టీడీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకా కుమార్తె సునీత పోటీ?
posted on Nov 18, 2022 @ 11:14AM
కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారా? కొన్ని సంఘటనలు, కొందరి మాటలను బట్టి చూస్తే.. నిజమే కావచ్చనే అంచనాలు రాజకీయ వర్గాలు, విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులలో ఆయన నివాసంలోనే దుండగులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ హత్యతో అప్పటి సీఎం చంద్రబాబుకు ముడిపెట్టిన జగన్ రెడ్డి మీడియా ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ ఊరూవాడా గగ్గోలు పెట్టింది. అయితే.. సీబీఐ దర్యాప్తులో వివేకా హత్య కుట్ర వెనుక ప్రముఖుల హస్తం ఉందనే అంచానా వచ్చింది.
తర్వాత 2019లో జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఏర్పాటైంది. జగన్ సర్కార్ వచ్చి నాలుగేళ్లవుతున్నా.. వివేకా హత్య కేసు కొలిక్కి రాకుండా సూత్రధారులతో పాటు ‘ముఖ్య నేత’ కూడా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అంతేకాదు.. స్వయంగా వివేకా కుమార్తె సునీత అదే విధమైన అనుమానాలు వ్యక్తం చేశారు.
దివంగత వివేకానందరెడ్డి సీఎం జగన్ కు సొంత బాబాయ్. పినతండ్రి హత్య కేసులో చిక్కుముడి విప్పించాలని సోదరి అయిన సునీత స్వయంగా జగన్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, పైగా లైట్ తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జగన్.. తానే సీఎం అయ్యాక ఈ కేసును నీరుగార్చేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కొందరు బెదిరించడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడంతో విసిగిపోయిన సునీత సీబీఐ విచారణను ఏపీలో కాకుండా మరే ఇతర రాష్ట్రానికైనా బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పోరాడారు. కేసు పూర్వాపరాలు సమీక్షించిన సుప్రీంకోర్టు కేసు విచారణను మరో రాష్ట్రాన్ని బదిలీ చేయడానికి అంగీకరించింది.
తండ్రి హత్య కేసులో నిందితులెవరో.. సూత్రధారులెవరో.. తేల్చేందుకు వివేకా కుమార్తె సునీతారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. తండ్రి హత్య విషయంలో సీఎం స్థానంలో ఉన్న అన్న జగన్ నుంచి సహకారం అందకపోయినా ఆమె విశ్రమించడం లేదు. పులివెందుల గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆమె కాలికి బలపం కట్టుకుని ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ సునీతకు అనూహ్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి మద్దతు లభిస్తోంది. సునీత పోరాటానికి మద్దతుగా నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితమే నిర్ణయించారు. కొన్ని సభల్లో చంద్రబాబు సునీత పోరాటాన్ని ప్రశంసించారు. తోడ్పాటుగా ఉంటామని కూడా చెప్పారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ పేరిట చేస్తున్న జిల్లాల పర్యటనల్లో సునీతకు మద్దతు గురించి బహిరంగంగా చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఈ విషయం స్వయంగా ప్రకటించారు. సునీతకు మద్దతుగా నిలబడదామని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల సందర్భంగా వచ్చే ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుండడం విశేషం. రాజకీయంగా తన ఆగర్భ శత్రువు జగన్ ను ఢీకొట్టే ఎన్నికల వ్యూహాన్ని ఈ అపర చాణక్యుడు రచించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ పై వైఎస్ సునీతను టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే.. పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్ కు మంచి పట్టు ఉంది. అయితే.. అంతే పట్టు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డికి కూడా ఉందంటారు. ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డే ఈ విషయం చెప్పారంటారు. తండ్రి వివేకాకు ఉన్న పలుకుబడి, ఆపైన ఆయన దారుణ హత్యకు గురయ్యారనే సానుభూతి కూడా సునీత విజయానికి మార్గం వేస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారంటున్నారు. ఒకవేళ సునీత పులివెందులలో పోటీకి చేయడానికి ఒప్పుకోకపోతే.. కడప ఎంపీ స్థానంలో అయినా బరిలో దిగేలా ఒప్పించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సునీత కడప ఎంపీ స్థానంలో పోటీకి ఒప్పుకుంటే.. తన తండ్రి హత్య వెనుక ఉన్నారనుకుంటున్న వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందంటున్నారు. కడప ఎంపీ సీటు విషయంలో వచ్చిన విభేదాలే వివేకానందరెడ్డి దారుణ హత్యకు కారణం అంటారు.
సునీతారెడ్డిని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కలిశారని, ఆమెకు పులివెందుల నుంచి జగన్ పై బరిలో దింపాలనుకుంటున్నట్లు.. లేదా కడప ఎంపీ స్థానంలో పోటీ చేయించే ప్రతిపాదన గురించి చెప్పారని విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనకు సునీతను ఒప్పించేందుకు ఓ టీడీపీ ముఖ్య నేత సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు సునీత తొలుత కాస్త విముఖంగా ఉన్నా తర్వాత ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సునీత స్వయంగా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా? లేక తన ఫ్యామిలీ నుంచి మరొకరితో పోటీ చేయిస్తారా? అనేది స్పష్టం కావాల్సి ఉందంటున్నారు.
వైఎస్ సునీత టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేసినా.. కడప బరిలో దిగినా ‘వన్ షాట్ టూ బర్డ్స్’ సామెతను చంద్రబాబు మరోసారి నిరూపించినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.