నాయి.. ఆయన వచ్చి నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణ రాజును మళ్లీ టీవీ ముందుకొచ్చి మాట్లాడావంటే నీ అంతు చూస్తా అన్నాడంట. ఆ పెద్దమనిషి పైన కేసులున్న సంగతి చాలామందికి తెలియదు. అసలాయన 2014లో జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలి తిప్పి మాట్లాడినప్పుడే డౌట్ రావాల్సింది. అప్పుడు అది ఆయన పౌరుషం అనుకున్నారు. కాని తర్వాతే అర్ధమైంది.. బాస్ యాటిట్యూడే అదని. అందరికంటే పాపం కియో మోటార్స్ మేనేజ్ మెంట్ ని అడిగితే ఇంకా బాగా చెబుతారు సార్ గురించి.. సార్ వార్నింగుల గురించి. ఏకంగా సీఎం హాజరైన ప్రోగ్రామ్ లోనే .. ఆయనుండగానే బెదిరించాడంటే.. బాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవాలి.అలాంటోడు మరి పార్లమెంట్ లోనే రఘురామకు వార్నింగ్ ఇచ్చాడంటే .. మాధవ్ బ్యాక్ గ్రౌండ్ తెలిసినోడు ఎవడూ ఆశ్చర్యపోడు. అసలు రేప్, మర్డర్ కేసులు జేసీ బ్రదర్స్ తో గొడవైతే పెట్టించారని కొంతమంది వైసీపీ సోషల్ మీడియాకార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేసులు ఆయన కర్నూలులో పని చేస్తుండగా 2012లోనే రిజిస్టర్ అయ్యాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే ఈ డేటా ఉంది. గెలిచిన ఎంపీల అఫిడవిట్లు పరిశీలించి జాతీయ మీడియా చెప్పేవరకు.. మనకు తెలియనే లేదు. జేసీతో గొడవపడే సమయానికి అనంతపురంలోనే ఉన్నారు..అది 2014. మామూలుగా ఒక కానిస్టేబుల్ పై కేసు బుక్ అయితేనే సస్పెండ్ చేస్తారు. కేసు ప్రూవ్ అయితే డిస్మిస్ చేస్తారు. మరి మనోడు సీఐగా ఎలా కొనసాగాడు అనేదే అర్ధం కావటం లేదు. అంత సీరియస్ కేసులుంటే సస్పెన్షన్ లో ఉండాలి గాని..డ్యూటీలో ఉండి మరీ మీసాలు కూడా మెలితిప్పాడంటే.. మనోడి లాబీయింగ్ మామూలుగా లేదని అర్ధమవుతూనే ఉంది. అలాంటి సూపర్ కాప్ ను ఎంపీగా గెలిపించుకున్న హిందూపురం ప్రజలకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఎంపీగానే ఇంత అరాచకం చేస్తుంటే.. ఇక సీఐగా ఉన్నప్పుడు ఇంకెన్ని అరాచకాలు చేశాడో .. అక్కడి లోకల్ వాళ్లను అడిగితేనే తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా జీనియస్.. ఆయన మైండ్ సెట్ కు తగ్గవాడిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్స్ పర్ట్.. అందుకే మాధవ్ లాంటివాడిని హిందూపురం అభ్యర్ధిగా పెట్టుకుని గెలిపించాడంటే.. గ్రేటే మరి.ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏకంగా ప్రధానికి, స్పీకర్ కి మాధవ్ సార్ వార్నింగుల గురించి కంప్లయింట్ పెట్టారు. మరేం జరుగుతుందో చూడాలి.

యడ్డీ కథ అడ్డం తిరిగింది.. బొమ్మై సినిమా భళేగా ఉంది! 

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై,మంత్రి వర్గాన్ని పునః వ్యవస్థీకరించారు. కొత్త మంత్రిమండలిలో 29 మందికి స్థానం కల్పించారు. పాత కొత్తల కలియికగా తీర్చి దిద్దిన నూతన మంత్రి మండలిలో, తాజా మాజీ ముఖ్యమత్రి యడ్యూరప్ప సామాజిక వర్గం, లింగాయత్ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. ఎనిమిది మంది లిగాయత్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పిచారు. అలాగే, ఇతర సామాజిక సమీకరణల విషయంలోనూ సమతూకం పాటించారు. అయితే, యడ్యూరప్ప ఆశల మీద మాత్రం చల్ల చల్లని కూల్ కూల్ వాటర్  కుమ్మరించారు.  రాజకీయ టక్కు టమార విద్యలలో ఆరితేరిన యడ్యూరప్ప, తన ముఖ్యమంత్రి పీఠం కదిలినా, కుమారుడు విజయేంద్రకు కీలక శాఖలతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయంగా దక్కుతుందని ఆశించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి పదవి సంగతి దేవుడికెరుక, విజేంద్రకు  అసలు మంత్రివర్గంలో స్థానమే దక్కలేదు. ఉప ముఖ్యమంత్రి పోస్టునే పీకి పారేసిన ముఖ్యమంత్రి బొమ్మై, విజయేంద్ర విషయంలో తన పాత్ర ప్రమేయం లేదని, యడ్యూరప్ప, విజయేంద్రతో చర్చలు జరిపిన తర్వాతనే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని చేతులు దులుపుకున్నారు.  నిజానికి, యడ్యూరప్పకు పార్టీలో ఏమి జరుగుతోంది, పార్టీ అధినాయకత్వం ఏమి ఆశిస్తోంది, అనేది తెలియదని అనుకోలేము. అంతే కాదు, పార్టీ అధిష్ఠానాన్ని ఎదిరించే పరిస్థితి లేదని కూడా ఆయనకు తెలియంది కాదు. అయినా. ప్రజల్లో, ముఖ్యంగా తమ వర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలలో తమ ఇమేజిని నిలుపుకునేందుకు ఆయన ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర రాజకీయ భవిష్యత్తుకు పటిష్ట పునాదులు ఏర్పరిచేందుకు, ఆయన తాపత్రయ పడుతున్నారని, అందుకే గోడ మీద బోమం క్లియర్ గా ఉన్నా, ఏమీ తెలియనట్లు నటిస్తుననారని ఆయన వర్గం  నేతలే గుసగుసలు పోతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? రాష్ట్ర, పార్టీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది, చూడవలసి వుంది.  ప్రస్తుతానికి అయితే, యడ్యూరప్ప ఆయన కుమారుడు విజయేంద్ర, అయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చేయగలిగింది ఏమీ లేదని, ఆయన సన్నిహిత వర్గాలే అంగీకరిస్తున్నాయి. యడ్డీ విషయంలో పార్టీ అధినాయకత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని అంటున్నారు. ప్రధానంగా రెండు విషయాల్లో పార్టీ అధినాయకత్వం యడ్డీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.రాష్ట్రంలో  బీజేపీ పాలక పక్ష హోదాను పొందడంలో యడ్డీ కష్టాన్ని గుర్తిస్తూనే, ఇక ఆయన పార్టీ నియమావళిని పాటించి  క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని, అదే సమయంలో పార్టీ మీద కుటుంబ రాజకీయాల ముద్ర పడకుండా చూడవలసిన బాధ్యత  కూడా ఆయనపైనే ఉందని అధినాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. యడ్యూరప్ప ఇకనైనా, తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలే హితవు చెపుతున్నారు.  మంత్రి మండలి పునః వ్యవస్థీకరణ యడ్డీ వర్గంలో అసంతృప్తిని నింపింది అనేది మాత్రం కాదన లేని నిజం. యడ్యూరప్ప తనకు అత్యంత ఆప్తుడు అయిన బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయితే, తన మాట వేదం వాక్కుగా చెల్లుబాటు అవుతుందని ఆశించారు, కానీ బొమ్మై , యూ టూ బ్రూటస్,అవతారం దాల్చారు. అధిష్టానాన్ని అడ్డుపెట్టుకుని యడ్డీ ఆశలకు, ఆలోచనలకూ ఎక్కడికక్కడ గండి కొడుతున్నారు. దీంతో, ఒక్క యడ్డీనే కాదు, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా, నిరాశకు గురయ్యారు. అయితే, ఈ అసంతృప్తి ఇప్పటికిప్పుడు అసమ్మతిగా రూపాంతరం చెందుతుందా, అంటే, ఇప్పటికిప్పుడు అసమ్మతి విచ్చుకునే అవకాశం లేదని అంటున్నారు.  పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి బొమ్మై ఈ సున్నిత సమస్యను ఎలా ట్యాకిల్ చేస్తారనే దానిపైనే భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

హుజురాబాద్ కు కేసీఆర్ షాక్.. వాసాలమర్రిలోనే దళిత బంధు స్టార్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన దళిత బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. ఈనెల 16న ప్రారంభిస్తానని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాసాలమర్రిలో దళిత బంధును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు.  వాసాలమర్రిలో దళిత కుటుంబాలపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 24 గంటల్లోనే బ్యాంకు అకౌంట్లలో పది లక్షలు జమ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో  పర్యటించారు. ముందుగా దళిత వాడలో తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు.  ప్రభుత్వం అందించే  డబ్బు ను సరైన దిశలో ఉపయోగించాలని సీఎం కేసీఆర్ కోరారు. వాసాల మర్రిలో దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా డబ్బుకు డబ్బును సంపాదించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మంచి వ్యాపారం చేసి ఆర్థికంగా దళితులు బాగు పడాలని సూచించారు. దళిత బంధు ముందుగా వాసాల మర్రి ప్రజలకే వస్తున్నందున మీ పై పెద్ద బాధ్యత ఉందన్నారు. పథకం ముందు ముందు మరింత బాగా చేసేందుకు వాసాల మర్రి ప్రజలను ఆదర్శంగా తీసుకునేలా ఉండాలన్నారు దళిత బంధు ఇచ్చినందుకు ఇతర పథకాలు దళితులకు బంద్ కావన్నారు కేసీఆర్. వాసాల మర్రి ఊరందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్లు, ఇతర పథకాలు అలాగే కొనసాగిస్తామన్నారు. ఊళ్లో అందరికీ కొత్త ఇళ్లు ఇస్తామన్నారు. ఈ పది లక్షలకు ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ లేదన్నారు.  అన్ని పథకాలతో పాటు అదనంగా ఇచ్చే ఈ సాయాన్ని మంచిగా వినియోగించుకోవాలన్నారు. ఏడాది పాటు పది లక్షల నుంచి ఖర్చు చేయకుండా డబ్బులు జమ చేయాలన్నారు. మర్వాడీల మాదిరిగా డబ్బుకు డబ్బు సంపాదించే మార్గాన్ని నేర్చుకోవాలని సూచించారు. తొందర పడకుండా మంచి వ్యాపారం ఏం చేయాలన్నది నిర్ణయించుకొని కలెక్టర్ కు చెప్పాలన్నారు. అల్రెడీ డబ్బులు మంజూరైనందున పదిహేను రోజులైనా సరే మంచి వ్యాపారం చేయండన్నారు. సీఎం కేసీఆర్ పర్యటనలో వాసాలమర్రిలో గందరగోళం నెలకొంది. సీఎం సమావేశానికి దళితులను మాత్రమే అనుమతించడంపై గ్రామస్తుల అభ్యంతరం తెలిపారు. మొదట దళితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామంలోని 150 మందికి అనుమతి ఉందని చెప్పిన అధికారులు సీఎం సమావేశానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. సీఎం పర్యటనలో ప్రధానంగా వాసాలమర్రిలోని దళితవాడలను పరిశీలన, గ్రామంలోని రైతువేదిక భవనంలో ప్రజలతో సమావేశం నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఆతర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు కేసీఆర్ తిరుగుప్రయాణమవుతారు.

ప‌త‌నం అంచున‌ జ‌గ‌న్ స‌ర్కారు!.. ర‌ఘురామ లేఖ‌తో మ‌రింత ముప్పు..

అవును, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం బాగా ఆలస్యం అవుతోంది. కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఈ మాట‌లన్న‌ది మ‌రెవ‌రో కాదు. ముఖ్య‌మంత్రి త‌ర్వాత ముఖ్య‌మంత్రి అంత‌టి వారైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ఆయ‌న ఇలా అన్నారంటే.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎంత దుర్బ‌రంగా ఉందో అర్థం అవుతోంది. ఒక‌విధంగా ఇది స‌ర్కారు చేతులెత్తేయ‌డ‌మే. ఏపీలో ఎక‌నామిక్ క్రైసిస్ వ‌చ్చిన‌ట్టే. ఆర్థిక అత్య‌వ‌స‌ర స్థితికి ఇది హెచ్చ‌రికే.  తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ కొత్త రుణాల కోసం ప్రపంచబ్యాంకు ముందు మోక‌రిల్లుతోంది. ‘సాల్ట్‌’ ప్రాజెక్టు అమలు కోసం సుమారు రూ.1,870 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు వైసీపీ ప్రభుత్వం ఓకే అనేసింది. ప్ర‌పంచ బ్యాంకు ష‌ర‌తులు ఎలా ఉంటాయో తెలుసుగా.. ఉద్యోగాలు ఇవ్వొద్దు.. జీతాలు పెంచొద్దు.. ప‌న్నులు, క‌రెంటు బిల్లులులాంటివి భారీగా పెంచేయాలి.. చెత్త ప‌న్నులాంటి కొత్త కొత్త ప‌న్నులు వేయాలి.. ఇలా వ‌ర‌ల్డ్ బ్యాంక్ రుణ‌మంటే ప్ర‌జ‌ల‌కు మూడిన‌ట్టే. అందులో భాగంగానే ఏపీలో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నా డీఎస్సీ ఊసెత్తకుండా స‌ర్కారు కాలయాపన చేస్తోందని.. జాబ్ క్యాలెండ‌ర్‌తో త‌క్కువ పోస్టులే భ‌ర్తీ చేయ‌డానికీ ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు.  మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టు.. ఇంటి గుట్టు ర‌ట్టు చేసేలా ఏపీ ఆర్థిక దుస్థితిని కేంద్రానికి పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిస్తూ ఎంపీ ర‌ఘురామ రాసిన లేఖ‌తో మ‌రింత ఇర‌కాటంలో ప‌డింది స‌ర్కారు. రఘురామ రాసిన లేఖపై కేంద్రం రియాక్టు అయింది. ఏపీ అప్పులపై క‌న్నెర్ర జేస్తూ.. కొత్త పరిమితులు విధించడంతో ప్ర‌భుత్వం గిల‌గిలా కొట్టుకుంటోంది.  ఎవ‌రైనా మ‌ద్యం అమ్మి ఆదాయం సంపాదిస్తారు కానీ, వ‌చ్చే 20ఏళ్ల మ‌ద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి అప్పులు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే కాబోలు. ఈ మేట‌ర్ ర‌ఘురామ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి చేర‌డంతో.. ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ.. భవిష్యత్తు ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పు బ‌డుతూ కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఏపీ సర్కారుకు కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలో.. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణ సేకరణ సరికాదని కూడా త‌ప్పుబ‌ట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3), ఆర్టికల్ 266(1)కు విరుద్ధంగా ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటైందని కేంద్రం స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రం. తమ దృష్టికి వచ్చిన అంశాలపై వివరణ కోరుతూ సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాల్ని కాగ్ నివేదిక బయటపెట్టగా.. అందులో ఏపీ మొదటి స్థానంలో నిలవ‌డం మ‌రింత దారుణమైన విష‌యం.  ఎంపీ ర‌ఘురామ లేఖ‌తో కేంద్రం ఏపీ ఆర్థిక దుస్థితిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌డంతో ప్ర‌భుత్వంలో క‌ల‌వ‌ర‌పాటు పెరిగింది. ఇన్నాళ్లూ ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించ‌గా.. ఇక‌పై ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని మెద‌లాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. అమ‌ర‌రాజాలాంటి ఉన్న కంపెనీలే వెళ్లిపోయేలా చేస్తూ.. కొత్త కంపెనీలు రాష్ట్రం పేరెత్తితేనే భ‌య‌ప‌డేలా చేస్తుంటే.. ఏపీ అభివృద్ధి సాధ్య‌మా? కేవ‌లం సంక్షేమ‌మే ఉంటే స‌రిపోతుందా? చేసిన అప్పులు ఎలా తీరుస్తారు? కొత్త అప్పులు ఎలా తెస్తారు? ఇక‌, ఏపీ ఆర్థికంగా దివాళా తీసిన‌ట్టేనా?   

పెద్దలు చెబితే వినరా? జగన్ తో ఏపీకి జల గండమా?

ఆవేశం అజ్ఞానానికి, అజ్ఞానం అవివేకానికి, అవివేకం అనర్థానికి దారి తీస్తుందని గీతాచార్యుడు ఏనాడో చెప్పి ఉన్నాడు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు పాటిస్తున్నవాళ్లు జీవిత పోరాటంలో అనేక  విజయాలు నమోదు చేస్తున్నారు. పెడచెవిన పెట్టినవారు అపకీర్తి అనే పాతాళానికి దిగజారిపోతున్నారు. తాజాగా జగన్ సర్కారు తీసుకున్న దుందుడుకు నిర్ణయం కూడా అలాంటిదేనంటున్నారు రాజకీయ నిపుణులు.  కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కారుకు... సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి సూచించిన హిత వచనాలు కూడా రుచించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆప్తుడైన జస్టిస్ ఎన్వీ రమణ.. రెండు రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని ఆలోచించి.. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కన్నా కూర్చుండి చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదని సూచించారు. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కూడా ఆయన అన్నారు. ఒకవేళ న్యాయ పరమైన పరిష్కారమే కావాలనుకుంటే వేరే ధర్మాసనానికి కేసు బదిలీ చేస్తానని కూడా సీజేఐ జస్టిస్ రమణ చెప్పారు. ఇదంతా దేన్ని సూచిస్తుంది? సమస్యలో మిళితమై ఉన్న సెంటిమెంట్లు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్న అభిలాష మేరకే రమణ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా దశాబ్దాల తరబడి రెండు ప్రాంతాల రైతుల మధ్య అపనమ్మకాలు రాజేసిన ఇలాంటి జీవజలాల సమస్యను సహృదయ వాతావరణంలో కూర్చుండి మాట్లాడుకోవడం కన్నా మేలైన పరిష్కారం ఉండదని నిపుణులంతా చెబుతున్నారు. ఇలా చేస్తే పరిష్కారం కూడా త్వరగా తేలిపోతుందన్న విషయం కూడా జగమెరిగిన సత్యమే.  కానీ జగన్ మాత్రం మొండిగా న్యాయపోరాటానికే ఓటేయడం అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు తావిస్తోంది. ఎన్వీ రమణ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పట్ల ఎంతో నమ్మకాన్ని, గౌరవాన్ని కనబరచారు. వారిద్దరి కలయికలోనే ఈ సమస్యకు ఓ మంచి సొల్యూషన్ రావడానికి బీజం పడిందని భావిస్తున్నారు. అయితే జస్టిస్ రమణ సూచించిన పారదర్శకమైన సూచనను జగన్ పట్టించుకోకపోవడం ఆయనలోని మొండివైఖరికి నిదర్శనమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర సర్కారు కూడా సీజేఐ ధర్మాసనమే విచారించాలని కోరడాన్ని గమనించాలి. అయినప్పటికీ కేంద్రానికి కూడా రమణ ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పడం ఆయనలోని స్వచ్ఛతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యాయరంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తే న్యాయపరమైన పరిష్కారం కాకుండా మధ్యవర్తిత్వమే మంచిదని చెప్పిన మాటలను జగన్ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తెలివైన పని కాదంటున్నారు జలరంగ నిపుణులు. న్యాయపరమైన విచారణ వల్ల ఏళ్లపాటు విచారణ సాగుతుందని, నీటిపంపకాల విషయంలో పెనవేసుకొని ఉన్న అనేక టెక్నికల్ అంశాల కారణంగా సమస్య కొలిక్కి రావడం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి అసలు జగన్ కు సమస్య పట్ల చిత్తశుద్ధే లేదని, ఏపీలో జగన్ పరపతి అడుగంటుతున్న క్రమంలో వ్యక్తిగత రాజకీయాల కోసమే రెండు ప్రాంతాల మధ్య గల సున్నితమైన సమస్యను కెలుకుతున్నారని, ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఏపీకి ఏవిధంగా లాభం జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ తెలిసితెలిసీ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

రఘువీరా రీ ఎంట్రీ నిజమేనా? ఆయనతో టచ్ లో ఉన్నదెవరు? 

ఒక వెలుగు వెలిగిన సీనీ తారలు ఫేడ్ అవుట్  అయి కొంత కాలం తెర చాటున ఉండిపోవడం, ఆ తర్వాత  మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేయడం సినిమా లోకానికి తెలిసిన విషయమే. అలాగే ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన లేదా పదవీ విరమణ చేసిన అధికారులు ఇతర రంగాలవైపు, ముఖ్యంగా రాజకీయాలా వైపు రావడం సహజం. నిన్న మొన్ననే, ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తమ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. త్వరలోనే ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  సహజంగా రాజకీయ నాయకులకు అలాంటి, అవసరం, అవకాశం రెండూ ఉండవు. ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. జీవిత చరమాంకమ వరకు రాజకీయ నాయకులు రాజకీయాలే సర్వస్వంగా బతికేస్తుంటారు. అయితే, అప్పుడు అడప్పుడు కొందరు ఒక వయసు దాటిన తర్వాత ఇక రాజకీయాలు చాలని  స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పు కుంటారు. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్ 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాత స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మధ్య ప్రదేశ్  లో అత్యంత వెనకబడిన గోండ్వా ప్రాంతంలో  అంత్యోదయ స్పూర్తితో ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 60 నిండిన తర్వాత అధికార పదవుల నుంచి తప్పు కుంటానని ప్రకటించారు కానీ, ఆయనకు ఆ అవకాశం రాలేదు. 60 ఏళ్ళు నిండకుండానే అయన 2009 లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఒకే సారి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్వేల్ మాజీ  ఎమ్మెల్యే, వైఎస్ ఆప్త మిత్రుడు డాక్టర్ శివరామ కృష్ణా రావు, ఆద్యాత్మిక జీవితంపై మక్కువ పెంచుకుని ఈ సంవత్సరం (2021) ఏప్రిల్ 2 వతేదీన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా నిజ సన్యాసం స్వీకరించారు. స్వామి శివరామ సరస్వతి గా మారి పోయారు.   అసలు విషయం ఏమంటే, వైఎస్ మంత్రివర్గంలోనే కాకుండా ఆ తర్వాత అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన, రఘువీరా రెడ్డి, చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన, అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పూర్తిగా చచ్చుపడి పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు.ఆశించిన ఫలితం రానందుకో, ఇంకేందుకో ఆయన,2019లో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఆకక్ది నుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ నిర్మాణానికి నడుం బిగించి, దిగ్విజయంగ ఆలయ నిర్మాణం  పూర్తి చేశారు. కొద్ది రోజుల క్రితం ఆలయ నిర్మాణం పూర్తయింది. జూన్ నెలలో విగ్రహ ప్రతిష్ట ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయ రీఎంట్రీ గురించి, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఓ వంక కాంగ్రెస్ నాయకులు రఘువీరతో టచ్ లోకి  వచ్చారు. ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లు సమాచారం. మరో వంక దేవాలయ పున్నః నిర్మాణ పవిత్ర కార్యాన్ని పూర్తిచేసిన రఘువీరను, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభినందించారు. అలాగే జేసీ సోదరుడు, తాడిపత్రి టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి స్వయంగా రఘువీరాను కలిసి,  రాయలసీమ నీటి హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని సూచించారు. అయితే రఘువీర ఎలానూ స్పందించలేదు. మౌనంగా ఉండి పోయారని సమాచారం. ఆయన మనసులో ఏముందో ... ఆయన ఏలాంటి నిర్ణయం తెసుకుంటారో .. చూడవలసి వుంది. ప్రస్తుతానికి అయితే రఘువీర ఒక విధంగా తమ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని మరిచిపోయి, టీవీఎస్ 50 ద్విచక్రవాహనం మీద తిరుగుతూ .. రచ్చబండ రాజకీయాలకు పరిమితం అయ్యారు.  రేపు ఏమవుతుందో ..?

తెలంగాణ రాజధానిగా వరంగల్? హైదరాబాద్ యూటీ కాబోతోందా..? 

హైదరాబాద్.. తెలంగాణ రాజధాని. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గత సంవత్సరం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా హైదరాబాద్ కు సంబంధించి కీలక అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు మల్లన్న. వరంగల్ లో జరిగిన సభలో ఆయన  డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ విస్తరించడం వల్ల జనాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని.. అందుకే వరంగల్ ను రాష్ట్రానికి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు బీజేపీ నేతలు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని చెబుతుండటం.. ఇటు తెలంగాణకు వరంగల్ రాజధాని చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం చర్చగా మారాయి. రాష్ట్రంలో త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారు మల్లన్న. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు తీన్మార్ మల్లన్నకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ ను తెలంగాణ రాజధానిగా చేయాలని ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్లన్న  పబ్లిసిటీ కోసమే ఇలా అన్నారా లేక హైదరాబాద్ పై ఆయనకు ఇతరత్రా ఏమైనా సమచారం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీనిపై గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పటి కేంద్ర సర్కార్ అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 వరకు ఇది వర్తించనుంది. ఇటీవల కోవిడ్ రోగులతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో హైదరాబాద్ కు మాకు హక్కులున్నాయని కొందరు ఏపీ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఏపీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాయని చెబుతున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దేశానికి రెండో రాజధానిగా చేసే యోచనలో ఉందంటున్నారు. హైదరాబాద్ ను యూటీగా చేస్తే తెలంగాణ నేతల నుంచి వ్యతిరేకత వస్తుంది కాని..దేశానికి రెండో రాజధానిగా చేస్తే అలాంటి సమస్య ఉండబోదని కేంద్రం పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఓ జాతీయా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కూడా దేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయితే తమకు సంతోషమేనని చెప్పారు. అందుకే ఈ దిశగా కేంద్ర సర్కార్ సీరియస్ గానే కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. అలా చేస్తే తెలంగాణ, ఏపీలోనూ తమకు లాభిస్తుందనే అంచనాలో కమలం నేతలు ఉన్నారని అంటున్నారు.  మొత్తానికి బీజేపీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం ఉన్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రాజధాని చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మల్లన్న ప్రకటన ఆషామాషీగా వచ్చిందేమి కాదని, దీని వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చూడాలి మరీ.. ముందు ముందు ఏం జరగనుందో... 

కేసీఆర్ డిన్న‌ర్ పాలిటిక్స్‌.. దావ‌త్‌ల వెనుక రీజ‌న్‌ అదేనా?

మటన్.. తలకాయ కూర.. బొటీ.. నాటుకోడి కర్రీ.. చికెన్ ఫ్రై.. చేపల కర్రీ.. ఫిష్ రోస్ట్‌.. పప్పు.. సాంబార్.. పెరుగు.. గారెలు.. స్వీటు. టేబుల్‌పై అన్ని రకాల వెరైటీస్‌. ఘుమ‌ఘుమ‌లాడుతున్నాయి. నోరూరిస్తున్నాయి. త‌న వ‌య‌సును, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను అన్నిటినీ ప‌క్క‌న పెట్టేశారు. ఏ ఒక్క వెరైటీ వ‌ద‌ల‌కుండా అన్నిటినీ టేస్ట్ చూశారు. తృప్తిగా, క‌డుపు నిండుగా విందు ఆర‌గించారు. ఇదీ కేసీఆర్ భోజ‌నం. తాజాగా నాగార్జున‌సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే భ‌గ‌త్ ఇంట్లో సీఎం కేసీఆర్ స్వీక‌రించిన ఆతిథ్యం.   కేసీఆర్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంతా క‌లిసి టేబుల్‌పై భోజ‌నం చేశారు. ఎమ్మెల్యే భగత్ స్వయంగా వడ్డిస్తుంటే.. తమతో కలిసి కూర్చొని తినాలని ప‌ట్టుబ‌ట్టారట‌ కేసీఆర్. భగత్ సతీమణి భవానీ సీఎం కేసీఆర్‌కు ద‌గ్గ‌రుండి వంట‌ల‌న్నీ కొస‌రికొస‌రి వ‌డ్డించ‌గా.. ఆయ‌న వ‌ద్ద‌న‌కుండా, అస్స‌లు మొహ‌మాట ప‌డ‌కుండా అన్నిటినీ లాగించేశార‌ట‌. ఐట‌మ్స్ అన్నింటిని రుచి చూసిన ఆయన.. వంటలు బాగున్నాయని ప్రశంసించారు కూడా. సీఎం కేసీఆర్ కాంప్లిమెంట్స్‌తో ఎమ్మెల్యే భగత్ కుటుంబం ఫుల్ ఖుషీ.  స‌రిగ్గా.. ఇలాంటి స్ట్రాట‌జీనే కేసీఆర్ ప‌దే ప‌దే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ఎవ‌రొచ్చినా.. కేసీఆర్ ఏ ఊరికి వెళ్లినా.. భోజ‌నంతో క‌ట్టిప‌డేస్తారు. స్వ‌త‌హాగా భోజ‌న‌ప్రియుడైన కేసీఆర్‌.. మిగ‌తా వారినీ త‌న భోజ‌నంతో, ఆతిథ్యంతో ఆక‌ట్టుకుంటారు.  కేసీఆర్ చేసేవ‌న్నీ డిన్న‌ర్ పాలిటిక్సే అంటారు. ఎంత‌టి కీల‌క‌మైన రాజ‌కీయ సమావేశ‌మైనా.. భోజ‌నం బ్రేక్ ఉండాల్సిందే. ఎంత పెద్ద ప్ర‌ముఖులైనా.. ఎంత చిన్న కార్మికులైనా.. వారితో క‌లిసి భోజ‌నం చేయాల్సిందే.  ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మీటింగ్ అంటే అధికారుల‌కు సంబ‌ర‌మేన‌ట‌. సీఎం ర‌మ్మ‌న్నారంటే ప‌లువురు ప్ర‌ముఖులు, వివిధ వ‌ర్గాల నాయ‌కులు ఎగిరిగంతేస్తార‌ట‌. చెవుల్లో అమృతం పోసే మాట‌ల‌తో పాటు, జోకులు, సెటైర్లతో, అద్భుత‌మైన ప్ర‌సంగాల‌తో.. వ‌చ్చిన వారెవ్వ‌రికీ విసుగెత్త‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి కేసీఆర్‌ ఒక్క‌రే మాట్లాడుతుంటారు. ఏ స‌మీక్ష అయినా, ఏ మీటింగ్ అయినా.. దాదాపు రోజంతా ఉంటుంది. మ‌ధ్య‌లో లంచ్ బ్రేక్ త‌ప్ప‌నిస‌రి. ఆ గంటసేపు మ‌రింత మ‌జా మ‌జా. కేసీఆర్ పెట్టే లంచ్‌.. ఓ రేంజ్‌లో ఉంటుంద‌ట‌. తిన్న వాళ్లు రెండు మూడు రోజులు ఆ రుచి మ‌రిచిపోర‌ట‌. అంత బాగుంటుంద‌ట కేసీఆర్ ఆతిథ్యం.  అలాంటి ఆతిథ్యాన్నే తన ప‌ర్య‌ట‌న‌ల్లోనూ పాటిస్తార‌ట‌. మీ ఊరికి వ‌స్తా.. గ్రామ స‌మ‌స్య‌ల‌న్నీ తీరుస్తా.. మంచిగా మాట్లాడుకుందా.. అక్క‌డే క‌లిసి తిందాం.. దావ‌త్ చేసుకుందాం.. ఇలా సాగుతుంది కేసీఆర్ ద‌త్త‌త‌ గ్రామాల ప‌ర్య‌ట‌న‌. అది వాసాల‌మ‌ర్రి అయినా, చిన్న‌ముల్క‌నూర్‌, మూడుచింత‌ల‌ప‌ల్లి అయినా.. కేసీఆర్ వ‌చ్చిండ్రంటే.. దావ‌త్ ఉండాల్సిందే. ఎండ త‌గ‌ల‌కుండా మంచి షామియానాలు వేసి.. టేబుళ్లు ప‌రిచి, కుర్చీలు వేసి.. వంద‌లాది మందికి వేడివేడిగా భోజ‌నం వ‌డ్డిస్తారు. వారితో పాటే క‌లిసి కూర్చొని కేసీఆర్ సైతం అక్క‌డే భోంచేస్తారు. క‌డుపునిండా తృప్తిగా భోజ‌నంతో పాటు.. తాము కేసీఆర్‌తో క‌లిసి తిన్నామ‌నే జ్ఞాప‌కం సైతం వారికి క‌ల‌కాలం ఉండిపోతుంది. ఇక అన్నంపెట్టిన‌వాడిని, త‌మ‌తో క‌లిసి తిన్న‌వాడిని.. జ‌నాలు అంత ఈజీగా ఎలా మ‌ర్చిపోగ‌లుగుతారు.  ఇక కేసీఆర్ ఎప్పుడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చినా.. కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంట్లోనే విడిది చేస్తారు. అక్క‌డే భోజ‌నం చేస్తారు. ఉద్య‌మ‌కాలం నుంచి ఇదే అల‌వాటు, సెంటిమెంటు కూడా. ఆ ఇంటి భోజ‌నం అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఆ రుచి మ‌రిచిపోలేకే.. ఎప్పుడొచ్చినా అక్క‌డే దిగుతార‌ని అంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ వ‌రంగ‌ల్‌కు ఓ వంద‌సార్లు వ‌చ్చార‌ని అనుకుంటే.. అందులో 99సార్లు కెప్టెన్ ఇంట్లోనే బ‌స‌. కానీ, ఆశ్చ‌ర్యంగా ఇటీవ‌ల మాత్రం క‌డియం శ్రీహ‌రి ఇంట్లో విందు ఆర‌గించారు ముఖ్య‌మంత్రి. బ‌హుషా, ఎమ్మెల్సీలేక‌, స‌రైన గుర్తింపులేక‌ అసంతృప్తితో ఉన్న క‌డియం.. కారు దిగి పారిపోకుండా ఉండేందుకు కాబోలు.. అలా ఆయ‌న ఇంట్లో విందు రాజ‌కీయం నెర‌పార‌ని అంటారు. ఇలా, భోజ‌నాన్ని జిహ్వ చాప‌ల్యానికి, రాజ‌కీయానికీ వాడుకునే స‌మ‌ర్థుడు కేసీఆర్‌. 67 ఏళ్లు వ‌చ్చినా.. అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా.. భోజ‌నం విష‌యంలో మాత్రం కాంప్ర‌మైజ్ కార‌ట కేసీఆర్‌. ఇష్టంగా తింటార‌ని.. రుచిగా ఉంటే అడిగి మరీ వడ్డించుకోవడానికి ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌ర‌ని అంటారు. ప‌సందైన విందులో.. దావాత్‌ల‌లో.. డిన్న‌ర్ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు.