మూడు రాజధానులకు జనామోదం లేదని చెబుతూనే ఎందుకీ జులుం?
posted on Oct 25, 2022 @ 10:26AM
మూడు రాజధానులకు జనం ఆమోదం లేదని వైసీపీకి కూడా అర్ధమైపోయిందా? అందుకే ఉత్తరాంధ్ర మంత్రులలో అసహనం పీక్స్ కు చేరుకుందా? ధర్మాన మాటలు వింటుంటే ఔననే సమాధానం వస్తోంది. ధర్మన ఇటీవలి కాలంలో తరచుగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదని విశాఖ వాసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వని వారంతా విశాఖ ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు అంటూ వమర్శలు గుప్పిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ఎందుకివ్వరని కన్నెర్ర చేస్తున్నారు. అయితే మొత్తం మీద విశాఖ రాజధాని అంటే విశాఖ ప్రజలే అంగీకరించడం లేదని ధర్మాన తన చేష్టల ద్వారా పదే పదే రుజువు చేస్తున్నారు.
రోజూ విశాఖ రాజధానిని జనం ఇష్టపడటం లేదనే మాటే చెబుతున్నారు. విశాఖ రాజధానికి మద్దతు కోసం ఏర్పాటు చేసిన సభలో విశాఖ రాజధాని కోసం చేతులెత్తమని అడిగితే ఒక్కరూ ఎత్తలేదు. దీంతో వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులేనని చిటపటలాడారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆయనకు విశాఖకు అనుకూలంగా స్పందన కనిపించలేదు. దాంతో మళ్లీ కన్నెర్ర చేశారు. విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర వాసులు నోరెందుకు విప్పడం లేదని ఆయన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు.
అయితే ధర్మాన విశాఖ రాజధాని పల్లవి ఎందుకు ఎత్తుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కనుక ఆయన చిటపటలకు, కోపానికి ఎవరూ బెదరడం లేదు. ఆయన మాటలకు తందాన అనడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఏపీకి రాజధానిని నిర్ణయించే సమయంలో అమరావతే రాజధాని అని ఏకగ్రీవంగా సర్వామోదం తెలిపారు. అప్పట్లో అమరావతికి వ్యతిరేకంగా ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. ఇప్పుడు వైసీపీ స్వరం మార్చినంత మాత్రాన ప్రజలు కూడా మారతారని, మారి తీరాలని ఎందుకు అంటున్నారో.. వారికే అర్ధం కాని పరిస్థితి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో ధర్మాన వాస్తవాలు వాగేస్తున్నారు.. విశాఖ వాసులపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఓ వెలుగువెలిగారు.
అయితే వైఎస్ తనయుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. తొలి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా ఆయన సోదరుడికి ఆమాత్యపదవి లభించింది. సరే కంటి తుడుపు చర్యగా మలి కేబినెట్ లో ధర్మాన క్రిష్ట ప్రసాద్ కు ఉద్వాసన పలికి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు జగన్. అయితే.. గతంలో ధర్మాన కూడా అమరావతికే మద్దతు తెలిపారు. అలా మద్దతు తెలిపినందునే రైతులంతా భరోసాతో భూములిచ్చారు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత .. భూ దందాల కోసం… తాము కబ్జా చేసిన భూములను రక్షించుకోవడం కోసం విశాఖ రాజధాని అని తాము అంటే జనం కూడా తమ మాటకు వంత పాడాలని ధర్మాన జులుం చేస్తున్నారు.