కాంగ్రెస్ + బీఆర్ఎస్.. బీఆర్ఎస్ + బీజేపీ.. ఏంటీ ఈక్వేషన్స్?!
posted on Jul 4, 2023 6:37AM
కాంగ్రెస్ + బీఆర్ఎస్.. బీఆర్ఎస్ + బీజేపీ. ఈ ఈక్వేషన్స్ ఏంటి.. అసలు ఈ లెక్కలేంటి అనుకుంటున్నారా?. ఈ లెక్కలన్నీ ఆ పార్టీ నేతలు చెబుతున్నవే. ఎలా అంటే అసలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడిపిస్తున్నది.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చేది కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు చెప్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని.. ఇక్కడ గల్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఢిల్లీలో భాయీ భాయీ అంటూ తిరుగుతారని, అసలు బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి బీ టీమ్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వరకూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో అసలు ఏ పార్టీ ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రువు.. అసలు ఎవరు ఎవరి వెనక ఉన్నారు.. ఎవరు ఎవరిని శత్రువుగా చూస్తున్నారన్నది అర్ధం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది కేసీఆరేనంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కేసీఆర్ టికెట్లు ఖరారు చేసే ఆ ముప్పై మందిలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా గులాబీ బాసే డిసైడ్ చేస్తారన్నారు. ఈ ముప్పై మంది కాంగ్రెస్ నుంచి గెలిచినా.. మళ్లీ బీఆర్ఎస్‌లో చేరుతారంటూ బండి సంజయ్ కలకలం రేపారు. కరీంనగర్ మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘టిఫిన్ బైఠక్’లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర దుమారం రేపాయి. ఇది బీజేపీ మైండ్ గేమ్ గా కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. బీజేపీ బీఆర్ఎస్ మైత్రి ఢిల్లీ వీధుల్లో కనిపిస్తుందని రిటర్న్ విమర్శలు కూడా కాంగ్రెస్ నుండి వినిపించాయి.
కాగా, తాజాగా తెలంగాణ పర్యటనకి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా మారిందని.. సీఎం కేసీఆర్
రిమోట్ ఇప్పుడు ప్రధాని మోడీ చేతిలో ఉందని, ఆయన ఏం చెబితే కేసీఆర్ అది చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, వాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దని రాహుల్ తెలంగాణ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ బీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని రాహుల్ అన్నారు. దీనికి బీఆర్ఎస్ నుండి కూడా ఘాటు కౌంటర్లు వచ్చాయి. ‘మాది బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్ కు సీ టీమ్ అంతకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్ అంటూ బీఆర్ఎస్ నేతలు రిటర్న్ కౌంటర్లు విసిరారు.
అయితే, ఈ మూడు పార్టీల మధ్య ఈ ఈక్వేషన్స్ చూస్తే కాస్త ఆసక్తి కలగక మానదు. రానున్న ఎన్నికలలో ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. దీంతో ఎవరికి వారు మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ ఈ మైండ్ గేమ్ మొదలు పెట్టగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే గేమ్ ఆడడం మొదలు పెట్టింది. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాబోతుందని భారీ ప్రచారం జరిగినా అది జరగకపోవడం.. ఈ మధ్యనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవడం వంటివి చూపిస్తూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలను రివర్స్ లో ఆ పార్టీపైకే వదులుతోంది. అయితే, ఎవరికి వారు ఇలా పక్కవారిపై బురదజల్లేలో పనిలో ఉండగా పాపం ప్రజలు మాత్రం.. ఈ ఈక్వేషన్స్ అర్ధం చేసుకోలేక అయోమయంలో పడిపోతున్నారు.