సెటిల్‌మెంట్ల మాస్టర్ ఎల్లంగౌడ్

  నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ కొద్ది రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. సదరు ఎల్లంగౌడ్‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి ఎల్లంగౌడ్ లీలలను వివరించారు. లొంగిపోయిన ఎల్లంగౌడ్ దగ్గర్నుంచి పోలీసులు 65 వేల రూపాయల దొంగనోట్లు, ఆమధ్య కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఎల్లంగౌడ్‌ మీద తెలంగాణలో 15 కేసులు, కర్నాటకలో మూడు కేసులు వున్నాయి. కొద్ది రోజుల క్రితం చైన్ స్నాచర్ శివను పోలీసులు కాల్చి చంపారు. తనకు కూడా పోలీసులు అలాంటి తగే పట్టిస్తారని భయపడిన ఎల్లంగౌడ్ ఓ రాజకీయ నాయకుడి సహకారంతో పోలీసులకు లొంగిపోయాడు. ఎల్లంగౌడ్ దొంగనోట్ల చెలామణి మాత్రమే కాకుండా సెటిల్‌మెంట్లు చేయడంలో కూడా ముదిరిపోయాడు... ఇలా పోలీసులు ఎల్లంగౌడ్ లీలలను వివరించారు. ఎల్లంగౌడ్ ముఠాని ప్రాణాలకు తెగించి ముఠాను పట్టుకునేందుకు యత్నించిన ఎస్ఐ వెంకటరెడ్డిని ఈ సందర్భంగా సత్కరించారు.

ఏపీ శాసనసభ రేపటికి వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం నాడు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. వైసీపీ సభ్యులు సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో వరుసగా మూడోసారి 15 నిమిషాల చొప్పున సభ వాయిదా పడింది. నాలుగోసారి సమావేశం ప్రారంభమైనప్పటికీ వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో శాసనసభను స్పీకర్ కోడెల శివప్రసాద్ బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు స్పీకర్‌ మైక్‌ విరగొట్టే ప్రయత్నం చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. దీంతో వైసీపీ సభ్యుల తమ నినాదాలను కొనసాగించారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలపడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

రాజీనామా చేస్తా... షీలా దీక్షిత్

  కేరళ గవర్నర్ పదవి నుంచి వైదొలగడానికి బెట్టు చేస్తూ వస్తున్న షీలాదీక్షిత్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. షీలా దీక్షిత్ సోమవారం నాడు ఢిల్లీకి వచ్చి మొదట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆమెని పదవి నుంచి వైదొలగాల్సిందిగా మౌఖికంగా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె హోం మంత్రిని, రాష్ట్రపతిని కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. షీలా దీక్షిత్ ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమిటా అన్న ఆలోచనలో రాజకీయ వర్గాలు పడ్డాయి. చివరికి షీలాదీక్షిత్ కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారన్న విషయం బయటపడింది. ఇక గంటల్లోనే ఆమె రాజీనామా వార్త వెలువడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

చిన్నారిని బీరువాలో దాచిన టీచర్

  కొంతమంది టీచర్లని టీచర్లు అని పిలవటం కంటే క్రీచర్లు అని పిలిస్తే సరిపోతుంది. పిల్లల్ని లాలించి బుజ్జగించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు సహనం కోల్పోయి క్రూరంగా ప్రవర్తించిన సంఘటనలు నేటి సమాజంలో తరచూ జరుగుతున్నాయి. అలాంటి రెండు సంఘటనలు తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్లో ఓ అంగన్ వాడీ టీచర్ ఓ చిన్నారిని అల్లరి చేస్తోందన్న నెపంతో స్కూల్లో వున్న బీరువాలో దాచింది. దాంతో చిన్నారికి ఊపిరి ఆడకపోవటంతో పరిస్థితి విషమంగా మారింది. ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ గ్రామస్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అలాగే విజయ నగరంలోని ప్రతిభా పాఠశాలలో హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని టీచర్ చితకబాదింది. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగరరావు

  మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా తెలంగాణకి చెందిన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విద్యాసాగర్ రావు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అలాగే మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు.

సెప్టెంబర్ 5న డిఎస్సీ నోటిఫికేషన్

  సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆరోజు గురుపూజోత్సవం కావడం విశేషం. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీలో ఖాళీగా వున్న 10,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.   1. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు కార్పొరేట్ పాఠశాలలకు మించి వుండేలా చర్యలు.   2. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు, ఉపాధ్యాయుల హాజరును కచ్చితంగా పర్యవేక్షించడానికి బయో మెట్రిక్ విధానం అమలు. ఈ విధానం మొదటగా ప్రయోగాగత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు.   3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు.   4. రానున్న రోజుల్లో రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం విద్యకే కేటాయింపు.

చెవిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

  వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. స్పీకర్ మీద చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిది. ప్రివిలేజ్ మోషన్ కోరిన చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఆ మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రతిపాదించారు. ఈ అంశాన్ని స్వీకరించామని.. తరువాత చూద్దామని.. బడ్జెట్‌పై చర్చను మొదలు పెట్టాలని స్పీకర్ కోరారు. ఆ తర్వాత కూడా సభ కొనసాగకుండా వైసీపీ సభ్యులు అడ్డు తగులుతూనే వున్నారు.

షీలా దీక్షిత్ రాష్ట్రపతిని ఎందుకు కలసినట్టో...

  తన గవర్నర్ పదవికి రాజీనామా చేయనని భీష్మించుకుని కూర్చున్న మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ తనను త్రిపురకు బదిలీ చేయడంతో రాజీనామా చేసేశారు. ఇప్పుడు అదే విధంగా భీష్మించుకుని కూర్చున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సోమవారం నాడు ఢిల్లీకి వచ్చి మొదట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆమెని పదవి నుంచి వైదొలగాల్సిందిగా మౌఖికంగా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె హోం మంత్రిని, రాష్ట్రపతిని కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. షీలా దీక్షిత్ తన పదవికి రాజీనామా చేయడం కోసం గవర్నర్ని కలిశారా.. లేక ఎన్డీయే ప్రభుత్వంతో రాజీపడే ఉద్దేశంతో కలిశారా అనేది సస్పెన్స్‌గా వుంది.

ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకున్నారు.. కాకపోతే....

  కర్నాటకకు చెందిన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పెద్దయ్యాక ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టింది. ఎంచక్కా ఒకరోజు ఇళ్ళలోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరి పెళ్ళిని ఇద్దరికీ చెందిన పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదేదో రొటీన్ సినిమా కథలా వుందని అనుకుంటున్నారు కదూ.. కానీ ఇది రొటీన్ సినిమా కథ కాదు.. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, ఆ పెళ్ళి చేసుకున్న ఇద్దరు ఫ్రెండ్స్.. ఓ అబ్బాయి.. ఓ అమ్మాయి కాదు.. ఇద్దరూ అమ్మాయిలే! కర్నాటక రాష్ట్రంలోని అబ్బూరుకు చెందిన వినుత (21), గరకహళ్ళికి చెందిన సుచిత్ర (21) చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎలిమెంటరీ స్కూలు దగ్గర్నుంచి డిగ్రీ వరకూ కలిసే చదువుకున్నారు. ఈ స్నేహ ప్రయాణంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఓరోజు ఇద్దరూ ఇళ్ళలోంచి వెళ్ళిపోయారు. ఇద్దరి ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చాలా శ్రమించి వీళ్ళిద్దరి జాడ తెలుసుకుని పట్టుకొచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట విని అందరూ షాకయ్యారు. వాళ్ళిద్దరూ అప్పటికే పెళ్ళి చేసుకుని చక్కగా కలసి కాపురం చేస్తున్నారట. తమ పెళ్ళికి పెద్దలు చచ్చినా ఒప్పుకోరని ఇళ్ళలోంచి వెళ్ళిపోతారట. తమ దారిన తమని వదిలేస్తే లైఫ్‌లో చక్కగా కాపురం చేసుకుంటారట. వీళ్ళిద్దరి వ్యవహారం చూసి ఇద్దరి తల్లిదండ్రులు నెత్తీనోరూ బాదుకుంటుంటే, జనం మాత్రం ఈరోజుల్లో ఇలాంటివి మామూలైపోయాయి అనుకుంటున్నారు.

పార్టీ మారనున్న సబితా ఇంద్రారెడ్డి?

  కాంగ్రెస్ నాయకురాలు, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తన కుమారుడు కార్తీక్ రెడ్డితో సహా తెరాసలో చేరే అవకాశం వుందన్న పుకార్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో షికార్లు చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన మేధోమథన సదస్సుకు సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ హాజరు కాకపోవడం రాష్ట్ర రాజకీయ వర్గాలలో వీరిద్దరూ పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సబిత, ఆమె కుమారుడు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా వుంటున్నారని, కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని సమాచారం.

బీహార్ ఎన్నికలలో లాలూ - నితిష్ కూటమి పైచేయి

  బీహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికలలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి ఆరు స్థానాలు దక్కగా, భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికలలో ఎవరికి వారే పోటీ చేస్తే అందరూ ఘోర పరాజయం చెందడం ఖాయమని తెలుసుకున్న ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. రాజకీయంగా పరమ శత్రువులైన ఈ మూడు పార్టీలూ ఉప ఎన్నికల కోసం ఒక్కటి కావడం బీహార్‌లో గమనించదగ్గర రాజకీయ పరిణామం. బీహార్‌లో నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకోవడం బీజేపీ వెనుకబాటుతనంగా భావించాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రాణీ సినిమాకి ‘పన్ను’ లేదు

  బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటించిన ఓ సినిమాకి వినోదపు పన్నును రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా పేరు ‘మర్దానీ’. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబంతో కలసి ఈ సినిమాని చూశారు. మహిళలు, టీనేజ్ బాలికలపై జరుగుతున్న అరాచకాలు ప్రధానాంశంగా రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాని చూసి ముగ్ధుడైపోయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సినిమాకి వినోదపు పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారా కూడా వెల్లడి చేశారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రాణీ ముఖర్జీ మీద శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘మర్దానీ సినిమాలో రాణీ ముఖర్జీ పోషించిన పాత్ర అద్భుతమైనదే కాకుండా చాలా శక్తివంతమైనదిగా ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రాకు ప్రత్యేక అభినందనలు. మంచి చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి సామాజిక చైతన్యం కల్గించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి టాక్స్ ఫ్రీ హోదా కల్పిస్తాం’’ అని శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఖురాన్ పేజీ ఖరీదు 40 లక్షలు

  అత్యంత పురాతన ఖురాన్‌లోని ఒక పేజీ వేలం పాటలో అక్షరాలా 40 లక్షల రూపాయలకు (68000 డాలర్లు) అమ్ముడైంది. సిడ్నీలో జరిగిన వేలంపాటలో ఖురాన్ పేజీకి అంత ధర పలికింది. ఈ ఖురాన్ పేజీ ఫ్రేమ్ చేసి వుంది. వేలంపాటలో ఈ పేజీకి 37 నుంచి 55 వేల డాలర్ల మధ్య ధర పలికే అవకాశం వుందని వేలం నిర్వాహకులు భావించారు. అయితే దీని ధర ఏకంగా 68 వేల డాలర్ల ధర పలకడం విశేషం. అంత ధర పెట్టి ఈ పేజీని కొనుగోలు చేసిన వ్యక్తి డైరెక్ట్‌‌గా వేలం పాట దగ్గరకి రాలేదు. ఈ మెయిల్ పంపడం ద్వారానే కొనుగోలు చేశాడు. ఈ ఖురాన్ పేజీని అమ్మిన వ్యక్తం గతంలో కూడా ఒక పేజీని అమ్మాడు. అప్పుడు దాని విలువ 27 వేల డాలర్లు మాత్రమే పలికింది. ఇప్పుడీ మరో పేజీకి అంతకు రెండింతలు పలకడం విశేషం.

బొగ్గు క్షేత్రాల కేటాయింపు రద్దు

  యుపిఎ ప్రభుత్వ హయాంలో బొగ్గుకు సంబంధించిన కుంభకోణాలే కుంభకోణాలు. బొగ్గు శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసిన వాళ్ళ దగ్గర్నుంచి సహాయ మంత్రులుగా పనిచేసినవాళ్ళు కూడా కుంభకోణంలో ఇరుక్కుపోయారు. సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కి కూడా బొగ్గు మరకలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో 1992 నుంచి 2010 సంవత్సరం వరకు కేటాయించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపును సుప్రీంకోర్టు రద్దు చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో పారదర్శకత లేదని, ఈ కేసుపై మరింత విచారణ జరగాల్సిన అవసరం వుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలను తిరిగి కేటాయించే అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని వేయాలని ధర్మాసనం సలహా ఇచ్చింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వేలం నిర్వహించకుండా బొగ్గు క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు కేటాయించడం వివాదాలకు దారితీసింది.

అమెరికా భారీ భూకంప నష్టం 6000 కోట్లు

  అమెరికాలోని నాపా వ్యాలీ ప్రాంతంలో తీవ్ర భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారు ఝామున వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలు మీద 6 పాయింట్లుగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక కట్టడాలు కూలిపోయాయి. ఈ భూకంపం కారణంగా అమెరికాకి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంతో ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే ప్రథమం. భూకంపం కారణంగా అనేక నివాసాలు కూలిపోవడంతోపాటు మంచినీళ్ళు, గ్యాస్ సరఫరా చేసే పైపులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందమందికి పైగా జనం గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది.

రెండో పెళ్ళికి రెడీ... ఇమ్రాన్‌ఖాన్

  పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం లేవదీసిన ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్ళి చేసుకోవడానికి తాను రెడీగా వున్నానని చెప్పారు. అయితే తాను తాను కలలు కంటున్న ‘నయా పాకిస్థాన్’ ఏర్పడిన తర్వాత పెళ్ళి చేసుకుంటానని ఆయన చెప్పారు. అరవై రెండేళ్ళ ఇమ్రాన్‌ఖాన్‌కి జెమీనా గోల్డ్ స్మిత్ అనే ఇంగ్లాండ్ జర్నలిస్ట్‌తో ఆల్రెడీ పెళ్ళయింది. వీళ్ళు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల ముచ్చట తీరి కూడా పదేళ్ళు అయింది. ఇంతకాలం ‘ఒంటరి’గా వున్న తర్వాత ఆయనకు ఇప్పుడు మళ్ళీ పెళ్ళి మీద మోజు పుట్టింది. ఆ పెళ్ళి కూడా తాను కలలు కంటున్న ‘నయా పాకిస్థాన్’లో అని చెబుతున్నాడు. కలలు కంటున్న పాకిస్థాన్ అంటే ఇమ్రాన్ చెప్పకపోయినా అందరికీ తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడేసి తాను ప్రధానమంత్రి కావడమే ఇమ్రాన్ ఖాన్ కలలు కంటున్న పాకిస్థాన్.

కుర్చీ వదిలి ఆరిపోయా...

  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ క్రేజీ పనులు చేయడంలో దిట్ట. ఎంచక్కా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి వస్తే చక్కగా పరిపాలించక, పదవిలో ఉన్నప్పుడు బోలెడన్ని ఓవర్ యాక్షన్లు చేశాడు. చివరికి ముఖ్యమంత్రి పదవికి అనవసరంగా రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాడు. దాంతో ఢిల్లీ ప్రజల దృష్టిలో కేజ్రీవాల్ చీప్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు కేజ్రీవాల్ బాధపడిపోతున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ వదలడం వల్ల అడ్డంగా ఆరిపోయానని అంటున్నాడు. ఎవరైనా సరే వచ్చిన పదవిని వదులుకోకూడదనే విషయం తనకు అనుభవపూర్వకంగా తెలియవచ్చిందని, ఢిల్లీలో జరిగిన ఆప్ కార్యకర్తల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ‘‘రాజకీయాలకు కొత్త కావడం వల్ల కొన్ని తప్పులు చేశా. ఢిల్లీ ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా వుండమంటే 49 రోజుల్లోనే పదవిని వదిలిపెట్టేశా. పదవి పోయాక గానీ నాకు జ్ఞానోదయం కలగలేదు. ఈసారి అధికారం వస్తే మాత్రం కుర్చీని వదిలిపెట్టకుండా ఐదేళ్ళు పరిపాలిస్తా’’ అన్నారు. 

చిత్రకూట్ ఆలయంలో తొక్కిసలాట.. 10 మంది మృతి

  మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ కంఠానాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. 30 మంది గాయపడ్డారు. సాత్నా జిల్లాలోని కంఠనాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలో రాక్షసులను సంహరించాడని అంటారు. అమావాస్య రోజున ఇక్కడ పూజలు జరిపితే మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం భక్తులకు వుంది. అయితే భక్తులు భారీగా రావడంతో ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. ఒక కొండ అంచు మీద కట్టిన గోడ కూలిపోవడంతో భక్తులు పై నుంచి పెద్ద గుంటలోకి పడిపోయినందువల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను తక్షణ ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.