అప్పుడు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్.. చేరికల ప్రచారం!
posted on Jun 21, 2023 @ 3:42PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాంచి ఊపు మీదుంది.. కర్ణాటక ప్రసాదించిన ‘బూస్ట్’తో తెలంగాణలో అధికారం హస్తగతమై పోయిందనే హస్తం నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా తగ్గేదేలే అనే రీతిలో పోటాపోటీగా కాంగ్రెస్ నేతల చెవులకు ఇంపైన కథనాలను వండి వడ్డిస్తున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా ఉన్నాయా, అంటే లేదు. నిజానికి మీడియాలో కనిపిస్తున్న ‘చిత్రాలు’ వినిపిస్తున్న ‘కథలు కహానీలు, విశ్లేషణలు’ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు, వినిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు అందరు కాకున్నా కొందరైనా అంగీకరిస్తున్నారు.
ముఖ్యంగా, చేరికల విషయంలో ... బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదు. గతంలో బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి బీజేపీలో చేరడం ఖాయమంటూ వచ్చిన మీడియా వంటకాలు/ వార్తలు తుస్సుమన్నాయి. బీజేపీ అభాసు పాలైంది. ఆ పార్టీ నాయకులు, అంతన్నాడింతన్నాడే .. అన్నట్లుగా అయిపొయిందని సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. నలుగురిలోనూ నవ్వుల పాలయ్యారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే కావచ్చును బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల ‘చిట్ చాట్’ లో చేసిన ‘రివర్స్ కౌన్సిలింగ్ రిమార్క్స్’ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో చేసినా ఈటల రివర్స్ కామెంట్స్ బీజేపీకి తలెత్తుకునే పరిస్థితి లేకుండా చేశాయి. అంతే కాకుండా అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. అంతేకాదు ఈటల, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, వినోద్, విశ్వేశ్వర రెడ్డి వంటి, నేతలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, అందులో ఏ ఒక్కరూ పార్టీ మారలేదు. మీడియా అతి ఉత్సహాన్ని తప్పు పట్టారను కొండి అది వేరే విషయం.
మరో వంక ఈటల కామెంట్స్ చేసిన డ్యామేజి తో బీజేపీ నాయకులు చేరికల విషయంలో సైలెంటై పోయారు. నష్ట నివారణ చర్యల కోసం కేంద్ర నాయకత్వం వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల (జూన్) 15 న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ అనుకున్నా,గుజరాత్ తుపాను కారణంగా ఆ సభ వాయిదా పడింది. అలాగే, జూన్ 25న నాగర్ కర్నూల్ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా పాల్గొంటున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘మహా జన సంపర్క్ అభియాన్’ లో భాగంగా అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
అయినా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ... వస్తేనే కానీ, పార్టీలో మళ్ళీ ఎంతోకొంత ఊపు రాదని పార్టీ రాష్ట్ర నాయకులు నిర్ణయానికి వచ్చారు. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి, మోదీ, షా రాష్ట్ర పర్యటన పై కేంద్ర నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 30తో ‘మహా జన సంపర్క్ అభియాన్’ముస్తున్నందున ఈ లోగానే మోదీ, షా రాష్ట్ర పర్యటన ఉంటుందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే మోదీ, షా రాష్ట్ర పర్యటనపైప్రకటన ఉంటుందని అంటున్నారు.
అదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ముందుగా బీజేపీ నుంచి ఈటల సహా కాంగ్రెస్ మాజీలు కట్టకట్టుకుని సొంత గూటికి తిరిగి వస్తారనే ప్రచారం తుస్సుమంది. ఆ జాబీతాలో పేర్లున్నవారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా గాంధీ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని కుండబద్దులు కొట్టారు. అలాగే కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం జరుగతున్న జాబితా రోజురోజుకు పెరుగుతోంది. పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో పాటుగా మరికొందరి పేర్లు జాబితాలో చేరుతున్నాయి. అయితే ..అదీ జరగడం లేదు. ఈ ఎపిసోడ్ లో తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లి తో ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో వారిరువురినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. జులై 2 న రాహుల్ గాంధీ సమక్షంలో ఆముగ్గురితో పాటుగా మరి కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అంటున్నారు. అయితే, పొంగులేటి, జూపల్లి చేరిక పై కాంగ్రెస్ లోనే ఒక వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
మరో వంక కాంగ్రెస్ తో కలిసొస్తారు అనుకున్న వామపక్ష పార్టీలు ఇప్పటికీ బీఆర్ఎస్ పంచన చేరాయి. అలాగే కాంగ్రెస్ తో కలిసి నడుస్తారు అనుకున్న కోదండ రామ్, ప్రజగాయకుడు గద్దర్ వంటి నాయకులు పునరాలోచనలో ఉన్నారు. గద్దర్ సొంత పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతే కాదు, కాంగ్రెస్ తో పొత్తు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. మొత్తం 119 స్థానల్లో పోటీ చేస్తామని గద్దర్ ప్రకటించారు.
అదలా ఉంటే తెలంగాణ జన సమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని, ఆపార్టీ అధ్యక్షుడు కోదండరామ్ కొట్టివేశారు. తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయడం లేదని కోదండరాం క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తమ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సర్కార్‌పై ఉద్యమిస్తోన్న, ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 21న తెలంగాణ బచావో యాత్ర చేయనున్నట్టు కోదండరాం ప్రకటించారు.
దీంతో కాంగ్రెస్ దూకుడు దిగివస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీతో భేటీ కావడం సంచలనంగా మారింది. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి కుడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు కమర్షియల్ గా మారి పోయాయని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పు కుంటారా? లేక బీఆర్ఎస్ లో చేరతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఆసక్తిగా మారింది.