స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం?

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక  ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశం తేలనందున రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని కోరుతూ తెలంగాణ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం గవర్నర్ కు పంపామనీ, ఆయన వద్ద ఆ బిల్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉందనీ రేవంత్ సర్కార్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నది.  నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తూండటంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయింది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనుందున మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.  తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయి, స్థానిక సంస్థలన్నీ  ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనప్పటికీ.. రిజర్వేషన్ల వివాదం కారణంగా  ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోతున్నది. 

జగన్ మొహం చాటేసి.. మిథున్ రెడ్డి పరామర్శకు పేర్నిని పంపారా?

మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారిని కూడా ఆయన ఇంత వరకూ జైలుకు వెళ్లి  పరామర్శించింది లేదు. ఈ విషయంలో ఇప్పటికే చెవిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఒకింత అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో.. ప్రస్తుతం జగన్ వాయిస్ గా మారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిశారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన మిథున్ రెడ్డి దాదాపు గత నెలన్నరగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని యథా ప్రకారంగా ఆవు కథలా గతంలో చెప్పిన మాటలనే మళ్లీ వల్లెవేశారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 40 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్కరోజు కూడా ఎందుకు కస్టడీకి తీసుకోలేదంటూ నిలదీశారు. కేవలం కక్ష సాధింపు, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిక మానసికంగా కుంగదీయాలన్న దురుద్దేశంతోనే అక్రమంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికించి జైల్లో పెట్టారని పేర్ని నాని అన్నారు. మద్యం కుంభకోణంలో నిందితులు చెప్పిన మాటల ఆధారంగా ఒక ఎంపీని అరెస్టు చేయడం అన్నది నిస్సందేహంగా రాజకీయ కక్ష సాధింపే అన్నారు. అక్కడితో ఆగకుండా ఓ వారం పది రోజుల్లో మిథున్ రెడ్డి బయటకు వస్తారని జోస్యం చెప్పారు. బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారన్న హెచ్చరిక కూడా చేశారు. మొత్తం మీద జగన్ మిథున్ రెడ్డికి ముహం చాటేసినా.. ఆయన తరఫున పేర్ని నాని వచ్చి కవర్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బీఆర్ఎస్ ‘స్థానిక’ ఆశలు గల్లంతేనా?

బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు. దానికి తోడు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయంగా అంతగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది. అలాగే వరుస కేసులతో ఆ పార్టీ అగ్రనేతలంతా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు తాజాగా గోరు చుట్టుమీద రోకటి పోటు అన్నట్లుగా కవిత ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. సొంత పార్టీపైనే ఆమె నిరసన గళం ఎత్తడం.. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందుకు బాధ్యులు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లే అని ఆరోపణలు గుప్పించడం.. దీంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేయడం జరిగిపోయింది. ఎలా చూసినా ఈ పరిణామం బీఆర్ఎస్ కు శరాఘాతమే అని చెప్పాలి.  ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించే అవకాలున్నాయంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కవిత త్వరలో తెలంగాణ రాజ్య సమితి పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదే జరిగితే..  గ్రామీణ తెలంగాణ ఇప్పటికీ ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ గా ఉన్న టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీగా గండి కొడుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఇది స్థానిక సమరంలో బీఆర్ఎస్ కు భారీ నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. 

కేసీఆర్ పై హరీష్ కుట్ర.. వంటేరు సంచలన ఆరోపణ?

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో గందరగోళానికి దారి తీసింది.  ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె సస్పెన్షన్  నేపథ్యంలో  సీనియర్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత స మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన ఆరోపణలను సమర్ధించారు. ఇప్పుడు కాదు.. 2018లోనే హరీష్ రావు కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించారు. అంతే కాదు.. హరీష్ రావు తన సొంత మామ కేసీఆర్ కి వ్యతిరేకంగా కుట్రకు ప్రయత్నించారని ఆరోపించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గజ్వేల్ నుంచి పోటీ చేసినప్పుడు హరీష్ రావు తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కేసీఆర్ ను ఓడించడానికి పూర్తి మద్దతు ఇచ్చారని వంటేరు పేర్కొన్నారు.  కేసీఆర్ ఓడిపోతే అంతా మనదే  అని హరీష్ రావు అప్పట్లో  తనకు డబ్బు, మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కవిత  చేసిన ఆరోపణలను వంటేరు సమర్ధించారు. హరీష్ రావు తనకు ఫోన్ చేసి కేసీఆర్ ఓటమికి సహకరిస్తానని చెప్పారన్న విషయాన్ని తాను ఏ దేవుడిపైనైనా సరే ప్రమాణం చేసి చెబుతానని వంటేరు అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్ర 2018 ఎన్నికలకు ముందే ప్రారంభమైందని వంటే రు చెప్పారు. అప్పట్లో తానీ విషయం చెప్పినా ఎవరూ వినలేదనీ ఆయన అన్నారు.  కవిత సస్పెన్షన్ సమయంలో వంటేరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపడమే కాకుండా అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. 

ప్రజా సమస్యలపై పోరాటాలు బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలా?.. నిలదీసిన కవిత

తాను ప్రజా పోరాటాలు చేస్తే వాటిని ప్రజావ్యతిరేక కార్యకలాపాలుగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెంబర్ 3)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జై తెలంగాణ నినాదంతో ప్రారంభించిన ఆమె తనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన లేఖలోని రెండు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.   మద్యం కుంభకోణం కేసులో తాను అక్రమంగా అరెస్టై ఐదు నెలలు తీహార్ జైలులో ఉండి బయటకు రాగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నానన్న ఆమె.. అలా ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీకి వ్యతిరేకమా అని ప్రశ్నించారు. ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురిం చి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పోరాడాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని గళమెత్తాను ఇవన్నీ బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలా అని ప్రశ్నించారు బీసీల కోసం మాట్లాడితే తనపై దుష్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు.  

ఏపీకి వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  దార్శనికత గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన దార్శనికత, ప్రగతి కాముకత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును ప్రపంచం గమనిస్తోంది.  గత జగన్ పాలనలో జరిగిన ఆర్థిక, సామాజిక విధ్వంసం నుంచి బయటపడి రాష్ట్రం ఇప్పుడు ప్రగతి పథంలో నడుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అభిమానులో, తెలుగుదేశం పార్టీ నేతలో, శ్రేణులో కాదు ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థ ఈ విషయాన్ని చెబుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యమైన అభివృద్ధి జోరందుకుందని పేర్కొన్న ఆ సంస్థ క్లీన్ ఎనర్జీ నుండి ఎలక్ట్రానిక్స్ వరకూ, చమురు నుంచి గ్యాస్  వరకు అన్ని రంగాలలోని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. వచ్చే ఐదు సంవత్సరాలలో రాష్ట్రాలనికి  45,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రానున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల కృష్టి, విశ్వసనీయతే ఇందుకు కారణమని పేర్కొంది.   

కవిత సస్పెన్షన్.. పొలిటికల్ గా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కు బిగ్ ఇష్యూనే!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కుమార్తె,  ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కవిత సస్పెన్షన్ ఒక పొలిటికల్ హీట్ గా మారడానికి   ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని తక్కువ చేస్తే ఆమె గతంలో మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కారణం. సరే ఆ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకూ కవిత సస్పెన్షన్ కేవలం  సస్పెన్షన్ కాదు.. పార్టీ చీలికకు దారి తీసే ఒక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి పార్టీ అధినేత.. కేసీఆర్ కవిత సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదనీ అంటున్నారు. కవిత తీరు పట్ల కేసీఆర్ ఎంతగా విసిగిపోయి ఉంటారు, పార్టీ ఉనికికే ముప్పుగా ఆమె వ్యాఖ్యలు చేయడం ఆయనను వ్యక్తిగతంగా ఎంతగా మానసికక్షోభకు గురై ఉటారో.. ఆమెను సస్పెండ్ చేయడం ద్వారా తెలుస్తోందని అంటారు. కవితపై బీఆర్ఎస్ వేసిన సస్పెన్షన్ వేటు కేవలం ఒక క్రమశిక్షణ చర్య మాత్రమే కాదనీ,  భావోద్వేగం, మానసిక వేదనల ఫలితమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.   కవిత సస్పెన్షన్ తో కేవలం పార్టీలోనే కాదు.. కేసీఆర్ కుటుంబంలో కూడా చీలికకు దర్పణమని చెబుతున్నారు.  కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఇదేనని చెప్పవచ్చు. కుమార్తె తీరుతో పార్టీ ప్రతిష్ట  మసకబారడమే కాకుండా.. ఇలాంటి పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారంటున్నారు. అందుకే గతంలో అంటే పార్టీ పరాజయం తరువాత ఆమె పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, నేరుగా సొంత సోదరుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించినా, పార్టీ లైన్ కు భిన్నంగా బీసీ రిజర్వేషన్లను సమర్ధించినా కేసీఆర్ ఆమెపై చర్యలకు ఉపక్రమించలేదు సరికదా.. కనీసం మందలించను కూడా మందలించకుండా వెనకేసుకు వచ్చిన చందంగా వ్యవహరించారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. కవిత సస్పెన్షన్ పార్టీని ఓ కుదుపు కుదిపిందనడంలో సందేహం లేదు.  సొంత కూతురిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా కేసీఆర్   కుటుంబ సంబంధాలు, రక్త సంబంధం కంటే పార్టీని రక్షించడమే ముఖ్యమని పార్టీ శ్రేణులకు చాటారని ఎంతగా చెప్పుకుందామని ప్రయత్నించినా జరగాల్సిన డ్యామేజి అయితే జరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు కవిత సొంత దారి చూసుకుంటున్నారని వినిపిస్తోంది. అంటే సొంతంగా కొత్త పార్టీ పెట్టి రాజకీయంగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎప్ ప్రభ మసకబారినట్లేనని అంటున్నారు.  కవితపై విమర్శలు గుప్పించడం, ఆమె విధానాలను తప్పుపట్టడం ఎంత కాదనుకున్నా.. కేసీఆర్, కేటీఆర్ లకు ఒకింత ఇబ్బందికరమేనని చెప్పాల్సి ఉంటుంది.  అన్నిటికీ మించి తెలంగాణ రాజకీయాలలో కవిత సొంత పార్టీ సమీకరణాలను మార్చడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఉంటున్న కేసీఆర్.. ఈ పరిణామాలతో మరింత సైలెన్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే.. బీఆర్ఎస్ పుంజుకోవడం అంత సులువు కాదని కూడా అంటున్నారు. 

బీఆర్‌ఎస్ పార్టీలో కవిత ఉంటే ఎంత.. పోతే ఎంత : సత్యవతి రాథోడ్

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేగు బంధం కన్న పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే  ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సత్యవతి రాథోడ్‌తో పాటు టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, నేతలు రజని సాయిచంద్, శీలా‌రెడ్డి, చారులత, నిరోషా తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు నెలలుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూశామని అన్నారు. గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మూడు నెలలుగా కవిత తన తీరుతో బీఆర్‌ఎస్ పార్టీ‌కి ఎంతో నష్టం చేశారని ఆరోపించారు. ఆమే కామెంట్స్ పార్టీ శ్రేణులకు ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. నేడు కవితను సస్పెండ్ చేస్తూ తమ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం అందరినీ, మరీ ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందని సత్యవతి రాథోడ్ అన్నారు. కార్యకర్తల కన్నా ఫ్యామిలీ ఎక్కువ కాదనే విషయం మళ్లీ స్పష్టమైంందని అన్నారు.  కవిత‌కు నచ్చజెప్పాలని చూసినా.. ఆమె వినకపోవడం వల్లే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ లైన్ దాటిటే ఎవరికైనా ఇదే శిక్ష అనే సందేశాన్ని అధినేత ఇచ్చారని తెలిపారు. పార్టీ గులాబీ దళపతి మళ్లీ జనాల్లోకి రావాలని బలంగా కొరుకుంటున్న తరుణంలో కవిత పార్టీని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లు కేసీఆర్‌కు కుడి ఎడమ భుజాల్లాంటి వారని అభివర్ణించారు. వారిద్దరిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని సెటైర్లు వేశారు. శాసన సభలో హరీష్ రావు ఒంటి‌చేత్తో రేవంత్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారని కొనియడారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని కొనియాడుతుంటే.. ఆయనను కవిత విమర్శించడంతో ఆమె ఏ లైన్లో ఉన్నారో అర్థం అవుతోందని సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కూతురుగా కవితకు ఎక్కడికి వచ్చినా ప్రజలు ఘన స్వాగతం పలికారని సత్యవతి రాథోడ్ అన్నారు. కానీ, ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోలేకపోయిందని తెలిపారు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అనే మాట మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా పార్టీ కేడర్ కవిత ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అంటూ సమాధానం ఇచ్చిందని అన్నారు.

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి కేంద్ర హోంమంత్రి..శోభాయాత్రలో పాల్గొననున్న అమిత్ షా

హైదరాబాద్ లో ఏటా గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కన్నులపండువగా ఉంటుంది. అంగరంగ వైభవంగా సాగే ఈశోభాయాత్రకు బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు హాజరౌతుంటారు. అలాగే  ఈ సారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాగే శోభా యాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్మానం మేరకు ఆయన శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు.   ఈ ఏడాది సెప్టెంబర్ 6న భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 6న హైదరాబాద్ వస్తున్నారు.  అదే రోజు  ఐ టి సి కాకతీయలో బిజెపి ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట మయంలో చార్మినార్ వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో పాల్గొంటారు. ఈ రోండు చోట్లా అమిత్ షా ప్రసంగిస్తారు.  

బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు

  తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత ప్లెక్సీని బీఆర్‌ఎస్ శ్రేణులు దహనం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న కవిత  బ్యానర్లు తీశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత దిష్టిబొమ్మ ను దహనం చేశారు. మాజీ మంత్రి హారీశ్‌రావుపై ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు వారు తెలిపారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని వారు ఆరోపించారు.  తమ పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే కవితను పార్టీను నుంచి సస్పెండ్ చేసినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్లు కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినందుకే కవితపై వేటు వేశమని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.    

పార్టీ అధినేతను కలవడానికి వీఐపీ పాసులా?.. జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన లోకేష్

పులివెందులలో జరిగే సమావేశాలకు పార్టీ సభ్యులకు వీఐపీ పాస్‌లు జారీ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఐటీ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు "ఓరిని పాసులా. సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాస్‌ల గురించి విన్నాం కానీ  మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత పార్టీ అధినేతను కలవడానికి వీఐపీ పాస్‌లు ఏంటంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, కనలేదని పేర్కొన్నారు.   ఇటీవలి జెడ్‌పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జగన్ అడ్డాలో ఈ పరాజయ పరాభవం తరువాత ఆయన తొలి సారిగా పులివెందులకు సోమవారం (సెప్టెంబర్ 1) వచ్చారు. ఆ సందర్భంగా   తనను కలవాలనుకునే వారికి వీఐపీ పాస్‌లు జారీ చేశారు. జగన్ ఈ నిర్ణయం పులివెందుల పార్టీ నేతలు, కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడానికి దారి తీసింది.  ఎందుకంటే.. వీఐపీ పాస్‌లు ఉన్న అతి కొద్ది మంది నాయకులను మాత్రమే  జగన్  కలిశారు. జగన్ భద్రతా బృందం వీఐపీ పాస్‌లు కలిగి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించింది.. వీఐపీ పాసులు లేకుండా ఆయన ఛాయలకు కూడా వెళ్ల నీయలేదు. దీంతో చాలా మంది పార్టీ నేతలూ, కార్యకర్తలు జగన్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద జగన్ కు కలవడానికి వీఐపీ పాస్ ల జారీ వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది.   

కవిత సస్పెన్షన్.. చక్రం తిప్పిన కేటీఆర్?!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో చర్చకు ప్రవేశ పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గట్టిగానే నిలబడ్డారు. బలమైన వాదనలతో అసెంబ్లీలో నివేదిక తప్పుల తడక అని చెప్పే విషయంలో ప్రశంసార్హమైన విధంగా వాదనలు చేశారు. సరే చివరికి  ఆదివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి సభ వేదికగా కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు చేసిన ప్రకటన బీఆర్ఎస్  నాయకులు, శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.  సీబీఐ చేతికి కాళేశ్వరం వెడితే.. బీజేపీ దానిని అవకాశంగా చేసుకుంటుందనీ, ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ను బలహీనం చేసి  రాష్ట్రంలో బలపడుతుందనీ బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. ఇది చాలదన్నట్లు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..సోమవారం (సెప్టెంబర్ 1) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ  కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు జరిగాయని ధృవీకరించేశారు. అంతే కాదు.. ఆ అవినీతికి పాల్పడింది.. మాజీ మంత్రి హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ లేనంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సుద్దపూస అని ఆయనను వెనకేసుకు వచ్చారు. ఇందుకు ఉదాహరణగా హరీష్ రావును కేసీఆర్ రెండో టర్మ్ లో ఇరిగేషన్ శాఖ నుంచి తొలగించడాన్ని చూపారు.   అయితే ఆమె ఎంతగా కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినా.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనిచెప్పడం ద్వారా, అప్పటి ప్రభుత్వాధినేత అయిన తండ్రి కేసీఆర్ ను చిక్కుల్లో పడేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక కవిత విమర్శలూ, ఆరోపణలూ రేవంత్ సర్కార్ వేయేనుగుల బలాన్ని అందించాయి. ఇక ముందు ముందు ఈ కేసులో  సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరో గత్యంతరం లేదన్న భావనకు బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చి ఉంటుందంటున్నాయి పార్టీ శ్రేణులు. అయితే ఇంత కాలంగా కవిత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే మొతక వైఖరితో ఉంటారన్న అనుమానంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు. వాస్తవానికి చాలా కాలంగా కేటీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారనీ, ఈ మేరకు తండ్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కవిత  విషయంలో తండ్రి మళ్లీ చూసీ చూడనట్లు వదిలేయకుండా కేటీఆర్ సోమవారం (సెప్టెంబర్ 1) కవిత మీడియా సమావేశం తరువాత స్వయంగా ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆయన రాత్రంతా ఫామ్ హౌస్ లో తండ్రితో చర్చించారనీ, కవితను సస్పెండ్ చేయకుంటే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని నచ్చచెప్పి కవిత సస్పెన్షన్ కు కేసీఆర్ ను ఒప్పించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

  సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2021లో ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు ముఖ్యమంత్రితో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది.  ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, తనపై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కింది కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావును హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల, అనగా అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.  హరీష్ రావు, సంతోష్  సహా పార్టీ నేతలపై చేసిన విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో బీఅర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.  కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ లది కీలక పాత్ర అని కవిత సోమవారం (సెప్టెంబర్ 1)న మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం అవకతవకలపై విచారణ సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వారి తప్పులకు తన తండ్రి చిక్కుల్లో పడ్డారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఇటీవల కొంత కాలంగా ఆమె పార్టీ లైన్ కు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు మంగళవారం (సెప్టెంబర్ 2) ఆమెను సస్పెండ్ చేసింది. 

కాళేశ్వరంలో కేసీఆర్ ను నిండా ముంచేసిన కవిత వ్యాఖ్యలు!?

కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరగలేవని బీఆర్ఎస్ ఎంతగా గొంతు చించుకుని అరిచినా ఫలితం లేకుండా పోయే పరిస్థితిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ లపై ఆరోపణలు ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారం వాస్తవమేనని కవిత కుండ బద్దలు కొట్టేశారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత పులు కడిగిన ముత్యమేనని చెబుతూనే.. మాజీ మంత్రి హరీష్ రావు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ధృవీకరించేశారు. దీంతో కాళేశ్వరం విషయంలో అవినీతి లేదని బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులు ఎంతగా గొంతు చించుకున్నా ఫలితం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన తండ్రి సుద్దపూస అంటూ.. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడినందునే హరీష్ రావుకు రెండో సారి బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఇరిగేషన్ శాఖ ఏమిటి తొలుత అసలు హరీష్ ను క్యాబినెట్ లోకే తీసుకోలేదనీ, ఆ తరువాత బతిమలాడుకుంటే కేబినెట్ బెర్త్ ఇచ్చారని ఇప్పుడు కవిత గట్టిగా చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని స్వయంగా కవితే అంగీకరించేసిన తరువాత.. ఇక పార్టీకి డిఫెండ్ చేసుకునే అవకాశం ఎక్కడుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇంత కాలం కాళేశ్వరంలో అవినీతి అన్నదే జరగలేదని బీఆర్ఎస్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవా లంటూ కవిత ధృవీకరించేశారు.  కవిత తన వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ ప్రతిష్టనే కాదు.. స్వయంగా తన తండ్రి ప్రతిష్టను కూడా పాతాళంలోకి తోసేశారని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం డిజైన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కర్తా, కర్మా, క్రియా తానేననీ, ఇంజినీర్లకు డిజైన్ ఎలా చేయాలో కూడా తానే చెప్పాననీ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు స్వయంగా ఆయన కుమార్తె కవితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు, అవినీతి నిజమేనని చెప్పడం, అయితే అందుకు తన తండ్రి ప్రమేయం లేదని సమర్ధించడానికి ప్రయత్నించడం ద్వారా కేసీఆర్ ను పూర్తిగా ఇరికించేసినట్లైందని అంున్నారు.  కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటున్న విమర్శకుల నోళ్లు మూయించడం సంగతి పక్కన పెడితే.. కవిత తన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ పై  ఆయన విమర్శకులు  మరింతగా విమర్శల దాడి చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లైందని అంటున్నారు. 

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత, మాజా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారి పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (సెప్టెంబర్ 2) విచారించింది.  ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలూ ప్రభుత్వం తీసుకోబోదనీ, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించనుందనీ తెలిపారు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ స్టే విధించింది. తదుపరి విచారణకు కాళేశ్వరంపై విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. 

పావురాళ్ల గుట్ట ఘటనకు 16 ఏళ్లు..

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. తాను 2004 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డానికి పాద‌యాత్ర చేసే ముందు.. చాలా చాలా తీవ్రంగా బాధ ప‌డ్డారు. కార‌ణం చంద్రబాబు పాలన, విధానాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు  చూస్తుంటే అస‌లు మ‌నం సీఎం కావ‌డం క‌ల్ల అన్న‌ది అప్పటికి ఆయ‌న భావన, ఆవేద‌న‌. ఈ విష‌యం త‌న ఆత్మగా చెప్పుకునే కేవీపీ కి చెప్పుకుని బాధ ప‌డ్డారని  చెబుతుంది ఆయ‌న బ‌యోపిక్ గా వ‌చ్చిన యాత్ర‌. త‌ర్వాత ఆయ‌న మాస్ నాడి ప‌ట్టుకున్నారు. ఆ పాద‌యాత్రకు అప్పటి వ‌ర‌కూ వ్యతిరేకిస్తూ వ‌చ్చిన ప‌త్రిక‌లు కూడా బాగా హైలెట్ చేసి చూపించ‌డంతో.. ఆయ‌న అనూహ్యంగా 2004 ఎన్నిక‌ల‌ను గెలిచారు. అంత‌క‌న్నా ముందు చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌ర‌గ‌టం,  ఆ సానుభూతి ప‌వ‌నాలు, ఆపై తాను మోడ్రన్ అడ్మినిస్ట్రేట‌ర్ గా పేరు సాధించ‌డం వంటి అంశాలేవీ ప‌ని చేయ‌లేదు. వైయ‌స్ పాద‌యాత్ర ద్వారా మాస్ లోకి మ‌రీ ముఖ్యంగా రైతాంగంలోకి వెళ్లడంతో.. ఆయ‌న పంట, కాంగ్రెస్ పంట ఒకేసారి  పండాయి. అప్పటి వ‌ర‌కూ అంద‌ని ద్రాక్షగా ఉన్న అధికారం ఎట్టకేల‌కు వైయ‌స్ఆర్  ప‌ర‌మైంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయ‌స్ శ‌కం   ఒక‌టి మొద‌లైంది. ఎన్టీఆర్ అంటే, రెండు రూపాయ‌లకు కిలో బియ్యం, జ‌న‌తా వస్త్రాలు వంటి సంక్షేమ ప‌థ‌కాలు ఎలాగో, వైయ‌స్ అన‌గానే ట‌క్కున గుర్తుకొచ్చేవి ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్. ఇవి త‌ర్వాతి  కాలంలో ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిల‌వ‌డం, అటుంచితే కొన్ని విమ‌ర్శల‌ను సైతం మూట‌గ‌ట్టుకున్నాయి ఈ పథకాలు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు బాగు ప‌డ్డాయ‌న్న విమర్శలు రావ‌డం.. ఆపై ఫీజు రీఎంబ‌ర్స్ ద్వారా.. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్ చేయ‌డం, దాని విలువ ప‌డిపోయి.. ఉద్యోగితా స్థాయి   దారుణంగా దెబ్బతిన‌డం ఒక ఎత్తు. ఈ విష‌యంపై కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు ఆనాడే విమ‌ర్శలు గుప్పించిన ప‌రిస్థితి. ఈ సామాజిక క్షేమం మ‌ర‌చి కూడా వైయ‌స్ఆర్, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తారు కాబ‌ట్టే.. వారికి ఉండే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్.. చంద్రబాబుకు ఉండేది కాదని చెబుతారు విశ్లేష‌కులు. బేసిగ్గా చంద్రబాబు థియ‌రీ వాట్ దే నీడ్. అదే వైయ‌స్ వాట్ దే వాంట్. దీంతో వైయ‌స్ మ‌హానేత అయ్యాడు. చంద్రబాబు చెడ్డ పేరు సాధించార‌ని చెబుతారు వీరంతా. ఇదిలా ఉంటే.. 2009లో రెండో సారి గెలిచాక వైయ‌స్ఆర్ ఇక తిరుగులేని నేత‌గా  ఎదుగుతార‌ని అనుకున్నారంతా. మ‌ధ్యప్రదేశ్ లో దిగ్విజ‌య్ సింగ్ త‌ర్వాత ఆ స్థాయిలో అధిష్టానం ముందు మంచి పేరు సాధించి.. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎంపీల‌ను అందించి.. అటు యూపీఏ కూట‌మిని సైతం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంతో.. వైయ‌స్ కి సోనియా కోట‌రీ ద‌గ్గర మంచి ప‌లుకుబ‌డి ఉండేద‌ని అంటారు. బేసిగ్గా వైయ‌స్ఆర్.. గాంధీ కుటుంబ వ్యతిరేకి. ఆయ‌న తొలి  రోజుల్లో ఆనాడు దేశ వ్యాప్తంగా న‌డుస్తోన్న కుటుంబ  రాజ‌కీయాల‌ను, గాంధీలు కాని గాంధీల దాష్టీకాన్ని స‌హించ‌లేక పోయేవారని చెబుతుంది ఇటీవ‌ల వ‌చ్చిన మ‌య‌స‌భ అనే సీరీస్. మీరు కావాలంటే చూడొచ్చు. ఆయ‌నేం పెద్ద ఇందిరాగాంధీ విధేయుడు కారు. పైపెచ్చు ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత‌.. కేవ‌లం ఒకే ఒక్కడుగా ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ నుంచి గెలిచి చ‌రిత్ర సృష్టించారు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఆ త‌ర్వాత వైయ‌స్ గెలిచిన ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్- ఐలో క‌లిపేయ‌డంతో.. విధిలేని ప‌రిస్థితుల్లో మాత్రమే వైయ‌స్ ఇందిర అధినాయ‌క‌త్వంలోని పార్టీలో టెక్నిక‌ల్ గా చేరారంతే!  ఆపై సోనియాగాంధీ సైతం వైయ‌స్ తో ఎంత ఇష్టం లేకున్నా  స‌రే.. ఆమె వైయ‌స్ ని కొన‌సాగించేవారంటే అందుకు కార‌ణం.. శ్యాంపిట్రోడా వంటి వారు చేసిన స‌ల‌హా సూచ‌న‌గా చెబుతారు కొంద‌రు సునిశిత రాజ‌కీయ విశ్లేష‌కులు. కాంగ్రెస్ అన‌గానే సీఎంల‌ను త‌ర‌చూ మార్చేస్తుంటార‌ని ఒక అప‌వాదు ఉండేది అప్పట్లో. ఇక‌పై ఏ రాష్ట్రంలో.. ఎవ‌రు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారో.. వారు ఎన్నిసార్లు పార్టీని అధికారంలోకి తెస్తే అన్ని సార్లు ముఖ్యమంత్రిని చేయాల‌న్న విధాన ప‌ర‌మైన నిర్ణయం కార‌ణంగా వైయ‌స్ఆర్ రెండో సారి కూడా సీఎం కాగ‌లిగార‌ని అంచ‌నా వేస్తారు. ఆపై వైయ‌స్ రెండోసారి అధికారంలోకి రావ‌డానికి ఇటు ప్రజారాజ్యం పార్టీ ప్రభావంతో పాటు.. అటు ఇక హైద‌రాబాద్ రావాలంటే పాస్ పోర్టు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని  జ‌నాన్ని రెచ్చగొట్టడం కూడా.. ప‌ని చేసింది. దీంతో ఆయ‌న ద్వితీయ విఘ్నం లేకుండా అధికార పీఠం రెండో సారి కూడా ఎక్కగ‌లిగారని చెబుతారు.  అయితే 2009, సెప్టంబ‌ర్ 2న  పావురాల గుట్టలో ఆయ‌న ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవ‌డంతో.. ఆయ‌న శ‌కం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో  మొద‌లైన ఆరో ఏటే ముగిసిపోయింది. ఒక వేళ వైయ‌స్సే బ‌తికి ఉంటే.. తెలంగాణ వ‌చ్చి ఉండేది కాదేమో. ఈ మాట స్వయంగా కేసీఆరే అనేవారు.  అలా వైయ‌స్ తాను చ‌నిపోయే నాటికి సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా జ‌నం గుండెల్లో గుర్తుండి పోవ‌డం.. ఆపై  కొంద‌రు ఆయ‌న మ‌ర‌ణ వార్త విని త‌ట్టుకోలేక చ‌నిపోయార‌న్న పేరు రావ‌డం. ఆపై వారిని ఓదార్చడానికంటూ జ‌గ‌న్ ఓదార్పు యాత్ర మొద‌లు పెట్టడంతో ఆయ‌న త‌ర్వాతి త‌రం విభ‌జిత ఆంధ్రప్రదేశ్ ను ప్రభావితం చేయ‌డం మొద‌లైంది. ఏది ఏమైనా వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ, ఫీజురీఎంబర్స్ మెంట్ వంటి వాటితో పాటు జ‌ల‌య‌జ్ఞం లాంటి ప‌థ‌కాల‌తో జ‌నానికైతే ఇంకా గుర్తే. ఆయ‌న మ‌ర‌ణించి నేటికి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయ‌న కొంద‌రి విష‌యంలో మ‌హానేత. ఈ విష‌యం మ‌న‌మెవ‌రం కొట్టిపారేయ‌లేం.

శతృవులు చెల్లెళ్లు, మరదళ్ల రూపంలో ఉంటారుగా కవితక్కా!

కేసీఆర్ కి ‘టి ’కలసి వచ్చినంతగా ‘బి’ కలసి రాలేదా? అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే ఆయనకెంతో అచ్చి వచ్చే టీని విడిచిపెట్టారో అప్పటి నుంచి కష్టాలు తరుముకొస్తున్నాయి. టీలోని తెలంగాణ అనే సెంటిమెంటు ఒక తల్లిలా కాపాడుతూ వచ్చింది. అదే..  బీ ఆయన్ను పూర్తిగా విడిచి పెట్టేసింది. ఏ ముహూర్తాన ఆయన టీ తో మొదలయ్యే టీఆర్ఎస్ అన్న పార్టీ పేరును బీతో ఆరంభమయ్యే భారత రాష్ట్ర సమితిగా మార్చారో.. అక్కడి నుంచి మొదలైంది కేసీఆర్ కు కష్టాల పరంపర. మొదట ఓటమి ఎదురైంది. ఆపై వరుస కేసులు. కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్. ఇక తాను అల్లుడు కలసి కాళేశ్వరం అవినీతి ఊబిలో పీకలోతు చిక్కుకుపోగా.. తన కొడుకు ఈ ఫార్ములా కేసులో.. బిడ్డ ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్. ప్రస్తుతం హరీష్‌, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కి మచ్చ అంటోన్న కవిత.. పార్టీకి మేలు చేస్తోందా కీడు చేస్తోందా? కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. అప్పటికీ హరీష్‌ అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తూ అరివీర భయంకరుడిలా పోరాడి పేరు సాధిస్తున్నారు. ఆయనకు బూస్టింగ్ ఇవ్వాల్సిన కవిత.. అలాక్కూడా వదలడం లేదు. అనవసరమైన కామెంట్లు చేసి చెడ్డపేరు తెస్తున్నారు.  శతృవులు ఎక్కడో ఉండరు,, చెల్లెళ్ల రూపంలో, మరదళ్ల రూపంలో ఉంటారన్న మాటను నిజం చేస్తున్నారామె. ఒక సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కేటీఆర్ ఆమె చేసిందసలు తప్పే కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు. ఢిల్లీ ప్రభుత్వం పాలసీ మార్చితే అందులో తాను కూడా ఒక వ్యాపార భాగస్వామిగా ఇన్ వాల్వ్ అయ్యారని ఆమెపై పడ్డ మరకను తుడిచేసే యత్నం చేశారు. హరీష్‌ , సంతోష్ ఎలాంటి ప్రో కామెంట్ చేయకపోయినా.. నెగిటివ్ గా అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.   ఇప్పుడు కళేశ్వరం విషయంలో అలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కవిత ఒకపక్క పార్టీపై  ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలతో చెడుగుడు ఆడేస్తుంటే.. ఏం చేయాలో పాలు పోవడం లేదు కేసీఆర్ కి.  అంటే టైం బాగలేకుంటే కర్రే పామై కరుస్తుందన్నట్టు.. మన అదృష్టం తిరగబడితే బిడ్డే అడ్డం తిరిగి ఇదిగో ఇలాంటి చిక్కులు తెచ్చి పడేస్తున్నారు.  ఇప్పుడు కేసీఆర్ ని, హరీష్‌ని, సంతోష్ ని వేరు చేసి చూడాలని ఇక్కడ ఎవరికీ ఉండదు. తలసానిని ఆయన ఓఎస్డీ కలసి కాకుండా తలసానికి తెలీకుండా కేవలం ఆ ఓఎస్డీ గొర్రల స్కామ్ కి కారకుడని అంటే ఎలా ఉంటుందో.. ఇదీ అంతే. ఒక వేళ కవిత చెప్పినట్టు వీరు ఇరువురూ.. అంత అవినీతికి పాల్పడి ఉంటే.. మరి కేసీఆర్ వైఫల్యం కూడా ఇందులో ఉన్నట్టేగా?  రాష్ట్రంలోని ప్రత్యర్ధి పార్టీల వారు, ఆపై సినీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వారి రహస్యాలను కనుగొన్న కేసీఆర్.. తన సొంతింట్లోని వారు ఇంత భారీ ఎత్తున అవినీతికిపాల్పడుతుంటే మాత్రం ఎందుకు వదిలేశారు? ఇది మిలియన్ డాలర్ క్వశ్చిన్. ప్రస్తుతం కవిత పిచ్చి ప్రయత్నమేంటంటే.. కేసీఆర్ పులుగడిగిన ముత్యం.. ఆయన్ను కాపాడ్డానికి ఇటు కేటీఆర్, అటు హరీష్‌ తో పాటు సంతోష్ ని కూడా బలిపెడుతోంది కావచ్చని అంటున్నారు. అది కూడా తన తండ్రికి చేటు తెచ్చేదేనని ఆమె ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదంటారు పలువురు. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐ వరకూ వెళ్లింది. దీంతో ఏ విధంగా ముందుకెళ్లాలో అని కేసీఆర్ ఓ పక్క తలపట్టుకుంటుంటే..  మధ్యలో కవిత తగుదునమ్మా అంటూ ఈ మేటర్ లో వేలు పెట్టి.. ఇటు సొంత కుటుంబాన్ని, అటు పార్టీని ఇరుకున పెట్టడంఎంత వరకూ సమంజసం అన్న మాట వినిపిస్తోంది.

ప‌వ‌న్ బ‌ల‌మేంటో తెలుసా!?

చాలా మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ బలం.. ఆయ‌న‌కున్న ప్ర‌జాద‌ర‌ణ‌గా భావిస్తారు. కానీ, అది కానే కాదు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రెంగ్త్ ఆయ‌న ఓపిక‌. దేనికైనా ఓపిక ప‌ట్ట‌డం ఆయ‌న నైజం. అందుకే ప‌వ‌న్ పాలిటిక్స్ లో అంత‌గా క్లిక్ అయ్యారు. అదే త‌న అన్న‌య్య చిరంజీవికి అలాంటి ఓపిక లేక పోవ‌డం వ‌ల్లే ఆయ‌న రాజ‌కీయాల్లో రాణించ‌లేక పోయారు. పార్టీ పెట్టిన‌ట్టే పెట్టి ఎత్తేశారు. ప‌వ‌న్ అలాక్కాదు. 2014లో ఆయ‌న నేరుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేయ‌లేదు. నాటి టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంటే ఒక వ్య‌క్తి  నేలపై పడుకున్న వాడు పడుకున్నట్లే నిటారుగా నిలుచోలేడు.. ముందు నిదానంగా కూర్చుని  ఆపై ఎలా లేస్తాడో అలాంటి వ్య‌వ‌హారం అన్న‌మాట‌. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి.. తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడి పోవ‌డం. ఆపై త‌న పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఒకే ఒక్క‌డు, రాజోలు ఎమ్మెల్యే రాపాక‌ వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీలోకి వెళ్లినా.. త‌న కౌంట్ అసెంబ్లీలో జీరో అయినా  ఆ ఐదేళ్లు నిల‌బ‌డి, క‌ల‌బ‌డి ఆపై 2024లో తిరిగి పొత్తు క‌లుపుకుని   వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం ఆయన ఘనత.   చాలా మంది అప్ప‌టి వ‌ర‌కూ అన్న మాట ఏంటంటే.. ప‌వ‌న్ కి అస‌లు రాజ‌కీయాలే తెలియ‌వ‌ని. కానీ ఆయ‌న త‌న పంథాలో తాను చేయాల్సిన రాజ‌కీయ ప్ర‌యోగాలన్నీ చేసేశారు. ఒక సారి మ‌ద్ద‌తిచ్చాం. మ‌రోమారు ఒంట‌రిగా పోటీ చేశాం. మ‌నం ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో 2009నాటి రిజ‌ల్ట్స్ వ‌చ్చాయ్. అప్ప‌ట్లో త‌న అన్న‌య్య కార‌ణంగా తిరిగి  వైఎస్ రాజశేఖరరెడ్డి విజయానికి ఎలో దోహదపడ్డారో , 2019 ఎన్నిక‌ల్లో జగన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీ విజయానికి దోహదపడ్డారు.  దీంతో ఆయన మళ్లీ పొత్తులతో వెడితే..  2014 నాటి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చ‌ని  అంచ‌నా వేసి దాని ప్ర‌కార‌మే ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు ముందు పొత్తు ప్ర‌క‌ట‌న చేశారు. అప్ప‌టికీ ప‌వ‌న్ ని బీజేపీ మైండ్ వాష్ చేయ‌కుండా పోలేదు. కానీ అది క‌రెక్టు కాద‌ని తానే ఓన్ డెసిష‌న్ తీసుకుని  రాజ‌కీయ ప‌రిణితిని  ప్ర‌ద‌ర్శించారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూశారు.  దీంతో కూట‌మి ఘ‌న‌ విజ‌యం సాధించింది. ఒక‌ప్పుడు రెండు చోట్ల పోటీ  చేసి ఓడిపోయిన ప‌వ‌న్.. త‌ర్వాత వంద‌కు వంద‌శాతం ఫ‌లితాల‌తో.. విజ‌య ఢంకా మోగించి.. ప్ర‌స్తుతం 21 ఎమ్మెల్యే 2 ఎంపీ, ఆపై మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌తో  తిరుగులేని విజయం సాధించారు.  ఇప్పుడు ప‌వ‌న్ టార్గెట్ జ‌న‌సేన జాతీయ పార్టీ కావాల‌ని భావించ‌డం. ఈ విష‌యంలోనూ కొంద‌రు గ‌ణాంకాలు వ‌ల్లె వేస్తున్నారు. మీకు ఆ మాత్రం ఓటు శాతం లేద‌ని అంటున్నారు. అది కూడా ఒక‌టిక‌న్నా ఎక్కువ రాష్ట్రాల నుంచి కావాల‌ని దెప్పి పొడుస్తున్నారు. కానీ ఆయ‌న తొలుత అంద‌రూ ఎగ‌తాళి చేశార‌ని ఎంత మాత్రం వెర‌వ‌రు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశ‌గా వెళ్తూనే ఉంటారు. ఒక మినీ బీజేపీ స్థాయిలో ప్రో హిందూ స్టాండ్ తీసుకున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఏపీలో అత్య‌ధిక శాతం గ‌ల కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన  వారు. ఆపై త‌న భార్య క్రిష్టియ‌న్. ఇప్పుడు తాను చూస్తే స‌నాత‌న సార‌థిగా దూసుకెళ్తున్నారు. ఇక త‌న‌కు తాను ప్ర‌తి  ప్రాంతాన్ని ఓన్ చేసుకునేలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. త‌ద్వారా ఆయా ప్రాంతాల స్థానిక‌త‌ను సొంతం చేసుకునేందుకు ప్ర‌యత్నిస్తూనే ఉంటారు. ఇదంతా కూడా రాజ‌కీయాల్లో ఒక భాగ‌మే. అందుకే ఆయ‌న్ను ఎగ‌తాళి చేసిన వారంతా  ప్ర‌స్తుతం అసెంబ్లీలో ప‌త్తా లేకుండా పోయారు. ద‌మ్ముంటే అసెంబ్లీ గేటు తాకి చూడు అన్నారు. ఆయ‌న ఎంట్రీ ఇచ్చాక అక్క‌డ అసెంబ్లీలో వారి ఊసే లేకుండా పోయింది. దీనంత‌టికీ కార‌ణం ఆయ‌న ద‌గ్గ‌ర ట‌న్నుల కొద్దీ ఉన్న ఓరిమి. భూదేవికి ఉన్నంత ఓపిక‌. ఇదే ప‌వ‌న్ ఆయుధంగా చెప్పాలంటారు ప‌లువురు పొలిట‌టిక‌ల్ ఎన‌లిస్టులు.