ప్రత్యేక అధికారాలు కలవారిపై థర్డ్ డిగ్రీనా! సీజేఐ సంచలన వ్యాఖ్యలు..
posted on Aug 8, 2021 @ 8:01PM
భారత ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి జస్టిస్ ఎన్వీ రమణ హాట్ కామెంట్స్ చేశారు.
మన దేశంలో కస్టోడియల్ టార్చర్, ఇతర పోలీసు దుశ్చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ నుంచి ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం మినహాయింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పోలీసులకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీని ఆయన కోరారు. నల్సా మొబైల్ యాప్‌ను, ‘విజన్ అండ్ మిషన్ స్టేట్‌మెంట్’ను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీజేఐ జస్టిస్ రమణ.. మానవ హక్కులకు, శారీరక భద్రతకు ముప్పు పోలీస్ స్టేషన్లలో అత్యధికంగా ఉందన్నారు.
పోలీసు కస్టడీలో నిర్బంధంలో ఉన్నవారిపై హింస, ఇతర పోలీసు దుశ్చర్యలు మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న సమస్యలని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. రాజ్యాంగపరమైన ప్రకటనలు, హామీలు ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్లలో సమర్థవంతమైన న్యాయ ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్టయినవారికి, నిర్బంధంలో ఉన్నవారికి అత్యంత తీవ్ర నష్టదాయకమని చెప్పారు. ఇటీవల వస్తున్న వార్తలను పరిశీలించినపుడు ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ నుంచి మినహాయింపు ఉండటం లేదన్నారు.
పోలీసుల అతి ప్రవర్తనను నిరోధించేందుకు చేపట్టవలసిన చర్యలను వివరిస్తూ, న్యాయ సహాయం పొందడం, ఉచిత న్యాయ సహాయ సేవలు అందుబాటులో ఉండటం ప్రజలకు రాజ్యాంగ హక్కులనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. దీనికి సంబంధించిన డిస్‌ప్లే బోర్డులను, ఔట్‌డోర్ హోర్డింగ్స్‌ను ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ, జైలులోనూ ఏర్పాటు చేయాలన్నారు. నల్సా దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు వీటిపై చురుగ్గా అవగాహన కల్పించాలన్నారు.