జగన్ ను ఎదిరిస్తా! వైఎస్ షర్మిల కార్యాచరణ
posted on Apr 10, 2021 8:59AM
ఖమ్మం సంకల్ప సభలో తన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు వైఎస్ షర్మిల. దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై8న పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. తాను తెలంగాణ బిడ్డేనని చెప్పారు. ఈ గడ్డ మీదే పుట్టాను... ఇక్కడే పెరిగానంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెడుతున్నానని షర్మిల చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎంతవరకైనా పోరాడుతానని తెలిపారు బరాబర్ ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.
పదవులు ఉన్న లేకున్నా ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు షర్మిల. సింహం సింగిల్ గానే వస్తుంది... తాను టీఆరెస్,బీజేపీ, కాంగ్రెస్ లకు గురిపెట్టిన ప్రజల బాణంగా వస్తున్నానని తెలిపారు. ఎవరో చెప్తే పార్టీ పెట్టలేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. తెలంగాణ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తుతాని షర్మిల స్పష్టం చేశారు. మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా.. తెలంగాణ కు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకోసం నేను నిలబడుతా, నేను కొట్లాడుతా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ పోరాడుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. పంచ్ డైలాగులు, ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మగౌరవం దొర చెప్పుకింద పడి నలిగిపోతోంది. నీళ్లన్నీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే.. నిధులు కూడా వారికే నియామకాలు కూడా కేసీఆర్ కుటుంబానికే ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు’’ అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. బంగారు తెలంగాణ సాధ్యమైందా అని నిలదీశారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రం బానిసైందా? అనిప్రశ్నించారు. దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి.. లేదా నోరు మూసుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు ఒకలా.. తర్వాత మరోలా మారిపోతారని దుయ్యబట్టారు.
సాగు ప్రాజెక్టుల్లో కేసీఆర్ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు షర్మిల. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడానికి తన పార్టీ అవసరమన్నారు. రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. దొర చెప్పుకింద తెలంగాణ నలిగిపోతుందన్నారు షర్మిల.
కేసీఆర్ హయాంలో పెన్షన్లు లేవని, కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అని షర్మిల ప్రశ్నించారు. నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్ మాత్రం నిలదీయదని ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదన్నారు. ఎవరు ఏమన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని షర్మిల మరోసారి స్పష్టం చేశారు.