డల్లాస్ లో వైసీపీ ఎన్నారైల కుమ్ములాట అమెరికా వెళ్లినా తీరు మారలే!
posted on Jul 3, 2023 @ 11:10PM
ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల నిర్వహణకు ఇంకా పది నెలల సమయం ఉన్నా రాజకీయ పార్టీల పరంగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజల మధ్యకు వెళ్లడంతో రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో అధికార వైసీపీ మరోసారి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సోషల్ మీడియా విభాగాన్ని మరింతగా బలీయం చేసుకుంటోంది. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా విభాగాన్ని సిద్ధం చేస్తున్నది. వైసీపీ సోషల్ మీడియా విభాగం సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భార్గవ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా అమెరికాలో పర్యటిస్తున్నారు.
వైసీపీ అమెరికా విభాగం ఆధ్వరంలో పార్టీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ జులై 1న డల్లాస్లో నాటా కన్వెన్షన్ సెంటర్ వద్ద సోషల్ మీడియా కార్యక్రమం నిర్వహించారు. జులై 8న కూడా వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్ వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో పాటు వైఎస్సార్ జయంతి వేడుకలు కూడా నిర్వహించనున్నారు. అమెరికా వైసీపీ విభాగాన్ని నేరుగా కలవడంతో పాటు సోషల్ మీడియాను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ కార్యక్రమం కాస్త రసాబాసగా మారింది. డల్లాస్ లో సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎన్నారై సభ్యుల మధ్య గొడవ ముదిరి పిడిగుద్దులు వరకు వెళ్ళింది. ఒకరిపై మరొకరు దాడులకు తెగబడి చితగ్గొట్టుకున్నారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతున్నాయి.
వైసీపీ ఎన్నారైలలో ఎప్పటి నుండో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోయిన ఈ ఎన్నారై విభాగం ప్రతి కార్యక్రమంలో ఈ వివాదాలను రచ్చకీడుస్తున్నాయి. అయితే, ఈసారి అది ఇంకాస్త శృతి మించి కొట్లాటకు దారి తీసింది. జులై 1న డల్లాస్ నాటా కన్వెన్షన్ సెంటర్ వద్ద నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమం అనంతరం సభ్యుల మధ్య గొడవ మొదలైంది. వైసీపీ ఎన్నారై రెండు వర్గాలలోని ఒక వర్గం కార్యక్రమం నిర్వహించిన సజ్జల భార్గవ్ పేరు కాకుండా మరో యువనాయకుడి పేరుతో స్లొగన్స్ ఇచ్చారు. దీంతో సజ్జల వర్గం ఆ వర్గం సభ్యులతో వివాదానికి దిగింది. మరో నాయకుడి స్లొగన్స్ ఇచ్చిన ఆ సభ్యులపై సజ్జల వర్గం సభ్యులు దాడి చేశారు. మొత్తంగా ఒకరిపై మరోకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. కాస్త ఆలస్యంగా ఈ వివాదం వెలుగులోకి రాగా.. తెలుగు ఎన్నారై సోషల్ మీడియా ఖాతాలలో ఇప్పుడు ఈ వివాదాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
వైసీపీ ఎన్నారైల మధ్య ఈ కొట్లాటతో అమెరికాలో తెలుగు వారి పరువు బజారున పడింది. అమెరికా వెళ్లినా రౌడీయిజం మానుకొని వైసీపీ సభ్యులు నాటా లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ కన్వెన్షన్ సెంటర్ ముందే పిడిగుద్దులు గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ రోడ్ల మీద దొర్లుతూ కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఖండాలు దాటినా వైసీపీ మాత్రం తన సంస్కృతిని వీడలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగే రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నేతలు.. అమెరికా వంటి విదేశాలలో కూడా తమ సంస్కృతి ఇదే అంటూ చాటి చెబుతున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఆ పార్టీ వారసత్వం అలాంటిది కనుకే యువనేతలు సైతం ఆ కల్చర్ కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.