క్రాకర్స్ తో అలంకరించి కారును కాల్చేశాడు!
posted on Oct 25, 2022 @ 9:53AM
పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి.. ఎవడి పిచ్చి వాడికి ఆనందం.. పిచ్చి పీక్స్.. అంటే.. ఇదే కాబోలు.. అని అనకుండా ఉండలేరు. దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇదేం తిక్కరా నాయనా, వీడెవడండి బాబూ అని అనుకునేలా చేసింది.
అందరిలా మనం కూడా బాణాసంచా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడో మరో కారణమో కానీ.. డిఫరెంట్‌గా థింక్ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్ చేశాడు.
దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు వరసగా పేర్చాడు. ఆ తర్వాత బాంబులను పేల్చాడు. దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా క్రాకర్స్ శబ్ధంతో మారుమోగిపోయింది.
బాంబులు పేలడంతో కారు కలర్ మొత్తం మారిపోయింది. పేలిన టపాసుల ధాటికి కారు గ్లాస్ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజిన్ పని చేయడం విశేషం. కాసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.