వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసతో డబుల్ గేం ఆడుతోందా?
posted on Mar 12, 2013 @ 8:04PM
రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో తెరాసా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధం అవుతుంటే, దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా నిశ్చింతగా తన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రతిపక్షాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమయిన రెవెన్యు సదసు ప్రారంభానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ తానూ ప్రతిపక్షాల బెదిరింపుల భయపడేవాడిని కానని, 5సం.లు పాలించమని ప్రజలు తనకు అధికారం అప్పజేప్పినందున, తమ ప్రభుత్వానికి 2014సం.వరకు ఏ ప్రమాదం లేదని అన్నారు.
బహుశః ఆయన తమ పార్టీలో ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి వర్గానికి చెందిన వారుగా ముద్రపడ్డ 9మంది శాసన సభ్యులకు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటువేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించి ఆయన లొంగదీసుకొని ఉండవచ్చును. వారు గనుక తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేయకపోతే, తన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిలేదని గ్రహించినందునే బహుశః కిరణ్ కుమార్ రెడ్డి ఇంత నిర్భయంగా మాట్లాడగలుగు తున్నారను కోవచ్చును. బహుశః ఆ కారణం వల్లనే ఆ 9 మంది శాసన సభ్యులు ఇంతవరకు మీడియా కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నారేమో.
అయితే, మరో వైపు వైయస్సార్ కాంగ్రెస్, తెరాసాతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటునపుడు ఆ తొమ్మండుగురు సభ్యులు కాంగ్రెస్ పార్టీను వీడి బయటకి రాకపోయినట్లయితే తెరాసా పెడుతున్న అవిశ్వాస తీర్మానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ సంగతి తెలియకనే వారిరువురూ అవిశ్వాసంపై ముందుకు వెళ్తున్నారని భావించలేము. అంటే, ఆఖరి నిమిషంలో ఆ తొమ్మండుగురు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఓటు వేయనయినా వేయాలి.
అలా జరుగలేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసాతో డబుల్ గేం ఆడుతోందని భావించాల్సి ఉంటుంది. ఒక వైపు తెరాసతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటూనే మరో వైపు తన తొమ్మండుగురు సభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కూడా కాపాడేందుకు ఆ పార్టీ ఆదేశించి ఉండవచ్చును. బహుశః ఆ కారణం తోనే, వైయస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని విస్పుష్టంగా ప్రకటించి ఉండవచ్చును. బహుశః ఆ కారణంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రభుత్వానికి 2014సం.వరకు ఏ ప్రమాదం లేదని ఈ రోజు కూడా దైర్యంగా చెప్పగలుగుతున్నారు.
ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈవిధమయిన అతి తెలివి ప్రదర్శించి తెరాసను మోసం చేసినట్లయితే, అందుకు ఆ పార్టీ తెలంగాణా లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.