గైర్హాజరే జగన్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెలేలు శిరసావహిస్తారా అన్నదే అనుమానం?!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ, వారం రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం కూటమి వర్గాల ద్వారా తెలుస్తోంది. అయినా అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సారైనా వైసీపీ సభ్యులు, ముఖ్యంగా జగన్ హాజరౌతారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 15 నెలలు అయ్యింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.  అది పక్కన పెడితే.. చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు ఓ సవాల్ విసిరారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమా అన్నదే ఆ సవాల్. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేలాడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కూడా అసెంబ్లీకి గైర్హాజర్ అవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసైనా సరే సభకు హాజరు అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ మించి జగన్ స్వయంగా పులివెందులలో ఉప ఎన్నికను ఎదుర్కొంటే పరాభవం తప్పదన్న భయంలో ఉన్నారన్న ప్రచారం సైతం సాగుతోంది. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అయితే ఒక అడుగు ముందుకు వేసి పులివెందులలో ఉప ఎన్నికను స్వాగతిస్తున్నానని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా.. అంటే కనీసం శాసనసభ సభ్యత్వాలను కాపాడుకుందుకైనా వైసీపీ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయం తీసుకుంటుందని పరిశీలకులు భావించారు. అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఇటీవల వైసీపీ నేతలతో జరిపిన సమావేశంలో హోదా లేకుండా సభకు వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.  జగన్ ఈ నిర్ణయం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరే వైసీపీ విధానమని జగన్ కుండబద్దలు కొట్టేయడంతో.. ఇప్పుడు ఆయన కాకుండా వైసీపీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలలో ఎందరు ఆయన నిర్ణయాన్ని సమర్ధించి సభకు హాజరౌతారు? ఎందరు గైర్హాజరౌతారు అన్న విషయంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది. ఇక  రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు, సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది ఉభయ సభల సంయుక్త సమావేశం కావడంతో  ఆ హాజరు చెల్లదని తేలింది.  ఆ తరువాత తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి జారుకున్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి రావడంతో దానిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన విషయం తన దృష్టికొచ్చిందని సభలోనే ప్రకటించి అవన్నీ దొంగ సంతకాలంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో తాము దొంగచాటుగా వెళ్లి పెట్టిన సంతకాలు కూడా చెల్లవా? ఈ సారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? అన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కిరించైనా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  అనర్హత వేటు కోసం భయం వద్దు సభ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో పర్యటించడం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని జగన్ చేసిన దిశానిర్దేశం వైసీపీ ఎమ్మెల్యేలకు అంతగా రుచించడం లేదంటున్నారు.   ఇంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైనా.. తమతమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నలను సభకు పంపారు. అయితే ఈసారి అలా కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రులు స్పష్టం చేశారు.  సభకు రాకుండా ప్రశ్నలు  అడిగితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రశ్నలకు సభలో సమాధానం ఇవ్వరు. దీంతో అసలు వైసీపీ వాయిసే వినబడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అనర్హత వేటు పడితే... ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించడం సాధ్యం కాదన్న భయం కూడా వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నది. చూడాలి మరి ఈ సారి జగన్ గైర్హాజర్ నిర్ణయానికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారో లేదో?

తాడిపత్రి లోకి ప్రవేశించిన పెద్దారెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం (సెప్టెంబర్ 6) తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని  పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  మూడు వందల పోలీసులల భద్రతతో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అయ్యారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  తాడిపత్రిలో పెద్దారెడ్డి , ఆయన అనచరులు చేసిన దాడులు, దౌర్జన్యాల కారణంగా తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ కారణంగానే ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకపోయింది. ఎన్నికలలో ఓటమి తరువాత ఓ సారి రహస్యంగా తాడిపత్రిలో అడుగుపెట్టినప్పటికీ, వెంటనే పోలీసులు ఆయనను బయటకు తీసుకువెళ్లారు.  ఆ తరువాత ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా తాడిపత్రిలో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి హైకోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు భద్రతా సమస్యలు అని చెప్పడంతో..  తన భద్రతకు అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని పెద్దారెడ్డి సుప్రీం కోర్టుకు తెలిపారు.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు 15 నెలల తరువాత  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టగలిగారు.   ఈ 15 నెలలలో జరిగినదేమిటన్నది ఒక్కసారి చూస్తే.. పంతాలు పట్టింపులు ఎంత కష్టనష్టాలు కలిగిస్తాయో తాడిపత్రి ఘటన చూస్తున్నాం.ఇటీవల  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఈ పరిస్థితికి కారణం అయింది… ఏడాది కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి పాలన ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 15 నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు. దీంతో పెద్దారెడ్డి చేసేది ఏమీలేక  హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రిలోకి  ప్రవేశించేందుకు అనుమతి పొందారు . ఆ తరువాత పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి తాడిపత్రిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ  స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు జెసి అభిమానులు, ప్రజలు పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే రోజునే జేసీ ప్రభాకరరెడ్డి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా తాడిపత్రి కి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులే కోర్టును ఆశ్రయించి శాంతిభద్రతల సమస్య ఉందని పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించ వద్ధని కోరారు. దీనికి కోర్టు కూడా సమ్మతి  తెలిపింది. దీంతో చేసేది ఏమీ లేక పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రవేశించకుండా  వెనుతిరిగారు. పెద్దారెడ్డి ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పట్టుదలతో  సుప్రీంకోర్టును ఆశ్రయించి  అనుమతి పొందారు. కోర్టు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు శనివారం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించారు.  ఈ సందర్బంగా  ఎటువంటి శాంతి భద్రత సమస్య ఎదురుగా కాకుండా భారీగా  పోలీసులను రంగంలోకి దింపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి సుమారు 15 నెలల తర్వాత తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఎడాదిపైగా తాడిపత్రి కి దూరంగా ఉన్న పెద్దారెడ్డి ఎట్టకేలకు తన సొంత ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించలేదని హెచ్చరించిన జేసి ప్రభాకర్ రెడ్డి కూడా పరిస్థితులకు  అనుగుణంగా మౌనం దాల్చారు.  ఇంకా కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమౌతుందన్న భయంతోనే పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కోసం పట్టుపట్టారని చెప్పాల్సి ఉంటుంది.  గత 15 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో తాడిపత్రిలో వైసీపీ ఇన్ చార్జిగా మరో వ్యక్తిని నియమించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలియడంతో పెద్దారెడ్డి తనకు కల్పించే పోలీసు భద్రతకు అయ్యే వ్యయం భరిస్తానని చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి కోర్టు అనుమతి పొందారు. ఇంత కష్టపడి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినా నియోజకవర్గంలో ఆయన రాజకీయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. 

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్  విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు  చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశిస్తూ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.  

టీచ‌ర్ కాబోయి పొలిటీషియ‌న్ అయిన చంద్రబాబు?

కూట‌మి ప్ర‌భుత్వం శుక్రవారంసెప్టెంబ‌ర్ 5న గురుపూజోత్స‌వం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రాధాకృష్ణ‌న్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయ‌న మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో ప‌ని చేసిన‌ట్టు  విన్నాన‌ని అన్నారు. ఆపై ఏయూకి వైస్ ఛాన్స్ ల‌ర్ గా ఆపై ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాష్ట్ర‌ప‌తిగా సేవ‌లందించార‌ని అల‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ప‌నిలో ప‌నిగా త‌న కుమారుడు లోకేష్ చ‌దువు సంధ్యలు ఎలా సాగాయో కూడా చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. త‌న కుమారుడు మొద‌ట ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నార‌న్న కామెంట్ చేశారు. మాములుగా అయితే రాజ‌కీయ నాయ‌కుల పిల్ల‌లు పెద్ద‌గా చ‌ద‌వ‌క పోయేవార‌ని.. కానీ లోకేష్ అలాక్కాదు.. బుద్ధిగా చ‌దువుకుని.. స్టాన్ ఫోర్డ్ స్థాయికి మెరిట్ ద్వారా వెళ్లారు. అక్క‌డి  నుంచి వ‌ర‌ల్డ్ బ్యాంక్, సింగ‌పూర్ సీఎం ఆఫీస్ వంటి చోట్ల ప‌ని చేసే రేంజ్ కి ఎదిగారు. ఇదంతా ఆయ‌న స్వ‌యం కృషి. లోకేష్ ని ఈ విధంగా తీర్చిదిద్ద‌డంలో ఆయ‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి పాత్ర ఎంతో ముఖ్య‌మైన‌ద‌ని అన్నారు సీఎం చంద్రబాబు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాను లెక్చ‌ర‌ర్ కావ‌ల్సింద‌ని అన్నారు. త‌న వ‌ర్శిటీలో ఈ దిశ‌గా వైస్ చాన్స‌ల‌ర్ అడిగార‌ని, అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న‌ట్టు చెప్పాన‌ని అన్నారు. ఆయ‌న త‌న‌ను గెలుస్తావా? అని కూడా అడిగార‌ని.. గెలిచి వ‌చ్చి మీతో మాట్లాడ‌తాన‌ని తాను అన్నాన‌నీ.. అలా తాను ఎమ్మెల్యేగా గెల‌వ‌డం మాత్ర‌మే కాదు మంత్రి  ఆపై ముఖ్య‌మంత్రి కాగ‌లిగాన‌నీ.. లేకుంటే ఈ పాటికి మీలాగ నేను కూడా ఒక టీచ‌ర్న‌యి ఉండేవాడ్న‌ని గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు.

ఆమె విజ్ణతకే వదిలేస్తున్నా.. కవిత విమర్శలపై హరీష్ స్పందన

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అంతా హరీష్ రావుదేనంటూ కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలపై ఇంత కాలం మౌనం వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు స్పందించారు. తన విదేశీ పర్యటన ముగించుకుని శనివారం (సెప్టెంబర్ 6) హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తన పాతికేళ్ల రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం అన్నారు. గత కొంత కాలంలో బీఆర్ఎస్ పైనా, తనపైనా కొన్ని రాజకీయ పార్టీలూ, కొందరు నేతలూ చేస్తున్న విమర్శలనే కవిత మళ్లీ చేశారని హరీష్ రావు అన్నారు.    బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు లే తెర వెనక ఉండి  కథ నడిపించారు. అంతేకాదు కాంట్రాక్ర్స్ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారంటూ తనపై తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలపై అంతా ఆమె విజ్ణతకే వదిలేస్తున్నానంటూ హరీష్ ముక్తాయించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలు తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని హరీష్ అన్నారు.  

ఏపీ మద్యం కుంభకోణం.. సిట్ దర్యాప్తు తుది అంకానికి?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ చేస్తున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందా? ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది సిట్ గుర్తించిందా? అంటే సిట్ దూకుడు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. తాజాగా జగన్ సోదరుడు, ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే అనిల్ రెడ్డి పిఏ దేవరాజులును సిట్ మూడు రోజుల పాటు విచారించింది. అతడి ద్వారా మద్యం కుంభకోణం సొమ్ము అంతిమంగా ఎక్కడకు చేరిందన్న కూపీ లాగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేప థ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ చివరి అంకానికి తీసుకువచ్చిందని అంటున్నారు. అంతిమ లబ్ధిదారును గుర్తించి అరెస్టు చేస్తే కేసు దర్యాప్తు పూర్తి అవుతుంది.  ఈ నేపథ్యంలోనే సిట్ మద్యం కుంభకోణం కేసులో మూడో చార్జిషీట్ దాఖలు చేయడానికి సమాయత్తమౌతున్నదని చెబుతు న్నారు. జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు కీలక  విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను దేవరాజులు ముందు పెట్టి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో దేవరాజులు మద్యం కుంభకోణం సొమ్ము ఎక్కడకు ఎలా చేరిందన్న విషయాన్ని సిట్ అధికారులకు పూసగుచ్చినట్లు చెప్పేశారని అంటున్నారు. మూడు రోజుల పాటు దేవరాజులును సిట్ విచారించిన విషయం శుక్రవారం (సెప్టెంబర్ 5) వెలుగులోనికి వచ్చింది.   దీంతో వైసీపీలో ఖంగారు, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు?.. సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ రాక!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తూ తెలంగాణ సర్కార్ పంపిన లేఖకు స్పందనగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో అదికారులతో  శుక్రవారం (సెప్టెంబర్ 5) సవావేశమయ్యారు.   కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సీబీఐ ఎలా ముందుకు సాగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు లేవు.   అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్ నివేదిక ఆధారంగా కాకుండా మొత్తంగా కళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. కోర్టుకు కూడా ఇదే విషయాన్నిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను సీబీఐ అక్నాలెడ్జ్ కూడా చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ రిపోర్టు ఆధారంగా కాకుండా.. జనరల్ గానే కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాసింది.  ఈ నేపథ్యంలోనే సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకున్న కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు ఏలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

సోనియా తలుపు తట్టిన...ఓటు చోర్ వివాదం !

  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ఏక కాలంలో కత్తులు దూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వంతో కుమ్ముక్కై, ఓటు చోరీ (ఓట్ల దొంగతనం)కి పాల్పడుతోందని ఆరోపిస్తూ,ఆటం బాంబు పేల్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్’లో, ఓట్ చోర్ – గడ్డీ చోడ్’ నినాదంతో, పక్షం రోజుల పాటు, ఓటరు అధికార యాత్ర సాగించారు. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబుతో మరో బ్రహ్మాండం బద్దలు కొడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే,కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దేదించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సాగిస్తున్న ఓటు చోరీ యుద్ధ తత్రం ఎంతవరకు ఫలిస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది. ఈ సంవత్సరం చివర్లో, జరిగే  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెల్చేస్తాయి.     అయితే, ఓ వంక  కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై యుద్ధం చేస్తుంటే, మరో వంక కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ’ కథలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పవన్ ఖేరా,అయన సతీమణి ఇద్దరి పేర్లు రెండేసి నియోజక వర్గాల ఓటరు జాబితాలో ఉన్నాయని, బీజేపీ ఐసెల్’ చీఫ్ అమిత్ మాలవీయ బయట పెట్టారు. కేవలం నోటి మాటలతో కాకుండా. పవన్ ఖేరాకు దేశ రాజధాని ఢిల్లీలోని జంగుపుర, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గాల ఓటరు జాబితాలలో నమోదైన ఎపిక్ నెంబర్’తో సహా జారీ అయిన ఓటరు  గుర్తింపు కార్డును బయట పెట్టారు.  మాలవీయ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల  సంఘం, విచారణ చేపట్టింది. పవన్ ఖేరాకు నోటీసులు జారీ చేసింది.   అదలా ఉంటే, రాహుల్ గాంధీ ఓటు చోర్’ నినాదం, ఆయన కన్నతల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు,సోనియా గాంధీ ఇంటి తలుపులు తట్టింది. సోనియా గాంధీ,భారతీయ పౌరసత్వం పొందక ముందే,1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకు ముందే ఆమె ఓటరు ఎలా అయ్యారనే సందేహంతో, వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ ద్వారా ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.  ఇందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారు. కానీ 1980లో న్యూఢిల్లీలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైంది. 1982లో ఆ పేరు జాబితా నుంచి తొలగించారు 1983లో మళ్లీ ఆమె పేరు జాబితాలో చేరింది. దీనిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు అప్పట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ కోర్టులో మాట్లాడుతూ ఇది సరైన ప్రక్రియ కాదని, ఇందులో ఏదో తేడా ఉందన్నారు. ఓటరుగా నమోదు కావడానికి భారత పౌరసత్వం తప్పనిసరి. ఆ సమయానికి ఆమె పౌరురాలు కాకపోయినా, ఆమె పేరు ఎలా జాబితాలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో వేరే వ్యక్తులు ప్రమేయం ఉండొచ్చని, ఎలక్షన్ కమిషన్ అధికారులపై కూడా అనుమానం ఉందన్నారు. ఇది ఓ పబ్లిక్ అథారిటీని మోసం చేసే ప్రయత్నంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ అంశాన్ని విచారించిన ఢిల్లీ కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి విచారణ జరగనుంది. అయితే, ఇది కోటగా వెలుగు చూసిన విషయం కాదు, గత కొంత కాలంగా, సోనియా ఒరు చోర్’ వ్యవహరం సోషల్ మీడియాలో, వైరల్ అవుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ, ‘బుల్ షీట్’  అంటూ కొట్టేసింది. అయితే ఇప్పడు,సోనియా ఓటు చోర్’ ఫిర్యాదును విచారణకు స్వీకరించడంతో, కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  సెప్టెంబర్ 18 నుంచి వర్షకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడి విడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాబోమని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలు హజరుకానిపక్షంలో అనర్హత వేటు పడుతుందని ఇప్పటికే డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. ఇలా ఉండగా, తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు ఏపీ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్నికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు

కేసీఆర్, కేటీఆర్, హరీష్ మౌనం వెనుక వ్యూహం ఏంటి?

కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ ఇప్పటి వరకూ ఎన్నడూ ఎదుర్కొనని మహా సంక్షోభంగా చెప్పుకోవలసి ఉంటుంది.  కేసీఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. అయితే ఆమె ఉన్నట్లుండి పార్టీకి ఎదురు తిరిగారు. స్వయంగా కన్నతండ్రే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకూ తెచ్చుకున్నారు. అయినా కూడా తగ్గేదే లే అంటూ.. మాజీ  మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హరీష్ నుంచి పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు ముప్పు ఉందని హెచ్చరించారు. అలాగే తన సోదరుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీని సమర్ధంగా నడిపించడంలో విఫలమయ్యారని నిందించారు. కవిత ఆ ఆరోపణలన్నీ.. తాను పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా చేసినవి. పార్టీలో ఉండగా కవిత చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై మౌనం వహించారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, దానికి ప్రతిగా ఆమె రాజీనామా చేసిన తరువాత  కూడా కవిత విమర్శలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి స్పందన కరవైంది. కవిత ఆరోపణలు విమర్శలపై   కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ స్పందించకపోవడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా హరీష్ రావుదే అన్న విమర్శ కు కూడా   కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి స్పందన లేకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  కనీసం హరీష్ రావు అయినా కవిత తనపై చేసిన విమర్శలకు దీటుగా బదులిస్తారని ఆశించిన పార్టీ శ్రేణులకు కూడా ఆయన మౌనం అంతుపట్టడం లేదంటున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు అక్కడి పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులతో భేటీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికే పరిమితమయ్యారు. దీంతో కవిత ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మౌనం వెనుక వ్యూహం ఏమిటన్నది పరిశీలకులకు సైతం అంతుపట్టడం లేదు.   

రాయలసీమలో వైసీపీకి చెక్.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. సీమలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా.. అక్కడ గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకుంటున్న వైసీపీకి గట్టి చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  2024 ఎన్నికలకు ముందు వరకూ కూడా సీమ ప్రాంతంలో తెలుగుదేశం పట్టు, ప్రభావం అంతంత మాత్రంగానే అన్నట్లుగా ఉండేది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గాలిలో సీమలో కూడా గణనీయమైన స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం సత్తా చాటినప్పటీకీ ఆక్కడ ఇప్పటికీ వైసీపీకి చెప్పుకోదగ్గ  బలం ఉందనడంలో సందేహం లేదు. దీంతో సీమలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. మహానాడును కడప వేదకగా జరపడం నుంచి మొదలుపెడితే.. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అయిన సందర్భాన్నిపురస్కరించుకుని నిర్వహించతలపెట్టిన  సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు రాయలసీమనే వేదిక చేసుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఈ నెల 10న అనంతపురం వేదికగా ఘనంగా, అట్టహాసంగా జరగనుంది.   ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న తెలుగు దేశం.. ఆ జోరును కొనసాగించేందుకు సీమ వేదికగావరుస కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్ధమై సన్నాహాలు చేసుకుంటోందనడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం ను వేదికగా ఎంచుకోవడాన్ని చెప్పుకోవచ్చు. అలాగే పారిశ్రామికంగా, కరవును రూపుమాపడానికి నీటి వసతిని కల్పించడం వంటి కార్యక్రమాలతో  రాయలసీమ జనాలను ఆకట్టుకుని ఆక్కడ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సీమ ప్రాంతంలో వైసీపీ పునాదులు కదులుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సీమ వేదకగా ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. 

ప్రధాని మోడీతో లోకేష్ భేటీ.. ముప్పావుగంట సమావేశంలో ఏం జరిగిందంటే?

  ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తన హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో శుక్రవారం (సెప్టెబర్ 5)  భేటీ అయ్యారు.  దాదాపు  45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో నారా లోకేష్ రాష్ట్రానికి  పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర మద్దతు రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపైచర్చించారు.  ఈ భేటీ సందర్భంగా  లోకేష్ ప్రధానికి యోధాంధ్రపై రూపొందించిన టేబుల్ బుక్ ను బహూకరించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రధానికి ధ్యాంక్స్ చెప్పారు. ఈ తగ్గింపు విద్యార్థులకు, పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఇక అమరావతి ప్రణాళికలో సింగపూర్ పాత్ర గురించి కూడా లోకేష్ మోడీకి వివరించారు.   గతంలో అంటే మే 17న ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఆ భేటీకి ఇప్పుడు తాజాగా జరిగిన భేటీ కొనసాగింపుగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, టెక్నాలజీ, ఇరిగేషన్ రంగాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను మోడీకి వివరించి ఆయా ప్రాజెక్టులు సత్వరం గ్రౌండ్ అవ్వడానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించాలని ఈ సందర్భంగా లోకేష్ మోడీని కోరినట్లు తెలుస్తోంది.  ఇవే కాకుండా ఈ 45 నిముషాల భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన వివరాలను కూడా ప్రధాని మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. సిట్ దర్యాప్తు ఆధారంగా మరి కొందరి పేర్లు చేర్చుతూ మరో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆ చార్జిషీట్ లో ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు పేరు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో లోకేష్ ప్రధానితో భేటీ కావడం, ఆ భేటీలో మద్యం కుంభకోణం దర్యాప్తు పురోగతిని వివరించినట్ల ప్రచారం జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  మొత్తం మీద కేంద్రంతో రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ భేటీని తార్కానంగా చెబుతున్నారు.  

మాజీ మంత్రి అంబటిపై విజిలెన్స్ విచారణ

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.  వైసీపీ హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చి న ఫిర్యాదుల నేపథ్యంలో  ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. దీంతో అంబటిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ తన విచారణ నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.  విజిలెన్స్ విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే కేసు విచారణను ఏసీబీకి అప్పగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే వైసీపీ మాత్రం అంబటిపై విజిలెన్స్ విచారణను కక్ష సాధింపు చర్య అంటూ గగ్గోలు పెడుతున్నది.   అయితే అంబటిపై భారీ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ల్యాండ్ కన్వర్షన్, ఎస్టేట్ వెంచర్లలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.   వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న అంబటి ఎకరం ఒక ఎకరం భూమిని పది లక్షల రూపాయలకు కొనుగోలు చేసి.. అదే భూమిని 30 లక్షల రూపాయలకు జగనన్న కాలనీల కోసం విక్రయించి, భారీగా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లూ ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి ఉన్నాయి. రూ.7 లక్షలకు అమ్మినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.  

బ్రాండ్ మార్చు జ‌గ‌న‌న్నా.. అన్నిటికీ ఇంకా స‌జ్జ‌లేనా?

అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్ట‌ర్ గా స‌జ్జ‌ల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విష‌యం అంత‌టా తెలిసిందే. గ‌త జ‌గ‌న్న పాల‌న‌లో ఇటు ధ‌నుంజ‌య్ రెడ్డి, అటు స‌జ్జ‌ల..  ఈ ఇద్ద‌రి హ‌వా న‌డిచింద‌ని అంటారు. మ‌రీ ముఖ్యంగా స‌జ్జ‌ల అయితే వైయ‌స్ జ‌గ‌న్ త‌ల‌రాత తిర‌గ‌రాసిన‌ట్టుగా భావిస్తారు. అస‌లు స‌జ్జ‌ల వ‌ల్లే జ‌గ‌న్ కి చాలా విష‌యాలు చేర‌క పోయేవ‌ని చెబుతారు. దీంతో జ‌గ‌న్ ఒకానొక ప‌బ్జీ గాడాంధ‌కారంలో ప‌డి కొట్టుమిట్టాడిన‌ట్టుగా ఒక అంచ‌నా. అలాంటి స‌జ్జ‌ల‌ను తొల‌గించాలంటూ పార్టీ ఓడిన‌ప్ప‌టి  నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వెల్లువెత్తింది. అయినా స‌రే స‌జ్జ‌ల‌, ఆయ‌న కుమారుడు భార్గ‌వ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జ‌గ‌న్. ఇక‌నైనా వీరిని మార్చాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికైతే భార్గ‌వ్ నుంచి సోష‌ల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మ‌రొక‌రికి దాన్ని అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. కానీ స‌జ్జ‌లే మ‌ళ్లీ త‌న పాత పాత్ర‌ను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జ‌గ‌న్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఏమాట‌కామాట విజ‌య‌సాయి రెడ్డి క‌ల‌సి వ‌చ్చిన‌ట్టు స‌జ్జ‌ల జ‌గ‌న్ కి క‌ల‌సి  రాలేద‌ని అంటారు చాలా మంది జ‌గ‌న్ అభిమానులు. ఈయ‌న‌కు ఏదీ న‌డ‌ప‌టం స‌రిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వ‌చ్చిన‌ట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో క‌నీసం ఏబీసీడీలు తెలీవ‌ని వాపోతారు. అంతెందుకూ.. తన‌పై రెడ్ కార్న‌ర్ నోటీసులు వ‌చ్చిన‌పుడు.. కొన్ని చానెళ్ల‌లో త‌న‌పై జ‌రిగిన డిబేట్ల‌కు జ‌డుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు. త‌న‌కు తాను ర‌క్షించుకోలేని వాడు.. జ‌గ‌న్ ని మాత్రం ఏం ర‌క్షించగ‌ల‌డు? ఈ విష‌యం ఎందుకో జ‌గ‌న్ కి ఇంకా అర్ధం కావ‌డం లేదు. అప్ప‌ట్లో విజ‌య‌సాయి రెడ్డి అంత రేంజ్ లో స‌జ్జ‌ల జ‌గ‌న్ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను చక్క‌బెట్ట‌డం లేద‌ని అంటారు. నిజానికి విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌న్ ఆస్తుల‌, ఆర్ధిక లావాదేవీల‌ను ఇంకా చ‌క్క‌బెడుతున్న‌ట్టుగానే చెబుతారు. ఆయ‌న రాజ‌కీయాల నుంచి దూర‌మ‌య్యారుగానీ జ‌గ‌న్ ఫైనాన్షియ‌ల్ వ్య‌వ‌హారాల నిర్వ‌హ‌ణ నుంచి బ‌య‌ట‌కు రాలేదని స‌మాచారం. ఇద‌లా ఉంచితే, పార్టీకి స‌రిగ్గా అలాంటి వ్య‌క్తి అవ‌స‌ర‌ముంది కానీ, స‌జ్జ‌ల లాంటి వారు కాద‌న్న‌ది ఫ్యాన్ పార్టీ  శ్రేణులు బాహ‌టంగా అంటోన్న మాట‌. మ‌రి స‌జ్జ‌ల కాకుండా ఇంకెవ‌రున్నారు. అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యుల‌ను అంత తేలిగ్గా ఎంట‌ర్ టైన్ చేయ‌దు. దీంతో స‌జ్జల‌కు ఇంకా ఆడింది  ఆట పాడింది పాట‌గా న‌డుస్తోంద‌ని భావిస్తున్నారు. స‌జ్జ‌ల ఫేస్ చూసి చూసి జ‌నానికి బోర్ కొట్టేసింద‌ని.. ఆయ‌న వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండ‌ద‌ని.. అంత ర‌స‌వ‌త్త‌రంగా కూడా ఆయ‌న మాట్లాడ‌లేడు కాబ‌ట్టి మాకు నీరసం వ‌స్తోంద‌ని అంటున్నారు వైసీపీ  కార్య‌క‌ర్త‌లు.

ఫేక్ న్యూస్ పై కొత్త చ‌ట్టం కాదు.. కొత్త సిస్టం తేవాలి!?

ఫేక్ న్యూస్ మీద చంద్ర‌బాబు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఇది క‌రెక్టు కాదు త‌ప్పు.. ఫేక్ కాదు రియ‌ల్ అంటూ మ‌నం వాళ్ల‌కు ఫోటోలు పెట్టుకుంటూ కూర్చోవాలా? లేక ప‌ని చేయాలా? అని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారాయ‌న‌. ఇక ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే సుగాలీ ప్రీతికి మ‌ద్ద‌తుగా నిలిచినందుకు త‌న‌ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కేసు సీబీఐకి అప్ప‌గించిన‌ట్టు గుర్తు చేశారు చంద్ర‌బాబు. ఈ విష‌యంపై అధికారులు సైతం స్పందించాల్సి ఉంద‌ని.. వీరి నుంచి స‌రైన స్పంద‌న లేక పోవ‌డం వ‌ల్ల కూడా జ‌నం పెద్ద ఎత్తున క‌న్ ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ఇటీవ‌లి కేబినేట్ భేటీ అనంత‌రం మంత్రుల‌తో మాట్లాడిన బాబు.. ఈ విష‌యంపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఫేక్ న్యూస్ ని అరి క‌ట్ట‌డానికి ఒక కొత్త చ‌ట్టం తేవాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. అంతే కాదు ఈ విష‌యంపై ఒక మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం సైతం ఏర్పాటు చేశారు  చంద్ర‌బాబు. ఈ స‌బ్ క‌మిటీలో మంత్రులు అనిత‌, నాదెండ్ల‌, అన‌గాని, పార్ధ‌సార‌ధి ఉన్నారు. వీరి ఆలోచ‌న ఏంటంటే ఇక‌పై సోష‌ల్ మీడియాకు ఆధార్ లింక‌య్యేలా ఒక అకౌంట‌బిలిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. ఎవ‌రైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో వార్ని వెంట‌నే ప‌ట్టుకుని క‌ట్ట‌డి చేసేలా ఈ కొత్త‌ చ‌ట్టం రానుంది. ఈ దిశ‌గా కొన్ని నిబంధ‌న‌లతో కూడిన కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నుంది మంత్రివ‌ర్గ ఉప‌సంఘం. అయితే ఇలాంటి చ‌ట్టాలు చాలానే వ‌స్తుంటాయ్. పోతుంటాయ్.  ఇందుకంటూ నాన్ స్టాప్ గా ప‌ని చేసే సిస్ట‌మ్ ఒక‌టి ఇంప్రూవ్ చేయాల్సి ఉంద‌ని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక యాప్ త‌యారు చేసి అందులో ఒక వార్త నిజ‌మా కాదాని టెస్ట్ చేసుకోవ‌డం. ఆపై ఒక యూట్యూబ్ చానెల్ నిర్వ‌హించి.. త‌ద్వారా ఈ ఫేక్ న్యూస్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పు అంటూ ప్రెజంటేష‌న్లు ఇవ్వ‌డం వంటివి చేయాల్సి ఉంద‌ని అంటున్నారు వీరంతా. ఇప్పుడు చూడండి ఇదే చంద్ర‌బాబు పై జ‌గ‌న్ ఒక ఉల్లి బాంబు విసిరేశారు. ఉల్లి రైతుల‌కు ఇక్క‌డ గిట్టుబాటు ధ‌ర లేక అల్లాడుతుంటే ఆయ‌న హెరిటేజ్  లో మాత్రం కిలో 35 రూపాయ‌ల‌కు అమ్ముతున్న‌ట్టు ఆరోపించారు. దీనిపై చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. అస‌లు హెరిటేజ్ కి రీటైల్ అవుట్ లెట్స్ లేవంటుంటే.. మ‌ధ్య‌లో ఈ కిలో బేరాలు ఎక్క‌డివ‌ని ఆవేద‌న వ్య‌క్తం  చేశారు చంద్ర‌బాబు. ఇక కుప్పంకి కృష్ణ‌మ్మ నీళ్ల వ్య‌వ‌హారం. ఈ విష‌యంలోనూ వైసీపీ సోష‌ల్ మీడియా శ్రేణులు.. పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగేలా చేస్తున్నాయి. ఆ నీళ్లు కృష్ణ  నీళ్లు కావ‌ని.. ట్యాంక‌ర్ల‌లో తోలిన‌వ‌ని సోష‌ల్ మీడియాలో ఈ వార్త తెగ ట్రోల‌వుతోంది. ఇలాంటి విష‌యాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యానికి రావ‌ల్సి ఉంది. ఎవ‌రైనా ఔట్ సోర్సింగ్ కి కానీ, లేదంటే స్వ‌యంగా ఐ అండ్ పీఆర్ ద్వారా గానీ ఒక యాక్టివ్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ని రెడీ చేసి దాని ద్వారా ఈ ఫేక్ న్యూస్ పై ఫైట్ చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే ఏపీడీసీ, ఆపై ఇత‌ర సోష‌ల్ మీడియా వింగుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది నియామ‌కాలు జ‌రిగాయి. కానీ ఫేక్ న్యూస్ మీద ఈ స్థాయిలో ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైతే లేదు. కేవ‌లం చ‌ట్టం త‌యారు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి యూజ్ లేదు. ఖ‌చ్చితంగా ఇందుకంటూ ఒక సిస్ట‌మ్ ఉండి తీరాల్సిన అవ‌శ్య‌క‌త అయితే క‌నిపిస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు సోష‌ల్ మీడియా వ్య‌వ‌హారాల నిపుణులు. ప్ర‌స్తుతం కేబినేట్ భేటీ ముగిశాక‌.. అంద‌రూ క‌ల‌సి నిర్ణ‌యించింది ఏంటంటే, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఎవ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చినా మూకుమ్మ‌డిగా ఒక్క‌టై.. ఈ దాడుల‌ను తిప్పి కొట్టాలని.  ఉదాహ‌ర‌ణ‌కు రాహుల్, మోడీ త‌ల్లిపై చేసిన కామెంట్ల లాంటి వాటిని అస్స‌లు ఉపేక్షించ‌రాద‌ని వీరంతా నిర్ణయించారు. కానీ ఇక్క‌డ ఏం జ‌రుగుతోందంటే.. నిజం ఒక అడుగు వేసే లోప‌ల, అబ‌ద్ధం వంద‌డుగులు వేసేస్తోంది. ఈ విష‌యంపైనా మంత్రి వ‌ర్గం మొత్తం సీరియ‌స్ గా చ‌ర్చించింది. మ‌నం రియాక్ట్ అయ్యే లోప‌ల అబ‌ద్ధాన్ని నిజమ‌న్నంత గ‌ట్టిగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అంద‌రూ క‌ల‌సి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌న ప‌నిలో మ‌నం ఉంటే- వారి ప‌నిలో వారుంటున్నార‌నీ వీరంతా అభిప్రాయ ప‌డ్డారు. కానీ, ఇక్క‌డ ఇందుకంటూ ఒక వ్య‌వ‌స్త లేక పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా దుష్ర‌చారాన్ని ఢీ కొట్ట‌డానికి యాంటీ  వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు కూట‌మి శ్రేణులు రివ‌ర్స్ అటాక్ చేయ‌డానికంటూ ఒక వ్య‌వ‌స్థ లేక పోతే.. వ‌చ్చే రోజుల్లో చాలా చాలా క‌ష్ట‌మ‌న్న‌ది నిపుణుల మాట‌. మ‌రి చూడాలి.. కూట‌మి ఈ దిశ‌గా ఏదైనా కొత్త చ‌ట్టంతో పాటు, మ‌రేదైనా కొత్త సిస్ట‌మ్ త‌యారు చేయాల‌న్న‌ ఆలోచ‌న చేస్తుందా లేదా? 

తల్లీ కొడుకుల న్యాయపోరాటం నాన్ స్టాప్.. జగన్ పై చెన్నై ట్రైబ్యునల్ కు విజయమ్మ

ఆస్తుల వ్యవహారంలో తల్లీ కొడుకుల మధ్య న్యాయపోరాటం నాన్ స్టాప్ గా సాగుతోంది. సరస్వతి పవర్ కంపెనీ వ్యవహారంలో ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.  సరస్వతి పవర్ సిమెంట్స్ వ్యవహారాలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని పేర్కొంటూ.. కుటుంబ వివాదంపై తన కుమారుడు జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేస్తే.. ఎన్సీఎల్టీ విచారించి జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.   విషయమేంటంటే.. సరస్వతి పవర్ కంపెనీ విషయంలో జగన్, భారతి  విజయమ్మకు తమ వాటాలను గిఫ్ట్ డీడ్ కింద రాసిఇచ్చి డైరెక్టర్లుగా వైదొలిగారు. అయితే విజయమ్మ షర్మిలకు ట్రాన్స్ ఫర్ చేయడంతో తాము గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటామని కోరుతూ జగన్ ఎన్సీ ఎల్టీని ఆశ్రయిం చారు.  దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ  జగన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అసలు జగన్ సరస్వతి పవర్ విషయంలో ఇంతగా పట్టుబట్టడానికి రాజకీయంగా తనను వ్యతిరేకిస్తున్న సోదరి షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతు పలకడమేనని పరిశీలకులు అంటున్నారు. కాగా ఎన్సీఎల్టీ  జగన్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ  విజయమ్మ చెన్నై ట్రైబ్యు నల్ ను ఆశ్రయించారు.  దీంతో తల్లి కొడుకుల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోందని అర్థమౌతోంది. ఇటీవల వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో తల్లి విజయమ్మతో జగన్ ముభావంగా ఉండటం తెలిసిందే. సరస్వతి పవర్ వాటాల విషయంలో విభేదాలే అందుకు కారణమని భావిస్తున్నారు. 

సీఎం చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్.. ఎందుకంటే?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుయడు కోసం కొత్త  ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత రెండు వారాలుగా చంద్రబాబు ఈ కొత్త హెలికాప్టర్ లోనే పర్యటనలు చేస్తున్నారు.  గతంలో ఉన్న పాత హెలికాప్టర్ కు స్థానంలో ఈ కొత్త  ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ వినియోగిస్తున్నారు.  ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణించేందుకు అణువుగా ఉండే ఈ హెలికాప్టర్ సీఎం భద్రతకే కాకుండా సమయం ఆదా అవ్వడంలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.  ఇంతకీ పాత హెలికాప్టర్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే.. ఆ పాత బెల్  హెలికాప్టర్ లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండదు. భద్రతా పరంగా కూడా బెల్ కంటే ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త హెలికాప్టర్ ఎంతో మెరుగు.  ఇక పాత హెలికాప్టర్ లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గమ్యస్థానికి చేరుకునే వారు.  ఆర్థికంగా కూడా ఇది ఎక్కువ వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొత్త హెలికాప్టర్ ను అధికారులు అందుబాటులోనికి తీసుకువచ్చారు.  ఈ కొత్త హెలికాప్టర్ లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్లడానికి వీలవుతుండటంతో ఆర్థికంగా తక్కువ ఖర్చు అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు.  

తెలంగాణ జాగృతి.. కవిత వ్యతిరేక ఆకృతి!?

ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు.    ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే  ఈ విషయంలో కవిత  చేసిన కామెంట్ ఏంటంటే తన భవితవ్యానికి వచ్చిన తొందరేం లేదని. అంతే కాదు తాను 27 ఏళ్ల వయసులో చిన్న బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చాననీ.. ఆనాటి నుంచి ఈ నాటి వరకూ తన జీవితం రోడ్డు మీదే ఉందని అన్నారామె. విచిత్రమైన విషయమేంటంటే.. ఇప్పుడు తెలంగాణ జాగృతి నేతలు సైతం ఇదే తరహా కామెంట్ చేశారు. మేడం మీరే కాదు మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా తాము కూడా మళ్లీ రోడ్డు మీద పడ్డట్టయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు  జాగృతి ఫౌండర్, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్. దీంతో కవితకు భారీ షాక్ తగినట్లైంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా సమయంలో  ఆ సంస్థ ఫౌండర్ గా పేరున్న రాజీవ్ సైతం రివర్స్ కావడంతో.. కవిత భవిత అడకత్తెరలో పోకచెక్కలా మారినట్టు భావిస్తున్నారంతా. ఇప్పటి వరకూ ఆమె వెనక ఉన్నది జాగృతి ఒక్కటే అనుకుంటే.. ఇప్పుడా జాగృతిలోనూ చీలిక రావడంతో.. ఆమె వెనక ఈ సంస్థ కూడా పూర్తిగా లేదన్న విషయం తేట తెల్లమైంది. ఇప్పటికే ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లోంచి బీఆర్ఎస్ పార్టీ గుర్తును తొలగించారు. తాను మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ అన్న సవరణలు చేశారు. కేవలం కేసీఆర్ బొమ్మ మాత్రమే ఉంచారు.   ఇప్పటి వరకూ ఎన్టీఆర్, వైయస్ వంటి వారు మరణించాక మాత్రమే వారిని భిన్న వర్గాల వారు ఓన్ చేసుకున్నారు. దాదాపు దేశంలో తొలిసారిగా.. తన తండ్రి ద్వారా సస్పెన్షన్ వేటు ఎదుర్కున్న కవిత.. ఆయన బొమ్మను ఇంకా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఉంచుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి కవిత భవితేంటో.

ట్రంప్ విధానాలతో అమెరికా దివాళా.. మొట్టికాయలు వేసిన అప్పీళ్ల కోర్టు!

భార‌త్ అంటే భ‌గ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా  ఇండియాపై  యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా  ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అస‌లైనా స‌రే రాబ‌ట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.   2024- 25 నాటికి భార‌త్ యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 131 బిలియ‌న్ డాల‌ర్లు కాగా.. దీనిని  2030 నాటికి 500 బిలియ‌న్ డాల‌ర్లకు పెంచాలని  ఇరు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈలోగా ట్రంప్ రెండో సారి పీఠ‌మెక్క‌డంతో ప్ర‌పంచంలో ఉన్న అన్ని దేశాల‌ కంటే  భార‌త్ నే   టార్గెట్ గా పెట్టుకున్నారు ట్రంప్.  ప్ర‌స్తుతం అమెరికాలో కంపెనీలకు సీఈఓలుగా, ఇత‌ర ఉన్న‌త స్థానాల్లో ఉన్న భార‌తీయుల నుంచి మొద‌లు పెడితే.. సాదా సీదా ఉద్యోగుల వ‌ర‌కూ అందరినీ  అమెరిక‌న్ కంపెనీలు తొల‌గించాల‌ని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికాలో అమ్ముడు పోతున్న ఐఫోన్లు స‌గానికి స‌గం భార‌త్ లో త‌యార‌వుతున్న‌వే. అలాగే.. భార‌త్ వ‌ల్ల ఏయే అమెరిక‌న్ కంపెనీలు, ఎంతేసి లాభాలు పొందుతున్నాయో.. లిస్ట్ చూస్తే గూగుల్, మెటా అమేజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఏటా భార‌త్ డిజిట‌ల్ రంగం నుంచి 15 నుంచి 20 బిలియ‌న్ డాల‌ర్ల మేర ల‌బ్ధి పొందుతున్నాయి. అదే విధంగా  మెక్ డొనాల్డ్, కోకాకోలా స‌హా ఇత‌ర కంపెనీలు ఇక్క‌డి నుంచి మ‌రో 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర సంపాదిస్తున్నాయి.  జేపీ మోర్గాన్, మెక‌స్సీ, గోల్డ్ శాక్స్ వంటి వాల్ స్ట్రీట్ ఫైనాన్షియ‌ల్ క‌న్సెల్టెన్సీలు కేవ‌లం ఫీజుల రూపంలోనే 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర వెన‌కేస్తున్నాయ్.  ఇక ఔష‌ధ రంగ పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ స‌ర్వీసులు, ర‌క్ష‌ణ ఒప్పందాల నుంచి వ‌చ్చే ఆదాయం   అద‌నం.  ఇదే కాకుండా సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భార‌తీయ విద్యార్ధులు ఏటా అమెరికాలో పై చ‌దువుల పేరిట అక్క‌డికి వెళ్లి పెడుతున్న ఖ‌ర్చు అక్ష‌రాలా 25 బిలియ‌న్ డాల‌ర్లు. దీన్నిబ‌ట్టీ చూస్తే భార‌త్ అమెరికా నుంచి ఏటా 85 బిలియ‌న్ డాల‌ర్ల మేర ఎగుమ‌తుల రూపేణా పొందుతుంటే.. అంతే స‌మాన స్థాయిలో మ‌న నుంచి ఏదో ఒక రూపంలో  లబ్ధిం పొందుతోంది అమెరికా.  ఈ లెక్క‌న మ‌నం కూడా ట్రంప్ లాగే.. వ్యవహరిస్తే.. దెబ్బ‌కు దెబ్బ..చెల్లుకు చెల్లు అన్నట్లుగా స‌రిపోతుంది. దీంతో గ్లోబ‌ల్ మార్కెట్ దాదాపు స్ట్ర‌క్ అయిపోతుంది. ఈ విష‌యం గుర్తించ‌ని ట్రంప్ పిచ్చిపిచ్చి నిర్ణ‌యాలు తీసుకుంటూ.. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను దివాళా తీయిస్తున్నారని సాక్షాత్తూ అమెరికా అప్పీళ్ల కోర్టు అక్షింతలు వేసింది. ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టింది. అయితే ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించి  త‌న పంతం నెగ్గించుకునే ప‌నిలో బిజీగా ఉండ‌టంతో.. పాపం ఈ కంపెనీల‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ట‌. మ‌నం ఎలా చేశామో స‌రిగ్గా భార‌త్ కూడా అదే చేస్తే.. మా ఆద‌యం ఏం కాను దేవుడా అంటూ   గుండెలు బాదుకుంటున్నాయట‌!