పవన్, అంబటి, రేణూ దేశాయ్.. తెగే వరకూ లాగితే వైసీపీకి మూల్యం తప్పదు!
posted on Aug 11, 2023 @ 4:55PM
ఏపీలో ఇప్పుడున్న పొలిటికల్ హ్యపెనింగ్స్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని, ఆ పాత్రలో నటించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన డాన్స్ గతంలో సంక్రాంతి సంబరాల్లో మంత్రి రాంబాబు చేసిన డాన్సును పోలి ఉందన్నది ఆరోపణ. ముందుగా బ్రో సినిమాలో డాన్స్ క్లిప్పులు సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో మీడియా ముందుకొచ్చిన అంబటి రాంబాబు నాటి నుంచి నేటి వరకూ నుండి ఈ విషయంపై ఇప్పటికే నాలుగైదు మీడియా సమావేశాలు పెట్టి మరీ తీవ్రంగా మండిపడ్డారు.
బ్రో సినిమా కలెక్షన్ల నుండి పవన్ కళ్యాణ్ సినిమాకు తీసుకొనే రెమ్యునరేషన్ వరకూ ఎన్ని మాట్లాడాలో అన్నీ మాట్లాడారు. మరికొందరు వైసీపీ నేతలు కూడా తోడై పవన్ కళ్యాణ్ ను విమర్శించడమే ఒక ఉద్యమంలా పెట్టుకున్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉన్న అంబటి బ్రో సినిమా మీదనే మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ పై విమర్శల యుద్ధమే చేసినా చల్లబడని అంబటి.. ఏకంగా పవన్ కళ్యాణ్ మీద నాలుగైదు సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తానని కూడా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ సీన్ లోకి వచ్చారు. ఇటీవల బ్రో సన్నివేశాల వల్ల వివాదం చెలరేగిందని, దీని వల్ల పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, పిల్లలు సహా వ్యక్తిగత విషయాలపై సినిమా తీస్తామని కొందరు అంటున్నారని రేణు దేశాయ్ చెప్పారు. ఒక తల్లిగా తాను రిక్వెస్ట్ చేస్తున్నానని, రాజకీయంగా.. వృత్తిపరంగా ఏ విషయాల్లోనైనా పిల్లలను మాత్రం అందులోకి లాగొద్దని ఆమె అన్నారు. ఫిల్మ్ ఫ్యామిలీలో పిల్లలు పుట్టారు.. వాళ్ల తండ్రి (పవన్ కల్యాణ్) రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పిల్లలు అయినందున వారిపై దృష్టి ఉంటుంది. కానీ వారు ఇంకా పిల్లలు. రాజకీయాలతో వారికి ఏం సంబంధం, అందుకే ఒక తల్లిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్, సపోర్టర్స్ ఎవరైనా పిల్లలను ఈ విషయాల్లోకి లాగొద్దు. నా పిల్లలనే కాదు.. ఏ రాజకీయ నాయకుడి పిల్లలైనా, యాక్టర్ పిల్లలైనా వారిని ఇలాంటి విషయాల్లో లాగొద్దు అని రేణు దేశాయ్ కోరారు.
ఇక, రాజకీయ, సామాజిక విషయాల్లో మొదటి నుంచి పవన్ కల్యాణ్‍కు తాను మద్దతునిస్తూనే ఉన్నానని విస్పష్టంగా పేర్కొన్న రేణూ దేశాయ్, ఆయన సమాజానికి మంచి చేసేందుకే పని చేస్తున్నారని తాను నమ్ముతున్నాననన్నారు. సమాజానికి మంచి చేసేందుకే ఆయన పని చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన మనీ మైండెడ్ కాదు. ఆయనకు డబ్బు అంటే ఆసక్తి లేదు. ఎప్పుడూ సమాజానికి మంచి చేయాలని అనుకుంటుంటారు అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి రాజకీయంగా పవన్‍కు సపోర్ట్ చేశానని, చేస్తూనే ఉంటానని కూడా రేణు దేశాయ్ స్పష్టం చేశారు. రేణూ దేశాయ్ వ్యాఖ్యలపై కూడా స్పందించిన మంత్రి అంబటి.. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది.
నిజానికి అంబటి రాంబాబు ఈ వ్యవహారంలో అవసరానికి మించి స్పందిస్తున్నారు. బ్రో సినిమాలో పృథ్వీ డాన్స్ కామెడీగా ఉందే తప్ప కించపరిచినట్లు లేదు. పోనీ ఒకవేళ తనకి బాధ అనిపిస్తే ఒకసారి మీడియా ముఖంగా నాలుగు విమర్శలు చేసి వదిలేయాల్సింది. కానీ, మంత్రిగా తన బాధ్యతల మీద కంటే బ్రో సినిమా కలెక్షన్లు, పవన్ పారితోషకం లెక్కలు చెప్పడం మంత్రిగా ఆయన స్థాయికి తగదు. ఆ విషయం జనానికి కూడా అర్ధమౌతుంది. అంబటి సినిమా థియేటర్లో టికెట్లు అమ్ముతున్నాడా అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. పైగా అదేదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు ఏకంగా సినిమాలు, సిరీస్ లు తీస్తానని చెప్పడంతో ఆయనపై ట్రోల్స్ మరింత జోరందుకుంటున్నాయి.
ఇక ఇప్పుడు రేణుదేశాయ్ స్పందనకు కూడా ఆదరాబాదరాగా రిప్లై ఇవ్వడంపై కూడా నెటిజన్లకు సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలకి సత్వర ప్రతిస్పందన ఉండదు, ఆయన శాఖకు సంబంధించి విపక్ష నేత సూటి ప్రశ్నలు గుప్పిస్తుంటే నోరు పెగలదు కానీ.. సినిమాలు, టికెట్ల గురించి మాట్లాడడానికి, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గంటల తరబడి ప్రసంగాలు చేయడానికీ మాత్రం ఎక్కడ లేని తీరికా ఉంటుందా అంటూ నిలదీస్తున్నారు. మంత్రి పదవిలో ఉండి తన శాఖ గురించి ప్రెస్ మీట్ లో పది నిముషాలు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేని మంత్రి అంబటి.. అంటూ ఫైరౌతున్నారు. రాజకీయాలు వ్యక్తిగతంగానే పరిమితం కావాలి కానీ కుటుంబాల జోలికి వద్దని చెప్పిన రేణు దేశాయ్ మద్దతు పెరుగుతున్నది. ఆమె అడిగిన దానిలో న్యాయం ఉందని.. అంబటి దానికి కూడా వెటకారంగా స్పందించి తన స్థాయిని తానే మరింత దిగజార్చుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతటితో అయినా ఈ వ్యవరాహాన్ని వైసీపీ నేతలు వదిలేస్తే మంచిది. లేకపోతే వైసీపీకి మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.