రోజాకు ఉద్వాసనేనా?
posted on Nov 18, 2022 @ 11:21AM
ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆ పదవీ బాధ్యతల్లో ఎంత సమర్ధంగా పనిచేస్తున్నారన్న విషయం అంతుచిక్కని అంశంగా ఉంది. పదవీ బాధ్యతల సంగతి ఎలా ఉన్నప్పటికీ నిరంతరం మంత్రి హోదాలో ఆమె గుళ్లూ, గోపురాలు తిరగడం, తీర్థయాత్రలు చేయడం, సొంత నియోజకవర్గం నగరిలో బలమైన తన వ్యతిరేక వర్గంతో ఏదో ఒక పేచీ పెట్టుకుంటుండడం, తాజాగా జనసేన శ్రేణులను కెలికి మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. జిల్లా మొత్తంలో ఆయనకు మంచి పట్టుంది. అలాంటి జిల్లాలో తొలి నుంచి తనతో విభేదిస్తున్న రోజాకు జగన్ తన రెండో మంత్రివర్గంలో స్థానం కల్పించడం పెద్దిరెడ్డికి సుతరామూ ఇష్టం లేదంటారు. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కోటరీలో అత్యంత ముఖ్యమైన వారు అంటారు. అలాంటి పెద్దిపెద్దితో పరోక్షంగా రోజా చిన్న చిన్న విషయాలకు కూడా గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. ఆపైన వైసీపీ అధినేత వద్ద పంచాయతీగా మారుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. రోజాకు జగన్ పలుమార్లు సర్దిచెప్పినా.. ఆమె మళ్లీ మొదటికే వస్తుండడంతో ఆయనలో అసహనం పెరిగిపోతోందంటున్నారు.
నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ఇటీవల సిద్ధమయ్యారు. అయితే.. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన స్థానిక జెడ్పీటీసీ నేత ఆ భవనం ప్రారంభోత్సవానికి అడ్డుపడి రచ్చరచ్చచేశారు. ఆ భవనం నిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండగా ఎలా ప్రారంభిస్తారంటూ దానికి తాళం వేసి మరీ వెళ్లిపోయారట ఆ జెడ్పీటీసీ. పంచాయతీ భవనాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించకుండా ఎలా ప్రారంభిస్తారని జెడ్పీటీసీ నిలదీశారని అంటున్నారు.
అయితే.. రాజకీయాల్లో మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ కదా..! పోలీసుల సాయం తీసుకుని మరీ ఆ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం అయిందనిపించారు. ఒకే జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఉంటే.. ఒకరంటే మరొకరికి పడే ఛాన్స్ ఉండదు. పైగా జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల నుంచీ కూడా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు పెదద్దిక్కుగా ఉంటున్నారు. జిల్లా అంతటా ఆయనకు మంచి పరిచయాలు, అనుచరులు ఉన్నారు. పెద్దిరెడ్డిని కాదని జగన్ కూడా ఏమీ చెయ్యరంటారు.
అలాంటి పెద్దిరెడ్డితో రోజా ఢీకొనాలని చూడడం పార్టీలో కూడా చాలా మందికి నచ్చడం లేదంటారు. దాంతో పాటు నగరి నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి వర్గం ఆమకు కంటి మీద కునుకు లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మొన్నా మధ్య ఓ భవన నిర్మాణం కార్యక్రమానికి ప్రోటోకాల్ పట్టించుకోకుండా మంత్రిగా రోజాను ఆహ్వానించకుండా స్థానిక నేతలే చేశారు. రోజా ఏ కార్యక్రమం సజావుగా నిర్వహించకుండా చూస్తారు. ఆమెతో తగవు కూడా పెట్టుకుంటారు. దీంతో కంగుతిన్న రోజా ఎవరో మరో నేతతో ఫోన్ లో చాలా బాధగా మాట్లాడిన ఆడియో మీడియాలో వైరల్ అయింది.
మరో పక్కన తన నగరి నియోజకవర్గంలో స్థానిక వ్యతిరేక వర్గం నుంచి ఎదురవుతున్నాయంటూ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ వైసీపీ అధినేత ఆమె మొరను పట్టించుకోలేదు. రోజు ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తున్న రోజా అంటే జగన్ విసుగెత్తిపోతున్నారని ఆ పార్టీ వర్గాల్లోనే ఓ చర్చ అయితే జరుగుతోందని తెలుస్తోంది. మరో పక్న రోజా పనితీరుపై జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయంటున్నారు. తాజాగా జనసేన శ్రేణులతో కూడా రోజా తలపడుతున్నారు. ఇది కూడా ఆమెకు మైనస్ అంటున్నారు. ఇవన్నీ కలగలిపి రోజా మంత్రి పదవి త్వరలోనే ఊస్టింగ్ అవుతుందని పెద్దిరెడ్డి వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రోజాకు వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ కూడా వస్తుందో రాదో అనే అనుమానాలు స్థానికంగా వస్తున్నాయి.