విరాట్ అద్భుత ఇన్నింగ్స్ పై అనుష్క లవ్లీ రియాక్షన్
posted on Oct 25, 2022 7:31AM
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం అందించిన విరాట్ కోహ్లీని క్రికెట్ ప్రపంచం మొత్తం పొగడ్తల వర్షంలో ముంచెత్తుతోంది. అయితే విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త అద్భుత ఇన్నింగ్స్ పై చేసిన ఒక ఎమోషనల్ పోస్టు క్రీఢాభిమానులు, సినీ అభిమానులనే కాకుండా అందరినీ ఆకర్షిస్తోంది. అనుష్క శర్మ తన భర్తపై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం తానెలా ఎమోషనల్ అయ్యానో చెబుతూ ఇస్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అందుకు విరాట్ ఇచ్చిన సమాధానం కూడా నెటిజన్ల మనసు దోచుకుంది.
పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించిన ‘ఛేజింగ్ కింగ్’ విరాట్ కోహ్లీపై దిగ్గజ ఆటగాళ్లు, రాజకీయ, సినీ, పారిశ్రామిక, ఇతర రంగాల ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. 90 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన మెల్‌బోర్న్ స్టేడియం ‘విరాట్ కోహ్లీ.. ఇండియా.. ఇండియా’ నినాదాలతో హోరెత్తింది. తర్వాత దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ పోరును ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా టీవీల్లో, కంప్యూటర్ తెరలపై వీక్షించిన కోట్లాది మందిలో విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఉంది. మ్యాచ్ తర్వాత ఆమె
‘ నువ్వొక అద్భుతం. నువ్వు ఇవాళ దీపావళి కంటే ముందే చాలా మంది జీవితాల్లో ఎంతో వెలుగుల సంతోషం నింపావు. నువ్వొక వండర్‌పుల్ మ్యాన్‌వి... నీ ధైర్యం, సంకల్పం, నమ్మకం అపూర్వం’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ పోస్టులో
తన జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ను ఇప్పుడే చూశాననీ, మ్యాచ్ తర్వాత ఆనందంతో డాన్స్ చేశాననీ, అరిచాననీ పేర్కొంటూ, తానెందుకు అలా అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానో అర్ధం చేసుకునే వయస్సు ఇంకా తమ కుమార్తెకు లేకపోయినా, తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఏదో ఒక రోజు తను తప్పకుండా తెలుసుకుని గర్వపడుతుందనీ పేర్కొంది. కెరీర్‌లో ఒక టఫ్ దశను ఎదుర్కొని మునుపెన్నడూ లేనంత బలంగా తిరిగొచ్చి చేసిన నీ ప్రదర్శన నాకెంతో గర్వంగా ఉంది
నీ ధైర్యం స్ఫూర్తిదాయకం. నీపై నా ప్రేమ అపరిమితం. నీ కష్టాల్లో, విజయాల్లో.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అన పేర్కొంది. ఆ పోస్టు వెంటనే వైరల్ అయ్యింది. లక్షల మంది లైక్ చేశారు. భార్య ప్రేమ పూర్వక అభినందనకు కోహ్లీ స్పందించి తీరు కూడా నెటిజన్ల మనసు దోచుకుంది. థాంక్యూ మై లవ్. ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో నాకు మద్దతుగా నిలిచావు. ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్ అండ్ లవ్ యూ సో మచ్ అంటూ కోహ్లీ చేసిన పోస్టు కూడా క్షణాల్లో వైరల్ అయ్యింది.