ప్రత్యేక హోదా పై జగన్ పోరాటాలు సమాప్తం?

  జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ఎంత అకస్మాత్తుగా పోరాటాలు మొదలుపెట్టారో అంతే అకస్మాత్తుగా వాటికి ముగింపు పలికేసినట్లున్నారు. చాలా అవమానకర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన నిరాహార దీక్ష ముగించవలసి వచ్చినప్పుడు వైకాపా నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ తదితరులు ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడి అమరావతికి వచ్చే ముందు రోజు వరకు వైకాపా నేతలు కొంచెం హడావుడి చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయినా తరువాత వైకాపా నేతలు రెండు మూడు రోజుల పాటు యధాప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు. వైకాపాకు ఊదే దాని బాకా మీడియాలో కూడా ఇప్పుడు ‘ప్రత్యేక హోదా’ అనే మాట వినపడటం లేదు.   ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన పోరాటం ఫ్లాప్ అవడంతో తరువాత మళ్ళీ రాజధాని భూసేకరణపై పోరాటాలు మొదలుపెట్టాలనుకొన్నారు. జగన్ వెళ్లి అక్కడి రైతులను కలిసి వచ్చేరు కూడా. కానీ మళ్ళీ ఎందుకో దానిపైన వైకాపా వెనుకంజ వేసినట్లు కనబడుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని అటక ఎక్కించేసారు...భూసేకరణపై పోరాడబోవడం లేదు...బస్సు చార్జీల పెంపుపై పోరాడటం పూర్తయిపోయింది కనుక మళ్ళీ తమ పోరాటాలు కొనసాగించడానికి అటువంటి మరో బలమయిన అంశం లేదా సమస్య కోసం వైకాపా నేతలు వెతుకుతున్నట్లున్నారు. ఈ పరిణామాలన్నీ ఇంతకు ముందు ఊహించినవే. వైకాపా పోరాటాలు కొనసాగించడానికి ‘మెటీరియల్’ అందించాల్సిన బాధ్యత మాత్రం అధికార తెదేపా పార్టీదే.

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఛేంజ్?

  వరంగల్ పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మీద పీకలదాకా కోపం మీద వున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని టీఆర్ఎస్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చాలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ స్థానం నుంచి గట్టి అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ఎంపిక చేసింది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటంతో వరంగల్ లోక్‌సభ ఎన్నిక రసవత్తరంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రాజయ్య ఈ స్థానంలో పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాజయ్య స్థానంలో మరో వ్యక్తిని పోటీలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఘోరమైన దుర్ఘటన జరిగింది. ఆయన కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్ళు గ్యాస్ సిలెండర్ పేలడంతో సజీవ దహనం అయ్యారు. ఈ దుర్ఘటనను పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తు్న్నారు. రాజయ్య కుమారుడిని సారిక ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మామాకోడళ్ళ మధ్య విభేదాలు వున్నాయి. ఆమె గతంలో రాజయ్య మీద గృహహింస కేసును పెట్టారు. అలాగే కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇప్పుడు జరిగిన దుర్ఘటన కూడా ఆత్మహత్యేనని పలువురు అనుమానిస్తున్నారు. నిజానికి బుధవారం నాడు రాజయ్య వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేయాల్సి వుంది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఇతర పార్టీల వారు రాజకీయానికి ఉపయోగించుకునే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ ఘటన రాజయ్యకు పెద్ద ఎదురుదెబ్బలా భావించవచ్చు. ప్రజల్లో కూడా రాజయ్యకి వున్న ఇమేజ్ చాలా దారుణంగా దెబ్బతినే ప్రమాదం వుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికలలో రాజయ్యను పోటీ నుంచి తప్పించే అవకాశాలు వున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉప ఎన్నికలకి పార్టీలో అభ్యర్ధి లేకపోతే సార్వత్రిక ఎన్నికలకి ఎలా?

  వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు గట్టిగా కృషి చేయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలను కోరారు. అందుకు వారు ఏవిధంగా ముందుకు వెళ్ళాలో నిర్దిష్టమయిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఆయన సలహాలను ఆంధ్రా నేతలు ఎంతో కొంత పాటిస్తూ రాష్ట్రంలో తమ ఉనికి చాటుకొంటున్నారు. ఇంతవరకు ఆంధ్రాతో పోల్చి చూస్తే తెలంగాణాలోనే బీజేపీ ఎంతో కొంత బలంగా, చురుకుగా ఉన్నట్లు కనిపించేంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అయినట్లుంది.   వరంగల్ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధినే నిలబెట్టాలని పంతం పట్టి మరీ తెదేపా నుంచి ఆ సీటు తీసుకొన్న తెలంగాణా బీజేపీ నేతలు, పార్టీలో అందుకు తగిన బలమయిన అభ్యర్ధి లేకపోవడంతో అమెరికాలో వైద్యుడుగా స్థిరపడిన డా. పగడిపాటి దేవయ్య పేరును ఖరారు చేసారు. ఈ ఉప ఎన్నికలు అకస్మాత్తుగా జరుగుతున్నవి కావు. ఇవి జరుగుతాయని ఆరు నెలల క్రితమే బీజేపీ నేతలకి తెలుసు. ఈ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించాలనే తపన రాష్ట్ర బీజేపీ నేతలకు ఉండి ఉంటే వారు అప్పటి నుంచే తమ పార్టీ నుంచే ఒక బలమయిన అభ్యర్ధిని సిద్దం చేసుకొని ఉండాలి. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొన్నారు.   అధికార తెరాస, కాంగ్రెస్, అభ్యర్ధులను మరియు వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ ని డ్డీ కొని ఎదురు నిలవగల అభ్యర్ధి తమ వద్ద లేడని తెలిసి ఉన్నప్పటికీ, తెదేపా నుంచి బలవంతంగా వరంగల్ సీటును గుంజుకొని మరో పెద్ద పొరపాటు చేసారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని దేవయ్యకు కట్టబెట్టడం ఇంకా పొరపాటు. తద్వారా రాష్ట్ర బీజేపీ నేతలే తమ విజయావకాశాలను ప్రత్యర్ధ పార్టీలకు స్వయంగా అప్పగించినట్లయింది. తమ వద్ద బలమయిన అబ్యర్ది లేడని తెలిసి ఉన్నప్పుడు, ఈ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి తప్పకుండా గెలిచి తీరాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావించి ఉండి ఉంటే ఆ సీటును మంచి రాజకీయ అనుభవం ఉన్న తెదేపాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి వదిలిపెట్టి ఉండాల్సింది. ఆయన వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసి తప్పకుండా విజయం సాధించగలనని ధీమా వ్యక్తం చేసారు. కానీ బీజేపీ పట్టుబట్టి ఆ సీటు తీసుకొని దానిని డా. దేవయ్యకు ఇచ్చి ప్రత్యర్ధ పార్టీలకు ఎన్నికలకు ముందే సగం విజయం సమకూర్చిపెట్టింది. తెదేపా-బీజేపీలలో ఎవరు పోటీ చేయాలని చర్చ జరుగుతున్నప్పుడు, వాటి తరపున పోటీ చేయబోయే ఎన్డీయే అభ్యర్ధి నుండి కూడా గట్టిపోటీ ఉంటుందని కాంగ్రెస్, తెరాసలు భావించాయి. బీజేపీ నేతల ఒత్తిడి కారణంగా ఆ సీటును తెదేపా వదులుకొన్నప్పుడే ప్రత్యర్ధ పార్టీల అభ్యర్ధులు సగం విజయం సాధించినట్లు సంబరపడ్డారు. ఎటువంటి రాజకీయ అనుభవం, ప్రజలతో, స్థానిక నేతలతో పరిచయాలు లేని దేవయ్యను ఎంపిక చేయడంతో వారి విజయావకాశాలను నూటికి నూరు శాతం బీజేపీయే స్వయంగా ఖరారు చేసినట్లయింది.   దీనిని బట్టి అర్ధమవుతున్న విషయం ఏమిటంటే నేటికీ తెలంగాణా బీజేపీలో బలమయిన నేతలు లేరని...ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలెవరూ పార్టీని పటిష్టం చేసుకోవడం లేదని...వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే బలమయిన అభ్యర్ధులను తయారు చేసుకోవడంలేదని! ఉప ఎన్నికలకే పార్టీలో బలమయిన అభ్యర్ధి లేనప్పుడు ఇక రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఏవిధంగా ఎదగగలరు? సార్వత్రిక ఎన్నికలలో వందల మంది అభ్యర్ధులను ఎక్కడి నుంచి తీసుకు వస్తారు? అనే సందేహాలు కలగడం సహజం. దేశమంతటా బీజేపీని విస్తరించాలని అమిత్ షా కలలు కంటూ అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నేతలలో ఆ ఉత్సాహం, చొరవ, పట్టుదల, కార్యదీక్ష కనబడటం లేదు. అందుకు వరంగల్ ఉప ఎన్నికలకు బయట నుంచి అభ్యర్ధిని తెచ్చుకోవలసిన దుస్థితిలో ఉండటమే ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

ఆంధ్రప్రదేశ్ లో ‘త్రీ సర్వీస్ ఎట్ డోర్ స్టెప్‘

  త్రీ సర్వీస్ ఎట్ డోర్ స్టెప్ పేరిట ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, వీడియో, టెలీఫోన్ సేవలను అందించే ఫైబర్ గ్రిడ్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది, 2016 మార్చికల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తేవాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.... ఫైబర్ గ్రిడ్ పనులపై సమీక్ష నిర్వహించారు, ఫైబర్ గ్రిడ్, ఇన్ క్యాప్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన చంద్రబాబు....వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికే పనులు పూర్తిచేయాలన్న చంద్రబాబు... మిగిలిన పది జిల్లాల్లో 2016 మార్చికల్లా కంప్లీట్ చేయాలని అధికారులకు సూచించారు. దేశంలోనే మొట్టమొదటిగా ఫైబర్ గ్రిడ్ పనులను చేపట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుందన్న ముఖ్యమంత్రి.... 333 కోట్ల రూపాయలతో తొలి దశ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును సమర్ధవంతంగా పూర్తిచేయడానికి విద్యుత్ శాఖ, ఇన్ క్యాప్, ఫైబర్ గ్రిడ్ ... అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాబు సూచించారు. ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ ను భూఉపరితలం మీద నుంచే వేయనున్నారు, సుమారు 3.5 లక్షల విద్యుత్ స్థంభాల మీదుగా 30 వేల కిలోమీటర్ల పొడవునా కేబుల్స్ వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు 2500 సబ్ స్టేషన్లు, విద్యుత్ స్థంభాలను జీపీఎస్ మ్యాపింగ్ చేస్తూ... ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ వేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 2600 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.

చంద్రబాబుకి చెడ్డపేరు తెస్తున్న టెక్నికల్ టీమ్

  టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ వాడుకోవడంలో గానీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా, డిజిటల్ ఇండియా నినాదం ఇప్పుడు వచ్చింది గానీ నైన్టీస్ లోనే ఐటీకి పెద్దపీట వేశారు చంద్రబాబు, పదేళ్ల క్రితమే హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు... పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు, టెక్నాలజీని ఏ అవసరానికి ఎలా వాడుకోవాలో, ప్రతి పనినీ కచ్చితత్వంతో, పారదర్శకంగా ఎలా చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్ ను అమలుచేసి దేశంలో సంచనలం సృష్టించిన‌ చంద్రబాబునాయుడు... ల్యాండ్ రికార్డ్స్ ను డిజిటలైజ్ చేయడంతోపాటు ఈసేవతో పౌరసేవలను మరింత సులువు చేశారు, డిజిటల్ ఇండియా కంటే ముందే ఏపీలో డిజిటల్ విప్లవం సృష్టించిన చంద్రబాబు... పరిపాలనను ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు. ఎంతో దూరదృష్టి కలిగిన నాయకుడైన చంద్రబాబు... మొదట్నుంచీ టెక్నాలజీకి పెద్దపీట వేశారు, డిజిటల్ విప్లవం అంటే తెలియని రోజుల్లోనే టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో ప్రతిభ చూపారు, అందుకే ఆనాడు దేశంలోనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు, ఇప్పుడు దాదాపు పదేళ్ల విరామం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... అదే రీతిలో మంచి విజన్ తో ముందుకెళ్తున్నారు. అయితే ఆనాడు మంచి టీమ్ తో సూపర్ సక్సెస్ సాధించిన చంద్రబాబు... ఈనాడు సరైన టీమ్ ను ఎంచుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు, దానికి రేషన్ షాపుల్లో ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానమే రుజువంటున్నారు విశ్లేషకులు, ఈపాస్ సిస్టం అద్భుతమైనదే... కానీ అమలులో మాత్రం ఫెయిల్ అయ్యిందంటున్నారు. ఈపాస్ పథకం మంచిదే, అద్భుతమైనదే, ఐడియా కూడా గొప్పదే, కానీ అమలు తీరే సరిగా లేదు, రేషన్ షాపుల్లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంలో లబ్దిదారుల వివరాలను, వేలిముద్రను సర్వర్ తో కనెక్ట్ చేశారు, దాంతో రేషన్ కోసం వచ్చే లబ్దిదారుడి వేలిముద్ర... సర్వర్ తో టాలీ అయితేనే డీలర్లు సరుకు ఇస్తారు, సర్వర్ పనిచేయకపోయినా, వేలిముద్ర టాలీ కాకపోయినా సరుకు ఇవ్వలేని పరిస్థితి, దాంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గంటల తరబడి క్యూలో నిలబడినా... సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు, ఒక్కోసారి రెండు మూడ్రోజులు సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో తిరిగితిరిగి విసుగొచ్చి లబ్దిదారులు రేషన్ తీసుకోవడం మానేస్తున్నారు. దాంతో రేషన్ సరుకులు పెద్దఎత్తున మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి 50శాతం స్టాక్ మిగిలిపోతుండగా, ప్రతి నెలా సుమారు 20శాతం సరుకు తిరిగి ప్రభుత్వానికి తిరిగి వెళ్తోందని డీలర్లు అంటున్నారు. అయితే దీన్ని ఆదాగా ప్రభుత్వానికి అధికారులు చూపుతున్నారని, కానీ నిజం కాదని... సర్వర్ తో జనం విసిగిపోయి సరుకు తీసుకోకపోవడంతోనే స్టాక్ మిగిలిపోతుందని, దాంతో జనం కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని డీలర్లు చెబుతున్నారు. ఈపాస్ విధానం అద్భుతమైనదే అయినా... సర్వర్లు సరిగా పనిచేయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం... టెక్నికల్ సపోర్ట్ సర్వీస్ లేకపోవడం... సమస్య వచ్చినప్పుడు పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని రేషన్ డీలర్లు అంటున్నారు, ఈపాస్ మిషన్లు, సర్వర్లు సరిగా పనిచేయడం లేదని ఎమ్మార్వోలకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారని డీలర్లు చెబుతున్నారు, ఈపాస్ మిషన్లు, సర్వర్లు సరిగా పనిచేస్తే తమకు మంచిదేనని, పని సులువు అవుతుందని... కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం చివరికి ప్రభుత్వంపైనే పడుతోందని అంటున్నారు,  సర్వర్ పనిచేయనప్పుడు కంప్లైంట్ చేసే విధానం గానీ, పరిష్కరించే టీమ్ గానీ లేదంటున్నారు. దాంతో ప్రజల సమయం కూడా వృథా అవుతోందని చెబుతున్నారు, రేషన్ సరుకులు కోసం జనం పడిగాపులు పడిపడీ... చివరికి విసిగిపోయి తీసుకోవడం మానేస్తున్నారని, అసలు సర్వర్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో... ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. పార్టీపరంగానూ ఐవీఆర్ఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిన చంద్రబాబు... ఈపాస్ అమలులో మాత్రం ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈపాస్ తో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం నిజమే అయినా... సర్వర్లు పనిచేయకపోవడంతో ఎందుకొచ్చిన ఈపాస్ అని జనం ఈసడించుకుంటున్నారు, పథకం ఉద్దేశం మంచిదే అయినా, అధికారులు దాన్ని సమర్ధంగా అమలు చేయలేకపోవడంతో ఆ ఎఫెక్ట్ చంద్రబాబుపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా పడుతోందంటున్నారు. అయితే టెక్నాలజీని వినియోగించుకోవడంలో మొనగాడైన చంద్రబాబు... ఈపాస్ విషయంలో మాత్రం సరైన టీమ్ ను ఎంచుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, కనీసం ఇప్పుడైనా అప్రమత్తం కావాల్సిన అవసరముందని, లేదంటే చెడ్డపేరు వచ్చే అవకాశముందని అంటున్నారు.

అంతర్మథనంతో అల్లాడుతున్న జగన్

  వైసీపీ నాయకుడు ఇప్పుడు అంతర్మథనంతో అల్లాడుతున్నారు. గతంలో ఎన్నోసారు దూకుడుతో కూడిన నిర్ణయాలను తీసుకుని పర్యవసానంగా కష్టాలు కొనితెచ్చుకున్న ఆయన ఆ కష్టాల నుంచి పాఠాలను నేర్చుకోలేదు. తన తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం లాంటి తొందరపాటు నిర్ణయం జగన్ రాజకీయ భవిష్యత్తును ఎంత పెద్ద మలుపు తిప్పిందో తెలిసిన విషయమే. అప్పట్లో చప్పుడు చేయకుండా కూర్చుని వుంటే, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేదని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వుంటారు. జగన్ తన రాజకీయ జీవితంలో అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. చేయకూడని పొరపాట్లు ఎన్నో చేశారు. అవన్నీ ఆయనకి అధికారానికి మాత్రమే కాదు.. ప్రజలకు కూడా దూరం చేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతూ వుంటారు. ఇటీవలి కాలంలో జగన్ చేసిన అతి పెద్ద పొరపాటు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళకపోవడం. తాను శంకుస్థాపన కార్యక్రమానికి రానని, తనకు ఆహ్వానం కూడా పంపవద్దని జగన్ ప్రకటించినప్పుడు ఆయన సన్నిహితులు అలా అనడం మంచిది కాదని చెప్పారట. అయినా సరే జగన్ తన పట్టుదలను వదులుకోలేదు. ఆహ్వానించడానికి వెళ్ళిన మంత్రులకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది ఆయన విషయంలో ఏపీ ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. ఆంధ్రులను తిట్టనిదే పూట గడవని కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఇష్టం వున్నా లేకపోయినా నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న జగన్‌కి అంతమాత్రం చేతకాలేదా అనే విమర్శలు ప్రజల్లో బాగా వినిపిస్తున్నాయి. ఈ అంశం వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పడిపోయేలా చేసింది. తాను తీసుకున్న నిర్ణయం తీసుకువచ్చిన చెడు ఫలితాలను చూసి ఇప్పుడు జగన్ అప్పుడు అలా చేయకుండా వుండాల్సింది.. శంకుస్థాపనకు వెళ్తే ఓ పనైపోయేది అని అంతర్మథనంతో అల్లాడుతున్నట్టు తెలుస్తోంది.

ఏపీ ప్రజలకు ఉద్యోగుల గుణపాఠం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరూ చెప్పనంత పెద్ద గుణపాఠాన్ని నేర్పించారు. సహజంగా ప్రభుత్వోద్యోగులు అంటే ప్రజల్లో వ్యతిరేకత వుంటుంది. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సి రావడం, విధుల  నిర్వహణలో నిర్లక్ష్యం ఈ వ్యతిరేకతకు కారణం. అయితే సమైక్య ఉద్యమ సమయంలో ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భారీ స్థాయిలో ఉద్యమం చేశారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఉద్యోగులు ఎంత గొప్ప ఉద్యమం చేశారో అని అప్పట్లో ప్రజలు మురిసిపోయారు. అయితే అప్పట్లో ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం చేసిన తమకోసమే తప్ప ప్రజల కోసం కాదనే చేదు వాస్తవం ఇప్పుడు ప్రజలకు మింగుడు పడకుండా వుంది. ఎక్కడ ఉద్యోగం చేసేవారు అక్కడే స్థిరపడిపోవాలని, ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఎందుకనే ఉద్దేశంతోనే ఉద్యోగులు అప్పట్లో సమైక్య ఉద్యమం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి ఇంతకాలమైనా చాలామంది ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌ని విడిచి విజయవాడకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. విభజన సందర్భంగా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన మరింత సులభతరం చేసి, అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వోద్యోగులలో కనిపించడం లేదు. విజయవాడకు వెళ్ళి ఎక్కడ వుండాలి.. చెట్ల కింద వుండాలా అని వెటకారపు మాటలు మాట్లాడడానికి కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పుడున్నది పాత చంద్రబాబు కాదు.. కాస్తంత మెత్తబడిన చంద్రబాబు. ఆ మెతకతనాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అలుసుగా తీసుకుంటున్నారు. విజయవాడకి రావాలనంటే అవి కావాలి... ఇవికావాలి అని కోరికల చిట్టా విప్పుతున్నారు. ఇళ్ళస్థలాలు కూడా ఇవ్వాలని ఓ భారీ డిమాండ్‌ని ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టార్జితం. మరి వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళకుండా వుండటానికి ఏవేవో సాకులు వెతుకుతున్నారు. ఇలాంటి ప్రవర్తన ద్వారా ప్రభుత్వోద్యోగులను నమ్మి తప్పు చేశాం.. మరోసారి వీళ్ళను నమ్మకూడదని వీళ్ళే ప్రజలకు గుణపాఠం నేర్పుతున్నారు.

కౌలు రైతుల్ని కాపాడండయ్యా...

  ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి లాంటి అందమైన రాజధాని, గొప్ప రాజధాని, అద్భుతమైన రాజధాని రూపొందబోతోంది. ఓకే... రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములు ఇచ్చారు... డబుల్ ఓకే.. ఈ ప్రాంతంలో రాజధాని రావడం, తమ భూములకు మంచి డిమాండ్ రావడం రైతులందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది..  ట్రిపుల్ ఓకే... అయితే  అమరావతి రాజధాని కావడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోందని అనుకోవడమే పొరపాటు. ఒక కంట పన్నీరు వున్నప్పటికీ మరో కంట కన్నీరు వస్తోంది. రైతులు సంతోషంగా వున్నారు. కానీ, మూడు పంటలు పండే ఈ ప్రాంతంలో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కౌలు రైతులు, కూలీలు మాత్రం తమ భవిష్యత్తు ఏమిటో తమకే అర్థం కాక అయోమయ పరిస్థితిలో వున్నారు. భవిష్యత్తు మీద భయం వీరిని క్రుంగదీసింది. ప్రభుత్వం ఇస్తున్న సహాయం వీరిలో ధైర్యాన్ని నింపలేకపోతోంది. ఆ అధైర్యం ఆత్మహత్యల రూపంలోకి మారుతోంది. రాజధాని ప్రాంతంలో ఇటీవలి కాలంలో పలువురు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమైన విషయం. ఎంతోమందికి ఎన్నో విషయాలలో భరోసాను కలిగిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులు, కూలీల విషయంలో మాత్రం ఎందుకు సమర్థంగా పనిచేయలేకపోతోందో, వారిలో ధైర్యాన్ని ఎందుకు కలిగించలేకపోతోందో అర్థం కావడం లేదు. రాజధాని నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో సాధించే విజయాలకు సంబంధించిన కలలు కనడం కాస్తంత తగ్గించి, వాస్తంలో జరుగుతున్న దారుణాలను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రాజధాని ప్రాంతంలో కౌలు రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలను నివారించడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే అలాంటి నిర్భాగ్యుల సమాధుల మీద రాజధాని పునాదులు కట్టిన అపఖ్యాతి మిగులుతుంది.

ఆంధ్రావాళ్ళని తిట్టని అందమైన ఎన్నికలు

తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద ఎంతమాత్రం ద్వేషం వుండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజలు కలసి మెలసి జీవిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులకు మాత్రం ఆంధ్రావాళ్ళ మీద మహా ద్వేషం. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఆంధ్రావాళ్ళని తిట్టనిదే తెల్లారదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తిట్టారు. ఎన్నికల సమయంలో తిట్టారు. దురదృష్టం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తిడుతూనే వున్నారు. ఆంధ్రావాళ్ళని తిట్టడం అనేది తెలంగాణ రాజకీయ నాయకులకు ఆక్సిజన్ లాంటిది. అలా తిట్టకపోతే వాళ్ళకు రాజకీయంగా రోజు గడవదు. సహజంగా ఏ ఎన్నికలు జరిగినా ఆంధ్రావాళ్ళ మీద మాటల బాణాలు వేస్తే చప్పట్లు మోగుతూ వుంటాయి. అయితే ఆంధ్రావాళ్ళని తిట్టకుండా త్వరలో అందమైన ఎన్నికలు జరగబోతున్నాయి. అవి జీహెచ్ఎంసీ ఎన్నికలు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ నాయకుడూ ఆంధ్రావాళ్ళను పల్లెత్తు మాట కూడా అనరు. ఆంధ్రా తెలంగాణ భాయీ భాయీ అని చాలా ఫ్రెండ్లీగా వుంటారు. ఆంధ్రావాళ్ళ కాల్లో ముల్లు దిగితే నోటితో తీస్తా.. ముక్కుతో తీస్తా అంటారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ తెలంగాణ నాయకుల నోటితో తిట్లు తినే ఆంధ్రా వాళ్ళకి ఈ ఎన్నికలు చాలా మనశ్శాంతిని ఇవ్వబోతున్నాయి. హైదరాబాద్ ఎన్నికలలో ఆంధ్రాప్రజల నిర్ణయం చాలా కీలకం అందువల్ల ఏ పార్టీ కూడా ఆంధ్రావాళ్ళను ఈసారి తిట్టే సాహసం చేయబోదు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో  తిట్లర్లే అని మురిసిపోతున్న ఆంధ్రులూ వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా తిట్లు తినడానికి సిద్ధంగా వుండండి.

వైసీపీ రాజకీయం మహా ఘోరం

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి భవిష్యత్తులో రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కబోతోంది. అధికారం కోసం ఘోరమైన రాజకీయాలు నడిపిన పార్టీగా వైసీపీ చరిత్రలో మిగలబోతోంది. వైసీపీ నాయకుల మీద వున్న అవినీతి కళంకం మాట అలా వుంచితే, ప్రతిపక్షంలో వున్న వారు నడుపుతున్న ఘోరమైన రాజకీయాలు ఏమాత్రం రాజకీయ స్పృహ వున్నవారికైనా ఏవగింపును కలిగిస్తున్నాయి. వైసీపీ అసలు స్వరూపం తెలిసిన ప్రజలు ఆ పార్టీకి గత ఎన్నికలలో అధికారం ఇవ్వలేదు. ఓటమిని పెద్ద మనసుతో అంగీకరించి, తమలో వున్న లోపాలను సరిదిద్దుకోవడం, రాష్ట్రాభివృద్ధికి అధికార పార్టీకి సహకరించడం ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం సరైన పద్ధతి అనిపించుకుంటుంది. అయితే వైసీపీ అందుకు విరుద్ధమైన పద్ధతిలోనే పయనిస్తోంది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎడ్డెం అంటే తెడ్డెం అనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. రాజధాని కోసం భూ సేకరణ విషయం కావచ్చు.. హుదుద్ తుఫాను సహాయ కార్యక్రమాలు కావచ్చు.. సాధారణ పరిపాలనకు సంబంధించిన విషయాలు కావచ్చు... ప్రభుత్వం చేపట్టిన ఏ విషయంలోనైనా నానా గందరగోళం సృష్టించడమే వైసీపీ ధ్యేయంగా వుంది. అయితే రోజు రోజుకూ వైసీపీ తన పరిధిని దాటి ఘోరమైన రాజకీయాలను ప్రదర్శించడమే బాధాకరమైన విషయం వైసీపీ తన రాజకీయ మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ప్రాంతీయవాదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వైసీపీ ప్రయత్నించడం దారుణం. వైసీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు, రాయలసీమకు చెప్పలేనంత అన్యాయం జరిగిపోతోందని ధర్మానవారు వాపోయారు. ఇది ముమ్మాటికీ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడమేనని తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఘాటుగా ధర్మాన వాదనను తిప్పికొట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందీ ఉదాహరణలతో సహా చెప్పారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దని ధర్మానకి వార్నింగ్ ఇచ్చారు. అంచేత వైసీపీ బాబులూ... మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ప్రాంతీయ చిచ్చు పెట్టకండి.

ప్రముఖ హాస్య నటుడు కొండవలస మృతి

  తెలుగు సినీ పరిశ్రమ వారం రోజుల వ్యవధిలోనే మరో ప్రముఖ హాస్య నటుడుని కోల్పోయింది. సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం వైజాగులో మృతి చెందారు. మళ్ళీ నిన్న రాత్రి మరో ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు (69) హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో ఆయనని కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్ను మూశారు.   కొండవలస లక్ష్మణరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామం. ఆయన ఆగస్ట్ 10,1946న లో జన్మించారు. కానీ అ తరువాత వారి కుటుంబం కళలకు కాణాచి అని చెప్పబడే విజయనగరం వచ్చి అక్కడే స్థిరపడింది. ఆయన చిన్నపాటి నుంచే బుర్రకధలు, నాటాకాల పట్ల చాలా ఆసక్తి చూపేవారు. విజయనగరంలో స్థిరపడటంతో ఆయన కళా రంగం వైపు ఆకర్షితులయ్యారు. ఆయన సుమారు 2,000కు పైగా నాటకాలలో నటించారు. వైజాగ్ పోర్టులో పనిచేసేవారు. ఉద్యోగం చేస్తూనే అనేక నాటకాలు వేసేవారు. ఆయన నటించిన మొట్ట మొదటి నాటిక ‘సవతి తల్లి.’ అందులో ఆయన ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. దానికి ఆయనకు నంది అవార్డు కూడా అందుకొన్నారు. మళ్ళీ ఆ తరువాత ‘కేళీ విలాసం’ అనే నాటకంలో విలన్ పాత్ర చేసి దానికీ మరొక నంది అవార్డు అందుకొన్నారు.   “అవును వాళ్లిదరూ ఇష్టపడ్డారు” సినిమాతో ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి కబ్బడీ కబ్బాడీ, దొంగ రాముడు అండ్ పార్టీ, సత్యం, పల్లకీలో పెళ్లి కూతురు, రాధా గోపాళం, కాంచనమాల కేబుల్ టీవి, ఎవడి గోల వాడిదే, అందాల రాముడు, బాస్, సైనికుడు, రాఖి, అత్తిలి సత్తిబాబు, సుందర కాండ, బ్లేడు బాబ్జి, బెండు అప్పారావు ఆర్.ఎం.పి.,అదుర్స్, వరుడు, కత్తి కాంతారావు వంటి సినిమాలలో తన అద్భుతమయిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆయన సుమారు 300పైగా సినిమాలలో నటించారు.శ్రీకాకుళం యాసలో ఆయన పలికిన “నేనొప్పుకోను...ఐతే ఒకే...” “ఐతే నాకేటి...?వంటి డైలాగ్స్ ఎప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతాయి. ఆయన అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించబడుతాయి.

జనతా పరివార్ లో "లైక్స్ అన్ లైక్స్ "

  బిహార్ ఎన్నికలలో నరేంద్ర మోడీ ధాటిని తట్టుకొని నిలబడి ఎన్నికలలో విజయం సాధించాలనే ఆలోచనతోనే బద్ద విరోధులయిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరినొకరు తప్పనిసరిగా ‘లైక్’ చేసుకోవలసి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినప్పటికీ బిహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితిలో లేదు గాబట్టి అది కూడా వారిని ‘లైక్’ చేసి వారితో చేతులు కలిపింది. ఆ మూడు పార్టీలు కలిసి బీహార్ ఎన్నికల వైతరిణిలో నాలుగు రౌండ్లు ఈదేసాయి. ఇంకొక్క రౌండ్ కష్టపడి ఈదేస్తే ఒడ్డున పడొచ్చు...లేదా లాలూ ప్రసాద్ యాదవ్ ‘ట్రాక్ బరువును’ మోయలేక అందరూ కలిసి ఆయనతో బాటే మునిగిపోవచ్చును. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో ఓడిపోతే ఆ క్రెడిట్ అంతా పూర్తిగా లాలూ ప్రసాద్ యాదవ్ కే దక్కుతుంది తప్ప నరేంద్ర మోడీకొ లేక అమిత్ షాకో దక్కదు.   ఈ కాంపిటీషన్ లో చేతులు పట్టుకొని కలిసికట్టుగా ఈదుతున్న వాళ్ళ ముగ్గుర్నీ చప్పట్లు కొడుతూ ఎంకరెంజ్ చేస్తున్నారు డిల్లీ ఆమాద్మీ అరవింద్ కేజ్రీవాల్. ఆయన నితీష్ కుమార్ పరిపాలనను చూసి ఓటేయమని బిహార్ ప్రజలకు సజెస్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా సేమ్ డిటో డిటో. మళ్ళీ వాళ్లిద్దరూ ఒకరినొకరు ‘లైక్’ చేయరు. రాహుల్ జీ నితీష్ కుమార్ ని ‘లైక్’ చేస్తారు. కానీ లలూని ‘అన్ లైక్’ చేస్తారు. కానీ నితీష్ రాహుల్ జీతో కలిసి ప్రచారం చేయడాన్ని ‘లైక్’ చేయరు. అయినా రాహుల్ జీ నితీష్ మొహం చూసే ఓట్లేయమని జనానికి సజెస్ట్ చేస్తుంటారు.   అలాగే లాలూ కూడా రాహుల్ జీని ‘లైక్’ చేయరు. ఎందుకంటే లాలూ ప్రసాద్ పై అనర్హత వేటు పడటానికి కారకుడు రాహుల్ జీ యే! ఆనాడు డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల చట్ట సవరణలపై ఆమోదించిన ఆర్డినెన్స్ “నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు..దానిని చింపి చెత్త బుట్టలో పడేయాల్సిందే”నని అనడంతో బిత్తరపోయిన డా.మన్మోహన్ సింగ్ నిజంగానే దానిని చింపి చెత్త బుట్టలో పడేశారు. అదే ఆర్డినెన్స్ అమలులో ఉండి ఉంటే నేడు లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటుపడేదే కాదు...అప్పుడు ఆయన కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసి ఉండేవారు. ఆ అవకాశమే ఆయనకు ఉండి ఉంటే బహుశః నితీష్ కుమార్ ఆయనని ‘లైక్’ చేసేవారే కాదేమో?   కారణాలు ఎవయినప్పటికీ అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరినొకరు ‘లైక్’ ‘అన్ లైక్’ చేసుకొంటూనే ఎన్నికల వైతరిణిని ఈదేస్తున్నారు. మరి ఇంత ఇస్ట్రాంగ్ కమ్యూని కేషన్ గ్యాప్ ఉన్నవీరందరూ గెలిస్తే పాపం బిహార్ ప్రజలు ఏమవుతారో ఏమో?అనే ధర్మ సందేహం కలుగుతోంది.

ఇ.డి.చిపెట్టను జగన్ బొమ్మాళీ!

నిన్ను ఎవరు క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు అనే డైలాగ్ చాలా సినిమాల్లో వినే వుంటాం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ డైలాగ్‌ని కాస్తంత మార్చి చదువుకోవచ్చు... ‘‘నిన్ను ఎవరు క్షమించినా ఆ ఇ.డి. (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మాత్రం క్షమించదు’’. అవునండీ బాబు... అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్‌‌ని ఎవరు క్షమించినా ఇ.డి. మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించి విడిచిపెట్టేట్టు లేదు. అక్రమాస్తుల కేసుల విచారణ మొదలైనప్పటి నుంచి ఇ.డి అప్పుడప్పుడు జగన్‌కి సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ఆయనగారికి కంటి నిండా నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు జగన్‌కి సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్‌కి సంబంధించిన కీలకమైన, ఆయువుపట్టు లాంటి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇ.డి. సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే సీబీఐ ధాటి నుంచి తట్టుకోవడం ఈజీగానే వుందిగానీ, ఈ ఇ.డి. తాకిడికి తట్టుకోవడం మాత్రం జగన్‌కి చాలా కష్టంగా మారింది. అందుకే ఇ.డి.ని అదుపు చేయడానికి జగన్ నానా తంటాలూ పడుతున్నాడు. సీబీఐ దగ్గర వున్న తన అక్రమాస్తుల కేసులు పరిష్కారమయ్యే వరకూ ఇ.డి. నా జోలికి, నా ఆస్తుల జోలికి రాకుండా చూడాలని జగన్ ఇ.డి. ప్రత్యేక కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇ.డి. కోర్టు ముందు జగన్ వాదదను ఖండిస్తూ కోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకూ తాను ప్రేక్షకపాత్ర వహించాల్సిన అవసరం లేదని, తాను తనదైన పద్ధతిలో విచారణ జరపవచ్చని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ చట్టంలోని ఏయే సెక్షన్ల ప్రకారం తాను జగన్ మీద చర్యలు తీసుకోవచ్చో సవివరంగా కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు విషయంలో జరుగుతున్న విచారణను జాప్యం చేయడానికే జగన్ తన ప్రమేయాన్ని ప్రశ్నిస్తున్నాురని ఇ.డి. వివరించింది. ఈ కేసు విషయంలో ఇ.డి. చేసిన వాదనను చూస్తుంటే ఇ.డి. జగన్ సార్‌ని అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.

జనవరిలోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఎందుకంటే....

  సుమారు ఏడాది క్రితం నిర్వహించాల్సిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను తెలంగాణా ప్రభుత్వం నేటి వరకు నిర్వహించలేదు. హైకోర్టు దాని గురించి ప్రశ్నించినపుడల్లా వార్డుల పునర్విభజన, ఆధార్ కార్డుల తో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియ కోసమేనని చెపుతూ హైకోర్టు నుంచి గడువు సంపాదించుకొంటోంది. మళ్ళీ ఇవ్వాళ్ళ హైకోర్టు ప్రశ్నించినపుడు కూడా అవే సమాధానాలు చెప్పి జనవరి వరకు గడువు కోరింది. ఈసారి జనవరిలో తప్పకుండా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని లిఖిత పూర్వకంగా అఫిడవిట్ ద్వారా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.   వార్డుల పునర్విభజన కోసం సుమారు 12నెలలు సమయం తీసుకొన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఆ పని పూర్తి చేయనేలేదు. కానీ ఆధార్ అనుసంధానం పేరుతో సుమారు ఆరున్నర లక్షల మంది ఓటర్లను ఏరి పడేసింది. వారిలో అత్యధిక శాతం ఆంధ్రాకు చెందినవారే. కేంద్ర ఎన్నికల సంఘం, హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి ఉండి ఉంటే మిగిలిన వాళ్ళ పేర్లను కూడా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి ఉండేదేమో కానీ కుదరలేదు. పైగా ఎన్నికల కమీషన్ పంపిన అధికారులు చివాట్లు పెట్టారు. ఇంతకాలం జి.హెచ్.ఎం.సి. కమీషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ ని బదిలీ చేసి తెరాస ప్రభుత్వం చేతులు దులుపుకొంది.   ఇక ఎలాగూ ఎన్నికల నిర్వహించక తప్పదు కనుక జనవరి నెలాఖరులోగా నిర్వహిస్తామని మత ఇస్తోంది. అయితే జనవరిలోనే ఎందుకు అంటే బహుశః అప్పుడే సంక్రాంతి పండుగకానీ జంట నగరాలలో ఉన్న ఆంధ్రా ప్రజలు అందరూ తమతమ ఊళ్లకు వెళ్ళిపోతారు కనుక అని అనుకోవలసి ఉంటుంది. తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ ఆంధ్రా ఓటర్ల కారణంగానే గెలుస్తుంటాయి. వాళ్ళు వెళ్ళిపోతే ఇక మిగిలిన స్థానికులు తెరాసకే ఓట్లు వేస్తారు కనుక జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిచేఅవకాశాలు ఉంటాయని తెరాస భావిస్తోందేమో? బహుశః అదే తెరాసకు మిగిలిన చిట్ట చివరి అవకాశం.

పురందేశ్వరి పగ చల్లారదా?

ఎన్టీఆర్ గారి అమ్మాయి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి గారికి తన మరిదిగారు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద పగ చల్లారినట్టు లేదు. తమ కుటుంబ గొడవలు, పగలను తీర్చుకోవడానికి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉపయోగించుకోవడం మానినట్టు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలో తన భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావును రెండో స్థానానికే పరిమితం చేశారన్న కోపంతోపాటు ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేశారన్న ఆగ్రహం పురందేశ్వరికి ఎప్పటి నుంచో వుంది.ఆ కోపాన్ని ఆమె అడపాదడపా ప్రకటిస్తూనే వుంటారు. అయితే ఒకవిధంగా చెప్పాలంటే, రాజకీయాలంటేనే తెలియని పురందేశ్వరి కేంద్ర మంత్రిపదవి వరకూ ఎదిగారంటే దానికి కారణం పరోక్షంగా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కుటుంబం నుంచి రాజకీయ శక్తిని తయారు చేయాలన్న మేడమ్ సోనియా ఆలోచన ఫలితంగానే ఆమె కేంద్ర మంత్రి పదవిని పొందగలిగారు. అయితే సోనియాగాంధీ ఆశించిన స్థాయిలో పురందేశ్వరి ప్రజల మనసులలో స్థానం సాధించుకోలేకపోయారు. రాష్ట్ర విభజనకు తనవంతు సహకారాన్ని అందించి తెలుగు ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఫలితం రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ నాయకురాలిగా ఊహించని పరాజయం. అయితే తన ఓటమికి చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయమే కారణమన్న అభిప్రాయం పురందేశ్వరికి బలంగా వుంది. గతంలో చంద్రబాబు నాయుడి మీద వున్న కోపాన్ని ఈ అభిప్రాయం మరింత పెంచింది. రాజంపేటలో ఓటమి తర్వాత ఆమె రాజకీయాలకు తాత్కాలిక విశ్రాంతినిస్తే బావుండేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులకు పెద్ద పనేమీ లేదు. అధికార తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీలో వున్న పురందేశ్వరి మాత్రం తెలుగుదేశం పార్టీలో బీజేపీకి ఉన్న మిత్రధర్మాన్ని పక్కన పెట్టి తమ కుటుంబ గొడవలకు ప్రాధాన్యం ఇస్తూనే వున్నారు. వీలైనప్పుడల్లా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తూనే వున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదనే అర్థం వచ్చే విధంగా ఈమధ్య కొన్నిసార్లు మాట్లాడారు. అక్కడితో ఆగారా... తాజాగా ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏపీలో తెలుగుదేశం పార్టీదే వచ్చే ఎన్నికలలో అధికారం అని చెబుతూ వుంటే, పురందేశ్వరి వచ్చే ఎన్నికలలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెబుతూ వున్నారు. పురందేశ్వరి చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఆమెలోని పగకు ప్రతిరూపాలా? లేక బీజేపీ నాయకత్వం ఆదేశానికి ప్రతీకలా? ఏమో... ఆమెకే తెలియాలి!

బీహార్ ఎన్నికలతో బుర్రలు వేడి

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలేమోగానీ, ఈ ఎన్నికలు దేశంలోని రాజకీయ వర్గాల బుర్రలు వేడెక్కేలా చేస్తున్నాయి. ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న ఈ ఎన్నికలు హిచ్‌కాక్ సినిమాల తరహాలో సస్పెన్స్‌తో కొనసాగుతూ చివరికి ఫలితాలు ఎలా వుండబోతున్నాయా అనే ఉత్కంఠ దశ దశకూ పెరిగిపోతోంది. దేశ సార్వత్రిక ఎన్నికలు ఎంతటి ఉత్కంఠభరితమైన వాతావరణంలో జరిగాయో ఇప్పుడు ఒక్క బీహార్ రాష్ట్ర ఎన్నికలే ఆ స్థాయి ఉత్కంఠతో జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల సందర్భంగా ఇంత ఉత్కంఠ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ ఎన్నికలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సవాలుగా నిలిచేవి. ‘మోడీ గాలి’ ఇప్పటికీ ఉందా లేదా అని స్పష్టం చేసేవి. అందుకే ప్రధాని మోడీతో సహా బీజేపీ మిత్ర పార్టీలన్నీ బీహార్ మీద పూర్తి స్థాయి కృషిని కేంద్రీకరించాయి. ఈ ఎన్నికలలో ఏన్డీయే కూటమి ఓడిపోవడం అంటూ జరిగితే, అది మోడీ ప్రతిష్టకు మచ్చ అయ్యే ప్రమాదం వుంది. ఈ ఎన్నికలలో గెలుపు, ఓటముల ప్రభావం త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద పడే ప్రభావం వుంది. అందువల్ల బీజేపీ బీహార్ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీహార్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందు ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయావకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వినిపించాయి. ఎన్నికల సర్వేలు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రజల్లో మంచి పేరు వున్న నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని సర్వే ఫలితాలు వచ్చాయి. అయితే నాలుగోదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు రాజకీయ పరిశీలకులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. నాలుగోదశ పోలింగ్ జరిగిన దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం వుందని అంటున్నారు. ఇది బీజేపీకి సీట్ల బలాన్ని పెంచుతుందని అంటున్నారు. నితీష్ కుమార్ కూటమి తమదే విజయం అని భారీ ధీమాని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల ఎక్కడో బెరుకు కనిపిస్తోంది. ఎన్డీయే వర్గాలు మాత్రం సర్వే రిపోర్టులు ఎలా వున్నా గత సార్వత్రిక ఎన్నికల తరహాలోనే మోడీ మంత్రం బీహార్లో కూడా ఫలించే అవకాశం వుందని చెబుతున్నాయి. అయితే మరికొన్ని వర్గాలు మాత్రం ఈసారి బీహార్లో హంగ్ ఖాయమని నిర్మొహమాటంగా అంటున్నారు. ఇలా ఏ అంచనాకూ స్పష్టంగా అందని బీహార్ ఎన్నికల సరళి రాజకీయ పరిశీలకుల బుర్రల్ని వేడెక్కిస్తోంది. నంబర్ 8వ తేదీన ఫలితాలు వెలువడేవరకూ ఈ వేడి చల్లారే అవకాశం లేదు.

‘నంది’కి మోక్షం వచ్చింది రామాహరీ!

ఎట్టకేలకు నంది అవార్డులకు మోక్షం వచ్చింది. రాష్ట్ర విభజన ఉద్యమం ఊపు అందుకునే ముందు నంది అవార్డుల ప్రదానోత్సవాలు చాలా వైభవంగా సాగేవి. సినిమాలకు ఇవ్వడంతో మొదలైన ఈ ‘నంది’ అవార్డులు ఆ తర్వాత నాటక రంగానికి, టీవీ రంగానికి కూడా ఇవ్వడం ప్రారంభించారు. నంది అవార్డుల వెనుక వుండే పైరవీలు, ఆశ్రిత పక్షపాతం అనే విషయాల సంగతి అలా వుంచితే, ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డులంటే కళాకారులకు ఎంతో ఆసక్తి వుండేది. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత నంది అవార్డులకు ప్రాధాన్యం తగ్గింది. ఎవరి ప్రభుత్వం అధికారంలో వున్నా ఉద్యమ సుడిగుండంలో చిక్కుకుని వుండటంతో నంది అవార్డుల గురించి కొంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. చివరికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డుల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని సంస్థలను రెండు రాష్ట్రాలూ పంచుకుంటున్నాయి. మరి ‘నంది’ని ఎవరు తీసుకెళ్ళి పోషిస్తారనే సందేహానికి చాలాకాలంపాటు సమాధానం దొరకలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం నందిని తాము పోషించే ప్రసక్తే లేదన్న సంకేతాలు వచ్చాయి. నంది అవార్డులలో సినిమా అవార్డులకే ఎక్కువ గ్లామర్. ఆ తర్వాత టీవీ అవార్డులకు స్థానం దక్కుతుంది. సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమ కేంద్రీకృతమై వున్న తెలంగాణ ప్రభుత్వమే నంది అవార్డుల విషయంలో అనాసక్తిగా వుందన్న సమాచారం రావడంతో ఇక నంది అవార్డులకు కాలంచెల్లినట్టేన్న సందేహాలు వచ్చాయి. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం నంది బదులు ‘ఏకశిల’ పేరుతో అవార్డులు ఇవ్వబోతోందన్న వార్తలు కూడా రావడంతో ఇక తెలంగాణకు, నందికి సంబంధం లేదనుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. గత కొన్నేళ్ళుగా మూలన పడి వున్న నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం మోక్షం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వబోతున్నామంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది. నాటకాలకు అవార్డులు ఇస్తున్నారంటే, భవిష్యత్తులో సినిమాలకు, టీవీలకు కూడా అవార్డులు ఇవ్వడం అనేది ఖాయమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసి నంది అవార్డులను పునరుద్ధరించడం సినిమా, టీవీ, నాటక రంగ కళాకారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

తీసేసిన ఓట్లు పాము కాట్లు అవుతాయా?

హమ్మయ్య.. ఎట్టకేలకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు  ఏనాడో నిర్వహించాల్సి వున్నప్పటికీ,  సీమాంధ్రుల ప్రాబల్యం ఎక్కువగా వున్న జీహెచ్ఎంసీలో పట్టు సాధించే ఉద్దేశంతో టీఆర్ఎస్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడం, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, ముస్లింలకు ప్రోత్సాహకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం, ఒక్కో సామాజిక వర్గాలనికో భవనం... ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే, ఈ ప్రయత్నాలన్నీ బలపడేవరకూ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకూడదని జాప్యం చేస్తూ వచ్చింది. అయితే హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించడంతో ఇక చేసేదేమీ లేక వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిమీద ప్రమాణ పత్రం సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రమాణ పత్రం సమర్పించక తప్పదు.. అలా సమర్పిస్తే జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహించకా తప్పడు. అయితే వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇప్పడప్పుడే నిర్వహించే ఉద్దేశం లేదు. హైదరాబాద్‌లోని వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం  చేసిన ప్రయత్నాలు ఇంకా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని తంటాలు పడినా హైదరాబాద్ ఓటరు ఆ పార్టీ వైపు మొగ్గుచూపిన దాఖలాలు కనిపించడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారుగానీ, ఓటర్లు మాత్రం తమ అభిప్రాయాలను మార్చుకోలేదు. వారి అభిప్రాయాలను మార్చే ప్రయత్నాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలితాలను ఇవ్వడం ప్రారంభించకముందే కోర్టు హుకుంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేయక తప్పని పరిస్థితి వచ్చిపడింది. వీటికి తోడు బోగస్ ఓట్ల పేరుతో లక్షలాది మంది ఓట్లను తొలగించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలో తొలగించిన ఓట్లు అధికార పార్టీకి పాముకాట్లుగా మారే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓట్ల తొలగింపు విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటి మీద నిలబడ్డాయి. ప్రభుత్వం ఇరుక్కుపోయే అనేక ఆధారాలను ఎన్నికల కమిషన్‌కి సమర్పించాయి. ఎన్నికల కమిషన్‌ కూడా ఈ విషయంలో చాలా లోతుగా దర్యాప్తు చేస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఓట్లను ఎలాంటి నోటీసులూ లేకుండా తొలగించారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎన్నికల కమిషన్ దర్యా్ప్తులో నిజమేనని తేలితే అది జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీకి బాగా నష్టం కలిగించే ప్రభావం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.

కేటీఆర్ అలా కమిట్ అవడం కరెక్టేనా?

ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం దృష్టి మాత్రమే కాదు.. యావత్ దేశం దృష్టీ త్వరలో జరగబోతున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక మీదే వుంది. ఈ ఉప ఎన్నిక చాలా కీలకమైన ఉప ఎన్నికగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏక ఛత్రాధిపత్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ  భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక ప్రతిఫలించే అవకాశం వుంది. గతంలో... అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎన్నో సందర్భాలలో తమ పదవులకు రాజీనామాలు చేసి, తిరిగి ఎన్నికలలో పోటీ చేసి విజయాలు సాధించారు. రాజకీయంగా తమ పార్టీ ప్రభావం తగ్గుతోందని భావించిన ప్రతి సారీ ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ రాజీనామాలు, ఉప ఎన్నికలు అనే అస్త్రాలను ప్రయోగించి మళ్ళీ ఉద్యమ వేడి రగిల్చేవారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు వేరు. ఈ నేపథ్యంలో జరగబోతున్న వరంగల్ పార్లమెంట్ స్థాన ఉప ఎన్నిక చాలా కీలకమైనది. ఉద్యమం జరిగినప్పుడు చేసిన రాజీనామాలు, ఉప ఎన్నికలు ప్రజల్లో ఆవేశాన్ని పెంచేవి... టీఆర్ఎస్‌కి మద్దతుగా నిలవాలన్న స్ఫూర్తిని రగిలించేవి. అయితే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఎంపీ కడియం శ్రీహరి చేసిన రాజీనామా కేవలం సొంత పార్టీలోని రాజకీయ కారణాల వల్ల చేసినది. ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీద అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఉద్వాసన పలికి, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. అందువల్ల కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఈ రాజీనామా అనేది ఊబుసుపోక చేయించిన రాజీనామా తప్ప తెలంగాణ ప్రజల కోసం చేయించిన రాజీనామా కాదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వుంది. అనేకమంది వరంగల్ ప్రజల్లో అయితే ఇది ప్రజాధనాన్ని ఖర్చు చేయించే ఉప ఎన్నిక అనే అభిప్రాయం కూడా వుంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎన్ని తంటాలుపడి అయినా ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న కాంక్షతో టీఆర్ఎస్ వర్గాలు పనిచేస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ ఉప ఎన్నిక విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వరంగల్ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానంలో వచ్చే ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకున నిదర్శనంగా భావించవచ్చని మంత్రి గారు, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రకటించడం దుస్సాహసమే అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని, ఆ స్థానంలో టీఆర్ఎస్ విజయం అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ తేడాతో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో  కేటీఆర్ ఈ ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలని కమిట్ అవడం ఆయనలోని మేకపోతు గాంభీర్యానికి ప్రతికగా భావించాల్సిందేనని అంటున్నారు.