ఆత్మ.. అంతరాత్మా..
posted on Jun 21, 2023 @ 4:40PM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని.. ఆ క్రమంలోనే ఆమె.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. పార్టీని విలీనం చేసే కార్యక్రమం మరికొద్ది రోజుల్లోనే ఉండబోతోందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.
అయినా షర్మిలలో ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఎవరు చెబితే వచ్చింది అనే ఓ చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. గతంలో సొంత సోదరుడు, వైసీపీ అధినేత జగన్ చెప్పారు.. వినలేదు. బాబాయి, టీటీడీ బోర్డు చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి చెప్పారు. వినలేదు. చివరకు బంధువులు, హితులు, సన్నిహితుల అంతా ఆమె చెవిన ఇల్లు కట్టుకొని పోరారు. అయినా వైయస్ షర్మిల వినను కాక వినను అంటూ వైఎస్సార్టీపీని ప్రారంభించారు.
తల్లి విజయమ్మతో కలసి తెలంగాణ వచ్చి వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి... తాను మెట్టినిల్లుగా చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సైతం.. కొత్త రాజకీయ పార్టీని స్థాపించి.. అధికారం అందుకోవడం సాధ్యమైన పని కాదని... ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోయి రాజకీయం చేయడం సులువు... కాదు కూడదూ అంటే... తెలంగాణలో మరో పార్టీలో వైయస్ఆర్‌టీపీని విలీనం చేయడం మినహా మరోమార్గం లేదంటూ స్ షర్మిలకు గతంలోనే కరాఖండిగా చెప్పేశారనే వార్తలు సైతం అప్పట్లో వైరల్ అయ్యాయి. అయినా షర్మిల మాత్రం తాను పట్టిన కందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహారించారే తప్ప ఎవరి మాటలూ వినలేదు. తన దారి మార్చుకోలేదు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల కోసం ప్రతీ మంగళవారం దీక్షలు, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. కానీ ఆమె చేపట్టిన పాదయాత్రకు, ధర్నాలకు తెలంగాణ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ అవినీతి, అక్రమాలపై షర్మిల నిప్పులు చెరిగారు. ఆ క్రమంలో చోటు చేసుకొన్న వరుస పరిణామాలు అందరికీ తెలిసినవే.
అలాంటి పరిస్థితుల్లో షర్మిల.. హస్తం పార్టీలో వైఎ్సార్టీపీని విలీనం చేయడం వెనుక ఆమె తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పారనే చర్చ పోలిటికల్ సర్కిల్‌లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.
అయితే తెలంగాణ వెళ్లి.. పార్టీ స్థాపించే క్రమంలో ఎంతో మంది ఆమె ప్రయత్నాన్ని ఆపినా.. ఆగని షర్మిల.. ఒకే ఒక్కడు కేవీపీ రామచంద్రరావు చెబితేనే పార్టీ విలీనానికి అంగీకరించేశారంటే అంత నమ్మశక్యం కావడం లేదని.. అంతకు మించి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని ఓ టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అదీ కాక షర్మిల తండ్రి, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆ పార్టీ కండువా కప్పుకొన్న నాటి నుంచి .. తుది శ్వాస విడిచే వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో తండ్రి కొనసాగిన పార్టీలోనే కొనసాగాలని ఆమె అంతరాత్మ ప్రభోధం మేరకు షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న నిర్ణయానికి వచ్చి ఉంటారని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.