మోడీకి కేజ్రీవాల్ తో సవతి పోరు తప్పదా?

  ఒకప్పుడు అత్యంత ప్రజాదరణతో డిల్లీ పీటం అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్,దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి, పారదర్శకమయిన, ప్రజారంజకమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని దేశ ప్రజలందరూ ఆశపడ్డారు. కానీ అధికారం చేప్పట్టిన 49 రోజులలోనే ప్రభుత్వం నడపలేక చేతులెత్తేసి పదవి నుండి దిగిపోవడంతో డిల్లీ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ డిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.   కానీ కేజ్రీవాల్ కి అప్పటికీ జ్ఞానోదయం కాలేదు. డిల్లీ శాసనసభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే, ఈసారి ఖచ్చితంగా బీజేపీయే గెలిచే అవకాశం ఉంటుంది గనుక, అందుకు ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ విధిలేని పరిస్థితుల్లో తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో ఆయన డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలిసి డిల్లీ అసెంబ్లీని రద్దు చేయవద్దని, తాను మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పివచ్చారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ కి ఇదివరకు ఒకసారి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తలబొప్పి కట్టింది. అందువల్ల ఆయనకు మళ్ళీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.   ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆమాద్మీ పార్టీలలో దేనికీ కూడా పూర్తి మెజార్టీ లేదు. వాటిలో ఏ ఒక్కరు కూడా తమంతట తాముగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలోలేవు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అధికారం చెప్పట్టేందుకు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం చూసి బీజేపీ కూడా అప్రమత్తమయినట్లుంది.   నరేంద్ర మోడీ మరో నాలుగు రోజుల తరువాత అంటే ఈనెల26 దేశప్రధానిగా బాధ్యతలు చేపడతారు. అయితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తన కలలను కల్లలు చేసిన నరేంద్ర మోడీ మీద పగ తీర్చుకొనేందుకు సోనియా గాంధీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ డిల్లీ ముఖ్యమంత్రి అయ్యి మోడీకి పక్కలో బల్లెంలా తయారవడం ఖాయం. ఒకవేళ అదే జరిగితే మరో నాలుగేళ్ల పాటు మోడీకి ఈ సవతిపోరు తప్పదు.   బహుశః అందుకే బీజేపీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావాలు వేసి కోర్టులు చుట్టూ తిప్పుతోందని భావించవచ్చును. కేజ్రీవాల్ ని బిజీగా ఉంచగలిగితే, నరేంద్ర మోడీ బాధ్యతలు చెప్పట్టగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రపతిని కలిసి ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉన్న డిల్లీ రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయమని అభ్యర్దించవచ్చును. విశేష ప్రజాధారణతో అఖండ మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ అభ్యర్ధనను రాష్ట్రపతి కూడా తిరస్కరించక పోవచ్చును. ఆయన డిల్లీ అసెంబ్లీని రద్దు చేసినట్లయితే, మళ్ళీ త్వరలోనే ఎన్నికలు కూడా జరుగుతాయి. కనుక అరవింద్ కేజ్రీవాల్ ని మరో నాలుగయిదు రోజులు అడ్డుకోగలిగితే బీజేపీకి గండం గడిచినట్లే.

ఎరక్కపోయివెళ్ళాడు.. ఇరుక్కుపోయాడు...

      వైసీపీ నాయకులు వైఎస్ జగన్ ఇప్పుడు ఇంట్లో కూర్చుని ‘ఎరక్కపోయి వెళ్ళాను.. ఇరుక్కపోయాను’ అని పాటలు పాడుకుంటున్నాడు. ఇంతకీ జగన్ వెళ్ళింది ఎక్కడికి? ఇంకెక్కడికి? ఢిల్లీకి.. నరేంద్రమోడీ దగ్గరకి! ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో ఏ ఎల్లయ్య, పుల్లయ్య అధికారంలోకి వచ్చినా మన దగ్గరకి మద్దతు కోసం రావాల్సిందే అని ప్రగల్భాలు పలికిన జగన్ కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ వుండటం, ఆంధ్రప్రదేశ్‌లో తన వైసీపీ చతికిలపడటంతో బిత్తరపోయాడు.   అంతలోనే తమాయించుకుని చేత్తో బొకే పట్టుకుని, ఎనిమిది మంది ఎంపీలను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడకి వెళ్ళి మోడీకి బొకే ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తే సరిపోయేది. మోడీ గవర్నమెంట్‌కి అంశాలవారీ మద్దతు ఇస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. జగన్ ఏదో తెలియక అలా చెప్పాడులే అని బీజేపీ నాయకత్వం విని ఊరుకోలేదు. మీ సపోర్టు మాకు అక్కర్లేదని వెంటనే చెప్పేసింది. దాంతో గతుక్కుమనడం జగన్ వంతయింది. మొత్తమ్మీద ఈ ఇష్యూలో జాతీయ స్థాయిలో జగన్ పరువు ఏదైనా వుంటే అదంతా తుడిచిపెట్టుకునిపోయింది. అంతేకాకుండా జగన్ తన మీద వున్న కేసుల నుంచి తప్పించుకోవాలనికే మోడీని కలిశాడన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. జగన్‌ని మోడీ పట్టించుకోలేదు కాబట్టి త్వరలో జగన్ అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాలు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. టోటల్‌గా ఇప్పుడు జగన్ అనవసరంగా ఢిల్లీవెళ్ళి వివాదాల్లో ఇరుక్కుపోయానే అని జగన్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి, పవన్ రాజకీయాల్లోకి...

  కేంద్రమంత్రిగా, సోనియాగాంధీకి అంతరంగికుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ చైర్మన్ గా ఒకవెలుగువెలిగిన చిరంజీవి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా తయారయింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఓడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయన మళ్ళీ సినిమాలలో నటించాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయన తన 150 చిత్రం గురించి చాలా కాలంగా అభిమానులను ఊరిస్తున్నారు. ఇప్పుడు ఎలాగూ ఇక ఖాళీయే గనుక ముందు ఆ సినిమాను పూర్తిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్ళు సినిమాలలో నటిస్తూ ప్రజలను మళ్ళీ ఆకట్టుకొనగలిగితే, వచ్చే ఎన్నికల సమయానికి అదేమయినా ఉపయోగపడవచ్చును కూడా.   ఇక ఇంతవరకు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ ఐదేళ్ళలో తన జనసేన పార్టీని నిర్మించుకొని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నారు. జనసేన పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ, రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీలు సక్రమంగా పనిచేయకపోతే వాటిపై ప్రజల తరపున పోరాడుతానని కూడా పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకోసం ఇకపై తాను సినిమాలు తగ్గించుకొని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఈవిధంగా అన్న రాజకీయాల నుండి తప్పుకొని సినిమాలలోకి వస్తుంటే, తమ్ముడు సినిమాల నుండి తప్పుకొని రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్దం అవడం చాలా ఆసక్తికరంగా ఉంది.   గత ఐదేళ్ళుగా చిరంజీవి రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇంతవరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోలేకపోయారు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం, ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ, రాజకీయాలలో ప్రవేశించిన రెండు మూడు నెలలలోపునే, రాష్ట్ర రాజకీయాలలో తనదయిన ముద్రవేసి దేశానికి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీ మనసు చూరగొని ఎన్డీయే సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు.   పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఆయనలో ఉన్న నిజాయితే. అన్న చిరంజీవి పదవుల కోసం కోట్లాది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెట్టి ఒక సగటు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి వారి శ్రేయస్సు కోసం పదవులను కాదనుకొని పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలలో, వ్యవహారంలో కొట్టవచ్చినట్లు కనబడుతున్న ఆ నిజాయితీయే ప్రజలను, చివరికి మోడీని కూడా ఆకర్షించింది.   రాజకీయనాయకులలో అరుదుగా కనబడే నిబద్దత, ప్రజలకు మంచి చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో పుష్కలంగా ఉన్నాయి గనుక ఇకనయినా తప్పటడుగులు వేయకుండా ముందుకు సాగినట్లయితే, ఆయన చెపుతున్నట్లు వచ్చే ఎన్నికల నాటికి బలమయిన రాజకీయ నాయకుడిగా ఎదగవచ్చును.

అత్తమీద కోపం దుత్తమీద చూపించిన అఖిలేష్

  ఎవరిమీద కోపాన్నో వేరెవరిమీదో చూపిస్తే అత్తమీద కోపాన్ని దుత్తమీద చూపించారని అంటారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన పని కచ్చితంగా ఇలాంటిదే. ఈ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతోపాటు అధికార సమాజ్‌వాది పార్టీ కూడా గల్లంతు అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ మొత్తంలో సోనియా, రాహుల్ తప్ప మిగతా పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీయే గెలుచుకుంది. ఎస్పీ అభ్యర్థులందరూ డిపాజిట్లు గల్లంతైపోయి అడ్రస్ లేకుండా పోయారు. అయితే సమాజ్ వాది పార్టీ అధికారంలో వున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడానికి మోడీ హవాతోపాటు మరో కారణం కూడా వుంది. సమాజ్ వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ మహిళల గురించి దారుణంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యవహరిస్తున్నాడు. తమను ఘోరంగా ఓడించిన మోడీమీద వున్న కోపాన్ని తన మంత్రివర్గ సహచరుల మీద చూపించాడు. తనతో కలసి 43 మంది మంత్రివర్గ సభ్యులున్నారు. వీరిలో 36 మందిని పదవుల నుంచి తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఇంతమంది మంత్రులను తీసేయడం కంటే, బీహార్‌లో నితీష్ కుమార్‌లా మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే, నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అఖిలేష్ కూల్‌గా సమాధానం చెప్పాడు.

గంటా రాజకీయాలు టీడీపీలో వర్కవుట్ అవుతాయా?

  పార్టీలు మారడంలో స్పెషలిస్టు అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీలో వున్న సమయంలో, ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి మారినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ పంచలో చేరినప్పుడు గంటా తనదైన శైలిలో రాజకీయాలు ప్రదర్శిస్తూ పదవులు పొందుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అలా ఎమ్మె్ల్యేగా ఎన్నికయ్యారో లేదో ఇలా రాజకీయాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడితో గంటాకి ఎంతమాత్రం పడటం లేదని వినికిడి. జిల్లానుంచి అయ్యన్న పాత్రుడిని కాదని తనకే పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో గంటా వుండటంతో అయ్యన్నకు, గంటాకు మధ్య అంతరం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా గంటా ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయాల్లో గంటా ఏ స్థాయిలో ముదిరిపోయారో అర్థమవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్న గంటాకి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కూడా బాగా ఒంటబట్టినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో చంద్రబాబు మంత్రి వర్గంలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే చేస్తాడంట.. లేకపోతే సామాన్య కార్యకర్తగా మిగిలిపోతాడట. ఈరకంగా గంటా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించినట్టుగా క్రమశిక్షణ లేకుండా తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తే కుదరదన్న విషయం గంటా మరచిపోయినట్టున్నాడని అంటున్నారు. ఇలా వ్యవహరిస్తే గంటా తోక చంద్రబాబు కట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.

మీ రాజీడ్రామాలు ఆపండెహె...

  నరేంద్ర మోడీ చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయినప్పటికీ పలువరు రాజకీయ నాయకులు కుళ్లు అండ్ చద్ది రాజకీయాలు చేయడం మానుకోవడం లేదు. ఎప్పుడో కాలం చెల్లిన రాజకీయ ట్రిక్కులు ప్రదర్శిస్తూనే వున్నారు. ఇంత ఔట్ డేటెడ్‌గా వున్నారు కాబట్టే మోడీ వీళ్ళందరికీ జెల్ల కొట్టి కేంద్రంలో బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, మోడీ ఘన విజయం సాధించగానే చాలా పార్టీలకి, వారి నాయకులకు కళ్ళు తిరిగిపోయాయి. అసలేం జరిగిందో కూడా అర్థంకానంత షాక్‌కి గురయ్యారు. మెల్లగా తేరుకున్న తర్వాత వాళ్ళ టైపు ఓల్డు మార్కు రాజకీయాలు ఆడటం ప్రారంభించారు. ఆ ఆటలో ప్రధాన అంశం రాజీడ్రామా. తాము ఈ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయామని తెలుసుకున్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన సోనియా, రాహుల్ చిరునవ్వులు చిందిస్తూ ఓటమిని అంగీకరిస్తున్నామని చిలక పలుకులు పలికారు. ఆ మర్నాడు ఇద్దరూ రాజీనామాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హమ్మయ్య దేశానికి పట్టిన దరిద్రం మరికాస్త వదలబోతోందని ఆనందిస్తూ వుండగానే, కాంగ్రెస్ పార్టీ అలాంటిదేమీ లేదు, వీళ్ళిద్దరూ రాజీనామా చేయబోవడం లేదని వివరణ ఇచ్చింది. అలాగే ఇలాంటి మరో పెద్దమనిషి నితిష్ కుమార్ భరద్వాజ్. బీహార్ ముఖ్యమంత్రి అయిన ఈయనగారికి మోడీ ఇచ్చిన షాక్‌తో కళ్ళు గింగిరాలు తిరిగాయి. దాంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేశాడు. జేడీయూ వర్గాలు నువ్వు తప్ప మరొకడు బీహార్ని ఏలలేడంటూ నితిష్ గడ్డం పట్టుకుని బతిమాలడంతో ఆయన మనసు మార్చుకునే యోచనలో వున్నాడట. అలాగే తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి స్టాలిన్ కూడా ఇలాంటి రాజీడ్రామానే ఆడాడు. జయలలిత చేతిలో దారుణ ఓటమి గురి కావడంతో హర్టయిపోయిన ఆయన తన పార్టీ పదవికి రాజీనామా చేసేశాడు. ఇంతలో పార్టీ కార్యకర్తలందరూ ఆయన కాళ్ళమీద పడి బతిమాలుకునేసరికి కరిగిపోయి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రాజకీయ నాయకులు ఇలాంటి రాజీనామా డ్రామాలు ఇంకా ఎంతకాలం ఆడతారో ఏంటో.

పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి మధ్య భావసారూప్యం

    ప్రభుత్వ మాజీ విప్, కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని, తమ ఇద్దరి భావాలూ ఒకేలా వున్నందున ఆయనతో కలిసి పని చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో జగ్గారెడ్డి సమావేశమైన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ భావసారూప్య మేటర్ని బయట పెట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని చెప్పారు. ఒకవైపు తెలంగాణవాదం గురించి మాట్లాడుతూనే ఇరుప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం జగ్గారెడ్డి తపించారని కొనియాడారు.జగ్గారెడ్డి వంటి వారు ప్రజలకు అవసరమన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి, తాము కలసి పనిచేస్తామని చెప్పారు. జనసేన ద్వారా పనిచేయాలా? లేక ఇతర పార్టీలతో కలసి పనిచేయాలా? అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. అలాగే, పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జగ్గారెడ్డి కూడా ప్రకటించారు.

నితీష్ రాజీడ్రామా: పాట్నా పాలిటిక్స్

  లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం టీకప్పులో తుఫాను మాదిరిగా సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహా‌ర్‌లో జేడీయు బీజేపీ చేతిలో చావుదెబ్బ తినగానే అప్పటి వరకూ ప్రధాని అవ్వాలనే కలలు కన్న నితీష్ కుమార్‌కి ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చింది. దాంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశాడు. నితీష్ ఆవేశం చూసిన అందరూ ఇక నితీష్ రాజీనామా వెనక్కి తీసుకోరని అపోహ పడ్డారు. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ తన రాజీనామా వెనక్కి తీసుకుని ఎంచక్కా బీహార్‌ని పరిపాలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. నితీష్ రాజీనామా అంశం మీద జేడీయూ అగ్ర నాయకులు సమావేశమయ్యారు. బీహార్‌ని పరిపాలించడానికి నితీష్‌ని మించిన మొనగాడెవరూ లేరని వాళ్ళందరూ ఫీలయ్యారు. నితీష్‌ని తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. దాంతో నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని నితీష్ కోరారు. అయితే జేడీయు నాయకుడు శరద్ యాదవ్ మాత్రం నితీష్ రాజీనామాకే కట్టుబడి వుంటేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో జేడీయులో కలకలం రేగింది. చిట్టచివరకి ఈ రాజీనామా డ్రామా ఎలా ముగుస్తుందో చూడాలి.

కమ్యూనిస్టుల జాతీయ హోదా మటాష్

  ఈ ఎన్నికలలో వీచిన మోడీ ప్రభంజనం కాంగ్రెస్ పార్టీతోపాటు అనేక పార్టీల గాలి తీసిపారేసింది. ముఖ్యంగా కమ్యూనిస్టులని అధ: పాతాళానికి తోసేసింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకుంటున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్నికల తర్వాత ఉభయ భ్రష్టత్వం పొందాయి. ఈ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఓడిపోయారు. దాంతో లోక్ సభలో ఈ పార్టీల బలం పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల సీపీఐ, సీపీఎం పార్టీలకు వున్న జాతీయ పార్టీల హోదా మటాషైపోయింది. ఏ పార్టీ అయినా జాతీయ హోదా పొందాలంటే ఎన్ని ఎంపీ స్థానాలు సాధించాలో అన్ని స్థానాలు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సాధించలేకపోవడంతో ఈ రెండు పార్టీలకు జాతీయ హోదా గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో సీపీఐ, సీపీఎం పార్టీల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తయారైంది. ఇంత జరిగినా రాష్ట్రంలో ఈ రెండు పార్టీల వారికి జ్ఞానోదయం కలిగినట్టుగా లేదు. సీపీఎం నేతలు లంచాలు తీసకున్నారని సీపీఐ నేతలు, సీపీఐ నేతలు ఎక్కువగా మాట్లాడుతున్నారని సీపీఎం నేతలు తిట్టుకుంటూ వున్నారు. అయ్యా.. మీరు ఇలా తిట్టుకుంటూనే వుండండి. మిమ్మల్ని వదిలి ఈ దేశం ముందుకు వెళ్ళిపోతుంది.

సీమాంధ్ర ఫలితాలు: జగన్‌ని నమ్మని ఓటర్లకి సెల్యూట్

      సీమాంధ్రలో అధికారంలోకి వచ్చేసి ముఖ్యమంత్రి పదవిని ఎక్కడంతోపాటు, సీమాంధ్రలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు గెలిచేసి కేంద్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని వైసీపీ నాయకుడు జగన్ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. సీమాంధ్ర ఓటర్లు జగన్ పార్టీని అధికారానికి చాలా దూరంగా తరిమికొట్టారు. జగన్ తన ధనబలం ఉపయోగించి సీమాంధ్ర మొత్తాన్నీ తన వైపు తిప్పుకోవాలని చూశారు. అయితే జగన్ పప్పులు ఎంతమాత్రం ఉడకలేదు. జగన్ పార్టీని మరీ ఘోరంగా ఓడించకుండా కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికీ అధికారాన్నికి ఆమడ దూరంలో వుంచేలా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రానికి జగన్ సంపాదించిన సింగిల్ అంకె ఎంపీ సీట్ల అవసరం కేంద్రానికి లేదు. ఇప్పుడు ఈ పార్లమెంటు సీట్లు చూపించి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనమీద వున్న కేసుల నుంచి తప్పించుకునే అవకాశం కూడా జగన్‌కి లేకుండా పోయింది. మొత్తంమీద జగన్‌కి ఇలాంటి పరిస్థితి తెచ్చిన ఓటర్లకు సెల్యూట్ చేయాలి.

రాష్ట్రంలో రాజకీయ ఆత్మహత్యలు జరగబోతున్నాయా?

        ఇంతకాలం రాష్ట్రంలో మామూలుగా జరిగే ఆత్మహత్యలు కాకుండా రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఉద్యమాల ఆత్మహత్యలు, ఏ నాయకుడో పోతే హర్టయినవాళ్లు చేసుకున్న ఆత్మహత్యలు మాత్రమే చూశాం. ఈనెల 16న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాజకీయ ఆత్మహత్యలు కూడా జరగబోతున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో డబ్బు ఏరులై పారింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలలో పాల్గొన్న నాయకులందరూ భారీగా ఖర్చు పెట్టారు. నా పోటీ అభ్యర్థి ఇంత ఖర్చు పెట్టాడు కాబట్టి.. నేను అంతకు మించి ఖర్చు పెట్టాలి. నా పోటీ అభ్యర్థి ఓటుకి ఇంత డబ్బు ఇచ్చాడు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ డబ్బిచ్చి ఓట్లు కొనాలనే సిద్ధాంతంతో చాలామంది అభ్యర్థులు డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. డబ్బు ఖర్చు పెట్టకపోయినా గెలిచే అభ్యర్థులు కూడా రిస్క్ ఎందుకు చేయాలన్నట్టు ఖర్చు పెట్టారు.  కొంతమంది భారీగా డబ్బున్న అభ్యర్థుల విషయం అలా వుంచితే, చాలామంది అభ్యర్థులు ఎన్నికలలో గెలిచి తీరాలన్న పట్టుదలతో వడ్డీలకు తెచ్చి మరి ఎన్నికలలో ఖర్చుపెట్టారు. ఎన్నికల కమిషన్ చూసీ చూడనట్టు వ్యవహరించడంతో బరితెగించి మరీ డబ్బు పారబోశారు. కొంతమంది 10 రూపాయల వడ్డీకి కూడా డబ్బు  అప్పు తెచ్చిమరీ ఖర్చుపెట్టారు. ఈసారి ఎన్నికలలో ఒక్కో నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి 6 నుంచి 7 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. డబ్బు అప్పనంగా సంపాదించిన ఒక పార్టీ అభ్యర్థి అయితే తాను పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికలలో గెలిస్తే, ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చనే ఆలోచనే ఇలా ఖర్చుపెట్టేలా చేస్తూ వుండొచ్చు. గెలిస్తే సంపాదించే సంగతి తర్వాత.. ఓడిపోతే పరిస్థితేంటి? ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఆ తర్వాత ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాంరా దేవుడా అని ఏడవాల్సిందే. కోర్టు కేసులో ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు. గెలిచినవాడు ఇంటికెళ్ళాక ఏడుస్తాడన్నట్టు.. ఇప్పుడు రాష్ట్రంలో  ఎన్నికలలో పోటీచేసిన చాలామంది అభ్యర్థుల పరిస్థితి గెలిచినా, ఓడినా ఏడవాల్సిందే అన్నట్టుగా తయారైంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికే చాలా ఒత్తిడిలో వున్నారు. 16 తర్వాత ఓడిపోయిన అభ్యర్థుల్లో కొంతమందిలో ఆ ఒత్తిడి మరింత పెరిగే  అవకాశం వుంది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యాప్రయత్నాలు కూడా జరిగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాంటివేవీ జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ అలాంటివేవైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఎన్నికలలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించలేకపోయిన ఎన్నికల కమిషనే తీసుకోవాల్సి వుంటుంది.  

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకే అవకాశం

  సీమాంద్రాలో మున్సిపల్, యంపీటీసీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన ప్రత్యర్ధి వైకాపాపై స్పష్టమయిన ఆధిక్యత ప్రదర్శించినందున, సార్వత్రిక ఎన్నికలలో కూడా తెదేపాయే విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ కొంత ఆధిక్యత కనబరిచినప్పటికీ, తెరాస దానికి సమఉజ్జీగా నిలవడంతో సార్వత్రిక ఎన్నికలలో సైతం ఆ రెండు పార్టీలలో దేనికీ కూడా పూర్తి మెజార్టీ దక్కకపోవచ్చును. అప్పుడు తప్పనిసరిగా వాటికి మజ్లిస్, లెఫ్ట్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా గెలిచిన వారి మద్దతుఅవసరం ఉంటుంది. రెండు పార్టీలు ఇప్పటికే ఆ పని మీదున్నాయి. టీ-కాంగ్రెస్ పార్టీ మరొక అడుగు ముందుకు వేసి తెరాస గెలుపు గుర్రాలకు కూడా వలవేస్తోంది. వారిని నియంత్రించడానికే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని సోనియా గాంధీకి మళ్ళీ మస్కా కొట్టే ప్రయత్నం చేసారు.   కాంగ్రెస్ అధిష్టానం కేంద్రంలో మళ్ళీ అధికారం దక్కించుకొని రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొందనే విషయం అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ కోసమే సీమాంద్రాలో తన పార్టీని, నేతలని కూడా బలిచేసింది. కానీ వ్రతం చెడినా ఫలం దక్కన్నట్లు సీమాంధ్రలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోబోతోంది.   కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేఅవకాశం లేనప్పుడు ఇక దానికి తెరాస మద్దతు అవసరం కూడా ఉండదు. అటువంటప్పుడు తెరాసకు తెలంగాణాను అప్పగించవలసిన అవసరం కూడా ఉండబోదు. అదేవిధంగా తెరాస మద్దతు స్వీకరించి దానికి అధికారంలో భాగం పంచి ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించకపోవచ్చును. కేవలం కేసీఆర్ దురాశ, అధికార కాంక్ష కారణంగానే కాంగ్రెస్ నేడు తెలంగాణాలో కూడా గెలుపు కోసం పోరాడవలసిన దుస్థితిలో పడింది. అందువల్ల ఈ పరిస్థితికి కారణమయిన కేసీఆర్ తో మళ్ళీ చేతులు కలిపే ఆలోచన చేయకపోవచ్చును. ఎలాగు కేంద్రంలో, సీమాంద్రాలో అధికారం కోల్పోబోతున్నపుడు కనీసం తెలంగాణాలోనయినా అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ఆశించడం అసహజమేమీ కాదు. అందుకోసం కాంగ్రెస్ ఎంతకయినా తెగించవచ్చును. అవసరమయితే తెరాస యం.యల్యేలకు మంత్రి పదవులు ఎరగా వేసి పార్టీలోకి ఆకర్షించవచ్చును. తప్పనిసరి పరిస్థితుల్లో తెదేపా-బీజేపీ కూటమి మద్దతు కోరవచ్చును. వారు కూడా తెరాసను దెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక తెరాస అంటే కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పెత్తనమే సాగుతుంది గనుక ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపించవచ్చును. అందువల్ల తెరాస తనంతట తానుగా పూర్తి మెజార్టీ సాధిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనని చెప్పవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారం దక్కించుకొనే అవకాశాలు ఎక్కువ.

కేసీఆర్ పీడకల వెనుక రహస్యమిదే..

      ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అప్పుడప్పుడు కొన్ని పీడకలలు కంటూ వుంటాడు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తనకు వచ్చిన పీడకలల వివరాలు జనానికి చెబుతూ వుంటాడు. రీసెంట్‌గా ఆయన ఒక పీడకల కన్నాడు. ఆ కల ఆయనకు స్వీట్ డ్రీమ్ కావొచ్చేమోగానీ, అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలకు మాత్రం అదొక పీడకల. ఇంతకీ కేసీఆర్ కన్న పీడకల సారాంశం ఏమంటంటే, జనరల్ ఎలక్షన్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. సీమాంధ్రలో జగన్ అధికారంలోకి వస్తాడు. వీళ్ళిద్దరూ కలసి రెండు రాష్ట్రాలనీ కలసి మెలసి అద్భుతంగా డెవలప్ చేసేస్తారు. కేసీఆర్ ఈ మాట చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు బిత్తరపోతే, సీమాంధ్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు.   కేసీఆర్, జగన్ కలసి మెలసి వుండే సంగతి ఏమోగానీ, ఈ రెండు రాష్ట్రాల్లో వీరిద్దరూ అధికారంలోకి రాకూడదని రెండు ప్రాంతాల ప్రజలు కలసిమెలసి ముక్కోటి దేవతలని కోరుకున్నారు. సోమవారం నాడు వెలువడిన మునిసిపల్ ఫలితాలు ఇటు తెలంగాణకి కేసీఆర్ గండం, అటు సీమాంధ్రకి జగన్ గండం లేదని చెప్పకనే చెప్పాయి. ఇదిలా వుంటే, మహానుభావుడు కేసీఆర్ సీమాంధ్రలో జగన్ రావాలని ఎందుకు కోరుకుంటున్నాడన్న అంశం మీద రాజకీయ వర్గాలలో భారీ స్థాయిలో చర్చ జరిగింది. సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో, తెలంగాణలో సీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలన్నీ సీమాంధ్రకు తరలిపోయే అవకాశం వుంది. సీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలు మాత్రమే కాదు.. తెలంగాణవాళ్ళు స్థాపించిన పరిశ్రమలు కూడా సీమాంధ్రకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాయి. అలా జరిగితే, తెలంగాణ పారిశ్రామికంగా మైనస్‌లో పడిపోతుంది. ఆ మైనస్‌ని సరిదిద్దే శక్తి కేసీఆర్‌కి లేదు. పాపం ఈ పెద్దమనిషికి సీమాంధ్రులను తిట్టడం తప్ప మరో పని వస్తేగా? అదేగనుక సీమాంధ్రలో జగన్ ప్రభుత్వం వస్తే హైదరాబాద్‌లోని ఒక్క పరిశ్రమ కూడా సీమాంధ్ర ముఖం చూడదు. జగన్‌కి భయపడి పారిశ్రామికవేత్తలు సీమాంధ్ర ముఖం కూడా చూడరు. అప్పుడు తెలంగాణలో పరిశ్రమలు అక్కడే పడుంటాయి. కేసీఆర్‌కి ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఈ ముందు చూపుతోనే కేసీఆర్ సీమాంధ్రలో జగన్ రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మునిసిపల్ ఫలితాల తర్వాత తెలంగాణలో కేసీఆర్, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి రారని తేలిపోయింది కాబట్టి రెండు ప్రాంతాలకీ నో ప్రాబ్లం.

బడంగ్‌పేటలో బుడుంగ్‌మన్న టీఆర్ఎస్

  తెలంగాణ తన జాగీరులాగా మాట్లాడే టీఆర్ఎస్ మునిసిపల్ ఎన్నికలలో అడ్డంగా ఆరిపోయింది. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మునిసిపాలిటీలో టీఆర్ఎస్ బుడుంగ్‌మని మునిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఈ మునిసిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా దక్కలేదు. ఒక్క బడంగ్‌పేటలో మాత్రమే కాదు.. తెలంగాణలోని అనేక మునిసిపాలిటీలలో టీఆర్ఎస్ ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఏడు మునిసిపాలిటీలలో టీఆర్ఎస్‌కి ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా దక్కలేదు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, నల్గొండ జిల్లాలోని భువనగిరి, కోదాడ, హుజూర్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ మునిసిపాలిటీలలో టీఆర్ఎస్ మునిగిపోయింది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు అద్దంపట్టనున్న స్థానిక ఫలితాలు

  ఈరోజు వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూచాయగా తెలియజేసాయి. అయితే ఇవి ప్రధానంగా నగరాలు, పట్టణాల ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిభింప జేసేవే గనుక, గ్రామీణ ఓటర్ల అభిప్రాయానికి అద్దంపట్టే యం.పీ.టీ.సీ., జెడ్.పీ.టీ.సీ.ఎన్నికల ఫలితాలు రేపు వెలువడిన తరువాత ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారనే విషయంపై మరికొంత స్పష్టత రావచ్చును.   ఇంతవరకు వెలువడిన అనేక సర్వే నివేదికలు ఈ సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో తెరాసకు, సీమాంద్రాలో వైకాపాకు తిరుగులేని మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పాయి. కానీ వాస్తవానికి తెలంగాణాలో బహుముఖ పోటీ వలన కాంగ్రెస్, తెరాసలకు మెజార్టీ వచ్చే అవకాశం కనబడటంలేదు. అదేవిధంగా సీమాంద్రాలో తెదేపా, వైకాపాలు విజయం కోసం చాలా తీవ్రంగా పోటీ పడ్డాయి గనుక ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు వెలువడిన ఫలితాలు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, సీమాంద్రాలో తెదేపాలకు సానుకూలంగా ఉన్నాయి. ఒకవేళ రేపు వెలువడే యం.పీ.టీ.సీ., జెడ్.పీ.టీ.సీ. ఎన్నికల ఫలితాలు కూడా ఈవిధంగానే ఉనట్లయితే, అధికారంలోకి రావాలని కలలుగంటున్న తెరాస, వైకాపాల కలలు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.   కానీ, ఒకవేళ రేపటి ఫలితాలలో తెరాస, వైకాపాలకు ఆధిక్యత వచ్చినట్లయితే, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చునని భావించవచ్చును. ఎందువలన అంటే అర్బన్ ఓటర్లు కాంగ్రెస్, తెదేపాలకు, గ్రామీణ ఓటర్లు తెరాస, వైకాపాలకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసినట్లవుతుంది. రేపటి ఫలితాలు ఏవిధంగా ఉన్నప్పటికీ సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం తధ్యమని ఈ రోజు మున్సిపల్ ఫలితాలు రూడీ చేస్తున్నాయి.

ఈయన రీపీటవుద్దంటాడు.. ఆయన కాదంటాడు

  పార్టీ ఒక్కటే.. గొంతులు మాత్రం రెండు. పార్టీ ఒక్కటే.. కానీ ఒకవైపు హిట్.. మరోవైపు ఫట్. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సూపర్ హిట్ అయి టీఆర్ఎస్‌ని కూడా వెనక్కి నెట్టేసింది. అదే మరోవైపు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఫలితాల మీద సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఒకాయన పరాజయ భారంతో స్పందిస్తే, మరొకాయన విజయోత్సాహంతో స్పందించారు. ఇద్దరూ ఈ ఫలితాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతవరకూ ఓకే, కానీ ఇలాంటి ఫలితాలు అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలలో రిపీటవుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాలలో విజయం సాధిస్తుందనేది విషయాన్ని ఆయన చెప్పదలచుకున్నారు. చెప్పేశారు. తెలంగాణలో ఫ్యూచర్లో ఇవే ఫలితాలు రిపీటవుతాయని పొన్నాల చెబుతుంటే, రఘువీరా మాత్రం సీమాంధ్రలో ఇవే ఫలితాలు రిపీట్ కావని అంటున్నారు. ఇప్పుడు సీమాంధ్రలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం దూసుకుపోతుందట. రెండు ప్రాంతాలు.. ఇద్దరు అధ్యక్షులు.. రెండు నాలుకలు.. ఇదే కాంగ్రెస్ స్టైల్.

డల్లయిపోయిన రఘువీరారెడ్డి

  ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్‌ని విభజించిందో అప్పుడే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆ డెడ్ బాడీని రఘువీరారెడ్డిని చేతిలో పెట్టి ఈ డెడ్‌బాడీని బతికించమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. పాపం రఘువీరారెడ్డి చిరంజీవి లాంటి పెద్దమనిషితో కలసి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో క్లియర్‌గా చెప్పేశాయి. అయితే ఫలితాలు ఇలా వచ్చినప్పటికీ రఘువీరారెడ్డికి జ్ఞానోదయం కలిగినట్టుగా కనిపించడం లేదు. మునిసిపల్ ఫలితాలలో సీమాంధ్ర కాంగ్రెస్ మటాషైపోయిందని స్పష్టంగా తెలియగానే రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతైపోవడం, దాంతోపాటు తాను ప్రాతినిధ్యం వహించిన మడకశిర నియోజకవర్గంలోని మడకశిర మునిసిపల్ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన చాలా డల్లుగా మారిపోయారు. ఈ అపజయాన్ని హుందాగా స్వీకరిస్తున్నామని ఆయన మరింత హుందాగా వాయిస్ మార్చి చెప్పారు. రఘువీరా అక్కడితో ఆగితే బాగుండేది. ఇప్పుడు మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు రేపు పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాల్లో రావని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. పాపం ఈ దశలో అలా చెప్పక ఇంకెలా చెబుతారులే..

పశ్చిమ గోదావరిలో అన్ని స్థానాలూ టీడీపీవే

      మునిసిపల్ ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మునిసిపల్ స్థానాలను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మునిసిపల్ స్థానాలున్నాయి. భీమవరంలో 39 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీటిలో 19 తెలుగుదేశం, 5 వైకాపా గెలిచాయి. ఒకస్థానంలో ఇతరులు గెలుపొందారు. పాలకొల్లులోని 31 స్థానాల్లో 24 స్థానాల్లో తెలుగుదేశం 6 స్థానాల్లో వైకాపా గెలవగా, ఇతరులు ఒక్క స్థానంలో గెలిచారు. తాడేపల్లిగూడెంలోని 35 స్థానాల్లో 24 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోగా, ఏడు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. మూడు స్థానాల్లో ఇతరులు గెలిచారు. నర్సాపురంలోని 31 స్థానాల్లో 10 తెలుగుదేశం, ఏడు వైకాపా, మూడు ఇతరులు గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం ఆధిక్యంలోకి వచ్చే అవకాశం వుంది. నిడదవోలులోని 28 వార్డుల్లో 17 తెలుగుదేశం, 10 వైకాపా గెలవగా ఇతరులు ఒక స్థానాన్ని పొందారు. తణుకులోని 34 స్థానాల్లో 31 తెలుగుదేశం గెలుచుకుంది. ఒక స్థానాన్ని వామపక్షాలు, రెండు స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు. కొవ్వూరులోని 23 స్థానాల్లో 13 స్థానాలు తెలుగుదేశం గెలిచింది. ఒక స్థానాన్ని ఇతరులు గెలిచారు. ఇతర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. జంగారెడ్డిగూడెంలోని 20 స్థానాల్లో 16 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాల్లో వైకాపా, రెండు స్థానాల్లో ఇతరులు గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడం విశేషం.

తూర్పు గోదావరిలో తెలుగుదేశం హవా

      తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మొత్తం పది మునిసిపల్ స్థానాల్లో ఎనిమిది స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలాపురంలోని 30 కౌన్సిలర్ స్థానాల్లో తెలుగుదేశం 22, వైసీపీ 7, ఇతరులు 1 స్థానాలు గెలుచుకున్నారు. తునిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2, టీడీపీ 17, వైకాపా 12 స్థానాలు గెలుచుకున్నాయి. సామర్లకోటలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 24, వైకాపా 6 స్థానాలు గెలిచాయి. రామచంద్రాపురంలోని 17 కౌన్సిలర్ స్థానాల్లో 16 తెలుగుదేశం గెలుచుకోగా ఆరు స్థానాలు మాత్రమే వైకాపా పొందింది. 1 ఇతరులు. పిఠాపురంలోని 30 స్థానాల్లో 23 తెలుగుదేశం, 6 వైకాపా గెలిచాయి. ఒకస్థానాన్ని ఇతరులు పొందారు. మండపేటలోని 29 స్థానాల్లో 18 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి. పెద్దాపురంలోని 28 స్థానాల్లో 21 తెలుగుదేశం, 4 వైకాపా గెలిచాయి. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. గొల్లప్రోలులోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1 గెలుచుకోగా తెలుగుదేశం, వైకాపా చెరో తొమ్మిది స్థానాల్లో గెలిచాయి. వామపక్షాలు 1 స్థానం గెలిచాయి. ముమ్మడివరంలోని 20 స్థానాల్లో తెలుగుదేశం, వైకాపా 8 స్థానాల చొప్పున గెలిచాయి. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఏలేశ్వరంలోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 10, వైకాపా 9 స్థానాల్లో గెలిచాయి.