జగన్ ను అరెస్ట్ చేస్తారు-గట్టు, జగన్ ను అరెస్ట్ చేయరు-అంబటి
posted on Mar 6, 2012 9:25AM
జగన్ అరెస్ట్ పై వైయస్సార్ పిసి నేతల విభిన్న ప్రకటనలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ జగన్ ను సిబిఐ అరెస్ట్ చేస్తోందో లేదో తెలియదుగాని ఈ ఉదంతంపై ఆ పార్టీ నేతలు విభిన్న ప్రకటనలు చేస్తూ కార్యకర్తలను ఆందోళనలకు గురిచేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు రామచంద్రరావు ఖమ్మలో జిల్లా నేతలతో మాట్లాడుతూ జగన్ ను సిబిఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తుందని చెప్పారు. జగన్ ను అరెస్ట్ చేసినప్పటికీ కార్యకర్తలు భయాందోళనలకు గురికావలసిన అవసరంలేదని, అయితే వారు ఏ త్యాగాలకైనా సిద్దంగా ఉండాలని కోరారు. దీంతో జగన్ ను త్వరలో అరెస్ట్ చేయడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేతలే భావిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది జరిగిన మరునాడు అంబటి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్ ను సిబిఐ అసలు అరెస్ట్ చేయదని బల్లగుద్ది మరీ చెప్పారు. జగన్ ఎటువంటి తప్పు చేయలేదని, నిర్దోషులను సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తుందని ఆయన ప్రశ్నిస్తూనే జగన్ ను అరెస్ట్ చేస్తే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అంబటి ప్రకటనలను కూడా సందిగ్ధత కనిపిస్తోంది. అసలు అరెస్ట్ చేయరని ఆయన ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్ట్ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం గమనార్హం. ఈ ప్రకటనల బట్టి చూస్తే జగన్ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోందని కార్యకర్తలు అంటున్నారు.