ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో బ్రేక్‌ఫాస్ట్ : సీఎం రేవంత్ రెడ్డి

 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వైఐఐఆర్‌ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేన‌న్నారు. ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు స్కూల్స్ కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాల‌న్నారు. 

విద్యా శాఖ‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో  ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేప‌ట్టే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. 

త‌గినంత స్థ‌లం, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తే ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని అక్ష‌య‌పాత్ర ప్ర‌తినిధులు సీఎంకు తెలియ‌జేశారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థ‌లం కేటాయింపు లేదా 99 సంవ‌త్స‌రాల‌కు లీజు  తీసుకునే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు ముఖ్య‌మంత్రి సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

బాచుప‌ల్లి పాఠ‌శాల స్థ‌లం కేవ‌లం అర ఎక‌రం మాత్ర‌మే ఉండ‌డంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎక్క‌డైనా పాఠ‌శాల‌కు క‌నీసం ఎక‌రంన్న‌ర స్థ‌లం ఉండాల‌ని, బాచుపల్లి ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లం స‌మీపంలో ఎక‌రంన్న‌ర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాల‌ని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆయన సూచించారు.

 పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాల‌ని  ఆదేశించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న ఉండాల‌ని సీఎం అన్నారు. 

ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్‌ మొలుగారం కుమార్‌, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ వి.ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌.సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.
  
 

కివీస్ పై టీమ్ ఇండియా విజయం.. కోహ్లీ వరల్డ్ రికార్డ్

న్యూజీలాండ్​తో   మూడు వన్డేల సిరీస్​లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఎవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి  300 పరుగులు చేసింది. 301 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన చేపట్టిన టీమ్ ఇండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే   లక్ష్యాన్ని ఛేదించింది.  ఛేదనలో తనకు ఎదురే లేదని కింగ్ విరాట్ కోహ్లీ మరో సారి నిరూపించుకున్నాడు. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగులు చేసి జట్టు స్కోరు   39 వద్ద ఉండగా ఔటయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, స్కిప్పర్ శుభమన్ గిల్ తో కలిసి రెండో వికెట్​కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో   గిల్​ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. కోహ్లీ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 93 పరుగులు చేసి ఔటయ్యాడు.   కోహ్లీ తృటిలో సెంచరీ మిస్సయినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అత్యంత వేగంగా 28వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి బ్యాటర్​గా రికార్డులకెక్కాడు.  అంతేకాకుండా మొత్తంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో మాస్టర్​ సచిన్​ టెండుల్కర్​ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.  

పురుషుల పొంగళ వేడుక.. ఎక్కడంటే?

ఆలయాల్లో జాతర్లు, తిరునాళ్లు జరిగితే,  మహిళలు పొంగళ్ళు పెట్టడం సాంప్రదాయం. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి కడప జిల్లాలోని ఒక ఆలయంలో వింత ఆచారం అమలులో ఉంది. ఆ ఆలయంలో పురుషులు పొంగళ్లు పెడతారు.   ఔను ఇక్కడి ఆచారం ప్రకారం ప్రతి ఏటా   సంక్రాంతికి ముందు సంజీవరాయ స్వామికి మగవాళ్ళు పొంగళ్ళు పెట్టి మొక్కలు తీర్చుకుంటారు. మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు. ఆలయంలో పెట్టిన నైవేద్యం కూడా మహిళలు ముట్టుకోరు. మగవాళ్ళేతింటారు.  ఉమ్మడి కడప జిల్లా  పుల్లంపేట మండలం తిప్పారు పల్లెలో ఈ  ఆచారం ఉంది.  ప్రస్తుతం ఈ పుల్లంపేట తిప్పారుపల్లె గ్రామం తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ మగవారి పొంగళ్ల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఆచారం ప్రకారం శ్రీ సంజీవరాయ స్వామికి మగవారే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొంగళ్ళు పెట్టారు. ఈ  పురుషుల  పొంగళ్ల వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం   సంజీవరాయునికి పొంగళ్లు పండుగను   సంక్రాంతి కంటే  ఘనంగా జరుపుకొంటారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. 

కన్నుల పండువగా గండికోట శోభాయాత్ర

గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం (జనవరి 11) శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.   గండికోట చారిత్రక, సాంస్కృతిక,  కళా వైభభం ఉట్టిపడేలా సాగిన ఈ శోభాయాత్రతో న్ని ఉట్టిపడేలా కన్నుల పండువగా అత్యంత వైభంగా ఉత్సవ వాతావరణంలో సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులు పాల్గొన్నారు. గ్రాండ్ కేన్వాస్ న్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన గండి కోట ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్  వచ్చే రెండు సంవత్సరాలలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతామన్నారు.  గండికోట మరింత అభివృద్ధి చెందడానికీ,  యునెస్కో ద్వారా గుర్తింపు రావడానికి స్థానికుల సహకారం అవసరమన్నారు.   ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌.సవితఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్‌పి నచికేతన్‌ విశ్వనాథ్‌, ప్రముఖ రచయితలు తవ్వా ఓబుల్‌రెడ్డి,   సుధారాణి తదితరులు పాల్గొన్ని ప్రసంగించారు. విశిష్ఠ అతిథిగా పాల్గొన్న గేయ రచయత    జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గండికోట గేయాలాపన చేశారు. 

షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్  ఐటీ, విద్యాశాఖ  మంత్రి నారా లోకేశ్ సతీ సమేతంగా  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీ చేరుకున్నారు.ఆయన సోమవారం (జనవరి 12) ఉదయం షిరిడీ సాయినాథుని దర్శించుకోనున్నారు. కాగా ఆదివారం (జనవరి 11) షిరిడీ చేరుకున్న  లోకేశ్ దంపతులకు   విమానాశ్రయంలో  కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. సోమవారం (జనవరి 12) ఉదయం జరిగే కాకడ హారతి సేవలో లోకేశ్, బ్రహ్మణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.  

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పవన్‌కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకకూ ఎవరూ అందుకోనటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐదవ డాన్‌ను ప్రదానం చేసింది. అంతే కాకుండా ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ.. పవన్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు .. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు.. ఎలా ఎదిగారు లాంటివన్నీ ఆ వీడియోలో పొందుపరిచారు.  డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించారు. మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యకు తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా గత ఏడాది డిసెంబర్ 30న ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు  అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న మొట్ట మొదటి భారతీయుడు పవన్ కళ్యాణ్.  . సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా ఐదవ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు.  ఈ వార్త తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తొలి వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే?

  భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు కాన్వే (56), నికోల్స్ (62) రన్స్ చేశారు.  డారిల్ మిచెల్ (84) అద్భుత ఇన్నింగ్స్‌ అందించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.  ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించినా, బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీశారు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత హెన్రీ నికోల్స్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా, కాసేపటికే కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.

సినిమా టికెట్ల రేట్లు పెంపు సీపీఐ నారాయణ ఫైర్

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ,   హోం మంత్రి అమిత్ షా ప్రశంసల కోసమే పవన్ సనాతన ధర్మం అంటూ వేషం మార్చారని విమర్శించారు. వ్యక్తిగతంగా పవన్ సనాతన ధర్మం వ్యతిరేకి. సనాతన ధర్మంలో విడాకులు ఉండవు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటం మన దురదృష్టమని  నారాయణ ఆరొపణలు చేశారు. మరోవైపు సినిమా టికెట్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ మాఫియా, ప్రభుత్వాలు ప్రజలను లూటీ చేస్తున్నాయి.  సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ది లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారు.  మూవీ చూసేందుకు ప్రజలు వెళ్తే వాటర్ బాటిల్, బిస్కెట్లు కూడా తీసుకెళ్లనివ్వరు అని ఆరోపించారు. ఇదిలా ఉంటే కొత్త సినిమాల విడుదలకు ముందు బెనిఫిట్ షోలతో పాటు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టికెట్ ధరలు అయితే వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ధరలు పెంచవద్దని తెలుగు రాష్ట్రాలకు నారాయణ విజ్ఞప్తి చేశారు.  

విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

  విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు... ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది.  సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా,  కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు.  అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

జగన్‌కు రైతుల స్ట్రాంగ్ కౌంటర్

  వైసీపీ అధ్యక్షుడ జగన్‌పై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ స్ట్రాంగ్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి పనులు జరుగున్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.  ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ అనడం సమంజసమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం (11-1-26) ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి స్మశానం, ఎడారి అన్నారని.. అందుకనే ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారనన్నారు.  రాజ్యంగానికి భిన్నంగా జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నందుకు జగన్‌పై వెంటనే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణం కూడా అమరావతి ఉద్యమమేనని స్పష్టం చేశారు. జగన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు. జగన్‌కు ధైర్యం ఉంటే 11 మందితో కలిసి అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అధికార పక్షం తప్పులుంటే జగన్ అండ్ కో ఎత్తి చూపాలని సూచించారు.  గత ఐదేళ్లు జగన్ ఎక్కడ ఉండి పరిపాలన చేశారని నిలదీశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందని ప్రస్తావించారు. 2015లోనే అమరావతిపై గ్రీన్ ట్రైబ్యునల్‌లో జగన్ కేసు వేయించారని గుర్తు చేశారు. అమరావతికి గ్రీన్ ట్రిబ్యునల్ క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపారు. అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్‌పై తమకు వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కూడా అమరావతిలోనే ఉంటున్నారని ప్రస్తావించారు.  జగన్ ఇలానే నడుచుకుంటే రాజకీయ సమాధి కట్టడానికి రాజధాని మహిళలు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. జగన్‌ని మోసపు రెడ్డి అని అనొచ్చని ఎద్దేవా చేశారు. జగన్ బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్నారని విమర్శించారు. జగన్ సగం సగం మాట్లాడతారని, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. సో కాల్డ్ అనే పదం జగన్ మానుకోవాలని.. లేదంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమరావతి పేరు చెప్పడానికే కూడా జగన్ ఇష్టపడడం లేదని వారు మండిపడ్డారు.  

బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

  విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయ కృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు.  తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు.  కృష్ణని చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని,  విజయవాడ నడిబొడ్డులో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు కృష్ణ పేరు నిలిచి ఉంటుందన్నారు. కృష్ణతో ప్రతి ఒక్క హీరోకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. మూవీ పోస్టర్‌ను చూసి ఆయా సినిమాలకు వెళ్లామంటే అది ఒక కృష్ణకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హీరో కృష్ణను మించిన సూపర్ స్టార్ మరొకరు ఉండరని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.  అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని ప్రశంసించారు. మూడో తరం వారసుడిగా రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్‌లో జై కృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నటుడు మహేశ్‌బాబు లాగే.. కృష్ణ మనువడు జై కృష్ణ కూడా సూపర్ స్టార్ తరహాలో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగిందని గుర్తుచేశారు. ఈనాడు సినిమా ద్వారా కృష్ణ రాష్ట్ర రాజకీయాల చరిత్రనే మార్చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.