కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న రోడ్ రోలర్ 

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంటుందన్నప్రచారం విస్తృతంగా ఉంది. బిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ముచ్చెటమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ తో పాటు మరో పార్టీ చేరింది. మునుగోడు ఉపఎన్నికల్లో  వినిపించిన ఈ పార్టీ పేరు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వినిపించడంతో కెసీఆర్ వణికి పోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు ఉన్న యుగతులసీ పోటీ చేయనుండటంతో కెసీఆర్ భయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే  ఈ గుర్తుపై బిఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించి రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని కోరి భంగపడింది.  చేసేదేమిలేక కెసీఆర్ యుగతులసీ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ తో ప్రగతి భవన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం.   ప్రవళిక ఆత్మహత్య తర్వాత నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు కాకుండా ఇదే ప్రగతి భవన్ లో ప్రవళిక కుటుంబసభ్యులను పిలిపించి చర్చలు జరిపినట్లు  వార్తలు వచ్చిన సంగతి  తెలిసిందే.  ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మంత్రులకే అవకాశం లేని నేపథ్యంలో యుగతులసి పార్టీ అధినేతతో చర్చలు జరిపి ఎన్నికల్లో ఆ పార్టీ  పోటీ చేయడకుండా కెసీఆర్  శత విధాల ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.   తెలంగాణలో యుగ తులసి పార్టీకి ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇది పీడకలగా మారింది. అంతకుముందు, బీఆర్ఎస్  పార్టీ కారు గుర్తును పోలి ఉండే రోడ్ రోలర్‌ను కేటాయించడంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఎన్నికల సంఘం పార్టీ చిహ్నాల కేటాయింపులో  డ్రా నిర్వహించి యుగ తులసి పార్టీకి కేటాయించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేయవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘంకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు గుర్తును తొలగించడం అప్పట్లోసంచలనంగా మారింది. యుగ తులసి పార్టీ అధినేత కొలిశెట్టి శివ కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం అప్పట్లో ఆయనపై బదిలీ వేటు వేసింది.ఎన్నికల సంఘం యుగ తులసి పార్టీ , అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అనే రెండు రాజకీయ పార్టీల మధ్య రోడ్ రోలర్ గుర్తును కేటాయించేందుకు డ్రాను నిర్వహించింది. డ్రాలో యుగ తులసి పార్టీకి గుర్తును కేటాయించారు.

ఆ సామాజిక వర్గాలకూ సంక్షేమం.. జగన్ దింపుడు కల్లం ఆశ!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశ ఆరిపోయింది. ఈస్ట్ మన్ కలర్ లో, సినిమా స్కోపులో రానున్న ఓటమి కళ్లెదుట కనిపిస్తుంటే.. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుముంటున్న పరిస్థితి వైసీపీది. అయితే మేకపోతు గాంభీర్యమే, అతి విశ్వాసమో, అహంభావమో తెలియదు కానీ.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఏం చేసైనా సరే మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలన్న తాపత్రయం మాత్రం వదలడం లేదు.  ఇందుకు కారణమూ లేకపోలేదు. ఈ సారి అధికారం దక్కకుంటే ఇక వైసీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయన్నది ఆయనకు విస్పష్టంగా అర్ధమైపోయింది. ఈ సారి ఎన్నికలలో పరాజయం పాలై, చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అమరావతి, పోలవరంను పరుగులు పెట్టించి పూర్తి చేయడం ఖాయమన్న సంగతి జగన్ కు స్పష్టంగా తెలుసు. అదే జరిగితే అంటే పోలవరం, అమరావతి పూర్తయితే ఇక ఏపీలో వైసీపీకి స్థానం అనేదే ఉండదు. ఆ విషయాన్ని గుర్తించే ఏం చేసైనా సరే మరోసారి అధికార పగ్గాలను అందుకోవాలని జగన్ నేల విడిచి సాము చేయడానికి కూడా వెనుకాడటం లేదు.  నిజానికి చెప్పాలంటే 2019 ఎన్నికల సమయంలో కూడా వైసీపీదీ, జగన్ ది ఇదే పరిస్థితి. అప్పుడు కూడా అధికారమో, రాజకీయ సన్యాసమో అన్నట్లుగానే జగన్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఉంది. అయితే అదృష్టం కలిసి వచ్చింది.   2019లో కూడా అధికారం దక్కకపోతే తనకి ఇక భవిష్యత్ లేదని గుర్తించిన జగన్  ఆ ఎన్నికలలో  ఎన్ని వాడాలో అన్నీ వాడారు. బాబాయ్ దారుణ హత్య, కోడి కత్తి కేసు, తండ్రి రాజశేఖరరెడ్డిది హత్యేనని ప్రచారం, తల్లి,చెల్లిని ప్రచారానికి వాడుకోవడం, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కుట్రలు చేశారని ఆరోపణలు, తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మాయం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు, అమరావతి గ్రాఫిక్స్ అనే ప్రచారం, మేధావులుగా చెప్పుకొనే కొంతమందితో నిత్య అసత్య ప్రచారాలు ఇలా ఏం చేయాలో అవి చేయడమే  కాకుండా చేయకూడనివి కూడా చేసేశారు. ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచీ ఈ నాలుగున్నరేళ్లు ప్రజలకు  నరకం చూపారు. జగన్ పాలనలో సమాజంలోని అన్ని వర్గాల వారు అసంతృప్తి, అభద్రతా భావంతోనే కాలం గడుపుతున్నారు. అన్ని వర్గాల వారి నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే  తేల్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీదే అని పలు సర్వేలు పేర్కొన్నాయి. చివరాఖరికి జగన్ కు ఎన్నికల వ్యూహకర్త అయిన పీకే  కూడా చేతులెత్తేశారని అంటున్నారు. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్..  కుట్ర పూరితంగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారు. చంద్రబాబును జనంలో తిరగకుండా నిరోధించగలిగితే.. తెలుగుదేశంలో స్తబ్దత నెలకొంటుందనీ, సులువుగా ఎన్నికలలో చక్రం తిప్పేయొచ్చని భావించారు. అయితే జగన్ అనుకున్నది  ఒకటి అ యితే అయ్యింది మరొకటి  అయ్యింది. చంద్రబాబు  అక్రమ అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులే కాదు.. సామాన్య  జనం, రాజకీయాలకు సంబంధం లేని తటస్థ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం  చేశాయి. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశాయి. దీంతో చంద్రబాబు అక్రమ అరెస్టుతో వైసీపీ ఓటమి మరింత ఖరారైంది. వైసీపీకి చంద్రబాబు అరెస్టు పూడ్చలేని నష్టాన్ని  చేకూర్చిందని తేలడంతో  దీని నుండి బయట పడేందుకు ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు ప్రజలలో అసంతృప్తిని ఎలా తగ్గించాలని కోటాను కోట్లు ఖర్చు చేసి ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో వైసీపీకి   ఏకైన ఆయుధం ఏదైనా ఉందంటే అది సంక్షేమం మాత్రమే. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టనీ, ముక్కు పిండి వసూళ్లు చేసి ఆ డబ్బులే వివిధ పేర్లతో పంచనీ, రకరకాల పేర్లతో పన్నులు బాది వాటినే తిరిగి ప్రజలకు జమ చేయనీ.. అప్పులు చేసి, ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇవ్వక ఎలాగోలా   బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరం చేశారు.  అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు, వ్యవసాయం, నీటి పారుదల, పరిశమ్రలు, టెక్నాలజీ లాంటివి అసలు తమకు పట్టనే పట్టవనీ,   సంక్షేమం ఒక్కటే తమ పాలసీ అన్నట్లుగా  జగన్ పాలన కొనసాగించారు. ఆ సంక్షేమం కూడా అనేక కోతలతో అరకొరగానే సాగింది.  దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ఆయా సామాజికవర్గాలలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఇది గమనించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. గత ఏడాది నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోతలు ఎక్కువయ్యాయి. ఆర్థిక‌ భారం నుంచి స‌ర్కారు త‌ప్పించుకునేందుకు ఈ చర్యలకు దిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కొన్ని సామాజికవర్గాలకు అసలు వైసీపీ సంక్షేమం చేరనే లేదు. అందులో ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలలో నేటికీ ఒక్క రూపాయి సంక్షేమ ఫలాలు దక్కని కుటుంబాలు ఉన్నాయి. తమ సిద్ధాంతమే బటన్ నొక్కుడు కాగా.. అదే అసలు అందకపోతే వారి అసంతృప్తి అంతా ఇంతా కాదు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధి పొంద‌ని కుటుంబాల‌ను ఎంపిక చేసి వారికి ప్ర‌త్యామ్నాయంగా ఏం చేయాలన్నయోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా కోటి కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా.   వీటిలో ముఖ్యంగా కాపు, రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాలే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కుటుంబాలకు వ‌చ్చే మూడు నెలల్లో ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలను  అమ‌లు చేయాల‌ని తాడేపల్లి కేంద్రంగా ప్రణాళికలు సిద్దమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే పరిశీలకులు మాత్రం చివరి క్షణంలో సంక్షేమం పేరుతో ప్రణాళికలు రూపొందించడాన్ని  జగన్ దింపుడు కళ్లెం ఆశగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అత్యాచారం కేసులో మురళీముకుంద్ అరెస్ట్, రిమాండ్

జూబ్లీ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ ను పోలీసులు అరెస్టు చేశారు.     తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నేరంపై మురళీముకుంద్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనను రిమాండ్ కు ఆదేశించింది.  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీముకుంద్‌ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు  న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడు మరళి ముకుంద్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలిచారు.   ఇదే కేసులో మురళీముకుంద్ కుమారుడు ఆకాశ్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. హైదరాబాద్  బంజారాహిల్స్ మిథిలానగర్ లో నివాసం ఉండే మురళి ముకుంద్ ఇంట్లో  ఓ ఏగ్రేడ్ ఏజెన్సీ ద్వారా పనిమనిషిగా చేరిన యువతిని తన కుమారుడితో సహా వేధింపులకు గురి చేశారు.  ఈ ఏడాది  జూన్ 18న   మురళి ముకుంద్ నివాసంలో పని మనిషిగా  చేరిన యువతికి అలా చేరిన నెల రోజుల నుంచే  వేధింపులు ఎదురయ్యాయి. పలు మార్లు ఈ విషయమై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. తాను పని చేస్తున్న ఇంటి యజమాని మురళి ముకుంద్ మామూలు వ్యక్తి  కాదు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్. మురళి ముకుంద్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించే వాడు. ఆ క్రమంలోనూ  జూలై 16 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మురళి ముకుంద్ ఆమెను తన బెడ్ రూంలో బెడ్ షీట్ మార్చాలని ఆదేశించాడు. దీంతో ఆమె బెడ్ రూంలోకి వెళ్లగానే ఆమె ప్రతిఘటించేలోగానే రూం తలుపులు మూసేసి స్నానం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. తిరస్కరిస్తే బెదరింపులకు దిగాడు. ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించడంతో ఆమె బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసింది. బాత్ రూంలో ఆమె స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలూ చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించాడు. తీవ్ర భయాందోళనకు గురైన  ఆ యువతి మురళీముకుంద్ కుమారుడు ఆకాష్ కు చెప్పింది. అయితే  ఆకాష్ బాధితురాలిని తీవ్రంగా కొట్టి విషయం బయటపెడితే చంపేస్తానని  బెదరించాడు. అంతే కాకుండా తమ ఇంట్లో సిమ్ కార్డ్ చోరీ చేసిందంటూ ఎదురు కేసు పెట్టారు. తనను తీవ్రంగా  కొట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీచేసుకోమని వారు ఆమెనే మందలించారు. దీంతో దిక్కుతోచక ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పలేకపోయింది. చెబితే తననూ తన తల్లినీ చంపేస్తామని మురళి ముకుంద్, అతని కుమారుడు ఆకాష్ బెదరించడంతో మౌనంగా ఉండిపోయింది. తర్వాత కూడా అత్యాచార పర్వం కొనసాగిస్తుండటంతో ఆమె విషయాన్ని తల్లికి  చెప్పి ఆమెతో కలిసి ఈ  నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని  భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు నిందితులు మురళీముకుంద్, అతని కుమారుడు ఆకాష్ పై కేసు నమోదు చేశారు. 

ఎపికి పొంచి ఉన్న అసాని తుఫాను

ఏపీకి తుఫాను గండం పొంచి ఉంది. ఈ విషయాన్ని  వాతావరణ శాఖ ధ్రృవీకరించింది.. విశాఖకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన అసాని తుఫాన్‌ మరో 6 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాంలో రెండ్రోజులపాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత మార్చిలో భారీ తుఫానుతో ఎపి అతలాకుతలం అయ్యింది. అప్పట్లో భారీ విధ్వంసం, ఆస్తి నష్టం జరిగింది.   తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుఫాను పేరు అసానిగా నామకరణం చేసింది శ్రీలంక. తమిళభాషలో అసాని అంటే రౌద్రం. అసాని ఈ సాయంత్రానికి తుపానుగా మారి... ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది.  కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్ డేట్ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఎపిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

బీఆర్ఎస్ రైతు రుణమాఫీకి తిలోదకాలిచ్చేసిందా?

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఊసే లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రుణమాఫీకి బీఆర్ఎస్ తిలోదకాలిచ్చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతాంగం రుణమాఫీ  హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని  బీఆర్ఎస్ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటుంటే.. రైతులు మాత్రం  పెదవి  విరుస్తున్నారు. రైతు బంధు సహా పది హామీలను ప్రకటించిన కేసీఆర్ రుణమాఫీని మాత్రం పూర్తిగా విస్మరించారు. పాత విధానాలు అన్ని  యథావిథిగా కొనసాగుతాయని మేనిఫెస్టోలో ప్రకటించినా.. రైతు రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్ష వరకు రుణమాఫీపై బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) విస్పష్ట హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ హామీని 2018 ఎన్నికల సమయంలోనూ పునరుద్ఘాటించింది. ఫస్ట్ టర్ములో నాలుగు విడతల్లో అమలు చేసినట్లుగానే రెండో టర్ములో కూడా సంపూర్ణం చేస్తామని అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ నాలుగున్నరేండ్లు పూర్తయ్యి ఎన్నికలకు వెళ్తున్నా ఇంకా బకాయిలు ఉండిపోయాయి. గత రెండు ఎన్నికలలోనూ మేనిఫెస్టోల్లో రుణమాఫీ గురించి విస్పష్ట హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈసారి  మేనిఫెస్టోలో కనీసంగానైనా ప్రస్తావించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  2014 మేనిఫెస్టోలోనూ,  2018 ఎన్నికల మేనిఫెస్టోలో నూ చేర్చినా.. ఇప్పుడు మాత్రం దానిని కనీసం ప్రస్తావించకపోవడంతో  కేసీఆర్ రుణమాఫీపై చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దీనిపై జనం ప్రశ్నలకు బీబర్ఎస్ నేతలు సమాధానం ఇవ్వడం లేదు.  గత ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చినా  అది సంపూర్ణంగా నెరవేరకపోవడంతో.. బకాయిల సంగతేమిటని రైతులు నిలదీస్తున్నారు.  రుణమాఫీ అంశంలో కేసీఆర్ మౌనంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.   ఇలా ఉండగా కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇప్పుడు రుణమాఫీ వ్యవహారం బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. 

తెలంగాణలో చలి తీవ్రత 

ఈసారి తెలంగాణలో శీతాకాలం కాస్త ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి. అక్టోబర్ నెల ప్రారంభమైన తర్వాత కూడా ఎండలు భగ్గుమన్నాయి. చాలా చోట్ల ఏకంగా 33 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నవంబర్‌ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. అయితే రుతుపవనాల తిరోగమనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.చల్లటి గాలుల కారణంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. మెదక్, హనుమకొండ, రామగుండం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  అక్టోబర్‌ నెలలో కూడా వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. తెలంగాణలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాత్రి సమయంలోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రంలో నెమ్మదిగా చలి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరకున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అత్యల్పంగా హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండతో పాటు మెదక్‌, రామగుండంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్‌, భద్రాచలంలో మాత్రం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో మాత్రం 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం.

లోకేష్, పవన్ భేటీ.. వైసీపీకి లోన వణుకు.. పైకి మేకపోతు గాంభీర్యం!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచినప్పటికీ.. తెలుగుదేశం పార్టీలో జోష్ ఇసుమంతైనా తగ్గలేదు. సరికదా.. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ పతనమే లక్ష్యంగా మరింత దృఢసంకల్పంతో  కేడర్ ముందుకు సాగుతున్నది.  అతెలుగుదేశం క్యాడర్ లోనే కాదు.. తటస్థులు, సామాన్య జనంలో కూడా ఇదే భావన వ్యక్తం అవుతోంది.   మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించి  జనంలో కొత్త జోష్ నింపారు. అయితే జనసేనాని తెలుగుదేశంతోనే కలిసి వెడతామని ప్రకటించి 45 రోజులైనా.. ఆ దిశగా రెండు పార్టీల మధ్యా  ఉమ్మడి కార్యాచరణ దిశగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో జనం ఒకింత అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. అసలు పొత్తు ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ అసహనానికీ, అనుమానాలకీ తెర దించుతూ రెండు పార్టీల పెద్దలు కలిసి ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. రాజమండ్రి మంజీరా హోటల్‌ వేదికగా సోమవారం (అక్టోబర్  23)న జరిగిన భేటీలో టీడీపీ, జనసేన నేతలు సమన్వయ కమిటీ సభ్యులతో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరిపారు. సమన్వయ కమిటీలలో ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల సమన్వయ కమిటీలతో  నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించారు. గ్రామీణ స్థాయిలో పార్టీల బలోపేతం, ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలు, క్షేత్రస్థాయికి పొత్తు అంశాన్ని బలంగా తీసుకెళ్లడంపై చర్చించారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహించిన తొలి సమావేశం ఇదే .   45 రోజులుగా చంద్రబాబు నిర్బంధంలో ఉన్న రాజమహేంద్రవరంమే రెండు పార్టీల భేటీకి అక్కడే వేదిక కావడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు. ముందుగా నారా లోకేష్ రాజమండ్రి తెలుగుదేశం క్యాంపు కార్యాలయంలో పార్టీ  సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కళ్యాణ్ తో  భేటీ అయ్యారు.   కాగా, సమన్వయ కమిటీలతో భేటీ అయ్యాక నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతకు ముందే  సోమవారం (అక్టోబర్ 10) ఉదయమే  నారా లోకేష్ చంద్రబాబును ములాఖత్ లో కలిసి చర్చించారు.. పలు అంశాలపై సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ భేటీ.. అనంతరం పవన్-లోకేష్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పవన్, లోకేష్ భేటీతో తెలుగుదేశం, జనసేన నాయకులలో జోష్ పెరిగింది. అంతకు మించి  వైసీపీ నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన పెరిగిపోయింది. ఈ సమావేశంతో  ఏపీ రాజకీయాలలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇరు పార్టీలూ వేరువేరుగా అంటే పొత్తు లేకుండా ఉన్నసమసయంలోనే వైసీపీ పట్ల వ్యతిరేకత పీక్స్ లో ఉంది. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. గుడ్డిలో మెల్ల అన్నట్లుగానైనా గెలుస్తామన్న ఆశ వైసీపీలో మిణుకు మిణుకు మంటుండేది. అయితే   రెండు పార్టీలూ కలిసి రంగంలోకి దిగితే.. సోదిలోకి కూడా మిగలం అన్న ఆందోళనతోనే వైసీపీ నేతలు ఇరు పార్టీల మధ్యా పొత్తు లేకుండా చేయడానికి నానా విధాలుగా  ప్రయత్నించారు. ఒంటరి పోరు.. దమ్ము అంటూ సవాళ్లు విసిరారు. అయితే ఇరు పార్టీలూ జగన్ ను గద్దెదించాలన్న ప్రజల ఆకాంక్షను సాకారం చేయడమే లక్ష్యం అంటూ కలిసే పోటీలో దిగడానికి సిద్ధం అవ్వడంతో  వైసీపీ వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు.   ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ  నాదశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ  తెలుగుదేశం. క్షేత్రస్థాయి నుండి బూత్ స్థాయి వరకూ నాయకత్వం, నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదార్శనికుడు, దార్శనికుడు చంద్రబాబు సారధ్యంలో సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలచుకోవడం అలవాటుగా మార్చుకున్న పార్టీ తెలుగుదేశం. ఇక పవన్ కళ్యాణ్ కున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, సినీ గ్లామర్ జనసేనకు ప్రధాన ఆకర్షణ. అన్నిటికీ మించి ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, వ్యతిరేకత, ప్రజాగ్రహం కూడా తోడై ఈసారి వైసీపీకి ఘోర పరాజయం తప్పదేనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. వాళ్లలోనూ, వీళ్లలోనూ కాదు.. ఏకంగా వైసీపీ శ్రేణులలోనే ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు, మంత్రులూ కూడా అంతర్గత సంభాషణల్లో, తమ అనుచరులతో భేటీలలో ఈ విషయాన్నే చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరిగిన లోకేష్, పవన్ భేటీ  వైసీపీలో అలజడి పెరిగింది. భయం మొదలైంది. ఇప్పటికే సర్వేల ఫలితాలను, ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్నీ చూసిన వైసీపీ నేతలకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది.  పైకి మేకపోతు గాంభీర్యం పదర్శిస్తున్నా ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి సహా.. వైసీపీ పెద్దలను కూడా  తెలుగుదేశం, జనసేన పొత్తు కలవరపెడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గజ్వేల్.. కామారెడ్డిలో కేసీఆర్ టార్గెట్ గా పెద్ద సంఖ్యలో నామినేషన్లు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో ‘కీలక’ పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్నుంచే పోటీ చేస్తారా? మరో  నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా?  నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ విషయంలో రాజకీయవర్గాలలో వినిపించిన ప్రశ్నలివి. కుమారుడికి సీఎం పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన సీఎం కేసీఆర్ కు కాలం కలిసిరావడం లేదు. బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అన్న భావన ప్రజలలోకి బలంగా వెళ్లడంతో.. ఆయన ముందు రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా విపక్షాలు వేటికవిగా ఆయన సిట్టింగ్ స్థానం అయిన గజ్వేల్ టార్గెట్ చేయడంతో కేసీఆర్ మరో నియోజకవర్గాన్ని కూడా సేఫ్ సైడ్ గా ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి వచ్చిందంటేనే తెలంగాణ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అని చెప్పుకునే కేసీఆర్ ఎంత డిఫెన్స్ లో పడ్డారన్నది అవగతమౌతుంది.  అసలు కేసీఆర్ ఎన్నికల వ్యూహ రచన ప్రత్యర్థి పార్టీల నేతలకే కాదు.. సొంత పార్టీ నేతలకే అంతుబట్టదు అని నిన్నమొన్నటి వరకూ అంతా భావించే వారు. కానీ ఎందుకే ఈ సారి ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఆయన మాటే శాసనం అనే పరిస్థితి పార్టీలో లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.  ఆయన ఏ ముహూర్తంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారో ఆ రోజు నుంచే పార్టీలో అసమ్మతి భగ్గుమంది. అంతకు ముందు వరకూ ఆయనకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన రాజయ్య, మైనంపల్లి వంటి వారే తొలుత అసమ్మతి గళం వినిపించారు. మైనంపల్లి అయితే నేరుగా  కేసీఆర్ సమీపబంధువు, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించి సంచలనం సృష్టించారు. అన్నిటికీ మించి ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరెవరికీ దక్కని వెసులుబాటు కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు దక్కడంతో విపక్షాలు గతం నుంచీ మొదటి నుంచీ వినవస్తున్న బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. అంతే కాకుండా సొంత పార్టీలో సైతం ఆ అనుమానాలు బలపడ్డాయి.  దీంతో సొంత పార్టీలోనే ఆయన పట్ల ఒకింత అనుమానాలు పొడసూపాయి. కల్వకుంట్ల కవిత కోసం ఆయన బీజేపీతో లాలూచీపడ్డారా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తం అయ్యాయి. అలాగే గతంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీ గేట్లు బార్లా తెరిచేయడంతో ఇప్పుడు చాలా వరకూ నియోజకవర్గాలలో  రెండు అంతకంటే ఎక్కువ వర్గాలు ఏర్పడ్డాయి.  దీంతో అభ్యర్థుల తొలి జాబితా విడుదల తరువాత పార్టీలో వలసలు పెరిగియి. గేట్లు తెరిచేసినట్లుగా ఆ వలసలు ఒక ప్రవాహంగా మారాయి. ఎన్నికల ముంగిట, అదీ అధికార పార్టీ నుంచి వలసలు పెరగడం కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరంగా మారిందని చెప్పకతప్పదు. అన్నిటికీ మించి కేసీఆర్ ను లక్ష్యంగా  చేసుకుని గజ్వేల్ లో పోటీ చేస్తామంటూ సవాల్ విసురుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో.. ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన కుమార్తె కవితకు ఎదురైన అనుభవం గుర్తుకు వచ్చింది. అందుకే ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఈటలకు గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి బీజేపీ అధిష్ఠానం పచ్చ  జెండా ఊపింది. ఈటల బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి, అలాగే ఆయన సొంత నియోజకవర్గం నుంచీ కూడా పోటీలో దిగుతున్నారు. అదే విధంగా రేవంత్ కూడా గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. అలాగే ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా పోటీలో దిగనున్నారు. దీంతో గజ్వేల్ లో నిస్సందేహంగా కేసీఆర్ గడ్డుపరిస్థితిని ఎదుర్కోనున్నారు. ఇది చాలదన్నట్లు.. అమరుల కుటుంబాలకు చెందిన వారు కూడా కేసీఆర్ ను లక్ష్యం చేసుకుని వందల సంఖ్యలో గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ లు దాఖలు చేయాలని నిర్ణయించడంతో కేసీఆర్  కు వచ్చే ఎన్నికలు ఒకింత ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి.   అసలు ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండానే.. ఆయనను వ్యతిరేకించే వారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. వీరి సంఖ్య తక్కువగా ఏమీ లేకపోవడంతో  బీఆర్ఎస్ పై ప్జా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది అందరికీ తెలిసిపోయింది. దానికి తోడు తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండు సార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టినాం ఒక సారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇద్దాం అన్న భావన మెజారిటీ ప్రజలలో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఆందోళన.. కేంద్ర బృందం సందర్శన

కాళేశ్వరం బ్యారేజి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన   మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డ్యామ్ భద్రత, బ్యారేజీ భద్రత  పరీక్షించాల్సిన అవసరం ఉందంటూ, ఇందు కోసం కేంద్ర  బృందాన్ని పంపాలంటూ.. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్నిపంపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ బృందం హుటాహుటిన  తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై.. కాళేశ్వరం డ్యామ్ ను సందర్శించింది. కాగా కాళేశ్వరం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.   మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. 6వ బ్లాక్‌లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయనీ, ఆ సందర్భంగా భారీ శబ్దాలు వెలువడటంతో స్థానికులు భయందోళనలకు గురయ్యారనీ పేర్కొన్నారు. మెడిగడ్డ ఫిల్లర్లు కుంగిన వెంటనే  బ్యారేజ్ లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేశారని వివరించారు.  సాగునీటికోసం నిలువ చేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదిలేయడంతో.. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంతా జాగరణ చేసి భయంతో గడిపారని పేర్కొన్నారు.   అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా?  నిర్వహిస్తే ఆ పరీక్షల్లో ఏం తేలింది? ఇత్యాది విషయాలను గోప్యంగా ఎందుకు ఉంచారు. మేడిగడ్డ  పిల్లర్లు కుంగిన నేపథ్యంలో   స్థానికులలోనూ, ఇంజినీరింగ్ నిపుణులలోనూ ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే పిల్లర్ల నిర్మాణం నాసిరకంగా జరిగిందని ఈ కుంగుబాటుతో తేటతెల్లమైందని, అక్కడ సాయిల్ ట్రీట్ మెంట్ జరగలేదని ఈ సంఘటనతో రుజువౌతోందని కిషన్ రేడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తాజా పరిస్థితికి ఎవరు బాధ్యులనే విషయాన్ని సత్వరమే తేల్చాలని ఆయన ఆ లేఖలో కోరారు.   నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఆయన లేఖకు వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి నిపుణుల బృందాన్ని ప్రాజెక్టు తనిఖీ కోసం పంపించారు. తొలి నుంచీ కాళేశ్వరం భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. గతంలో భారీ వరదకు ప్రాజెక్టు ముంపునకు గురైన సందర్భంలోనే ఈ అనుమానాలు వెల్లువెత్తాయి. అప్పట్లో ప్రాజెక్టు సందర్శనకు ఎవరినీ అనుమతించలేదన్న విషయం విదితమే. ఇప్పుడు  కూడా మెడిగడ్డ ఫిల్లర్లు కుంగిన తరువాత ఆ ప్రాంతానికి రాజకీయ పార్టీల నేతలను అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఏరులై పారుతున్న మద్యం.. బహిరంగంగానే పంపిణీ!

రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా.. మందు అంటే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే దొరికేలా చేస్తా. అమ్మల్లారా.. అక్కల్లారా వింటున్నారా.. ఇదీ మీ బిడ్డ జగన్ ఇస్తున్న హామీ. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి చూపిస్తా అంటూ గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పారు. మాట ఇస్తే చేస్తాడంతే అంటూ వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. మాట తప్పడు.. మడమ తిప్పడు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాకా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు. మద్యపాన నిషేధం హామీని మరవడమే కాకుండా కొత్త కొత్త కంపెనీలను తెచ్చి ఏ మాత్రం ప్రామాణికాలు లేకుండా క్వాలిటీలేని మద్యంతో ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా జీవోలు తెచ్చి మద్యాన్నితన ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వైసీపీ నేతలే ఇప్పుడు గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రజల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేసి జేబులు నింపుకుంటున్నారు.  ఇక, ఇప్పుడు అదే నాసిరకం మద్యాన్ని వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉచితంగా పంపిణీ చేస్తూ ఓట్లుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ వై నాట్ 175 అన్న నినాదాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. అంటే  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా గెలుపొందుతామని వైసీపీ ప్రగల్భాలు పలికింది. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలను చూసిన వైసీపీ ఈ నినాదాన్ని పక్కన పెట్టింది. కానీ, కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి పోటీ చేయించాలని భావిస్తున్న జగన్.. ఆయనకు ఆర్ధికంగా కూడా   అండగా ఉంటూ వస్తున్నారు. భరత్ ఏది అడిగితే అది చేసేలా వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్ పవర్ ఇచ్చారు. దీంతో పోలీసు, రెవెన్యూ అంతా భరత్ కనుసన్నల్లోనే మెలిగేలా చేసుకున్నారు. కాగా, ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ గా కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. చంద్రబాబును   అరెస్ట్ చేశారు.  ఇదే ఆదునుగా భావిస్తున్న వైసీపీ కుప్పాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ముందుగా చంద్రబాబు అవినీతిపరుడని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో నియోజకవర్గంలో భారీగా  సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభలకు హాజరయ్యే వారికి సకల ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో సభ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ తమ వైపుకు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు జనాలను బలవంతంగా తరలించి వారికి భారీగా మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు.. సమావేశం అనంతరం సభా ప్రాంగణంలోనే భారీగా మందు పంపిణీ చేయడం విశేషం.  ఈ సభకు వచ్చే మార్గాలలో కూడా వందలాది మందికి బహిరంగంగానే మద్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫోటోలు చూస్తున్న నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన మద్యపాన నిషేధం ఇదేనా అంటూ  ప్రశ్నిస్తున్నారు. జగన్ తెచ్చిన చీప్ లిక్కర్ మద్యంతో ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. మాట తిప్పడు మడమ తిప్పడు అంటూ మైక్ దొరికితే భజన చేసే మంత్రి రోజా తదితరులకు ఈ వీడియోలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. మీరు మంత్రిగా ఉండి కూడా మీ జిల్లాలోనే ఇలా బహిరంగంగా ప్రజలకు ఉచితంగా మద్యం పంపిణీ చేస్తుంటే మీ కళ్ళు మూసుకుపోయాయా అంటూ రోజాను ట్యాగ్ చేస్తూ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. మీరు ఎంతగా ఇలా బజారు కెక్కితే అంతగా నష్టం పెరుగుతుందే తప్ప చంద్రబాబును ఓడించడం మీ తరం కాదంటూ తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాలినేని vs సుబ్బారెడ్డి.. తీగ లాగితే అక్రమాల బాగోతం బయటపడిందా?

బాలినేని శ్రీనివాస రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఈ రెండు పేర్లు చెప్పగానే మనకి గుర్తొచ్చేది సీఎం జగన్ మోహన్ రెడ్డే. ఈ ఇద్దరూ జగన్ కు దగ్గరి బంధువులే.  వైవీ సుబ్బారెడ్డి వైఎస్ జగన్ కు వరసకు చిన్నాన్న కాగా.. బాలినేని బంధువుతో పాటు జగన్ కాంగ్రెస్ తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న రోజులలోనే ఆయనతో నడిచిన వారిలోఒకరు. అందుకే సుబ్బారెడ్డిని జగన్ టీటీడీ చైర్మన్ ను చేస్తే.. బాలినేనికి జగన్ తొలి క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. కాగా సుబ్బారెడ్డికి మరోసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తే.. బాలినేనిని మాత్రం రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి నుండి తప్పించారు. అదే సమయంలో అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కేబినెట్ లో కొనసాగించారు. దీంతో అప్పటి నుండే బాలినేని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వైసీపీలో ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలో రెబల్ గా వాయిస్ వినిపిస్తున్నారు. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. ఆ మధ్య తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో మీడియా ముఖంగా వైసీపీ పెద్దలపై విరుచుకుపడిన బాలినేని.. తన వాళ్లపై సప్సెన్సన్ ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని, పోలీసుల నుండి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికీ తన మాట అంటే లెక్కలేకుండా పోయిందని ఆవేశాన్ని వెళ్లగక్కారు. దీంతో పలుమార్లు వైసీపీ పెద్దలు బుజ్జగించి బాలినేనిని కూల్ చేస్తూ వస్తున్నారు. నిజానికి ఇక్కడ వైసీపీలో బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు కలిసి చేసిన ఓ భూ ఆక్రమణల కుంభకోణం బాలినేని చేతికి చిక్కింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలినేని.. ఈ కుంభకోణంలో ఎంతటి వారున్నా వదలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, పోలీసులు బాలినేనిని లెక్కచేయకుండా సుబ్బారెడ్డికి మద్దతుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలినేని పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు.  ప్రకాశం జిల్లాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అనుచరులు కొందరు నకిలీ పట్టాలు తయారు చేసి భూవివాదాలకు పాల్పడ్డారు. ఈ ముఠా చాలా పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడింది. బాలినేని ఫిర్యాదుతో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. కానీ, ఈ కేసులో పోలీసులు అసలు వారిని వదిలేసి కొసరు వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును తప్పు దోవ పట్టించారని..ఆరోపిస్తూ అందుకు నిరసనగా బాలినేని సెక్యూరిటీని సరెండర్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అధిష్టానం పెద్దలు ఎలాగోలా బాలినేని కూల్ చేశారు. కానీ, అసలు ఈ భూ కుంభకోణం ఏంటి అన్నది మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.   ఒంగోలులో వెలుగు చూసిన ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణం ఒక్క ఒంగోలుకు పరిమితమవలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారసులు దగ్గర్లో లేని ఆస్తులను, ఎలాంటి అండా లేని వృద్ధుల ఆస్తులను, పలుకుబడి లేని వారి ఆస్తుల్ని ముఠా టార్గెట్ చేసి.. అప్పటికప్పుడు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బెదిరింపులకు దిగేవారనీ. త్రుణమో పణమో ఇచ్చింది తీసుకుని తమకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో వారిని మేనేజ్‌ చేయగా.. పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ సివిల్‌ కేసులని దాటవేయడంతో బాధితులు ముఠాకి లొంగిపోయి వారు చెప్పినట్లు తలొగ్గేవారని అంటున్నారు. ఈ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్వవస్థలన్నీ వ్యవస్థీకృతంగా కలిసి ఈ కుంభకోణానికి తెరతీసినట్లు తెలుస్తున్నది. ఇది ఒక్క ఒంగోలులో మాత్రమే కాదని రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కేసును ఏ దర్యాప్తు సంస్థకు ఇచ్చేది లేదని.. తామే ‘లోతు’గా దర్యాప్తు చేస్తామని ఏపీ పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ కుంభకోణం నీరుగారిపోవడం గ్యారంటీ అని టాక్ నడుస్తుంది.

కొట్లాడి తెచ్చిన తెలంగాణ.. కేసీఆర్ ఎమోషన్ పని చేసేనా?

తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన ఘనుడు కల్వకుంట చంద్రశేఖర రావు. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ ప్రజల మనసు లోతులను కొలిచి.. అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న  టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీ. అందుకే ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజలను ఎంతగా తమ వైపుకు తిప్పుకున్నా.. ఒక్కసారి కేసీఆర్ మైక్ అందుకుంటే ప్రజలంతా తన గురించి మాట్లాడుకొనేలా చేసుకోగలరు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగింది ఇదే. ఒకవైపు రాజకీయంగా తన ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బ తీస్తూనే.. ప్రజల నాడీని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రసంగాలు చేస్తూ వచ్చారు.   దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజలను బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్లేవారు. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు విజయవంతంగా అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ క్రమంలో ఆయన  ఆ సమయానికి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఒక అంశాన్ని టేకప్ చేసుకొని అందులోనే సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలచుకునే వారు. గత రెండు ఎన్నికలలో కేసీఆర్ అదే చేశారు. ముఖ్యంగా తెలంగాణ స్వాభిమానం పేరిటే ఇంత వరకూ కేసీఆర్ ఎన్నికల రాజకీయం అంతా నడిచింది. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంటును, ఆంధ్రా నేతల పాలనను తెరమీదకి తెచ్చి.. ఓటర్ల గుండెల్లో అగ్గిపుట్టించే వారు. తెలంగాణ రాష్ట్రం ఊరికే అచ్చిందా .. చావు నోట్లో తలబెట్టి తెచ్చిన.. ఊరికే ఇచ్చిన్రా రాష్ట్రం.. ఆగమాగం జేస్తే ఇచ్చిన్రు. సోయ లేకుండా నిర్ణయాలు తీసుకోకన్రి.. ఇంకా ఈ ఆంధ్రోళ్లు మన నెత్తిన అవసరమా.. ఇంకా మనం ఢిల్లీ ఎళ్లి గులాంగిరి జేయాల్నా.. జెర ఆలోచించుర్రి లాంటి మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునే వారు. ఎన్నికలు ఏవైనా సరే కనీసం ఒక్కసారైనా తెలంగాణ తెచ్చింది నేనే అనే మాట లేకుండా కేసీఆర్ ప్రసంగాలు ఉండవు. ఇక, ఆ పార్టీ నేతలైతే తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ అనే రేంజిలో ఎలివేషన్స్ ఇస్తారు. ఒక ధంగా తెలంగాణ అనే ఎమోషన్ మీదనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గండం నుండి గట్టెక్కుతూ వస్తుంది.  అయితే, ఈసారి ఈ తెలంగాణ ఎమోషన్ కేసీఆర్ ను గెలిపిస్తుందా అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. గత రెండుసార్లు కాంగ్రెస్ పరిస్థితి వేరు.  ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది.  తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.  తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అంటూ బలంగా ప్రజలలోకి చొచ్చుకుపోయింది. చొచ్చుకుపోతోంది. అస‌లు సోనియా ప్రత్యక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న రాజకీయ సంకల్పం తీసుకోకుండా ఉంటే తెలంగాణ వ‌చ్చేదా అంటూ ప్రజల మనసుకు హత్తుకునేలా ప్రశ్నిస్తోంది.  దీంతో తెలంగాణ  ప్రజలలో ఇదే చ‌ర్చ‌నీయాంశంగామారింది.   రెండుసార్లు తెలంగాణ తెచ్చిన వారికి అవకాశం ఇచ్చాం.. ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అసలు ఈ సెంటిమెంటే ఈసారి ఎన్నికలలో ఏ మాత్రం ఉపయోగపడదన్న భావన వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్దం అయ్యింది. అంతే కాకుండా పార్టీ పేరులోని తెలంగాణను కూడా కేసీఆర్ తీసి పారేశారు. అలాగే ఈ పదేళ్లలో ఉద్యమ నేపథ్యం ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా తాను స్వయంగా ముద్ర వేసిన నాయకులను కేసీఆర్ చేరదీశారు. దీంతో తెలంగాణ ఎమోషన్ ను ఈ సారి కేసీఆర్ పండించలేకపోవచ్చునని, అదే సమయంలో ప్రజలలో ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిందేమిటన్న ప్రశ్న బలంగా మెదులుతోందని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు.   దీంతో ఈసారి తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ ఎమోషన్ ను పండించలేరనీ, ఈ సారి ప్రజలు ఇచ్చే తీర్పు కేసీఆర్ పాలనపైనేననీ అంటున్నారు. 

ఏపీలో రోడ్లకు మరొకరు బలి.. పుట్టిన కుమార్తెను కళ్లారా చూడకుండానే కానరాని లోకాలకు!

రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోవాలని.. అందుకు తగిన మార్గర్శకాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఏపీలో రోడ్లకు మహర్దశ రాబోతుందని, రూ.వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రులు మీడియా ముందుకొచ్చి ప్రజలకు వివరించారు.   పోనీలే ఇకనైనా రహదారి కష్టాలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రజలు ఆశపడ్డారు. కానీ, ప్రకటనలకే తప్ప ఆచరణను మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరు. మంత్రులు మళ్ళీ ఆ ఊసే ఎత్తరు.  గత నాలుగేళ్ళరేళ్ళలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇలాంటి ప్రకటనలు రావడం.. ప్రజలు ఆశపడడం.. మన బతుకు ఇంతేలే అని రాజీ పడడం, నిరాశపడటం ప్రజలకు అలవాటైపోయింది.  రాష్ట్రంలో గుంతల రోడ్లతో వాహనదారుల బండ్లు, ఒళ్ళు గుల్లయిపోతున్నాయి. ఏపీలో రోడ్డెక్కితే బండికి ఏది ఎక్కడ ఊడిపోతుందో అర్ధంకాకపోగా.. అసలు రోడ్డు మీదకి వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి క్షేమంగానే వస్తాడా అని ఆ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూసే పరిస్థితులు దాపురించాయి.  వర్షాకాలంలో రోడ్ల మీద గుంతలలో నీరు నిలిచి అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో కూడా అర్ధం కాక ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలే కాదు.. ఆర్టీసీ బస్సులు సైతం రోడ్ల మీద వెళ్తుండగానే చక్రాలు ఊడిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రోడ్లెక్కి నిరసనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా మాట్లాడితే.. వాహన మిత్ర పేరుతో డబ్బులు ఇస్తున్నాం కదా రోడ్లు వేసేందుకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఉల్టా మాట్లాడిన మంత్రులు కూడా ఉన్నారు. దీంతో అసలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు అనే మాటకు తావులేదని జనం కూడా నిర్ధారణకు వచ్చేశారు. ప్రభుతాన్ని, సీఎంను రోడ్డెక్కిన ప్రతిసారి తిట్టుకుంటూనే  గతుకుల రోడ్లపై ఒళ్లు హూనమౌతున్నా, బండ్ల రిపేర్లకు జేబులు ఖాళీ అయిపోతున్నా పట్టించుకోకుండా తిరుగుతూనే ఉన్నారు. అందుకు అలవాటు పడిపోయారు.   కానీ, అన్ని రోజులు మనవే కాదు కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా గుంతల రోడ్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్ల కారణంగా  ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఓ ప్రమాదం మాత్రం మనసులు కలచివేసింది. కన్నులు చెమర్చేలా చేసింది. మనసు వికలమయ్యేలా చేసింది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజని అనే మహిళ   నిండు గర్భిణీ కాగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు లేరు. కుటుంబ సభ్యులు ఆమెను గురజాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ సదుపాయాలు లేవు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అయితే, గర్భిణీ వెళ్లిన రోడ్లన్నీ గుంతల మయమే కావడంతో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. చివరకు అదృష్టం కొద్దీ అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గురజాల ఆసుపత్రి నుండి భార్యను తరలించే సమయంలో నరసారావు పేట ఆసుపత్రిలో కూడా చేర్చుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే ఉద్దేశ్యంతో భర్త ఆనంద్ డబ్బులు తీసుకు రావడానికి వెళ్ళాడు. గురజాల వరకు గర్భిణీకి తోడుగా వచ్చిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని వెళ్ళాడు.  ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొని వస్తుండగా జోలకళ్ళు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు గుంతల్లో బోల్తా పడింది. దీంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు.   స్థానికులు ఆయనను  నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో ఆయన భార్య, అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉన్నారు. కానీ వారిని చూసుకునే భాగ్యం ఆనంద్ కు కలుగలేదు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ కన్నుమూశాడు. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే తండ్రి మృతి చెందడం అందరికీ కన్నీరు తెప్పించింది. దిక్కుమాలిన రోడ్ల కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని ఆనంద్ కుటుంబం విలపిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. ఇది ఒక ఆనంద్ పరిస్థితి మాత్రమే కాదని.. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంలో ప్తి రోజూ ఏదో ఒక కుటుంబంలో ఇలాంటి విషాదం నెలకొనడం పరిపాటిగా మారిందని నెటిజన్లు అంటున్నారు. 

ఏపీలో పనితనం లేదు పగతనం ఉంది.. జగన్‌పై మరోసారి హరీష్ రావు సెటైర్లు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలలో కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క ఏపీలో మాత్రమే కాదు.. ఇప్పుడు తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్ట్ బిగ్ ఇష్యు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణలో ఇది రాజకీయాలను మలుపు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఈ అంశమే తెలంగాణ రాజకీయాలలో కూడా సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయింది. చంద్రబాబు అరెస్టు సమయంలో అన్ని పార్టీల నేతలు స్పందించి ఖండించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టుపై స్పందించి ఖండించారు. బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ స్పందించలేదు  కానీ.. బీఆర్ఎస్ లో మిగతా మంత్రులు ఈ అంశంపై స్పందించి ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలకు వైసీపీ నేతలలో కనీస చలనం  లేదు. బీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి హరీష్ రావు మొదట నుండి చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పు బడుతూనే ఉన్నారు. మూడు వారాల క్రితం స్పందించిన ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండకూడదన్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం ముమ్మాటికీ తప్పే అని.. ఇది పూర్తిగా బీజేపీ, వైసీపీల కుట్ర రాజకీయం అని కూడా విమర్శించారు. తెలంగాణ నేతలు ఈ స్థాయిలో విమర్శిస్తున్నా.. ఏపీ వైసీపీ నేతలు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కాగా, ఇప్పుడు మరోసారి హరీష్ రావు చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసలు పనితనం లేదు.. కేవలం పగతనం మాత్రమే ఉంది అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కేసీఆర్ పగబడితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలులో ఉండేవారని.. కానీ తాము ఎవరి మీదా పగ పట్టమని, అలాగే ఎవరి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఏపీలో కక్ష రాజకీయాలు కనిపిస్తున్నాయని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టడాన్ని ఆయన పగతనంగా చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో పనితనం లేదని..  పగతనం మాత్రమే ఉందని హరీష్ రావు విస్పష్టంగా చెప్పారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ యధాలాపంగా చేశారో.. ముందే అనుకోని చేశారో కానీ.. కేసీఆర్, జగన్ లను ముడిపెట్టి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను కలుపుతూ చేసిన ఈ వ్యాఖలు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐదేళ్ల తమ పాలనలో రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోయామన్న ఆవేదన హరీష్ రావు మాటలలో కనిపిస్తున్నదని కొందరి అంటుంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలాగా తాము రాజకీయాలలో పగను చూడమని, వ్యక్తిగతంగా పగబట్టమనే హరీష్ రావు మాటలకు అర్ధంగా మరికొందరు   భావిస్తున్నారు. అ యితే, అసలు ఇప్పుడు హరీష్ రావు మరోసారి చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే తెలియనిదేమీ కాదు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు సానుభూతిపరుల ఓట్లు బీఆర్ఎస్ కు ఇప్పుడు అవసరం. అందుకే బీఆర్ఎస్ నేతలు వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. పనిలో పనిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని, ఆయన పాలనను వేలెత్తి చూపుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో నిరసనలను కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నది. అడ్డుకుంటున్నది. మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, ఆ తర్వాత అదే కేటీఆర్ చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ చేసిన ట్వీట్ కు స్పందించి సానుభూతి తెలిపారు. ఖమ్మంలో చంద్రబాబు పాలన ప్రస్తావన తెచ్చి కీర్తించారు. అదే దారిలో తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు ప్రస్తావన తెచ్చి ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నేతలు సైతం జగన్ సర్కార్ వైఖరిని తప్పుబడుతున్నా వైసీపీ నేతలు తేలు కుట్టిన దొంగలాగా  మౌనంగా ఉంటున్నారు.

లోకేష్, పవన్ భేటీ.. ఇక బొమ్మ దద్దరిల్లిపోతుంది!

సమయం లేదు మిత్రమా.. ఇక రణమే అంటూ ఎన్నికలకు సిద్దమైపోతున్నాయి ఏపీలో ప్రతిపక్ష పార్టీలు  తెలుగుదేశం,జనసేన. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో  జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తరువాత  ఏపీలో జగన్ ఓటమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.  అప్పటి వరకూ ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాల మధ్య ఊగిసలాడుతున్న తెలుగుదేశం, జనసేనల పొత్తు ఖరారైపోయింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన పవన్ పొత్తు ఉంటుందని పై ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం, జనసేన కలిసే పోటీచేస్తాయని విస్పష్టంగా తేల్చేశారు. దీంతో రెండు పార్టీలలో జోష్ పెరిగింది. త్వరలోనే రెండు పార్టీల నేతలు కలిసి చర్చించి జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటిస్తామని నేతలు చెప్పారు.  ఇప్పటికే రెండు పార్టీల నుండి ఈ కమిటీ కోసం నేతల ఎంపిక కూడా పూర్తయ్యింది. ఇకపై రెండు పార్టీలు కలిసే ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించనున్నారు . పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేసినపుడే త్వరలోనే చంద్రబాబు జైలు నుండి బయటకి వస్తారని, ఆ తర్వాత రెండు పార్టీల నేతల మధ్య చర్చలు ఉంటాయని అనుకున్నారు. కానీ, నలభై రోజులు దాటిపోయినా చంద్రబాబు కేసులో తీర్పు రాలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడడానికి మరి కొన్ని రోజులు.. అంటే కోర్టుల దసరా సెలవుల పూర్తయిన తరువాత వెలువడే అకాశం ఉండటంతో  చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పుడు రెండు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు. ముందుగా రెండు పార్టీల కమిటీలు సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తదుపరి కార్యాచరణపై చర్చించబోతున్నాయి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో జనసేన కమిటీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించబోతున్నారు. ముందుగా నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించబోతున్నట్లు  వార్తలు వచ్చినా.. ఇప్పుడు పవన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నుండి నారా లోకేష్ నాయకత్వం వహించబోతున్నారు. ఇక ఈ భేటీకి ముందు లేదా తర్వాత చంద్ర‌బాబుతో లోకేష్, పవన్ లు ములాఖత్ ద్వారా భేటీ కానున్నట్లు చెబుతున్నారు.   ఒక్కసారి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటన వస్తే.. ఇహ అప్పటి నుంచీ నిత్యం రెండు పార్టీలు ప్రజల మధ్యనే ఉండనున్నాయి. ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్‌ని నవంబరు 1 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం వచ్చే వారం మొత్తం ప్రజల్లోనే ఉండాలని ప్రణాళిక రూపొందించింది. `నిజం గెలవాలి` అంటూ భువనేశ్వరి, `భవిష్యత్ గ్యారెంటీ` ప్రోగ్రామ్‌తో నారా లోకేష్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా, ఈ రెండు కార్యక్రమాలకీ జనసేన నేతలు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చే అవకాశం ఉంది. అలాగే,  నవంబరు మొదటి వారంలో పవన్ తదుపరి విడత వారాహి యాత్ర మొదలు కానుంది. ఈ  యాత్రకి టీడీపీ మద్దతు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఐక్యంగానే కదులుతున్న సంగతి తెలిసిందే. ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగేలా  మొత్తం వ్యవహారాల్ని జాయింట్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు కదలనున్నాయి. మొత్తంగా  రానున్న రోజుల్లో రాష్ట్రం అంతటా  ప్రతిపక్షాల జోరు, దూకుడు కనిపించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఇరు పార్టీల నేతలూ చెబుతున్నారు.  తెలుగుదేశం, జనసేన కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించి  నలభై రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకూ రెండు పార్టీలూ కలిసి చేపట్టిన కార్యక్రమాలు లేవు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు మద్దతు ప్రకటించడం సరే..  ఉమ్మడిగా కలిసి పనిచేసింది లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరగబోయే రెండు పార్టీల భేటీ ఉమ్మడి కార్యాచరణకు నాంది కాబోతున్నది. రాజహేంద్రవరంలో సోమవారం (అక్టోబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్, లోకేష్ ల అధ్యక్షతన ఇరుపార్టీలూ ఉమ్మడిగా తొలిసారి సమావేశం కానున్నాయి. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. ఒక్కసారి ఈ ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే ఇక రాష్ట్రంలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని తెలుగుదేశం, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

పెద్దిరెడ్డి వర్గీయుల అరాచకత్వం!

ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయనని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆయన మంత్రివర్గ సహచరులతో సహా అంతా  మూకుమ్మడిగా మీడియా ముందుకొచ్చి ఏపీలో జగనన్న పాలన సుభీక్షంగా, సంతోషంగా ఉందని  చెప్పుకుంటారు. రామరాజ్యం లాంటి జగనన్న రాజ్యంపై ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురద జల్లుతున్నాయని మాటల దాడికి దిగుతుంటారు. అయితే వాస్తవంగా   ఏపీలో పరిస్థితులు చూస్తే అసలు రాష్ట్రంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మాస్కులు లేవన్న దళిత వైద్యుడి దగ్గర నుండి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తుల వరకూ ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ వేధింపులకు గురి చేశారు. వీరిలో అవమానాలు భరించలేక మరిణించిన వారు కొందరైతే..   వైసీపీ శ్రేణులే దాడులు, చిత్రహింసలకు మరణించిన వారు మరి కొందరు. ప్రశ్నిస్తే దాడులు.. నిరసన తెలిపితే అరెస్టులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి.  ఆ మధ్య జరిగిన పుంగనూరు అల్లర్లు రాష్ట్ర ప్రజలెవరూ ఇంకా మరిచిపోలేదు. ఈ అల్లర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై ఇంకా న్యాయస్థానాలలో విచారణ   కొనసాగుతోంది. నిజానికి ఈ అల్లర్లకు కారణం వైసీపీ నేతలు, కార్యకర్తలే. పక్కా ప్రణాళికతో చంద్రబాబు రాకను అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో రాళ్ళూ, కర్రలతో వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. కానీ, దీన్ని వక్రీకరించి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదలా ఉండగా  ఇప్పుడు అదే పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను అమానుషంగా వేధించి అర్ధనగ్నంగా మాకంయి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మంత్రి పెద్ది రెడ్డి మనుషేలే ఈ దారుణానికి ఒడిగట్టారు.   చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు పలు నిరసన కార్యకమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్ రావు, రమేష్ లు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఈ సైకిల్ యాత్ర తలపెట్టారు. మధ్యలో వచ్చే దేవాలయాల్లో చంద్రబాబు పేరిట పూజలు చేస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అక్టోబర్ 19) వారి సైకిల్ యాత్ర పుంగనూరు చేరుకుంది.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద టీ తాగేందుకు సైకిళ్లు ఆపారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు వారిని చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇది పెద్దిరెడ్డి అడ్డా.. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్ళగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అటువంటిది మీరు టీడీపీ జెండాలతో ఎలా వచ్చార్రా.. అసలు శ్రీకాకుళం నుంచి ఏం పీకేందుకు వచ్చార్రా అంటూ రెచ్చిపోయారు. అంతే కాదు, టీడీపీ జెండాలు, కండువాలు తీయించి, వారితో చొక్కాలు విప్పించి అర్ధనగ్నంగా మార్చి సైకిళ్ళు నెట్టుకుంటూ వెళ్లండని హుకుం జారీ చేసి అక్కడ నుండి పంపించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండగా ఏపీలో పరిస్థితులపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు మనం స్వాతంత్య్ర దేశంలోనే ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడెక్కడో రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్ పరిస్థితులను జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. అవసరం లేకున్నా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులకు ఏపీలో ఇంత జరుగుతున్నా కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది వీడియో రూపంలో బయట పడింది కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉందని.. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1నుంచి జనంలోకి తెలుగుదేశం.. లోకేష్ దిశా నిర్దేశం

నారా చంద్రబాబునాయుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా ప్రజాసేవలోనే ఉన్న నేత. అయినా చంద్రబాబునాయుడు కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయతల మేలుకలయిక అనదగ్గ రాజనీతిజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో దూసుకుపోతున్నారు. ఈ  నాలుగున్నర దశాబ్దాలలో దేశంలో ప్రతి కీలక మలుపులోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి దిగ్గజ నేతను ఏపీలోని జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. 43 రోజులుగా ఆయన  నిర్బంధంలోనే ఉన్నారు. క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లపై కోర్టులలో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ విషయంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో  ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి దిశా నిర్దేశం చేస్తూనే చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం అని నినదించారు. జగన్ సర్కార్ అక్రమంగా బనాయించిన స్కిల్ కేసులో నిందితులుగా ప్రభుత్వం పేర్కొన్న వారంతా బెయిలుపై బయటకు వచ్చేశారనీ, కానీ చంద్రబాబు మాత్రం 43 రోజులుగా జైలులో ఉన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కంటనీరు పెట్టుకుంటూనే జగన్ సర్కార్ పై కన్నెర్ర చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ సర్కార్ చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఆవేదన, ఆగ్రహం, ఆవేశం కలగలిసిన స్వరంతో ఆయన పార్టీలో గత 43 రోజులుగా ఉన్న స్థబ్దతను బద్దలు కొట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై జరుపుతున్న న్యాయపోరాటంలో గెలుపు తథ్యమని ఉద్ఘాటించారు. చంద్రబాబు అరెస్టు తరువాత గత 43  రోజులుగా ఆగిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను  వచ్చే నెల 1వ తేదీ నుంచి  రెట్టించిన ఉత్సాహంతో మొదలు  పెట్టాలని పిలుపునిచ్చారు.   చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, విద్యావంతులు ఆయన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆయనకు సంఘీభావం  తెలుపుతూ దేశ  విదేశాల్లో స్వచ్ఛందంగా  ఆందోళనలకు దిగుతున్నారు. ఆ విషయాలన్నీ ప్రస్తావించిన  లోకేష్ విస్తృతస్థయి సమావేశంలో పార్టీ  నేతలకూ, నియోజకవర్గ ఇన్ చార్జీలకూ దిశానిర్దేశం చేశారు. “బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ” కార్యక్రమాన్ని తిరిగి ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. జగన్ సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జగన్ రాష్ట్రంలో  ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనీ, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవలసిసన బాధ్యత తెలుగుదేశం భుజస్కంధాల మీద ఉందని చెప్పారు.   విజిల్ వేస్తే కేసు,  కొవ్వొత్తి పట్టుకుంటే కేసు, గంట కొడితే కేసు  మన చేతులకు మనమే సంకెళ్లు వేసుకున్నా కేసు అంతెందుకు కదిలితే అరెస్టు, మెదిలితే నిర్బంధం అంటూ తెలుగుదేశం నేతలపై, తెలుగుదేశం మద్దతుదారులపై ఇష్టారీతిగా కేసులు నమోదు చేసి భయపెట్టాలని జగన్ సర్కార్ చూస్తోందనీ, అయితే తెలుగుదేశం డిక్షనరీలో భయం అన్న పదానికే చెటులేదని లోకేష్ అన్నారు. తెలుగుదేశం బయోడేటాలో భయం అన్నదేలేదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలతో, అక్రమ కేసులు పెట్టి బాబుని జైలుకు పంపిన జగన్ ఒక సైకో అని, దీనికి కచ్చితంగా రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం సరైన సమాధానం చెప్తుందని, ఈ సైకో ప్రభుత్వం వలన ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసే గ్యారంటీ నాది అంటూ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వారిలో ధైర్యం నింపారు.  ప్రజా వేదికను కూల్చడంతో మొదలు పెట్టిన తన దుష్టపాలన ప్రారంభించిన జగన్ ఈ నాలుగున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్వీర్యం సహా ఎన్నోఎన్నెన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారనీ,  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ఏకంగా రాష్ట్రాన్నే కూల్చేందుకు సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు. వంద తప్పులతో శిశుపాలుడి పాపం బద్దలైనట్లు.. చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలు పండాయనీ, ఆయనను అరెస్టు చేసి తన గొయ్యి తానే తీసుకున్నారనీ, తన పతనాన్ని తానే లిఖించుకున్నారని లోకేష్ అన్నారు. నాలుగున్నర దశాబ్దాల  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా అంటని బాబుపై నిరాధార ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్టు చేసిన జగన్ తన తప్పుకు కచ్చితంగా రానున్న రోజులలో ఫలితం  అనుభవించకతప్పదని హెచ్చరించారు.  రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి,రాజకీయ కక్ష సాధింపులతో ప్రతిపక్ష నేతల పై కేసులు మోపి, “జే” టాక్స్ లతో పెట్టుబడి దారులను భయపెట్టి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేసి,రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన జగన్ ఒక భస్మాసరుడనీ, బాబు అక్రమ అరెస్టుతో జగన్ తన నెత్తిన తానే చేయిపెట్టున్నట్లైందనిలోకేష్ చెప్పారు.