రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
posted on Jul 3, 2023 @ 11:06PM
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం న్యూఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. ఆ క్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి కానీ, ప్లోర్ లీడర్ కానీ, జాతీయ అధికార ప్రతినిధి పదవి కానీ ఇవ్వలని కమలం పార్టీ అధిష్టాన్ని కోరారు. పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని.. తానేందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ఆయన ప్రశ్నించారు. అయితే కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే రెండోసారి కూడా దుబ్బాక నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేయలేదని.. అలాగే తనకు ఎవరు సాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా.. బీజేపీ గెలవలేదని.. సొంతంగానే తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా రఘునందన్ రావు గుర్తు చేశారు. అదే 100 కోట్ల రూపాయిలు తనకు ఇస్తే.. తెలంగాణ దున్నేసేవాడినన్నారు.
దుబ్బాకలో తనను చూసి గెలిపించారని.. అంతేకాని బీజేపీ చూసి కాదన్నారు. తాను బీజేపీ అభ్యర్థిగా ఈ నియోజకర్గం నుంచి గెలవక ముందు.. జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే కేవలం 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్‌కు వందకోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని రఘునందన్ రావు ప్రశ్నించారు.
పార్టీ డబ్బులో తనకు వాటా ఉందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బండి సంజయ్ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలేనన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎవరు ఎక్కువ కష్టపడలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే పేపర్ ప్రకటనల్లో తరుణ్ చూగ్, సునీల్ బాన్సల్ బొమ్మలు కాదు.. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీకి శాసనసభపక్ష నేత లేడనే విషయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం తెలియదని.. ఆ విషయమై ఆయన్ని ప్రశ్నిస్తే అదేంటి అంటూ నడ్డా తనని అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల బీజేపీలోకి వచ్చారన్నారు.