మినీ డెయిరీలకు మోకాలడ్డుతున్న బ్యాంకులు
posted on Mar 5, 2012 @ 3:22PM
హైదరాబాద్: రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచడానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేయాలనుకున్న మినీ డెయిరీల పధకం బ్యాంకుల వైఖరితో నీరుగారిపోతోంది. మార్చి నెలాఖరులోగా ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేల మినీ డెయిరీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పధకానికి రుణాలు ఇవ్వడం ద్వారా సహకరించాలని బ్యాంకులను కోరింది. అయితే కింగ్ ఫిషర్ లాంటి దివాళా కంపెనీలకు కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఈ బడుగు జీవులకు డబ్బులు విదల్చడానికి సంకోచించాయి. ఫలితంగా రాష్ట్రంలో మినీ డెయిరీ పధకం దారుణంగా విఫలమైంది. 6వేల యూనిట్లు లక్ష్యంకాగా, 600 యూనిట్లు కూడా రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. ఈ పధకం కింద ఒక్కొక్క యూనిట్ కు 5 పాడి ఆవులు, లేదా గేదెలను మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్ విలువ రెండు లక్షల రూపాయలు కాగా దీంతో 50 వేలు సబ్సిడీ ఉంటుంది. మిగిలిన లక్షా 50వేల రూపాయలను బ్యాంకులు రుణాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. తామిచ్చే లక్షా 50వేల రూపాయలకు రెండు నుంచి మూడు రెట్ల సెక్యూరిటీ చూపిస్తే రుణాలు ఇస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఆ మాత్రం సెక్యురిటీ తమ వద్ద ఉంటే బ్యాంకుల చుట్టూ రుణాలకోసం ఎందుకు తిరుగుతామని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బ్యాంకుల సహాయ నిరాకరణ కారణంగా రాష్ట్రంలో మినీ డెయిరీల పధకం దారుణంగా విఫలమైంది.