చంద్రబాబు సరికొత్త వ్యూహం ఫలించేనా?
posted on Mar 12, 2013 6:26AM
నిన్న చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఈ సారి ఎన్నికలకి ఆరు నెలలు ముందుగానే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియను మొదలుపెడతామని ప్రకటించారు. ఇది తేదేపాకు సరికొత్త ఎత్తుగడగా ఆయన అభివర్ణిస్తున్నపటికీ, ఇటీవల కొంత కాలంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తినీ, తనకు వ్యతిరేఖంగా తోక జాడిస్తున్న సీనియర్లను, పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ వైపు దూకుతున్న అసంతృప్తి నేతలనూ అందరినీ ఏక కాలంలో తన దారికి తెచ్చుకొనే ప్రయత్నంగానే భావించవచ్చును.
సాధారణంగా రాజకీయపార్టీలు టికెట్లు కేటాయించడం మొదలుపెట్టగానే, సహజంగానే పార్టీలో మళ్ళీ క్రమశిక్షణ, అధిష్టానం పట్ల వినయ విదేయతలు పెల్లుబుకుతాయి. (ఆ కార్యక్రమం తరువాత టికెట్ రాని అభ్యర్ధుల అలకలు, వేరే పార్టీకి వలసలు కూడా సహజమే.) అందువల్ల నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనతో పార్టీలో అసమ్మతి చాలా త్వరగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.
గత ఆరు నెలలుగా ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా తిరుగుతూ చేస్తున్న పాదయాత్రల వల్ల, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై తన దృష్టి కేంద్రీకరించ(లే)క పోవడంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే బహుశః ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చును. ‘ఎన్నికలకి ఆరు నెలల ముందుగానే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడతాము,’ అన్న ప్రకటనలో ఆయన ఇచ్చిన ‘టైమింగ్’ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే. ఎందుకంటే, ఆయన పాదయాత్ర ముగిసే సరికి మరో రెండు నెలలయినా పట్టే అవకాశం ఉంది. అంటే మే నెలలో ఆయన పాదయాత్ర ముగించుకొని మళ్ళీ తన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రతిపక్షాలవారు ఎంత మధ్యంతర ఎన్నికల ఊహా గానాలు వినిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో లేదా ఇంకా ఆలస్యంగా ఎన్నికలకి వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును. ఎందుకంటే, 9 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు కూడా జరిగే ఆ సమయంలో కాంగ్రెస్ సాధారణ ఎన్నికలకు కూడా వెళ్ళే సాహసం చేయకపోవచ్చును. అంటే చంద్రబాబు తన పాదయాత్ర ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి సరిగ్గా ఆరు నెలల సమయం ఉంటుందన్నమాట.
అందువల్ల చంద్రబాబు తిరిగి తానూ పార్టీ కార్యాలయానికి వచ్చిన తరువాత అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని ఆశ చూపడం ద్వారా ఆయన తన పాదయాత్ర సాగుతున్నంత కాలం పార్టీలో పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినట్లు కనబడుతోంది. సర్వరోగ నివారిణి అయిన ఈ దివ్యౌషద ప్రభావం త్వరలోనే పార్టీపై తప్పక కనిపిస్తుంది. ఆయన తన పాదయాత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చిన తరువాత పార్టీ పరిస్థితులను తన అదుపులో తెచ్చుకొనే ప్రయత్నాలు ఎలాగు చేస్తారు. కానీ, అంతవరకూ పార్టీని అదుపులో ఉంచడానికి ఇంతకంటే దివ్యౌషదం మరొకటి ఉండదని అనుభవజ్ఞుడయిన చంద్రబాబుకి తెలుసు గనుకనే ఆయన ఈ ‘ఎన్నికలు-అభ్యర్ధుల ఎంపిక’ అనే మందు వాడి ఉంటారు.
ఇక, ఈ ప్రకటన వెనుక ఆయన ఉద్దేశ్యాలు ఏవున్నపటికీ, ఆయన దానిని అమలు చేసినప్పుడు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఏర్పడుతాయి. పార్టీ అభ్యర్ధులను ఆరు నెలలు ముందుగానే ప్రకటించడం వలన, టికెట్ ఇచ్చిన నేతలకే సదరు నియోజక వర్గాల భాద్యతలు అప్పజెప్పడం ద్వారా అక్కడ పార్టీ విజయావకాశాలు పెరగవచ్చును. అదే సమయంలో, తమకు వ్యతిరేఖంగా పనిచేసే అసమ్మతి నేతలను లొంగ దీసుకొనే తిప్పలు కూడా సదరు అభ్యర్ధులే పడక తప్పదు గనుక, చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా పైపైనుండి పార్టీని పర్యవేక్షిస్తూ ఎన్నికలకు సిద్ధం కావచ్చును.