వైసీపీ తరుపున సినీ హీరో ప్రచారం?

  సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. కానీ సినిమాలకి, రాజకీయాలకి విడదీయరాని సంబంధం ఉంది.. సినిమా హీరోలు, రాజకీయాల్లోకి రావడం.. రాజకీయ వారసులు, సినిమా హీరోలు అవ్వడం కామన్.. అందుకే సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి.. రాజకీయ నాయకులు కూడా సినిమా వాళ్ళతో ప్రచారం చేపిస్తే, వాళ్ళ ఫాలోయింగ్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని నమ్ముతారు.. ఆ నమ్మకంతోనే సినిమా వాళ్ళని ఎన్నికల సమయంలో రంగంలోకి దింపుతారు.. ఇప్పుడు ఇదే ఫార్ములాని వైసీపీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. పాదయాత్రల పేరుతో జనాల్లో తిరిగితే సరిపోదు, జనాలకి దగ్గరవాలంటే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న వైసీపీకి, సినిమా వాళ్ళతో ప్రచారం అనే పాత ఫార్ములా తట్టిందట.. ఫార్ములా పాతదైనా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తదని నమ్ముతున్నారట.. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, థర్టీ ఇయర్స్ పృథ్వి లాంటి వారు వైసీపీకి మద్దతుగా నిలిచారు.. పోసాని అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరి బాబు మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. వీరికి తోడు ఇంకొందరు సినిమా వాళ్ళు వైసీపీకి మద్దతుగా నిలిస్తే పార్టీకి మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నారట.. ముఖ్యంగా హీరోలని రంగంలోకి దింపాలని చూస్తుందట.. దానిలో భాగంగానే తెలుగువాడు అయ్యుండి తమిళ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ని, వైసీపీ తరుపున ప్రచారం చేయించాలని చూస్తున్నారట.. మరి నిజంగానే విశాల్, వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా? ఒకవేళ చేస్తే వైసీపీకి ఏమన్నా ప్లస్ అవుతుందా? తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.  

తెలంగాణ పంచాయితీ

  తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా? అంటే అది గ్రామ పంచాయితీ ఎన్నికలే.. అసలు గ్రామ పంచాయితీ ఎన్నికలు ఉన్నాయా? లేవా? ఒకవేళ ఉంటే ఎప్పుడున్నాయి? అంటూ ఓటరు నుండి లీడర్ వరకు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు.. తెరాస ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇదే విషయం గురించి ఆలోచిస్తుంది.. సీఎం కేసీఆర్ ఏమో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటున్నారు.. కానీ తెరాస ఎమ్మెల్యేలు, నేతలు మాత్రం తొందర పడొద్దు ఇప్పుడు నిర్వహించటం కరెక్ట్ కాదు అంటున్నారట..   ఇదేంటి సీఎం సార్ అంత నమ్మకంగా నిర్వహించాలి అనుకుంటుంటే, ఎమ్మెల్యేలు ఎందుకు వద్దంటున్నారు అనుకుంటున్నారా?.. సీఎం నమ్మకం సీఎం ది.. ఎమ్మెల్యేల నమ్మకం ఎమ్మెల్యేలది..కేసీఆర్ ఏమో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బాగా పోయాయి.. సార్వత్రిక ఎన్నికలకి ఏడాది కూడా లేదు.. గ్రామ స్థాయిలో మన బలం తెలుస్తుంది.. దాన్ని బట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చని చూస్తున్నారట.. కానీ ఎమ్మెల్యేలు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు..   గ్రామ స్థాయి రాజకీయాలు వేరేలా ఉంటాయి.. పొరపాటున ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సంకేతాలు వెళ్తాయి.. ఇది ప్రతిపక్షాలకు వరంగా మారుతుంది.. ఈ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడుతుంది.. అందుకే పంచాయితీ ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచిదని తెరాస ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.. మరి కేసీఆర్ ఎమ్మెల్యేలు మాట విని వెనకడుగు వేస్తారో లేక తాను అనుకున్న మాట ప్రకారం ముందడుగు వేస్తారో చూడాలి.  

కర్ణాటక సీఎం కుమార స్వామికి మోడీ ఛాలెంజ్

కర్ణాటక అనగానే ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ముందుగా గురొస్తాయి.. సీట్లు ఎక్కువొచ్చిన బీజేపీ, ఓట్లు ఎక్కువొచ్చిన కాంగ్రెస్ కాకుండా.. అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమార స్వామి సీఎం అయ్యారు.. దీంతో బీజేపీ, జేడీఎస్ లు ప్రత్యర్ధులు అయ్యాయి.. మరి ప్రత్యర్థి పార్టీ నేత కుమార స్వామికి, మోడీ ఛాలెంజ్ విసరటం కామనేగా అనుకుంటాం.. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. మోడీ, కుమారస్వామికి పొలిటికల్ ఛాలెంజ్ విసరలేదు, ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.. క్రీడల శాఖామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అంటూ వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేసి కోహ్లీ, సైనా నెహ్వాల్ లాంటి వారిని ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ ఛాలెంజ్ స్వీకరించిన కోహ్లీ, జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. మోడీ, ధోని లాంటి వారిని ఛాలెంజ్ చేసాడు. ఈ ఛాలెంజ్లో భాగంగా మోడీ వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు, 2018 కామెన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన మానికా బాత్రాకు మరియు 40 ఏళ్లకు పైబడిన ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ చేసారు.. ప్రత్యర్థి పార్టీ నేతకి మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడంతో అందరూ షాక్ అవుతున్నారు.. అయితే కుమారస్వామి మాత్రం మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్ కి పాజిటివ్ గా స్పందించారు. 'నా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపినందుకు ధన్యవాదాలు, ప్రతిరోజు నేను యోగ చేస్తాను, ఇప్పటినుండి రాష్ట్ర అభివృద్ధి మీద ఇంకా ఎక్కువ శ్రద్ద పెడతాను దానికి మీ సపోర్ట్ కావాలంటూ' కుమారస్వామి ట్వీట్ చేసారు.. మరి ప్రత్యర్థుల మధ్య ఏర్పడిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ బంధం ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి.

ట్రంప్, కిమ్ ల భేటీ.. ఫలితం ఏమిటి?

  'శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు' అనే  డైలాగ్.. మన దేశ రాజకీయాల్లో బాగా వింటుంటాం.. అయితే ఈ డైలాగ్ మన దేశ రాజకీయాలకే కాదు.. ప్రపంచం మొత్తానికి సరిగ్గా సరిపోతుందని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ నిన్న మొన్నటి వరకు బద్ద శత్రువులు.. ఒకరి పేరు ఒకరు వింటే చాలు ఒంటికాలు మీద లేస్తారు.. అంతెందుకు ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది.. అమెరికా మీద అణుబాంబులు వేస్తామని కిమ్ బెదిరిస్తే.. ఉత్తర కొరియాని అసలు మ్యాప్ లో లేకుండా చేస్తానంటూ ట్రంప్ అన్నాడు.. ఇలా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం చూసి.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని ప్రపంచ దేశాలు భయపడ్డాయి.. అయితే ఎవరి ఊహలకి అందకుండా.. ట్రంప్, కిమ్ లు యుద్ధం వైపు కాకుండా సయోధ్య వైపు అడుగులు వేశారు.. ఇది ప్రపంచ దేశాలకు మూడో ప్రపంచ యుద్ధం కంటే షాకింగ్ గా మారింది.. అసలు ట్రంప్, కిమ్ ల భేటీ ఏంటంటూ ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూసింది.. అలా చూస్తుండగానే వీరిద్దరి భేటీకి ముహూర్తం ఖరారైంది.. భేటీ కూడా జరిగింది.. ట్రంప్, కిమ్ ల స్నేహపూర్వక కరచాలనంతో మొదలైన భేటీ సుమారు గంటన్నర పాటు సాగినట్టు తెలుస్తుంది.. మొదట కొంచెం ఆచి తూచి వ్యవహరించిన వీరిద్దరు, తరువాత బాగానే స్నేహపూర్వకంగా మాట్లాడారు.. ఈ భేటీలో ప్రధానంగా అణ్వాయుధ రహిత ఒప్పందం గురించి చర్చించినట్టు తెలుస్తుంది.. ఈ ఒప్పందంపై ఇద్దరు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.. మొత్తానికి వీరిద్దరి భేటీ వల్ల ఇరు దేశాల మధ్య శాంతి నెలకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.. చూద్దాం ఇంకా ముందు ముందు ఈ భేటీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.  

ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం ఉందా? లేదా?

  ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ మాజీ రాష్ట్రపతి.. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, మాజీ రాష్ట్రపతితో పాటు, మాజీ కాంగ్రెస్ నేత కూడా అనాల్సి వచ్చేలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. కాంగ్రెస్ నేతలు వద్దని చెప్పినా వినకుండా.. ప్రణబ్, ఈ మధ్య జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.. సిద్ధాంత పరంగా శత్రువైన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవ్వడంతో..కాంగ్రెస్ పార్టీ, ప్రణబ్ మీద కోపంగా ఉంది.. అందుకే ప్రణబ్ ని కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.. దానిలో భాగంగానే.. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానం, ప్రముఖులు అందరికీ పంపారు కానీ ప్రణబ్ కి పంపలేదంటూ వార్తలొచ్చాయి.. అయితే ఈ వార్తలని కాంగ్రెస్ కొట్టి పారేస్తోంది.. ప్రణబ్ ముఖర్జీ కి ఆహ్వానం పంపామని, ఆయన కూడా విందుకి రావడానికి అంగీకరించారని కాంగ్రెస్ అంటుంది.. దీంతో ప్రణబ్ కి నిజంగా ఆహ్వానం పంపారా? ఒకవేళ పంపినా ప్రణబ్ విందుకి వస్తారా? అంటూ ప్రజలలో ప్రశ్నలు మొదలయ్యాయి.. ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.. మొత్తానికి రేపు ఇఫ్తార్ విందు సాక్షిగా తెలియనుంది.. కాంగ్రెస్, ప్రణబ్ ని పక్కన పెడుతుందో? లేక ప్రస్తుతానికి తమ పక్కనే ఉంచుకుంటుందో?.. అయితే ఇదంతా చూసి.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. ప్రణబ్ ని కాంగ్రెస్ రాష్ట్రపతి చేసి గౌరవం ఇచ్చింది.. కానీ ప్రణబ్ కి మొదటి నుండి ప్రధాన మంత్రి పదవి మీద మక్కువ ఉండేది.. అందుకే కొన్ని పార్టీలు ప్రణబ్ తో థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయించాలని చూస్తున్నాయి.. ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రణబ్ ని దూరం పెడితే కాంగ్రెస్ కే నష్టం అంటున్నారు.. చూద్దాం ఈ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏంటో?.

బీజేపీ వైపు ఆనం అడుగులు?

  ఆనం బ్రదర్స్.. నెల్లూరులో బలమైన రాజకీయ శక్తులుగా ఎదిగి.. రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆనం బ్రదర్స్, కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరారు.. టీడీపీలో కూడా ఆనం బ్రదర్స్ వాళ్ళ మార్క్ చూపించారు.. అయితే అనుకోకుండా ఆనం వివేకానంద రెడ్డి మరణించడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.. ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ మీద అసహనంతో వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు మొదలయ్యాయి.. ఇక అందరూ ఆనం ఈరోజో, రేపో వైసీపీలో చేరతాబోతున్నారు అనుకుంటుండగా.. ఇప్పుడు కొత్తగా మరో వార్త వినిపిస్తుంది.. అదే ఆనం బీజేపీ లో చేరబోతున్నారని.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. అప్పుడు కన్నా, ఆనం మధ్య మంచి స్నేహం ఉండేది.. ఆ స్నేహమే ఇప్పుడు ఆనం, బీజేపీ వైపు అడుగులు వేసేలా చేస్తుందంట.. ఆనం వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు రావడంతో బీజేపీ, కన్నాని రంగంలోకి దింపిందట.. కన్నా కూడా దానికి తగ్గట్టే పావులు కదిపి ఎలాగైనా ఆనంని బీజేపీలోకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. మరి ఆనం రామనారాయణ రెడ్డి 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అంటూ కన్నా చెప్పినట్టు బీజేపీలో చేరతారా? లేక ముందు ఇచ్చిన మాట ప్రకారం వైసీపీలో చేరతారా?.. లేదా ఈ వార్తలన్నీ అవాస్తవం నేను టీడీపీలోనే ఉంటా అంటారా?.. ఆనం గురించి ఇలా రోజుకో వార్త వస్తుంటే.. అసలు ఆనం నిజంగా పార్టీ మారుతున్నారా? మారితే ఏ పార్టీలోకి వెళ్తారు? అంటూ నెల్లూరు ప్రజలే కాదు, తెలుగు ప్రజలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.. మరి ఆనం దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చూడాలి.  

కర్ణాటక ప్రభుత్వానికి కష్టకాలం?

    కర్ణాటక రాజకీయాలు థ్రిల్లర్ సినిమాని మించిపోయాయి.. ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాకు పూర్తి మెజారిటీ వస్తుందంటే, మాకు పూర్తి మెజారిటీ వస్తుందంటూ బల్లగుద్ది చెప్పాయి.. కానీ రిజల్ట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాయి.. ఓట్లేమో కాంగ్రెస్ కి ఎక్కువొచ్చాయి.. సీట్లేమో బీజేపీ కి ఎక్కువొచ్చాయి.. పూర్తి మెజారిటీ మాత్రం ఎవరికీ రాలేదు.. అయినా బీజేపీ, పెద్ద పార్టీ మాదే అంటూ గవర్నర్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా? బీజేపీకి అధికారం లేకుండా చేయటమే ప్రధాన లక్ష్యంగా జేడీఎస్ తో చేతులు కలిపింది.. బీజేపీకి మెజారిటీ లేదంటూ కోర్టుకెక్కింది.. ఎట్టకేలకు బీజేపీని ఒక్కరోజుకే గద్దె దింపి.. జేడీఎస్ నేత కుమార స్వామిని సీఎం చేసింది.. ఇంతటితో కర్ణాటక రాజకీయాలు కుదుటపడ్డాయి , ఇక సాఫీగా సాగుతాయి అనుకున్నారంతా.  ఇంతలో మరో ట్విస్ట్.. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కుమార స్వామికి సీఎం కుర్చీ టెన్షన్ మొదలైంది.. పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ౩౦ మంది కాంగ్రెస్ నేతలకి మంత్రి పదవులు దక్కాయి.. ఈసారేమో పూర్తి మెజారిటీ లేకపోవడంతో జేడీఎస్ కి మద్దతిచ్చింది.. అప్పటికీ జేడీఎస్ 8 మంత్రిపదవులే తీస్కొని మిగతావి కాంగ్రెస్ కి ఇచ్చింది.. కానీ మంత్రి పదవి దక్కని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం మాకూ మంత్రి పదవి కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి ఆ నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది.. దాంతో వాళ్ళు శాంతించారు.. ఇక కుమార స్వామి ప్రభుత్వం సాఫీగా సాగిపోతుంది అనుకుంటుండగా ఇంకో ట్విస్ట్.. అసంతృప్తితో ఉన్న సుమారు 40 మంది కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారంట.  దీంతో అసలు కుమార స్వామి ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అంటూ ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.. ఇదంతా చూసి 'బీజేపీకి అధికారం దక్కకుండా చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడిలా పదవుల కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ.. బీజేపీకి అవకాశం ఇస్తే ఎలా అంటూ.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.. చూద్దాం మరి ఆ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారో?.. పార్టీ గౌరవం ముఖ్యం అంటూ సైలెంట్ అవుతారో, లేక పదవే ముఖ్యమంటూ కుమార స్వామి కుర్చీకి ఎసరు పెడతారో.

ఈసారి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు పవన్

  ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కి చాలాసార్లు ఎదురైన ప్రశ్న ' స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు?'  .. పవన్ కొన్ని స్పీచులు వింటుంటే సామాన్యులకి కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది.. రాజకీయ విశ్లేషకులు కూడా పవన్, ఎవరో రాసిచ్చిన దాన్ని చదవకుండా ఆ విషయం మీద అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందని అంటుంటారు.. తాజాగా పవన్ మాట్లాడిన తీరు చూసి మళ్ళీ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.. మన శ్రీకాకుళం వ్యక్తి అడిగితే భూములు ఇవ్వలేదు కానీ 'ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ ' అనే వ్యక్తికి లోకేష్ భూములు కట్టబెట్టారని, ఆ భూముల్ని అతను అమ్ముకున్నాడని పవన్ చేసిన ఆరోపణలకి జన సైనికులు సైతం తలలు పట్టుకుంటున్నారు. నిజానికి 'ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్' అనేది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ.. ఈ కంపెనీని ఏపీ కి తీసుకురావడానికి ఐటీ మినిస్టర్ లోకేష్ చాలా కష్టపడ్డారు.. ఆ కష్టానికి ప్రతిఫలమే ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ కంపెనీ వైజాగ్ లో పెట్టడానికి అంగీకరించింది.. దానిలో భాగంగానే ఆ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించింది.. ఆ కేటాయింపులో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి.. కంపెనీ పూర్తిస్థాయిలో ఏర్పడి, ఉద్యోగ హామీలు నెరవేర్చాకే.. ఆ కంపెనీకి భూములు మీద పూర్తిహక్కు వస్తుంది. పవన్ ఇదంతా తెలుసుకోకుండా ప్రభుత్వం మీద ఏదొక ఆరోపణ చేయాలి అన్నట్టుగా.. కంపెనీ పేరుని వ్యక్తి పేరు అనుకోని ఎవరో రాసిచ్చింది ఇలా గుడ్డిగా చదివి నవ్వులపాలు కాకుండా.. అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిదని రాయకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మీరు తాగే నీళ్లలో యురేనియం

  మన దేశంలో సమస్యలకి కొదమేమీ లేదు... నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, రోగాలు, మతకల్లోలాలు అంటూ మన సమస్యల జాబితా చాలా సుదీర్ఘంగా జీవితాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. అందుకేనేమో పర్యావరణం, జీవవైవిధ్యం, భూగర్భజలాలు, అడవుల నరికివేత... లాంటి అంశాల మీద ఎవరూ పెద్దగా దృష్టి సారించరు. అందుకే వాటికి సంబంధించిన చట్టాలు అంత కఠినంగా ఉండవు, ఉన్నా వాటినెవ్వరూ పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇవే మన భవిష్యత్తుని తేల్చే అసలైన సమస్యలు. వాటిని అశ్రద్ధ చేయడం అంటే కూర్చున్న కొమ్మని నిదానంగా నరుక్కుంటూ పోవడమే! ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడెందుకూ అంటే... పర్యావరణానికి సంబంధించిన మరో సమస్య ఇప్పుడు పీకల మీదకు వచ్చింది కాబట్టి! ఈ మధ్యనే విడుదల అయిన ఓ నివేదిక ప్రకారం దేశంలో ఏకంగా 16 రాష్ట్రాలలోని భూగర్భ జలాలలో యురేనియం నిల్వలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. నివేదిక కోసం రాజస్థాన్‌ నుంచి సేకరించిన నమూనాలలో, ఏకంగా మూడో వంతు నీటిలో యురేనియం ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా 26 జిల్లాల నీటిలో యురేనియం శాతం చాలా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. దరిద్రం ఏమిటంటే మన దేశంలో అసలు తాగే నీటిలో యురేనియం ఎంత శాతం ఉండాలో చెప్పే నిబంధనలు కూడా లేవు. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలనే తీసుకోవాల్సి వస్తోంది. మన దేశ భూగర్బంలో యురేనియం శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. కానీ అది ప్రమాకరమైన రీతిలో నీటిలో కలవడం మాత్రం మనషి వల్లే జరుగుతోంది. భూగర్భజలాలను ఎడాపెడా తోడేయడం వల్ల, భూగర్బంలోని రాళ్లు ఎండి వాటిలో ఉండే యురేనియం బయటకి వస్తోందట. ఇది క్రమంగా భూగర్భజలాలను కలుషితం చేస్తోంది. రసాయన ఎరువుల నుంచి వచ్చే పదార్థాల వల్ల కూడా ఈ యురేనియం కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.   అణ్వాయుధాలని తయారుచేయడంలో యురేనియం చాలా అవసరం అన్న విషయాన్ని తరచూ వింటూ ఉంటాం. దాని వల్ల యురేనియం ఓ ప్రమాదకరమైన ఖనిజం అని అర్థం చేసుకోగలం. ఈ యురేనియం కలిసిన నీటిని తాగటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడైపోవడం వాటిలో ఒకటి మాత్రమే! యురేనియం కలిసి నీటితో స్నానం చేసినా కూడా కేన్సర్‌లాంటి సమస్యలూ వస్తాయి. రోజురోజుకీ మన దగ్గర భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో యురేనియం సమస్య మరింత తీవ్రం కానుందని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. కానీ దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయంటే చెప్పడం కష్టమే! తమ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో దొరికే నీటిలో ఏఏ ఖనిజాలు ఉన్నాయో మానిటర్‌ చేయాల్సిన ప్రభుత్వాలు చూసీచూడనట్లే రాజకీయాలలో మునిగిపోతుంటాయి. ఒకవేళ మనమే మనం తాగుతున్న నీటిలో యురేనియం నిల్వల గురించి తెలుసుకోవాలనుకున్నా కష్టమే. కాబట్టి ఓసారి నివేదికలను సరిచూసుకుని, వాటిలో మన ప్రాంతం ప్రస్తావన ఉంటే జాగ్రత్త వహించాలి. ఏ నీరు పడితే ఆ నీరు తాగకుండా రక్షిత మంచినీటి మీదే ఆధారపడాలి. ఆ సౌకర్యం లేని పేదల సంగతేమిటంటారా!!!

ఎన్టీఆర్ లో ఉన్న క్రమశిక్షణ పవన్ లో లేదు

  సినిమాల నుండి ఎవరు రాజకీయాలకి వచ్చినా వారిని, ఎన్టీఆర్ తో పోల్చటం తెలుగువారికి అలవాటు.. కానీ ఎన్టీఆర్ స్థాయికి చేరుకోటం అంత సులువు కాదని అందరికీ తెల్సిన నిజం.. ఇప్పటికే అది రుజువైంది కూడా.. సినిమాల్లో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.. కానీ ఆ పార్టీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్రమంత్రిగా పనిచేసారు.. కొంతకాలం తరువాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. అన్నయ్య చిరంజీవి బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. పవన్ జనసేన పార్టీ స్థాపించి.. 2014 లో టీడీపీ మద్దతిచ్చారు. తరువాత టీడీపీ కి, సినిమాలకి దూరమైన పవన్, 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. దానిలో భాగంగానే ప్రజా యాత్ర చేస్తూ టీడీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.. అయితే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, పవన్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.. తెర వెనక ఎవరో రాసిచ్చింది చదివితే ఉన్న గౌరవం పోతుందని.. పవన్ రాజకీయాల మీద మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలానే ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీస్కోచ్చారు.. నాడు ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తున్న టైములో కొడుకు పెళ్లి జరుగుతున్నా వెళ్లకుండా ప్రజలతో ఉన్నారని.. ఎన్టీఆర్ కి ప్రజలు, ప్రజాసేవే ముఖ్యమని.. అలాంటి క్రమశిక్షణ పవన్ లో కనిపించడం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు.. మరి ఈయన కామెంట్స్ కి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు నాలుగేళ్ళ పాలన

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏపీ పరిస్థితిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి.. ఏపీకి మంచి రాజధాని నిర్మాణం సాధ్యమేనా?.. కంపెనీలు, విదేశీ పెట్టుబడులు వస్తాయా?.. ఏపీ మిగతా రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందుతుందా?.. ఇలా చాలా ప్రశ్నలు ఏపీ ప్రజల్ని వేదించాయి.. ఆ ప్రశ్నల్లో నుండే ఒక సమాధానం వచ్చింది.. ఆ సమాధానమే చంద్రబాబు.. ఇపుడున్న పరిస్థితుల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలివితేటలు, ముందుచూపు ఉన్న చంద్రబాబు, సీఎం అయితే ఏపీ కి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మారు.. గెలిపించారు.. చంద్రబాబు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. ఈ వయస్సులో కూడా ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడూ పరిస్థితులు అనుకూలంగా లేవు.. ఇప్పుడూ అనుకూలంగా లేవు.. అయినా చంద్రబాబు పట్టువదలకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందన్న ఆశతో బాబు, 2014 లో బీజేపీతో నడిచారు.. కానీ బీజేపీ మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీ అంది.. దానికి కూడా బాబు అంగీకరించి నాలుగేళ్లు సహనంతో వేచి చూసారు.. కానీ కేంద్రం ఏపీకి మొండిచెయ్యి చూపడంతో.. బాబు బీజేపీ కి దూరమయ్యారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేకహోదా కోసం బీజేపీతో పోరాడుతున్నారు.. మరోవైపు 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. తరువాత టీడీపీని విభేదించి.. విమర్శలు చేస్తూ.. 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. వైసీపీ కూడా బలమైన ప్రతిపక్షంగా ఉంది.. ఇన్ని ప్రతికూలతలు మధ్య కూడా బాబు ఏ మాత్రం తడబడకుండా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అమరావతిని ప్రపంచంలో ఉన్న గొప్ప రాజధానుల్లో ఒకటిగా నిలుపుతానన్న బాబు.. అన్నట్టుగానే ఆ దిశగా పనులు మొదలుపెట్టారు.. భూసేకరణ చేసి, అద్భుతమైన డిజైన్లు వేయించి పనులు ప్రారంభించారు.. కానీ కేంద్రం నుండి సరైన సహకారం లేక పనులు నెమ్మదిగా సాగుతున్నాయని బాబు ఆరోపణ.. అలానే ప్రతిపక్షాలు కూడా బీజేపీతో కుమ్మక్కై టీడీపీని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బాబు ఆవేదన. ఏదేమైనా ప్రజలు బాబు అభివృద్ధి చేయగలడని నమ్మి ఓటేశారు.. బాబు కూడా దానికి తగ్గట్టే గొప్ప రాజధాని నిర్మాణ ప్రణాళికలు మొదలుపెట్టారు.. అలానే విద్యాసంస్థలు, కంపెనీలు రాష్ట్రానికి తేవడంలో విజయం సాధించారు.. అయితే ప్రభుత్వం మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రజలు బాబు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. రాజకీయ విశ్లేషకులు కూడా 'మళ్ళీ బాబు సీఎం అవ్వడమే కరెక్ట్ అని, ఒకవేళ వేరేవాళ్లు సీఎం అయితే రాజధాని పనులు మళ్ళీ మొదటికొస్తాయనీ.. దానివల్ల ఏపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని' భావిస్తున్నట్టు తెలుస్తుంది...

లోకేష్ సీఎం.. చంద్రబాబు పీఎం ...

  టీడీపీ మీద, బాబు మీద విమర్శలు చేస్తున్న బీజేపీ రోజురోజుకి ఆ విమర్శల డోస్ పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా, ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మరొక్కసారి టీడీపీని, బాబుని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసారు.. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.. అలానే, కేంద్ర పథకాలను టీడీపీ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుంది అంటూ మండిపడ్డారు.. అంతేనా 2014 ఎన్నికల టాపిక్ కూడా తీస్కోచ్చారు వీర్రాజు.. అసలు ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేన వల్లే తెలుగుదేశం గెలిచి అధికారంలోకి వచ్చింది అన్నారు.. అలానే 2019 ఎన్నికల టాపిక్ కూడా తీస్కోచ్చారు.. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని సీఎం చేసి, బాబు పీఎం కావాలని ఆశపడుతున్నారంటూ ఆరోపించారు. మోడీ పీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని.. చంద్రబాబు పీఎం కావాలని ఎప్పుడూ, ఎవరూ కోరుకోలేదని విమర్శించారు.. బాబువి కుట్రపూరిత రాజకీయాలని.. మిత్రపక్షంగా ఉన్నపుడు కూడా బీజేపీ గెలుపుకి ఎప్పుడూ సహకిరించలేదని మండిపడ్డారు.. అలానే కాంగ్రెస్, టీడీపీల పొత్తు గురించి మాట్లాడిన వీర్రాజు.. టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది అందుకే బీజేపీ మీద విమర్శలు చేస్తుందని అన్నారు.. సోము వీర్రాజు విమర్శలకు జవాబుగా కొందరు టీడీపీ నేతలు.. బాబు పీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని.. రాష్ట్ర ప్రయోజాల కోసమే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారట.. అలానే టీడీపీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్న వీర్రాజు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మాటిచ్చిన బీజేపీ.. తరువాత ఆ మాట తప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటే మంచిది అని కొందరు టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారట.

రామోజీతో కన్నా భేటీ.. టీడీపీతో రాజీ కోసమేనా?

  రామోజీ రావు .. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈనాడు సంస్థల అధినేతగా ప్రజలకు దగ్గరైన రామోజీ.. రాజకీయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలుస్తుంటారు.. ఎంతమంది కలిసినా, ఎవరేం అనుకున్నా ఆయన తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తారని అందరికి తెలిసిందే.. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీ.. ఇప్పుడు విడిపోయి ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నసంగతి తెలిసిందే.. ఈ టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, రామోజీతో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.. రామోజీకి, కన్నాతో అంతగా సాన్నిహిత్యం లేదు.. అయినా కన్నా ఇలా సడెన్ గా రామోజీతో భేటీ అవ్వడంతో.. టీడీపీ తో రాజీ కుదుర్చుకోడానికి, బీజేపీ పంపిన రాయభారం అయ్యుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఈ మధ్య బీజేపీ నేతలు టీడీపీ మీద, చంద్రబాబు మీద ఆరోపణలు, విమర్శలు బాగా చేస్తున్నారు.. దీనికి జవాబుగా కేంద్రం చేసిన రెండు భారీ స్కాములను సాక్షాలతో సహా బయట పెడతామంటూ టీడీపీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.. ఇదే కన్నా, రామోజీల భేటీకి పునాది వేసింది అంటున్నారు.. ఈ టైంలో స్కాములు బయటపడితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.. అందుకే బీజేపీ పెద్దలు టీడీపీ తో సత్సంబంధాలున్నా రామోజీతో, కన్నాని భేటీకి పంపారంట.. ఇదంతా చూస్తుంటే స్కాముల బాంబు బీజేపీకి గట్టిగానే తగిలినట్టు కనిపిస్తుంది...

ఆత్మహత్యలకు కారణం మనమే!

  హత్యలు, ఆత్మహత్యల వార్తలు ఎప్పుడూ వినిపించేవే. కానీ అవి ఇంకా ప్రపంచాన్ని చూడాల్సిన కుర్రవాళ్లవి అయితే బాధాకరం. నవ్వుతూ తుళ్లుతూ సాగే సెలయేరు కాస్తా ఒక్కసారిగా మాయమైపోవడం ఎంత దారుణం! కానీ ఏ దిష్టి తగిలిందో కానీ ఈ వారం ఏ రోజు ఏ పేపరు చూసినా ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి. - ఆలస్యంగా పరీక్ష హాలుకి వెళ్లినందుకు పరీక్ష రాయలేక ఓ 28 ఏళ్ల యువకుడు దిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. - హైదరాబాదుకి చెందిన 18 ఏళ్ల జస్లీన్‌ కౌర్‌ నీట్‌ పరీక్ష సరిగా రాయనందుకు పదంతస్తుల మీద నుంచి దూకి చనిపోయింది. - తమిళనాడులో ప్రతిభ, శుభశ్రీ అనే ఇద్దరు అమ్మాయిలు నీట్‌లో ఉత్తీర్ణత రానందుకు తనువు చాలించారు. ఏదో ఉదాహరణగా చెప్పుకోవాలి కాబట్టి పై మూడు సందర్భాలూ చెప్పుకొన్నాం. కానీ చెప్పుకొనేందుకు స్థలం చాలని వార్తలెన్నో. ఏదన్నా పరీక్ష ఫలితాలు వస్తున్నాయంటే ఇంతకుముందు ఓ పండుగ వాతావరణం కనిపించేంది. పాసయ్యేవాళ్లు సంతోషించేవాళ్లు, ఫెయిల్‌ అయ్యేవాళ్లు ఓ రెండ్రోజులు బాధపడి ప్రత్నామ్నాయం దిశగా సాగిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్ని ఆత్మహత్యల వార్తలు వినాలో అని భయపడాల్సి వస్తోంది. ఇంత దరిద్రపుగొట్టు పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే- దానికి కారణం మన విద్యావ్యవస్థే అని చెప్పుకోవడంలో సంకోచించాల్సిన అవసరం లేదు. పిల్లల్ని విచక్షణ కలిగిన మనుషులుగా తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ వాళ్లని పందెంకోళ్లుగా దిగజారుస్తోంది. కార్పొరేట్‌ సంస్థల సంతల్లో పిల్లలు బలిపశువులుగా మారిపోతున్నారు. చాలామంది ఇదంతా కేవలం ప్రైవేట్‌ స్కూళ్ల వల్లే జరుగుతున్న అనర్థం అంటారు. ఒకరకంగా నిజమే కావచ్చు. ఫలితాల మర్నాడు టీవీలలో వినిపించే అరుపులూ, పేపర్లలో మొదటి పేజీలలో కనిపించే మెరుపులూ... ర్యాంకుల కోసం రోడ్డున పడి మరీ కొట్టుకునే వివాదాలూ చూసి కార్పొరేట్‌ సంస్థల సంస్కారం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ బలుపుకి బలాన్నిస్తోంది మాత్రం తల్లిదండ్రులే! ఇప్పుడు పిల్లల ర్యాంకులు ఓ స్టేటస్‌, వాళ్లు చటుక్కున ఎంట్రెన్సులలో పాసైపోయి క్యాంపస్ ఇంటర్వ్యూలలో లక్షల జీతానికి కుదురుకుంటేనే సమర్థత, అమెరికాలో గ్రీన్‌కార్డు సంపాదించుకుంటే వంశోద్ధరణ! తెలుగువారిలోనే ఈ తరహా జాడ్యం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దేశంలో ఎక్కడా కనిపించని విధంగా తెలుగుగడ్డ మీద కార్పొరేట్‌ సంస్థలు వీరంగం వేస్తుంటాయి. మార్కులు, ఎంట్రెన్సులకి సంబంధించిన వార్తలలో తెలుగు పేర్లే వినిపిస్తుంటాయి. మరి ఇతర రంగాల మాటో అంతరిక్ష పరిశోధన, సాహిత్యం, సంగీతం, రాజకీయం, సమాజసేవ, వ్యాపారం... ఇలాంటి రంగాలలో మనం కనిపించమే! ఈ ఒక్క ప్రశ్న చాలు, మన ప్రాధాన్యతలు ఏమిటో తెలియడానికి. మన సామర్థ్యాన్ని మార్కులతోను, భవిష్యత్తుని ఎంట్రెన్సులతోను కొలుస్తున్నప్పుడు యువతకి చదువే ‘ప్రాణం’ అన్న భ్రాంతి కలగడంలో తప్పేముంది. అలాగని పిల్లలలో చదువు పట్ల విముఖత కలిగించాలని కాదు. చదువు జీవితంలో ఓ ముఖ్యభాగమే కానీ, చదువే జీవితం కాదని తెలియచెప్పాలి; పిల్లవాడిలో అనూహ్యమైన ఆసక్తులు ఉంటే, వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి; ఆరోగ్యవంతమైన అలవాట్లకీ, ఆటపాటలకీ అవకాశం ఇవ్వాలి; చదువులో వెనకబడినప్పుడు కారణాలు తెలుసుకోవాలి; మార్కులు తక్కువగా వస్తే ప్రత్యామ్నాయాలను సూచించాలి. అన్నింటికీ మించి పిల్లవాడిలో జీవితం పట్ల నిబ్బరాన్నీ, గమ్యం పట్ల స్పష్టతనీ అలవర్చుకునేలా చేయాలి. అప్పుడు పిల్లవాడు ఎప్పుడ్నా పరీక్షలో తప్పుతాడేమో కానీ, జీవితంలో మాత్రం తప్పడు. ఇవేవీ ఎరగని పిల్లవాడు ఎన్ని మార్కులు సాధించినా.... జీవితంలో మాత్రం అరకొర మార్కులతోనే మిగిలిపోతాడు. ఇప్పుడు ఎంపిక మన చేతుల్లోనే ఉంది- పరీక్షా? జీవితమా? ఏది ముఖ్యం!

బాబు చేతిలో బీజేపీ స్కాములు

  చంద్రబాబు రాజకీయ దిట్ట.. ఆయన ఆలోచనలు, వ్యూహాలు అంత త్వరగా ఎవరికీ అర్థంకావు.. అందుకే కొందరు ఆయన్ని తక్కువంచనా వేస్తారు.. బీజేపీ కూడా అలా తక్కువంచనా వేసే పప్పులో కాలేసింది.. బాబు తన అనుభవాన్ని, అభిమానాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో నాలుగేళ్లు కలిసున్నారు.. కానీ బీజేపీ కనికరించలేదు.. ఇక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక బాబు, బీజేపీకి దూరమయ్యారు.. తర్వాత బాబు తన శైలికి భిన్నంగా దూకుడు పెంచారు.. అయినా బీజేపీ తగ్గలేదు.. ఈసారి ఏపీలో మాదే అధికారమంటూ బాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టింది.. అప్పుడే బాబు ఆట మొదలైంది.. ఇప్పుడిప్పుడే బాబు వ్యూహాలు ఎలా ఉంటాయో బీజేపీకి అర్థమవుతుంది. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రెస్ మీట్ పెట్టారు.. ప్రెస్ మీట్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి మాట్లాడతారనుకున్నారంతా.. కానీ వాటితో పాటు కుటుంబరావు, బీజేపీ గుండెల్లో బాంబు పేల్చేలాంటి మాట చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం రెండు భారీ స్కాములు చేసిందని.. వాటిని నెల రోజుల్లో సాక్షాలతో సహా బయట పెడతామని అన్నారు.. దీంతో బీజేపీ ఒక్కసారిగా షాకైంది.. ఇవి తప్పుడు ఆరోపణలని కప్పిపుచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.. అసలే మోడీ మీద రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. దీనికితోడు ఎన్నికలు సమయం దగ్గరికొస్తుంది.. ఈ టైంలో స్కాములు బయటపడితే బీజేపీకి కష్టకాలమే.. అందుకే, స్కాములు బయటపడకుండా ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తుంది.. మరోవైపు బాబు విషయంలో తొందరపడ్డామంటూ తలలు పట్టుకుంటుంది. బాబు వ్యూహాలు అలా ఉంటాయి మరి.. ఏ విషయంలోనైనా ముందు చూపుతో ఆలోచించే బాబు.. మోడీ, అమిత్ షాల గురించి ముందే పసిగట్టి.. స్కాముల వివరాలు సేకరించారు.. ఇప్పుడు వాటినే అస్త్రంగా మలుచుకున్నారు.. తనని ఇరుకున పెట్టాలని చూసినవాళ్లనే ఇరుకున పెట్టారు.. బాబంటే ఏంటో చూపించారు.. బాబుని తక్కువంచనా వేసిన బీజేపీ.. బాబు దెబ్బకి విలవిలలాడుతోంది...  

మోదీ కొంప ముంచనున్న ఉత్తర్‌ప్రదేశ్‌

  ఉత్తర్‌ప్రదేశ్‌ అంటే ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంగానే తెలుగువారికి పరిచయం. కానీ రాజకీయంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎవరికి ఎక్కువ లోక్‌సభ సీట్లు వస్తే, ఆ పార్టీనే కేంద్రంలో చక్రం తిప్పుతుంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్నాయి మరి! 2014 ఎన్నికలలో మోదీ ప్రధానమంత్రి అయ్యారంటే దానికి ఉత్తర్‌ప్రదేశ్‌ చలవే కారణం. ఆ ఎన్నికలలో బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. కానీ క్రమంగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రి కావడం చరిత్ర. ఒక స్వామీజీ ముఖ్యమంత్రి కావడంతో అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ సంబరంలో మునిగిపోయాయి. కానీ ఆ సంబరాలు ఎక్కువకాలం నిలవలేదు. యోగి పాలన పట్ల ప్రజలు ఏమంత సుముఖంగా లేరని తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో పిల్లల మరణాల దగ్గర్నుంచీ, వారణాసిలో ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవడం వరకు అనేక సందర్భాలలో ఆదిత్యనాధ్ ప్రభుత్వ వైపల్యం స్పష్టంగా కనిపించింది. అందుకేనేమో! ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు.... ఏకంగా నాలుగు ఉప ఎన్నికలను కోల్పోయింది. వీటిలో ఆదిత్యనాధ్‌కు పెట్టని కోటలా ఉన్న గోరఖ్‌పూర్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. మొన్నటి కైరానా స్థానానికి జరగిన ఎన్నికలో ఓడిపోవడం మరీ సిగ్గుచేటుగా మిగిలిపోయింది. యూపీలో వరుస ఓటముల తర్వాత... ప్రజల సంగతి అలా ఉంచితే, తోటి బీజేపీ నాయకులు కూడా ఆదిత్యనాధ్‌ పాలన మీద దండయాత్రని మొదలుపెట్టారు. ఆయనను దింపేసి కేశవ్ ప్రసాద్‌ మౌర్యని ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగానే వెల్లడించడం మొదలుపెట్టారు. ఒకపక్క ప్రతిపక్షాలన్నీ వ్యూహాత్మకంగా ఒక్కటవుతుంటే... బీజేపీ మాత్రం చీలిక దిశగా సాగుతోంది. సహజంగానే ఈ పరిణామాలతో బీజేపీ నాయకత్వంలో గుబులు మొదలైంది. హుటాహుటిన ఆదిత్యనాధ్‌ను దిల్లీ పిలిపించుకున్నారు. అయితే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు అమిత్‌ షా ఇష్టపడకపోవచ్చు. మోదీ- అమిత్‌ షాలు తమకు వీరవిధేయంగా ఉన్నవారిని కాపాడుకుని తీరతారు. పైగా ఆదిత్యనాధ్‌ను తొలగించడం అంటే తమ ఓటమిని సగం అంగీకరించడమే! అన్నింటికీ మించి ఆదిత్యనాధ్‌ తొలగింపు ఆరెస్సెస్‌ ఆగ్రహానికి కారణం కాక తప్పదు. మరి ఒకప్పుడు బద్ధవైరులుగా ఉన్న కాంగ్రెస్, బహుజన్‌ సమాజ్‌వాదీ, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌లాంటి పార్టీలన్నీ కలిసి కమ్ముకొంటున్న వేళ... బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తుందో చూడాలి!  

ఇంటర్వెల్లో ‘సినిమా’ చూపిస్తున్న హాళ్లు

  సూరిబాబు కుటుంబంతో సహా ‘భరత్‌ అనే నేను’ సినిమా చూద్దమనుకున్నాడు. హాయిగా ఇంటర్వెల్లో ఏదో ఒకటి తిందామనుకుంటే... బయటి ఆహారం ఏదీ లోపలకి తీసుకువెళ్లకూడదని చెప్పారు. దాంతో హాల్లోనే ఏదో ఒకటి కొనుక్కోవచ్చులే అనుకున్నాడు. దాంతో సూరిబాబు అడ్డంగా బుక్కైపోయాడు. సమోసా 20 రూపాయలు, కూల్‌డ్రింక్‌ 30 రూపాయలు చొప్పున కొనుక్కునేందుకు అతని జేబుకి చిల్లు పడిపోయింది. ఒక్క క్షణం ఇక్కడో చిన్న లెక్క వేసుకుని చూద్దాం. సినిమా హిట్‌ అయితే హాల్లో జనాలు బాగా నిండుతారు. ఒకో షోకి కనీసం 100 సమోసాలు అమ్ముడుపోతాయి. హోల్‌సేల్‌లో ఏడు రూపాయలకి వచ్చే సమోసాని కనీసం 20 రూపాయలకి అమ్మడం వల్ల షోకి 1300 రూపాయల లాభమన్నమాట. అంటే రోజుకి నాలుగు షోలకీ కలిపి 5200 రూ.ల లాభం- నెలకి ఏకంగా లక్షన్నర ఆదాయం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకి కూడా రాని సంపాదన, హాల్లో గంట పనిచేస్తే వచ్చేస్తుంది కదూ! మరి ఇంత దర్జాగా దోచుకుంటున్న వ్యక్తుల మీద చర్యలేవీ అంటే నామమాత్రమే! ఈ పరిస్థితి అక్కడా ఇక్కడా అని కాదు... బహుశా దేశం అంతటా ఉండే ఉంటుంది. చిన్న చిన్న పట్నాలలో ఉండే హాళ్లలో కూడా యథేచ్చగా దోపిడీ సాగుతుంటోంది. ప్రభుత్వాధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటారు. ఒకవేళ ఏదన్నా చర్య తీసుకోవాలన్నా తూనికలు, కొలతలు; శానిటరీ అధికారుల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. చర్యలు తీసుకున్నా కూడా అవి ఎక్కువగా జరిమానాలకే పరిమితం అవుతూ ఉంటాయి. జరిమానా కట్టేసి, ఓ వారం రోజులు గమ్మున ఉండి... తిరిగి ప్రేక్షకులని దోచుకోవచ్చు. మహా అయితే హాల్లో అమ్ముకునే కాంట్రాక్టరు మారతాడు. దోపిడీ యథావిధిగా సాగుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవల్సి వస్తోందంటే... తూనికలు, కొలతల శాఖ నిన్న హైదరాబాదులోని 15 మల్టీప్లెక్సుల్లో తనిఖీలు నిర్వహించి 105 కేసులు నమోదు చేశాయి. ఈ వార్త చదువుకోవడానికి కాస్తా బాగానే ఉంది. హాళ్ల పాపం పండిందని వినియోగదారుడు కాసేపు సంతోషపడొచ్చు కూడా! కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమే అన్న చేదు నిజాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కోర్టులకి జరిమానా కట్టి, ఆ జరిమానాలని తిరిగి కస్టమర్ల మీద దండుకుంటారు కాబట్టి... ఆ శిక్ష ప్రేక్షకులకి విధించినట్లుగానే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జరిమానాలను భయపడే స్థాయిలో విధించాలి. తప్పు జరుగుతున్న హాళ్లను సీజ్ చేయాలి. కఠిన చర్యలు తీసుకోనంత వరకూ సినిమాహాళ్ల దోపిడీ ఆగుతుందని ఆశించలేం. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇది కేవలం సమోసాలకీ, పాప్‌కార్న్‌లకీ సంబంధించిన విషయం కాదు. మన సమాజంలో దోపిడీ ఎంత యథేచ్ఛగా జరిగే అవకాశం ఉందో తెలిపే ఉదాహరణ కూడా! నోరెత్తి అడగాల్సిన ప్రజలు మనకెందుకులే అని నోరు మూసుకుంటారు. ప్రజల తరఫున పని చేయాల్సిన అధికారులు లంచాలకో, అలసత్వానికో బానిసైపోతారు. అధికారుల పనితీరు గమనించుకోవాల్సిన ప్రభుత్వం స్కీములతోను, స్కాములతోనూ బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యవస్థలోని అణువణువూ ఇంతే లోపభూయిష్టంగా ఉంటుంది.

బజారున పడ్డ భారతీయ పత్రికలు

  ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలలో మీడియా కూడా ఒకటని మాటమాటికీ వింటాం. కానీ ఆ మీడియా పరిస్థితిని చూస్తే మాత్రం చిరాకో, కోపమో కలగక మానదు. మొన్నటివరకూ మీడియా అంతా మోదీని ఆకాశానికి ఎత్తేసింది. ఆయన పాలనలో పొరపాట్లు జరుగుతున్నాయన్న విషయాన్ని చెప్పేందుకు ఏ ఒక్క ప్రముఖ పత్రికా సాహసించలేదు. ద వైర్‌, స్క్రోల్ వంటి ఒకటి రెండు వెబ్‌ పత్రికలు మాత్రమే కాస్త ధైర్యం చేయగలిగాయి. ఎప్పుడైతే మోదీ ప్రభ తగ్గి, ఆయన వల్ల తమకు పెద్దగా నష్టం జరగదనుకున్న నిర్ణయానికి వచ్చాయో... అప్పుడే ఎక్కడలేని ఉత్సాహంతో బీజేపీ పాలన మీద యుద్ధం ప్రకటించాయి. మోదీ మీద కార్టూన్లు, ఆయన మనస్తత్వం మీద ప్రత్యేక విశ్లేషణలు మొదలయ్యాయి. చాలా జాతీయ/ ప్రాంతీయ పత్రికల అవకాశవాదం ఎంత లోతుకి దిగజారిందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చెప్పుకొంటే సరిపోతుందేమో! కానీ తాము అంతకంటే హీనస్థాయిలో ఉన్నామని కొన్ని పత్రికలు కెమెరా సాక్ష్యంగా చెప్పుకొచ్చాయి. డబ్బులిస్తే మళ్లీ మోదీని ఆకాశంలో నిలబెడతామని అమ్ముడుపోయేందుకు సిద్ధపడ్డాయి. కోబ్రాపోస్ట్‌ అనే పరిశోధనా పత్రిక ఆ మధ్య ‘ఆపరషన్‌ 136’ పేరుతో ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. భగవద్గీత, కృష్ణుని బోధల ముసుగులో హిందుత్వని ప్రచారం చేయాలని కొన్ని పత్రికలను సంప్రదించింది. ఇలా చేసినందుకు 500 కోట్ల వరకూ భారీ నగదుని ఎర చూపింది. ఈ ఆపరేషన్‌లో ఒకటి కాదు, రెండు కాదు- ఏకంగా 27 పత్రికల మీద ఉచ్చు బిగించారు. వాటిలో రెండు బెంగాలీ పత్రికలు మినహా, మిగతా పత్రికల ప్రతినిధులంతా తోలుబొమ్మల్లా ఆడేందుకు ఉత్సాహం చూపించారు. ఈ ఆపరేషన్‌లో చిక్కుకున్న సంస్థలు సామాన్యమైనవి కావు. టైమ్స్ ఆఫ్‌ ఇండియా అధినేత వినీత్ జైన్‌ స్వయంగా కెమెరా ముందు ఫోజులిస్తూ దొరికిపోయాడు. ఇండియా టుడే వైస్‌ చైర్మెన్‌ ‘కాలీ పురి’ కూడా డబ్బు కోసం హిందుత్వ అజెండాకు సిద్ధపడింది. ఇక హిందుస్థాన్‌ టైమ్స్‌, దైనిక్‌ భాస్కర్, జీ న్యూస్‌, స్టార్ ఇండియా, రేడియో వన్, లోక్‌మత్‌, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్....తదితర పత్రికలూ ఈ జాబితాలో ఉన్నాయి. కోబ్రాపాస్టు ఉచ్చులో రెండు తెలుగు మీడియా సంస్థలు (ఏబీఎన్, టీవీ5) కూడా ఉండటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. తాము తెలుగుదేశానికి సానుకూలం అని ఏబీఎన్ ప్రతినిధి హొయలు పోతే, మీరెలా కావాలంటే అలా చేసి పెడతామని టీవీ5 ఉద్యోగి దేబిరించాడు. అందుకేనేమో... కోబ్రాపోస్టు ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే తెలుగు మీడియా మాత్రం ఎక్కడా ఏమీ జరగనట్లు గుంభనంగా మిన్నకుండిపోయింది. సహజంగానే కోబ్రాపోస్టు ఉచ్చులో చిక్కుకున్న పత్రికలన్నీ తమకేం తెలియదని భుజాలు తడుముకున్నాయి. కొన్ని పత్రికలైతే కోర్టు కేసులకి సిద్ధపడ్డాయి. కానీ కొన్నాళ్లుగా మీడియా తీరు గమనిస్తున్న ప్రజలు మాత్రం, వాటి నడవడిలో ఏదో లోపం ఉందని గాఢంగా విశ్వసిస్తున్నారు. అది తప్పనీ తాము నిప్పనీ నిరూపించుకునే బాధ్యత సదరు మీడియా మీద ఉంది. లేకపోతే మీడియా తీరు కూడా ‘నాన్నా పులి’ కథలో పిల్లవాడి అబద్ధపు బతుకులా మారిపోతుంది. కాకపోతే ఇందులో నష్టపోయేది మాత్రం ప్రజలే!

కష్టపడి ఒక్కపైసా తగ్గించారుగా.. అంత పరాచకాలా..!

  నిజంగా ప్రజలంటే ఎంత చులకనగా కనిపిస్తున్నారో మరోసారి రుజువు చేసింది కేంద్రప్రభుత్వం. మరీ ఇంత తేలికగా కనిపిస్తున్నారా..అన్నట్టు చేసింది. గత కొద్దిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో... ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పడు మొదటిసారి ఆయిల్ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయి. కానీ తగ్గిన ధరలు చూసి ప్రజలు ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో ఉన్నారు. ఇంతకీ ధరలు ఎంత తగ్గాయో తెలుసా...?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. పోనీలే కాస్త తగ్గాయి అని సామాన్యులు సంతోషించే కొద్దిసేపటికే.. ఇదంతా తూచ్....తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, అందుకే పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దాంతో ఒక్క పైసా తగ్గడంతో వినియోగదారులు షాకయ్యారు. అంతేకాదు... ఐఓసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో కూడా కామెంట్లు విసురుతున్నారు.   ఇదిలా ఉండగా.. ఇక ఈ ఒక్కపైసా తగ్గింపుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి మోడీపై సెటైర్లు వేశారు. మీరేమైనా ప్రజలతో పరాచకాలు ఆడుతున్నారా.. ఒక్క పైసా తగ్గించడం ఏంటీ... మీరు చేసింది పిల్ల చేష్టల్లా ఉన్నాయి అని మండిపడ్డారు. అంతేకాదు..తాను చేసిన ఫ్యూయల్ ఛాలెంజ్ పై కూడా స్పందించి.. నేను ఫ్యూయల్ ఛాలెంజ్ చేశాను కదా అని... దానికి ఈ రకంగా సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. మరి నిజంగానే పరాచకాలు కాకపోతే.. తగ్గించకపోతే అసలు తగ్గించకుండా ఉండాలి అంతేకానీ... ఒక్క పైసా తగ్గించి ప్రజలతో పరాచికాలు ఆడటం ఏంటీ..!