దాడుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వైసీపీ తీరు.. జనం తిరగబడతారు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరిక
posted on Nov 18, 2022 @ 11:12AM
రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా అనిపించేలా వైసీపీ శ్రేణుల దాడులు ఉంటున్నాయి. వ్యతిరేకించే వారిపై దాడులు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై దాడు..ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా, కళమెత్తినా దాడులే అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. ఆఖరికి విపక్ష నేత, తెలుగుదేశం అధినేత పర్యటనలలో కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి.
కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్బంగా చోటుచేసుకున్న సంఘటనలు మరువక ముందే ఆయన కర్నూలు పర్యటనలో కూడా దాడులు పునరావృతమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనీ, ఎమ్మిగనూరులో రోడ్ షో సందర్బంగా సోమప్ప సర్కిల్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులే రోడ్ షోను భగ్నం చేయాలన్న ఉద్దేశంతోనే రాళ్ల దాడికి పాల్పడ్డాయంటూ తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కర్నాలూ జిల్లా పర్యటనలో అడుగడుగునా జనం బ్రహ్మరథ పడుతున్నారు. ఆయన పర్యటన, రోడ్ షోలకు జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. జగన్ సర్కార్ పై జనాగ్రహం విపక్ష నేత పర్యటనకు జనం పోటెత్తడంలో ప్రస్ఫుటంగాకనిపిస్తోంది. అసంఖ్యాకంగా తరలివచ్చిన సన సముద్రాన్ని చూసి చంద్రబాబు సైతం మరింత ఉత్సాహంతో అధికార పక్షంపై ఈటెల లాంటి మాటల విమర్శలను సంధిస్తున్నారు.
చంద్రబాబు ప్రతీ మాటకూ, ప్రతీ విమర్శకూ జనం నుంచి విశేష స్పందన వస్తోంది. దానిని చూసి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. జగన్ సర్కార్ నుంచి రాష్ట్రానికి తెలుగుదేశం అధికారంలోకి రావడం తోనే విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దుష్ట పాలనకు ఓటుతో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. సోమప్ప సర్కిల్ లో తన కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడిని ప్రస్తావిస్తూ నేరుగా ముఖ్యమంత్రినే సవాల్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రీ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది.. నా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఎక్కడికెళ్లినా దాడులకు పాల్పడుతున్నారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నీది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి నాపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నావు. ప్రజలు తిరగబడితే నేను బాధ్యుడను కాను అని హెచ్చరించారు. ‘ఈ రోడ్ షోకు వచ్చిన జనాలను చూసి వైకాపా వారి కళ్లు తిరిగాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈ జన ప్రభంజనంతో ప్రస్ఫుటమౌతోంది ’ అని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘నేను ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మీరందరూ ఆశీర్వదించాలన్నారు’ రాయలసీమలోనే మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ జనం స్వచ్ఛందంగా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు తాను రాజకీయాలలో కొనసాగాలో లేదో మీరే నిర్ణయించాలని అని అనడం ఆఖరి అవకాశం లాస్ట్ చాన్స్ అని అడగడం కాదని తెలుగు దేశం నేతలు అంటున్నారు.
రాష్ట్రం బాబుపడేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తున్నారని వివరిస్తున్నారు. కాదు మరో సారి జగన్ కే అవకాశం ఇద్దాం అనుకుంటే రాష్ట్రం వల్లకాడు అయిపోవడం ఖాయమనీ, అప్పుడు వగచినా ప్రయోజనం ఉండదనీ వల్లకాడును ఏలడానికి ముందుకు ఎవరొస్తారని వారంటున్నారు.