ధీమా తగ్గింది.. స్వరం మారింది.. బేలతనం బైటపడింది!
posted on Aug 11, 2023 @ 5:20PM
నాలుగేళ్లలో మన ప్రభుత్వ పాలన చూడండి.. మళ్ళీ ఓటేయాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఈసారి గట్టిగా కొడతాం.. 175కి 175 కొడదాం. అందరూ కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు.. ఇవీ నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చిన మాటలు.. ప్రగల్భాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను.. ఎక్కడ వీలయితే అక్కడ వ్యక్తిగతంగా దూషణల పర్వానికి దిగడం, ముసలోడు, పనైపోయిందని చంద్రబాబును ఎగతాళి చేయడం.. పవన్ పెళ్లిళ్లపై కామెంట్లు చేయడంతో ఈ మధ్య వరకూ సీఎం జగన్ సభలు సాగిపోయేవి. కానీ, ఇప్పుడు జగన్ టోన్ మారింది. మాటలలో ధీమా పోయి, బేలతనం బయటపడుతోంది. నిన్న మొన్నటి వరకూ గట్టిగా కొడదాం అన్న ఆ నోటి నుండే ఇప్పుడు వాళ్లంతా కలిసి నన్ను కొడతా అంటున్నారు.. మీరే నన్ను ఆదుకోండని ప్రజలను వేడుకుంటున్నారు. నా పాలన చూసి మరోసారి నాకు ఓట్లేయండని కోరిన జగన్.. ఇప్పుడు టీడీపీకి అధికారం వస్తే తనను చంపేస్తారని వాపోతున్నారు.
శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమంతో సున్నా వడ్డీ కింద ఎన్ని నిధులు విడుదల చేస్తున్నారో కానీ.. ఈ సభకు మాత్రం కోట్లలోనే ఖర్చు పెట్టారని ఆ ఏర్పాట్లూ, హంగామా చూస్తే అర్ధమౌతుంది. బటన్ నొక్కి జగన్ ఎంత విడుదల చేశారో కానీ.. ఈ కార్యక్రమం పబ్లిసిటీకి మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని విమర్శించారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు.
అయితే, ఆ మాటలు చెప్పిన అదే సభలో జగన్ తన గొంతు మార్చి మాట్లాడారు. ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే తనను మట్టుబెడతానంటున్నారని గొంతు తగ్గించి గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ముగ్గురూ (చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్) ఒక్కో చోట సభలు నిర్వహించారని.. అధికారం ఇస్తే ఎవరినీ వదలమంటూ హెచ్చరిస్తున్నారని.. అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. గిట్టని వారిని మట్టు బెడతామంటున్నారని, అందుకే వాళ్ళు అధికారం కోరుకుంటున్నారనీ.. ఏకంగా తనకు నరకాన్ని చూపిస్తామంటున్నారని తనదైన శైలిలో హావభావాలను పలికించారు. ప్రతిపక్షాలు ప్రజలను బెదిరిస్తున్నాయని చెప్తూనే.. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రజలకు దీన వదనంతో చెప్పుకున్నారు. దీంతో సహజంగానే జగన్ అమలాపురం ప్రసంగం మరోసారి విస్తృత చర్చకు దారి తీసింది.
జగన్ అమలాపురం ప్రసంగాన్ని చూస్తే మరోసారి జగన్నాటకం మొదలైపోయిందా అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. సానుభూతి డ్రామాను పలికించడంలో జగన్ కు జగనే సాటి. తన తండ్రి వైఎస్ మరణం నుండి వివేకా మరణం వరకూ.. తన అవినీతి కేసుల నుండి కోడికత్తి కేసు వరకూ కాదేదీ సానుభూతికి అనర్హం అన్నట్లుగా అన్నిటినీ తనకు అనుకూలంగా మలచుకోవడంలో జగన్ మార్క్ జగన్ కి ఉంది. ఇప్పుడు ఇది కాస్తా ఆయన ప్రసంగాలలోకి వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకూ గంభీరాలు పోయిన ఆయన గొంతు ఒక్కసారిగా డౌన్ అయి వేడికోళ్లకు, అభ్యర్థనలకు దిగిపోయింది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రజలకు మోర పెట్టుకొనే పరిస్థితికి వచ్చిందంటే ఇది సానుభూతి డ్రామా కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే గతంలో ఆయనకు సానుభూతి వర్కౌట్ కావడానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉండటమే కారణం. ఇప్పుడు ఆయనదే అధికారం. నాలుగేళ్లుగా అధికారం చెలాయిస్తున్నారు.
పైగా ఈ నాలుగేళ్లలో ఆయన తన విధానాలను వ్యతిరేకించిన ఎందరికి ఎలా నరకం చూపించారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. కరోనా సమయంలో వైద్యులకు మాస్కులు ఇవ్వాలన్నందుకు డాక్టర్ ను పిచ్చివాడిగా ముద్ర వేసి నడిరోడ్డుపై పోలీసుల చేత కొట్టించారు. ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అచ్చెంనాయుడిని ఇంటి నుంచి బలవంతంగా తీసుకువచ్చి వేల మైళ్లు తిప్పారు. తన విధానాలను విమర్శించిన పాపానికి సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు ఎన్ని రకాలుగా వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. అటువంటి జగన్ ఇప్పుడు అధికారం దూరమౌతున్న సంకేతాలు వచ్చాయనేసరికి సానుభూతి డ్రామాకు తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి సరికొత్త పాత్ర డ్రామా వైసీపీకి ఏమేరకైనా కలిసొస్తుందేమో చూడాలి!