విజయవాడకు ప్రభుత్వ శాఖల తరలింపు సాధ్యమేనా?
ఈ దసరా పండుగలోగా విజయవాడకు రాష్ట్ర ప్రభుత్వ అన్ని ప్రధాన శాఖలను తరలించి ఇకపై అక్కడి నుండే పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టాలనుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన, కనీసం వచ్చేదసరా పండుగ నాటికయినా తీరుతుందో లేదో అనే అనుమానం కలుగుతోంది ప్రభుత్వోద్యోగుల తీరు చూస్తుంటే. ప్రభుత్వ శాఖల తరలింపు కోసం ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాం, రవాణా శాఖా ప్రధాన కార్యదర్శి బీ. శ్యాం బాబు, మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావులతో వేసిన త్రిసభ్య కమిటీ నిన్న హైదరాబాదులో ప్రభుత్వ శాఖల అధిపతులతో సమావేశమయినప్పుడు, ఉద్యోగులలో చాలా మంది తక్షణమే విజయవాడకు తరలి వెళ్లేందుకు సిద్దంగా లేరనే విషయం స్పష్టమయింది. ముందుగా ప్రజలతో నేరుగా సంబంధాలుండే మునిసిపల్, ఆరోగ్య, పౌర సరఫరా, విద్యా శాఖ వంటి కొన్ని ముఖ్యమయిన కార్యాలయాలు వెళ్ళినట్లయితే సరిపోతుందని, విజయవాడలో అన్ని ప్రభుత్వ శాఖలు నడిపేందుకు కార్యాలయాలు, ఉద్యోగులకు, అధికారులకు ఇళ్లు వంటివన్నీ అమరిన తరువాత అంచెలంచెలుగా తరలించినట్లయితే, ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఎటువంటి ఆటంకమూ లేకుండా సజావుగా సాగుతుంటాయని ఉద్యోగుల వాదన. వారి వాదన నిజమే కావచ్చు. కానీ వారి అయిష్టతకు కారణాలు మాత్రం వేరే ఉన్నాయి.
హైదరాబాదులో పనిచేస్తున్న ఉద్యోగులలో చాలామంది అక్కడే ఇళ్లు కొనుకొని స్థిరపడ్డారు. వారి పిల్లలు చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. అందువలన వారు ఇప్పటికిప్పుడు విజయవాడకు తరలి వచ్చే పరిస్థితి లేదు. అలాగని నిరాకరించడానికి కూడా కుదరదు. కనుక తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుకొంటున్నారు. కానీ అదెంతో ఎవరూ చెప్పలేరు కనుక ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. కనుక వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, కార్యాలయాల ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం, తక్షణమే ఏయే శాఖల తరలింపు సాధ్యమవుతుంది? మిగిలినవి ఎన్ని దశలలో, ఎప్పటిలోగా పూర్తి తరలించవచ్చును? వంటి వివరాలతో వచ్చే అక్టోబరు 6న జరిగే సమావేశానికి హాజరుకమ్మని త్రిసభ్య కమిటీ అన్ని శాఖల అధిపతులకు ఆదేశించింది.
సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. విజయవాడలో అన్ని హంగులతో రాజధాని ఏర్పడే వరకు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉంటామని వాదిస్తే, పాలనాపరంగా చాలా సమస్యలు ఉత్పన్నం కావచ్చును. అలాగని రాత్రికి రాత్రి ఉద్యోగులను తట్టాబుట్టా సర్దుకొని విజయవాడ వచ్చేయమని ఆదేశించడం సబబు కాదు. కనుక దశాలవారిగానే ప్రభుత్వ శాఖలను తరలించడం అందరికీ మంచిదేమో?