ఈరోజు రెండు చందమామలు హంబక్...
ఈరోజు (ఆగస్టు 27, 2014) నాడు ఆకాశంలో రెండు చందమామలు కనిపిస్తాయని, వాటిలో ఒక చందమామ మనకు ఎప్పుడూ కనిపించే చందమామ కాగా, మరో చందమామ భూమికి బాగా దగ్గరగా వచ్చిన అంగారక గ్రహం అని, బుధవారం అర్ధరాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత ఆకాశంలో రెండు చందమామలు కనిపిస్తాయన్న ప్రచారం ఈమధ్యకాలంలో బాగా జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయం బాగా ప్రచారంలో వుంది. దాంతో ఆకాశంలో రెండు చందమామలు కనిపిస్తాయట, మళ్ళీ అలా కనిపించేది ఇంకో మూడువేల సంవత్సరాల తర్వాతేనట అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈరోజు అర్ధరాత్రి పన్నెండున్నర కావడం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రచారం అంతా హంబక్ అని తేలిపోయింది. బుధవారం నాడు అంగారక గ్రహం భూమికి దగ్గరగా వచ్చే మాట వాస్తవమేగానీ, అది మరో చందమామలా కనిపించేంత దగ్గరకి రాదని, ఆకాశంలో అంగారక గ్రహం ఉన్నచోట కాస్త ఎక్కువ వెలుగు వుంటుంది తప్ప, చందమామ స్థాయిలో పూర్ణ బింబం ఏమీ కనిపించదని బెంగుళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ ప్లానిటోరియం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అందువల్ల బుధవారం అర్ధరాత్రి ఆకాశంలో రెండు చందమామలు కనిపించకపోతే నిరాశపడొద్దని మనవి...