బీజేపి వర్సెస్ టీడీపీ : పొత్తు పొత్తే … పోట్లాట పోట్లాటే!
posted on May 22, 2017 @ 12:39PM
చెట్టు మీదే బాగా పక్వానికి వచ్చిన పళ్లు వాటంతటవే రాలిపోతాయి. రాజకీయ పొత్తులు కూడా అలానే తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఏదో ఒక పార్టీ బలంగా వున్నప్పుడు రెండో పార్టీ దానితో పొత్తు పెట్టుకుంటుంది. తరువాత టైం రాగానే వేరు కుంపటి. ఇదీ ఇప్పటి పరిస్థితి. రాజకీయ పొత్తులకి, ఎన్నికల అవగాహనలకి పెద్దగా సిద్దాంతాల రాద్దాంతాలు ఏమీ లేకుండా పోయాయి. తాజాగా ఆంధ్రా బీజేపి నాయకుల మాటలు చూస్తుంటే ఏపీలో టీడీపీ, బీజేపి అలయన్స్ అంతం అంతకంతకూ దగ్గరకొచ్చేస్తున్నట్టు కనిపిస్తోంది!
ఏపీలో బీజేపికి పెద్దగా బలమైన క్యాడర్ గాని, నాయకులు గాని లేరన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, దిల్లీలో పనులు జరగాలని టీడీపీ, ఆంధ్రాలో బలం పుంజుకోవాలని బీజేపి పరస్పరం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలతో కలిసి ప్రచారం చేసిన పవన్ ఆల్రెడీ జనసేనతో కమ్యూనిస్టుల వైపు వెళ్లిపోతున్నాడు. ఇక మిగిలిన టీడీపీ, బీజేపి బంధం కూడా రోజు రోజుకి క్షిణిస్తున్నట్టే కనిపిస్తోంది. పెద్ద నాయకులు ఎంతగా సంయమనం పాటిస్తున్నా… పొత్తుకు వచ్చిన విపత్తు ఎం లేదని చెబుతోన్నా… ఒక స్థాయి నేతలు మాత్రం ఇరు పార్టీల నుంచీ ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు.
ఏపీ బీజేపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీపైన, టీడీపీ నాయకులపైనా ఆగ్రహంగా స్పందించారు. కేశినేని నాని బీజేపితో పొత్తు వల్ల టీడీపీ నష్టపోయిందని కామెంట్ చేశారనీ… అలాంటివి తాము పట్టించుకోమని అన్నారు. అదే సమయంలో నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక టీడీపీ పార్టీ అభిప్రాయం కూడా అదేనా తెలపాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇలా టీడీపీ నేతలు బీజేపి టార్గెట్ చేయటం పరిపాటి అయిపోయిందని కూడా కన్నా అన్నారు! ఇదంతా టీడీపీ, బీజేపి పొత్తుకి ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. అదీ త్వరలో అమిత్ షా ఏపీలో పర్యటించనున్న వేళ!
ఇక ఏపీ బీజేపిలోని మరో నేత సోము వీర్రాజు అయితే స్పష్టంగానే అభిప్రాయాన్ని చెప్పేశారు. ఏ పార్టీ అయినా బలపడటానికి ప్రయత్నిస్తుందనీ, అదే పని బీజేపి చేస్తే తప్పేంటని అన్నారు. అంతే కాదు, జగన్ కి మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వటం ఎంత మాత్రం తప్పు కాదని గట్టిగా బదులిచ్చారు. జగన్ , మోదీ భేటీ పైన కూడా చాలా రోజులుగా టీడీపీ, బీజేపి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక వైపు చంద్రబాబు బీజేపిని పల్లెత్తు మాట అనకున్నా, మరో వైపు వెంకయ్య నాయడు 2019 వరకూ తెలుగు దేశంతో బంధం భద్రంగా వుంటుందని చెబుతున్నా… మాటల తూటాలు మాత్రం పేలుతూనే వున్నాయి. ఈ రచ్చని నియంత్రించే ప్రయత్నం బీజేపి జాతీయ నాయకత్వం అస్సలు చేస్తుండకపోవటం కూడా అనేక అనుమానాలకి తావిస్తోంది! ఒకవేళ దిల్లీ స్థాయిలోనే టీడీపీతో పొత్తు ముందు ముందు వద్దని కాషాయ దళ నాయకులు భావిస్తున్నారా? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది! మహారాష్ట్రలో శివసేనతో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూనే భాగస్వామ్యం కొనసాగిస్తున్న కమలం… అదే ఫార్ములా టీడీపికి కూడా అప్లై చేయాలనుకుంటుందేమో! ముందు ముందు ఇరు పార్టీల నేతల మాటల్ని బట్టి వ్యూహం బయటపడుతుంది!