‘ఇద్దరు ఇటలీ నావికుల పెరోల్’ ధారావాహికం ప్రారంభం

 

కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి ఉన్న సమస్యలు సరిపోవనట్లు ఇప్పుడు కొత్తగా ‘ఇద్దరు ఇటలీ నావికుల పెరోల్’ అనే కొత్త ధారావాహికానికి తెర తీసింది. వారిరువురూ ఇటలీ దేశస్తులు కాకుండా మరే దేశస్తులయినా అయిఉంటే ప్రతిపక్షాలు అంతగా పటించుకొనేవి కావేమో. కానీ, వారు సోనియా గాంధీ మాతృ దేశమయిన ఇటలీకి చెందిన వారు కావవడంతో, ప్రతిపక్షాలు మరింత శ్రద్ధతో పార్లమెంటులో ఈ కధని ముందుకు నడిపిస్తున్నాయి.

 

ఇంతకీ, ఈ ధారవాహికానికి ఉపోద్ఘాతం ఏమిటంటే, గత సంవత్సరం ఇటలీ దేశానికి చెందిన నావికులు ఇద్దరు కేరళ సమీపంలో చేపలు పడుతున్న మన భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు మత్స్యకారులు అక్కడికక్కడే చనిపోయారు. భారత సముద్రజలాలో ఈ సంఘటన జరగడంతో వెంటనే మన దేశ నావికాదళం వారు, మన మత్స్యకారుల మరణానికి కారణమయిన ఆ ఇద్దరు ఇటలీ నావికులను బందించి వారిని స్థానిక పోలీసులకి అప్పగించింది.

 

వారు విదేశీయులయిన కారణంగా ఈ కేసులో మన విదేశీ మంత్రిత్వ శాఖ కూడా వేలు పెట్టక తప్పలేదు. వారిని డిల్లీకి తరలించి పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసారు. అయితే, వారిరువురూ గత డిశంబరు నెలలో తమ కుటుంబముతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకొని తిరిగివచ్చి కోర్టుకి లొంగిపోతామని కోర్టుకు విన్నవించుకోవడంతో, (విదేశీ మంత్రిత్వ శాఖ కూడా అనుమతి ఇచ్చి ఉండాలి) కోర్టు వారికి అనుమతి మంజూరు చేసింది. వారు చెప్పినట్లే మళ్ళీ వచ్చి కోర్టులో లొంగిపోయారు కూడా.

 

తమ దేశంలో జరుగుతున్నసాధారణ ఎన్నికలలో ఓటు వేసి వచ్చేందుకు తమకు అనుమతినీయాలని వారిరువురు మళ్ళీ కోర్టుకు వినతిపత్రం ఈయడంతో, వారి సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని కోర్టు వారిరువురికీ గత నెలలో 4 వారాలు పెరోల్ మంజూరు చేసింది.

 

అయితే, వారు మన నీతి కధలలో చెప్పుకొన్నట్లు ‘దూడకి పాలిచ్చి తిరిగి వచ్చి పులికి ఆహారం అయ్యే గంగిగోవులు’ కారు గనుక ఈ సారి భారత్ గుమ్మం దాటగానే తమ ఇటలీ ప్రభుత్వం ద్వారా వారిక తిరిగి రాబోరని ప్రకటింపజేసారు. మరీ అవసరమయితే అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేసుకోవచ్చునని భారతదేశానికి ఇటలీ ప్రభుత్వం ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడంతో ఈ ఇటలీ ధారావాహికం మొదలయింది.

 

షరా మామూలుగానే, ప్రతిపక్షాలు పార్లమెంటులో అల్లరి చేయడం, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం (సిగ్గు, మొహమాటం పడకుండా)ఎదురుదాడి చేయడం, ఆతరువాత కులాసాగా ఇటలీ దేశానికి తమ తీవ్ర అభ్యంతరాలు తెలియజేశామని చెప్పడం వంటి ఎపిసోడ్స్ అన్ని ఈ ధారావాహికంలో చకచకా పూర్తియిపోయాయి.

 

అందుబాటులో ఉన్నఇటలీ రాయభారి ‘డానియల్ మంసిని’కీ ఈ విషయంలో గట్టిగా క్లాసు కూడా పీకమని మన యుపీయే ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ, వారు వినకుండా, అసలు మన మత్స్యకారులను మనదేశ సముద్ర జలాలోనే చంపిన విదేశీయులని ఏవిధంగా దేశం విడిచి వెళ్ళనిచ్చేరు? అసలు వారిని ఎవరు వెళ్ళనిచ్చేరు? ఇదే తప్పు మన దేశస్తులు ఇతరదేశాలలో చేసినట్లయితే వారిని అక్కడి ప్రభుత్వాలు కూడా మనలాగే వారికి పూల దండలు వేసి ఘనంగా వీడ్కోలు పలికి సాగనంపుతాయా? అంటూ డిటెక్టివ్ ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టడంతో, సాధారణంగా ఎన్నడూ పరుషంగా మాట్లాడే అలవాటులేని మన ప్రధాని మన్మోహన్ సింగు వారికి కూడా ఆగ్రహావేశాలు వచ్చేశాయి.

 

దానితో ఆయన ఇటలీ ప్రభుత్వానికి మరో హెచ్చరిక జారీ చేస్తూ, వెంటనే ‘ఆ ఇద్దరినీ’ వెనక్కు పంపకపోతే 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కోవలసి ఉంటుందని తీవ్ర స్వరంతో పార్లమెంటులోనే మృదువుగా హెచ్చరించేసారు కూడా. అయితే, ఆ ‘తీవ్ర పరిణామాలు’ ఏమిటో తెలుసుకోవాలంటే తరువాయి ఎపిసోడ్ వరకు మనం ఎదురు చూడక తప్పదు.